26, ఫిబ్రవరి 2020, బుధవారం

చివరి నవ్వు


గలేరియా మాల్ లో ఓ షాపు.
“ఎంత”
“ట్వెల్  ఫిఫ్టీ”
“అయితే నాలుగివ్వండి” అన్నాను పర్సులో నుంచి యాభయ్ నోటు తీస్తూ.
అప్పుడు వినపడింది నవ్వు. షాపు వాడేమో అని చూస్తే అతడు నా మొహం లోకి చూస్తూ మందహాసం చేస్తున్నాడు. మరెవరు!
తీరా చూస్తే మా ఆవిడే.
నవ్వుతోంది. పగలబడి నవ్వుతోంది. అందరూ చూస్తున్నారు అనే ధ్యాస లేకుండా.
బహుశా అంత హాయిగా నవ్వింది మా నలభయ్ ఎనిమిదేళ్ళ వైవాహిక జీవితంలో మొదటిసారి.
నా అమాయకత్వాన్ని చూసి కాదు, నా తెలివి తక్కువతనాన్ని చూసి అలా నవ్విందని తర్వాత తెలుసుకుని నేనూ నవ్వుకున్నాను.  తర్వాత ఉబెర్ లో ఇంటికి వస్తున్నప్పుడు కూడా ఆ నవ్వు అలా తెరలు తెరలుగా వస్తూనే వుంది. “మీకు కిలో కాఫీపొడుం రేటు  తెలవదు, అలాంటి షాపుల్లో పదీ పరక్కూ దొరుకుతాయని ఎలా అనుకున్నారు” అని నవ్వుతూనే అంది.
ఇంతకీ ఆ రోజు  జరిగింది ఏమిటంటే సినిమా చూసి వస్తూ ఓ షాపులోకి వెళ్ళాము. ఏదో తల నూనె కొన్నది. చూడబోతే చిన్నసీసా.  డబ్బులు ఇవ్వబోతూ నేనడిగిన ప్రశ్న”ఎంత” అని. “ట్వెల్ ఫిఫ్టీ” అన్నాడు షాపువాడు. “పన్నెండున్నర రూపాయల సీసా కోసం మళ్ళీ మళ్ళీ రావడం ఎందుకు ఒకేసారి  నాలుగు సీసాలు కొనుక్కోవచ్చు కదా” అంటూ యాభయ్ నోటు తీశాను. నిజానికి దాని ధర పన్నెండు వందల యాభయ్ రూపాయలు. ఈ విషయం తనకు తెలుసు. నాకు తెలవదు. మరి నాది అమాయకత్వమో, తెలివితక్కువతనమో కూడా తెలియదు. ఏదైతేనేం అది చూసే ఆమెకు నవ్వొచ్చింది. మామూలుగా కాదు. తెరలుతెరలుగా.
ఇలా పగలబడి నవ్వడం మొదటిసారి. నాకప్పుడు తెలియదు, మరో వారం తర్వాత  అదే చివరిసారి అవుతుందని.