20, అక్టోబర్ 2018, శనివారం

మంచితనానికి దైవానుగ్రహం తోడయితే..... భండారు శ్రీనివాసరావు


నిన్న తిరుమలమ్మ మా ఇంటికి వచ్చింది. పోల్చుకోవడానికి కొంత సమయం పట్టిన మాట నిజం.
ఈ అమ్మాయి ఎవరో చెప్పడానికి ముందు కొంచెం నేపధ్యం తెలపడం అవసరం.
1992 లో మేము మాస్కోనుంచి వచ్చేసి హైదరాబాదులో ఇల్లు వెతుక్కుంటున్న రోజులు. వెంట తెచ్చుకున్న అయిదారు సూటుకేసులు మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారి పంజాగుట్ట క్వార్టర్ లో వదిలేసాము. కంటైనర్లో వేసిన మిగిలిన సామాను, రష్యా నుంచి ఓడలో మద్రాసు వచ్చి మళ్ళీ రోడ్డు మార్గంలో హైదరాబాదు చేరడానికి రెండు మూడు నెలలు పడుతుంది. కాబట్టి ఇల్లు వెతుకులాట కార్యక్రమం కాసింత నెమ్మదిగానే సాగింది, హడావిడి లేకుండా.
మా అన్నయ్యగారి ఇంటికి దగ్గరలోనే ఇటు పంజాగుట్ట మెయిన్ రోడ్డు, అటు రాజ భవన్ రోడ్డు నడుమ దుర్గానగర్ అనే కాలనీలో ఓ ఇల్లు దొరికింది. అద్దె పద్దెనిమిది వందలు. వచ్చే సామాను కోసం అంత కిరాయి పెట్టక తప్పలేదు.
మా ఇంటి సందు మొదట్లో ఓ గుడిసెలో  కాపురం ఉంటున్న యాదమ్మ మా  ఇంట్లో పనికి కుదిరింది. మొగుడు మల్లయ్యకు సొంత ఆటో వుంది. ఆ బండే వీరి బతుకు బండికి ఆధారం. ఈ తిరుమల అనే అమ్మాయి యాదమ్మ, మల్లయ్యల కడసారి  కుమార్తె. ఆ దంపతులకు  అందరూ ఆడపిల్లలే. కళ, భాగ్య, సంపూర్ణ,  తిరుమల అందరూ మా ఇంట్లోనే దాదాపు పెరిగారు. బిడ్డల్ని వెంటేసుకుని యాదమ్మ పనికి వచ్చేది. వీళ్ళు కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేవరకు మా ఇంట్లోనే పనిపాటులు చూస్తుండేవారు. కాలక్రమంలో  మేము అనేక ఇల్లు మారుతూ వచ్చినా ఆ కుటుంబం మాత్రం మమ్మల్ని వదిలిపెట్టలేదు. కళకు పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుడితే వారిద్దరికీ మా పిల్లల పేర్లే  సందీప్, సంతోష్ అని పెట్టుకుంది.  సందీప్ ఇప్పుడు తొమ్మిదో తరగతి. ప్రభుత్వ పాఠశాలలో చేరి మంచి మార్కులు తెచ్చుకుంటూ, బాగా చదువుకుంటున్న అతడికి ఈ ఏడాది తెలంగాణా ప్రభుత్వం పదిహేను వేల రూపాయల స్కాలర్ షిప్ కూడా ఇచ్చింది.
మరో అమ్మాయి కుమార్తెకు మంచి సంబంధం దొరికింది. ఆ అబ్బాయికి  ఏదో మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం. నలభయ్  లక్షలు పెట్టి ఫ్లాటు కొనుక్కుని ఆ గృహ ప్రవేశానికి మమ్మల్ని కూడా పిలిచారు. 
మా ఇంట్లో పారాడుతూ పెరిగిన తిరుమలమ్మకు కూడా పెళ్లయింది. కూకట్ పల్లిలో ప్రభుత్వం కేటాయించిన ఫ్లాటులో వుంటున్నారు. మొగుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు.
నువ్వేం చేస్తున్నావని అడిగితే, ‘నేనిప్పుడు పూర్తిగా హౌస్ వైఫ్.  ఇంట్లోనే వుండి నా పిల్లల మంచీచెడూ చూసుకుంటున్నాను’ అంది నవ్వుతూ.
పెద్ద ఆశలు పెట్టుకోకుండా పిల్లల్ని పెంచిన మల్లయ్య దంపతుల ఆశలపై వాళ్ళు నమ్ముకున్న యాదాద్రి నరసింహుడు నీళ్ళు చల్లలేదు. సరికదా, వారిని చల్లగా చూస్తున్నాడు. శుభం!

Discussion on Rahul Gandhi's Telangana Tour | Public Point | Part 1 | AB...



ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ముఖాముఖి చర్చాకార్యక్రమంలో ......

Discussion on Rahul Gandhi's Telangana Tour | Public Point | Part 2 | AB...



ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ముఖాముఖి చర్చాకార్యక్రమంలో ......

19, అక్టోబర్ 2018, శుక్రవారం

సతీమణి అంటే....... భండారు శ్రీనివాసరావు


ఎమ్మెస్సార్ కృష్ణారావు గారు. రేడియోలో నా సీనియర్ కొలీగ్. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు అధికారిగా హైదరాబాదులో, ఢిల్లీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు తెలుగంటే ప్రాణం. ‘మాట్లాడితే ఇంగ్లీష్ లో మాట్లాడండి, లేదా పూర్తిగా తెలుగులో మాట్లాడండి, అంతేకాని  ఇంగ్లీష్  తెలుగు  కలిపి సంకరం చేయొద్దు’ అనేవారు.
‘నా వైఫ్’ అని ఏదైనా చెప్పబోతే ఆయనకు చర్రున కాలేది. ‘నా  వైఫ్ ఏమిటి ఛండాలంగా,  మా ఆవిడ అని హాయిగా  అనొచ్చుగా’ అనేది ఆయన వాదన.
అలాగే ‘సతీమణి’ అనే పదం పట్ల కృష్ణారావు గారికి కొన్ని అభ్యంతరాలు ఉండేవి.
‘సతీమణి అంటే సతులలో మణి అని అర్ధం. రుక్మిణి కృష్ణుడి సతీమణి. ఆయనకున్న అష్ట సతుల్లో ఆవిడ మణి అని. పలానా వారి సతీమణి అని వార్తల్లో చెబితే తప్పు అర్ధం వస్తుంది, ఆయనగారికి ఇంకా వేరే భార్యలు వున్నారని. అలా కాకుండా పలానా వారి భార్య’ అని రాయమనేవారు.

చంద్రబాబుతో మా ఆవిడ పోటీ – భండారు శ్రీనివాసరావు



“చంద్రబాబును చూడండి, ఆ వయసులో ఎలా అలుపు ఎరగకుండా పనిచేస్తున్నాడో. మొన్నీమధ్య అమెరికా వెళ్లి వచ్చాడా. మనమయితే  జెట్ లాగ్ అంటూ రెండ్రోజులు కాళ్ళు మునగతీసుకుని ఇంట్లోనే పడివుంటాం. ఆయన మాత్రం కాళ్ళకు బలపం కట్టుకుని తిరుగుతూనే ఉంటాడు. ఇప్పుడు తిత్లీ తుపాను సంగతి చూడండి, తుపాను రావడం తీరం దాటి వెళ్ళడం మాత్రం జరిగింది కానీ ఆయన ఆల్ మకాం శ్రీకాకుళం జిల్లాలోనే పెట్టి ఎలా అహోరాత్రులు పనిచేస్తున్నాడో. టీవీల్లో చూస్తుంటే ఆశ్చర్యంకలుగుతుంది.  రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తానని అంటుంటే ఏమో అనుకున్నా కానీ నిజమే అనిపిస్తోంది”
ఈ మధ్య మా ఇంటికి వచ్చిన ఒక పెద్ద మనిషి చెప్పుకొచ్చాడు, మా ఆవిడ ఇచ్చిన కాఫీ తాగుతూ చంద్రబాబు గురించి   అనర్ఘలంగా మాట్లాడుతూ.
ఆయనకో సంగతి తెలవదు మా ఆవిడ కూడా రోజుకు పద్దెనిమిది గంటలు, అవసరమయితే మరికొన్ని గంటలు ఎక్కువగా పనిచేస్తుందని. పని చెయ్యకపోయినా, పని లేకపోయినా ఆమెకు తోచదని నాకూ ఆలస్యంగానే తెలిసింది.
‘చూసారా డ్రాయింగు రూములో తేడా’ అంటుంది నేను మధ్యాన్నం నిద్ర లేవగానే. ఈ కొద్ది సమయంలో కొట్టొచ్చిన ఆ తేడా ఏమిటని నేను నిద్ర కళ్ళు మరింత విప్పార్చి చూస్తే ఏమీ కనబడదు.
‘అదే మరి. నిన్న ఫ్లవర్ వాజు ఎక్కడుంది? ఇవ్వాళ ఎక్కడుంది. ఇక్కడ పెట్టి చూసాను, ఎంతో అందంగా కనిపించింది’
కొలను విడిచిన తామరపూలు వాడి పోతాయని సుమతీ శతకంలో చదివా కానీ, ఫ్లవర్ వాజ్ చోటు మారితే లేని అందాలు సంతరించుకుంటుందని నాకు తెలియదు.
‘అవునా’ అనబోయి ఎందుకయినా మంచిదని ‘అవును’ అన్నాను ముక్తసరిగా.
‘పక్కింటి పిన్నిగారు కూడా అలాగే అంది, ఇలా పెడితేనే చాలా బాగుందని’
ఇచ్చిన కాఫీ తాగి బల్ల మీద పెట్టబోతే అదక్కడ కనిపించలేదు. ఏమైందా అని చూస్తే గదిలో మరో మూలకు జరిగి కూర్చుంది.
‘వాస్తు మహిమా?’ అనబోయి ఆగి ఆ నమ్మకాలు ఆమెకు లేవని గుర్తుకొచ్చి, ఇంటి సర్డుడు కార్యక్రమంలో భాగమని జ్ఞాపకంవచ్చి నాలుక మడతేసి సర్దుకున్నాను.
మా ఇంట్లో సోఫాలు ఈ రోజు వున్నట్టు మరురోజు ఉంటాయన్న గ్యారంటీ లేదు. అటూ ఇటూ మారుస్తూ వాటితో చెడుగుడు ఆడడం మా ఆవిడకో సరదా. మంచాలు జరుగుతాయి. తలగడలు  అటువి ఇటవుతాయి. టీవీ దిక్కు మార్చుకుంటుంది. పూలకుండీలు, బట్టల బీరువాలు, పుస్తకాల అరమరాలు, డైనింగు టేబులు ఏవీ నాల్రోజుల పాటు ఒక్క తీరున, ఒక్క జాగాలో వుండవు. వంటిల్లు సరేసరి. అది ఆవిడ సొంత సామ్రాజ్యం.
‘ఆ గోడ మీద వినాయకుడి పెద్ద పటం అక్కడ బాగా అనిపించడం లేదు, ఎవరయినా వచ్చినప్పుడు ఎదురుగా కనిపిస్తే బాగుంటుంది.’ తనలో తాను అనుకుంటున్నట్టుగా పైకే అనేసింది.
నాకు అనిపించింది, బ్రహ్మ రుద్రాదులు కూడా ఆ వినాయకుడి స్థానచలనాన్ని ఇక ఆపలేరని.
మొన్నటికి మొన్న మా అమ్మగారి ఆబ్దీకం, ఆ తర్వాత వరలక్ష్మీ వ్రతాలు, వినాయక చవితి, ఇప్పడు దేవీ నవరాత్రులు, లలితా సహస్రాలు, ఇవన్నీ ఒక్క చేత్తో సంభాళిస్తూనే మళ్ళీ ఇలా తెచ్చి పెట్టుకున్న పనులు. అలసట అనేది ఈ మనిషికి లేదా ఉండదా అనిపిస్తుంది.
అలాగే మరోటి కూడా అనిపిస్తుంది.
ఇందులో పనికొచ్చే పనులెన్ని? పనికిరానివెన్ని?
పని కోసం పనిచేయడమా? పనికొచ్చే పనిచేయడమా?
అడగడానికి మా ఇంట్లో అసెంబ్లీ లేదు.      

17, అక్టోబర్ 2018, బుధవారం

ఏవిటి లాభం అంటే అదే లాభం – భండారు శ్రీనివాసరావు

‘ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నన్ను కష్టపెట్టడానికే పుట్టారు’ అనేది ఓ నలభయ్ ఏళ్ళ క్రితం నాకున్న ఓ నిశ్చితాభిప్రాయం.
అది చిన్నప్పుడు బలవంతాన కలరా సూదిమందు ఇచ్చిన సర్కారు మనిషి కావచ్చు, అడిగిన అప్పచ్చులు వెంటనే పెట్టలేదని నేను కోపం పెంచుకున్న మా బామ్మ కావచ్చు, హోం వర్కు చేయలేదని నా వీపు వాయగొట్టిన లెక్కల మాస్టారు కావచ్చు, దాచిపెట్టుకున్న గోలీలు కాజేసిన నా బెస్టు ఫ్రెండు కావచ్చు ఇలా ఈ డెబ్బయి ఏళ్ళ పైచిలుకు సాగిన నా ఈ జీవితంలో, ప్రతి దశలో ఎవరో ఒకరు నన్ను కష్టపెడుతూనే వచ్చారని అదేమిటో ఓ పిచ్చి నమ్మకం. ఆ నమ్మకంతోనే వాళ్ళతో పెరుగుతూ విరుగుతూ వచ్చిన మానవ సంబంధాలు.
ఇన్నేళ్ళ తరవాత ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఏమిటో అంతా విష్ణుమాయ.
‘ఈ లోకంలో ప్రతి ఒక్కరూ నన్ను సుఖపెట్టడానికే పుట్టారు’ అనేది కొత్తగా మొగ్గ తొలుస్తున్న భావన.
అది పొరుగింటివారు కావచ్చు, ఆటో డ్రైవరు కావచ్చు, ఇంట్లో పొద్దున్నే పత్రికలు వేసే పేపరు బాయి కావచ్చు, ఇలా ఎందరెందరో వాళ్ళ సుఖాల్ని వదులుకుని నన్ను సుఖపెడుతున్నారనే అభిప్రాయం నాలో నాకే ఒక కొత్త మనిషిని చూపిస్తోంది.
ఈ ఎరుక నలభయ్ ఏళ్ళ క్రితమే కలిగివుంటే ఈనాడు నాకు ఎటు చూసినా మంచి మిత్రులే వుండేవాళ్ళు. అలాంటి విలువయిన సంపదను నేనే చేతులారా పోగొట్టుకున్నానన్నమాట.
ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం?


‘ఏం లాభం అనే ప్రశ్నే శుద్ధ వేస్టు. మనిషి ఆలోచనా ధోరణి మంచిగా మారడం అనేది ఏ వయస్సులో జరిగినా అది లాభమే. నీకే కాదు, నీ చుట్టూ వున్న సమాజానికి కూడా’ అన్నాడు మా మేనల్లుడు రామచంద్రం.