16, ఆగస్టు 2021, సోమవారం

వాగ్ధాటికి మారుపేరు వాజ్ పాయ్

 

(ఈరోజు ఆయన వర్ధంతి)
అరవై ఏళ్ళ పైమాటే. అప్పటికి ఆ పార్టీ పేరు జనసంఘ్. ప్రమిదె గుర్తు. బెజవాడలో ఎన్నికలప్పుడు ఏదో ఒక మూల గోడలమీద ఈ గుర్తు కనబడేది. కానీ జనం గుర్తు పెట్టుకునే వాళ్లు కాదు. ఆరోజుల్లో గాంధీ మునిసిపల్ హైస్కూలు ఆవరణలో ఢిల్లీ నుంచి ఒక పెద్దాయన వస్తున్నాడు, సాయంత్రం మీటింగు అంటూ వూళ్ళో టముకు వేసారు. తెలిసీ తెలియని వయసు. అయినా పెద్దవాళ్ళతో కలిసి వెళ్లాను. కాసేపటి తరువాత ఆ వచ్చినాయన మాట్లాడడం మొదలు పెట్టాడు. శుద్ధ హిందీ. ఒక్కరికీ అర్ధం అయినట్టు లేదు. మాటల జడివాన మొదలయింది. పిడుగులు పడ్డట్టుగా ప్రసంగం సాగింది. ఒక్క ముక్క అర్ధం కాకపోయినా స్పీచ్ అంటే ఇలా వుండాలి అని అనిపించింది. వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఆయనకు అప్పటికప్పుడే అభిమానులు అయిపోయారు. ఆయన ఎవరో కాదు, తదనంతర కాలంలో దేశానికి అయిదేళ్ళు సుస్తిర పాలన అందించిన ప్రధాని వాజ్ పాయ్.
భాష అర్ధం కాని వారిని సయితం తన వాగ్ధాటితో కట్టిపడేసిన ఆయనకు మరణ ఘడియలు దగ్గర పడేముందు మాట పడిపోవడం విధి వైచిత్రం.



“మౌత్ కి ఉమర్ క్యా హై?
దో పల్ భీ నహీ”
– కీర్తిశేషులు వాజ్ పాయ్ రాసుకున్న కవితా పంక్తులు

15, ఆగస్టు 2021, ఆదివారం

జాతికి ఇవ్వాల్సిన కానుక – భండారు శ్రీనివాసరావు

 

 (ఈరోజు ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

దసరా, దీపావళి, సంక్రాంతి  మొదలయిన పండగల సరసన చేర్చదగిన జాతీయ పర్వదినాలు ఆగస్టు పదిహేను, జనవరి యిరవై ఆరు.

పంద్రాగష్టును మొదటిసారి పండుగ రూపంలో స్వతంత్ర భరతజాతి యావత్తు ఒక్కటై జరుపుకున్ననాటికి  నేను నెలల బిడ్డని. రెండో పండగ, రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవాన్ని  తొలిసారి జరుపుకున్నప్పుడు నా వయస్సు అటూఇటుగా నాలుగేళ్ళు. అంటే దాదాపు నాతోపాటే పెరిగి పెద్దవుతూ వచ్చిన పర్వదినాలు ఇవి.


నాకు ఊహ తెలుస్తున్న వయస్సులో ఈ రెండు పండగలను యెంతో ఉత్సాహంతో జరుపుకున్న రోజులు యిప్పటికీ జ్ఞాపకం వున్నాయి. పొద్దున్నే లేచి బడికి వెళ్లి త్రివర్ణ పతాకాలు చేతబట్టుకుని ఊరంతా తిరుగుతూ ప్రభాత్ భేరిలో పాల్గొనే వాళ్ళం.


ప్రభాత్ భేరి అనే మాటకు అర్ధం తెలియని వయసు. అయినా అలా ఊరేగింపుగా బయలుదేరి 'భారత్ మాతాకీ జై' అని నినాదాలు చేస్తూ వీధుల్లో తిరుగుతూ వుంటే ఊరంతా ఉత్సాహం ఉరకలెత్తేది.  'జనగణమన' గీతంలో ఏఏ భాషల ప్రస్తావనవుందో, ఏఏ ప్రాంతాల  ప్రసక్తి వుందో మాకు అప్పటికి తెలియదు.  ఆ గీతాన్ని ఎవరు రాసారో,  ఏ భాషలో రాసారో అంతకంటే తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే అది అందరి గీతం.

జనగణమన చరణాలలోని  'న' ను 'న' లాగా, 'ణ' ను 'ణ' లాగా, తప్పులు దొర్లకుండా ఎలా పాడాలన్న తపన ఒక్కటే అప్పుడు  మాకు తెలిసింది. ఢిల్లీ  ఎక్కడ వుందో తెలియదు, ఎర్రకోట అంటే తెలియదు, కానీ దానిపై చాచా నెహ్రూ  జండా ఎగురవేస్తాడని మాత్రం తెలుసు. ఏమీ తెలియని అజ్ఞానంలోని మధురిమను ఆస్వాదించడం కూడా ఒక మంచి అనుభవమే అని ఈనాడు ఆ రోజులను గుర్తుకు తెచ్చుకుంటే అనిపిస్తోంది.

అవును. ఎక్కడికి పోయాయి ఆ రోజులు?

'లేవరా నాన్నా! ఈరోజు స్కూల్లో జండా ఎగరేస్తారు తొందరగా వెళ్ళాలి' అంటే, ‘కాసేపు పడుకోనీ మమ్మీ, ఈ రోజు సెలవే కదా!' అని పిల్లలు నసిగే  రోజులు వచ్చేసాయి. పండగదినం స్థానంలో సెలవురోజు వచ్చింది. తప్పులు లేకుండా ‘జనగణమన' పాడడం పోయి  ఆ  గీతంలో తప్పులెన్నే రోజు వచ్చింది. భారతీయ జండాకు బదులు మరో జండా ఎగురవేస్తామనే వితండవాదం కూడా  పుట్టుకొచ్చింది. ఏటేటా జరిగే  పతాక ఆవిష్కరణలు మొక్కుబడిగా మారిపోయాయి. ఎప్పుడేమి జరుగుతుందో అన్న భయం మధ్య, నిఘా పోలీసుల డేగ కళ్ళ పహరాల నడుమ , జాతీయ పండుగలు జరుపుకునే దుస్తితి దాపురించింది.


సైనిక కవాతులు, శస్త్రాస్త్ర ప్రదర్శనలు, భారీ టాంకులు, వైమానిక దళ విన్యాసాలతో ఎలాంటి పరిణామాలనయినా ఎదుర్కోగల యుద్ధ సన్నద్ధతను, జాతి సంసిద్ధతను ఒక పక్క ప్రదర్శిస్తూనే, మరో పక్క బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుకనుంచి నాయకులు చేసే ప్రసంగాలు వినవలసి రావడం యెంతటి  విషాదం?

శాంతి భారతంగా పేరొందిన భారతదేశంలో ఈనాడు ఎక్కడ ఏమిజరుగుతుందో, ఎక్కడ ఏ బాంబు పేలుతుందో తెలియని పరిస్తితి పొటమరించడం యెంతటి  దారుణం?

మతమన్నది మనకంటికి మసకయితే

గతమన్నది మనకంటికి కురుపయితే

మతం వద్దు గతం వద్దు మారణ హోమం వద్దు అన్న సూక్తులను వొంటబట్టించుకుని ఎదిగిన ఓ తరం వారు,  ఈనాటి పరిస్తితులను చూసి, 'మనం కోరుకున్న స్వేఛ్చాభారతం ఇదేనా  అని మధనపడాల్సిరావడం మరెంతటి దుస్తరం?

మతాల దురభిమానాలతో, కులాల కుంపట్లతో, ప్రాంతీయ ద్వేషాలతో దేశం  యావత్తు అడ్డంగా నిలువుగా చీలిపోతుంటే,

స్వార్ధమే పరమావధిగా, సంపాదనే ఉపాధిగా, అడ్డదారుల్లో అందినంత స్వాహా చేయడమే అంతిమ లక్ష్యంగా , నీతికి దూరంగా, అవినీతికి ఆలంబనగా తయారయిన రాజకీయ దళారులంతా కలసి కుమ్మక్కై  జాతి సంపదను నిస్సిగ్గుగా కొల్లగొడుతుంటే,

జనరంజకంగా పాలించాల్సిన అధికార  యంత్రాంగం లంచాల మత్తులోపడి ప్రజల రక్తం పీలుస్తుంటే,

రాజ్యాంగం ఏర్పరచిన అన్ని వ్యవస్థలు, మారుతున్న కాలానికి అనుగుణంగా విలువలను నిలువు పాతర వేసి కుప్పకూలి  కునారిల్లుతున్న సమయంలో, ‘నేనున్నానంటూ’ జనాలకు వెన్నుదన్నుగా నిలబడాల్సిన మీడియా సయితం, తానూ ఆ తానులో ఓ ముక్కగా మారిపోతుంటే,

జనం నిస్సహాయంగా నిలబడి చూడాల్సి రావడం యెంత విషాదం, యెంత దారుణం, యెంత దుస్తరం, యెంత బాధాకరం?  

అయితే ఏమిటట?

నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్టే, ప్రపంచం గర్వించదగిన  గొప్ప లక్షణాలను కూడా స్వతంత్ర భారతం తన కొంగున ముడివేసుకుంది. 1947 లో మన దేశంతో పాటే స్వేచ్చా వాయువులు పీల్చుకున్న అనేక ఆసియా దేశాలు, ఇరుగు పొరుగు దేశాలు  ఈ ఏడు దశాబ్దాల పైచిలుకు కాలంలో  కొంతకాలం పాటయినా ప్రజాస్వామ్య పధాన్ని వీడి నియంతృత్వపు బాటలో నడిచిన దాఖలాలున్నాయి. మన దేశం మాత్రం ఎన్ని వొడిదుడుకులకు లోనయినా, మరెన్ని వొత్తిడులకు గురయినా,  ఎంచుకున్న మార్గంలోనే అప్రతిహతంగా  పురోగమించి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా తన స్థా నాన్ని పదిలం చేసుకుంది.

జనాభాలో అత్యధిక భాగం నిరక్షరకుక్షులయినా 'ఓటు' అనే ఆయుధంతో ప్రభుత్వాలను మార్చగల సత్తా వారి సొంతం.

అక్షరజ్ఞానం లేకపోయినా, కానులూ, ఏగానులనుంచి, బేడలూ అర్ధణాల నుంచి నయా పైసల లెక్కకు అలవోకగా మారగలిగిన 'మేధోతనం' వారి ఆస్తి.

గిద్దెలు, సోలలు, శేర్లు, సవాశేర్లు, మానికెల కొలతలనుంచి లీటర్లకు అతి తక్కువ వ్యవధిలో మారిన చరిత్ర వారిది.

వీసెలు, మణుగుల తూకాల నుంచి కిలోగ్రాములకు, బస్తాలనుంచి క్వింటాళ్లకు,  'మైలు రాళ్ళని' అధిగమించి కిలోమీటర్లకు ఎదిగారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా కిలోమీటర్ల లెక్కల్లోకి మారిపోకుండా పాతకాలంలోలా   ఇంకా 'మైలు'రాళ్ళదగ్గరే ఆగిపోయిన సంగతి ఇక్కడ గమనార్హం.

చదువూసంధ్యా లేనివాళ్లనీ, ఎందుకూ  పనికిరాని వాళ్ళనీ మనపై   ఇతర దేశాల వారికి చిన్నచూపు. కానీ అలాటి మనవాళ్లు,  దేశానికి స్వాతంత్రం రాగానే నిర్వహించిన తొలి ఎన్నికల్లో పార్టీల గుర్తులున్న పెట్టెలలో ఓటు వేసే దశను అలవోకగా దాటేసారు. ఆ తరువాత  ఒకే బాలట్ పేపరుపై  ముద్రించిన అనేక పార్టీల  గుర్తులనుంచి తాము ఎంచుకున్న అభ్యర్ధిని అతడి గుర్తుతోనే   గుర్తుపట్టి  ఓటు వేయగల పరిణతిని అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా అధునాతన  ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను తడబడకుండా ఉపయోగించుకోగల సామర్ధ్యాన్ని అలవరచుకోగలిగారు. 

'ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం' అనే నిర్లిప్తస్థితిని  అధిగమించి  ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో భారతీయుల ముద్ర స్పుటంగా, ప్రస్పుటంగా ప్రపంచ వ్యాప్తంగా కానరాగల అత్యున్నత శిఖరాలకు మన దేశం చేరుకోగలగడం స్వతంత్ర భారతం సాధించిన మరో ఘనత.

'చందమామ రావే' అంటూ పాటలు పాడే స్తితి నుంచి 'చంద్రయాన్' వరకు ఎదగగలిగాము. అంతరిక్ష పరిశోధనల్లో అభివృద్ధి చెందిన  దేశాల సరసకు చేరగలిగాము. సుదూర లక్ష్యాలను చేధించగలిగిన అధునాతన రక్షణ  క్షిపణులను అంబుల పొదిలో చేర్చుకోగలిగాము. సస్య విప్లవం విజయవంతం చేసుకుని ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్థితి తప్పించుకుని స్వయంసమృద్ధిని సాధించుకోగలిగాము.

ఏ ఇంగ్లీష్ వారితో తలపడి, అహింసా మార్గంలో వారితో  పోరాడి స్వతంత్రం సంపాదించుకున్నామో, ఆ ఇంగ్లీషు వారి భాషనే ఆయుధంగా చేసుకుని, దేశ దేశాలలో కంప్యూటర్ రంగాన్ని మన కనుసన్నలతో శాసించగలుగుతున్నాము.  

అయితే , 'అంగట్లో  అన్నీవున్నా అల్లుడి నోట్లో శని' అన్న సామెత చందంగా  ఎక్కడో ఏదో లోటు జనం మనస్సులని కుదిపేస్తోంది. ఏడు దశాబ్దాల పైచిలుకు కాలంలో సాధించిన అభివృద్ధి అంతా అడవిగాచిన వెన్నెల అవుతున్నదేమో అన్న శంక కలవరపెడుతోంది. స్వతంత్ర భారతం ఆలపిస్తున్న స్వేఛ్చా గీతికల్లో వుండి వుండి అపశ్రుతి వినబడుతోంది.

వెడుతున్న దోవ మంచిదే. కానీ, నడుస్తున్న కాళ్లే తడబడుతున్నాయి. కాలికి కాలే అడ్డంపడి గమ్యాన్ని మరింత దూరం చేస్తున్నాయి.

విభిన్న స్వరాలతో వినిపిస్తున్న సందేశం మంచిదే. కానీ మధ్య మధ్య వినబడుతున్న  అపస్వరాలు అసలు అర్ధాన్నే మార్చివేస్తున్నాయి.

అందరూ మంచివాళ్ళే. కానీ మానసిక కాలుష్యమే  వాళ్ళ మంచితనాన్ని మంచులా కరిగించి వేస్తోంది. హరించి వేస్తోంది.

స్వార్ధం ముందు నిస్వార్ధం తలవంచుతోంది. అధికారం అన్నదే పరమావధిగా, ధనార్జన అన్నదే అంతిమ ధ్యేయంగా, అవలక్షణలక్షిత సమాజం కళ్ళముందే ఆవిష్కృతమవుతోంది.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ రకమయిన పరిణామాలు అనివార్యం, అతి సహజం. కానీ  అవి  తాత్కాలికం కావాలి. శాశ్వతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత  మాత్రం అందరిదీ.

ఒకరిపై మరొకరు నెపాలు మోపకుండా, తప్పులు దిద్దుకోగలిగితే మార్పు అనివార్యం. అభివృద్ధి సురుచిర సాధ్యం.

భారత స్వాతంత్ర దినోత్సవ శుభసమయంలో  మనమందరం జాతికి కలసికట్టుగా ఇవ్వాల్సిన కానుక అదే.

(15-08-2021)





ఇలా కూడా చెప్పొచ్చు

 

డెబ్బయ్యవ దశకంలో నేను నార్ల వారి ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు నాకు తొలి గురువు నండూరి రామమోహన రావు గారు. ఆయనా, పురాణం గారు అవ్యాజానురాగంతో నన్ను అనేక విధాలుగా ప్రోత్సహించారు.
ఈ క్రమంలో నండూరి వారు కొన్ని అదనపు బాధ్యతలు నా భుజంపై మోపారు. కానీ నాకు అదనపు భారం అనిపించలేదు. సంతోషపడ్డాను కూడా.
ఆరోజుల్లో ఇప్పటిలా కంప్యూటర్లు లేవు. ఏ రచన అయినా చేతి రాతే. ఆఫీసులో కింద కంపోజింగ్ విభాగం వుండేది. చిన్న చిన్న అరలతో కూడిన నిలువెత్తు చెక్క బల్లల ముందు నిలబడి అక్షరాలు కూర్చేవారు. ఆ అరల్లో సీసంతో తయారు చేసిన తెలుగు అక్షరాలు, వత్తులు, దీర్ఘాలతో సహా అన్ని సైజుల్లో ఉండేవి. మేము పంపించిన వ్యాసాలు లేదా రచనల కాగితాలను చిన్న చిన్నగా కత్తిరించి వాటిని ముందు పెట్టుకుని కళ్ళు చికిలించుంటూ పేరాలు పేరాలుగా కంపోజ్ చేసేవారు. వార్తలకు ఒక సైజు అక్షరాలు, హెడ్డింగు లకు ఒక సైజ్, సబ్ హెడ్డింగులకు మరో సైజు ఇలా అన్నమాట. ఆ సైజుల్ని పాయింట్లు అనేవారు. 36 పాయింట్ 24 పాయింటు 16 పాయింట్, 12 పాయింట్ ఇలా ఉండేవి. తరువాత వాటిని న్యూస్ ప్రింట్ కాగితాలపై రోల్ చేసి, ప్రింట్ వేసి ప్రూఫ్ రీడర్లకు పంపేవారు. ప్రూఫ్ దిద్దిన వాటిని పొడవాటి ఎస్ గ్యాలీల రూపంలో సబ్ ఎడిటర్లకు పంపేవారు. వాళ్ళు సరిదిద్దిన వాటిని మళ్ళీ రోల్ ప్రింట్ వేసి నండూరి వారి టేబుల్ వద్దకు చేర్చేవాళ్ళు. ఆయన చూసిన తర్వాత ఇక ఫైనల్. వాటిని పేజి మేకింగ్ సెక్షన్ కు పంపడం జరిగేది.
రామ్మోహన రావు గారు సంపాదకీయం రాసేవారు. అదే ఎడిట్ పేజీలో, సంపాదకీయం కింద రోజువారీగా నేను రాసే వాక్టూన్లు, బయటివారు రాసిన ఆర్టికిల్స్ ప్రచురించేవారు. అప్పుడప్పుడు వాటిని కంపోజ్ చేయించి పేజీలో పెట్టే బాధ్యత నామీద పడేది. ఒక్కోసారి ఆర్టికిల్ సైజ్ ఎక్కువ కావడం వల్ల పేజీలో సరిపోయేది కాదు, మరో పేజీలో తరువాయి భాగం అని రాయడానికి నార్ల వారి నిబంధనలు ఒప్పుకునేవి కావు. మధ్య మధ్యలో కొన్ని పదాలు, మార్చడం, లేదా వాక్యాలు తీసివేయడం చాలా కష్టంగా వుండేది. అనుభవలేమి కారణంగా, రచయితలు పంపిన వ్యాసాలలో చివరి పేరాలు తీసేసేవాడిని, పేజీలో పట్టడానికి వీలుగా.
ఈ విషయం నండూరి వారి దృష్టికి వచ్చినట్టుంది. నన్ను పిలిచి చెప్పారు.
‘శ్రీనివాసరావు గారు! ఒక విషయం ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి. ప్రతి రచయితకు తాను రాసిన ప్రతి రచన సొంత బిడ్డలాంటిది. వాటిని మన వీలుసాలు కోసం ఇష్టం వచ్చినట్టు మారిస్తే వాళ్ళ మనసు బాధ పడుతుంది. కావాలంటే నా ఎడిటోరియల్ తగ్గిద్దాము. అంతే కాని రచయితలను మనస్తాపానికి గురిచేయవద్దు’
ఆయన ఇదే విషయాన్ని మరోలా అంటే దాష్టీకంగా చెప్పవచ్చు. కానీ ఆయన తరహా వేరు. చాలా సూటిగా, సున్నితంగా చెప్పడం ఆయనకు అలవాటు.
ఆ రోజులకు, అలాంటి ఎడిటర్లకు శత సహస్ర వందనాలు
(15-08-2021)

ఎర్రకోట మీదనే ఎందుకు?

 మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు అంటే 1947 ఆగస్టు 15 న జరిగిన మొదటి జెండా వందనం ఎర్రకోట బురుజుల నుంచి జరగలేదు. పండిట్ నెహ్రూ పదిహేనవ తేదీనే ఢిల్లీలోని ఇండియా గేటు సమీపంలోని ప్రిన్సెస్ పార్కులో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన వెంట ఆ నాటి భారత గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ కూడా వున్నారు. ఆ బహిరంగ కార్యక్రమానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. సుమారు అయిదు లక్షల మంది ఆ ప్రాంతానికి ఉత్సాహంగా చేరుకున్నారు. వారిని నిలువరించడానికి చేసిన ప్రయత్నాలన్నీ వమ్ము కావడంతో పోలీసులు చేతులు ఎత్తేసారు. కార్యక్రమానికి అతిధులుగా వచ్చిన అనేకమంది విదేశీ దౌత్య వేత్తలు, మంత్రులు, ఇతర ప్రముఖులు, జన సందోహంతో నిండిపోయిన ఆ ప్రదేశానికి చేరుకోలేక వెనక్కి మళ్ళాల్సి వచ్చింది. ఆ జన సమ్మర్దంలో తప్పిపోయిన పిల్లలను వెతికే కార్యక్రమంలో నెహ్రూ, మౌంట్ బాటెన్ కూడా ఎంతో శ్రమ పడాల్సి వచ్చిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ఆ మరునాడు అంటే 1947 ఆగస్టు 16 వ తేదీన నాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోట వద్ద జరిగిన జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ఆ కార్యక్రమానికి హాజరయ్యారు కానీ పతాకాన్ని ఎగురవేయలేదు. మరో నమ్మ లేని నిజం ఏమిటంటే ఆనాడు ఎర్రకోటపై పతాకాన్ని ఎగురవేసింది ఆ పనికోసం నియోగించబడ్డ ఒక ఆర్మీ అధికారి. అప్పుడు జరిగిన ఏర్పాట్ల గురించి ఒక ఆర్మీ అధికారి రాసిన పుస్తకంలో ఈ వివరాలు వున్నాయి. బురుజుపై నిలబడి ప్రధాని నెహ్రూ ఒక స్విచ్చి నొక్కగానే బురుజు కింద గంట మోగే ఏర్పాటు చేసారు. నెహ్రూ స్విచ్చి నొక్కి గంట మోగించగానే ఆ సంకేతాన్ని అందుకుని ఆర్మీ అధికారి వెంటనే జాతీయ జెండాను ఎగురవేశారని ఆయన ఆ పుస్తకంలో తెలిపారు.
మరో విశేషం ఏమిటంటే త్రివర్ణశోభితమైన జాతీయ పతాకం వినువీధుల్లోకి ఎగరగానే చిరుజల్లులు కురిశాయి. గగన తలంలో ఇంద్రధనుస్సు దర్శనమిచ్చింది. ఒకవైపు త్రివర్ణ పతాకం, మరో వైపు రంగురంగుల ఇంద్ర ధనుస్సు. నయనానందకరమైన ఆ దృశ్యాన్ని చక్కటి శుభసూచనగా ప్రజలు భావించారు.
1947 దాదిగా స్వతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి ఎర్రకోట బురుజులపై జాతీయ పతాకాన్ని ఎగురవేసే సాంప్రదాయం ఈనాటికీ కొనసాగుతోంది. అయితే ఈ కార్యక్రమానికి మొఘల్ చక్రవర్తుల కోటను ఎందుకు ఎంపిక చేసుకున్నారు అనే విషయంపై సరయిన వివరాలు లభించడం లేదు. 1857లో జరిగిన ప్రధమ స్వాతంత్ర పోరాటాన్ని బహదూర్ షా జాఫర్ ఈ లాల్ ఖిలా నుంచే మొదలుపెట్టారని, అందుచేత స్వాతంత్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని ఎర్రకోట నుంచి ఎగురవేయడం సముచితంగా ఉంటుందన్న భావనతో ఈ సాంప్రదాయం మొదలయిందని కొందరు వివరిస్తున్నారు.
పొతే మరో ఆసక్తికర చారిత్రిక విషయం ఏమిటంటే మొదట బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి స్వతంత్రాన్ని 1948లో ఇవ్వాలని అనుకున్నారు. అయితే 1947 ఫిబ్రవరిలో వైస్రాయ్ గా నియమితులయిన లార్డ్ మౌంట్ బాటెన్ మాత్రం వేరే విధంగా తలపోయడంతో బ్రిటిష్ పాలకులు తమ నిర్ణయం మార్చుకుని స్వతంత్ర భారత ఆవిర్భావానికి 1947 ఆగస్టు పదిహేనును ముహూర్తంగా ఎంచుకున్నారు. ఈ మార్పుకు మరో కారణం కూడా చెబుతారు. అంతకు మునుపు రెండేళ్ళ క్రితం, రెండో ప్రపంచ యుద్ధం ముగియవచ్చే తరుణంలో సరిగ్గా ఆగస్టు పదిహేనవ తేదీనే, జపాన్ సైన్యం బ్రిటిష్ వారికి లొంగిపోవడంవల్ల, ఆ తేదీ పట్ల మౌంట్ బాటెన్ ముచ్చట పడ్డారనేది ఆ కధనం.
ఆగస్టు పద్నాలుగవ తేదీ అర్ధరాత్రి (తెల్లవారితే పదిహేనవ తేదీ) పార్లమెంటు హౌస్ లో జరిగిన భారత రాజ్యాంగపరిషత్తు ఐదో సమావేశంలో, భారత దేశానికి స్వతంత్రం ఇస్తూ బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన అధికారిక ప్రకటన జరిగింది. ఈ సమావేశం పద్నాలుగో తేదీ రాత్రి పదకొండు గంటలకు సుచేతా కృపాలాని వందేమాతరం గీతాలాపనతో మొదలయింది రాజ్యంగ పరిషత్తు చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. పండిట్ నెహ్రూ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది “ప్రపంచం యావత్తూ నిద్రిస్తున్న వేళ, స్వతంత్ర వాయువులు పీలుస్తూ భారత దేశం మేలుకుంటోంది” అనే అర్ధం వచ్చేలా చేసిన ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ గా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది.
అనంతరం బొంబాయి (ఇప్పుడు ముంబై) కి చెందిన విద్యావేత్త, ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు హంసా మెహతా, దేశంలోని మహిళలు అందరి తరపున భారత జాతీయ పతాకాన్ని జాతికి సమర్పించారు. సుచేతా కృపాలానీ ‘సారే జహాసే అచ్చా’ గేయం పాడి అలరించారు. ‘జనగణమన’ (అప్పటికి అది జాతీయ గీతం కాదు) గీతాలాపనతో నాటి సమావేశం ముగిసింది.
మరునాడు అంటే ఆగస్టు పదిహేనవ తేదీన ఉదయం ఫెడరల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ హరిలాల్ కనియా, నూతన గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మౌంట్ బాటెన్ నెహ్రూ మంత్రివర్గంతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. జగ్జీవన్ రాం ఆసుపత్రిలో చేరిన కారణంగా ఆయన ఆ రోజున ప్రమాణస్వీకారం చేయలేకపోయారు

14, ఆగస్టు 2021, శనివారం

నాస్తికవాద ప్రబోధి శ్రీ లవణం – భండారు శ్రీనివాసరావు

(ఈరోజు లవణం గారి వర్ధంతి)

ఆరేళ్ల క్రితం ఈ రోజు బెజవాడలో కన్ను మూసిన ప్రముఖ నాస్తిక ప్రచారోద్యమ నాయకుడు లవణం గారితో నా పరిచయం వయస్సు నలభయ్ అయిదేళ్లు పైమాటే. లవణం గారి నాన్నగారు గోరా గారి ద్వారా లవణం గారు పరిచయం అయ్యారు. గోరాగారు (గోపరాజు రామచంద్ర రావు గారు) నాస్తికులు. దేవుడ్ని నమ్మేవారు కాదు. దేవుడ్ని గురించి ప్రస్తావన వస్తే ‘దేవుడు లేదు’ అనేవారు. ‘నేను దేవుడ్నే నమ్మను, ఇక ఆయన ఆడో మగో నాకేమిటి నిమిత్తం’ అని వాదించేవారు.
1975 నాటి మాట. బెజవాడ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నరోజులు. అప్పటికే హైదరాబాదుకు మకాం మార్చిన ఎడిటర్ నార్ల వెంకటేశ్వర రావు గారికి ఓ ఆలోచన వచ్చి బెజవాడలో అసిస్టెంట్ ఎడిటర్ గా వున్న నండూరి రామమోహన రావు గారిని సంప్రదించారు. అనుదినం జరిగే సంఘటనలపై స్పందించి నాలుగు లైన్లలో హస్యస్పోరకంగా వుండే గేయాన్ని రాయించాలని వారి ఉద్దేశ్యం. ‘రాయగలరా అని అడక్కుండా రాయండి’ అనేసారు రామ్మోహన రావు గారు నాతొ. ఆవిధంగా మొదలయ్యాయి ఆంద్రజ్యోతి దినపత్రికలో ఎడిట్ పేజీలో కార్టూన్లవంటి నా వాక్టూన్లు. చిత్రకారుడు రమణ గారు ఓ చిన్న చిత్రాన్ని దానికి జోడించేవారు.
ఆరోజుల్లో గోరాగారి కూరగాయల ఉద్యమం మొదలయింది. బెజవాడ గవర్నర్ పేటలోని రాఘవయ్య పార్కులో కార్యక్రమం. వ్యవసాయశాఖ మంత్రి ఏసీ సుబ్బారెడ్డి గారు ముఖ్య అతిధి. పూలదండల బదులు కూరగాయల దండలు వేయాలనేది గోరాగారి ఉద్యమం. కూరగాయలు పెంచితే ప్రజలకు ఉపయోగం అనేది ఆయన సిద్దాంతం. సరే సభ మొదలయింది. కూరగాయలతో చేసిన దండలు వేసారు, పుష్ప గుచ్చాల బదులు కాలీ ఫ్లవర్, క్యాబేజీలతో రూపొందించిన గుచ్చాలు అందించారు. సుబ్బారెడ్డిగారు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే రకం. మనసులో దాచుకుండే మనిషి కాదు. అయన మాట్లాడుతూ, గోరాగారి ఉద్దేశ్యం మంచిదే అయినా మనిషి మానసిక ఆనందానికి పూలతోటలు కూడా అవసరమన్నారు. పూల చెట్లు పీకి వాటి స్థానంలో కూరగాయల మొక్కలు పెంచేబదులు, కాలువగట్ల మీద, వృధాగా వున్న ప్రాంతాలలో కూరగాయల పాదులు వేస్తె నలుగురుకీ ఉపయోగం అన్నట్టు ప్రసంగించారు. ఆ కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని నేను వాక్టూన్ రాసాను. మర్నాడు ఉదయం అది జ్యోతిలో వచ్చింది. అదే ఇది.
కాయ 'గోరా'లు
“కూరగాయలు పెంచండని శ్రీ గోరా
ఇచ్చిన పిలుపును విని, మా శ్రీవారా
రోజంతా పట్టుకు పలుగూ పారా
పెరడంతా తవ్వేస్తే రాత్రికి వొళ్ళు పట్టేది నేనా వారా!”
గోరాగారి గురించి రాసింది లవణం గారికి నచ్చినట్టు లేదు. మర్నాడు ఆ పేపరు పట్టుకుని రామ్మోహన రావు గారిని ఆఫీసులో కలుసుకుని ‘ఇదేమన్నా బాగుందా’ అని అడిగారు. నండూరి రామ్మోహనరావు గారు సీరియస్ గా పైకి కనిపించినా హాస్య ప్రియులు.
‘జోకుని జోక్కా తీసుకోవాలండీ లేకపోతె మేకులా గుచ్చుకుంటుంది. కార్టూన్ చూసి నవ్వుకున్నట్టే శ్రీనివాసరావు వాక్టూన్ చదివి నవ్వుకోండి. ఓ పనయి పోతుంది’
ఇదీ ఆయన జవాబు.
వాక్టూన్ సంగతి ఏమోకానీ, లవణం గారితో నా పరిచయం సుదీర్ఘంగా కొనసాగింది. కొన్నేళ్ళ క్రితం ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఏదో కార్యక్రమానికి వెడితే కలిసారు. ఓ ఫోటో కూడా దిగాము. ఆంధ్రభూమి ఫోటోగ్రాఫర్ అనుకుంటాను తీసింది. ప్రస్తుతం అయితే నా దగ్గర లేదు.





(14-08-2021)

13, ఆగస్టు 2021, శుక్రవారం

మంచి పలుకు

శ్రీ పీఠం ఆద్యాత్మిక మాస పత్రిక తాజా సంచికలో శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచించిన సుభాషితం:


“గంగను భువికందించిన భగీరధుని కధను రామాయణంలో కూడా వివరించారు. సగరులను తరింపచేయడానికి గంగను భువికి తీసుకురావాలని వారి పుత్రుడు అంశుమంతుడు తపస్సు చేశాడు. కానీ తన జీవితకాలంలో సాధించలేకపోయాడు. తరువాత అతని కుమారుడు దిలీపుడు తపమాచరించాడు. ఆయన వల్ల కూడా సాధ్యం కాలేదు. అటుపై దిలీపతనయుడు భగీరధుడు తపస్సు చేసి గంగను సాధించాడు.
గంగను సాధించిన భగీరధుడి వద్దకు బ్రహ్మ వచ్చి, ‘నాయనా! నీ పెద్దలు సాధించలేనిది నువ్వు సాధించావు’ అని ప్రశంసించాడు. వెంటనే భగీరధుడు, ‘స్వామీ! అది నిజం కాదు. వారు చేసిన తపస్సు నా దాకా వచ్చి నా దగ్గర ఫలించింది. అంతే! నా పూర్వీకులే చేయకుంటే, నాతోనే తపస్సు ప్రారంభమైతే, ఇది ఫలించడానికి మరో రెండు తరాలు పట్టేది. మా పూర్వీకులు నా వరకు తీసుకువచ్చిన తపోరూప సూత్రాన్ని నేను అందుకుని సాధించగలిగాను’ అని సమాధానమిచ్చాడు.
దానికి విరించి, ‘అద్భుతంగా చెప్పావు. నీ వినయం, వివేకం గొప్పవి. నువ్వు గంగని సాధించడం ఒక ఎత్తు, ఈ మాట ఒక్కటీ ఒక ఎత్తు’ అని అభినందించాడు.
(శ్రీ పీఠం, ఆధ్యాత్మిక మాస పత్రిక, ఆగస్టు సంచిక నుంచి)
(13-08-2021)

జయాలకు అపజయం లేదు – భండారు శ్రీనివాసరావు

(గురువారం నాడు శ్రీహరికోట నుంచి  ఇస్రో  ప్రయోగించిన జి.ఎస్.ఎల్.వి. ఎఫ్.10 వైఫల్యం గురించిన వార్తలు విన్నప్పుడు  గుర్తుకువచ్చిన పాత సంగతి)

1987, మార్చి నెల

ASLV-1 ప్రయోగానికి శ్రీహరికోటలో సర్వం సిద్ధం అయింది. 31 గంటల కౌంట్ డౌన్ కూడా పూర్తయింది. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధి, గవర్నర్ కుముద్ బెన్ జోషి, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఇస్రో చైర్మన్ డాక్టర్ యు.ఆర్.రావు రెండతస్తుల మిషన్ కంట్రోల్ రూమ్ టెర్రేస్ మీద నుంచి రాకెట్ ప్రయోగాన్ని వీక్షించడానికి ఆసీనులయివున్నారు. భారత దేశానికి గర్వకారణం కాగల ఈ ప్రయోగాన్ని కళ్ళారా చూడడానికి సుమారు పదివేలమంది ప్రేక్షకుల గేలరీలో వేచి వున్నారు.

అనుకున్న సమయానికి రాకెట్ ప్రయోగించారు. నిప్పులు చిమ్ముతూ రాకెట్ గగనంలోకి దూసుకుపోయింది. రాకెట్ పైకి లేస్తుండగానే వారందరూ ఒకరికొకరు అభివాదాలు తెలుపుకుంటూ, కరచాలనాలు చేసుకుంటూ ఉద్విగ్నంగావున్న సమయంలో జరగరానిది జరిగిపోయింది. ప్రయోగించి నిమిషం కూడా గడవకముందే రాకెట్ బంగాళాఖాతంలో కూలిపోయింది. ఒక్క లిప్తపాటు భయంకర నిశ్శబ్దం. అందరి మొహాల్లో ఆనందం తప్పుకుంది. విషాదం అలముకుంది.

రాజీవ్ గాంధి అందరికంటే ముందు తేరుకున్నారు. ఇస్రో అధికారులను, సిబ్బందిని అనునయించారు. ఇటువంటి శాస్త్రీయ ప్రయోగాలలో విజయాలే తప్ప, అపజయాలు ఉండవన్నారు. ముందుకు దూసుకుపోవడానికి ఇదొక అవకాశంగా భావించాలని ధైర్యం చెప్పారు.

అలా పోగుపడిన ధైర్యమే ఈనాడు ఇస్రో బృందాన్ని ప్రపంచ రికార్డు సొంతం చేసుకునేలా చేసింది.

అక్షరాలా నూట నాలుగు ఉపగ్రహాలను ఏక కాలంలో అంతరిక్షంలోకి పంపేలా చేయగలిగింది.

నిజమే. అంతకు ముందు తెలియని విషయాలను కనుగొనేముందు ఎన్ని అపజయాలు ఎదురయినా శాస్త్రవేత్తలు వెనక్కి తగ్గక పోవడం వల్లనే ఈనాడు ప్రపంచానికి ఇన్ని శాస్త్రీయ పరిశోధనల ఫలితాలు అందుతున్నాయి. మొదటి వైఫల్యానికే చతికిల పడివుంటే ఇప్పుడూ అక్కడే వుండేవాళ్ళం.

కాబట్టి గురువారం ప్రయోగం విఫలం అయిందని కుంగిపోనక్కరలేదు. ఆ వైఫల్యం మరో ఘన విజయానికి  సోపానం కావాలని కోరుకుందాం!



(Image Courtesy ISRO)


(13-08-2021)