16, ఏప్రిల్ 2021, శుక్రవారం

డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారిక లేరు

 డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారితో చిన్న పర్సనల్ టచ్

దూరదర్శన్ విలేకరిగా పనిచేస్తున్న రోజుల్లో ఓ రోజు తెల్లగా తెలవారక మునుపే, కప్పు కాఫీ కూడా కడుపులో పడకుండానే జూబిలీ హిల్స్ లోని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కెమెరామన్ తో సహా చేరుకున్నాను. మిగిలిన జాతీయ చానళ్ళ బృందాలు కూడా బిలబిల మంటూ అక్కడికే చేరాయి. మామూలుగా అయితే బాబుగారి ఇంట్లో విలేకరులకు రాజభోగాలు. కానీ ఆ రోజు విలేకరులది పిలవని పేరంటం. బీజేపీతో టీడీపీకి ఎన్నికల పొత్తు విషయం గురించి తేల్చడానికి ఆ రెండు పార్టీల నాయకుల నడుమ ఎడతెగని చర్చలు లోలోపల సాగుతున్నాయి. బయట ఫుట్ పాత్ మీద నిలబడి కొందరం, కూలబడి కొందరం పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటున్నాం. ముందు జాగ్రత్త చర్యగా వెంట తెచ్చుకున్న సిగరెట్లను ఒకదాని వెంట మరోటి తగలేస్తూ, తెచ్చుకోని వాళ్లకు ఉదారంగా పంచిపెడుతూ నా మానాన నేను కాలక్షేపం చేస్తుండగా సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. కడుపులో ఎలుకలు. మరో పక్క సిగరెట్ల పొగతో కళ్ళ కలకలు. అలా నిలబడి సిగరెట్ తాగుతూ వున్నవాడ్ని వున్నట్టుండి స్లో మోషన్ లో కిందకు వొరిగి పోతూ వుండడం వరకే గుర్తు.
కట్ చేస్తే నిమ్స్ ఆసుపత్రిలోని ప్రత్యేక గదిలో డాక్టర్ల పర్యవేక్షణలో. ఆందోళనగా నా వైపే చూస్తున్న నా భార్య. ఆమెతో పాటు నా ఇద్దరు పిల్లలు. ముఖ్యమంత్రి గారా మజాకా. జరిగిన విషయం విలేకరుల ద్వారా తెలుసుకుని హుటాహుటిన అంబులెన్స్ తెప్పించి నన్ను నిమ్స్ లో అడ్మిట్ చేయించారట.
అందుకే కాబోలు, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు కూడా స్వయంగా వచ్చి చూసారు. రిపోర్టులన్నీ తిరగేశారు. కళ్ళు తిరగడానికి, వొళ్ళు తూలడానికీ నా సిగరెట్లే కారణం అని ఆయన తన అనుభవంతో ఇట్టే కనుక్కున్నారు. ఆ విషయం మా ఆవిడతో చెప్పి, ‘నెమ్మదిగా ఈ అలవాటు మానిపించమ’ని సలహా ఇచ్చారు. కళ్ళు తెరిచి ఇదంతా చూస్తూ, చెవులు వొగ్గి ఇదంతా వింటున్న నేను హఠాత్తుగా ముందుకు వొంగి, ‘నేను సిగరెట్లు మానేశాను డాక్టర్ గారు’ అని ఒక బహిరంగ ప్రకటన చేసాను. ఆయన విలాసంగా మందహాసం చేసి, నెత్తి మీది వెంట్రుకలు చేత్తో పట్టి చూపిస్తూ, ‘ఇలాటి వాళ్ళను నా సర్వీసులో ఇంతమందిని చూసాను’ అంటూ, ‘అదంత తేలిక కాద’ని ఆయనే చెబుతూ, నేను తాగే బ్రాండ్ సిగరెట్ ప్యాకెట్ ఒకటి అప్పటికప్పుడే తెప్పించి మా ఆవిడ చేతిలో పెట్టి, ‘రాత్రి అందరూ నిద్ర పోయిన తరువాత నీ మొగుడు నీ మెదడు కొరుక్కు తింటాడు, ఎందుకయినా మంచి ఇది దగ్గర వుంచుకోమ్మా’ అని వెళ్ళిపోయారు.
అంతే! ఎంతయినా నేనూ పట్టుదల కలిగిన మనిషిని కదా! ఇంటికి వెళ్ళినప్పటినుంచి ఆ ప్యాకెట్టూ ముట్టుకోలేదు. అప్పటినుంచి సిగరెట్టూ అంటించలేదు.
మరో వింత ఏమిటంటే, ఆనాటి నుంచి సిగరెట్ తాగాలని కూడా అనిపించలేదు.
నా చేత సిగరెట్లు మానిపించడం నా భార్యకే చేత కాలేదు. అలాంటిది ఆ పని చేసింది డాక్టర్ కాకర్ల గారు.
వారు కన్ను మూశారు అనే వార్త ఇప్పుడే తెలిసింది.
వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ...
(16-04-2021)

సర్కారీ జర్నలిస్టు

 సుమారు మూడు దశాబ్దాలు హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేసిన అనుభవం నాకుంది. ఇన్నేళ్ళ ఉద్యోగ పర్వంలో ఏనాడు పై అధికారులెవ్వరూ, ఆ మాటకు వస్తే కేంద్రప్రభుత్వంలో, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ,  సమాచార ప్రసార శాఖ మంత్రులుగా పనిచేసిన తెలుగువారు కూడా 'ఈ వార్త ఇలా ఇవ్వండి, ఆ వార్త అలా యెందుకు ఇచ్చారు' అని అడిగిన జ్ఞాపకం లేదు. ఆ పాటి ఫంక్షనల్ అటానమీ (విధి నిర్వహణా స్వేచ్ఛ) ని నాతోపాటు పత్రికల్లో పనిచేసిన సాటి జర్నలిష్టు మిత్రులు అనుభవించారని అనుకోవడం లేదు. అయినా కానీ, సర్కారీ వార్తలు రాసే సర్కారీ జర్నలిష్ట్ అనే ముద్ర నుంచి తప్పించుకోలేకపోవడం విచిత్రం. బహుశా, పాలక పక్షాలకు ఎలాటి రాతలు, ఎలాటి వార్తలు రుచిస్తాయో అవగతం చేసుకుని అందుకు తగ్గట్టుగానే వార్తలు వండి వడ్డించి వుంటామని అని అనేవాళ్ళు కూడా లేకపోలేదు.

రేడియో వార్తల సేకరణ, కూర్పు, ప్రసారాల్లో 'విధి నిర్వహణా స్వేచ్ఛ' గురించి సోదాహరణంగా చెప్పుకోవడం సముచితంగా వుంటుంది.

నర్రావుల సుబ్బారావు గారు. మోచేతుల కిందకి చొక్కా, పంచెకట్టుతో, చేతిలో చుట్టతో అచ్చం ఒక రైతు మాదిరిగా కనిపించేవారు. ఆయన్ని చూడగానే హైదరాబాదు ఆకాశవాణి ప్రాంతీయ వార్తావిభాగంలో న్యూస్ ఎడిటర్ అని ఎవరూ అనుకోరు. ఆకారంలోనే కాదు, నిజంగానే ఆయన రైతు పక్షపాతి. ఆ నైజం వార్తల్లో కూడా ప్రతిఫలించేది. వర్షాలు కురవక పలానా జిల్లాలో పైర్లు ఎండిపోతున్నాయని వార్తల్లో వివరాలతో సహా ప్రసారం చేసేవారు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు. ఆయన మాటకు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఎదురులేదు. అయినా సుబ్బారావు గారు తరువాత అనేక సంవత్సరాలు రేడియోలో కొనసాగారు.

ఒకసారి ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సుబ్బారావు గారు లేచి పలానా ప్రాంతంలో పంటలు ఎండి పోతున్నాయని, అధికారులు చేతులు ముడుచుకుని కూర్చున్నారని అన్నారు ఆయన తరహాలో. చెన్నారెడ్డి గారి తరహా కూడా విలేకరులకు తెలుసు. ఆ ప్రశ్న ఆయనకు సుతరామూ నచ్చలేదు. అది ఆయన మాటల్లో కనబడింది.

చూడు సుబ్బారావ్! నువ్వు విలేకరిగా ఈ ప్రశ్న వేస్తే జవాబు చెబుతాను. రైతుల ప్రతినిధిగా వేస్తె ఇక్కడ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు”

ఇరువురూ హుందాగా వ్యవహరించడంతో రసాభాస కాకుండా అది అక్కడకి ముగిసిపోయింది.

రేడియోమీద కానీ, రేడియో వార్తలమీద కానీ సర్కారువారికి పట్టో, పెత్తనమో వుంటుందని ఆ రోజుల్లో ఓ అభిప్రాయం ప్రచారంలో వుండేది. ఇలాటి ఉదంతాలు విన్నప్పుడు వాటికి సరైన ప్రాతిపదిక లేదన్న వాస్తవం బోధపడుతుంది.

నా ఈడువాడే, కొంచెం చిన్నవాడు కూడా ఓ జర్నలిస్టు స్నేహితుడు ఉండేవాడు. ప్రముఖ పత్రికలో పనిచేసేవాడు. నన్ను ఎప్పుడూ సర్కారీ జర్నలిస్ట్ అని ఎద్దేవా చేస్తుండేవాడు. నేనొకసారి అతడితో అన్నాను.

గంటలో ప్రాంతీయ వార్తలు వస్తాయి. నువ్వు ఒక వార్త ఇవ్వు ఏదైనా సరే. అది రేడియోకి ఇస్తాను. అలాగే నేను నీకొక వార్త చెబుతాను. అది రేపటి నీ పత్రికలో వచ్చేట్టు చూడు. ఆ తర్వాత జర్నలిస్టుల స్వేచ్చ గురించి తీరిగ్గా మాట్లాడుకుందాము’

అతడు చెప్పిన వార్త రేడియోలో వచ్చింది. నేను చెప్పిన వార్త అతడి పేపర్లో రాలేదని వేరే చెప్పక్కరలేదు. మరునాడే కాదు, ఎప్పటికీ రాదని అతడికీ తెలుసు.

ఆ తర్వాత అతడెప్పుడూ సర్కారీ జర్నలిస్టు అనే పదం నా వద్ద తేలేదు.

 

15, ఏప్రిల్ 2021, గురువారం

మా మంచం కధ – భండారు శ్రీనివాసరావు

 పెళ్ళయి, కాపురం పెట్టిన పదేళ్లకు కాబోలు మొట్టమొదటిసారి మొదటి మంచం కొనుక్కున్నాము. ఇందుకోసం నేనూ మా ఆవిడా కలసి పెద్ద సర్వేనే చేసాం. ఎక్కడమంచివి కొనుక్కోవచ్చని కాదు, ఎక్కడ కారు చౌకగా దొరుకుతాయా అని.

మొత్తం మీద లక్ డి కా పూల్ టెలిఫోన్ భవన్ దగ్గర మాకు తగ్గ షాపువాడు ఒకడు దొరికాడు. డెకొలం షీట్ వేసిన సింగిల్ కాట్స్ రెండూ కలిపి రెండువందల యాభయ్ రూపాయలు. షాపువాడే రిక్షాలో వేసి పంపిస్తానన్నాడు. సాయంత్రానికల్లా అవి దిగాయి. వున్న రెండు గదుల్లో ఒక రూమును ఫినాయిల్ వేసి కడిగి సిద్ధంగా ఉంచాము. మంచాలు వేయగా కాస్త కాళ్ళు కదపడానికి కాసింత జాగా మిగిలింది. మంచాలు అయితే వచ్చాయి కానీ వాటిమీద పరుపులు కొనడానికి మళ్ళీ ఒక నెల ఆగాల్సి వచ్చింది. ఏ పని చేయాలన్నా ఫస్ట్ తారీకు రావాలికదా.

మొత్తం మీద పరుపులు కూడా అమిరాయి. ఇక ఆ మంచాలే మాకు సర్వస్వం అయిపోయాయి. నలుగురు కూర్చుని ముచ్చట్లు చెప్పుకోవాలన్నా, చీట్ల పేకలు ఆడుకోవాలన్నా, ఆ మంచాల మీదనే. డైనింగ్ టేబుల్ అమిరేవరకు టిఫిన్లు, భోజనాలు కూడా వాటిమీదనే. నిజం చెప్పొద్దూ భోజనాల బల్లలు కొనుక్కున్న తర్వాత కూడా మంచాల మీద కూర్చునే అన్నాలు తినేవాళ్ళం.

ఉండడానికి మరో రూము వుంది కానీ, ఆ గది పగలల్లా అమ్మవొడి. అంటే మా ఆవిడ నడిపే చైల్డ్ కేర్ సెంటర్ అన్నమాట. పదిహేను ఇరవైమంది పసిపిల్లలు, చిన్న పిల్లలతో కీసర బాసరగా వుండేది. సాయంత్రం కాగానే శుభ్రంగా కడిగించి వుంచేది. ఇక అప్పటినుంచి అది పర్మిషన్ అక్కరలేని పేకాట క్లబ్ గా మారిపోయేది. పెద్దపెద్ద వాళ్ళు సాయంత్రానికల్లా అక్కడ జమయ్యేవాళ్ళు. అలా కాలక్షేపం చేసిన వాళ్ళు చాలామంది జీవితంలో చాలా పెద్ద స్థానాలలోకి చేరుకున్నారు. ఇక మా ఆవిడ అమ్మవొడిలో పెరిగిన పిల్లలు అనేకమంది ఇప్పుడు విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

ఇలా అందరికీ కలిసొచ్చిన ఆ చిక్కడపల్లి ఇల్లు ఇప్పుడు ఒక పెద్ద అపార్ట్ మెంటుగా మారిపోయింది. మాస్కో వెళ్ళేంతవరకు మేము ఆ ఇంట్లోనే అద్దెకు ఉన్నాము. ముప్పయ్యేళ్ళ తరవాత కూడా ఆ ఏరియాలో అమ్మవొడి అంటే గుర్తుపట్టేవాళ్ళు వున్నారు.

సందర్భం వచ్చింది కాబట్టి ఓ విషయం చెప్పుకోవాలి. నేను ఉదయం ఆరుగంటల కల్లా బయలుదేరి ఆఫీసు కారులో రేడియో స్టేషన్ కు వెళ్లి పొద్దుటిపూట ప్రసారం అయ్యే న్యూస్ బులెటిన్ తయారుచేసి వార్తల అనంతరం ఏడున్నర కల్లా మళ్ళీ ఇంటికి చేరేవాడిని. అలా అప్పుడు పక్క ఎక్కితే మళ్ళీ మిట్ట మధ్యాన్నమే దిగడం. తర్వాత సెక్రెటేరియేట్ లో మంత్రులు, లేదా ముఖ్యమంత్రి ఏర్పాటు చేసే ప్రెస్ కాన్ఫరెన్సులు కవర్ చేసుకుని, ఆఫీసుకు వెళ్లి రిపోర్టులు ఫైల్ చేసి సాయంత్రం ఇంటికి వచ్చేవాడిని. ఇది ఎవరికంటా పడలేదు కానీ, నేను పొద్దస్తమానం ఇంట్లో పడివుండడం మాత్రం ఇరుగింటి పొరుగింటి అమ్మలక్కల కంటపడింది. నాకు ఉద్యోగం లేదనీ, అందుకే ఇల్లు నడపడానికి మా ఆవిడ ఇలా కేర్ సెంటర్ నడుపుతోందని వాళ్లకి వాళ్ళే తీర్మానించుకుని మా ఆవిడమీద బోలెడు జాలి, నా మీద లేనిపోని అక్కసు పెంచుకున్నారు (ట). ‘ సెక్రెటేరియేట్ లో మా వారికి తెలిసిన వాళ్ళు వున్నారు. ఏదో కొలువు ఇప్పిస్తారు, మీ వారిని ఓసారి కలవమని చెప్పండి’ అన్నదో ఆవిడ నేరుగా మా ఆవిడతోనే.

ఆ అమ్మలక్కలు అందించిన ఆ ఆయుధం నన్ను ఆట పట్టించడానికి మా ఆవిడకు కొన్ని రోజులు బాగా ఉపయోగపడింది.

ఇప్పుడా ఆటలు, మాటలూ అన్నీ గతకాలపు ముచ్చట్లు.

 

గుళికలు – భండారు శ్రీనివాసరావు

 తెలుస్తూనే వుంది సంబడం

మొగుడు తాగి ఇంటికి వచ్చాడు. వచ్చీ రాగానే లాప్ టాప్ ముందేసుకుని ఫేస్ బుక్ ఓపెన్ చేసాడు.
'ఇవ్వాళ కూడా తాగారా' భార్య అడిగింది.
'అబ్బే లేదే. ఎందుకలా అడిగావ్?'
'ఏంలేదు. లాప్ టాప్ అనుకుని సూట్ కేసుమీద వేళ్ళు టకటకలాడిస్తుంటే అనుమానం వచ్చి అడిగాను లెండి'

ఆవిడ పుణ్యమే!
'అయ్యా ధర్మ ప్రభువులు ఓ ఇరవై రూపాయలు ఇలా నా చేతిలో పడేస్తే అలా వెళ్లి హోటల్లో టీ తాగొస్తాను'
'ఇస్తాలే కాని ఒక్క టీ తాగడానికి ఇరవై ఎందుకో అది చెప్పు ముందు'
'మరి నా గర్ల్ ఫ్రెండ్ కూడా నాకూడా వస్తుంది కదా'
'ఓహో ఇప్పుడు తెలిసింది బిక్షగాళ్లు ఆడపిల్లలతో ఫ్రెండ్ షిప్ చేస్తారని'
'అయ్యా మీరు పొరబడ్డారు. నేను ఫ్రెండ్ ని చేసుకోవడం కాదు. నన్ను మాత్రం బిక్షగాడిని చేసింది'

వీడి ఫేస్ నచ్చలేదు
భార్య" ఈ ముష్టివాడ్ని మన ఇంటికి రానివ్వకండి, వాడిని చూస్తె నాకు అరికాలిమంట నెత్తి కెక్కుతుంది
భర్త: ఎందుకే వాడంటే అంత కోపం?
భార్య: ఎందుకేమిటి? నిన్న వస్తే మిగిలిన టమాటా పప్పు, వంకాయ కూర వాడి గిన్నెలో వేసాను. ఈరోజు పొద్దున్న ఎంచక్కా వచ్చి నా చేతిలో వంటా వార్పూ పుస్తకం పెట్టి వెళ్ళాడు. వొళ్ళు మండదా మరి!
వంక
విమానంలో పక్క సీట్లో కూర్చున్న అందమైన యువతితో మాటలు కలపాలనుకున్నాడు ఏకాంబరం.
'మీ వొంటికి రాసుకున్న సెంటు ఏం బ్రాండో తెలియదు కాని అద్భుతంగా వుంది. అదేమిటో చెబితే నేను మా ఆవిడకు కూడా కొనిస్తాను'
'వద్దు లెండి. ఇది రాసుకుంటే ఏ వెధవో ఇలాగే మీ ఆవిడతో మాటలు కలపాలని చూస్తాడు'

అదేమరి!
తల్లి : 'టిప్పు సుల్తాన్ ఎవర్రా?'
కొడుకు: తెలియదు మమ్మీ!
తల్లి: అదేమరి చెప్పేది. ఎప్పుడూ ఆటలు పాటలు అని జులాయి తిరుగుళ్ళు మానేసి అప్పుడప్పుడన్నాపుస్తకాల మీద ధ్యాస పెట్టమని చెప్పేది అందుకే'

కొడుకు : రీటా ఆంటీ తెలుసా అమ్మా!

తల్లి: తెలియదురా ఎవరావిడ?

కొడుకు: అదేమరి. ఎప్పుడూ టీవీ సీరియళ్లు అని కాలక్షేపం చేయకుండా అప్పుడప్పుడన్నా నాన్న ఏం చేస్తున్నాడో ఓ కంట కనిపెట్టి చూడమని చెప్పేది అందుకే!

ఏపీ రాజకీయ చిత్రం – భండారు శ్రీనివాసరావు

 

“ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ విభజనపై మీ అభిప్రాయం?’

‘అచట జనములు పలు తెరగులు.
‘ చంద్రబాబుపై అభిమానంతో జగన్ ని ద్వేషించేవాళ్లు, జగన్ పై కోపంతో బాబును ప్రేమించేవాళ్లు, జగన్ పై అభిమానంతో బాబును విమర్సించేవాళ్ళు, బాబు అంటే గిట్టకపోయినా జగన్ పై ద్వేషంతో బాబుని అభిమానించేవాళ్ళు, జగన్ అంటే పడకపోయినా బాబుపై ద్వేషంతో జగన్ ని అభిమానించేవాళ్ళు, సోనియాపై కోపంతో మోడీని అభిమానించేవాళ్ళు, మోడీపై అభిమానంతో సోనియాను ద్వేషించేవాళ్లు, మోడీపై ప్రేమ లేకపోయనా సోనియా కారణంగా ఆయన్ని అభిమానించేవాళ్ళు, సోనియాపై అభిమానం లేకపోయినా మోడీ కారణంగా ఆమెని అభిమానించేవాళ్ళు, మోడీ మీద ప్రేమ లేకపోయినా పవన్ కారణంగా ఆయన్ని సమర్ధించేవాళ్ళు, పవన్ పొడ గిట్టకపోయినా మోడీ కారణంగా ఆయనకు మద్దతు పలికేవాళ్ళు, ఇలా...ఇంకా...’

‘వద్దు, వద్దు, ఇప్పటికే తల నాలుగు టీవీ చర్చలు చూసినట్టుగా వాచిపోయింది.’ (15-04-2021)

14, ఏప్రిల్ 2021, బుధవారం

చేదు గుళికలు - భండారు శ్రీనివాసరావు

 

"కొందరు విశ్లేషకులు రాజకీయ పార్టీల అధికార ప్రతినిధులుగా మారిపోవడం వల్ల వాళ్ళ అభిప్రాయాలకు విలువతగ్గుతోంది. మరి కొందరు రాజకీయ నాయకులు విశ్లేషకుల అవతారం ఎత్తడం వల్ల వాళ్ళ మాటలకు విశ్వసనీయత తగ్గుతోంది"

"మీరు చదివే పత్రికను బట్టి మీ అభిప్రాయం వుంటుంది. ఔనా?"
"కావచ్చు. కానీ నా అభిప్రాయానికి అనుగుణంగా వుండే పత్రికనే నేను చదువుతాను"

"నిన్నటి స్క్రోలింగే మళ్ళీ ఈరోజు వేస్తున్నారెందుకు'
'నిన్నచెప్పిందే ఇవాళ కూడా చెప్పారు. అందుకని వేశాం. రేపు ఇదే చెబితే మళ్ళీ అదే వేస్తాం! ప్రతిపూటా ఓ కొత్త విషయం చెప్పాలంటే కష్టం కదా!'

వీవీఐపీని కలిసినప్పుడు గౌరవపురస్సరంగా ఖరీదైన పుష్పగుచ్ఛాలు చేతికి ఇస్తారు. ఆయన దాన్ని తక్షణమే పక్కన వున్న తన అటెండర్ చేతిలో పెడతారు.
అంటే అటెండర్ కు కూడా ఆ వీవీఐపీ పుష్పగుచ్ఛం ఇచ్చినట్టే కదా!

'ఒక వైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు'
-సినిమా డైలాగ్
'ఒకవైపే చూస్తా రెండో వైపు చస్తే చూడను'
- పార్టీ అభిమాని

ఉదయం పూట పార్కుల చుట్టూ వందలాది కార్లు అడ్డదిడ్డంగా పార్కు చేసి వెళ్ళే వారిని చూసినప్పుడు 'నడకే' తప్ప 'నడత' తెలియని మనుషులనిపిస్తుంది.

నలభయ్ ఏళ్ళక్రితం ఆంధ్రజ్యోతిలో సినిమా రివ్యూలు రాసేవాడిని. డిస్త్రి బ్యూటర్లు ప్రివ్యూ(PREVIEW)లకు పిలిచి మర్యాదలు చేసేవాళ్ళు. వాటికి పెట్టిన పేరు: ‘ఫ్రీవ్యూ’ (FREE VIEW)

రాజకీయ శ్రవణానందాలు - పంచాంగ శ్రవణాలు

 

ఉగాది పర్వదినంనాడు పంచాంగ శ్రవణం అనేది అనూచానంగా వస్తున్న ఆచారం. ప్రస్తుతం అన్ని వ్యవహారాలు ఆర్ధికమయం అయిపోతున్న ఈ రోజుల్లో - కాలపరీక్షకు నిలుస్తూ ప్రజల అభిమానం చూరగొంటున్న పంచాంగ శ్రవణం కూడా విలువలు కోల్పోతూ వాణిజ్య స్వరూపాన్ని సంతరించుకుంటూ వుండడం విచారకరం.
మా స్వగ్రామం కంభంపాడులో మా చిన్నతనంలో ఇద్దరు పంచాంగకర్తలు వుండేవాళ్ళు. లంకా సూర్య ప్రకాశ సిద్ధాంతి గారు. గూడా సత్యనారాయణ సిద్ధాంతి గారు. నాకు గుర్తున్నంతవరకు తెలుగు అంకెల్లో అంటే – ౧ ౨ ౩ ౪ ౫ (1 2 3 4 5 ) ఇలా ముద్రించే ప్రింటింగ్ ప్రెస్సులు ఆ రోజుల్లో చాలా తక్కువ వుండేవి. పైగా పంచాంగంలో తెలుగు భాషను అర్ధం చేసుకుని కంపోజ్ చేసేవాళ్ళు, ప్రూఫులు దిద్దేవాళ్ళు కూడా తక్కువగా వుండడం వల్లనో యేమో చాలా పంచాంగాలు, విభిన్న పండితులు రాసినా ఒకే ప్రెస్సులో (తెనాలిలో అనుకుంటా) ముద్రించేవారు. ఉగాదికి చాలా ముందుగానే వీటి ముద్రణ పూర్తయ్యేది. ఎందుకంటే రాసిన సిద్ధాంతులు వాటిని కాలినడకన అన్ని వూళ్ళకు వెళ్ళి పంచాంగాల ముద్రణకు ద్రవ్య సాయం చేసిన దాతలకు వాటిని ఇచ్చి అందుకు ప్రతిఫలంగా తృణమో ఫణమో స్వీకరించేవారు. పంచాంగ రూపకల్పనకు ముందు, నాకు బాగా జ్ఞాపకం, సత్యనారాయణ సిద్ధాంతి గారు అస్తమానం గాలిలో చేతులు ఆడిస్తూ, అర్ధనిమీలిత నేత్రాలతో ఏదో గణిస్తూవుండేవారు. ఒకరకంగా చెప్పాలంటే వాళ్లదో లోకం.
పొతే,
తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని అనేక తెలుగు చానళ్ళు ‘రాజకీయ పంచాంగాల’ పేరుతొ ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేసాయి. ప్రతి రాజకీయ పార్టీ తన కార్యాలయంలో ఒక సిద్ధాంతి గారితో పంచాంగ శ్రవణం కార్యక్రమాలను ఏర్పాటుచేసుకుని తమకు అనుకూలమైన ఫలితాలను చెప్పించుకుని తాత్కాలిక ఉపశమనం పొందాయి. నిజానికి దేవాలయ ప్రాంగణాల్లో నిర్వహించాల్సిన తంతు ఇది. వెనుకటికి, ఆ మాటకు వస్తే ఇప్పటికీ గుళ్ళల్లో జరిగే పంచాంగ శ్రవణాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతూనే వున్నారు. టెక్నాలజీ వినియోగం తక్కువగా వున్నరోజుల్లో ప్రజలు, తమకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని ఈ పంచాంగ శ్రవణాల ద్వారా తీర్చుకునేవారు. అప్పట్లో వాళ్లకు కొన్ని అంశాల మీదనే ఆసక్తి వుండేది. వానలు యెలా పడతాయి? పంటలు యెలా పండుతాయి? యే పంటలకు ఎలాటి ధర లభిస్తుంది? ఇక వ్యక్తిగతంగా చూసుకున్నప్పుడు ఆదాయ వ్యయాలు యెలా వుంటాయి? ఆరోగ్యం ఎలావుంటుంది? ఇలాటి ప్రశ్నలకు పంచాంగ శ్రవణ కార్యక్రమాల్లో సమాధానాలు లభిస్తాయన్న ఆశ వారిది. నాటి పరిస్తితుల దృష్ట్యా తప్పుబట్టడానికి కాని, సిద్ధాంతులు చెప్పే విషయాలతో కేవలం వాదన కోసం విభేదించడానికి కాని వీలులేదు.
కాకపొతే ప్రజలు వీటిని బాగా నమ్ముతున్నారు అన్న నమ్మకం పెంచుకున్న రాజకీయ పార్టీలు, వాటి నాయకులు ఈ పంచాంగ శ్రవణాన్ని సైతం తమ ప్రయోజనాలకు వాడుకోవడం ఈ మధ్యకాలంలో బాగా ప్రబలిపోయింది. అందుకే యే పార్టీకి ఆ పార్టీ సొంతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసుకుని పండితుల చేత నాలుగు మంచి ముక్కలు చెప్పించుకుని, మీడియాలో ప్రచారం చేయించుకుని, తాము సంతోషపడడం మాత్రమే కాకుండా ఆ మాటలు జనం కూడా నమ్ముతున్నారు అనే భ్రమలో పడిపోతున్నారు. మరో రకంగా చెప్పాలంటే ఎన్నికల సర్వేలు చేయించుకుని, తమకు అనుకూలంగా రాయించుకుని, సానుకూల ఫలితాలు రాకపోతాయా అని సంతృప్తి పడడం ఎలానో ఇదీ అలానే.
ఈ ఆచారానికి బీజం పడింది మాత్రం పాలక పక్షాలు ప్రభుత్వ ఖర్చుతో ఉగాది వేడుకల పేరుతొ నిర్వహించే అధికారిక కార్యక్రామాల్లో. మొదట్లో గుడిలో జరిగే రీతిలోనే ఈ పంచాంగ శ్రవణాలు మొదలయినా, పోను పోను రాజుల ఆస్థానాల్లో వందిమాగధుల స్త్రోత్ర పాఠాల మాదిరిగా తయారై, ఇదిగో ఈనాటి ఈ వికృత రూపాన్ని సంతరించుకున్నాయి. దేనికీ పడనివాడు పొగడ్తకు పడతాడన్నట్టుగా ఈ నాటి రాజులను అంటే ముఖ్యమంత్రులను సంతోషపెట్టడానికి నాలుగు మంచి ముక్కలతో ప్రారంభమై ఇప్పడు భట్రాజు పొగడ్తలను తలదన్నేవిదంగా తయారయ్యాయి. పేరున్న సినిమానటి ‘పలానా సబ్బునే వాడుతాను’ అంటే జనం ఎగబడి కొంటారన్న భ్రమలకు గురై వాణిజ్య సంస్థలు ప్రకటనలు గుప్పిస్తున్నట్టు ఇప్పుడు ఈ కార్యక్రమాలకోసం ప్రజల్లో పట్టున్న పండిత ప్రకర్షులను పోటీలుపడి ఎంపిక చేసుకుంటున్న తీరు గమనిస్తే పరిస్తితి యెంత వేగంగా దిగజారుతున్నదో అర్ధం అవుతుంది. యే రోటి వద్ద ఆ పాట పాడాలి అన్నచందంగా యే పార్టీ ఆఫీసులో ఆ పార్టీ పలుకు పలికే తీరులో ఇవి ఏడాది ఏడాదికీ విలువలు పోగొట్టుకుంటున్నాయి. ‘పంచాంగాలా పాత చింతకాయ పచ్చడేం కాదూ’ అంటూ అవహేళన చేసే హేతువాదులకు, జన చైతన్య కార్యకర్తలకు కొత్త ఆయుధాన్ని చేతికి అందిస్తున్నాయి. అలాగే, వాటిని పవిత్రంగా, సంస్కృతిలో భాగంగా భావించేవారికి కూడా ఈ పరిణామాలు తీరని మనస్తాపాన్ని కలిగిస్తున్నాయి. ప్రాచీన సంస్కృతీ వైభవాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్న ప్రతిఒక్కరూ ఈ విషయంపై దృష్టి సారిస్తే బాగుంటుంది.