6, మార్చి 2020, శుక్రవారం

పొత్తూరి ఇక లేరు

తెలుగు పాత్రికేయ దిగ్గజం పొత్తూరి

(Published in Andhra Prabha  daily on 06-03-2020) 

‘ఒక పత్రిక ఎడిటర్ అనేవాడు ఎలావుంటాడు? ఎలా వుండాలి?’ అని కళ్ళుమూసుకుని ప్రశాంతంగా ఆలోచిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరిచినప్పుడు కనబడే రూపమే శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు. 
ముఖ్యమంత్రి కేసీఆర్ సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు నేనూ  కలిసి ఒకసారి  పొత్తూరి వారి ఇంటికి వెళ్లాం. వారు రాసిన ‘బులేనా’ పుస్తకం సంతకం చేసి ఇచ్చారు. ‘ఎలా వున్నారు, ఆరోగ్యం ఇప్పుడు కులాసా కదా’ అని మేము అడగడం తప్పిస్తే ఆయన అంతట ఆయన తన అనారోగ్యం గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. ఎంతో ఖరీదయిన వైద్యం. మామూలు మందులు కాక అదనంగా మూడు వారాలపాటు రోజుకొక కాప్స్యూల్ వేసుకోవాలి. ఒక్కొక్కటి అక్షరాలా వెయ్యి రూపాయలు. సాదా సీదా అట్టపెట్టెలోవున్న ఆ మాత్రల బాటిల్ ఇరవై వేల రూపాయలు అంటే నమ్మ బుద్దికాలేదు, కానీ కళ్ళెదుట కనబడుతున్న వాస్తవం అది.
వున్న ఆ కొద్ది సమయంలోనే  ఆయన ఎన్నో కబుర్లు చెప్పారు. ప్రత్యేకతెలంగాణా ఉద్యమం కొన్ని దశాబ్దాల క్రితం సికిందరాబాదులోని ఒక హోటల్లో  ఎలా ఊపిరి పోసుకున్నదో చెబుతూ ఆనాటి విశేషాలు వివరించారు.
ఇంట్లో పెంచుకుంటున్న ఈశ్వర నామం కలిగిన ఒక మొక్కను చూపించారు. పచ్చటి వర్ణం కలిగిన ఆకులు. వాటి మీద కపిల వర్ణంలో ‘నాగుపాము పడగ’ మీద వుండే కృష్ణ పాద ముద్రలు. ఆ మొక్క చాలా అరుదుగా దొరుకుతుందట. ఆ మొక్క వుంటే పాములు ఆ దరికి కూడా రావట. ఆయుర్వేద వైద్యులు మాత్రమే ఈ మొక్కను గుర్తించగలరట. ప్రాచీన ఔషధీ శాస్త్రంలో ఇటువంటివి ఎన్నో వున్నాయని చెప్పారు.
నిజం కావచ్చు. నిజం కాదని నమ్మే వాళ్ళూ వుంటారు.
నమ్మేవారు మొక్కితే  రాయే సాయి, నమ్మనివారు  తొక్కితే అదే రాయి.
అదలా ఉంచి వెంకటేశ్వరరావు గారు స్వయంగా చెప్పిన కొన్ని విశేషాలు నెమరు వేసుకుందాం.
ఈనాటి పత్రికారంగం వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలు వాటిల్లో వున్నాయి.
పత్రిక యజమానికి తన పత్రిక గురించి ఆరా తీసే అధికారం ఉంటుందా?
ఇప్పటి రోజుల్లో అయితే ఇదొక ప్రశ్నే కాదు. ఆరా తీయడమేమిటి, వార్తలను  అదుపు చేసే అధికారం కూడా వుంటుంది.
అయితే దాన్ని గురించి ఒక పాత విషయం చెప్పారు. కొంచెం అటూ ఇటూగా  మూడు దశాబ్దాల నాటి సంగతి.
అప్పటి ఆంద్రప్రభ దినపత్రికకు పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఎడిటర్.
విజయవాడలో రంగా హత్య దరిమిలా జరిగిన విధ్వంస కాండపై,  రామోజీరావు గారు చైర్మన్ గా ఉన్న ఎడిటర్స్ గిల్డ్  ఒక నిజనిర్ధారణ కమిటీ వేసింది. కుల్ దీప్ నాయర్,  చెన్నై ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ జగన్నాధన్ తో  పాటు  ఆంధ్రప్రభ ఎడిటర్ హోదాలో పొత్తూరి వెంకటేశ్వర రావు గారు కూడా అందులో ఒక సభ్యులు.  పొత్తూరివారు విడిగా బెజవాడ వెళ్లి పరిస్తితులను పరిశీలించి   ఒక నివేదిక  పంపారు. అది ఎలా చేరిందో ఇండియన్ ఎక్స్ ప్రెస్   అధినేత రామనాద్ గోయంకాకు చేరింది. అది ఆయనకు రుచించినట్టు లేదు. వెంటనే వెంకటేశ్వర రావు గారికి ఒక లేఖ పంపారు. ‘మీ  నివేదిక నాకు దిగ్భ్రాంతితో కూడిన నిరుత్సాహాన్ని కలిగించింది’ అన్నది దాని సారాంశం. గోయంకా యజమాని. పొత్తూరి వారు ఆయన దగ్గర ఒక ఉద్యోగి. అయినా అలా ఉత్తరం రాయడం ఆయనకు నచ్చలేదు. వెంటనే నిరసనగా రాజీనామా లేఖ గోయంకాకు పంపించారు.
గోయంకా నుంచి పిలుపు వచ్చింది, మద్రాసు వస్తున్నాను అక్కడికి రమ్మని. పొత్తూరిగారు వెళ్ళారు.
 “నా ఎడిటర్ అభిప్రాయంతో విబేధించే స్వేచ్చ నాకు లేదా?” అని సూటిగా అడిగారు, రాజీనామా విషయం ప్రస్తావించకుండా గోయంకా.
ఇంకా ఇలా అన్నారు.
“మన పత్రికలో పాఠకుల ఉత్తరాలు ప్రచురిస్తాము కదా. పత్రిక విధానాలతో విబేధించే ఉత్తరాలు కూడా వేస్తుంటాం. యజమానిగా ఒక విషయం మీ దృష్టికి తెచ్చాను. అది మీకు నచ్చలేదు. సరే! ఒక సాధారణ పాఠకుడికి వుండే ఈ వెసులుబాటు కూడా ఒక యజమానిగా నాకు లేదా చెప్పండి”
ఇలాంటి యజమానికి ఏ సంపాదకుడు అయినా ఏం జవాబు చెబుతారు.
అందుకే గుంభనగా వుండిపోయారు. రాజీనామా విషయం పట్టుబట్టలేదు.
గోయంకానే స్వయంగా రాజీనామా లేఖ పొత్తూరి వారి చేతిలో పెట్టి సాదరంగా సాగనంపుతూ అన్నారు.
“మీరు ఎడిటర్ గా ఉన్నంత కాలం మీరు మీ అభిప్రాయాలనే రాస్తూ వుండండి”
పొత్తూరివారి ఆరోగ్యం బాగాలేదని జ్వాలా ద్వారా తెలుసుకున్న తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖరరావు స్వయంగా పొత్తూరి వారిని చూడడానికి విజయనగర్ కాలనీలోని వారి ఇంటికి వెళ్ళారు. అక్కడి పరిస్తితిని ఓ కంట గమనించిన కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. వారికి పూర్తి స్వస్థత చేకూరేవరకు ఆ బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు అయినప్పటికీ, సుదీర్ఘ కాలం  ప్రాంతీయ ఉద్యమాన్ని నడిపిన నేత అయినప్పటికీ ప్రాంతీయతత్వం ఏ కోశానా లేని కేసీఆర్, పొత్తూరి వారిని  ఒక పాత్రికేయుడుగా గుర్తించారు కాని, అయన ఏప్రాంతం వారనే వివక్ష చూపలేదు. ఆయనలోని ఈ విలక్షణత్వం పొత్తూరివారికి కూడా తెలుసు. కానీ మొదటే చెప్పినట్టు విలువలకు కట్టుబడి జీవిస్తూ వచ్చిన పాత్రికేయుడాయన. అంచేత కేసీఆర్ సాదరంగా ఇవ్వచూపిన సాయాన్ని వారు సున్నితంగా తిరస్కరించారు. అయితే వారిరువురి నడుమ సాగిన సంభాషణలో పొత్తూరి వారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.
“రెండో ప్రపంచయుద్ధంలో నాయకత్వం వహించిన నాటి బ్రిటన్ ప్రధానమంత్రి విన్ స్టన్ చర్చిల్ ఆ తరువాత జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో ఆట్లీ చేతిలో ఓడిపోయారు. కానీ సుదీర్ఘకాలం ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి సారధ్యం వహించిన కేసీఆర్, తెలంగాణా రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలలోనే విజయబావుటా ఎగురవేసి తన నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు”   
తెలుగు పత్రికా రంగంలో తరాల నడుమ నడుమ వారధిలా ఉంటూ వచ్చిన పొత్తూరివారి మరణం పాత్రికేయ లోకానికి ఎన్నటికీ తీరని లోటే.


4, మార్చి 2020, బుధవారం

మాడపాటి సత్యవతి గారు ఇక లేరు

(Published in Andhra Jyothy Daily on 07-03-2020, Saturday)
నాలుగు మాసాల క్రితం...
ఫోన్ మోగింది...
AIR Madapati Satyavati
ఫోన్ చేసినవారి పేరు డిస్ ప్లే అయింది. ఏం చెయ్యాలి. మాట్లాడాలా! వదిలేయాలా!
మూడు నెలల నుంచీ ఆవిడ అడపాదడపా ఫోన్ చేస్తూనే వున్నారు.
“శ్రీనివాసరావు గారూ. మీకు పెద్ద కష్టం వచ్చిపడింది. మీకు కుడి భుజం పడిపోయింది. నిర్మల పోయినప్పుడు రాలేకపోయాను. మిమ్మల్ని వెంటనే చూడాలి. ఇంట్లో ఉంటారా?”
ఆవిడ వుండేది గాంధీ హాస్పిటల్ వెనుక. నేనుండేది ఎల్లారెడ్డి గూడా. పైగా మాడపాటి సత్యవతి గారి వయసు ఎనభై ఎనిమిదేళ్ళు.
అంత దూరం నుంచి ఆవిడను రమ్మని అంటే నేను తప్పు చేస్తున్నట్టే లెక్క. ఎలా! నేను పోలేను. రమ్మని చెప్పలేను. అందుకే ఫోన్ ఎత్తకపోవడం. అంతేకాని ఆవిడను అవమానించడం కాదు.
నేనే ఫోన్ చేశాను. ‘సత్యవతి గారూ. ఈ సాయంత్రం వెంకట్రామయ్య గారిని తీసుకునే నేనే మీ ఇంటికి వస్తాను”.
‘అంతకంటేనా! తప్పకుండా రండి” అన్నారావిడ ఎంతో సంబరంగా. మొహం కనిపించకపోయినా ఆ స్వరంలోనే తెలుస్తోంది ఆ ఆనందం.
అనుకున్న సమయానికి కారులో వివేకానంద నగర్, ఈనాడు కాలనీకి వెళ్లాను. అక్కడ ఉంటున్న డి.వెంకట్రామయ్య గారిని ఎక్కించుకుని సికింద్రాబాదు బయలుదేరాము.
సత్యవతి గారింటికి వెళ్ళాము.
మా ఇద్దర్నీ చూడగానే ఆవిడ మొహం వెలిగి పోయింది. మళ్ళీ ఏమి గుర్తుకువచ్చిందో ఏమిటో వదనంలో విచారం తొంగి చూసింది.
‘మనం లోగడ వెంకట్రామయ్య గారింట్లో కలిసాము. అప్పుడు మీ వెంట నిర్మల వచ్చారు’ అన్నారు. తర్వాత ఏమీ మాట్లాడలేకపోయారు. నా సంగతి సరే.
వెంకట్రామయ్యగారు కల్పించుకుని సంభాషణ మార్చారు. పాత రేడియో రోజులు నెమరేసుకున్నాం. నేను రాస్తున్న రేడియో రోజుల ప్రసక్తి వచ్చింది. ‘ఏమిటండీ నన్నలా ఆకాశానికి ఎత్తేశారు’ అన్నారు తన గురించి రాసిన వ్యాసాన్ని ప్రస్తావిస్తూ.
చాలా సేపు కూర్చున్నాం. చాలా విషయాలు మాట్లాడారు. మాటలో అదే నెమ్మదితనం. ఎనభయ్ ఎనిమిదేళ్ళ వృద్ధాప్యపు ఛాయలు శరీరంలో కానవస్తున్నా ఆవిడ కంఠం మాత్రం అలాగే మునుపటి మాదిరిగానే శ్రావ్యంగా వుంది.
మళ్ళీ వీలు చిక్కినప్పుడు వస్తామని చెప్పి వచ్చాము.
పాత పరిచయస్తులను, స్నేహితులను ఇలా కలుస్తుంటే అదో తృప్తి. కానీ ఈ వేగయుగంలో మనసులో అనుకున్నాకుదరని విషయాల్లో ఇదొకటి.
ఇప్పుడు ఆ వెంకట్రామయ్య గారూ లేరు. సత్యవతి గారూ లేరు.


(మాడపాటి సత్యవతి)

1, మార్చి 2020, ఆదివారం

ఇది నా జీవితం. కధకాదు.



అంచేత సాఫీగా ఎలాంటి ముడులు లేకుండా చెబుతాను.
నా భార్య చనిపోయి ఏడో నెల నడుస్తోంది. పెద్దవాడు సందీప్ అమెరికాలో తల్లి మాసికాలు భార్య భావనతో కలిసి ప్రతినెలా శ్రద్ధగా పెడుతున్నాడు. రెండోవాడు సంతోష్ బెంగళూరులో ఓ మల్టి నేషనల్ కంపెనీలో పనిచేస్తాడు. రెండో కోడలు నిశ నాకు తోడుగా ఉంటోంది. తనదీ విసుగూ విరామంలేని మల్టీ నేషనల్ ఉద్యోగమే. కాకపొతే వర్క్ ఫ్రం హోం వెసులుబాటు వుంది. ఇన్నాళ్ళుగా సంతోష్ ప్రతి శుక్రవారం సాయంత్రం వచ్చి ఆదివారం సాయంత్రం తిరిగి వెడుతుండేవాడు. ఈ నెలలో ఆ ఉద్యోగం హైదరాబాదుకే మారింది. వాళ్ళ సామాను సదిరే కార్యక్రమంలో ఓ కపిలకట్ట బయట పడింది. అందులో ఏముంటాయో నాకు తెలుసు కాని వాళ్లకు తెలియదు. దాన్ని నేను పదిలంగా తీసుకుని భద్రపరచుకున్నాను. మా ఆవిడకు అదంటే ప్రాణ సమానం. మేము మాస్కో వెళ్ళినా మాతోటే వచ్చింది. తిరిగి మాతోటే ఇండియా వచ్చింది. హైదరాబాదులో ఎన్నో ఇళ్ళు మారినా అది మాత్రం తను మరచిపోకుండా వెంట తెచ్చుకునేది. అందులో బంగారం ఏమీ లేదు. బంగారం లాంటి ఉత్తరాలు ఉన్నాయి. యాభయ్ రెండేళ్ళ క్రితం మా పెళ్ళికి పూర్వం రెండు మూడేళ్ళ పాటు మా మధ్య ఉత్తరాయణం నడిచింది. నేను రాసినవన్నీ ఆవిడ దగ్గర భద్రంగా వున్నాయి. తను రాసిన వాటిలో కొన్నే నా దగ్గర మిగిలాయి.
మిమ్మల్ని ఇలాంటి వ్యక్తిగత విషయాలతో విసిగించడం నా ఉద్దేశ్యం కాదు. ప్రేమించిన ఆడదాని హృదయం ఎంత గొప్పదో, అది ఎంతటి ఉదాత్త ప్రేమో చెప్పడం కోసమే ఈ ప్రయత్నం.
ఆమె రాసిన వాటిల్లో అణువణువూ ప్రేమమయం. నా ఉత్తరాలు అన్నీ డాబుదర్పం. పెళ్ళయిన తర్వాత ఎలా మెలగాలి, అత్తగారు, ఆడబిడ్డలతో ఎలా వుండాలి ఇలా అన్నమాట. నిజానికి అలా నిర్బంధించే అధికారం నాకేమి వుంది. ఆమె నన్ను ప్రేమిస్తోంది. నేను ఆమెను ప్రేమిస్తున్నాను. అంతే! అలాంటప్పుడు నా ఈ పేను పెత్తనం ఏమిటి? అవి చదివి ఎంత నొచ్చుకుని వుంటుంది. అయినా నన్ను పెళ్ళాడింది అంటే అది ఆమె గొప్పతనమే. ఇప్పుడు తలచుకుంటే చాలా చిన్నతనం అనిపిస్తుంది.
నన్ను మన్నించు! నన్ను క్షమించు ! అని ఎంతగా గొంతు చించుకున్నా నా మాటలు వినబడనంత దూరానికి వెళ్ళిపోయింది.


(భండారు నిర్మలాదేవి)

26, ఫిబ్రవరి 2020, బుధవారం

చివరి నవ్వు


గలేరియా మాల్ లో ఓ షాపు.
“ఎంత”
“ట్వెల్  ఫిఫ్టీ”
“అయితే నాలుగివ్వండి” అన్నాను పర్సులో నుంచి యాభయ్ నోటు తీస్తూ.
అప్పుడు వినపడింది నవ్వు. షాపు వాడేమో అని చూస్తే అతడు నా మొహం లోకి చూస్తూ మందహాసం చేస్తున్నాడు. మరెవరు!
తీరా చూస్తే మా ఆవిడే.
నవ్వుతోంది. పగలబడి నవ్వుతోంది. అందరూ చూస్తున్నారు అనే ధ్యాస లేకుండా.
బహుశా అంత హాయిగా నవ్వింది మా నలభయ్ ఎనిమిదేళ్ళ వైవాహిక జీవితంలో మొదటిసారి.
నా అమాయకత్వాన్ని చూసి కాదు, నా తెలివి తక్కువతనాన్ని చూసి అలా నవ్విందని తర్వాత తెలుసుకుని నేనూ నవ్వుకున్నాను.  తర్వాత ఉబెర్ లో ఇంటికి వస్తున్నప్పుడు కూడా ఆ నవ్వు అలా తెరలు తెరలుగా వస్తూనే వుంది. “మీకు కిలో కాఫీపొడుం రేటు  తెలవదు, అలాంటి షాపుల్లో పదీ పరక్కూ దొరుకుతాయని ఎలా అనుకున్నారు” అని నవ్వుతూనే అంది.
ఇంతకీ ఆ రోజు  జరిగింది ఏమిటంటే సినిమా చూసి వస్తూ ఓ షాపులోకి వెళ్ళాము. ఏదో తల నూనె కొన్నది. చూడబోతే చిన్నసీసా.  డబ్బులు ఇవ్వబోతూ నేనడిగిన ప్రశ్న”ఎంత” అని. “ట్వెల్ ఫిఫ్టీ” అన్నాడు షాపువాడు. “పన్నెండున్నర రూపాయల సీసా కోసం మళ్ళీ మళ్ళీ రావడం ఎందుకు ఒకేసారి  నాలుగు సీసాలు కొనుక్కోవచ్చు కదా” అంటూ యాభయ్ నోటు తీశాను. నిజానికి దాని ధర పన్నెండు వందల యాభయ్ రూపాయలు. ఈ విషయం తనకు తెలుసు. నాకు తెలవదు. మరి నాది అమాయకత్వమో, తెలివితక్కువతనమో కూడా తెలియదు. ఏదైతేనేం అది చూసే ఆమెకు నవ్వొచ్చింది. మామూలుగా కాదు. తెరలుతెరలుగా.
ఇలా పగలబడి నవ్వడం మొదటిసారి. నాకప్పుడు తెలియదు, మరో వారం తర్వాత  అదే చివరిసారి అవుతుందని.

24, ఫిబ్రవరి 2020, సోమవారం

ఏకచక్ర వాహకుడు


సాయంత్రం మా అన్నయ్య, వదిన, వారి కుమారుడు సుభాష్, అతడి భార్య హేమతో కలిసి  కారులో మియాపూర్ వెడుతున్నాం. కారు అప్పుడే జే. యెన్. టీ.యూ.  ఫ్లై వోవర్  ఎక్కుతోంది. ‘బాబాయి చూసావా’ అన్నాడు కారు నడుపుతున్న సుభాష్ రియర్  వ్యూ మిర్రర్ లోకి చూస్తూ. ఏమిటన్నట్టు వాడివైపు చూసాను. ‘స్లో చేస్తాను, నీ విండో నుంచి ఒకసారి బయటకు చూడు’ అన్నాడు.



(ప్రణయ్ఉపాధ్యాయ)

ఒక వ్యక్తి వేగంగా మా కారును దాటి వెళ్ళాడు. మోటారు సైకిలూ కాదు, మోటారు కారూ కాదు. అతడు వెడుతున్న చిన్ని వాహనానికి ఒకే ఒక చక్రం వుంది. దానికి రెండు వైపులా ఉన్న చిన్న పెడల్స్ పై అటొక కాలు, ఇటొక కాలు వేసుకుని నిటారుగా నిలబడి  ప్రయాణం చేస్తున్నాడు. ఆ ఏకచక్ర వాహనానికి హాండిల్  కూడా లేదు. కాళ్ళతో బేలన్స్ చేసుకుంటూ వెడుతున్నాడు.  ఆ సమయంలో వాహనాల రద్దీ  కూడా బాగానే వుంది. చాలాసేపు అంటే ఫ్లై వోవర్ దిగి, మియాపూర్ మెట్రో  మార్గం ముగిసేవరకు మేము అతడినే ఫాలో అయ్యాము. తలకు హెల్మెట్ వుంది. మోకాళ్ళకు, మోచేతులకు మందమైన గ్లౌజ్ లు వేసుకున్నాడు. కాసేపటి తర్వాత అతడ్ని దాటివెళ్ళి, పక్కగా కారు ఆపుకుని  ఆ యువకుడిని చేతిసైగతో ఆగమని కోరాను. అతడూ ఆగాడు. ఎక్కువ టైం లేదు. ఏదో అడిగాను, అతడూ జవాబు చెప్పాడు. అతడి ఫోటో అడిగితే అతడు ముందు నాది అడిగి తీసుకున్నాడు. పేరు చెప్పాడు. ప్రణయ్ఉపాధ్యాయ. వారానికి రెండు రోజులు ఇంటినుంచి ఆఫీసుకు ఇరవై కిలోమీటర్లు మామూలు సైకిల్ మీద వెడతాడు.  రెండేళ్లుగా మిగిలిన రోజుల్లో ఈ ఎలక్ట్రిక్ యూనీ సైకిల్ వాడడం మొదలు పెట్టాడు. మోటారు వాహనాల కారణంగా వాతావరణం కాలుష్య పూరితంగా తయారవుతోందని, ఇలా ఇంధనం లేని వాహనాలు వాడితే కొంతయినా ఆ ప్రమాదాన్ని తగ్గించవచ్చని అన్నాడు. ఇలా ఒకే చక్రం మీద వెడితే ప్రమాదం కాదా అని అడిగితె అతడు గట్టిగా లేదని జవాబు చెప్పాడు.



హడావిడిలో ఫోన్ నెంబరు తీసుకోవడం మరచిపోయాను. ఇంటికి వచ్చి గూగులమ్మను అడిగితె అతడ్ని గురించి మరిన్ని వివరాలు చెప్పింది. ఇంకా కావాలనుకున్నవాళ్ళు అతడి వెబ్ సైట్ చూడవచ్చు.

ఓపెన్ కాకపోతే : uni electric cycle pranay upadhyaya : ఇలా ట్రై చేయండి

https://www.facebook.com/bhandarusrinivasrao/videos/pcb.2429787387333587/2429787344000258/?type=3&theater


19, ఫిబ్రవరి 2020, బుధవారం

అన్నయ్య గురించి అక్కయ్యలు ...



పెద్ద అన్నయ్య, కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారి  ఏడూడికి ఆయన గురించి చిన్న పుస్తకం తెద్దామని అడిగితే, శారదక్కయ్య, సరసక్కయ్య, సావిత్రక్కయ్య, భారతక్కయ్య వెంటనే స్పందించారు. కారణాంతరాలవల్ల  ఆ సంకల్పం నెరవేరలేదు. కానీ పాత కాగితాల్లో వాళ్ళు రాసిన జ్ఞాపకాలు కనిపించాయి. ఆ రాతలకు అక్షర రూపం:  
అన్నయ్య గురించి.... కొలిపాక శారద
బాబు మాట్లాడుతుంటే పెద్దవాళ్ళం కూడా ఆశ్చర్యంతో, ఎవరూ చూడకుండా ముక్కుమీద వేలేసుకునేవాళ్ళం. అంత గొప్పగా ఉండేవి వాడి మాటలు. ఎదుటివారి మనసు గమనించి వారి మనసులోని మాటను మార్దవంగా చెప్పేవాడు. అది నిజానికి ఓ అపూర్వమైన శక్తి. భగవంతుడే పుట్టుకతో ఇచ్చాడు. మా బాబు బయటి వాళ్ళతో ఎలా వుండే వాడో తెలియదు కాని, బావగార్లందరినీ సమానంగా గౌరవిస్తూ, మర్యాద చేస్తూ, పాదాలకు నమస్కారం చేస్తూనే, చురక వేయాల్సిన సందర్భం వస్తే మాత్రం, ముఖ్యంగా బావల మీద వాడు వేసే చమత్కార బాణాలు వింటూ లోలోపల నవ్వుకునే వాళ్ళం. మావారితో మాట్లాడేటప్పుడు, దేశభక్తి, రాజకీయాలు ఏవేవో చర్చించేవాడు. మాట్లాడడంకన్నా ఎక్కువ వినడమే  చిన్నప్పటినుండి నాకలవాటు. నవ్వు వచ్చినప్పుడు దాచుకోవడం తెలియకపోయినా, సభ్యత పాటించాల్సిన సందర్భాల్లో దాన్ని చిరునవ్వుగా మార్చుకునేదాన్ని.
బాబు కుటుంబం పట్ల నెరవేరుస్తున్న బాధ్యతల బరువు చూసి రాధక్కయ్య ఎప్పుడూ అంటూవుండేది, ‘ నేను పెద్ద కొడుకుగా పుట్టి వుంటే మొత్తం కుటుంబానికి ఏ ఇబ్బందీ లేకుండా చూసేదాన్నని. అది దేవుడు విన్నట్టున్నాడు, దాని కడుపున రంగడు పుట్టాడు. బాబుకు కూడా రంగడు అంటే ప్రేమే కాదు, గౌరవం కూడా. తమ చదువూ, తెలివితేటలూ  కుటుంబానికే కాదు, నలుగురికీ ఉపయోగపడాలని వాళ్ళిద్దరూ తపించేవారు.
బాబుకి సాహిత్యంపై తగని ఆసక్తి. మేనమామల పోలికలు వచ్చాయేమో తెలియదు, మా పిల్లలకు కూడా ఆ వరస ఒంటబట్టింది. సాహిత్యపరంగా మా ఇంట్లో బాబుకెప్పుడూ సన్మానమే.
మొత్తం  భండారు బండికి ఇరుసు ఊడిపోయిందా అనిపిస్తుంది బాబు లేకుండా.
వాణ్ణి తీసుకువెళ్ళిన దేవుడు ఇచ్చిన ధైర్యంతో బండి నడుపుతూనే వున్నాం. తప్పదు కదా!
రఘు, రాణి, వేణి, వాణి కుటుంబాలకు ఆశీస్సులు.
కొలిపాక శారద

అన్నయ్య గురించి ..... తుర్లపాటి సరస్వతి
భక్తులకు ఆ భగవంతుడి కరుణ ఒక్కటే సమాదరణగా లభిస్తుంది. అదే మనిషి పుట్టుక పుడితే ఆప్యాయతలు, అనురాగాలు సాటి మనుషులకు సమానంగా  పంచడం అంత సులభం కాదు. ప్రతి మనిషికి సొంత ఇష్టాలు వుంటాయి. తోటి మనిషిని తనదైన రీతిలో అంచనాలు వేయడాలు వుంటాయి. అలాంటి అరలు తెరుచుకోకుండా తలుపులు వేసేసి, స్వచ్చమైన, స్పష్టమైన ఆలోచనలపై దృష్టి నిలపడం మామూలు మాట కాదు. పేగు పంచుకున్న, పేగు తెంచుకున్న బంధాలు వేరే. ఎవరి సంసారాలు వారివనే సంకుచిత దృష్టితో వ్యవహరించడం వల్లనే ఆప్యాయతలు, అనురాగాల్లో ఇన్ని తేడాలు. ఇలాంటివి ఎన్నో విన్నాం. మరెన్నో కన్నాం.
కానీ,
మా అక్కాచెల్లెళ్ళం మెట్టింట్లో అడుగుపెట్టి సంసారవృక్షం ఒక పక్క పెరుగుతున్నా, అత్తింటి సేవలు, మర్యాదలు కాపాడుకుంటూనే, కంభంపాడులో మా చిన్నతనంలో తల్లి చాటు పిల్లలుగా ఉన్నప్పటి తీయదనాలకు మేం ఎప్పుడూ దూరం జరగలేదు. జరగం కూడా.
ఏటా అందరం అప్ప తద్దినానికి కలిసేవాళ్ళం. పెళ్ళిలా వుండేది ఆ హడావిడి. వెంకప్ప ఏం చేస్తున్నాడో మూడో కంటికి తెలియకుండా అన్ని ఏర్పాట్లు చేసేవాడు. అక్కడ వుండేది ఒకటి రెండు రోజులైనా చిన్నప్పటి నుంచీ అక్కడే ఉంటున్న అనుభూతి కలిగేది.
ఇంటికి పెద్దవాడయిన  అప్ప తద్దినం అందరినీ కలిపే సందర్భంగా భావించేవాళ్ళం కానీ, ఇదేమిటి దేవుడు శపించినట్టుగా ఇంటికి పెద్ద కొడుకు బాబు ఏడూడికి కలవడం ఏమిటి? మా పెద్దవాళ్ళ దౌర్భాగ్యం కాకపొతే.
మా పుట్టింటి గౌరవాన్ని నిలిపింది మా బాబే. మా వారంటే బాబుకి అమితమైన గౌరవం. బాబంటే మా వారికి అమితమైన వాత్సల్యం. వయసులో చిన్నవాడయినా వాడి మాటంటే మా వారికి తగని గురి. బాబు జ్ఞాపక శక్తి అమోఘం. ఎదురుగా ఎవరు వుంటే వారి అభిరుచికి తగిన విషయాలు  ఆసక్తిగొలిపేలా చెబుతుండేవాడు. వాడు ముచ్చట్లు చెబుతుంటే మేమందరం ప్రపంచాన్ని మరచిపోయి వింటుండేవాళ్ళం.
బాబు బాబా దగ్గరికి వెళ్లి, అక్కడినుంచి ఆ దేవుడి దగ్గరికి వెళ్లి అప్పుడే ఏడాది గడిచిందా – భగవంతుడా!
తుర్లపాటి సరస్వతి

అన్నయ్య గురించి.... కౌటూరి సావిత్రి
బాబు ఖమ్మం ఎప్పుడు వచ్చినా, సరోజినితో కలిసి నడుచుకుంటూ మామిళ్ళగూడెంలోని మా ఇళ్ళన్నీ వరసగా చుట్టబెట్టేవాడు. వాడు ఖమ్మం వస్తే ముందు ఎవరింటికి వచ్చేవాడని ఎవరూ అనుకుండేవాళ్ళు కాదు, ఎందుకంటె ఓపిగ్గా అందరిండ్లకు వచ్చేవాడు. పెద్దల్నీ, పిల్లల్నీ ఆప్యాయంగా పలకరించేవాడు. వాడు వస్తేచాలు అన్నీ ముచ్చట్లే. రకరకాల కబుర్లు చెప్పేవాడు. అసలు ఖమ్మంతోనే దివ్యమైన అనుబంధం వుంది బాబుకి. అది నరసింహస్వామి గుట్ట. ఆ గుట్ట మీదికి ఎక్కి కలయచూస్తె ఖమ్మం అంతా ఇంతై కనిపిస్తుందని సరదాగా అనేవాడు. వాడి మాటలు నవ్వు తెప్పించేవి. కానీ తరచి చూస్తె అందులో నిగూఢమైన ఆధ్యాత్మిక భావం గోచరించేది.
అమ్మంటే బాబుకు యెనలేని గౌరవం. తల్లుల పట్ల పిల్లలకు అనురాగం వుండడం సహజమే. కానీ బాబుది విలక్షణమైన ప్రేమ. అప్పుడప్పుడూ అమ్మ కొన్నాళ్ళు ఖమ్మంలో మా ఇంట్లో వుండేది. అమ్మ కాళ్ళకు దణ్ణం పెట్టి రైలు స్టేషనుకు వెళ్ళేవాడు. రైలుకు పది నిమిషాలు టైం వుంటే చాలు, గబగబా వచ్చి మళ్ళీ అమ్మను చూసి వెళ్ళేవాడు.
సరోజినీ, విమల, అరుణ, నిర్మల ఈ నలుగురూ  భండారు వారి కోడళ్ళుగా కాదు, మాతో కలిపి పదకొండుమంది ఆడబిడ్డలుగా ఇమిడిపోయారు.
బాబును ఇలా అర్ధాంతరంగా తీసుకు వెళ్ళడం వెనక ఏముందో తెలవదు కానీ ఆ దేవుడికి బాబుతో ఏదో పనిపడే ఈ పని చేసి ఉంటాడు. నిజానికి వాడు ఎక్కడున్నా చేసేది దేవుడి పనేగా. వాడి చివరి రోజుల్లో మాకు బాబా దర్శనం ఏర్పాటు చేసి వాడు దేవుడి దగ్గరికే వెళ్ళిపోయాడు.
దేవుడా! నీకో దండం!
కౌటూరి సావిత్రి   
         

అన్నయ్య  గురించి ... తుర్లపాటి  భారతి
ప్రేమక్కయ్య. నేను దాన్ని ప్రేమనే పిలుస్తాను. ప్రేమకు అన్నయ్య అంటే ప్రేమతో కూడిన గౌరవం. అన్నయ్య ఎదుట నోరు విప్పేది కాదు. సంతోషం నిండిన మొహంతో అన్నయ్య ముందు మౌనంగా వుండేది. కానీ నేనలా కాదు. నోరు మూసుకుని వుండే తత్వం కాదు నాది. నా తరవాత ముగ్గురు తమ్ముళ్ళు వున్నా నేనే అందరికంటే చిన్నదాన్ని అనిపించేది. ఆ ఇది తోనే, అన్నయ్య అంటే కొంత చనువుగా మసిలేదాన్ని. అన్నయ్య తోటి ముఖతః చెప్పలేని విషయాలను ఉత్తరాల్లో కూర్చేదాన్ని. వెంటనే అన్నయ్య నుండి జవాబు వచ్చేది. నాఉత్తరం కొద్దిగా లేటయితే, ఎందుకోలే పోనీ  అని వూరుకునేవాడు కాదు. మళ్ళీ ఆయన నుంచి ఉత్తరం వచ్చేది. అన్నయ్య రాసే ఉత్తరాల్లో ఆయన కనిపిస్తున్నట్టే వుండేది. అదో చిత్రం. అన్నయ్య గురించి ఇలా రాయాల్సి వస్తుందని ఏనాడు అనుకోలేదు. ఆయన్ని ఇలా గుర్తు చేసుకోవాల్సి వస్తుందని కూడా ఊహించలేదు.
అన్నయ్య అన్నదాన్ని, నేను కాదని అన్న సందర్భాల్లో నాది గెలుపు కాదు, ఆయనది ఓటమి కాదు. నిజం చెప్పాలంటే నామీద ప్రేమతోనే ఆయన ఓడిపోయి ఉంటాడు.
బహుశా మా పేర్లు ప్రేమ భారతి అని అన్నయ్యే సూచించి ఉంటాడు. ఆ రెండూ ఆయన గుణానికి, స్వభావానికి సంబంధించినవి.
అదేమిటో అందరం ఒక గొడుగు కింద, ఎండొచ్చినా, వానొచ్చినా కలిసి ఉందామంటే, భగవంతుడు ఆ గొడుగును చిన్నగా చేస్తున్నాడేమో అనిపిస్తున్నది. దేవుడితో పోటీ ఏం పడతాం.
ఇక్కడ అందరం క్షేమంగా వుండాలని అన్నయ్య ఆత్మే పైనుంచి పెద్ద గొడుగు పట్టుకున్నట్టుగా అనిపిస్తోంది.
ప్రేమతో (కలిసి)
-తుర్లపాటి భారతి              

26, జనవరి 2020, ఆదివారం

కొత్త రాజధానికి ఖర్చు ఎంత అవుతుందో తెలుసా ? | Latest Updates On Ap 3 Cap...



సుమన్ టీవీ ఛానెల్ లో ఇంటర్వ్యూ ఇచ్చి చాలా కాలమైంది. ఇన్నాల్టికి కళ్ళపడింది.
కర్టెసి : సుమన్ టీవీ రజని