19, డిసెంబర్ 2019, గురువారం

రేడియో కబుర్లు - 45 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 19-12-2019, Thursday) 

డెక్కన్ రేడియో
‘యే ఆకాష్ వాణి హైదరాబాద్ హై. అబ్ ఆప్ వసీమక్తర్ సే ఇలాఖాయే ఖబ్రే సునియే’
పాటల్లోనే కాదు మాటల్లో కూడా సంగీతం వినవచ్చు. ఉర్దూ భాషకు ఆ శక్తి వుంది.
డెబ్బయ్యవ దశకంలో హైదరాబాదు రేడియో కేంద్రం నుంచి సరిగ్గా సాయంత్రం అయిదు గంటల యాభయ్ నిమిషాలకు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు మొదలయ్యేవి.
‘యే ఆకాష్ వాణి హైదరాబాద్ హై. అబ్ ఆప్ వసీమక్తర్ సే ఇలాఖాయే ఖబ్రే సునియే’ అంటూ వసీం అక్తర్ చదివే వార్తలు ఉర్దూ తెలియని వాళ్లు కూడా వినడం నాకు తెలుసు. ఆయన వార్తలు చదువుతుంటే సంగీతం వింటున్నట్టుగా వుండేది. నేను ఆయనతో కలిసి చాలా సంవత్సరాలు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేశాను. కొన్ని ఉద్యోగాలు చేయడం కూడా పూర్వజన్మ సుకృతం. చిన్నవా పెద్దవా అన్న మాట అటుంచి గొప్పగొప్ప వాళ్ళతో కలిసి పనిచేశామన్న తృప్తి కలకాలం మిగిలిపోతుంది.
దేశానికి స్వాతంత్రం రావడానికి ఓ పుష్కర కాలం కంటే చాలా ముందుగానే, అప్పటి నిజాం సంస్థానంలో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. 1933 లో రెండువందల వాట్ల ట్రాన్స్మిషన్ శక్తితో, ‘డెక్కన్ రేడియో’ అనే పేరుతో ఒక ప్రైవేటు రేడియో స్టేషన్ ను హైదరాబాదులో ఏర్పాటు చేశారు. ఆ రేడియో ట్రాన్స్ మిటర్ ను స్తానికంగా రూపొందించడం విశేషం. వాస్తవానికి ఈ రేడియో కేంద్రం ఒక కుటుంబం ఆద్వర్యంలో ఏర్పడింది. ఆ కుటుంబసభ్యులే కేంద్రం నిర్వహణ బాధ్యత చూసుకునేవారు. చిరాగ్ ఆలీ లేన్ లోని ఆజం మంజిల్ భవనంలో ఈ రేడియో కేంద్రం పనిచేసేది.
ఉర్దూలో వార్తలతో పాటు గజల్స్, ఖవ్వాలీలు, పాటలు ప్రసారం అయ్యేవి. ఆ రోజుల్లో సినిమా పాటల రికార్డులు అంత సులభంగా దొరికేవి కావు. దానితో స్థానిక సంగీత కళాకారులు రేడియో కేంద్రానికి వచ్చి తమ కార్యక్రమాలను రికార్డ్ చేసేవారు. ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు రోషన్ ఆలీ డెక్కన్ రేడియోలో మొదటి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తరువాత ఎం ఏ రవూఫ్ డెక్కన్ రేడియోలో స్టుడియో ఎక్జిక్యూటివ్ గా చేరారు. ఆయన పేరు పొందిన గజల్ గాయకుడు. తదనంతర కాలంలో రవూఫ్ ఈ కేంద్రానికి డైరెక్టర్ అయ్యారు.
మొహరం మాసంలో రేడియో కేంద్రానికి సెలవు ప్రకటించేవారు. ప్రసారాలు వుండేవి కావు.
ఆ తరువాత కొన్ని మార్పులు చేశారు. మొదటి పదమూడు రోజులు ప్రసారాలు నిలిపివేసేవాళ్ళు. మిగిలిన రోజుల్లో కూడా సంగీత కార్యక్రమాలు వుండేవి కావు. స్థానిక వార్తాపత్రికల్లో వెలువడిన వార్తల ఆధారంగా న్యూస్ బులెటిన్లు తయారయ్యేవి. రాష్ట్రానికి సంబంధించిన సమాచారమే వార్తల్లో చోటుచేసుకునేది.
రెండేళ్ళ తరువాత అంటే 1935 లో డెక్కన్ రేడియో కేంద్రాన్ని నిజాం స్వాధీనం చేసుకున్నారు. నిజాం సంస్థానంలోని వైర్ లెస్ విభాగం కింద డెక్కన్ రేడియో పనిచేయడం మొదలు పెట్టింది. నవాబ్ ఆలీ యవార్ జంగ్ ఆధ్వర్యంలో డెక్కన్ రేడియో కేంద్రానికి మరిన్ని హంగులు సమకూరాయి. ఇంగ్లాండ్ లోని మార్కొనీ కంపెనీ తయారు చేసిన శక్తివంతమైన రెండువందల వాట్ల రేడియో ట్రాన్స్ మిటర్ ను దిగుమతి చేసుకున్నారు. రేడియో కేంద్రాన్ని చిరాగ్ ఆలీ లేన్ నుంచి ఖైరతా బాద్ లోని యావర్ మజిల్ అనే భవనంలోకి మార్చారు. కొత్త రికార్డింగ్ స్టుడియోలను నిర్మించారు. నగర పొలిమేరల్లోని సరూర్ నగర్ ప్రాంతంలో పెద్ద యాంటీనా నెలకొల్పారు. దానిమీద వున్న యెర్ర విద్యుత్ దీపాలు నగరంలో సుదూరంగా వుండే అనేక ప్రాంతాలకు కనబడేవని చెప్పుకునే వారు. డెక్కన్ రేడియోలో పనిచేసే ఒక ఉద్యోగిని లండన్ పంపించి బీబీసీ లో శిక్షణ ఇప్పించారంటే డెక్కన్ రేడియో పట్ల నవాబ్ ఆలీ యవార్ జంగ్ ఎంతటి శ్రద్ధ తీసుకున్నదీ అర్ధం అవుతుంది.
తరువాతి రోజుల్లో డెక్కన్ రేడియో సంగీత కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. వాటికి శ్రోతల నుంచి విశేషమైన ఆదరణ లభించడం అందుకు కారణం. ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్, ఉస్తాద్ బడే గులాం ఆలీ ఖాన్, హీరా బాయ్ బరడేకర్, ఆవిడ సోదరి సరస్వతీ రాణే వంటి సుప్రసిద్ధ సంగీతకారులు డెక్కన్ రేడియో కళాకారుల జాబితాలో వుండేవారు. మరో ప్రసిద్ధ సంగీత కారుడు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ రెండు పర్యాయాలు హైదరాబాదు వచ్చి డెక్కన్ రేడియోలో ప్రోగ్రాములు ఇచ్చారు.
డెక్కన్ రేడియో నుంచి తెలుగు, కన్నడం, మరాఠీ భాషల్లో కూడా కొన్ని కార్యక్రమాలు ప్రసారం అయ్యేవి కాని వాటి వ్యవధి చాలా పరిమితం.

(ఇంకా వుంది)

17, డిసెంబర్ 2019, మంగళవారం

రేడియో కబుర్లు -44- భండారు శ్రీనివాసరావు


“నేనిప్పుడు చెన్నపట్నం నుంచి మాట్లాడుచున్నాను. మీరెక్కడ నుంచి వినుచున్నారో చెప్పజాలను. కానీ అనేక స్థలములయందు వుండి వినుచున్నారని తలచుచున్నాను. నేనీ రోజున చెప్పవలసినది ఏమనగా ఆకాశవాణి యొక్క ఉపయోగములే. దీన్నే ఇంగ్లీష్ లో రేడియో అనెదరు.”
“1938 జూన్  16 నాడు మద్రాసు రేడియో కేంద్రం ప్రారంభం అయినప్పుడు తొలి తెలుగు ప్రసంగం చేస్తూ సర్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు చెప్పిన తొలి పలుకులు ఇవి. రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ‘భారత దేశము -  రేడియో’ అనే విషయం గురించి  సర్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు తెలుగులో చేసిన ప్రసంగాన్ని ప్రసారం చేశారు. జస్టిస్ పార్టీ నాయకులలో ఒకరయిన నాయుడు గారు కొంతకాలం ఉమ్మడి మద్రాసు ప్రధానిగా పనిచేశారు. మద్రాసు రేడియో స్టేషన్ నుంచి అదే మొదటి తెలుగు ప్రసంగం.
“రేడియోకు తెలుగు పర్యాయ పదంగా ‘ఆకాశవాణి’  వాడిన సర్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు గారు తమ ప్రసంగం ముగింపులో చెప్పిన అంశాలు నేటికీ ప్రసార సాధనాలకు వర్తిస్తాయి.
“ఆయన ఇలా చెప్పారు.
“యెంత మంచి వస్తువయిననూ మంచిదే కాక చెడునకు కూడా ఉపయోగింపనగును. కొన్ని దేశములందు వివిధ రాజకీయ పక్షములవారు తమ పక్షముల గొప్ప చెప్పుకొనుటకు, వైరులను (విపక్షాలను) తక్కువచేసి చెప్పుకొనుటకు ఉపయోగింతురు. ప్రస్తుతము మన దేశము నందు అన్నింటికంటే విద్యావ్యాప్తి చాలా ముఖ్యము. కనుక, ఆకాశవాణిని సర్వజనోపయోగకరమైన విషయములందును, ఆనందము కలుగచేయు పనుల యందును స్వచ్ఛ మనసుతో ఉపయోగింపవలెనని నా హెచ్చరిక”
ఎప్పుడో ఎనభయ్ ఏళ్ళకు పూర్వం హెచ్చరిక రూపంలో నాయుడు గారు చేసిన మనవిని ఈనాటి ప్రసార సాధనాలవారు ఏమేరకు పాటిస్తున్నారన్నది సందేహమే.
“అంతకు ముందు అదే రోజు సాయంత్రం  మద్రాసు రేడియో కేంద్రాన్ని అప్పటి మద్రాసు గవర్నర్ ఎర్స్కిన్ ప్రభువు ( Lord Erskine) రాష్ట్ర ప్రధాన మంత్రి  (ఇప్పటి మాటల్లో చెప్పాలంటే ముఖ్యమంత్రి)  చక్రవర్తుల రాజగోపాలాచారి ప్రారంభించారు. అప్పటికే ఆల్ ఇండియా రేడియో అనే పేరుతొ ప్రభుత్వ వ్యవస్థలో ఏర్పాటుచేసిన ఆ సంస్థను వ్యవహరిస్తూ వస్తున్నప్పటికీ,  రాజాజీ మాత్రం ఆంగ్లంలో చేసిన తన  ప్రారంభోపన్యాసంలో ‘హిందూస్తాన్ ఆకాశవాణి’ అనే ప్రస్తావించారు.
“ప్రారంభోత్సవం రోజు సాయంత్రం ఐదున్నరకు సౌరాష్ట్ర రాగంలో శ్రీ త్యాగరాజ స్వామి వారు రచించిన ‘శ్రీ గణపతిని సేవింప రారే’ అనే తెలుగు కృతిని తిరువెణ్ కాడు సుబ్రహ్మణ్య పిళ్ళై అనే విద్వాంసులు నాదస్వరంపై వాయిస్తుండగా మొదలయింది. రాజాజీ ప్రారంభోపన్యాసం తరువాత సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ గాత్ర కచేరీ, తిరిగి సుబ్రహ్మణ్యపిళ్ళై గారి నాదస్వర సభ ప్రసారం అయ్యాయి. ఆ వెంటనే రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ‘భారత దేశము - రేడియో’ అనే విషయం గురించి,  సర్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు తెలుగులో ప్రసంగించారు.
“ఎప్పుడో ఎనభయ్ ఏళ్ళకు పూర్వమే మద్రాసు రేడియో కేంద్రం అనేక తెలుగు కార్యక్రమాలను ప్రసారం చేసింది. రామమూర్తి పంతులు ‘సజీవమైన తెలుగు’ అనే విషయం గురించీ, ‘మన ఇళ్లు – వాని అందము చందము’ గురించి కోలవెన్ను కోటేశ్వరరావు,  ‘రవీంద్రుడు’ శీర్షికన బెజవాడ గోపాలరెడ్డిగారు రాసిన ప్రసంగా వ్యాసాలను ఆకేంద్రం నుంచి ప్రసారం చేశారు.
“అదే కేంద్రం నుంచి  తెలుగులో ప్రసారం అయిన తొలి రేడియో నాటకం ‘అనార్కలి’. ముద్దుకృష్ణ రాసిన ఈ నాటకాన్ని ఆచంట జానకీరాం  రూపొందించారు. నాయిక పాత్రను రేడియో భానుమతిగా ప్రసిద్దురాలయిన  పున్నావజ్జల  భానుమతి పోషించారు. నాయకుడు సలీం (జహంగీర్)పాత్రను దేవులపల్లి వెంకటకృష్ణశాస్త్రి,  అక్బర్ పాత్రను  డాక్టర్ అయ్యగారి వీరభద్రరావు  పోషించారు. ఈ నాటకం   1938 జూన్  24 తేదీ రాత్రి ఎనిమిదిన్నరనుంచి  ప్రసారం అయింది.
“జానపద సంగీతం కూడా వినిపించాలనే ఉద్దేశ్యంతో అడపా దడపా ‘పల్లె పాటలు’ ప్రసారం చేసేవారు. అయితే ఈ పల్లెపాటలు పాడిన వారు నాగరీకులే కావడం విశేషం. వారు అసలు సిసలు జానపద కళాకారులు కాదు. శాస్త్రీయ సంగీతంలో కాస్త లలితమైనవిగా భావించే పదాలను. జావళీలను ప్రత్యేకంగా వినిపించేవారు. అట్లా వినిపించినప్పుడు తెలుగు రచనలతో పాటు తమిళ రచనలను కూడా ప్రసారం చేసేవారు.
“మద్రాసు రేడియో కేంద్రం నుంచి తమిళంలో కన్నా తెలుగులోనే ఎక్కువ ప్రసారాలు జరుగుతున్నాయనే ప్రచారం ఒకటి ఆ రోజుల్లో కొనసాగుతూ వుండేది.
“1939లో తిరుచినాపల్లి రేడియో కేంద్రం ఏర్పడి దక్షిణ తమిళ జిల్లాలపై దృష్టి నిలిపిందని అనుకునేవారు.
“అంతకు ముందే   హైదరాబాదులో, ఆ తరువాత మైసూరులో  రేడియో కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మైసూరు విశ్వవిద్యాలయంలో మనస్తత్వ శాస్త్ర  ఆచార్యులుగా వున్న డాక్టర్ ఎం.వీ. గోపాలస్వామి మైసూరు రేడియో కేంద్రానికి సంస్థాపకులు. దానికి ఆయన ‘ఆకాశవాణి’ అని పేరు పెట్టారు. ఆ పేరును రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు సూచించారని చెబుతారు.    తిరువాన్కూర్ సంస్థానం 1937సెప్టెంబరు ఆఖరులో ఒక రేడియో కేంద్రాన్ని నెలకొల్పింది.
డెక్కన్ రేడియో పూర్వాపరాలు :
“1923లో మహబూబ్ ఆలీ అనే తపాలాశాఖ ఉద్యోగి హైదరాబాదులో చిరాగ్ ఆలీ సందులో
200 వాట్ల శక్తి కలిగిన చిన్న రేడియో కేంద్రం నెలకొల్పాడు. 1935 ఫిబ్రవరి నుంచి అది నిజాం నవాబు అధీనంలోకి వచ్చింది. ఆ రేడియో కేంద్రంలో ప్రసార భాష ఉర్దూ. ప్రసార శక్తి చాలా తక్కువ కావడం వల్ల ప్రసారాలు చాలా  పరిమితమైన దూరాలకే వినిపించేవి.
“1939 జులైలో అయిదు కిలోవాట్ల శక్తి కలిగిన రేడియో రిలే  కేంద్రాన్ని
 సరూర్ నగర్ లో ఏర్పాటు చేసి డెక్కన్ రేడియో పేరిట ప్రసారాలు
మొదలుపెట్టారు.  ఉర్దూతో పాటు తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో ప్రసారాలు
చేసేవారు.  అయితే ఉర్దూతో పోలిస్తే తక్కిన భాషల ప్రసారాలు పరిమితంగా
వుండేవి. మొహర్రం మాసంలో ప్రసారాలు వుండేవి కావట. కొన్నాళ్ళకు స్టూడియోను
సరూర్ నగర్ నుంచి నగరంలోని ఖైరతాబాదులోవున్న యావర్ మంజిల్ కు మార్చారు.
రిలే స్టేషన్  మాత్రం సరూర్ నగర్ లో వుండేది. తెలుగులో ప్రసారాలు మొదట తక్కువ వ్యవధిలో ఇచ్చేవాళ్ళు. కాలక్రమేణా రోజుకు గంట సేపు ప్రసారాలు చేసేవారు. ఈ కేంద్రం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర దాకా, సాయంకాలం అయిదున్నర నుంచి రాత్రి పదిన్నర దాకా ప్రసారాలు చేసేది.
హిందూస్తానీ సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చేవారు.  చాలా ఏళ్ళ తరువాత కర్నాటక సంగీతానికి కొంత సమయం కేటాయించసాగారు. ముస్లిం వనితలకోసం పరదా పధ్ధతి, వారికోసం విడిగా వాకిలి ఏర్పాటుచేశారు. వసీంఖాన్ అనే ఆయన  తెలుగు కార్యక్రమాల అధికారిగా పనిచేశారు. రాయప్రోలు రాజశేఖర్ సహాయ దర్శకులుగా, భాస్కరభట్ల కృష్ణారావు, దుర్గా చలం కార్యక్రమ నిర్వాహకులుగా పనిచేసేవారు.
కురుగంటి సీతారామయ్య, మహారధి సంభాషణలు, వార్తలు వంటివి రాసేవారు. కే.ఎల్. నరసింహారావు గ్రామీణ కార్యక్రమాలు నిర్వహించేవారు. లలిత, వెంకటేశ్వర్లు అనేవాళ్ళు  వార్తలు చదివేవాళ్ళు. మల్లి  పాటలు, ఎల్లి పాటలు మొదలయిన శీర్షికలతో జానపద గీతాలు ప్రసారం అయ్యేవి”
 (సమాచార సేకరణలో అమూల్య సహకారం అందించిన ఆకాశవాణి పూర్వ సంచాలకులు
డాక్టర్ పీ ఎస్ గోపాలకృష్ణ గారికి నా కైమోడ్పులు)
(ఇంకావుంది)

16, డిసెంబర్ 2019, సోమవారం

రేడియో కబుర్లు - 43- భండారు శ్రీనివాసరావు

రేడియో కబుర్లు - 43 - భండారు శ్రీనివాసరావు
(Published in SURYA daily on 17-12-2019, Tuesday)
రేడియో కధాకమామిషు
నిజానికి ఈ వ్యాసపరంపరను దీనితోనే మొదలు పెట్టాల్సింది కానీ నా రేడియో రోజులు గురించి రాయడం కోసం వేరే విధంగా ప్రారంభించాల్సి వచ్చింది.
నాకు బుద్ది తెలుస్తున్న తొలి రోజుల్లో రేడియోని చూసింది మా స్వగ్రామం కంభంపాడులోని చామర్తి వీరభద్రరావు మామయ్య గారింటిలో. వాళ్ళ ఇంటి మధ్యహాలులోని అల్మారాలో ఒక భోషాణం పెట్టె మాదిరిగా వుండేది. దానికిందనే మోటారు కార్లలో వాడే బ్యాటరీ మాదిరిగా పెద్దగా వుండేది. కార్లలో వాడే బ్యాటరీ కాదు గానీ రేడియో కోసం ప్రత్యేకమైన బ్యాటరీ. బాగానే పెద్దది. ఎవరెడీ కంపెనీ వారి బ్యాటరీ. ఆ కంపెనీ గుర్తు 9 అంకె. ఆ నెంబరు మధ్యలో నుండి దూకుతున్నట్లున్న పిల్లి బొమ్మ ఆ బ్యాటరీ మీద ఉండేది.
ఆ పెద్ద గదిలో పైన ఆ మూల నుంచి ఈ మూలకు నైలాన్ తో అనుకుంటా తయారు చేసిన ఒక జాలీ మాదిరి యాంటీనా కట్టి వుండేది. మా మామయ్యగారు రేడియో ఆన్ చేయగానే కింది భాగంలో పచ్చటి లైటు ముందుకూ వెనక్కూ సాగుతూ ఒక చోట ఆగిపోయేది. మా మామయ్యగారికి భానుమతి పాటలు అంటే చాలా ఇష్టం. ఆ పాటలు రేడియోలో ఎప్పుడు వస్తాయో ఆయనకు ముందుగా ఎలా తెలుసో నాకయితే తెలియదు. కానీ రేడియోలో అవే పాటలు వచ్చేవి. బహుశా ఆకాశవాణి ప్రచురించే వాణి పత్రిక తెప్పించేవారేమో. ఒక వేళ భానుమతి స్వరం వినబడకపోతే, వెంటనే గ్రామఫోన్ పెట్టె బయటకు తీసి బాసింపట్టు వేసుకు కూర్చుని భానుమతి పాట రికార్డు వేసుకుని వినేవాడు. మాకేమో రేడియో వినాలని. ఆయనకేమో భానుమతి పాట వినాలని. రేడియోలో అప్పుడప్పుడూ హరికధలు, ఆదివారాల నాడు తెలుగు సినిమా (సంక్షిప్త శబ్ద చిత్రం) వేసే వాళ్ళు. ఇక ఆరోజు ఆయన ఇల్లు తిరుణాల మాదిరిగా వూరి జనంతో నిండిపోయేది. ఎందుకంటే వూరి మొత్తానికి అదొక్కటే రేడియో. అలాంటి రోజుల్లో మా మామయ్య గారు ఆ రేడియోనుతీసుకుని వచ్చి పదిలంగా బయట వరండాలో ఓ బల్ల మీద వుంచి రేడియో పెట్టేవారు, వచ్చిన జనమంతా విననడానికి వీలుగా.
పొరబాటున ప్రసారంలో ఏదైనా అంతరాయం వస్తే ఆయన వెంటనే హార్మనీ పెట్టె బయటకు తీసి దానిపై వున్న మీటలపై చేతివేళ్ళను కదిలిస్తూ, మరో చేతితో ఆ పెట్టెకు వెనుకవైపు చెక్క పలకను వెనక్కీ ముందుకూ జరుపుతూ గొంతెత్తి ఏదో ఒక పద్యం అందుకునేవారు. కొంతమంది ఊరిజనం కూడా ఆయనతో గొంతు కలిపేవారు.
ఒక విధంగా మా మామయ్య గారిల్లు పొద్దుగూకే వేళకు వూరిజనాలకు వినోదకేంద్రంగా మారిపోయేది.
అదీ రేడియోతో నా మొదటి పరిచయం.
తర్వాత స్కూలు చదువుకోసం బెజవాడ వెళ్లి మా లాయరు బావగారు తుర్లపాటి హనుమంతరావు గారింట్లో ఉండేవాడిని. ఆయన ఇంట్లో ఆఫీసు గదిలో ఒక బీరువా మీద ఒక చిన్న సైజు రేడియో వుండేది. దానికి మా వూళ్ళో రేడియో మాదిరిగా యాంటీనా వున్నట్టు లేదు. కరెంటుతో పనిచేసేది. కాకపోతే ఆ రేడియో పెట్టే అధికారం మా బావగారికి మాత్రమే వుండేది. ఇంట్లో వాళ్ళం ఎవ్వరం దాని మీద చేయివేసే సాహసం చేసేవాళ్ళం కాదు. పొద్దున్నే భక్తి రంజని, ఇంగ్లీష్ వార్తలు అంతే! ఆ తర్వాత రేడియో నోరు తెరిచేది కాదు. అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ మొట్టమొదటిసారి చంద్రుడి మీద కాలుమోపినప్పుడు ఆ చారిత్రాత్మక సంఘటనను బీబీసీ కాబోలు ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఆ రోజు మా బావగారు నిబంధనలను కాస్త సడలించి రేడియో పెట్టారు. గుర్రుబర్రు మంటూ ఇంగ్లీష్ లో ప్రసారం అయిన ఆ కార్యక్రమంలో ఒక్క ముక్క అర్ధం కాకపోయినా అందరం చెవులొప్పగించి విన్నాం.
బీసెంటు రోడ్డులో జంధ్యాల నారాయణ మూర్తి (సినిమా డైరెక్టర్ జంధ్యాల తండ్రి) గారి బుష్ రేడియో స్టోర్స్ వుండేది. మా బావగారు ఆయన గారు మంచి స్నేహితులు. అంచేత పిల్లలం అప్పుడప్పుడూ ఆ దుకాణంలో కాసేపు కూర్చుని రేడియో కొనడానికి ఎవరైనా వచ్చినప్పుడు పెట్టే ప్రోగ్రాములు కాసేపు వినేవాళ్ళం. ఆ విధంగా మా ముచ్చట తీర్చుకునేవాళ్ళం.
హైస్కూల్లో చేరిన తర్వాత సెలవుల్లో మా వూరికి వెళ్ళినప్పుడు ఊరిమద్యలో మైకులో వినిపించే పంచాయతీ రేడియో సెంటర్ మాకు ఆటవిడుపు. రోజూ సాయంత్రం వేళల్లో ఓ రెండు మూడు గంటలు రేడియో వినడానికి వూళ్ళో వాళ్ళు ఆ మైకు దగ్గరికి చేరేవాళ్ళు. అది కూడా ఒక్క విజయవాడ మెయిన్ స్టేషన్ మాత్రమే. వివిధభారతి పాటలు అవీ వినడానికి వీలులేదు. సాయంత్రం ప్రాంతీయ వార్తలు, ఢిల్లీ నుంచి వచ్చే తెలుగు వార్తలు, వ్యవసాయదారుల కార్యక్రమం, ఎప్పుడయినా ఓ హరికధా కాలక్షేపం. వివిధభారతి పాటలు అవీ వినడానికి వీలులేదు. మొదట్లో బాగున్నా సినిమాపాటలు వినే ఛాన్స్ లేకుండా పోయిందని బాధపడే వాళ్ళం.
ఈ లోపల మా ఇంటి పెత్తనం మా మూడో అన్నయ్య వెంకటేశ్వర రావు చేతికి వచ్చింది. ఆయన చేసిన మొదటి పనేమిటంటే విజయవాడ వెళ్లి నాలుగు బా౦డ్లో, అయిదు బా౦డ్లో తెలియదు, ఓ ట్రాన్సిస్టర్ రేడియో కొనుక్కొచ్చాడు. మా వూళ్ళో అడుగుపెట్టిన మొదటి ట్రాన్సిస్టర్ అదే. అంతకు ముందు బ్యాటరీతో పనిచేసే రేడియో మాత్రమే మేము చూశాము. ఎక్కడికిపడితే అక్కడికి తీసుకువెళ్ళే ఆ రేడియో ఆ రోజుల్లో వూళ్ళో వాళ్ళందరికీ చూడముచ్చటగానే కాకుండా విచిత్రంగా కూడా వుండేది. రేడియో సిలోన్ నుంచి మీనాక్షి పొన్ను దొరై సమర్పించే కార్యక్రమంలో వినిపించే తెలుగు పాటలు మొదటి సారి వినే భాగ్యం కలిగింది.
ఇక ఆ తర్వాత రేడియో యుగం. ప్రతి ఇంటా రేడియో. ప్రతి చేతిలో బుల్లి ట్రాన్సిస్టర్. క్రికెట్ కామెంటరీలు వింటుంటే అచ్చం క్రికెట్ గ్రౌండ్ లోనే వున్నామా అనే అనుభూతి కలిగేది. ఆ ఉత్సాహం రేడియో వినేవాళ్ళ మొహాల్లో చేతల్లో కేరింతల రూపంలో కనబడేది. రేడియో పుణ్యమా అని బుర్ర కధలు, హరి కధలు, పురాణ కాలక్షేపాలు, సంగీత కచ్చేరీలు అన్నీ ఇళ్ళ లోగిళ్ళలోకి తరలివచ్చాయి.
ఎప్పటికో అప్పటికి సొంతంగా రేడియో కొనుక్కోలేకపోతానా అనే కోరిక నాతోపాటే పెరిగి పెద్దయి రేడియో ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా తీరలేదు. ఎందుకంటే రేడియో వాళ్ళే మాకో రేడియో ఇచ్చారు. దాంతో కొనే అవసరం లేకుండా పోయింది. ఆ రేడియోకి కావాల్సిన బ్యాటరీ సెల్స్ కూడా నెలకోసారి ఆఫీసువాళ్ళే సప్లయి చేసేవాళ్ళు. బదిలీ అయినప్పుడో, రిటైర్ అయినప్పుడో ఆ రేడియో తిరిగిచ్చేయాలనేది కండిషన్. నా విషయంలో ఇది కూడా జరగలేదు. ఎందుకంటే ఏ బదిలీలు లేకుండా చేరిన చోటే, అంటే హైదరాబాదులోనే మూడు దశాబ్దాల తర్వాత పదవీవిరమణ చేశాను. ప్రభుత్వ సర్వీసులో ఇదొక రికార్డు అనేవాళ్ళు. మూడు దశాబ్దాల క్రితం ఇచ్చిన ఆ రేడియో ఏమైందో తెలియదు. మధ్యలో అయిదేళ్ళు దేశంలోనే లేను. రేడియో మాస్కోలో పనిచేయడానికి వెళ్లాను. తిరిగివచ్చిన తర్వాత కూడా ఆ రేడియో గురించి అడిగినవాళ్ళూ లేరు. ఆ రికార్డులు వున్నట్టూ లేదు.
ఉద్యోగం చేసిన రోజుల్లో పుట్టని యావ, అసలు రేడియో ఏమిటి, దీని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి అనే మీమాంస రిటైరైన తర్వాత మొదలయింది. ఇటువంటి విషయాల్లో అవగాహన కలిగిన వాళ్ళు చాలామంది నాలాగే రిటైర్ అయ్యారు. చాలామంది జీవించి లేరు. ఉన్నవారిలో కూడా చాలామందికి కొన్ని కొన్ని జ్ఞాపకం. అక్కడక్కడా మతిమరపు. డాక్టర్ పద్మనాభ రావుగారి లాంటి వాళ్ళు విషయ సేకరణ చేసి రేడియోకి సంబంధించి కొన్ని పుస్తకాలు రాసారు. మరొక వ్యక్తి డాక్టర్ పి.ఎస్. గోపాల కృష్ణ. గతంలో ఆలిండియా రేడియో, హైదరాబాదు కేంద్రానికి డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన స్వయంగా రాసి అనేక సదస్సుల్లో సమర్పించిన పరిశోధనాపత్రాలు అనేకం వున్నాయి. ఆయన పనితీరు నాకు తెలుసు. పైగా ధారణ శక్తి అపారం. సాధికారత లేకుండా ఏదీ రాయరు. కాబట్టి ఆయన్నిఅడిగీ, ఫోనులో మాట్లాడి చాలా విలువైన సమాచారం సేకరించాను. ఆ ఆధారంగా మరికొన్ని రేడియో సంగతులు ఈ శీర్షిక ద్వారా తెలియచెప్పాలనేది సంకల్పం.
దానికి ప్రతి రూపమే ఈ రేడియో కబుర్లు.
(ఇంకా వుంది)






14, డిసెంబర్ 2019, శనివారం

రేడియో రోజులు - 42 - భండారు శ్రీనివాసరావు



జర్నలిస్టుల జీవితాల్లో పైకి కనిపించని ఓ  విషాద కోణం.
జర్నలిస్టు వృత్తి జీవితం తొలినాళ్ళలో నేను కలిసి తిరిగిన అనేకమంది మిత్రులు, తదనంతర కాలంలో స్వయంకృషితో ఎదిగి వాళ్ళు పనిచేస్తున్న పత్రికలకే ఎడిటర్లుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉచ్చస్తితిలో వున్నప్పుడు వాళ్ళని కలుసుకోవాలంటే మహామహులకే దుర్లభంగా వుండేది. విజిటింగ్ కార్డు పంపి అనేకమంది బయట వెయిట్ చేస్తున్న సమయాల్లో కూడా వాళ్ళు,  నాతో గతకాలంలో గడిపిన రోజులు మరచిపోకుండా, నన్ను తమ సన్నిహిత వర్గంలోని వాడిగానే పరిగణించి ఆదరించేవారు. అది వారి గొప్పతనంగా నేను భావిస్తాను.
 విలేకరిగా వృత్తి జీవితం ప్రారంభించి విలేకరిగానే పదవీ విరమణ చేసినవాడిని నేను. నా బోటి వాళ్ళే  ఈ వృత్తిలో ఎక్కువగా వుంటారు. అతికొద్దిమంది మాత్రమే  తమ ప్రతిభతో పైమెట్లు  ఎక్కగలుగుతారు. నాది ఒక రకంగా సర్కారు ఉద్యోగం కనుక ఎక్కవలసిన మెట్లు తక్కువే. ఎక్కగలిగిందీ తక్కువే. గోదావరిలో ఎన్ని నీళ్ళున్నా, మనం బిందె తీసుకువెడితే బిందెడు నీళ్ళు, చెంబు తీసుకువెడితే చెంబెడు నీళ్ళు, మన ప్రాప్తాన్నిబట్టి తెచ్చుకోగలుగుతామని మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు చెప్పిన విషయం అహరహం గుర్తుండడం చేత ఈ మెట్లెక్కే గొడవ నా మనసుకు ఎక్కలేదు. అయినా ఈనాటి లోకంపోకడ ఇందుకు విరుద్దం. పొజిషన్ ను బట్టి పలకరింపులు, స్తాయిని బట్టి సాన్నిహిత్యాలు, హోదాని బట్టి ఆహాఓహోలు. కానీ నా అదృష్టం, నా మిత్రులెవ్వరు ఈ కోవలోకి రారు. అందుకే ఇన్నేళ్ళ తరవాత కూడా వారు నాతో  ప్రవర్తించే తీరులో ఇసుమంత తేడా లేదు.
కీర్తి శేషులు, శ్రీయుతులు జి కృష్ణ, నండూరి రామమోహన రావు, తుర్లపాటి కుటుంబరావు,  పీటీఐ కృష్ణ, శ్యాం రావు,  హిందూ రాజేంద్రప్రసాద్, లక్ష్మీపతి, ఆంధ్రపత్రిక ముక్కు శర్మ, పాపయ్య శాస్త్రి,  ఈనాడు శాస్త్రి, యుఎన్ఐ డి సీతారాం, పార్ధసారధి,  ఎక్స్ ప్రెస్ సుందరం, నీలంరాజు మురళీధర్, శ్రీకాంత్ విఠల్, ప్రభ దీక్షితులు, ఆంద్రజ్యోతి  ఆదిరాజు వెంకటేశ్వర రావు, కే. రామకృష్ణ, దామోదరస్వామి, సత్యారావు,  ప్రభ నంద్యాల గోపాల్, సలంద్ర,  పీటీఐ ఏ.హెచ్.వి. సుబ్బారావు, జమాల్ , ఉదయం అంజన్  కుమార్  వంటివారితో (వీరందరూ ఇప్పుడు లేరు) కలిసిమెలిసి తిరగగలిగే అదృష్టం నాకు దక్కింది. అలాగే, శ్రీయుతులు,  సుప్రసిద్ధ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్, పొత్తూరి వెంకటేశ్వరరావు, ఐ. వెంకట్రావు, కే. రామచంద్రమూర్తి, ఎంవీఆర్ శాస్త్రి, ఇండియా  టు డే అమరనాద్ మీనన్,  నరిశెట్టి ఇన్నయ్య, వేమూరి రాధాకృష్ణ, విశాలాంధ్ర శ్రీనివాసరెడ్డి, దేవులపల్లి అమర్, హిందూ కేశవరావు, ఎస్.నగేష్ కుమార్, కె. శ్రీనివాస రెడ్డి, సోమశేఖర్,  క్రానికల్ రబీంద్రనాధ్, పి.ఏ. రామారావు, సింహం అనే నరసింహారావు, పెద్ద బాబాయి సీహెచ్వీఎం కృష్ణారావు, కొమ్మినేని శ్రీనివాసరావు, కడెంపల్లి వేణుగోపాల్, పాశం యాదగిరి, ఎం. వేణుగోపాల్, ఔట్ లుక్  ఎం.ఎస్. శంకర్,  నందిరాజు రాధాకృష్ణ, లక్ష్మీ ప్రసాద్, ఎక్స్ ప్రెస్ వాసు, ఆంధ్రపత్రిక శాస్త్రి, విద్యారణ్య, ప్రజాశక్తి వినయకుమార్, ఎన్.ఎస్.ఎస్. కొండా లక్ష్మారెడ్డి ఇలా ఒకరా ఇద్దరా జర్నలిజంలో కాకలు తీరిన అనేకమందితో చనువుగా మసలగలిగే అవకాశాన్ని నా రేడియో విలేకరిత్వం నాకు అందించింది. నిజానికి వీరిలో చాలామందితో నా సాన్నిహిత్యం, గారు వంటి గౌరవ పద ప్రయోగాలతో ముడిపడివుండలేదు. చాలా చనువుగా పలకరించుకోగల సంబంధబాంధవ్యాలు వుండేవి. దాదాపు ప్రతి రోజు సెక్రెటేరియేట్  లోని ప్రెస్ రూం లో కలుసుకునేవాళ్ళం. పత్రికా సమావేశాలు లేనప్పుడు కొన్ని గంటలపాటు మా నడుమ ముచ్చట్లు సాగేవి. పెద్దా చిన్నా తేడా లేకుండా ఒక కుటుంబంలోని సభ్యులమాదిరిగా గడిపేవాళ్ళం. ఇండియన్ ఎక్స్ ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్   సుందరం  కనపడగానే సుందరం మనమందరం అని ఏదో కవిత్వ ధోరణిలో పలకరించినా ఆయన  ఏమీ అనుకునేవాడుకాదు. పైగా నవ్వి వూరుకునేవాడు. మా ఇద్దరి నడుమా మరో బాదరాయణ సంబంధం వుండేది. గుజరాత్ గవర్నమెంటు వారి గిర్నార్ స్కూటర్ ను మేమిద్దరం ఒకే డీలర్ దగ్గర కొన్నాము.  హైదరాబాదులో అమ్ముడుపోయిన గిర్నార్ స్కూటర్లే బహు తక్కువ. వాటిల్లో రెండింటికి మేమిద్దరమే  ఓనర్లం. ఆ రోజుల్లో వెస్పా స్కూట ర్లకు పెద్ద గిరాకీ వుండేది. కొనుక్కోవాలంటే ఎన్నో సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితులు వుండేవి. వాటిని ప్రభుత్వ సిఫారసుతో వెనువెంటనే పొందగల అవకాశం జర్నలిస్టులుగా మాకున్నప్పటికీ, వాటి ఖరీదులో కొంతమేరకు మేరకు  మాత్రమే బ్యాంకు రుణాలు పుట్టేవి. మిగిలిన మొత్తం చేతి నుంచి పెట్టుకునే ఆర్ధిక వెసులుబాటు లేకపోయేది.   అందుకే మరో మాట లేకుండా మేమిద్దరం గిర్నార్ స్కూటర్లు కొనుక్కున్నాము. అదీ ఏదో బ్యాంకు అధికారి జర్నలిష్టులమని అప్పివ్వబట్టి. ఆ అప్పు పుట్టడం కూడా విచిత్రంగా జరిగింది.


(గిర్నార్ స్కూటర్ పై  రచయిత)

కలకత్తా (ఇప్పుడు కోల్ కటా) కార్యస్థానంగా కలిగిన యునైటెడ్ బాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎనభయ్యవ దశకం ప్రధమార్ధంలో అనుకుంటాను, హైదరాబాదు వచ్చి అప్పటి బంజారా హోటల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అలాటి వాటికి రాయని పత్రికా రచయితలు ఒకరిద్దర్ని మినహాయిస్తే డ్యూటీమీద వచ్చే వాళ్ళు పట్టుమని పదిమంది కూడా వుండేవాళ్ళు కాదు. అందువల్ల మాటా మంతీ మాట్లాడుకోవడానికి వ్యవధానం, వెసులుబాటు ఉండేవి. అప్పటికే జర్నలిజం వృత్తిలో చేరి పుష్కర కాలం గడిచింది కాని (ద్విచక్ర)వాహనయోగం పట్టలేదు. కొత్త స్కూటరు ఖరీదు పదివేల లోపే. బాంకు ఋణం ఇచ్చినా మూడు నాలుగు వేలు చేతినుంచి పెట్టుకోవాల్సి రావడం వల్ల అప్పు ఇచ్చే బాంకులవాళ్ళు వున్నా తీసుకోవడానికి ఓ పట్టాన  ధైర్యం చాలేది కాదు. ఈ నేపధ్యంలో యునైటెడ్ బాంకు చైర్మన్ హైదరాబాదు వచ్చారు.  ఆయన బాంకులు, లోన్లు గురించి మాట్లాడుతుంటే ఆకాశవాణి న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావుగారు  జర్నలిస్టులకు స్కూటర్ లోన్లు గురించి కదిలించారు. ఓ పది వేలు రుణం ఇవ్వడం అనేది ఆయనకు ఒక లెక్కలోనిది కాదు. ఆయన వెంటనే స్పందించి  అక్కడ వున్న స్తానిక బాంకు అధికారిని పిలిచి వెంటనే కావాల్సిన వారికి  లోన్ శాంక్షన్ చేసి ఆ విషయం తనకు తక్షణం  తెలియచేయాల్సిందని హుకుం జారీ చేసారు. సరే ప్రెస్ కాన్ఫరెన్స్, దరిమిలా ఏర్పాటు చేసే విందు భోజనాలు ముగిసిన తరువాత ఎవరి ఇళ్ళకు వాళ్ళం వెళ్ళిపోయాం. రెండు రోజుల తరువాత కోటీ లోని యునైటెడ్ బాంకు నుంచి ఫోను వచ్చింది. లోను కోసం రాలేదేవిటి అని వాకబు. ఆశ్చర్యం వేసింది. నమ్మబుద్ది వేయలేదు. అపనమ్మకంతోనే అక్కడికి వెళ్లాను.  బాంకు అధికారి స్కూటరు  లోనులో ఓ ఇరవై శాతం అయినా ముందు ధరావతు మొత్తంగా కట్టమన్నాడు. ఆ డబ్బే వుంటే మీ దగ్గరకు ఎందుకు వస్తామని లేచి రాబోతుంటే ఆయనే మళ్ళీ కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి ‘మీకు లోను శాంక్షన్ చేసి మళ్ళీ  మా హెడ్ ఆఫీసుకు ఈ సాయంత్రానికల్లా రిపోర్ట్ చేసుకోవాలి, ముందు చెక్కు తీసుకు వెళ్ళండి’ అని హామీదారుల సంతకాలు కూడా అడక్కుండా కాసేపట్లో చెక్కు చేతిలో పెట్టాడు. ఆ రోజుల్లోనే,  గుజరాత్ గవర్నమెంటు వాళ్ళ గిర్నార్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. అంతా వెస్పా స్కూటర్ మోజులో వున్నారు. కానీ అది దొరకాలంటే చాలా ఏళ్ళు వెయిట్ చేయాలి. దాంతో చాలామందికి గిర్నార్ స్కూటర్ వరప్రసాదంలా కనబడింది. అంతకు రెండు రోజులముందే ఎక్స్ ప్రెస్ సుందరం గారు గిర్నార్ కొనుక్కుని దాన్నే నాకు సిఫారసు చేయడంతో నేనూ అదే కొనుక్కున్నాను. ఆ విధంగా నా జీవితంలో మొట్టమొదటి స్కూటరు మా ఇంట కాలు పెట్టింది. మా వైభోగం  ఎలా ఉండేదంటే గిర్నార్ మనిషి మా ఇంటికే వచ్చి స్కూటర్ ను సర్వీసింగుకు తీసుకువెళ్ళేవాడు. కాకపొతే, చివరికి ఆ స్కూటరే నన్ను వార్తల్లోకి ఎక్కించింది.  హెల్మెట్ లేకుండా ఆ స్కూటర్ పై వెడుతుంటే పోలీసులు పట్టుకోవడం, స్టేషన్ కు తీసుకువెళ్ళడం, జర్నలిస్టుల ధర్నాతో ప్రభుత్వం దిగిరావడం మొదలైన అవాంఛిత సంఘటనలకు ఆ గిర్నార్ స్కూటరే నిర్జీవసాక్ష్యం.
ఇదలా ఉంచి అసలు విషయానికి వస్తే, 
 ‘ఐ నో సీఎం. ఐ నో పీఎం’ అనుకునే  జర్నలిస్టుల జీవితాలు పైకి కనిపించినంత గొప్ప కరెన్సీ కాగితాలేమీ కావు.  వారికి వృత్తి రీత్యా  సమాజంలో ఎంతోమంది తెలుస్తుంటారు. కానీ తోటి జర్నలిస్టుల కుటుంబ సభ్యులతో  పరిచయాలకు ఆస్కారం చాలా తక్కువ. అందుకే, కొందరు సాటి జర్నలిస్టులు  చనిపోయినప్పుడు  విషయం  తెలిసికూడా వాళ్ళ ఇళ్ళకు వెళ్లి పరామర్శించలేకపోవడానికి ఇదే కారణం. చనిపోయిన వ్యక్తి తప్ప ఇతర కుటుంబ సభ్యులు   వేరే ఎవ్వరు తెలవదు. తెలిసిన ఒక్కరికి మనం  వచ్చిన విషయం తెలియదు.
ఇది పైకి చెప్పుకోలేని ఓ  పెనువిషాదం.                               
(ఇంకా వుంది)

13, డిసెంబర్ 2019, శుక్రవారం

రేడియో రోజులు - 41 - భండారు శ్రీనివాసరావు



సత్యలోకంలో విధాత తన పద్మాసనంపై బాసింపట్టు వేసుక్కూర్చుని సృష్టికర్తగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న సమయంలో ఆయన సతీమణి, హాటుకగర్భురాణి అయిన చదువులతల్లి పక్కనే వుండి ఓరకంట తన భర్త చేతివేళ్లల్లో రూపుదిద్దుకుంటున్న జీవరాశుల్ని తదేకంగా గమనిస్తోంది.
సృష్టికార్యంలో నిమగ్నుడయివున్న బ్రహ్మదేవుడు పక్కన భార్య వున్న సంగతి సయితం మరచిపోయి, ఒక లావణ్యవతి రూపాన్ని రూపొందించి దానికి స్త్రీమూర్తి అని పేరుపెట్టాడు. ప్రాణం పోసి భూమిమీదకు పంపే సమయంలో సరస్వతమ్మకు కరణేషు మంత్రిఅనే సతీ ధర్మం తటాలున గుర్తుకువచ్చి ఆగండాగండి! తొందరపడి యావత్ సృష్టినే గందరగోళంలోకి నెట్టకండిఅని వేడుకుంది. వేడుకుంటూనే మరోపక్క మాటల్లో వేడిని కాస్త పెంచి -
ఇన్ని తలలున్నాయని పేరే కానీ చేస్తున్నదేమిటో, దాని పరిణామాలేమిటో ఒక్క మారయినా, కనీసం ఒక్క తలకాయతో నయినా ఆలోచించారా ?’ అని వాగ్దేవి తన వాగ్ధాటితో మొగుడ్ని అడ్డుకుంది.

ప్రతిక్షణం లక్షల కోట్ల జీవరాసులను ఒకదానితో మరొకటి పోలిక లేకుండా సృష్టించగల అపారమయిన శక్తియుక్తులున్న ఆ బ్రహ్మదేవుడు కూడా, ఎంతవారలయినా కాంతాదాసులే అన్నట్టు పెళ్ళాం మాటకు బద్ధుడే. అవటాన,

రెండో మాట లేకుండా సతీమణి సలహాకు అంగీకార సూచకంగా మూడు తలలు ఒకేమారు వూపుతూ కాసేపు చేస్తున్న పనికి విరామం ఇచ్చాడు.

అదే అనువుగా తీసుకుని, హితవచన రూపంలో ఆయన అర్ధాంగి వాణి తనదయిన బాణీలో విధాతకు భగవద్గీత బోధించడం ప్రారంభించింది.

మీరు సృష్టించిన ఆ స్త్రీ మూర్తి అందాన్ని చూసి ఆడదాన్నయిన నాకే మతిపోతున్నది. ఇక భూలోక వాసుల సంగతి వేరే చెప్పాలా! ఏమయినా సరే ఇటువంటి భూలోక సుందరిని భూలోకానికి పంపడానికి సుతరామూ వీల్లేదు. సత్యలోకంలో కూడా వుంచడానికి ఒప్పుకోను. ఇటువంటి ఆడవాళ్ళ పొడ నాకు గిట్టదు గాక గిట్టదు.అని గట్టిగా తెగేసి చెప్పింది.

భగవతి మాటలతో విధాత మూడు తలలు పట్టుకున్నాడు. సత్యలోకం నిబంధనల ప్రకారం ఒకసారి తన చేతులతో సృష్టించిన జీవిని భూలోకానికి పంపకుండా వుండేందుకు వీలులేదు. ఆ సంగతే అర్ధాంగికి అవగతమయ్యేలా చెప్పి తరుణోపాయం కూడా చెప్పి పుణ్యం కట్టుకోమని కోరాడు.

ఎంతకట్టుకున్నవాడయినా, ఎంత తన కట్టుబాట్లలో వున్న మొగుడయినా బ్రహ్మ సామాన్యుడేమీ కాదు. సాక్షాత్తు త్రిమూర్తుల్లో ఒకడు. ఆ ఎరుక ఎరిగినది కనుక సరస్వతి కొంత మెత్తబడింది.

అలా మెత్తబడ్డ వీణావాణి మనసులో ఓ కొత్త ఆలోచన పురుడు పోసుకుంది.

మొగుడు ముచ్చటపడి సృష్టించిన ఆ స్త్రీ మూర్తి అద్భుత సౌందర్య రాశి. అంతే కాదు. పరమాద్భుతమయిన తెలివితేటలూ ఆమె సొంతం. ఇంతటి ప్రతిభాశాలినీ, అసాధారణ ప్రజ్ఞాధురీణనీ అదుపులో వుంచడం మానవమాత్రులకు అసాధ్యం. దాన్ని సాధ్యం చేయాలంటే, ఆ పడతి తన ప్రతిభాపాటవాలను మరచిపోయేలా, అవి మరుగున పడిపోయేలా ఆమె దృష్టిని మళ్లించి, ఆ లలన మనసును ఆకట్టుకోగల మరికొన్నింటిని సృష్టించాలి. చదువులలో సారం తెలిసిన చదువుల తల్లికి ఆ ఆనుపానులేవిటో వెంటనే తెలిసిపోయాయి.

ఫలితం ఆ అందాల సుందరితో పాటే బ్రహ్మ దేవుడు, ఇల్లాలి సలహాపై మరో రెండింటిని సృష్టించి భూలోకానికి పంపాడు. అవే పట్టు చీరెలు, స్టీలు గిన్నెలు.

(ఉపసంహారం: డెబ్బయ్యవ దశకంలో హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రతి వారం ప్రసారం అయ్యే జీవన స్రవంతిఅనే కార్యక్రమానికి నేను కర్తా, కర్మా క్రియగా పనిచేస్తున్న రోజుల్లో ఓ వారం ఆ కార్యక్రమంలో భాగంగా పైన పేర్కొన్న ఈ పిట్ట కధ చదివాను. అంతే! ఆనాడు నేను ఆఫీసుకు వెళ్ళగానే రేడియో కార్యక్రమాలలో దిట్టలుగా పేరుగాంచిన నలుగురు మహిళా మూర్తులు, నా సీనియర్లు తురగా జానకీ రాణి, మాడపాటి సత్యవతి, వింజమూరి సీతాదేవి, సునందిని ఐప్ - నాకోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. నన్ను చూసిందే తడవుగా ఒక్కుమ్మడిగా నా మీద మాటల దాడికి దిగారు. స్త్రీజాతిని కించబరిచే విధంగా ఇలాటి కాకమ్మ కధలు ప్రసారం చేయడానికి ఎంత ధైర్యం!అవటాని కేకలు వేసారు. వయస్సులో, అనుభవంలో వారందరికంటే నేను చాలా చిన్నవాడిని. అంచేత ఆ పెద్దల అక్షింతలను ఆశీస్సులుగా తీసుకున్నాను. హాస్యానికి కూడా ఎవరినీ నొప్పించడం తగదన్న నీతి నాకానాడే బోధపడింది. అందుకే అప్పటినుంచి నా కార్యక్రమంలో నేను ఏనాడు ఎవరినీ కించబరిచే వ్యాఖ్యలు చేయలేదు. పొతే వీరిలో జానకీ రాణి గారిది మరింత విలక్షణమైన శైలి. ఆప్యాయత తొణికిసలాడే కాటుక దిద్దుకున్న కళ్ళు.  గుండెలో మాటనే మాట్లాడే నాలుక. భేషజాలు లేని మనిషి. నిజంగా నిండు మనంబు నవ్యనవనీత సమానము, పల్కు దారుణాశస్త్రతుల్యముఅనే పద్యపాదము జానకీరాణి గారికి అతికినట్టు సరిపోతుంది.
రేడియోలో పనిచేసిన మా బోంట్లకు జానకీరాణి గారంటే భయంతో కూడిన గౌరవం ఏం చేస్తాం? కాదనే ధైర్యం ఎక్కడిది ?
జానకీరాణి గారు అంటే గౌరవం. ఆవిడ వయస్సు కొంతా, ఆవిడ కలివిడితనం కొంతా కలిపి గౌరవం ఆవిడంటే. భయం దేనికంటే, నేనే గలగలా మాట్లాడుతానని అంతా అంటారు. జానకీరాణి గారు గలగలా మాత్రమే కాదు, దడ దడలాడిస్తూ దడదడా కూడా మాట్లాడతారు.

ముందే  చెప్పినట్టు, తురగా జానకీరాణి గారు నాకు రేడియోలో సీనియర్ సహోద్యోగి. రేడియోలో చిన్నపిల్లల  ప్రోగ్రాము నిర్వాహకురాలిగా, రచయిత్రిగా, వక్తగా ఆమె తెలుసు. నాకు తెలియని ఆమెలోని మరో పార్శ్వం , ఆవిడ స్వయంగా  రాసిన డాన్స్  మాస్టర్ సత్యం గారి జ్ఞాపకం. ఆవిడ చిన్నతనంలోనే  నాట్యం నేర్చుకున్న సంగతి  అప్పుడే  తెలిసింది. తను ముప్పయ్యేడవ ఏట కూడా  రంగస్థలంపై  నర్తించిన సంగతి కూడా ఆవిడే  చెప్పారు.
ఇక ఆవిడ స్వయంగా రాసుకున్న సంగతులు ఇవి:

(శ్రీమతి తురగా జానకీరాణి)

పంతొమ్మిదివందల నలభై ఏడు , ఎనిమిది ప్రాంతాల్లో సత్యం మాస్టారికి పంతొమ్మిది, నాకు పన్నెండు. మదరాసులో పెదసత్యంగారి దగ్గర నుంచి కూచిపూడికి తిరిగి వచ్చేసిన రోజుల్లో బందరులో నాకు నాట్యం నేర్పించారు. మహిళా సేవా మండలిలో కొందరికి నేర్పుతూ, నాకు ఉదయం పూట ఆరు గంటలకి వచ్చి స్పెషల్ క్లాసు తీసుకునేవారు.
మా అమ్మమ్మ ఆయనగారికి కంచు గ్లాసులో కాఫీ ఇచ్చేది. అది త్రాగి గోడవారగా పెట్టేవారు.

నేను అప్పటికే మదరాసులో పందనల్లూరు చొక్కలింగం పిళ్ళై గారి దగ్గర కొంతనేర్చుకొన్నాను. అందువల్ల నాకు ఒకేసారి కొన్ని అంశాలు నేర్పించారు. అలరింపు, అఠాణా స్వరజతి, భైరవి, కల్యాణి రాగాల్లో జతిస్వరాలు, కానడతిల్లానా, వసంత రాగంలో స్వరజతి, మా వల్లకాదమ్మ దేవి యశోద, కొన్ని అరవ పాటలరికార్డింగులు, ఇలా ఎన్నో. ఆయనే నట్టువాంగం, గానం చేసేవారు. తేలికగా, లైట్గా మాట్లాడేవారు.
నాచేత బుట్టాయపేట హాలులోను, గుడివాడ, వడాలి మొదలైన కొన్ని పల్లెటూళ్ళలో ప్రదర్శనలిప్పించారు. మువ్వలు కొని వాటికివెండి పూత పూయించి తోలు పట్కా మీద కుట్టించి ఇచ్చారు. బహుశ నేను ఆయనకు తొలి శిష్యురాలినేమో. ఆ తరువాత ఆయన మదరాసు వెళ్లి పోయారు. నేను మళ్ళీ చొక్కలింగం పిళ్ళై గారి దగ్గరికి నేర్చుకోవడానికి వెళ్ళాను. నిజానికి ఆయన నాకు భరత నాట్యమే నేర్పారు.
ఆ తరువాత ఆయన్నిరాజసులోచన మేడ మీద క్లాసులు నడుపుతుండగా చూసి వచ్చాను. ఇంకొక సారి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ ప్రెస్ లో హైదరాబాదు నుంచి  భోపాల్ వరకు చేసిన ప్రయాణంలో ఆయన ఎందరెందరి గురించో  చెప్పారు. ఆ తరువాత తెలుగు విశ్వ విద్యాలయం విశిష్టపురస్కారం ఇచ్చినప్పుడు, నేను స్టేజీ మీదకు వెళ్లి, నాకు పన్నెండు, ఆయనకు పంతొమ్మిది ఏళ్ల వయస్సులో ఎంత గొప్ప గురు భావం ఉండేదో చెప్పినప్పుడు, ఆయన అలాగాఅన్నారు.ఇంకా ఎంతో చెయ్యాలని ఉందమ్మాఅని కూడా  అన్నారు. ఎప్పుడూ అమ్మ బాగున్నారా? మామయ్య  బాగున్నారాఅని అడిగేవారు. ఆ సాన్నిహిత్యం, అభిమానం నేను కలకాలం మదిలో నిలుపుకుంటాను. నేను కొంత వరకైనా దూరదర్శన్,  రేడియోలతో పాటు, రవీంద్ర భారతి రంగస్థలం మీద అనేక నృత్య రూపకాలకి, బృంద గీతాలకు దర్శకత్వం వహించగలిగానంటే అది ఆయన పెట్టిన భిక్షే. ప్రాతః స్మరణీయులు ఆమహామనీషిఅంటూ నాట్యంలో తన తొలి గురువును స్మరించుకున్నారు శ్రీమతి  తురగా జానకీరాణి.
(ఇంకా వుంది)

12, డిసెంబర్ 2019, గురువారం

కొత్తా జబ్బులండీ ...... భండారు శ్రీనివాసరావు


బ్రహ్మలోకంలో దేవుడుగారు కొలువు తీరాడు. భటుడుగారు ప్రవేశించి, నడుము వరకు వొంగి వినయంగా నమస్కరించి చెప్పాడు.  'స్వామీ! ఒక మానవాధముడు తెల్లని ఉడుపులు ధరించి వచ్చాడు. శివుడి మెడలో నాగుపామును బోలిన ఒక వస్త్ర విశేషము అతడి మెడలో కూడా  వేలాడుచున్నది. అనుమతించిన లోపలకు తోడ్కొని వత్తును'
దేవుడు అంతఃచక్షువుతో పరికించి  చూశాడు. తోలుపటకా సంచీతో దిక్కులు చూస్తున్న మెడికల్ రిప్రెజెంటేటివ్ కానవచ్చాడు. అతడిని చూడగానే బ్రహ్మగారికి తన శిరోవేదన జ్ఞాపకం వచ్చింది. తక్షణం ప్రవేశపెట్టడమే కాకుండా సభలో వున్న యావన్మందినీ బయటకు పంపేయమని ఆజ్ఞాపించాడు.
మె.రి. దిక్కులు చూస్తూనే లోపలకు వచ్చాడు. వస్తూనే దేవుడు గారు తలనొప్పితో బాధపడుతున్న విషయం చిటికెలో గ్రహించాడు. పటకా సంచీ తెరిచి మందుల సాంపిల్స్ అన్నీ దేవుడుగారి ఆసనం ముందు పరిచాడు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన మందుల్లో తలనొప్పి గోలీ వుందని, అది రాత్రి వేసుకుని పొద్దున్న లేస్తే,  నొప్పి సరే, తల వుందన్న సంగతి కూడా గుర్తుకురాదనీ విరించికి వివరించి చెప్పాడు. మాత్ర వేసుకోగానే నొప్పి  మాయం, గాయబ్ అంటూ సంస్కృతంలో ఏమంటారో తెలియక ఆగిపోయాడు.
బ్రహ్మగారు మూడు తలలు పంకించి మందహాసం చేశారు. మూడు తలలతో ఆలోచించాడు. మనవాడు వుత్తుత్తిగానే ఇంతదూరం రాలేదనీ. ఏదో కారణం  ఉండేవుంటుందని  గ్రహించినవాడై,  అదేదో చెప్పమని సూటిగా అడిగాడు.
మె.రి. భేషజాలకు పోకుండా వున్నవిషయం చెప్పాడు.
'మీరు పరబ్రహ్మ మూర్తులు. మీ రాతకు తిరుగులేదు. అలాఅని అర్ధం కూడా కాదు. అందుకే బ్రహ్మరాత అంటారు. మీలాంటి వాళ్ళు మాలోకంలో కూడా వున్నారు. కాకపొతే వాళ్ళని డాక్టర్లు అంటారు. వారి దస్తూరీ మెడికల్ షాపుల వాళ్లకు తప్ప వాళ్ళ పెళ్ళాలకు కూడా అర్ధం కాదని బోలెడు జోకులు ప్రచారంలో వున్నాయి. అయినా వాళ్ళు మా మందులు రాయకపోతే మేము విషం మందు కొనుక్కుని  మింగి చావాలి. మా బతుకులు వారి రాతతో ముడిపడివున్నాయి. వాళ్ళు అలా మందులు రాస్తూనే వుండాలి. జనాలు వాటిని కొని మింగుతూనే వుండాలి. మరి రాయాలంటే ఉత్త మందులు వుంటే సరిపోదు, వాటికి సరిపడా రోగాలు కూడా వుండాలి. వీటిని ఇతోధికంగా పెంచడానికి మా వంతు తిప్పలు మేము పడుతూనే ఉన్నాము. కానీ మా ప్రయత్నాలు సరిపోవడం లేదు. కాబట్టి మీరు సృష్టి కార్యంతో పాటు, పెద్ద మనసు చేసుకుని అలాగే  మరో చేయి చేసుకుని మరి కొన్ని కొత్త జబ్బులను కూడా సృష్టించి భూమ్మీదకు వదిలితే కాని మా ఉద్యోగాలకు భరోసా వుండదు. కావున ఓ దేవదేవా కాసింత ఈ సాయం కానీ చేస్తివా, మీ మేలు మా మందుల కంపెనీల వాళ్ళు మరచిపోరు. మీ శ్రీమతి గారికి లక్ష్మీదేవి గారితో సమానంగా ఏడువారాల నగలు చేయించి పెడతారు. ఇక మీకంటారా మూడు తలలకూ నిఖార్సయిన బంగారు తొడుగులు వేయిస్తారు. భూలోకంలో మీకు గుళ్ళు ఎలాగూ లేవు, అంచేత మీ లోకంలోనే ఆ భోగాలన్నీ అందిస్తారు.”
మె.రి. ఇచ్చిన సాంపిల్ గోలీతో బ్రహ్మగారి ‘తలల’ నొప్పి తగ్గింది.
కానీ భూమ్మీద కొత్త కొత్త రోగాల నొప్పి జనాలకు  మొదలయింది.                  

రేడియో రోజులు - 40 - భండారు శ్రీనివాసరావు


ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ నెల్లూరు? ఎక్కడ ఆలిండియా రేడియో, ఎక్కడ బీజేపీ, ఎక్కడ వెంకయ్యనాయుడు, ఎక్కడ శ్రీనివాసరావు? ఎక్కడ 2005 ఎక్కడ 2017?
అదంతా గతం. అని నేను అనుకున్నాను. కాదని నాయుడు గారు అనుకుంటున్నారు (ట).
ఆలిండియా రేడియో అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా పదవీ విరమణ చేసిన డాక్టర్ పద్మనాభరావుగారు ఈ సంగతి చెప్పారు కనుక నమ్మక తప్పదు. వెంకయ్య నాయుడుగారు  గౌరవించి ఆదరించే ఆత్మీయులలో డాక్టర్ పద్మనాభరావు గారు ఒకరు. రేడియో గురించి అనేక గ్రంధాలు రాశారు. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి ఆలిండియా రేడియోలో ఉన్నత స్థానానికి చేరుకోగలిగారు.
కొంత కాలం  క్రితం పద్మనాభరావు గారు స్వర్ణభారతి ట్రస్టుకు వెళ్ళారు. ఉపరాష్ట్రపతి హోదాలో నాయుడు గారు ట్రస్టులో ఇద్దరు ముగ్గురు సన్నిహితులకు సాదాసీదాగా ఇచ్చిన విందులో పద్మనాభ రావు గారు కూడా  పాల్గొని, నాయుడి గారితో ఉన్న  పాత పరిచయంతో మాటామంతీ జరిపారు. ఆ సంభాషణల్లో వెంకయ్యనాయుడు నాయుడు గారు నా ప్రసక్తి కూడా తెచ్చారని  పద్మనాభ రావు గారు పేర్కొంటే  సంతోషం అనిపించింది.
వెంకయ్య నాయుడు గారితో నా మొదటి పరిచయం 1972 – 73 లో ప్రత్యేక ఆంద్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల నాటిది. నేను బెజవాడ నార్లవారి ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాను.  బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఇప్పుడు స్వరాజ్ మైదానం అనుకుంటా, అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రధాన వక్తలు మాట్లాడిన తరువాత ఒక యువకుడు మైకు అందుకున్నాడు. నిమిషాల వ్యవధిలోనే సభికులను తన వాగ్దాటితో మైకంలో ముంచి తేల్చాడు. ఎవరని ఆరా తీస్తే వెంకయ్య నాయుడు అన్నారు. పేరు చూస్తే వయసుమళ్ళినవాడనిపించేది కానీ, మనిషి మాత్రం చాలా  చిన్నకారువాడే.
1975 లో హైదరాబాదు ఆలిండియా రేడియోలో విలేకరిగా చేరిన మూడు సంవత్సరాలకు వెంకయ్యనాయుడు ఎమ్మెల్యేగా శాసన సభలో అడుగుపెట్టారు. ఆయనకు జోడీ ఎస్. జైపాల్ రెడ్డి.  ఇక వాళ్ళు సభలో ప్రసంగం మొదలు పెట్టినా, ప్రశ్నలు లేవనెత్తినా, ప్రభుత్వాన్ని నిలదీసినా మొత్తం ప్రెస్ గ్యాలరీ పూర్తిగా నిండిపోయేది. వింటూ రాసుకోవడం విలేకరులకి అలవాటే అయినా వాళ్ళిద్దరూ చెబుతున్నది ఆసక్తిగా వినాలా,  శ్రద్ధగా వింటూ పొల్లుపోకుండా రాసుకోవాలా అనేది అందరికీ  ఒక సమస్యగా వుండేది. ఆ రోజుల్లో ‘శాసన సభలో ఛలోక్తులు’ అనే శీర్షికతో  ప్రతి పత్రికా ఒక కాలం ప్రచురించేది.  వాటిల్లో సింహభాగం వారిద్దరివే  ఉండేవి. ఈ విషయంలో ఇద్దరూ ఇద్దరే.  వెంకయ్యనాయుడి విశ్వరూపం నేను చూసింది అసెంబ్లీలోనే. అంత్య ప్రాసలతో  ఉపన్యాసాన్ని రక్తి కట్టించే ఆ సాంప్రదాయాన్ని ఆనాటి నుంచి ఈనాటివరకూ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ప్రసంగాల్లో కూడా  ఆయన కొనసాగిస్తూ వస్తూనే  వున్నారు.     
ఇక ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో ఆయన పాత్ర ఇంతా అంతా కాదు. ప్రజల్లో రగిలిన అసహనానికి ఆయన వాగ్ధాటి ఆజ్యం పోసిందనడంలో అతిశయోక్తి లేదు.
మరోసారి కలిసింది ఢిల్లీలో. మాస్కో రేడియోలో పనిచేస్తూ సెలవుపై హైదరాబాదు వస్తూ ఢిల్లీలో దిగాను. పూర్వ పరిచయం పురస్కరించుకుని వెడితే గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించారు. మాస్కో విశేషాలు అడిగి ఆసక్తిగా విన్నారు.
వై.ఎస్. రాజశేఖర రెడ్డి మొదటి విడత  ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో నేనూ జ్వాలా నరసింహారావు ఒకసారి ఢిల్లీ వెళ్ళాము. ఏపీ భవన్ లో దిగిన మమ్మల్ని కలవడానికి సీనియర్ జర్నలిష్టులు చంద్రకాంత్, ఆనంద్ వచ్చారు. మాటల మధ్యలో వెంకయ్యనాయుడు గారి ఇంటికి వెడుతున్నట్టు చెప్పి మమ్మల్ని కూడా రమ్మన్నారు. ఆయన ప్రతి సంక్రాంతి పండక్కు కాబోలు తన ఇంట్లో చక్కటి విందు భోజనం ఏర్పాటుచేసి, ఢిల్లీలోని తెలుగు కుటుంబాలను ఆహ్వానిస్తారు. పిలవని పేరంటంగా వెళ్లిన మా ఇద్దర్నీ కూడా వెంకయ్యనాయుడు చాలా ఆదరంగా కనుక్కున్నారు. అద్వానీని చాలా దగ్గరగా ఆ సందర్భంలోనే చూడడం తటస్తించింది. అందరూ వెళ్ళిన తరువాత వెళ్లి కలిస్తే, ‘ఢిల్లీ వచ్చిన పనేమిటని’ ఆయనే  ఆరా తీసారు. అప్పుడు జ్వాలా 108 లో పనిచేస్తున్నాడు. రాజస్థాన్ రాష్ట్రంలో విస్తరణ గురించి జ్వాలా చెబితే అక్కడి ముఖ్యమంత్రితో మాట్లాడుతానని చెప్పి, అప్పటికప్పుడే  మాట్లాడారు కూడా.
నాయుడి గారితో  నా రేడియో అనుబంధం ఇంకా విచిత్రం. ఎమ్మెల్యేగా, పార్టీలో అతి వేగంగా ఎదుగుతున్న నాయకుడిగా వున్న రోజులనుంచి పరిచయం.  ఏదైనా వార్తను పత్రికలకు ఎలా కూర్చి చెప్పాలో, రేడియోకు ఎలా మార్చి  చెప్పాలో ఆయనకు కరతలామలకం. రేడియో వార్తలకు వున్న పరిమితులు ఆయనకు మాకన్నా బాగా తెలుసేమో అనిపించేది. ఎందుకంటే ఆయన ఏదైనా వార్తను  రేడియో కోసం ఫోనులో చెబితే మళ్ళీ తిప్పి రాసుకోవాల్సిన అవసరం వుండేది కాదు. అంత క్లుప్తంగా, సూటిగా వార్తను మలిచి చెప్పేవారు.   మధ్యాన్నం పూట,  మళ్ళీ సాయంత్రం రేడియోలో ప్రాంతీయ వార్తలు ప్రసారం అయ్యేవి. ఆయన ఇరవై మూడు జిల్లాల్లో ఎక్కడ వున్నా ఫోనుచేసి వార్త చెప్పేవారు. మేము ప్రసారం చేసింది విని, మళ్ళీ ఫోను చేసి ‘బాగానే చెప్పారు కానీ మరో వాక్యం జత చేస్తే బాగుండేది, సాయంత్రం వీలుంటే చెప్పండి’ అనేవారు, మేము  ‘కాదు’ అనడానికి అవకాశం ఇవ్వకుండా. అంత మన్ననగా వుండేది ఆయన వ్యవహార శైలి. తదనంతర కాలంలో ఏకంగా రేడియో, దూర దర్శన్ లను ప్రత్యక్షంగా పర్యవేక్షించే కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు కూడా ఆయన తీరులో ఇసుమంత మార్పును నేను చూడలేదు. 
ఇక ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా  వెంకయ్యనాయుడు గారు పదవీ రీత్యా చాలా బిజీ. కానీ వారికి జర్నలిస్టులు అంటే తగని అభిమానం. అందులోను గతంలో ఈ రంగంలో ఎంతో కాలం పనిచేసి, ఉద్యోగ విరమణ అనంతరం ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్న వయోధిక పాత్రికేయులంటే మరింత వాత్సల్యంతో కూడిన అభిమానం. అందుకే వయోధిక పాత్రికేయ సంఘం సభ్యులం కొంతమందిమి వారిని కలవాలని ఉందనే  ఆకాంక్షను ఉపరాష్ట్రపతి ప్రెస్ సెక్రెటరి శ్రీ మల్లికార్జున్ (ఒకప్పుడు హిందూ పత్రిక విలేకరి) ద్వారా తెలపగానే ఆయన  వెంటనే అంగీకరించారు. ఇచ్చిన సమయానికి ముందే మేము, హైదరాబాదులోని  జూబిలీ హిల్స్ లోఉన్న  వారి నివాస గృహానికి చేరుకున్నాము. తేనీటి వంటి అతిధి మర్యాదలు ఆయనే  స్వయంగా కనుక్కున్న తర్వాత మేము వచ్చిన పని చెప్పాము. ఈ ఏడాది ప్రసిద్ధ సంపాదకులు గోరా శాస్త్రి గారి  శతజయంతి సంవత్సరం. ఈ సందర్భంగా ఆయన స్మృత్యర్ధం ప్రచురించిన ఒక పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరింప చేయాలనేది మా సంఘం తరపున చేసిన అభ్యర్ధన. రెండో మాటకు తావివ్వకుండా అంగీకరించి,  అందుకు సంబంధించిన ఆదేశాలను వ్యక్తిగత సిబ్బందికి అక్కడికక్కడే జారీ చేసి, ‘ఇహ చెప్పండి ఏమిటి విశేషాలు’ అంటూ ముచ్చట్లకు స్వీకారం చుట్టారు. వచ్చిన వారినందరినీ పేరు పేరునా పలకరించి మా పూర్వాశ్రమాలలో మాతో వారి అనుభవాలను, జ్ఞాపకాలను చాలాసేపు గుర్తు చేసుకున్నారు. అవన్నీ ఒకచోట రాయాలంటే పెద్ద వ్యాసమే అవుతుంది. వీలువెంట రాయాలనేది నా సంకల్పం. తరువాత ఇచ్చిన మాట ప్రకారమే  గోరా శాస్త్రి గారి శత  జయంతి కార్యక్రమానికి హాజరై చక్కటి ప్రసంగం చేశారు.
వెంకయ్యనాయుడి గారిని కలిసిన వాళ్ళలో నాతోపాటు శ్రీయుతులు జీ.ఎస్. వరదాచారి, ఉడయవర్లు, లక్ష్మణ రావు,  దాసు కేశవరావు, నందిరాజు రాధాకృష్ణ, శ్రీనివాసరెడ్డి (మాజీ ఈనాడు) ఉన్నాము. 
ఉపరాష్ట్రపతి గా ఎంపిక కావడానికి పూర్వం మోడీ మంత్రివర్గంలో సభ్యుడిగా వున్న కాలంలో హైదరాబాదులో ఏదో కార్యక్రమానికి హాజరయి, జనాల హర్షద్వానాల నడుమ ఆసక్తికర ఉపన్యాసం ముగించుకుని, విమానం టైం అయిందని మధ్యలోనే వెడుతుంటే దారిలో నాకు కనిపించారు. ‘ఎలా వున్నావు శ్రీనివాసరావు’ అంటూ అదే ఆదరణతో కూడిన పలకరింపు. నడుస్తూనే నా గురించి మంచీచెడూ కనుక్కుంటూ కారెక్కి వెళ్ళిపోయారు.
పరిచయం ఉన్నవారిని ఆయన మరచిపోరు. ఆయనతో పరిచయం ఉన్న వారు ఆయన్ని మరచిపోరు.
అలాంటి విలక్షణ వ్యక్తిత్వం వెంకయ్యనాయుడు గారిది.
(ఇంకా వుంది)