14, మార్చి 2021, ఆదివారం

ఎందుకో గుర్తుకొస్తున్నాయి – భండారు శ్రీనివాసరావు

 

తెలుగు దేశం పార్టీ పుట్టేనాటికి నాకు ముప్పయ్ ఆరేళ్ళు. ఆ పార్టీలో నాడు కొత్తగా చేరినవాళ్ళలో చాలామంది వయసులో నాకంటే చాలా చాలా చిన్నవాళ్ళు. ఇప్పుడు ఆ పార్టీ వయస్సు నలభయ్ ఎనిమిది. వాళ్ళ వయసు డెబ్బై దాటి వుంటుంది.

ఆ పార్టీ ఆవిర్భావం నాటికి నేను రేడియో విలేకరిగా పనిచేస్తున్నాను. మొదట రామకృష్ణా సినీ స్టూడియోలో విలేకరులను పిలిచి తాను త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. పార్టీ స్వరూప స్వభావాలను గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నించినా వాటికి ఆయన నుంచి జవాబు లేదు. ఊహా జనితమైన వేటికీ సమాధానం చెప్పనని చెప్పేశారు.

అయితే చెప్పే ముహూర్తం త్వరలోనే వచ్చింది. మళ్ళీ విలేకరులకు పిలుపువచ్చింది. ఈసారి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలుసుకున్నారు. పెట్టబోయే పార్టీ పేరు “తెలుగుదేశం పార్టీ” అనగానే అందరూ విస్తుపోయారు. ఒక పార్టీకి, అందులోనా ఒక ప్రాంతీయ పార్టీకి దేశం అనే పదం జోడించడం ఏమిటని అనుకున్నారు.

ఇక అక్కడనుంచి ఆయన కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆ పార్టీ ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టిందన్నారు. ఒక తాసీలు ఆఫీసులో గుమాస్తాను బదిలీ చేయాలన్నా ఢిల్లీ అనుమతి కోసం ఎదురుచూపులు చూసే పార్టీ, తెలుగు ప్రజలకు ఏం ఒరగబెడుతుందని ప్రశ్నించారు. ఇప్పటి కాంగ్రెస్ మహాత్మా గాంధీ కాలం నాటి కాంగ్రెస్ యెంత మాత్రం కాదన్నారు. ఇంగ్లీష్ లో ఎన్ని అక్షరాలు వున్నాయో కాంగ్రెస్ అన్ని రకాలుగా చీలిపోయిందని ఎద్దేవా చేసారు.

పార్టీ ప్రచారం కూడా వినూత్న పద్దతిలో సాగింది. ముందు హెలికాప్టర్ పై రాష్ట్రాన్ని చుట్టి రావాలని అనుకున్నారు. కానీ కేంద్రంలోని ప్రభుత్వం హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ పైనే నెపం వేసారు. పర్యటనల కోసం తమ ఇంట్లో ఓ గరాజులో మూలపడివున్న, ఎప్పుడో ముచ్చట పడి కొనుక్కున్న నల్ల రంగు వ్యాన్ ని బయటకు తీసి కొత్త నగిషీలు చెక్కారు. వ్యాను పైకెక్కి ఉపన్యసించడానికి వీలుగా ఏర్పాట్లు చేసారు. ఎన్టీఆర్ భోజనం, పడక అంతా అందులోనే. ఉదయం పూట రోడ్డుపక్కనే స్నానాలు. అంతవరకూ ఇలాటి ప్రచారం ఎరుగని వారికి వింతగా అనిపించింది. ఒక్క పత్రిక తప్ప మిగిలిన తెలుగు దినపత్రికలన్నీ అప్పుడు కాస్తో కూస్తో కాంగ్రెస్ అనుకూల వార్తలు రాసేవి. రామారావు గారు సాగిస్తున్న ఈ ప్రచారాన్ని చూసి కాంగ్రెస్ నాయకులు ‘డ్రామా రావు’ అని అపహాస్యంగా మాట్లాడేవాళ్ళు. కాంగ్రెస్ నాయకుడు జీ. వెంకటస్వామి గారు ‘అది తెలుగు దేశం కాదు, కమ్మ దేశం’ అంటూ నేరుగా ఆ పార్టీకి కులాన్ని ఆపాదిస్తూ ప్రకటన చేసారు. అప్పుడు కాంగ్రెస్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని విలేకరులం కలిసి ‘ మీ మామగారి పార్టీలో చేరతారా అని అడిగితే, ‘పార్టీ ఆదేశిస్తే ఎన్టీఆర్ పైనే పోటీ చేస్తా’ అని బదులిచ్చారు. ఆ సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో, మరునాడు పత్రికల్లో ‘మామగారిపై పోటీకి రెడీ అంటున్న చంద్రబాబు’ అంటూ ప్రముఖంగా వార్తలు వచ్చాయి.

ఎన్టీఆర్ చైతన్య రధం ఒక గ్రామం చేరే లోగా మరో జీపు ముందుగానే అక్కడికి చేరుకునేది. వేములపల్లి శ్రీ కృష్ణ రాసిన ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’ అనే పాట, శంకరంబాడి సుందరాచారి రచించిన ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ అనే పాటలను మైకుల్లో వినిపించేవాళ్ళు. వస్తున్నది రామారావు వంటి సుప్రసిద్ధ నటుడు. వేస్తున్నది ఉర్రూతలూగించే ఈ పాటలు. జనాలు విరగబడేవాళ్ళు. వాళ్ళను చూడగానే ఎన్టీఆర్ ప్రసంగం మరింత వేడెక్కేది. ఇక ఈలలూ, చప్పట్లతో ఆ ప్రాంతం మారుమోగిపోయేది.

ప్రచారం ఉధృతం అవుతున్న కొద్దీ కాంగ్రెస్ నాయకులకు తత్వం బోధపడింది. అపజయం తప్పదేమో అనే సందేహం పట్టుకుంది. దీనికి తొలి సూచన నంద్యాలలో జరిగిన ఇందిరాగాంధీ ఎన్నికల ప్రచారంలో కనబడింది. ఆసభలో మాట్లాడుతూ అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధి బొజ్జా వెంకట రెడ్డి ‘ బడుగు బలహీన వర్గాలను కాపుకాసే కాంగ్రెస్ కు ఓటు వేస్తారా, సినిమా వేషాలతో జిమ్మిక్కులు చేసే తెలుగు దేశం పార్టీకి ఓటేస్తారా’ అని అడిగితే సభకు వచ్చిన వాళ్ళలో చాలామంది మా ఓటు ఎన్టీఆర్ కే అని చెప్పడంతో కాంగ్రెస్ శ్రేణులు నీరసపడిపోయాయి. తిరుపతి ఎన్నికల సభల నాటికి ధ్రువ పడింది.

ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వెలువడుతున్నాయి. షాద్ నగర్ నుంచి మొదటి ఫలితం అధికారికంగా వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ పి. శంకరరావు గెలుపొందారు. అక్కడ రాష్ట్ర చరిత్రలో మొదటి సారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. అందువల్ల మిగిలిన అన్ని చోట్లకంటే అక్కడ ఫలితం చాలా ముందుగా వెలువడింది. షాద్ నగర్ నుంచి నేను పంపిన వార్త మధ్యాన్నం, సాయంత్రం వార్తల్లోనూ, ఢిల్లీ నుంచి ప్రసారం అయ్యే ఆరుగంటల ఇంగ్లీష్ వార్తల్లోనూ ప్రముఖంగా వచ్చింది. తరువాత చాలా సేపటి వరకు ఎటువంటి సమాచారం ఎక్కడి నుంచి లేదు. టీడీపీ అభ్యర్ధులు చాలా చోట్ల ఆధిక్యతలో వున్నట్టు అనధికారికంగా తెలుస్తున్నా, అప్పటి నిబంధనలు అనుసరించి ప్రసారం చేయడం సాధ్యపడలేదు. కావాలనే రేడియోలో వార్తలు తొక్కిపడుతున్నారని ఆ పార్టీ అభిమానుల్లో సందేహాలు కలిగాయి. కొందరు రేడియో స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగారు కూడా. విషయం వివరించి చెప్పడంతో శాంతించారు.

అదే రాత్రి ఫలితాలు చాలావరకు తెలిసిపోయాయి. ప్రభుత్వం స్థాపించడానికి ఏర్పాటు చేసే మెజారిటీ టీడీపీకి అప్పటికే లభించింది. ఎన్టీఆర్ ని కలిసి ఆయన స్పందన రికార్డు చేయడానికి స్కూటరు మీద ఆబిడ్స్ నివాసానికి వెళ్లాను. వాకబు చేస్తే ఆయన అప్పటికే నిద్రకు ఉపక్రమించారని తెలిసింది.

దటీజ్ ఎన్టీఆర్.

రాష్ట్రమంతా సంబరాలు జరుగుతుంటే ఆయన మాత్రం ఆయన అలవాటు ప్రకారం వేళకు నిద్రపోయారు.

మరునాడు అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర రెడ్డి రాజీనామా చేశారు. ఆయన స్పందన విచిత్రం అనిపించింది.

కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ తుడిచిపెట్టుకునిపోదు. చూస్తుండండి, మళ్ళీ అధికారంలోకి వస్తుంది”

అప్పుడు భేషజం అనిపించిన ఆయన మాటలు ఆరేళ్ళ తరువాత నిజమయ్యాయి. 1989 లో కాంగ్రెస్ పార్టీ, టీడీపీని ఓడించి మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టింది.

(14-03-2021)

పరాజితులు నేర్వాల్సిన పాఠం – భండారు శ్రీనివాసరావు

 రాజకీయం కోసం వాదోపవాదాలు చేయండి. కానీ కొన్ని రోజులే. ఆ తర్వాత కూడా ఇదే విధమైన ఆరోపణలు చేస్తూ పొవాలనుకుంటే మాత్రం మరో పరాజయానికి సంసిద్ధం కండి.

ఎదురైన ఈ అవరోధం నిజానికి మీకు చక్కని అవకాశం.
ఒక్కసారంటే ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోండి. ఎందుకిలా జరిగింది అన్న కారణం ఎవరూ చెప్పకుండానే మీకే బోధ పడుతుంది.
ఆత్మబలం కలిగిన వాడికి ఓటమి అనేది కామా మాత్రమే. ఫుల్ స్టాప్ కాదు. అది గత అసెంబ్లీ ఎన్నికలలో నిరూపణ అయింది.
మరో ఓటమి వద్దు అనుకుంటే కాసేపు ఆగండి. చుట్టూ గమనించండి. జనం చెప్పేది వినండి. ఆ తరువాతే అడుగు ముందుకు వేయండి.
కుంటి సాకులు వినీ వినీ జనం విసుగెత్తిపోయారు.
వాటి జోలికి పోకండి. ఓటమిని హుందాగా స్వీకరించి తదుపరి యుద్ధానికి సమాయత్తం కండి.
ఇది విమర్శ కాదు, హిత వాక్యం మాత్రమే.
(14-03-2019)

మీడియాలో సిత్రాలు


జనాలకు చిత్రవిచిత్రాలు చూపే మీడియాలో కూడా ‘సిత్రాలు’ వుంటాయి.
మామూలుగా ఎన్నికల ఫలితాలు వెలువడే రోజున మీడియా సందడి సందడి చేస్తుంది. బ్యాలెట్ పెట్టెల సీళ్లు విప్పినప్పటి నుంచి, బ్యాలెట్ పత్రాలను కట్టలుగా కట్టడం మొదలైనప్పటి నుంచి టీవీ స్టూడియోల్లో చర్చలు ప్రారంభిస్తారు.

ఇప్పుడు అంటే వ్యక్తిగత కారణాల వల్ల పోవడం లేదు కానీ గతంలో నాకీ హడావిడి ఎక్కువనే చెప్పాలి. ఉదయం మొదలుపెడితే రాత్రి పొద్దు పోయేవరకు ఈ టీవీ చర్చలు రోజంతా సాగుతూనే ఉండేవి. మధ్యాన్న భోజనం సమయానికి ఇంటికి వచ్చి మళ్ళీ వెంటనే ఏదో ఒక స్టూడియోకి వెడుతూ ఉండేవాడిని, ‘ఘడియ తీరిక లేదు, గవ్వ రాబడి లేదు’ అనే సామెతను నిజం చేస్తూ.

ఇంతకీ చెప్పాలని మొదలుపెట్టిన ‘సిత్రం’ ఏమిటంటారా!

2019లో ఎన్నికల ఫలితాల రోజున ఇలాగే అనేక టీవీ ఛానళ్లకు ముందుగానే ‘ఉభయం’ ఒప్పుకున్నాను. అదో పెద్ద టైం టేబుల్ లాగా వుండేది. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు పలానా టైంలో పలానా టీవీ అని.

అలాగే ఆరోజు ఉదయం నుంచి మిట్ట మధ్యాన్నం దాకా నాలుగయిదు ఛానళ్లలో చర్చాకార్యక్రమాల్లో పాల్గొని భోజనానికి వచ్చాను. తర్వాత ఎటూ కదలకుండా ఇంట్లో సోఫాలోనే పడుకుని టీవీ చూస్తుంటే మా ఆవిడ గమనించింది.

‘రాత్రిదాకా క్షణం తీరిక లేదన్నారు. మరి ఇప్పుడేమిటి ఈ వరదరాజస్వామి అవతారం అవటా! అని ఆరాలు మొదలు పెట్టింది.
అసలు విషయం ఆమెకు ఎలా చెప్పాలో అర్ధం కాలేదు.

అప్పటిదాకా వెల్లడైన ఫలితాలు చూసిన తర్వాత చర్చలు పెట్టి ఇక లాభం లేదనుకున్నారో ఏమిటో, కొన్ని చానళ్ళ వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే ప్రోగ్రాములు కాన్సిల్ చేసుకున్నట్టు నా ఫోనుకు వర్తమానం పంపారు.

కానీ ఆవిడకి ఈ మీడియా ‘సిత్రాలు’ యేమని చెప్పను, ఎలా చెప్పను?
(14-03-2021)

మా ఆవిడ బెస్ట్ ఫ్రెండ్

మాకోసం యాభయ్ ఏళ్ళకు పైగా గాలింపు
1971. అంటే ఇంచుమించు అయిదు దశాబ్దాల కిందటి మాట.
నేనూ మా ఆవిడా పెళ్లి చేసుకున్నాము. అంటే అర్ధం అయింది కదా ప్రేమ వివాహం అని.
ఎవర్ని పెళ్లి చేసుకుందని మా ఆవిడ స్నేహితులకి తగని ఆరాటం. ‘ఎవడే అతగాడు’ అని పాటలు పాడకముందే నా పరిచయం జరిగిపోయింది. అంతే!
మళ్ళీ ఇన్నేళ్ళకి వాళ్ళల్లో ఒక స్నేహితురాలు, మా ఆవిడ మాటల్లో వెరీ క్లోజ్ ఫ్రెండ్, సీత అనే ఆవిడ వాళ్లాయన్ని వెంటబెట్టుకుని ఇవ్వాళ (14-03-2018) ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది.
‘నీ అడ్రసు (చిరునామా కాదు, ఆనుపానులు) పట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశానో తెలుసా’ అంటూ అవన్నీ చెప్పుకొచ్చింది.
నేనో జర్నలిస్టును అని మాత్రం తెలుసుట. ఎక్కడ పనిచేస్తానో తెలవదు. రేడియోలో నా పేరు విని బెజవాడ రేడియో వాళ్లకు ఫోను చేసింది. వాళ్ళు ‘ఇక్కడ కాదు హైదరాబాదు’ అన్నారు. ఆవిడ పట్టువదలకుండా హైదరాబాదు రేడియోకు చేసింది. ‘ఇక్కడా కాదు ఆయన ప్రస్తుతం మాస్కోలో వున్నాడ’న్నారు. కొన్నాళ్ళు విరామం ఇచ్చి సోషల్ మీడియాను ఆశ్రయించింది. అల్లుడి సహకారంతో నెట్లో గాలించారు. భండారు, బండారు కొంత తికమక పెట్టినా చివరకు పట్టుకున్నారు. ఫేస్ బుక్ లో నెంబరు దొరికింది. అంతే! ఫోన్ చేసి భార్యాభర్తలు నేరుగా ఇంటికి వచ్చేశారు. ఇక మా ఆవిడ సంతోషం చెప్పనక్కర లేదు.



పాత ఫోటోలు చూస్తుంటే గుర్తుకొచ్చిన మూడేళ్ల నాటి జ్ఞాపకం.

14 March 2018
Comments
Like
Comment
Share

Co

చంద్రబాబు, వై ఎస్ – రెండు జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

 చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రోజులు.

హైదరాబాదులో ఎర్రమంజిల్ కాలనీ నుంచి జూబిలీ హాల్ కు బయలుదేరాను. అసెంబ్లీ సమావేశాలకు ముందు స్పీకర్ సంప్రదాయంగా ఇచ్చే అల్పాహార విందుకు వెళ్ళాలి. రోడ్డు దాటి అవతల వైపు వెళ్ళి ఆటో పట్టుకోవాలి. ఇవతల ఎక్కుదామంటే ఒక్కడూ రాకపోగా సనత్ నగర్ అయితే తీసుకుపోతా అంటాడు. వాళ్ళతో పనికాదనుకుని సగం రోడ్డు దాటాను. ఇంతలో ముఖ్యమంత్రి వస్తున్న దాఖలాగా పోలీసుల హడావిడి కనిపించింది. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడివాళ్ళను అక్కడే నిలిపేశారు. దాంతో నేను డివైడర్ మీదనే నిలబడిపోయాను. ఈలోగా సీఎం కాన్వాయ్ రావడం పోవడం క్షణాల్లో జరిగిపోయింది. కాన్వాయ్ వెళ్లడం ఆలశ్యం, రోడ్డుమీద ఎక్కడలేని హడావిడి. అప్పటిదాకా నిలబడిపోయిన వాహనాలన్నీ ఒక్కమారుగా బయలుదేరాయి. అంతా అస్తవ్యస్తం. ఒకదానికొకటి అడ్డం. అడిగే నాధుడు లేదు. అప్పటిదాకా ట్రాఫిక్ కంట్రోల్ చేసిన పోలీసులందరూ మంత్రం వేసినట్టు మాయం అయిపోయారు. సీఎం వెళ్ళగానే తమ డ్యూటీ అయిపోయినట్టు వాళ్ల లెక్క కాబోలు. పోలీసులు మరికొద్ది నిమిషాలు వుండి వాహనాల రాకపోకలు అదుపుచేసి వుంటే ఈ పరిస్తితి వుండేది కాదు. నేను ఆటో పట్టుకుని వెళ్ళేటప్పటికే అల్పాహార విందు మొదలయింది. విందు పూర్తి కావస్తుండగా సీఎం సెక్యూరిటీ అధికారి ఇక్బాల్  (ఇప్పుడు  వైసీపీ  ఎమ్మెల్సీ) నాతో అన్నారు, ‘వస్తుంటే దారిలో డివైడర్ మీద నిలబడ్డ మిమ్మల్ని చూసాము, ఒక్కసారి సీఎం గారిని కలవండి, అని. చంద్రబాబు నన్ను చూస్తూనే ‘వచ్చారా సంతోషం, బ్రేక్ ఫాస్ట్ చేశారా, ఎవరక్కడ, వీరిని కనుక్కోండి’ అంటూ రోడ్డు మీద నన్ను గమనించిన విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించారు. “సిటీలో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది, గట్టిగా ఏదైనా చేయాలి, చూద్దాం ’ అన్నారు.

నేను మళ్ళీ ఇక్బాల్ దగ్గరికి వెళ్లి, 'మరికొద్ది నిమిషాలు పోలీసులు అక్కడ వుంటే కొంపలు మునగవు కదా' అన్నాను. ఆయన నవ్వుతూ, 'అవును మీ సలహా బాగానే వుంది, కమీషనర్ గారితో చెప్పి చూస్తాను' అన్నారు మర్యాదగా.

సలహా బాగానే వుందన్నారు అందరూ. కానీ, ఇన్నేళ్ళు గడిచినా అది పట్టించుకున్నట్టు దాఖలా నాకయితే కనిపించడం లేదు.

ట్రాఫిక్ కు సంబంధించి వై ఎస్ తో మరో జ్ఞాపకం వుంది.

హైదరాబాదు ప్రెస్ ఫొటోగ్రాఫర్ల సంఘం వాళ్ళు ఏటా ఒకసారి సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో ఫోటో ఎగ్జిబిషన్ పెడుతూ వుండడం రివాజు. అది జరిగినన్నాళ్ళు ప్రతిరోజూ ఒక అతిధిని ఆహ్వానిస్తుంటారు. అలాగే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా వున్న వైఎస్ రాజశేఖరరెడ్డిని పిలిచారు. రిసీవ్ చేసుకోవడానికి మేమంతా క్లబ్ మెయిన్ గేటు దగ్గర నిలబడి ఉన్నాము. వైఎస్ కారులో కేవీపీ కూడా వున్నారు. రోడ్డుకు అటువైపు వున్న ఈనాడు మీదుగా వెళ్లి యూ టర్న్ తీసుకుని రావాలి. టర్న్ తీసుకునేలోగానే, సీఎం వస్తున్నారని పోలీసులు ట్రాఫిక్ నిలిపి వేసారు. ఎదురుగా వున్న రోడ్డులో వాహనాల నడుమ నిలిచివున్న వైఎస్ కారుని ఇటువైపునుంచి మేము చూస్తూనే ఉన్నాము. (అప్పుడు మెట్రో లేదు, డివైడర్ మాత్రమే వుంది)

కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ రావడం, సచివాలయం వైపు దూసుకు పోవడం జరిగింది. ట్రాఫిక్ కదిలింది. మలుపు తీసుకు వచ్చిన వైఎస్ కారు క్లబ్ దగ్గర ఆగకుండా గేటు దగ్గర నిలబడి వున్న మా కళ్ళ ముందే, ముందుకు వెళ్ళిపోయింది. వెంటనే నేను కేవీపీ మొబైల్ కి ఫోను చేశాను. ఆయన ‘అరెరే! బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ అనుకున్నాము’ అని నొచ్చుకుంటూ చెప్పారు. ఆ వెంటనే విశ్వేశ్వరయ్య చౌరాస్తాలో మళ్ళీ వెనక్కి తిరిగి క్లబ్ కి చేరుకున్నారు.

 

13, మార్చి 2021, శనివారం

ఆడవాళ్ళతో జాగ్రత్త - భండారు శ్రీనివాసరావు

 ‘ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ‘ అన్నాడు ఏకాంబరం

‘ఎందుకలా అనిపించింది? ఏమైనా స్వానుభవమా’ అడిగాడు చిదంబరం.
‘అవును. రాత్రి నేనూ మా ఆవిడా తీరికూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. మధ్యలో రోగాలు, రెస్టుల ప్రస్తావన వచ్చింది. మొన్నీమధ్య ఆసుపత్రిలో వున్న మా బంధువుని చూసొచ్చాను. ఏమిటో, తలకు, నోటికి, ముక్కుతో సహా వళ్ళంతా వైర్లు. ఆ కనెక్షన్ తీసేస్తే ప్రాణం పోయినట్టే అన్నారు డాక్టర్లు. అది చూసిన తర్వాత ఓ రకం వైరాగ్యం కలిగింది. అదే మా ఆవిడతో చెప్పాను. ముందు ముందు నాకేదైనా రోగం వస్తే ఆ లైఫ్ సపోర్టింగ్ మెషిన్లు, కనెక్షన్లతో నన్ను ఇబ్బంది పెట్టవద్దు. అంతకంటే ప్రశాంతంగా చావడాన్నే నేను కోరుకుంటాను అని చెప్పాను’
‘ఆవిడ ఏమంది?’
‘ఏమీ అనలేదు. వెంటనే లేచి వెళ్లి ఇంటర్నెట్ కనెక్షన్ పీకేసింది’
నీతి: ఆడవారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త! వాళ్ళ మెదడు పాదరసంలా పనిచేస్తుంది.
(చాలాకాలం క్రితం Reader's Digest లో ప్రచురించిన ఓ జోక్ ఆధారంగా)
Mamillapalli Manikyamba