మరణవార్తలు రాయడానికి మనసు శరీరము సహకరించడం లేదు. సీనియర్ జర్నలిస్టు ఆజాద్ చిస్తీ చనిపోయినట్టు ఇప్పుడే తెలిసింది. సచివాలయం బీట్ చూసేవారందరికీ చిరపరిచితుడు.
3, మే 2021, సోమవారం
సీనియర్ జర్నలిస్టు ఆజాద్ చిస్తీ
సబ్బం హరి ఇక లేరు
నేను ఆలిండియా రేడియోలో పనిచేసేటప్పుడు విశాఖపట్నంలో మా రేడియో ప్రతినిధి, నా సీనియర్ కొలీగ్ బి.ఎన్ రావు (నారాయణరావు) ద్వారా శ్రీ సబ్బం హరితో పరిచయం. వైజాగ్ లో వుండే విలేకరులకే కాకుండా మొత్తం ఉత్తరాంధ్రాలోని జర్నలిస్టులు అందరికీ ఆయన ఇష్టుడు. పార్లమెంట్ సభ్యుడు కావడం వల్ల హైదరాబాదులో వుండే మా బోంట్లకు వ్యక్తిగత పరిచయం కాస్త తక్కువే. కాకపొతే, ఫోన్ చేస్తే ఎక్కడ వున్నా వెంటనే స్పందించి ఓపికగా అడిగిన వాటికి జవాబు చెప్పేవారు. నేను రిటైర్ అయిన తర్వాత అనేక టీవీ డిబేట్లలో వారితో కలిసి పాల్గొనే అవకాశం నాకు లభించింది. విషయాన్ని విపులీకరించే తీరు అందర్నీ ఆకట్టుకునేది. విషయ పరిజ్ఞానం కలిగిన రాజకీయ నాయకుడు కావడం వల్ల టీవీ చర్చల్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు.
ఆయన హఠాన్మరణ వార్త కలచి వేసింది. పెద్ద వయసు
కాదు. రాజకీయాల నుంచి కొంత పక్కకు తప్పుకుని రాజకీయ విశ్లేషణలకు మాత్రమే పరిమితం
అవుతూ వస్తున్నారు.
సబ్బం హరి గారికి ఆత్మ శాంతి కలగాలని
కోరుకుంటున్నాను.
ధన్యజీవి జ్వాలా
కంచి కామకోటి పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకులు, శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారు ఆసేతు హిమాచలం అంతటా పరమ పూజ్యనీయులు. అలాంటి మహనీయుడి నోటి నుంచి ఒక రచయిత పేరు, ఇంటి పేరుతో సహా పలుమార్లు ప్రస్తావనకు రావడం అంటే, అంతకు మించిన అదృష్టం వుండదు. అలాంటి సుకృతం నా మిత్రుడు, నా మేనకోడలు విజయలక్ష్మి భర్త అయిన వనం జ్వాలా నరసింహారావుకు లభించడం మా కుటుంబం మొత్తానికి గర్వకారణం.
జ్వాలా ఐహిక పరమైన గృహస్తుబాధ్యతలు ఓ పక్క
నిర్వర్తిస్తూనే,
మరోపక్క ఆముష్మిక మార్గంలో గత రెండు దశాబ్దాలుగా అనేక ఆధ్యాత్మిక గ్రంధ రచనలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా ‘ఆంధ్ర వాల్మీకి
రామాయణ రసరమ్య గాధలు’ అనే
పుస్తకాన్ని రాయడం,
దర్శనం శర్మగా ప్రసిద్ధి చెందిన శ్రీ మరుమాముల వెంకట రమణ శర్మ ప్రచురించడం ఈ కరోనా
కట్టడి సమయంలో కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా జరగడం నిజంగా ఒక అద్భుతమే.
పరమేశ్వరుడి కృప ఉంటేనే సాధ్యం.
అంతకు మించిన భాగ్యం ఈ ఇరువురికీ దక్కింది ఎలా
అంటే కంచి కామకోటి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకులు, శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర
సరస్వతీ స్వామివారు స్వయంగా తమ అమృత హస్తాలతో నిన్న
ఆదివారం సాయంత్రం ఈ పుస్తకాన్ని
ఆవిష్కరించి అనుగ్రహ భాషణ చేయడం. కంచి పీఠం నుంచి స్వామి కరకమలాలతో చేసిన ఆవిష్కరణ
కార్యక్రమాన్ని హైదారాబాదులోను, ఇతర ప్రదేశాలలోనూ ఉన్న భక్త జనం, దర్శనం ఆధ్యాత్మిక
మాస పత్రిక వారు చేసిన ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా వీక్షించగలిగారు.
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ శ్రీ చరణులు ఇలా
అన్నారు.
“రామాయణం
గొప్ప ఇతిహాసం. శ్రీరామచంద్రుడు భారతీయ ఆధ్యాత్మిక తత్వానికి,
సాంప్రదాయ పరంపరకు ప్రతీక. మనిషి అనేవాడు ఎలా వుండాలి అనేది రామాయణం చెబుతుంది. రామనామం మధురాతి మధురం. అందుకే ఉత్తర భారతాన
ప్రతి ఒక్క సామాజిక వర్గంలోనూ రామ రామ అనే పేరుకలవాళ్ళు అనేకమంది వుంటారు.
“వనం – దర్శనం (రాసింది వనం జ్వాలా నరసింహారావు,
ప్రచురించింది దర్శనం శర్మ). శ్రీరాముల వారు కూడా వనం దర్శనం చేశాడు. దండకారణ్యంలో
ప్రవేశించాడు.
“వనం జ్వాలా నరసింహారావు లోగడ అనేలా ఆధ్యాత్మిక
రచనలు చేశారు. ఇప్పుడు ఈ రామాయణం గురించి రాసారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం
అవుతోంది. ఈనెలలోనే శ్రీరామ నవమి జరుపుకున్నాము. అదే సమయంలో రామాయణ రసరమ్య గాధలు
పుస్తకం కూడా.
“విశాల దృక్పథం, అందర్నీ కలుపుకుని పోయే తత్వం (Coexistence),
ధైర్యం ధన ప్రధానమైన జీవితం కాకుండా గుణ ప్రధానమైన జీవనం ఇవన్నీ భారతీయ సంస్కృతిలో భాగాలు.
స్థిరప్రజ్ఞత, స్థితప్రజ్ఞతలతో భారతీయ ఇతిహాస పరంపర పరిపక్వత చెందింది.
“రానున్న తరాలలో ఈ పరంపర
కొనసాగించడానికి వనం జ్వాలా నరసింహారావు రాసిన సంశోధనాత్మక సాహిత్యం అవసరం.
“విభూతి అంటే ఏమిటి? గోమయం విశిష్టత ఏమిటి? తిలక ధారణ ఏమిటి అనే విషయాలను విపులీకరిస్తూ తమిళంలో ఒక
పుస్తకం వేశారు. అలాంటివి తెలుగులో కూడా రావాలి. E-learning ద్వారా దేశ విదేశాల్లోని బాలబాలికలకు భారతీయ ఆధ్యాత్మిక
విలువలను బోధించాలి”
గ్రంధ రచయిత శ్రీ వనం
జ్వాలా నరసింహారావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక
గ్రంధ రచనకు తనను ప్రోద్బలం చేసిన కారణాలను వివరించి, పుస్తకావిష్కరణ చేసిన కంచి
స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ కార్యక్రమంలో కంచి
కామకోటి పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకులు, శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారు
ఆసాంతం పాల్గొనడం ఓ విశేషం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ
మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్.వీ. సుబ్రహ్మణ్యం, కేంద్ర సమాచార హక్కు మాజీ కమిషనర్ శ్రీ మాడభూషి శ్రీధర్, ఎస్.బి.ఐ.
మాజీ సీ.జీ.ఎం. శ్రీ భండారు రామచంద్రరావు, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ వి.జే.ఎం. దివాకర్, బ్రహ్మశ్రీ కొడకండ్ల రాధాకృష్ణ శర్మ, శ్రీ దర్శనం శర్మ ప్రభ్రుతులు పాల్గొన్నారు.
(03-05-2021)
1, మే 2021, శనివారం
దీన్ని దోపిడీ అని కాకుండా వేరే విధంగా అనొచ్చా!
30, ఏప్రిల్ 2021, శుక్రవారం
కొలనరావు ఇక లేడు
నా చిన్న మేనల్లుడు కొలనరావు కొలిపాక (లచ్చుబాబు) అనేక వేలమందికి స్నేహపాత్రుడు. ఆ కొలనరావు ఇక లేడు. కరోనా కాటుకు బలై 29-04-2021 రాత్రి కన్ను మూశాడు.
ఈ మూడు
ముక్కలు రాయడానికే నేను ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఉబుకి వస్తున్న కన్నీళ్లు
అక్షరాలను మసకబారుస్తున్నాయి. ఏం చెప్పను? ఏం రాయను? భగవంతుడా! వయస్సులోనే వాడికి నూరేళ్లు నిండిపోతాయని ఏనాడూ
అనుకోలేదు. కళ్ళముందు చిన్నవాళ్లు రాలిపోవడమే పెద్దవాళ్లు చేసుకున్న పాపం అని మా
బామ్మ చెప్పేది.
28, ఏప్రిల్ 2021, బుధవారం
రాకూడని కష్టం
ఫేస్
బుక్ మిత్రురాలు శ్రీమతి షమీర్ జానకిదేవి,
సంజీవరావు దంపతులకు కరోనా గర్భశోకం మిగుల్చింది. ముప్పయ్యేళ్లు కూడా నిండని వారి చిన్న కుమార్తె ఈ
తెల్లవారుఝాఅమున కన్ను మూసింది. ఆరేడు నెలల పసివాడిని ఈ లోకంలో వదిలేసి.
బ్యాంకు
ఉద్యోగం చేస్తున్నప్పుడు,
రిటైర్ అయిన తర్వాత కూడా అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి ఉత్సాహం చూపే
జానకి గారెకి ఈ దుర్ఘటన శరాఘాతం.
రెండేళ్ల
క్రితం మా ఆవిడ చనిపోయినప్పుడు ఆ విషయం తెలుసుకున్న జానకి గారు, ఆవిడ భర్త సంజీవరావు గారు అతికష్టం మీద అడ్రసు పట్టుకుని వచ్చి పరామర్శించి
వెళ్ళారు.
కుమార్తె
భౌతిక కాయాన్ని వారికే అప్పగించడానికి వీలులేని రోజుల్లో ఆ దంపతులను ఓదార్చడానికి ఎవరు వెళ్ళాలి?
ఈ
కష్టం పగవారికి కూడా రాకూడదు.
కింది ఫోటో: జానకి గారి అల్లుడు, చనిపోయిన కుమార్తె, ఆరేడు నెలల బాబు
పడిలేచిన కెరటం
సోయ్ చిరో హోండా! ఉహు గుర్తు రావడం
లేదు.
పోనీ ఉట్టి ‘హోండా!’ ఓహో! హోండానా! హోండా యెందుకు తెలవదు. హీరో హోండా. మోటారు సైకిల్.
అమ్మయ్య అలా గుర్తుకు వచ్చింది కదా.
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ మోటారు సైకిళ్ళను, హోండా మోటారు వాహనాలను ఉత్పత్తిచేసే హోండా మోటారు కంపెనీ స్థాపకుడీయన. ఈ
స్థాయికి రావడానికి ఆయన ఎన్నో పాట్లు పడ్డాడు. పడడమే కాదు పడి లేచాడు. లేచి
నిలబడ్డాడు. తాను నిలబడి తన కంపెనీని నిలబెట్టాడు.
అత్యంత పేద కుటుంబంలో పుట్టిన ఈ
జపానీయుడికి చిన్నతనం నుంచి వాహనాలు అంటే ఎంతో
మోజు. ఆ రోజుల్లో వాళ్ల వూరికి వచ్చే మోటారు వాహనాలను చూడడానికి, వీలుంటే ఒకసారి చేతితో తాకడానికి చాలా మోజుపడేవాడు. ఆ అవకాశం దొరక్క కేవలం
ఆ మోటారు వాహనం నుంచి వెలువడే చమురు వాసన పీల్చి తృప్తిపడేవాడు. అలాటి వాడు
భవిష్యత్తులో ఒక పెద్ద మోటారు వాహనాల కంపెనీ స్తాపించగలడని వూహించడానికి కూడా
వీలులేని రోజులవి. బతుకు తెరువుకోసం ఓ గరాజులో పనికి కుదిరాడు. కానీ అతడి ఆరాటం
బతుకు బండి నడపడం కాదు. మోటారు బండి తయారు చేయడం.
ఈ క్రమంలో అతడి ఆలోచనలనుంచి
రూపుదిద్దుకున్న పిస్టన్ అతడి బతుకు బాటను ఓ మలుపు తిప్పింది. అంతా ఓ గాట్లో
పడుతోందని అనుకుంటున్న సమయంలో వచ్చిన భూకంపంలో అతడి ఫాక్టరీ సర్వనాశనం అయింది. కధ
మళ్ళీ మొదటికి వచ్చింది. భూకంపం అతడి ఫాక్టరీని ద్వంసం చేయగలిగింది కాని అతగాడి
పట్టుదలను కాదు కదా! అందుకే అతడు కధ మళ్ళీ మొదలుపెట్టాడు. ఈసారి మరింత కసిగా.
అతడి కృషితో ఫాక్టరీ తిరిగి ఉత్పత్తి
మొదలు పెట్టింది. అంతా సజావుగా సాగుతోంది. ఆర్డర్లు పెరుగుతున్నాయి. కంపెనీ
కోలుకుంటోంది. ఈ దశలో మళ్ళీ కోలుకోలేని డెబ్బ తగిలింది. రెండో ప్రపంచయుద్ధం
పుణ్యామా అని హోండా ఫాక్టరీ మూతపడింది.
యుద్ధం ముగిసింది. హోండా మళ్ళీ నడుం బిగించాడు. పట్టుదలే అతడి పెట్టుబడి. అంతకంటే మించిన పెట్టుబడి మరి
ఏముంటుంది. అందుకే అతడి కల ఫలించింది. వెనుతిరిగి చూడాల్సిన అవసరం ఇక రాలేదు.
కంపెనీ అప్రతిహతంగా అభివృద్ధి పధంలో పురోగమించింది.
దేశదేశాల్లో హోండా పేరు మారు మోగింది. విశ్వవ్యాప్తంగా హోండా కార్లకు ఆదరణ
పెరిగింది. మోటారు వాహనాల రంగంలో హోండా పతాకం వినువీధులకు ఎగిరింది.
‘పడిలేచిన కెరటం’ అంటే ఇదేనేమో!
(2015)