26, జులై 2020, ఆదివారం

వీరీ వీరీ గుమ్మడిపండు వీరీ పేరేమీ



ఫేస్ బుక్ మిత్రులు కప్పగంతు శివరామ ప్రసాద్ గారు వస్తుతః రేడియో అభిమాని. రేడియో అంటే ఆకాశవాణి. దానికి సంబంధించిన చాలా సమాచారం సేకరించి పెట్టుకున్నారు. ఈ మధ్య నాకు వాట్సప్ లో ఓ పాత గ్రూపు ఫోటో పంపారు. అది 1969 నాటి ఫోటో. అలనాటి రేడియో ధిగ్గజాలు అనేకమంది అందులో వున్నారు. శివరామ ప్రసాద్ గారికి తెలిసిన  పుణ్యాత్ములు, ఫిరంగిపురానికి చెందిన టి. శ్యాం నారాయణ గారు ఈ తెలుపు నలుపు ఫొటోకు రంగులు అద్దారు. దాన్ని నేను ‘ఒకనాటి స్వరచరులు’ అనే రేడియో గ్రూపులో షేర్ చేసాను. విజయవాడ రేడియో స్టేషన్ డైరెక్టర్ గా పనిచేసిన ప్రయాగ వేదవతి గారు  తమ సహజ ధోరణిలో వేగంగా స్పందించారు. ఆ ఫొటోకు సంబంధించిన వివరాలు తెలియచేశారు.

అరవై ఒక్క ఏళ్ళ క్రితం బెజవాడ రేడియో స్టేషన్ లో పనిచేసిన  కందుకూరి రామభద్రరావు గారు, ప్రయాగ నరసింహ శాస్త్రి గారు (వేదవతి గారి తండ్రి) పదవీ విరమణ సందర్భంగా తీసిన ఫోటో అది. వేదవతి గారి సమాచారం ప్రకారం ఈ కింది ఫోటోలో :

ముందు వరసలో కింద కూర్చున్న వారు (ఎడమ నుంచి): ఏ. కమల కుమారి, వి.బి. కనకదుర్గ, శ్రీరంగం గోపాల రత్నం, వి. నాగరత్నం, వింజమూరి లక్ష్మి, బీ.టీ. పద్మిని, పద్మినీ చిత్తరంజన్  గార్లు.

కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు (ఎడమ నుంచి) : అన్నవరపు రామస్వామి, ఎల్లా సోమన్న, ఓలేటి వెంకటేశ్వర్లు, కందుకూరి రామభద్రరావు, ప్రయాగ నరసింహ శాస్త్రి, జి.వి. కృష్ణారావు, రాచకొండ నరసింహమూర్తి, ఎన్.సి.హెచ్. కృష్ణమాచార్యులు గార్లు.

వారి వెనుక నిలబడిన వారు (ఎడమనుంచి): రామవరపు సుబ్బారావు, కనకారావు (అని గుర్తు), ఏ.ఎస్.వి. కుటుంబయ్య, దండమూడి రామ్మోహన రావు, బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి, ఉషశ్రీ, ఎం.వి. వాసుదేవమూర్తి, సి. రామ్మోహనరావు, జి.ఎం. రాధాకృష్ణ, కనకారావు, చల్లపల్లి కృష్ణమూర్తి, వి. చార్లెస్, క్రొవ్విడి సీతారాం గార్లు.

వారి వెనుక చివరివరసలో నిలబడిన వారు: (ఎడమనుంచి): మొదటి వ్యక్తి తెలియదు. నండూరి సుబ్బారావు, పాండురంగరాజు, సుందరపల్లి సూర్యనారాయణ, ఎన్.సీ.వీ. జగన్నాధాచార్యులు, ఏ. లింగరాజు శర్మ, ఏ.బీ. ఆనంద్, వై. సుబ్రహ్మణ్యం (ఫ్లూట్), వై. సత్యనారాయణ రావు (వీరు కొద్ది రోజులు అనౌన్సర్ గా పనిచేసారు) ఈ వరసలో కూడా చివరి వ్యక్తి తెలియదు.

చాలా కాలం అయినందువల్ల కొందరి పేర్లు పొరబాటు పడితే మన్నించమని కూడా వేదవతి గారు కోరారు.

గమనిక : నేను విజయవాడ రేడియోలో ఎప్పుడూ పనిచేయలేదు. అప్పుడప్పుడూ వార్తావిభాగానికి వచ్చి పనిచేసినా ఉదయం వార్తల వరకే. కాబట్టి నా టైపింగులో ఏమైనా పొరబాటు దొర్లితే క్షంతవ్యుణ్ణి (తప్పులు ఎత్తి చూపితే దిద్దుబాటుకు అవకాశం వుంటుంది. 

25, జులై 2020, శనివారం

మనిషే ప్రమాదకరం – భండారు శ్రీనివాసరావు

ఈగలు, దోమలు ఇతర క్రిమి కీటకాదుల కారణంగా సంక్రమించే అంటు వ్యాధుల కంటే మనిషి నుంచి మనిషికి సోకే కరోనా అంటేనే ఎక్కువ భయపడాల్సిన పరిస్తితి ఏర్పడింది.

ఈ నేపధ్యంలో చాలా ఏళ్ళ క్రితం హైదరాబాదులో జరిగిన మీడియా అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసిద్ధ సినీ రచయిత శ్రీ పరుచూరి గోపాల కృష్ణ చెప్పిన ఆయన సొంత అనుభవం గుర్తుకు వస్తోంది.

 ఒక దేశానికి వెళ్ళినప్పుడు ప్రపంచంలోని సమస్త జంతుజాలాన్ని చూపే ఒక ప్రదర్శనకు వెళ్లాను. వరసగా చూస్తూ పోతున్నాను. కోతులు, కుందేళ్ళు, పులులు, సింహాలు. అన్నీ బొమ్మలే అనుకోండి. చివర ఒక బోర్డు కనిపించింది. ‘యావత్ సృష్టిలో భయంకరమైన జంతువును మీరిప్పుడు చూడబోతున్నారు’ అని దానిపై రాసివుంది. ఉత్సుకతతో చూడడానికి వెళ్లాను.
“అక్కడ ఒక నిలువుటద్దం పెట్టి వుంది. దానికి ఎదురుగా నిలబడ్డ నాకు, నా ప్రతి బింబమే అందులో కనిపించింది”

ఆయన చెప్పిన మాటల్లో నిజం ఏమిటన్నది ఇప్పుడు కరోనా కాలంలో తెలిసివస్తోంది.


కరోనా మరణాలు , ఒక సూచన – భండారు శ్రీనివాసరావు

కరోనా కారణంగా చనిపోయిన వారి భౌతిక శరీరాలను ముట్టుకోవడానికి కూడా జనం భయపడుతున్నారనే అర్ధరహిత వదంతులను నమ్మి కొందరు వాటికి అంతిమ సంస్కారాలు జరపడానికి సంకోచిస్తున్నారనే బాధాకరమైన వార్తలు వినవస్తున్నాయి. అనాధ ప్రేత సంస్కారానికి మించిన పుణ్య కార్యం మరోటి ఉండదంటారు. కానీ కరోనా భయానికి సొంత మనుషులు కూడా వెనుకాడుతుండడం విచారకరం. ఈ నేపధ్యంలో ఒక సూచన,

ఈరోజు పత్రికల్లో ఒక వార్త  చదివాను. కరోనా పేషెంట్లను తరలించడానికి ఆరు అంబులెన్సులు విరాళంగా ఇస్తామని తెలంగాణా మంత్రి శ్రీ కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించారు.  దాన్ని స్పూర్తిగా తీసుకుని మరికొందరు కూడా అంబులెన్సులు సమకూరుస్తామని వాగ్దానం చేసినట్టు ఆ వార్తలు తెలుపుతున్నాయి. చాలా హర్షదాయకం.

గతంలో కేటీఆర్  మొక్కల నాటే కార్యక్రమాన్ని  ప్రోత్సహించడానికి ‘నేను ఒక మొక్కను నాటాను, మీరూ నాటండి’ అనే ఛాలెంజ్ విసిరిన తరహాలోనే, వేరే ఎవరైనా సెలెబ్రిటీ (ఎందుకంటే ఇటువంటివి త్వరగా జనంలోకి వెళ్ళాలి అంటే వారివల్లే సాధ్యం) ముందుకువచ్చి, ‘ఒక కరోనా మృతుడి కుటుంబానికి ఇరవై పీ.పీ.ఈ. కిట్లు ( Personal Protection Equipment Kits) ఇస్తాను, మీరూ ఇవ్వండి’ అనే పోటీ మొదలుపెడితే బాగుంటుంది. (ఇరవై మంది సమీప బంధువులు మాత్రమే అంత్యక్రియలకి హాజరు కావడానికి వీలుంది) ఈ కిట్లు ప్రస్తుతం ఒక్కొక్కటి అయిదు వందలకంటే తక్కువకే మార్కెట్లో లభిస్తున్నాయని నాకు తెలిసిన సమాచారం.

Image may contain: one or more people

    


21, జులై 2020, మంగళవారం

ఓ సలహా! ఓ సూచన! (సరదాగా)

శరత్ చంద్ర మంచి రచయిత. రచయిత పెట్టుకున్న కలం పేరు ఇది. అసలు పేరు ఆర్.డి. విల్సన్. శరత్ చంద్ర పేరుతొ సాహితీ వ్యవసాయం, విల్సన్ పేరుతొ రాజకీయ సేద్యం చేస్తుంటారు. అయితే ఈ రెండు విభిన్న పాత్రల స్వభావాల నడుమ ఆయనే ఒక స్పష్టమైన విభజన రేఖ గీసుకున్నారు.
కోరానా దుష్పరిణామాల నేపధ్యంలో సమాజం పట్ల బాధ్యత కలిగిన ఒక రచయితగా స్పందిస్తూ ఇలా ఒక పోస్టు పెట్టారు.

"కరోనా రోగి భారం ప్రభుత్వాలే భరించాలి.ఆ భరోసా ఇవ్వకపోతే రోగం వచ్చిన వాళ్ళు కుమిలిపోతారు.
"ఒక ఏడాది పాటు అందరూ రాజకీయాలు చేయడం మానేయాలి"

ఈ సలహాకు నేనిచ్చిన సూచన ఇది.

"రెండో సలహా భేషుగ్గా వుంది. అయితే, రాజకీయులు తమకు అలవాటయిన రాజకీయాలు మానడం అంత తేలిక కాదు. కాబట్టి వాళ్ళు ఈ మాట నిలబెట్టుకోవాలంటే ఒకటే మార్గం. దాన్ని మూడో సలహా కింద మీరే ఇవ్వండి. ఎందుకంటే మీ కత్తికి రెండు వైపులా పదును. రాజకీయ పార్టీ ప్రతినిధి గానే కాకుండా ప్రసిద్ధ రచయితగా మీ మాటకు విలువ వుంటుంది.

ఇంతకీ ఆ మూడో సలహా ఏమిటంటే... ఏమిటంటే.. చెప్పేస్తున్నాను.

"కనీసం ఓ ఆరు మాసాలపాటు టీవీల్లో రాజకీయ చర్చాకార్యక్రమాలు ప్రసారం చేయకుండా ఆంక్షలు విధించాలి"😊

నేను చదివిన పుస్తకం ‘నాలో...నాతో... YSR’ – భండారు శ్రీనివాసరావు

ఇది పుస్తక సమీక్ష కాదు. నేను చదివిన పుస్తకంలోని కొన్ని ముచ్చట్లు. అంతే!

ఆవల తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ప్రతిదీ రాజకీయమయమే. ప్రతి చిన్న విషయాన్ని కొందరు ఆ కోణం నుంచే చూడడం అలవాటు చేసుకున్నారు. గతంలో చంద్రబాబునాయుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఒక మహిళా జర్నలిస్టు ఎక్కడో ఉత్తర హిందూస్థానం నుంచి వచ్చి, హైదరాబాదులో మకాము పెట్టి ఆయనతో పలుమార్లు భేటీలు జరిపి  ఆయన మీద ఇంగ్లీష్ లో ఒక పుస్తకం ( Plain Speaking అనే పేరుతొ కాబోలు) రాశారు. అలాగే, ప్రముఖ సంపాదకులు శ్రీ ఐ. వెంకట్రావు ‘ఒక్కడు’ అనే పేరుతో చంద్రబాబు గురించి ఓ గ్రంధం రచించారు. ఆ రోజుల్లో వాటి గురించి పత్రికల్లో సమీక్షలు వచ్చాయి. చంద్రబాబు అభిమానులు, బాబు వ్యతిరేకులు వాటిని తమ దృష్టితోనే స్వీకరించారు కానీ స్వేచ్చగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఈ సోషల్ ప్లాటుఫారాలు, ఈ సాంఘిక మాధ్యమాలు అప్పట్లో ఉండేవి కావు. ఇప్పుడు  సమీక్షలు సరే, పుస్తకం విడుదల కాగానే అభిప్రాయాలు ఇబ్బడిముబ్బడిగా సాంఘిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. తన కొడుకు గురించీ, మొగుడు గురించీ ఒకావిడ రాసిన పుస్తకంలో ఏముంటాయి వాళ్ళని గురించిన పొగడ్తలు తప్ప అనే కామెంట్లు వినపడ్డాయి. అలాగే వారి ప్రత్యర్ధి పక్షం వాళ్ళు పుస్తకం చదవాలనే ఆకాంక్షతో పోస్టులు పెట్టారు.     

సమాజంలో ఏ వ్యక్తి గురించి అయినా ఆయన భార్యకు తెలిసినంతగా వేరెవ్వరికీ తెలియదు. అంచేత భార్యలు తమ భర్తల గురించి రాసే రచనల్లో అసమగ్రతకు అవకాశం తక్కువ. సాధికారతకు అవకాశం ఎక్కువ. ఆ రీత్యా చూస్తే శ్రీమతి వై.ఎస్. విజయమ్మ(వాస్తవానికి పుస్తకం ముఖచిత్రం మీద రచయిత్రి పేరు వైయస్ విజయ రాజశేఖరరెడ్డి అని ముద్రించారు. వారి వివాహ శుభలేఖలో విజయమ్మ పేరు రాజేశ్వరి అని వేశారు. జాతకాల్లో గణాలేవో సరిపోలేదని తమ పేరును రాజేశ్వరిగా మార్చారని, అందుకే వెడ్డింగ్ కార్డులో విజయలక్ష్మి అని ఉండదని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. కానీ ఆ పేరుతొ నన్నెవ్వరూ, ఎప్పుడూ పిలవలేదని కూడా వెల్లడించారు) భర్త  వై.ఎస్. రాజశేఖరరెడ్డి గురించి రాసిన ‘నాలో...నాతో... YSR’ అనే గ్రంధం అత్యంత సమగ్రంగా, వాస్తవాలకు అతి దగ్గరగా  వుంది.  రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వాన్ని అతి దగ్గరగా గమనించగలిగిన జీవన సహచరిగా శ్రీమతి విజయమ్మ ఆయన గురించి తన మనసులోని భావాలకు అందంగా, హృద్యంగా, ఒక్కోచోట హృదయం ద్రవించే విధంగా అక్షరరూపం ఇవ్వడంలో సఫలీకృతం అయ్యారు. దీనికి తగ్గట్టు ప్రచురించింది ఎమెస్కో కావడం మూలాన పుస్తక స్వరూపం కూడా వైభవంగా రూపుదిద్దుకుంది. (ఒక మాట చెప్పాలి. ఖరీదైన (నాలుగు వందల రూపాయలు) చాలా అందంగా ఆర్టు పేపరు మీద రంగురంగుల ఫొటోలతో బాగా ముద్రించారు. కాఫీ టేబుల్ బుక్  కావడం వల్ల డ్రాయింగు రూములో అందంగా అమర్చుకోవడానికి వీలుగా వుంది కానీ ఆసాంతం ఒక్కసారి చదవాలని అనిపించినా అది సాధ్యం కాని పని. ఈ పుస్తకంపట్ల రగిలిన ఆసక్తి గమనిస్తే ఎమెస్కో వారికి ఓ సూచన చేయాలనీ అనిపిస్తోంది. మామూలు సైజులో దీన్ని ఒక పుస్తకంగా తీసుకువస్తే చాలామంది కొనుక్కుని చదవడానికి (పేజీలు  తిరగేస్తూ చూడడానికి కాదు) వీలుంటుంది. ఎమెస్కో విజయ కుమార్ గారు తలచుకుంటే వాళ్ళకు ఇదో లెక్క కాదు.

పుస్తకం గురించి మరో పోస్టులో.  .

'నాలో.. నాతో.. వై.ఎస్.ఆర్.' పుస్తకం గురించి నా అభిప్రాయం సాక్షి టీవీలో నిన్నా, ఈరోజు ప్రసారం అయింది. కింది లింక్ ఈ ఉదయం ప్రసారం చేసింది. కొద్ది  సెకన్ల తర్వాత నా బైట్ మొదలవుతుంది

https://youtu.be/jSx1zUgVKpU
No photo description available.



20, జులై 2020, సోమవారం

పెద్దగీత ముందు చిన్న గీత

సాధారణంగా భయపెట్టే, నైరాశ్యానికి గురిచేసే పోస్టులు పెట్టడం ఇష్టం వుండదు. అయితే అవగాహన కలిగిస్తుందేమో అనే ఆలోచనతో పెడుతున్నాను.

నాలుగయిదు మాసాల క్రితం వరకు కేన్సర్ పేరు చెబితే జనం హడిలిపోయేవారు. కేన్సర్ నిర్ధారణకు చేసే పరీక్ష పేరు చెబితేనే కేన్సర్ వచ్చినట్టుగా భావించి ఇంటిల్లిపాదీ భయపడిపోయేవారు. ఎందుకంటే వర్తమాన ప్రపంచంలో సామాన్యులు, అసామాన్యులు కూడా కేన్సర్ అంటే ఇక కేన్సిల్ అని ఆశలు వదులుకునే పరిస్తితుల్లో  జీవిస్తున్నాం. రోగి బతకడు అని తెలిసి కూడా చికిత్స చేయించక తప్పని పరిస్తితి. అదీ లక్షల్లో ఖరీదు చేసే వైద్యం.  

ఈ మధ్య మాకు తెలిసిన వాళ్ళలో ఒకరికి అత్యంత భయంకరమైన ఈ  కేన్సర్  వ్యాధి సోకినట్టు పరీక్షల్లో నిర్ధారణ అయింది. భయపడిపోయి  పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. పదహారు లక్షల ప్యాకేజీతో పలానా రోజున ఆపరేషన్ చేస్తామని చెప్పి అందుకు అవసరమైన కొన్ని పరీక్షలు చేశారు. ఆ రోగికి కరోనా పాజిటివ్ అనే సంగతి ఆ పరీక్షల్లో బయటపడింది. అంతే! డాక్టర్లు కేన్సర్ ఆపరేషన్ పక్కన పెట్టి ఆ రోగిని ఐసొలేషన్ లో పెట్టారు. పొద్దున్నే ఒక నర్సు వచ్చి బెల్లు కొట్టి తలుపు దగ్గర రెండిడ్లీలు ఉన్న ప్లేటు పెట్టి  వెళ్లిపోతుందట. వేళకు కొన్ని మందులు, భోజనం అలాగే. ఎవరూ కనబడరు. ఇంటి మనుషుల్ని రానివ్వరు. అసలే కేన్సర్ భయంతో బిక్కచచ్చి ఉన్న రోగికి ఈ పరిస్తితి మరింత భయానకంగా మారింది. బిల్లు చూస్తె  రోజుకు లక్ష.  కట్టగలిగిన స్థోమత వున్నవాళ్ళు కూడా వైద్యం ఎలా జరుగుతోందని ఆలోచిస్తారు. కానీ అక్కడ రోగికి జరుగుతున్న చికిత్స అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. కరోనా నెగెటివ్ వచ్చిన దాకా కేన్సర్ గురించి ఆలోచించరు. పెద్ద గీత ముందు చిన్న గీత మాదిరిగా అంత పెద్ద కేన్సర్ కూడా ఇంత చిన్న కరోనాముందు  చిన్నదయిపోయింది.

ఇప్పుడు కుటుంబ సభ్యుల  ఆందోళన అంతా కరోనా గురించి. కేన్సర్ విషయం మరిచిపోయారు.

(20-07-2020)

మనిషి తవ్వుకున్న గొయ్యి కరోనా! – భండారు శ్రీనివాసరావు

సృష్టిలోని ఓ వైచిత్రిని కరోనా ఎత్తి చూపుతోంది.
ఈ చరాచర ప్రపంచంలో మానవులతో పాటు కోటానుకోట్ల ఇతర జీవరాశులు కూడా మనుగడ సాగిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే, కరోనాకు కారణమైన ఒక అల్పక్రిమి ఈ సమస్త భూమండలంలో ఒక్క మనిషి జోలికి తప్ప ఏ జీవిని తాకడం లేదు. చెట్లూ చేమా, కుక్కలు, పిల్లులూ, పాములూ తేళ్ళూ, బల్లులూ, బొద్దింకలు ఈ సృష్టిలోని ఏ ఇతర జీవీ కూడా కరోనా వైరస్ కు గురైన దాఖలా లేదు. ఆ జీవులన్నీ తమతమ జీవన విధానాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నాయి. ఈ విషయాన్ని మనుషులు గమనంలోకి తీసుకోవాలి. దీనికి కారణం ఏమిటంటే, ఇతర జీవరాశులు ఏవీ కూడా ప్రకృతి సమతుల్యానికి హాని చేసే పనికి పూనుకోలేదు. ఒక్క మనిషి మాత్రమే ఈ విషయంలో నాగరీకం, ఆధునికత పేరుతొ సొంత గొయ్యి తవ్వుకుంటూ వస్తున్నాడు.
ఆ గొయ్యే ఈ కరోనా!