7, ఏప్రిల్ 2021, బుధవారం

'ఏ’ ‘బీ’ ‘సీ’ ‘డీ’ – భండారు శ్రీనివాసరావు

 


ఏ’ కూ ‘బీ’ కూ పడదు. ‘ఏ’ ఏది చెప్పినా ‘బీ’ ఖండిస్తుంది. ‘బీ’ ఏది వాదించినా ‘ఏ’ అడ్డు తగులుతుంది.

సీ’ కీడీ’ కీ చుక్కెదురు. ‘సీ’ చెప్పే మాట ‘డీ’ చెవిదూరనివ్వదు. ‘డీ’ మాట ‘సి’ చెవిన పెట్టదు.

ఇంతేనా అంటే ఇంకా వుంది.

ఈ నాలుగింటిలో మళ్ళీ ఒకదానికొకటి కుదరదు. కాకపొతే ‘ఏ, బీ’ వాదించుకుంటుంటే ‘సి, డీ’ లు వినోదం చూస్తుంటాయి. ‘సి, ‘డీ’ తగవు పడితే ‘ఏ, ‘బీ’ లు మౌనంగా ఆనందిస్తాయి.

అంశాన్ని బట్టి అందరూ ఒకరితో ఒకరు వాదించుకోవడమో, లేదా ఇతరుల వాదనలు వింటూ వినోదించడమో చేస్తుంటాయి.

ఏతావాతా ప్రేక్షకులకు మిగిల్చేది మాత్రం ఓ క్వింటాలు అయోమయం.

ప్రోటోకాల్ పేచీలు – భండారు శ్రీనివాసరావు

 ప్రజాప్రతినిధులు, వారికి ఇవ్వాల్సిన మర్యాదలు (ప్రోటోకాల్) గురించి చర్చ జరుగుతోంది. పేరుకు ముందు గౌరవనీయులు అనే పదం విధిగా తగిలించాల్సిన వారిలో కొందరి దురుసు ప్రవర్తన కూడా పతాక శీర్షికలకు ఎక్కుతోంది. ఈ నేపధ్యంలో ఓ ముప్పయ్యేళ్ళ నాటి జ్ఞాపకం మనసులో కదలాడింది.

అప్పుడు నేను మాస్కోలో రేడియో మాస్కోలో పనిచేస్తూ ఉండేవాడిని. ప్రతి ఫ్లోర్ లో ఉద్యోగులకోసం క్యాంటీన్లు ఉండేవి. ప్రతి ఒక్కరూ క్యూలో నిలబడి తమకు కావల్సినవి తెచ్చుకోవాలి. తెలుగు విభాగంలో గీర్మన్, విక్టర్ అని ఇద్దరు సహాయకులు వుండేవాళ్ళు. ఒకరోజు క్యాంటీన్ కు వెళ్లి క్యూలో వున్నప్పుడు నావెనుక ఒకాయన నిలబడ్డారు. ఆయన సోవియట్ ప్రభుత్వంలో రేడియో టెలివిజన్ వ్యవహారాలు చూసే శాఖకు మంత్రి. నేను తప్పుకుని ఆయనను ముందుకు రమ్మని మర్యాదకోసం కోరితే ఆయన మృదువుగా తిరస్కరించారు. మా లాగే మా మంత్రి కూడా క్యూలో నిలబడి డబ్బులు చెల్లించి కాఫీ తాగి వెళ్ళిన వైనం నాకు చాలా చిత్రంగా అనిపించింది. అలాగే, మంత్రులు, సీనియర్ అధికారులు ప్రభుత్వం సమకూర్చిన వాహనాల్లో వచ్చేవాళ్ళు. అయితే, ఆఫీసు గేటు ముందు తనిఖీ సిబ్బందికి తమ గుర్తింపు పత్రాలు చూపించిన తరువాతనే లోపలకు రావడం నేను ఎన్నో సార్లు గమనించాను.

అంటే ఏమిటి? వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడం కోసం కొన్ని సదుపాయాలు కల్పించారు. మిగిలిన విషయాల్లో వాళ్ళు కూడా నలుగురితో సమానమే.

ప్రత్యేక సదుపాయాలు, ప్రత్యేక హక్కులు వీటి నడుమ సన్నటి గీత వుంటుంది. మన దురదృష్టం. మన దేశంలో ఈ విభజన రేఖ కనబడకుండా చేశారు.

సుపరిపాలన అనగా .... భండారు శ్రీనివాసరావు

 ఎవరి పాలనలో అయితే పాలకుల ప్రమేయం లేకుండా పాలితులు తమ దినవారీ జీవితాలను నిశ్చింతగా గడపగలుగుతారో ఆ ప్రభుత్వం ఉత్తమ ప్రభుత్వం’ అని రాజనీతి శాస్త్రం చెబుతుంది.

ఇప్పటి ప్రభుత్వాలు పాలితులకు అలాంటి పాలన ఇవ్వగలుతున్నాయని చెప్పగలిగిన స్తితి వుందా అంటే సందేహమే.

సబ్సిడీ బియ్యం కావాలంటే రేషన్ కార్డు కావాలి. రేషన్ కార్డు కావాలంటే ఎవరో ఒక ప్రభుత్వాధికారి సంతకం కావాలి. అతగాడికి ఇదొక్కటే పనికాదుకదా! అంచేత, దానికోసం చెప్పులు అరిగేలా తిరగాలి. ఎవరయినా పుణ్యాత్ముడు దొరికి సంతకం పెట్టినా, మరో అధికారి ఆదాయం సర్టిఫికేట్ ఏదీ అంటాడు. అది ఇచ్చే ఆయన అడ్రసు ప్రూఫ్ పట్రా అంటాడు. అది ఇచ్చేవాడు ఆ అడ్రసులో వుంటున్నది నువ్వే అని దాఖలా చూపమంటాడు. ఇవన్నీ లేకపోయినా తెలివి మాత్రం వున్నవాడు అన్నీ ఇట్టే పుట్టించి కావాల్సిన సర్టిఫికేట్లు కావాల్సిన విధంగా ఒక్క రోజులో తెచ్చుకుంటాడు. తెచ్చుకోలేని వాడు తన అసమర్ధతని ఒక పక్కా, ప్రభుత్వాన్ని మరోపక్కా ఆడిపోసుకుంటూ వుంటాడు. ఇలానే అనేకం. అది ఆసుపత్రిలో వైద్యం కావచ్చు, బళ్ళో ప్రవేశం కావచ్చు, గుళ్ళో దర్శనం కావచ్చు దేనికైనా ప్రభుత్వం మీద ఆధార పడాల్సిందే. అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిందే. చిన్న చిన్న విషయాల్లో కూడా ఇంత చెడ్డ పేరు తెచ్చుకోవడం అవసరమా?

దుర్భలస్య బలం రాజ’ అంటాడు కౌటిల్యుడు తాను సూత్రీకరించిన ‘మత్య్స న్యాయం’లో.

చిన్న చేపలను పెద్ద చేపలు తినడం అందరూ ఎరిగిందే. సమాజంలోని బలహీనులను బలవంతులు దోచుకోకుండా రాజులు కాపాడాలి అన్నది కౌటిల్యుడు బోధించిన సూక్తి. కానీ, నేటి సమాజంలో పాలకులు ఆ విధంగా బలహీనుల కాపు కాస్తున్నారా అంటే ఔనని చప్పున చెప్పడం కష్టం. కాకపొతే దారిద్ర్య రేఖకు దిగువన వున్న దరిద్ర నారాయణుల సంక్షేమం కోసం కొన్ని, కొన్ని పధకాలు ప్రవేశ పెడుతుంటారు. ప్రచార ఆర్భాటం తప్పిస్తే అవి అర్హులకు అందుతున్నాయని, దుర్వినియోగం కావడం లేదని గుండె మీద చేయి వేసుకుని చెప్పలేని పరిస్తితి. కాకపొతే, ఈ సంక్షేమ పధకాల పుణ్యమా అని కొందరు దళారులు కోటికి పడగలెత్తుతున్నారనేది కాదనలేని వాస్తవం. పూటకో పధకం తెచ్చాం అని ప్రకటించుకోగానే పాలన బాగున్నట్టు కాదు. అమలు కాని పధకాల వల్ల లాభపడేది కేవలం ప్రకటన కర్తలు మాత్రమే. రోజుకో కొత్త చొక్కా తొడుక్కున్నంత మాత్రాన పండగ కాదు కదా!

సమాజంలో ప్రజలందరూ తినాకుడవా సమృద్ధిగా వున్నట్టు పైకి కనబడాలంటే కొందరు అవి లేనివాళ్ళు కూడా వుండాలి అని వాదించే వాళ్ళు కూడా లేకపోలేదు. రైలు బోగీల్లో రెండో తరగతి వున్నప్పుడే మొదటి తరగతికి ఆ హోదా, భోగం అన్నది వాళ్ళ థియరీ.

రాజులు ఎలా పాలించాలి అనే విషయంలో శుక్రుడు, విదురుడు, చాణక్యుడు మొదలయిన వారు ప్రవచించినవి రాజనీతి శాస్త్రాలుగా ప్రసిద్ధి పొందాయి. భర్తృహరి ‘నృప నీతి అనేక రీతి’ అంటూ సూత్రీకరించాడు. ప్రజల పట్ల రాజులు ఎలా వ్యవహరించాలి అన్నదే ఈ శాస్త్రాలు అన్నింటిలో కీలకాంశం.

శ్రీకృష్ణ దేవరాయలు ఓ చెంప రాజ్య పాలన చేస్తూనే, మరో వంక సాహితీ సేద్యం చేసేవారట. అలా ఆయన సాహిత్య క్షేత్రంలో పుట్టుకొచ్చినదే ‘ఆముక్తమాల్యద’ కావ్యం. అందులో యమునాచార్యుల చేత రాయలవారే తన మనసులోని మాట చెప్పిస్తారు.’ రాజ్యాంతే నరకం ధృవం’ అని. రాజు తన పాలనలో తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తాడు. కారణాలు అనేకం వుండొచ్చు కానీ తప్పనిసరై కొన్ని హింసలకు పాల్పడతాడు. మరిక నరక ప్రాప్తి తప్పదు కదా!

ఈ పాపపరిహార్ధం రాజులు యాగాలు, యజ్ఞాలూ చేసేవాళ్ళు. మరి వాళ్లకు పుణ్యలోకాలు సిద్ధించాయో, నరకలోకమే ప్రాప్తించిందో వెంటబోయి, వెనక్కి వచ్చి చెప్పినవాళ్ళు ఎవరూ లేరు. కానీ వారి పరిపాలన వల్ల జనాలు సుఖపడ్డారా లేక కష్టపడ్డారా అన్నది ఒక్కటే మంచిచెడ్డల ఎంపికకు సరయిన గీటురాయి.

ఒకసారి నాకు బాగా తెలిసిన పెద్ద మనిషికి ఒక పెద్ద పదవి దక్కింది. అంతా వెళ్లి శుభాకాంక్షలు చెబుతున్నారు. నేనూ వెళ్లి చెప్పాను. యేమని?

మంచి అవకాశం లభించింది మీకు. అవసరంలో వున్నవారికి అడగకుండానే సాయం చేయండి’

ఆయనకు మరోలా అర్ధం అయినట్టు వుంది. అధికారంలో వున్నన్నాళ్ళు అవసరం పడ్డ వాళ్లకు బాగానే సాయపడ్డాడని ప్రతీతి.

సాక్షరా విపరీతాశ్చేత్ అని హితోపదేశం చెబుతోంది. అంటే అక్షరాస్యులు విపరీత మనస్కులు అయితే రాక్షసులు అవుతారని అర్ధం. ఇప్పుడు సాక్షరులు అంటే మేధావులు, చదువుకున్న వాళ్ళు. సాంఘిక మాధ్యమాల్లో వీరి విశృంఖల వీర విహారాలు చూస్తుంటే, ‘సాక్షరా తిరగేస్తే రాక్షసా అవుతుంద’ని కీర్తిశేషులు ఆర్వీయార్ చెప్పిన మాట గుర్తుకు వస్తుంది.

రాజకీయాలు రాయడం పత్రికల ప్రధాన వ్యాపకం. ఈ నింద మోస్తూ కూడా అప్పుడప్పుడూ ప్రజాసమస్యలను వెలుగులోకి తెస్తుంటాయి. అవి రాసే ప్రతివార్తను రాజకీయ కోణంలో చూడకుండా దిద్దుబాటు చర్యలు తీసుకుంటే ప్రజలు సుఖపడతారు. వెనుకటి రోజుల్లో ప్రజల కష్టాలను స్వయంగా గమనించడానికి రాజులు మారువేషాల్లో తిరిగేవారు. లేదా వారి వేగులు ఈ పని చక్కబెట్టేవారు. ఇప్పుడూ ప్రభుత్వంలో ఈ పనులు చూడడానికి ఒక ప్రత్యేక నిఘా విభాగమే వుంది. ప్రతిపక్షాల మీద కన్నేసి వుంచడంలోనే వారి పుణ్యకాలం గడిచిపోతోంది. ఇక ప్రజల ఇబ్బందులు ఎక్కడ పట్టించుకుంటారు. కావున, ఏలినవారికి నచ్చినా నచ్చకున్నా, ఈ పనికి కొంతలో కొంత పత్రికల మీదనో, మీడియా మీదనో ఆధారపడడమే మేలు.

అసలు ఇదంతా కాక అసలయిన కిటుకు ఒకటి వుంది.

జనాలకు ప్రభుత్వాలతో ప్రమేయం లేకుండా చేయండి. ఆ ప్రభుత్వాలను జనమే నెత్తిన పెట్టుకుంటారు.

6, ఏప్రిల్ 2021, మంగళవారం

అమ్మాయిలూ ! బ్రహ్మాస్త్రం మీ చేతిలోనే వుంది

 

అమ్మాయిలూ ఇలా చేసి చూడండి !

ఆ భవనంలో మీరు వెళ్ళాల్సింది ఆఖరు అంతస్తులోకి. బాగా పొద్దుపోయింది. లిఫ్ట్ లోకి మీతో పాటు పరిచయం లేని ఓ మగవాడు కూడా ఎక్కాడు. అతడి చూపులు, ప్రవర్తన మీకు అనుమానం కలిగించాయి. అప్పుడు ఏం చెయ్యాలంటే, మీరు వెళ్ళాల్సిన అంతస్తు పన్నెండు అనుకోండి. పన్నెండు లిఫ్ట్ బటన్లు ఒకేసారి వరసగా ప్రెస్ చేయండి. దాంతో లిఫ్ట్ ప్రతి అంతస్తులో ఆగుతూ వెడుతుంది. అలా ఆగుతూ వెళ్ళే లిఫ్ట్ లో ఎలాటి అఘాయిత్యం చేయడానికీ ఏ మగవాడు సాహసించడు.

ఇంట్లో మీరు ఒంటరిగా వున్నారు. ఎవడో ముక్కూ మొహం తెలియని మనిషి లోపల ప్రవేశించి మీ మీద దౌర్జన్యం చేయబోయాడు. వెంటనే వంట గదిలోకి వెళ్ళిపొండి. కారపు పొడి డబ్బా ఎక్కడ వుంటుందో మీకు మాత్రమే తెలుసు. కత్తులూ, ప్లేట్లు ఎక్కడ ఉంటాయో తెలిసిందీ మీకే. వాటిని మీ రక్షణ కవచాలుగా మార్చుకోండి. స్టెయిన్ లెస్ స్టీల్ ప్లేట్లు, చెంచాలు గదంతా విసరడం మొదలు పెట్టండి. ఆ చప్పుడుకు ఇరుగూపొరుగూ రావడం ఏమో కాని ఆ ఆగంతకుడి గుండెల్లో రైళ్ళు పరిగెత్తడం ఖాయం. కాలికి బుద్ది చెప్పడం అంతకంటే ఖాయం.

రాత్రి వేళ వొంటరిగా ఆటోలోనొ, టాక్సీలోనొ వెళ్ళాల్సిన అవసరం పడింది. ఆటో ఎక్కే ముందే దాని నెంబరు రాసుకోండి. ఎక్కగానే మొబైల్ ఫోనులో ఇంటి వారికి వివరాలు ఆటో డ్రైవర్ వినేటట్టు పెద్దగా చెప్పండి. అవతల లైను కలవకపోయినా సరే, ఆటో వివరాలు ఎవరికో చెబుతున్నట్టు కాసేపు నటించండి. ఇక అంతే! అప్పటిదాకా వాడి మనసులో వేరే చెడు ఉద్దేశ్యాలు వున్నా ఆ ఫోను కాలుతో అన్నీ సున్నా. తన వివరాలు మీకు తెలుసనీ, మీకే కాకుండా మీ వాళ్లకు కూడా తెలిసిపోయాయని తెలుసుకుని భయపడి పోతాడు. మీరు వెళ్ళాల్సిన చోటుకు భద్రంగా తీసుకువెళ్ళి దింపుతాడు. ఎందుకంటె మీకేదైనా జరిగిందంటే ముందు చుట్టుకునేది వాడి మెడకే అని వాడికి అప్పటికే అర్ధం అయి వుంటుంది.

మీరు ఎక్కిన ఆటోవాడు హఠాత్తుగా వేరే సందులోకి మళ్ళాడనుకోండి. గాభరా పడకండి. అదును చూసి మీ చున్నీతో వాడి మెడ గట్టిగా వెనక్కి లాగండి. ఊపిరాడక వాడే గిజగిజలాడుతాడు. అపాయం నుంచి తప్పించుకోవడానికి ఆ మాత్రం వ్యవధానం చాలు.

ఇంతకీ చెప్పేదేమిటంటే...

'మృగాళ్ళ' నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి వేరే ఆయుధాలు అక్కరలేదు. మానసికంగా చురుగ్గా, సంసిద్ధంగా వుంటే చాలు, అదే మీ చేతిలో కనబడకుండా వుండే 'బ్రహ్మాస్త్రం'.

ఏమంటారు?

5, ఏప్రిల్ 2021, సోమవారం

దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి ఎలా అయ్యారు? - భండారు శ్రీనివాసరావు

 

కాకతాళీయం కావచ్చు. కానీ ఇలాంటివి  మనసుకు స్వాంతన కలిగిస్తాయి. దామోదరం సంజీవయ్య గారి గురించి నేను ఏనాడో రాసుకున్న జ్ఞాపకాన్ని సుప్రీం కోర్టు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ  రమణ  నోటి వెంట వెలువడడం నిజంగా సంతోషం కలిగించే విషయమే!



 

దామోదరం సంజీవయ్య గారు - ఓ జ్ఞాపకం - భండారు శ్రీనివాసరావు

అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రి.

ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి ఆ పదవికి రాజీనామా చేసారు. ఆయన స్థానంలో దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రిగా నియమించాలని నెహ్రూ నిర్ణయించారు. అగ్రకులాల ఆధిపత్యం అధికంగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ లోని కొందరు నాయకులు ఒక దళితుడు ముఖ్యమంత్రి కావడాన్ని సహించలేక పోయారు. సంజీవయ్య అవినీతిపరుడని, అక్రమంగా లక్షలాది రూపాయలు కూడబెట్టారని అధిష్టానానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. సంజీవయ్య నీతి, నిజాయితీ తెలిసిన నెహ్రూ ఆ ఫిర్యాదులను కొట్టి పారేశారు. అయినా, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మొండిపట్టు పట్టారు.

నెహ్రూ ఓ నాయకుడిని ఆంధ్రాకు వెళ్లి సంజీవయ్య మీద రహస్య విచారణ చేసి నివేదిక ఇవ్వమని కోరారు. ఆయన హైదరాబాద్ వచ్చి అప్పటి కాంగ్రెస్ యువనాయకుడు చక్రపాణి గారిని కలిసి వచ్చిన పని చెప్పారు. సంజీవయ్య గారి గూర్చి బాగా తెలిసిన చక్రపాణిగారు నిర్ఘాంతపోయి ఆ నాయకుడిని చివాట్లు పెట్టారు. కానీ ప్రధాని ఆదేశం. చేసేది లేక ఢిల్లీ నాయకుడిని వెంటబెట్టుకుని కారులో సంజీవయ్య గారి గ్రామానికి వెళ్లారు. గ్రామ పొలిమేరలలో ఒక పూరి పాక ముందు కారు ఆపారు చక్రపాణి. ఆ పాక బయట ఒక వృద్ధురాలు కట్టెల పొయ్యిపై మట్టి కుండతో అన్నం వండుతున్నది. పొగగొట్టంతో మంటను ఊదుతూ చెమటలు కక్కుతున్నది. "ఏమిటి ఇక్కడ ఆపారు?" ప్రశ్నించాడు ఢిల్లీ నేత.

"సంజీవయ్య గారి ఇల్లు ఇదే. ఆ వృద్ధురాలు ఆయన అమ్మగారు. కారు దిగండి" అన్నారు చక్రపాణి. నాయకుడు నివ్వెరపోయాడు. చక్రపాణి ఆమెకు నమస్కరించి "అమ్మా...ప్రస్తుతం మంత్రి గా ఉన్న మీ అబ్బాయి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారు" అన్నారు.

ఆమె చెమటలు తుడుచుకుంటూ "అయితే మా వాడి జీతం ఏమైనా పెరుగుతుందా నాయనా! ఈ కట్టెల పొయ్యి మీద వంట చెయ్యడం కష్టంగా ఉంది. ఒక బొగ్గుల కుంపటి కొనిపెట్టమని ఎన్నాళ్ళ నుంచో అడుగుతుంటే, డబ్బులు లేవు అంటున్నాడు" అన్నది.

నాయకుడి నోట్లోంచి మాట రాలేదు. "సార్.. గ్రామం లోకి వెళ్లి విచారణ చేద్దామా?" అడిగారు చక్రపాణి. "అవసరం లేదు. కారును హైద్రాబాద్ కు పోనీయండి" అన్నాడు నాయకుడు.

ఆ తరువాత వారం రోజుల్లో సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అయ్యారు.

(05-04- 2021)

4, ఏప్రిల్ 2021, ఆదివారం

తాళము వేసితిని గొళ్ళెము మరచితిని – భండారు శ్రీనివాసరావు

 

కారణం తెలియదు కానీ,  చదువుకునే రోజుల్లో, ఉత్తరాలు రాయాలంటే కార్డు, ఇన్లాండ్ కవర్ కన్నా ఉత్తరం రాసి కవర్లో పెట్టి పోస్ట్ చేయడం నాకు ఇష్టంగా వుండేది. బహుశా రాసేవి చాలావరకు  ప్రేమలేఖలు కావడం కారణమేమో.

ఉత్తరం ముందే రాసేసుకుని, గవర్నర్ పేటలోనే వున్న బకింగ్ హాం పేట పోస్టాఫీసుకు వెళ్లి జాగ్రత్తగా పోస్టు చేసేవాడిని. ఈ క్రమంలో ఒక్కోసారి రాసిపెట్టుకున్న ఉత్తరం నా జేబులోనే వుండిపోయేది. కవర్లో పెట్టాను అనుకుని అక్కడ దొరికే జిగురుతో  కవర్ని ఘాట్టిగా అతికించి పోస్టాఫీసు ముందర వున్న, ‘తర్వాతి క్లియరెన్స్ గంటలో’ అని రాసివున్న  డబ్బాలో పడేసి వచ్చేసేవాడిని.

తర్వాత ఎప్పుడో వారం రోజులకు, నాకు కాబోయే మా ఆవిడ, మద్రాసు నుంచి  రాసిన  రిప్లయ్  కవరు వచ్చేది, ‘అదేమిటి ఉత్త కవరు పోస్టు చేశారు, ఉత్తరం లేకుండా’ అనే ట్యాగ్ లైన్ తో.

ఇప్పుడీ పాత పురాణం ఎందుకంటే ఎప్పుడూ ఓ పట్టాన చూడని మెసెంజర్ ని తెరిచి చూస్తే, చాలావరకు ‘ATTACHMENT UNAVAILABLE’ అనే మెసేజులు పుష్కలంగా దర్శనం ఇచ్చాయి. అలాంటివి ఎందుకు పంపిస్తారు అనే సందేహం తొలిచింది కానీ తెరిచి చూడని దానికోసం మధన పడడం ఎందుకు అని కూడా అనిపించింది.

బహుశా వాళ్ళు కూడా నా పోస్టల్ కవర్ ఉదంతం మాదిరిగానే ATTACHMENT పెట్టడం (తగిలించడం) మరచిపోయారేమో!

(04-04-2021)