12, ఆగస్టు 2017, శనివారం

బాల్యం నుంచి బాధ్యతల తుది అంచుల దాకా......(11)



భండారు వంశం – శ్రీ పర్వతాలరావు అముద్రిత రచన 

మా తాతగారు పర్వతాలయ్య గారికి చిన్నతనంలోనే పెండ్లయింది. పెండ్లిలో కూడా మా బామ్మ ఆయనపై పడుకుని నిద్రపోయిందట. పొలిమేర మీద ఊళ్ళు కావడం వల్ల బాగా రాకపోకలు ఉండేవి. ఇద్దరూ కలసి ఆడుకునేవారట. మా బామ్మగారు సమర్త కాకపూర్వమే గర్భం ధరించిందట. మా నాన్నగారు పోయినప్పుడు చెల్లమ్మమ్మ ఎంతో దుఃఖపడింది. ఆ ఏడుపులోనే,  ఇదిగో ఈకధ,  ఆమె నోట మొదటిసారి బయటకు వచ్చింది. అలా పిల్లలు పుట్టడం దోషం అని, పుట్టగానే,  రోజుల బిడ్డగా వున్న మా నాన్నగారిని ఎరుకల బూశామ (బూశమ్మ)కు దానం ఇచ్చారట. ఆమె పిల్లవాడిని తన గుడిసెకు తీసుకుపోయింది. తరువాత ఆ పసివాడిని గంపలో పెట్టుకుని పండ్లోయమ్మ పండ్లుఅంటూ భూశమ్మ వూళ్ళో  తిరుగుతుంటే, చెల్లమ్మగారు వెళ్లి,  ‘మాకు ఓ పండు కావాలి అమ్ముతావాఅని అడిగి,  సోలెడు సజ్జలు భూశామకు ఇచ్చి పిల్లవాడిని కొనుక్కుని ఇంటికి తీసుకు వచ్చిందట. అలా, ఆ దోష పరిహారం జరిగిందన్నమాట. మా నాన్నగారు తన 53వ ఏటనే చనిపోయారు. మా తాతగారు, ముత్తాత గారు సుమారుగా అదే వయస్సులో పోయారు. మొదటి పర్వతాలయ్య గారిని కూడా ఆ వయస్సులోనే  హత్య చేసారు. అప్పయ్య గారి సంగతి తెలియదు. బహుశా షష్టిపూర్తి చేసుకున్నారేమో. అలా జరిగివుంటే, ఆయన తరువాత, నా వూహ ప్రకారం, మొదటి వరుస సంతానంలో షష్టిపూర్తి చేసుకున్నది నేనేనేమో(అంటే, మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు). నందిగామలో జనన మరణ రిజిష్ట్రార్ కార్యాలయానికి వెళ్లి తేదీలు పట్టుకుంటే కాని ఈ విషయం గట్టిగా చెప్పలేము.

పర్వతాలయ్యగారికి పెద్ద మీసాలు ఉండేవి. వెనుక జుట్టు ముడి వుండేది. సింహలలాటం మురుగులు ధరించేవారు. మిత భాషి. అయినా చమత్కారంగా మాట్లాడేవారు. సౌమ్యుడు, సాత్వికుడు. కానీ ఒక్కోసారి తీవ్రంగా కోపం వచ్చేది. ఏదీ మనసులో ఉంచుకునే తత్వం  కాదు. ఆయన చివర దశలో కాళ్ళు చచ్చుపడ్డాయి. దాదాపు పది పన్నెండేళ్ళు మంచం మీద కూర్చునే కరణీకం చేసారు. ఆయనకు ఎనిమిదవ ఏట పెళ్లయింది. అప్పుడు మా బామ్మ రుక్మిణమ్మ గారికి నాలుగేళ్ళు.
ఆమె తండ్రి కాకరవాయి (కాకరాయి) వాస్తవ్యులు, కందిబండ చిదంబరం గారు. తల్లి చెల్లమ్మ గారు. చిదంబరంగారు చనిపోయేనాటికి మా బామ్మ ఒక్కతే  కూతురు. చెల్లమ్మగారికి అప్పటికి ఇంకా పదహారేళ్ళు కూడా నిండలేదు. భర్త పోయిన తరువాత  కొన్నాళ్ళకు చెల్లమ్మ గారు కాకరవాయి లోని తమ వాటా ఇల్లూ, పొలాలు అమ్మేసుకుని పదివేల రూపాయలు తెచ్చి మా నాన్నగారికి ఇచ్చిందట. బహుశా 1929, 1930 ప్రాంతాల్లో అయివుండవచ్చు.  ఆ సొమ్ముతోనే మా నాన్నగారు ప్రస్తుతం వున్న మా ఇల్లు కట్టారని అంటారు. చెల్లమ్మగారు అప్పటినుండి మా ఇంట్లోనే వుండేది. ఆమె భాగవతం నిత్య పారాయణ చేసేది. భారతం, భాస్కర రామాయణం, కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం కూడా చదువుతూ వుండేది. అయితే ఆమెకు రాయడం బొత్తిగా రాదు. చదువుకున్నవారికే వోటు హక్కు అని ఆరోజుల్లో ఒక రూలు వచ్చిందట. మా నాయనమ్మమ్మ చెల్లమ్మగారికి కాని, మా నాయనమ్మ రుక్మిణమ్మ గారికి కాని, మా అమ్మగారు వెంకట్రావమ్మ గారికి కాని చదవటం చక్కగా వచ్చు కాని రాయడం రాదు. అందుకని వాళ్ళందరికీ తమ పేర్లు (సంతకం) రాయడం వరకు నేర్పించారట.

మా చిన్నతనంలో చిట్టేల కోటయ్య పంతులు గారు తన దగ్గర చదువుకునే పిల్లల్ని,  ఇంటి దగ్గర కూడా చదివినట్టు వాళ్ళ పెద్దవాళ్ళచేత పలకపై రాయించుకుని రమ్మనేవారు. మేం చెల్లమ్మగారికి చదివినాడుఅనే పదం రాయడం నేర్పాము. ఆమె పలక మీద అదే రాసి ఇచ్చేది. సామాన్యంగా ఇంటికి వచ్చిన తరువాత మళ్ళీ పుస్తకం పట్టుకునే అలవాటు  లేదు. అది చూసి చెల్లమ్మగారు ఇవ్వాళ  మీరు చదవలేదుఅని రాస్తానని మమ్మల్ని బెదిరించేది. కాని అల్లా రాయడం ఆమెకు రాదని మాకు తెలుసు. చాలా మెత్తని మనిషి కనుక చదివినారుఅనే రాసిచ్చేది. ఆమె  దాదాపు  95సంవత్సరాలు జీవించింది. చక్కిలాలను నమలగలిగే దంత పటిమ వుండేది. మనిషి బాగా వంగిపోయినా ఎప్పుడు నవిసిన దాఖలాలు లేవనే చెప్పాలి. ఆఖరి రోజున కూడా కాలకృత్యాలు తీర్చుకునేందుకు మనుమరాళ్ళు ప్రేమ,భారతి సాయంతో దొడ్లో చింతచెట్టు వరకు చేతి కర్ర పొడుచుకుంటూ  నడిచి వెళ్లి వచ్చింది. పండ్లు తోముకుంటూ పక్కకు వాలిపోయి   అనాయాసంగా మరణించింది. ఆమె మరో రెండు రోజులకు పోతుందనగా నాకు (భండారు పర్వతాలరావు) లా కాలేజీ తెరవడం వల్ల హైదరాబాదు ప్రయాణం అయ్యాను. ఆమెకు దండం పెట్టడానికి వెడితే రెండు రోజులు తాళు (ఆగు)అంది. నేను ప్రయాణం మానేసాను. సరిగ్గా రెండో రోజునే  ఆమె మరణించింది. అంతకు ముందు రాత్రి కూడా రోజు మాదిరిగానే గజేంద్ర మోక్షం లోని పద్యాలు పొద్దు పోయిందాకా చదివి పండుకుంది. 

(భండారు పర్వతాలరావు)

(ఇంకావుంది)

11, ఆగస్టు 2017, శుక్రవారం

బాల్యం నుంచి బాధ్యతల తుది అంచుల దాకా......(10)



భండారు వంశం – శ్రీ పర్వతాలరావు అముద్రిత రచన

ఆరోజుల్లో  పుట్టి ధాన్యం రూపాయాకో రెండుకో అమ్ముడయ్యేది. పంటలన్నీ వర్షాధారం. ధరలు లేవు. దానితో చాలామంది రైతులు శిస్తు కట్టలేక పొలాలు వొదిలేసి వెళ్లిపోయారట.  అప్పటి నిబంధనల ప్రకారం ఆ శిస్తు తాను  చెల్లించి ఆ పొలాలను రామయ్య గారు తీసుకున్నారట. ఆయనకు కరిణీకంచేసినందుకు లభించే జీతం నెలకు మూడో నాలుగో రూపాయలు. అవేం చేయాలో తెలిసేది కాదు.  వస్తువులు అన్నీ గ్రామంలోనే  లభించేవి. దాంతో జీతం రూకలను గూట్లో గిరవాటు వేసేవారట. అలా గూట్లో పడివున్న రూపాయలు,  శిస్తు కట్టలేని రైతుల పొలాలు కొనుక్కోవడానికి అక్కరకు వచ్చాయట.
రామయ్య గారు చాలామందికి ఆశ్రయం కల్పించారు.  ఒకసారి ఆయన వాకిట్లో అరుగు మీద కూర్చుని మొహం కడుక్కుంటూ వుంటే ఒక రైతు  వచ్చాడట. ‘ఎక్కడికి’ అని అడిగితె ‘ఎక్కడ పని దొరికితే అక్కడికి’ అని అన్నాడట. ‘నీకెంత పొలం కావాలో తీసుకో ఇప్పిస్తా. ఇక్కడే వుండిపో ‘ అన్నాడట రామయ్య గారు. ఆ రైతు ఎవ్వరో కాదు ప్రస్తుతం వూరి మోతుబరుల్లో ఒకరయిన  శ్రీ బండి సత్యనారాయణ పూర్వీకుడు. శ్రీ సత్యనారాయణ నేనూ (అంటే, పర్వతాలరావు)  మా వూరి వారిలో మొట్టమొదటి గ్రాడ్యుయేట్లం. నేను చదువు పూర్తయిన తరువాత ఉద్యోగాల్లో ఉండిపోయాను. బండి సత్యం బియ్యే  మాత్రం వ్యవసాయం చేసుకుంటూ ఊళ్లోనే ఉండిపోయాడు. అది వేరే కధ.
అలాగే వేమిరెడ్డివారికి ‘మీరెంత అడవి కొట్టుకుంటే  అంత పొలం ఇస్తానని’ చెబితే వాళ్ళు అడవి నరికి పొలం చేకుంటూ కంభంపాడులోనే వుండిపోయారు. రామయ్యగారి కాలంలో  ప్రస్తుతం వేమిరెడ్డి వంశం వాడయిన ఓబుల్ రెడ్డి( నరిసిరెడ్డి దత్తత కుమారుడు) చామర్తి వీరభద్ర రావు గారు, భండారు కామాక్షమ్మ గారు, భండారు రామకృష్ణయ్య గార్ల ఇండ్ల స్థలాలన్నీ ఆయనవే. భండారు సీతారామయ్య గారు తన కూతురు రాజమ్మ గారిని మా పెద్ద మేనమామ కొండపల్లి శ్రీ రామచంద్రరావుకు భార్య చనిపోతే రెండో సంబంధం ఇచ్చారు. మా మేనమామ కృష్ణారావు మరణానంతరం ఆయన విజయవాడకు మకాం మార్చారు.  తరువాత కంభంపాడులోని పొలాలు, ఇళ్ళ స్థలం అమ్మేసుకున్నారు. ప్రస్తుతం మా ఇంటికి ఐ మూలగా ఓబులరెడ్డి ఇల్లున్న స్థలం రామయ్య గారిదే.
ఇంగువ వారి పూర్వీకులకు ఆశ్రయం కల్పించింది కూడా ఆయనే. ఈరోజుల్లో ఇండ్ల స్థలాలు, పొలాలు ఇప్పించడం అనేది మంత్రులు కూడా చేయలేని పని. మంత్రివర్గం చేయగలిగే ఈ పనులను ఆ రోజుల్లో గ్రామ కారణాలు చేయగలిగేవారు. అదీ నోటి మాటతో.
రామయ్య, లక్ష్మయ్య గార్ల హయాంలోనే వారికీ, వారి చిన తాత రామలింగయ్య (కోర్టు తీర్పులో  లింగయ్య అనే వుంది ) కుమారుడు చినకామయ్య గారికీ దావా నడిచింది. బెజవాడ డిస్ట్రిక్ట్ మునసబు కోర్టులో నడిచిన ఈ దావాలో వాది చిన కామయ్య కాగా ప్రతివాదులు రామయ్య, లక్ష్మయ్యలు. దావా పర్యవసానం ఎలా వున్నా, దానికి సంబంధించిన కోర్టు తీర్పులో భండారు వంశం వారి పూర్వీకుల పేర్లు వివరంగా పేర్కొనడం జరిగింది.
రామయ్య గారి భార్య శేషమ్మ గారు. ఆమె దాదాపు ఎనభయ్ ఏళ్ళకు పైగా బతికింది. రామయ్య గారి దంపతులకు ముగ్గురు కుమారులు. పర్వతాలయ్య, లక్ష్మీ నారాయణ, వెంకట సుబ్బారావు. కుమార్తెల సంగతి స్పష్టంగా తెలియదు. కొడుకులలో పెద్దవాడయిన పర్వతాలయ్య గారిదే కరిణీకం. చాలా కాలం అంతా కలిసే వున్నారు. అప్పుడు మా ఇల్లు ఉత్తర ముఖంగా వుండేదిట. ప్రస్తుతం సుబ్బయ్య తాతయ్య జాగాలోకి వున్న బేస్ మట్టం, మెట్లు అప్పుడు ఇంటికి సింహ ద్వారం వైపు ఉండేవి.  ఆ ఇల్లు అగ్ని ప్రమాదానికి ఆహుతి కావడం వల్ల మా నాన్నగారు రాఘవరావు గారు ఇప్పుడున్న ఇంటిని నిర్మించారు. కొద్దిగా  కాలిన దూలాలను కొన్నింటిని కొత్త ఇంటి నిర్మాణంలో వాడారు. జాగ్రత్తగా పరికించి చూస్తే ఆ ఆనవాళ్ళు ఇప్పటికీ కానవస్తాయి. ఆ  ఇల్లు కట్టినప్పుడు మా తాతగారు పర్వతాలయ్య గారు బతికే వున్నారు. వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు వేర్లు పడ్డారు. లక్ష్మీనారాయణ గారు కొండారెడ్డి జాగా కొనుక్కుని వేరే ఇల్లు కట్టుకున్నారు. సుబ్బయ్య గారు మా ఇంటి పక్కనే ఒక పూరిల్లు వేసుకుని వుంటూ వుండేవారు. ఆ రోజుల్లో ఊళ్ళోకి తాసీల్దారు  రావడం అంటే గొప్ప విషయం. వూరికి వచ్చిన తాసీల్దారు పొలాల వెంట తిరుగుతూ అడంగల్ లో రాసిన విధంగా పంటలు వాస్తవంగా వేసేవారో  లేదో ప్రత్యక్షంగా తనిఖీ చేసేవాడట. అందుకోసం ఆయన దర్జాగా మేనాలో వెడుతుంటే  కరణం, మునసబులు ఆ మేనాకు చెరో వైపు వెంట పరిగెత్తుతూ పంటల వైనం, సర్వే నెంబర్లు వివరించేవారట. అప్పుడు అందరికీ గుర్రాలు ఉండేవి. ప్రయాణాలు ఎక్కువభాగం కాలినడకనా, గుర్రాల మీదా సాగేవి. ఆడవాళ్ళు  మేనాలో గాని ఎద్దు బండ్లపై గాని ప్రయాణం చేసేవారు. మోతుబరులు, కరణాలు గుడిసె బండ్లలో వెడితే, సంసారులు(రైతులు) జల్ల బండ్లలో వెళ్ళే వాళ్ళు. బండ్ల ప్రయాణాల్లో జీతగాళ్ళు ఎడ్ల తాళ్ళు పట్టుకుని ముందు  నడుస్తుంటే వెనుక వెట్టివాళ్ళు (వాళ్ళు గ్రామోద్యోగులయినా వెట్టివాళ్లనే పేరు పోలేదు. ఒకప్పుడు వాళ్ళు వెట్టి చాకిరీ చేస్తూ బతికేవాళ్ళు. మోతాదు, వెట్టి వాడు అని పిలిచేవాళ్ళు. మా నాన్నగారివద్ద  అలాటివాళ్ళు ముగ్గురు వుండేవాళ్ళు. ఇప్పుడు వారికి సమాజంలో గౌరవం లభించేలా వారి ఉద్యోగ హోదాలు మార్పు చేయడం అభిలషణీయం)

బండ్లు వెడుతున్నప్పుడు వడ్డేరకాలు (బాటలో ఎత్తుపల్లాలు) వచ్చినప్పుడు బండి పడిపోకుండా వాళ్ళు బండి చక్రం పట్టుకుని బరువానేవాళ్ళు.  వానాకాలం దోవ బురదగా వుండి బండి చక్రాలు కూరుకుపోతాయనే భయంతో ఒక్కొక్క బండికి రెండేసి జతల ఎడ్లను కట్టే వాళ్ళు. అసలా రోజుల్లో కరణాలు తప్ప ఎవరూ  బండ్లు కట్టి ప్రయాణాలు చేసేవాళ్ళు కాదు. వ్యవసాయప్పని చెడుతుందని కొంతా, ఎడ్లు దెబ్బతింటాయని కొంతా  భయం. (ఇంకా వుంది)


(భండారు పర్వతాలరావు)

10, ఆగస్టు 2017, గురువారం

బాల్యం నుంచి బాధ్యతల తుది అంచుల దాకా......(9)


భండారు వంశం – శ్రీ పర్వతాలరావు అముద్రిత రచన
“కంభంపాడు గ్రామం కృష్ణాజిల్లాలోది. (లోగడ ఇది నందిగామ తాలూకాలో వుండేది. తాలూకాల రద్దు, మండల వ్యవస్థ ఆవిర్భావం తరువాత మా గ్రామం వత్సవాయి మండలంలో చేరింది). ఈ గ్రామ చరిత్ర తెలుసుకోవడానికి ఆధారాలు లేవు. గ్రామంలో వున్న శ్రీ రాజలింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కట్టించారని చెబుతారు. అదే ప్రాంగణంలో ఆంజనేయ స్వామి గుడి కూడా వుంది. ఇక్కడ మొదట్లో గుడి వుండేది కాదనీ, భండారు పర్వతాలయ్య గారి హయాములో వారూ, వారి సోదరులు కలిసి ఈ గుడి నిర్మించారని కూడా చెబుతారు. ఈ గుడి కాక, వూరి బయట మా తాతయ్య గారు సుబ్బారావు గారు నిర్మించిన ఆశ్రమంలో ముక్తినాధ స్వామి ఆలయం వుంది. శిధిలావస్థకు చేరిన ఈ గుడిని శ్యాం ప్రసాద్ బ్రహ్మచారి అనే స్వాములవారు పునరుద్ధరించారు. ఈ స్వామి వారే, ఆ ఆశ్రమంలో ఒక వేద పాఠశాలను సైతం నిర్వహించేవారు. కొత్తూరు (కొత్త వూరు)లో ఆంజనేయ స్వామి ఆలయాన్ని అక్కడి రైతులు నిర్మించారు. తరువాత ఆ వూరు ఖాళీ అయినా, ఆలయంలో మాత్రం నిత్య పూజాదికాలు నిర్వహిస్తున్నారు. ఇవికాక, మా వూరిలో ముత్యాలమ్మ గుడి వుంది.


(భండారు పర్వతాలరావు)

మా చిన తాతగారు భండారు లక్ష్మీనారాయణ గారు దాచివుంచిన 1878 వ సంవత్సరం నాటి కోర్టు తీర్పు ప్రతిలో వారి తండ్రి రామయ్య, పినతండ్రి లక్ష్మయ్య గార్ల పేర్లను ‘రామయ్య కులకర్ణి, లక్ష్మయ్య కులకర్ణి’ అని ఉదహరించడం కనిపించింది. భండారు వంశీకులు మహారాష్ట్ర నుంచి వచ్చారా అనే అనుమానానికి దీనివలన కొంత ఆస్కారం చేకూరుతోంది. ‘కులకర్ణి’ అనేది ఆరోజుల్లో గ్రామాధికారి పదవి. అయినా, అది మహారాష్ట్ర నుంచి వచ్చిందే. దేశముఖ్, దేశపాండేల మాదిరిగా గ్రామాల్లో శిస్తు వసూలుచేసి పెట్టే అధికారం వారికి వుండేది. ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో చాలా ఊళ్ళల్లో కులకర్ణి వ్యవస్థ దాఖలాలు కనిపిస్తాయి.
ఒకసారి ముత్యాలమ్మ గ్రామ దేవత, పర్వతాలయ్య గారి కలలోకి వచ్చి ‘బందిపోట్లు వూరి పైకి రాబోతున్నారని’ హెచ్చరించిందట. వెంటనే అంతా గ్రామం వొదిలి తప్పుకున్నారట. బందిపోట్లకు ఏమీ చిక్కలేదు. అందుకని కోపించి వారు ముత్యాలమ్మ దేవతను గడ్డపారతో పొడిచి పగులగొట్టారని అంటారు. వెంకటస్వామి అనే అతను ముత్యాలమ్మకు చిన్న గుడి కట్టించాడు. వూరికి తూర్పున పొలిమేర మీద జమ్మి చెట్టు కింద ఎండ పల్లెమ్మ అనే ఓ అమ్మవారి విగ్రహం కూడా వుంది.
“వీరేశం గారికి నలుగురు కొడుకులు. కూతుళ్ళ సంగతి వంశవృక్షం గాని, కోర్టు తీర్పులు కాని చెప్పడం లేదు. కొడుకులు: రాజయ్య(రాజన్న).అప్పయ్య, రామలింగయ్య (లింగయ్య), బసవయ్య.
“రాజయ్యగారికి కనకయ్య (ఈయనకు వీరేశలింగం అనే పేరు కూడా వుంది). రాజయ్య (రాజన్న) అని ఇద్దరు కొడుకులు. వారిద్దరూ అవివాహితులుగా, నిస్సంతుగా చనిపోయారని కోర్టు తీర్పులో వివరించారు.
“అప్పయ్యగారికి చాలాకాలం సంతానం లేదు. దానిపై ఆయన, శ్రీశైలం వెళ్లి అక్కడ మల్లిఖార్జున దేవాలయ ప్రాంగణంలో వున్న సంతానవృక్షానికి ప్రదక్షిణాలు చేసి వచ్చారట. తరువాత ఆయనకు ఒక కుమారుడు కలిగాడు. ఆయనకు శ్రీ పర్వతం (శ్రీ శైలం) పేరిట పర్వతాలయ్య అని పేరు పెట్టుకున్నారు. ఈయనే పర్వతాలయ్య -1 (కోర్టు తీర్పులో పర్వతాలు అనే వుంది). ఈయన కంభంపాడు గ్రామ కరిణీకం చేస్తూ వచ్చారు. ఆయనకూ, గ్రామంలోని కమ్మ రైతు పెద్దలకు ఒకసారి కచేరిసావిడిలో కొంత వాగ్వాదం జరిగిందట. అప్పుడు అంతా బొడ్లో పేష్ కప్ (ఒకరకం చిన్న చాకు) పెట్టుకుని, తలపాగాలు చుట్టుకుని వచ్చేవారట. పర్వతాలయ్య గారు ఈకకలంతో ఏదో రాసుకుంటున్నారు.ఏదో మాటామాటా వచ్చి ‘మా కత్తి గొప్పా, నీ కలం గొప్పా’అని అడిగారుట. ఆయన ‘నా కలమే గొప్ప’ అనడంతో మాటకు మాట పెరిగింది. సరసం విరసం అయింది.వాళ్ళు ఇళ్ళకు వెళ్లి, వరిగడ్డి, కుండల్లో చద్దన్నాలు బండ్లలో పెట్టించుకున్నారట. ఆ పళానవెళ్లి, అర్ధరాత్రి పర్వతాలయ్య గారిని లేపి, దొడ్లో చింతచెట్టు కిందకి తీసుకుని వెళ్లి, కత్తితో పొడిచి హత్య చేసారు. ముఖ్యంగా కుడి చేతిపైనా, నాలికపైనా పొడిచారట. కొనవూపిరితో వుండగా ఎవరయినా వచ్చినా తమ పేర్లు చెప్పకుండా ఉండడానికి అలా చేశారుట. తరువాత బండ్లు కట్టుకుని నైజాం లోకి పారిపోయారుట. ఆయన భార్య (పేరు వెంకమ్మగారని గుర్తు) ఏడుస్తుంటే పర్వతాలయ్యగారు ఆ నెత్తురుతోనే, ‘నా’ , ‘కా; అనే అక్షరాలు రాసారుట.‘నా’ అంటే నారాయణ అనీ, ‘కా’ అంటే కామయ్య అనీ అందరికీ అర్ధం అయింది. కాని, పోలీసులు వచ్చి అడిగితే పర్వతాలయ్యగారి భార్య ఎవరి పేరు చెప్పలేదట. (బహుశా చెబితే వాళ్ళు పగబట్టి పిల్లలకు హాని తలబెడతారన్న భయంతో కావచ్చు) ‘ఎవరి పాపాన వాళ్ళే పోతారు. నాకేం తెలియదు. చీకటి. ఎవరూ కనబడలేదు’ అన్నదట. అప్పుడామెకు ఇద్దరు కొడుకులు. రామయ్య, లక్ష్మయ్య. రామయ్యకు పన్నెండేళ్ళు. అయినా, ‘మీ తండ్రి కరణీకం ఇస్తా చేస్తావా?’ అని తాసీల్దారు అడిగితే, ‘చేస్తాన’ని దస్త్రం తీసుకున్నాడట. “ఆరోజుల్లో కరిణీకం ఉద్యోగానికి మేజరయి ఉండాలన్న నియమం లేదన్నమాట. రామయ్య గారి హయాంలో కుటుంబం ఆస్తి బాగా పెరిగింది. వూళ్ళో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన పోయేసరికి మూడువందల ఎకరాల పొలం వుండేది.తన తమ్ముడు లక్ష్మయ్యను ఆయన రాజయ్యకు దత్తు ఇచ్చారు. లక్ష్మయ్య కొడుకు నాగభూషణం కాశీకి వెళ్లి అక్కడ గతించాడు. అప్పుడు మళ్ళీ తన రెండవ కొడుకు లక్ష్మీనారాయణను ఆయన భార్య చుక్కమ్మగారికి దత్తు ఇచ్చారు. కొందరు బంధువులు నాగభూషణం మృతి విషయమై అనుమానాలు వ్యక్తం చేశారట. అవన్నీ తరువాత సమసిపోయాయి. (ఇంకా వుంది)

బాల్యం నుంచి బాధ్యతల చివరంచుల దాకా.....(8)


పర్వతాలరావు గారి భండారు వంశం
మా వంశం గురించి మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు తన జీవితకాలంలోనే అనేక విషయాలు సేకరించి పెట్టారు. వాటినే యధాతధంగా ఇక్కడ పొందుపరుస్తున్నాను.- భండారు శ్రీనివాసరావు 


(భండారు పర్వతాలరావు) 
  
భండారు వంశం ఎప్పుడు మొదలయిందో ఇదమిద్ధంగా చెప్పడం కష్టం. దీనిని గురించి కొంత పరిశోధన చేసిన శ్రీ భండారు చంద్ర మౌళీశ్వరరావు గారు  న్యాయవాది, రచయిత కూడా. వీరిది వరంగల్లు. ఈ విషయంలో వారు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడదు. శ్రీ భండారు నాగభూషణ రావు (నిజాం షుగర్స్ లో పనిచేశారు.  కీర్తిశేషులు. అసలు వేములపల్లి స్వగ్రామం) చెప్పినదాన్నిబట్టి బసవేశ్వరుడు ఈ వంశానికి ఆదిపురుషుడని తెలుస్తోంది. కొందరు అక్కన్న కూడా ఈ వంశం వాడేనని  అంటున్నారు.
వంశ  నామాలలో చాలా భాగం వూరి పేర్లు కనిపిస్తాయి. కొడవటిగంటి (కొడవటిగల్లు) మాగంటి (మాగల్లు), వేములపల్లి, తుర్లపాడు మొదలయినవి ఇందుకు ఉదాహరణ. అయితే భండారు అనే పేరు తెలుగునాట ఊరికీ లేదు. మహారాష్ట్రలో భండారి అనే బస్తీ వుంది. ఛత్రపతి శివాజీ దండయాత్రల సమయంలో అక్కడినుంచి కొందరు బ్రాహ్మణులు ఆయనతో పాటు ఆంద్ర దేశం వచ్చి అక్కడక్కడా స్థిరపడినట్టు తెలుస్తోంది. వారిని, భండారి వారని, భండారు   వారని పిలిచే అవకాశం లేకపోలేదు.
భండారు  అన్న వంశనామ పుట్టుపూర్వోత్తరాల సంగతి తెలియకపోయినా కంభంపాడు  గ్రామానికి భండారు వంశీకులు మొదట ఎలా వచ్చారు అన్న సంగతిపై మాత్రం తగిన ఆధారాలు లభించాయి. నేను (పర్వతాలరావు గారు) విజయవాడలో చదువుకునేటప్పుడు, అంటే 1953 ప్రాంతంలో మా చిన తాతగారు భండారు వెంకట సుబ్బారావు గారు  మా స్నేహితుడు శ్రీ గోనుగుంట్ల విశ్వనాధంతో  తనకు గుర్తున్నంత వరకు మా వంశ వృక్షం రాయించారు. నేను కూడా రాసుకుంటానంటే,  ‘ఎవరి వంశవృక్షాన్ని వాళ్ళు రాసుకోకూడదు. అలా  రాసిన వారికి సంతానం కలగదంటారుఅని  చెప్పి వారించారు. ఆ తరువాత మా చిన తాతగారు లక్ష్మీనారాయణ గారింట్లో మా వంశవృక్షం కాపీ ఒకటి వుందని ఆయన మునిమనుమడు భండారు సుధాకర రావు చెప్పగా నేను వెళ్లి దాని నకలు రాసుకొని వచ్చాను.  ఈ రెండూ కాక, పైన చెప్పిన కోర్టు తీర్పు కాపీలో కూడా ఆ వివరాలను  పేర్కొన్నారు. కంభంపాడుకు  సంబంధించినంత వరకు ఈ ఆధారాలతో చాలావరకు వంశ వృక్షాన్ని నిర్ధారించుకునే  అవకాశం కలిగింది.
కానీ వీటిని బట్టి వూరి చరిత్ర తెలుసుకునే వీలు తక్కువ. అయితే చాలా ఏళ్ళుగా వున్న  గ్రామం అని చెప్పవచ్చు.  స్తంభము ప్రోలుఅన్నది కంభం పాడు  అన్న పేరుకు మూలం కావచ్చు. లేదా స్థంభం పహాడ్కాలక్రమంలో కంభంపాడు కావచ్చు. కానీ ఈ గ్రామానికి సమీపంలో స్థంభం కానీ, పహాడ్ కానీ లేవు. ఇక్కడ లోగడ ఏదయినా జయస్థంభంలాంటిది వుంటే, స్థంభం ప్రోలు లేక కంభంపాడు అనే పేరు వచ్చి ఉండవచ్చు.  ఆ రోజుల్లో ఇలాటి జయ స్తంభాలను చాలాచోట్ల నెలకొల్పి వుంటారు. కనుక కంభంపాడు అన్న పేరుతొ చాలా గ్రామాలు కనిపిస్తాయి. మధిర దగ్గర ఒకటి, తిరువూరు దగ్గర ఒకటి, అమరావతి దగ్గర వైకుంఠ పురం దగ్గర మరోటి వున్నాయి. గ్రామ చరిత్రను తెలుసుకోవాలంటే బందరు వెళ్లి జిల్లా కలెక్టర్ ఆఫీసులో పురాతన పత్రాలను శోధించాల్సి వుంటుంది.

కంభంపాడుకు  భండారు వారు రావడం గురించి వంశ వృక్షంలో కాని, కోర్టు తీర్పులో కాని, వివరాలు అంటే తేదీలు వగయిరా  పేర్కొనలేదు. వాడేల రామరాజు గారని ఒకరుండేవారు. ఆయన భార్య బుచ్చమ్మ. వారికి మగపిల్లలు లేరు. ఒక్కతే  కుమార్తె. ఆమెను కంచెల గ్రామంలో భండారు వీరేశలింగం గారికి ఇచ్చి పెళ్లి చేశారు. వీరేశలింగంగారు కంభంపాడుకు వచ్చి స్థిర పడ్డారు. (ఒకరకంగా ఇల్లరికం అన్నమాట) లక్ష్మీనారాయణగారు రాయించిన వంశ  వృక్షం ఆయనను వీరేశలింగంగా  పేర్కొంటోంది. సుబ్బారావుగారు రాయించిన దానిలో వీరేశం అనే వుంది. (కోర్టు తీర్పులో కూడా ఇంటి పేరు బండారుఅనే వుంది  కాని భండారుఅని లేదు. అయితే ఇది రాయసకాని పొరబాటు అని అనుకోవచ్చు. ఇంచుమించు అదే కాలంలో భండారు లక్ష్మయ్య కులకర్ణి గారు రాసిన ఒక అర్జీలో  ఇంటి పేరును స్పష్టంగా  ‘భండారుఅనే రాసారు.) కనుక భండారు వీరేశం లేక భండారు వీరేశలింగం అనే ఆయన కంభంపాడులో భండారు వారికి మూలపురుషుడు అనడంలో సందేహం లేదు. కంచెల గ్రామంలో కాని, వేములపల్లిలో గాని ఎవరయినా వంశ వృక్షాలు రాయించి దాచి  వుంటే వీరేశం గారి పూర్వీకుల గురించి తెలుసుకునే వీలువుంటుంది. అయితే వేములపల్లిలోని వంశ వృక్షాలను  గురించి కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.  అగ్రహారం పంపకాలలో కోర్టు కెక్కి అక్కడివారు తమ తమ సానుకూలాన్ని బట్టి వంశ వృక్షాలు రూపొందించి ఉంటారని కొందరి వూహ. వేములపల్లి భండారు వారు లింగాలను ధరించారు. అయితే కంచెల, పల్లగిరి భండారు వారు, వారివలె  లింగధారులు  కారు. ఆరువేల నియోగులు. స్మార్తులు. యజుస్మాఖాధ్యాయులు. ఆపస్తంభ సూత్రులూను. (ఇంకా వుంది)

9, ఆగస్టు 2017, బుధవారం

బాల్యం నుంచి బాధ్యతల చివరంచుల దాకా ...... (7)


మరో ప్రారంభానికి ఇంకో ఆరంభం
బాల్యం.
ప్రతి మనిషి జీవితంలో ఓ అద్భుత భాగం. కష్టాలున్నా బాధ్యతలు వుండవు. సుఖాలు అనుభవించి ఆనందించడమే కాని కాని వాటిని ఎలా సంపాదించుకోవాలి అనే అవసరం వుండదు. ప్రేమను పొందడమే కాని దాన్ని  తిరిగి ఇతరులకు  పంచే పూచీ వుండదు.
బాధ్యతలు, బరువులు లేని దిలాసా జీవితం, కులాసా జీవనం. అదే బాల్యం. అందుకే ప్రతి మనిషికి అది అపురూపం.
అంతగా గుర్తుండకపోయినా, బాల్యంలో పడ్డ ముద్రలు పెద్దయిన తరువాత కూడా ప్రభావాన్ని చూపిస్తాయి.
నాకు కూడా చిన్ననాటి విషయాలు గురించి పెద్దవాళ్ళు చెప్పగా వినడమే కాని గుర్తున్నవి తక్కువ. గుర్తుంచుకోవాల్సినవి కూడా తక్కువేనేమో!
ఏడుగురు ఆడపిల్లలు, ముగ్గురు మొగపిల్లల తరువాత పదకొండోవాడిని నేను. అందరిలోకి చిన్నవాడినని గారాబం చేయడంతో, కర్ణుడికి  కవచకుండలాల మాదిరిగా నాకు మంకుతనం, ముట్టె పొగరు సహజసిద్దంగా అలవడ్డాయి. పెద్దలను ఎగర్తించి మాట్లాడ్డం, అనుకున్నది దొరికే దాకా గుక్క పట్టి ఏడ్వడం నా చిన్నతనం గురించి మా పెద్దలకు మిగిలిన  జ్ఞాపకాలు. ముఖ్యంగా అన్నం తినేటప్పుడు నెయ్యి కోసం చేసిన యాగీ అంతాఇంతా కాదు. కుడిచేతిలో నెయ్యి పోస్తుంటే అది వేళ్ళ సందుల్లోనుంచి కారిపోయేది. గుప్పెడు నిండేదాకా నెయ్యి వేయలేదని గుక్క తిప్పకుండా ఏడుపు.  గుక్కపట్టడం అనేది ఈనాటి తల్లులకు, పిల్లలకు బహుశా తెలియకపోవచ్చు. ఊపిరి కూడా పీల్చుకోకుండా అదేపనిగా ఆపకుండా ఏడ్వడం వల్ల ఒక్కోసారి పిల్లలు కళ్ళు తేలవేసేవాళ్ళు. అందుకే గుక్క పట్టే పిల్లలంటే తలితండ్రులు భయపడేవాళ్ళు. ఏడుపు మాన్పించడానికి  వాళ్ళు ఏది అడిగితె అది ఆలోచించుకోకుండా చేతిలో పెట్టేవాళ్ళు. నా గుక్క సంగతి అందరికీ తెలుసు కనుక ఇంట్లో నేను ఆడింది ఆటా, పాడింది పాటా.
అన్నాలుతినే సమయంలో నెయ్యి కోసం నేను పెట్టే పోరు తట్టుకోలేక పోయిన మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు ఒక సులువు కనిపెట్టారు. ‘ఇక వీడితో వేగడం ఇలా కాదనుకుని  ఒక చిన్న వెండి గిన్నెలో నెయ్యి నింపి ప్రత్యేకంగా నా కంచం పక్కన పెట్టడం అలవాటు చేశారట. వయసు పెరిగిన కొద్దీ ఆ నెయ్యి అలవాటు కొంతవరకు పోయింది కానీ మొండితనం మాత్రం, తనకు నేనెందుకు నచ్చానో తెలియదు కాని, శాస్వితంగా నాతోనే ఉండిపోయింది. పైగా తనకు తోడుగా ‘మాట తూలడం’ అనే తోబుట్టువును  కూడా తోడు  తెచ్చుకుంది. నిజానికి ఈ రెండూ లేకపోతే నేనూ ఒక ఆదర్శ పురుషుడిని అయ్యేవాడినేమో!  కాని కొందరికి కొన్ని ఇలాటి ‘రోల్డ్ గోల్డ్ ఆభరణాలు’ ఆ దేవుడే కావాలని తగిలిస్తాడు. లేకపోతే ఈ రకం  మనుషుల్ని పట్టుకోవడం కష్టం అన్న సంగతి ఆ దేవుడికి కూడా తెలుసు. ఈ చిన్నప్పటి లక్షణాలే చాలామందికి చివరి వరకు అంటుకుపోతాయి. ‘పుటక- పుడకలు’ సామెత అందుకే పుట్టిందేమో!
సరే! ఈ స్వగతం ఎందుకంటే నాలోని ఆ మొండితనమే మా ఊరు గురించి, చిన్ననాటి కబుర్లు గురించి నాచేత ఇంతగా రాయించేలా చేసింది. ‘బాగున్నాయి, బాగా రాస్తున్నారు’ అని ఎవరయినా కితాబులు  ఇచ్చినప్పుడు, ‘పోనీలే! మొండితనం కూడా ఒక రకంగా మంచితనమే’ అనుకుంటున్నాను.
“వేళ్ళు కొంకర్లు పోయేలా ఏమిటలా కంప్యూటర్ దగ్గర కూర్చుని టిక్కూ టిక్కూ అంటూ కొట్టడం’ అంటూ విసుక్కునే మా ఆవిడ నిర్మల కూడా నా చిన్నతనం కబుర్లు చదువుతూ ఇప్పుడు నస పెట్టడం మానేసింది. రాయడం నాకు కొత్తేమీ కాదు, బ్లాగుకూ, పత్రికలకీ వందల కొద్దీ వ్యాసాలు, వేల పుటల్లో రాసాను. కానీ అవన్నీ రాజకీయ అంశాలు. ఇంటికి వచ్చే పత్రికలలో  పడిన నా వ్యాసాలు, కంటి ఎదురుగా కనిపిస్తున్నా కూడా మా ఆవిడ చదివేది కాదు. అలాంటిది  ఈ మధ్య నేను రాస్తున్న ఈ  ‘బాల్యం’ ముచ్చట్లు చదవడమే కాదు, వాటిని గురించి మాట్లాడుతోంది కూడా.
ఈ విషయంలో నా కెందరో సహకరించారు. ఎందరో ఎన్నో విషయాలు చెప్పారు. నేను రాసిన వాటిల్లో ఎన్నో సంఘటనలకు నేను ప్రత్యక్ష సాక్షిని కాను. నిజానికి చాలా సందర్భాల్లో నేను అనేవాడినే నేను. పుట్టక ముందు జరిగిన అనేక సంగతులు చాలామందిని అడిగి తెలుసుకున్నాను. నాకే డెబ్బయి నిండాయి. చాలామంది రాలిపోయారు. కంభంపాడు స్కూల్లో నాతో కలిసి చదువుకున్న మా మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు, చిన్నప్పటి స్నేహితులు వేమిరెడ్డి ఓబుల రెడ్డి (కోటిరెడ్డి,కోటయ్యఅని పిలిచేవాళ్ళం), పమ్మి సత్యమూర్తి, పర్సా రామ్మూర్తి చనిపోయారు. విషయాలు వివరించడానికి పెద్దలు మిగల్లేదు. మా అక్కయ్యలు తుర్లపాటి సరస్వతి, కొమరగిరి అన్నపూర్ణ రాసిపెట్టుకున్న సంగతులు నాకు అక్కరకు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు. కాని వారి జ్ఞాపకాలు ఇలా నా రాతల్లో మిగిలిపోయాయి. వారికి వేనవేల కృతజ్ఞతలు. ఇలాఎందరి నుంచో ఇంకా ఎంతో సమాచారం నా మెదడులో నిక్షిప్తం అయి వుంది. నెమ్మదిగా బయటకు తీసి అక్షర రూపం ఇవ్వాలి. ఈలోగా మా అన్నయ్య రాసిన భండారు వంశం వివరాలు లభించాయి.   
మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు బహు గ్రంధ కర్త. ఆధ్యాత్మిక అంశాలతో పాటు ఎంతో శ్రమించి మా భండారు వంశానికి సంబంధించిన అనేక అంశాలను క్రోడీకరించారు. పుట్టపర్తిలో ఒక చిన్న గదిలో ఆయన పోతూ పోతూ మిగిల్చి వెళ్ళిన రాత ప్రతులను మా వదిన గారు సరోజినీ దేవి భద్రంగా హైదరాబాదు చేర్చి మా అన్నయ్య రామచంద్ర రావు గారి ఇంట్లో భద్రపరిచింది. ఆ భాండాగారంలో దొరికిందే మా అన్నయ్య రాసిపెట్టిన ‘భండారు వంశం’. ఈ విషయంలోనేను కష్టపడింది ఏమీ లేదు, ఆయన రాసి ఉంచిన దాన్ని కంప్యూటర్ కు ఎక్కించడం తప్ప.
ఇది చదివిన తరువాత నేను ఎంతటి అంగుష్ఠమాత్రుడినో నాకు బోధపడింది. నిజంగా నా రచనలు నలుగురికీ నచ్చుతున్నాయి అంటే దానికి కారణం మా అన్నయ్య నుంచి నేను ఏకలవ్యుడిగా పొందిన విద్య. ఆయన రచనలు చదవడం వల్లనే నేనిలా రాయగులుతున్నాను. ఇది సత్యం.
వచ్చే భాగం నుంచే మా అన్నయ్య రాసిన ఆయన చిన్ననాటి విషయాలు, మా ఊరు ముచ్చట్లు కొన్ని పోస్ట్ చేస్తాను. నిజానికి బాల్యం నుంచి బాధ్యతల చివరంచుల దాకా ......” అనే  ఈ వ్యాస పరంపరలో ఆయన రాసిందే ప్రధాన భాగం. 
నమస్కారం! 
           



బాల్యం నుంచి బాధ్యతల చివరంచుల దాకా ...... (6)


ఇక్కడో చిన్న మలుపు. మా ఇంట్లో ఇప్పటి తరానికి, పాత తరానికి వారధి మా పెద్దక్కయ్య  కుమారుడు డాక్టర్ ఏ.పీ.రంగారావు. ఇప్పటి మా  కుటుంబంలో పెద్దవాడు. కుటుంబానికి పెద్ద దిక్కు కూడా. డెబ్బయి అయిదేళ్ళ క్రితం మా  కంభంపాడు (ఆయనకు మాతామహుల స్థానం) లోనే జన్మించాడు. చిన్నతనంలో తాను  పెరిగిన  మా వూరు గురించీ, అప్పటి ఆచార వ్యవహారాల గురించి ఒక వైద్యుడి కోణంలో కొన్ని విశేషాలు ఇంగ్లీష్ లో రాశారు. వాటిని నేను తెనుగు చేసి ఇందులో పొందుపరుస్తున్నాను. (భండారు శ్రీనివాసరావు)



(డాక్టర్ అయితరాజు పాండు రంగారావు)
 
కంభంపాడు గురించి డాక్టర్ అయితరాజు పాండు రంగారావు జ్ఞాపకాల దొంతర: 
 “కృష్ణా జిల్లా, నందిగామ తాలుకా, కంభంపాడు అనే కుగ్రామంలో - 1942 సెప్టెంబర్ 20వ తేదీన  పుట్టాను. అప్పుడది బ్రిటిష్ పాలనలోని  మద్రాస్ ప్రెసిడెన్సీలో వుండేది. నేను పుట్టింది మా మాతామహుల ఇంట్లో. అదొక పెంకుటిల్లు. మా తాతగారు అంటే మా అమ్మగారి నాన్నగారు, భండారు రాఘవరావు, ఆ వూరికి కరణం.
“నేను మా తలిదండ్రులకు రెండో సంతానాన్ని. నేను పుట్టినప్పుడు నా బొడ్డు కోసిన మంత్రసాని పుట్టుగుడ్డిది. విచిత్రమేమిటంటే మా అమ్మ పుట్టినప్పుడు కూడా ఈ మంత్రసానే పురుడుపోసిందట. మా కుటుంబంలో చాలామంది  ఈ మంత్రసాని ఆధ్వర్యంలోనే సుఖంగా ప్రసవించి క్షేమంగా వున్నారు.  ఆమె పురుడు పోసిన పిల్లలెవ్వరూ  ప్రసవ సమయంలో చనిపోలేదు. అది ఆవిడ  చేతిచలవ అని చెప్పుకునేవారు. ఆ రోజుల్లో ప్రసవాలన్నీ ఇళ్ళల్లోనే జరిగిపోయేవి. మొట్టమొదటిసారి ఆసుపత్రిలో పురుడు పోసుకున్నది మా అమ్ముమ్మ గారు. అదీ మా మా పెద్ద మేనమామ (పర్వతాలరావు) పుట్టినప్పుడు. అయిదుగురు ఆడపిల్లల తరవాత కానుపు  కావడంతో మా అమ్ముమ్మను అప్పుడు ఖమ్మంలోని క్రిస్టియన్ మిషన్ ఆసుపత్రిలో చేర్పించి పురుడు పోయించారు.
“నేను పుట్టిన తరవాత నాకు కానీ, మా అమ్మకు కానీ ప్రసవానంతర జాగ్రత్తలు ఏమీ తీసుకోలేదు. మా ఇద్దరికీ ధనుర్వాతం (టెటనస్) రాకుండా ఏ విధమయిన ఇంజెక్షన్లు ఇవ్వలేదు. అలాటివి వున్నట్టు ఆ రోజుల్లో ఎవరికీ తెలిసివుండదు.  పురుడు  రావడానికి కొన్ని నెలలముందు  మా అమ్మ పుట్టింటికి వెళ్ళింది.  కేవలం పుట్టింటివారి ఆప్యాయతా, పూర్తి విశ్రాంతి మినహా ఆమె తీసుకున్న  మందులు ఏమీ లేవు.  నేను పుట్టగానే మంత్రసాని కొడవలితో  బొడ్డు కోసి ఒక తట్టలో పడుకోబెట్టింది. కోసిన బొడ్డు ముక్కను గోతిలో పాతిపెట్టారు. నాకు స్నానం చేయించి తల్లి పాలు పట్టించారు. మైల బట్టలు మంత్రసాని పట్టుకెళ్ళింది. అవి ఆమెకే చెందుతాయి. పురుడు పోసినందుకుగాను కొంత ధాన్యం కొలిచి ఇచ్చేవాళ్ళు.  
“ప్రసవం అయిన తరవాత ఆ గదిలోకి పన్నెండు రోజులపాటు ఎవ్వరూ రావడానికి వీలులేదు. ఎవరూ తాకడానికి వీలులేదు. పుట్టిన తిధి నక్షత్రాలనుబట్టి జాతకం రాయించారు. ‘రాధమ్మ సుఖంగా ప్రసవించింది. తల్లీ పిల్లవాడు కులాసా’ అని చుట్టపక్కాలందరికీ ఇంటి పురోహితుడితో కబురు పంపించారు.
“మూడోరోజున బాలింతరాలయిన మా అమ్మకు వావిలాకులు కలిపిన  వేడినీటితో స్నానం చేయించారు. మరో తొమ్మిది రోజులు ఇలాగే గడిచిన తరవాత, పన్నెండో రోజున   ఆమెకు పురిటి స్నానం చేయించారు. పసుపు, పెసరపిండి,శనగపిండి కలిపి వొంటికి నలుగుపెట్టి చేయించే స్నానం ఇది.  ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లి పుణ్యావచనం, పూజ అయిన తరవాత, బియ్యం, బెల్లంతో తయారుచేసిన పులగం మా అమ్మకు తినడానికి పెట్టారు. అప్పటినుంచి పురిటి మైల వొదిలిపోయినట్టే. ఇల్లంతా స్వేచ్చగా అందరితో కలసి తిరగొచ్చు. పసిపిల్లాడినయిన నాకు కూడా ప్రతి రోజూ  పెద్దవాళ్లో, పనిమనుషులో కాళ్ళమీద పడుకోబెట్టుకుని స్నానం చేయించేవారు. ఒక గుడ్డ పరచి  నిద్రపుచ్చేవారు. దాన్ని పాడుచేసినా ఆ గుడ్డనే, ఉతికి ఆరవేసి మళ్ళీ  వాడేవారు. పన్నెండో రోజున  నామకరణం చేసి ఉయ్యాలలో వేసారు. “చిన్నతనంలో నాకు ఎలాటి వాక్సినేషన్లు ఇవ్వలేదు. రెండేళ్ళ తరవాత నా చెల్లెలు పుట్టేవరకూ నేను మా అమ్మ పాలే తాగేవాడిని. అయితే, నాకు తొమ్మిది నెలల వయస్సు రాగానే  ఒక మంచి రోజు చూసి యిరవై కిలోమీటర్ల దూరంలో వున్న తిరుమలగిరి గుట్టమీది వెంకటేశ్వర స్వామి గుడిలో  అన్నప్రాసన చేసారు. బెల్లం కలిపి వొండిన అన్నం పాయసం.  ( అంటే అది నేను తిన్న మొట్టమొదటి ఘన పదార్ధం అన్నమాట.) అలాగే నా మొట్టమొదటి  కేశ ఖండన (తల వెంట్రుకలు) కూడా ఏడాది నిండినప్పుడు జరిగింది. చిన్నతనంలో మా పినతల్లులు (మా అమ్మ చెల్లెళ్ళు ) ముగ్గురు నా ఆలనా పాలనా చూసేవారు. అప్పటికి వారికింకా పెళ్ళిళ్ళు కాలేదు. పైనుంచి మా తాతయ్య రాఘవయ్య గారి తల్లి రుక్మిణమ్మ గారు  నన్ను కనిపెట్టి చూసేది. ఆమె, ఆమె తల్లి ఇద్దరూ చిన్నవయస్సులోనే వైధవ్యం పొందారు. పెద్దలు, పిల్లలు అందరికీ వాళ్ళిద్దరే పెద్ద దిక్కు. దూలానికి వేలాడదీసిన గుడ్డ ఉయ్యాలలో నన్ను పడుకోబెట్టి నిద్రపుచ్చేవారు. మా తరంలో నేనే తొలిచూరు పిల్లవాడినని చాలా గారాబంగా చూసేవారు. యిరవై నాలుగ్గంటలూ ఎవరో ఒకరు కంటికి రెప్పలా కనిపెట్టుకుని వుండేవారు.
బోర్లపడితే బూరెలు వండాలి, పారాడితే పాలకాయలు పంచాలి అని ఏదో  పేరుతొ ప్రతినెలా నేను పుట్టిన తరువాత పండగలు, పేరంటాలు  చేసేవారు. మా అమ్మ నన్ను ప్రసవించిన తొమ్మిదో రోజున మా అమ్ముమ్మగారు, మా అమ్మ అమ్మగారు వెంకట్రావమ్మ గారు  కూడా అదే ఇంట్లో మరో గదిలో మగ పిల్లవాడిని (భండారు రామచంద్రరావు) కన్నది. నాకు బొడ్డుకోసిన మంత్రసానే మా అమ్ముమ్మకు కూడా పురుడు పోసింది. ఒకే ఇంట్లో రోజుల తేడాతో పుట్టిన మేమిద్దరం ఆడుతూ పాడుతూ  పెరిగాం. 
“చిన్నప్పటి ఓ జ్ఞాపకం నా మనసు తెరపై ముద్రపడిపోయింది.
1948 నాటి మాట.  మా అమ్మ తండ్రి రాఘవయ్య గారిని  కంభంపాడు తాతయ్య అనే వాళ్ళం. ఎవరూ లేవకముందే తెల్లారగట్టనే లేచి కాఫీ తయారుచేసుకుని తాగడం ఆయన అలవాటు.  బెజవాడనుంచి పచ్చి కాఫీ గింజలు కొనుక్కొని వచ్చి వాటినివేయించి కాఫీ చేసుకుని తాగేవాడు. కాఫీ గింజలను పొడి చేసే ఒక చిన్న మిషను ఒకటి అయన పట్నం (మద్రాసు) పోయినప్పుడు కొనుక్కు వచ్చాడు. నన్ను నిద్రలేపి, వొళ్ళో వేసుకుని పొయ్యి రాజేసేవాడు. నీళ్ళు పడేసి అవి కాగుతుండగానే, బొడ్లోనుంచి బీడీ కట్ట తీసి ఒకటి వెలిగించేవాడు.
“వేయించిన గింజల కమ్మటి వాసన, కాఫీ పొడి మిషన్ చేసే అదో రకం చప్పుడు, సుళ్ళు తిరిగే బీడీపొగ, ఎదురుగా పొయ్యిలో కణకణమని కట్టెల మంటలు, ఇవన్నీకళ్ళకు కట్టినట్టు గుర్తుండిపోయాయి.
“ఇన్నేళ్ళ తరవాత ఇప్పటికీ ఇలాటి చిన్న చిన్న సంగతులు కొన్ని బాగా జ్ఞాపకం వున్నాయి.             
“అలాటిదే మరో జ్ఞాపకం, గుడ్డ ఉయ్యాలలు గురించి. ఈ కాలం వారికి ఏమాత్రం తెలియని ఉయ్యాలలు ఇవి. ఒక పాతచీరెను  
దూలానికి వేలాడగట్టి ఉయ్యాల మాదిరిగా తయారుచేసేవారు. అందులో పిల్లలని పడుకోబెట్టి ఎవరో ఒకరు ఊపుతూ నిద్రపుచ్చేవారు. బయటనుంచి చూసేవారికి లోపల పిల్లాడికి గాలి ఆడుతుందా అని అనుమానం కలిగించేలా వుండేవి ఈ గుడ్డ ఉయ్యాలలు.
 “మరో చేదు జ్ఞాపకం నెలనెలా పిల్లలకు వంటాముదం పట్టించడం. పిల్లల్ని కాళ్ల మీదవేసుకుని, బలవంతంగా నోరు తెరిచి ఉగ్గిన్నెతో ఆముదం తాగించేవాళ్ళు. ఇలా చేస్తే మలబద్దకం రాదని నమ్మకం.  
“వినడానికి ఆశ్చర్యంగా వుండవచ్చు కానీ, మా నాన్నను చూడడం కూడా నా చిన్ననాటి జ్ఞాపకాల్లో ఒకటి.
1949 సెప్టెంబర్ ఆఖరి వారంలో మా నాన్న జెయిలునుంచి విడుదల అయ్యారు.  హైదరాబాద్ స్టేట్, ఇండియన్ యూనియన్ లో విలీనం కావడంతో జైళ్లలో పెట్టిన స్వాతంత్ర్య సమరయోధులనందరినీ వొదిలిపెట్టారు. మా అమ్మగారి పుట్టింటిలో వుంటున్న మమ్మల్ని చూడడానికి మా నాన్నగారు, మూడు, నాలుగు మైళ్ల దూరంలోవున్న పెనుగంచిప్రోలులో బస్సు దిగి  కాలినడకన కంభంపాడు  చేరారు.
“అంత దూరంలో ఆయన కనబడగానే పెద్దపిల్లలం కొంతమందిమి చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని, ‘జై హింద్’ అని అరుస్తూ పరిగెత్తుకుంటూ ఎదురెళ్ళాము. “అంతమంది పిల్లల్లో తనపిల్లవాడెవరన్నది ముందు ఆయనకు అర్ధం కాలేదు. అయితే వెంటనే తేరుకుని నన్నుగుర్తుపట్టి  చేతుల్లోకి తీసుకుని ప్రేమగా గుండెలకు హత్తుకున్నారు. నా గుండె గోడల నడుమ పదిలంగావుండిపోయిన  మరో మధుర మధుర  జ్ఞాపకం అది.
“మేముంటున్న ఇల్లు చాలా పెద్దది. ముందూ వెనకా బోలెడంత ఖాళీ జాగా. పిల్లలం ఆరుబయట  ఆడుకునేవాళ్ళం. చెట్లనీడలో మంచాలు వేసుకుని కొంత మంది  కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఇంట్లో నా వయసు పిల్లలం ముగ్గురం వుండేవాళ్ళం. అందరూ మమ్మల్ని గారాబంగా చూసుకునేవారు. దానితో మా పని ఆడింది ఆట పాడింది పాట.
“ఇంట్లో పెద్దవాళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టుకుని కధలు చెప్పేవాళ్ళు. కబుర్లు చెప్పేవాళ్ళు. రకరకాల ఆటలు నేర్పించేవాళ్ళు. దాగుడుమూతలే మేము ఎక్కువగా ఆడుకున్న ఆట. దొంగా పోలీసు మాదిరి. చేతులతో పంటలు వేసుకుని దొంగని నిర్ణయించేవాళ్ళం. వాడు ఒక్కడే మిగిలిన వారిని ఎక్కడ దాక్కున్నా వెతికి  పట్టుకోవాలి.
“అందరం రోజూ రెండుపూటలా స్నానాలు చేసేవాళ్ళం. బావిదగ్గరనిలబడితే పనివాళ్ళు చేదతో తోడి  పోసేవాళ్ళు. కాగులో నీళ్ళు కాగుతూ వుండేవి కానీ  దాదాపు రోజూ చన్నీళ్ళ స్నానమే. ఆ నీళ్ళనే బావి వెనుకవున్న పెరడుకు  మళ్లించే వారు. అక్కడ అరటి చెట్లు, కాయగూరల మడులు వుండేవి. కాలకృత్యాల కోసం అందరూ ఇంటికి కొద్ది దూరంలోవున్న తుమ్మల బీడుకు చెంబులు తీసుకునివెళ్ళేవాళ్ళు. మరీ పెద్దవాళ్ల కోసం పెరట్లో ఒక దడి కట్టి వుండేది.
“ఇల్లు యెంత పెద్దదయినా మూడంటే మూడే లాంతర్లు వుండేవి. పొద్దుగుంకడానికి ముందుగానే లాంతరు  అద్దాలను ముగ్గు పెట్టి శుభ్రంగా తుడిచి,  కిరసనాయిలు పోసి సిద్ధంగా వుంచేవారు. పూర్తిగా చీకటి పడకముందే పిల్లలకు అన్నాలు పెట్టేసేవాళ్ళు. తరవాత అంతా ఆరుబయట మంచాలు వేసుకుని పండుకునేవాళ్ళం. వెల్లకిలా పడుకుని ఆకాశంలో మిలమిల మెరిసే  నక్షత్రాలు చూస్తూ వుంటే ఆ ఆనందం అంతా  ఇంతా  కాదు.
“ఒక్కొక్క మంచంలో ఇద్దరిద్దరం పడుకునేవాళ్ళం. నులక మంచాలు కొన్ని, నవారు మంచాలు మరికొన్ని. నవారు మంచాలు పెద్దవాళ్ళకు వేసేవాళ్ళు.
మంచం పట్టెడ వొదులు కాకుండా సాయంత్రం కాగానే వాటిని బిగించి కట్టేవాళ్ళు.
 “వెన్నెట్లో ఎన్నోరకాల ఆటలు ఆడుకునేవాళ్ళం. పాడుకునేవాళ్ళం. వెన్నెల కుప్పలు అనే ఆట బాగుండేది. ఒక జట్టు చేతిలో మట్టి తీసుకుని ఇంటి ఆవరణలోని రకరకాల చోట్ల మట్టిని  చిన్న చిన్న కుప్పలుగా పోసేది. రెండో జట్టు అవి ఎక్కడున్నాయో కనుక్కుని వాటిని చెరిపేసేది. ఎవరివి మిగిలితే వాళ్ళు గెలిచినట్టు.
“మమ్మల్ని అందరితో పాటే వూరి బడిలో వేసారు. తాటాకుల షెడ్డు. తెలుగులో చదువు. అన్ని క్లాసులకూ ఒక్కరే టీచరు. స్కూల్లో వున్నప్పుడు అ ఆ ఇ ఈ లు నేర్పించేవారు. వల్లెవేయడం మీదనే శ్రద్ధ చూపెట్టేవారు. అంటే టీచరు  చెప్పిందే మనం మళ్ళీ  మళ్ళీ చెప్పడం అన్నమాట.  కుర్చీలు బెంచీలు లేవు. నేలమీదనే కూర్చునే వాళ్ళం. పుస్తకాల సంగతి సరే - అసలు  పలకా బలపాలే లేవు. ఇసకలో అక్షరాలూ రాసి వేళ్ళతో దిద్దించే వాళ్ళు. మొత్తం స్కూల్లో విద్యార్దుల సంఖ్య పదిహేను దాటేది కాదు.  వారిలో ఏడెనిమిది మందిమి మా ఇంటినుంచే. బాగా పాఠం ఒప్పచెప్పిన వారిని పంతులు గారు  మాటలతో మెచ్చుకునేవారు. బడి వొదలగానే ఇంటికి వచ్చి భోంచేసే వాళ్ళం.  “అన్నం, గరిటెజారుడు పప్పు, వంకాయ, బెండకాయ, దోసకాయ, చిక్కుడుకాయలతో చేసిన ఏదో ఒక కూర, పప్పుచారు, ఆవకాయ, నెయ్యీ, పెరుగు ఇదీ  మా భోజనం.
 “ ఆ రోజుల్లో కంభంపాడు  గ్రామానికి కరెంటు లేదు. రోడ్డు లేదు. మంచినీటి పంపులు లేవు. ఒక్క మా తాతగారికి తప్ప ఎవరి కాళ్ళకూ చెప్పులు కూడా వుండేవి కాదు.  అల్యూమినియం కంచాల్లో భోంచేసే వాళ్ళం. పెద్దవాళ్ళకు విస్తరాకులతోనో, బాదం ఆకులతోనో కుట్టిన  విస్తళ్లలో వడ్డించే వాళ్ళు. ఇంట్లో విధవరాండ్రయిన ముగ్గురు ఆడవాళ్ళు వుండేవాళ్ళు. ఒంటిపూట భోజనాలు. రాత్రి ఉప్పిడిపిండి తినేవాళ్ళు. ఉప్పుడు పిండికీ, తప్పాల చెక్కకూ,  ‘పేటెంట్’ ఇవ్వాల్సివస్తే,  అది మా కంభంపాడు అమ్ముమ్మ వెంకట్రావమ్మ గారికి ఇవ్వాలి. తప్పాలచెక్క అంటే బియ్యపు పిండితో చేసే వంటకం. బియ్యపుపిండిలో నానేసిన సెనగపప్పు, ఉప్పూ కారం జీలకర్ర కలిపి ముద్దగాచేసేవాళ్ళు.  ఇత్తడి గిన్నెను పొయ్యిపై వేడిచేసి, దానిలోపల ఈ ముద్దను  తందూరీ రోటీ మాదిరిగా పలచగా అంటించి మూతపెట్టేవాళ్ళు. కాసేపయిన తరవాత, గిన్నెని దించి లోపల ఎర్రగా కాలిన తప్పాలచెక్కను చేత్తో బయటకు తీసి దానికి వెన్నరాసి పెట్టేవాళ్ళు. ఆహా ఏమి రుచి! అన్ని లొట్టలు వేసుకుంటూ తినేవాళ్ళం. కానీ అది తయారుచేసేటప్పుడు అమ్ముమ్మ కాల్చుకున్న చేతుల సంగతి ఎవరికీ గుర్తుండేది కాదు.
“ఇంట్లో వంట పని భారం అంతా మా అమ్ముమ్మదే. పొగ చూరే కట్టెల పొయ్యిముందు కూర్చుని, ఇంటిల్లిపాదికీ వొంటి చేత్తో వండివార్చేది.  ఆవిడ వొదినెగారో, అత్తగారో అప్పుడప్పుడు ఆమెకు  చేతి సాయం చేసేవారు.
“వాళ్ళందరికీ మడి పట్టింపులు ఎక్కువ. మమ్మల్ని పొరపాటున కూడా తాకనిచ్చేవారు కాదు. ఎప్పుడయినా ముట్టుకోవాల్సిన పరిస్తితి ఏర్పడితే బట్టలు విప్పి ముట్టుకోవాలి. “మా అమ్ముమ్మ కానీ, ఆవిడ  వొదినె గారు కానీ,  ఆమెను అంతా  చిదంబరం అత్తయ్య అనే  అని పిలిచేవాళ్ళు, మంచి నీళ్ళ బావికి వెళ్లి బిందెలో నీళ్ళు పట్టుకుని నెత్తిన  పెట్టుకుని మోసుకొచ్చేవాళ్ళు. ఇంటిల్లిపాదీ అవే తాగేవారు.  ఇంటికి మూడువందల మీటర్ల దూరంలో ఈ మంచి నీళ్ళ బావి వుండేది. ఇంట్లో కూడా  బావి వుండేది కానీ నీళ్ళు ఉప్పు కషాయం. తాగడానికి పనికి రావు. 
“కావాల్సిన కూరగాయలన్నీ  ఇంటి పెరట్లోనే పండేవి. కొష్టం నిండా ఆవులూ, బర్రెలూ వుండేవి. ఇంట్లోకి అవసరమయిన పాలు,పెరుగు,నెయ్యీ వాటి పాడితోనే సరిపోయేది. కొనుక్కోవాల్సిన పరిస్తితి వుండేది కాదు. అలాగే బియ్యం,పప్పులూ, ఇతర దినుసులు. వేరుసెనగ విత్తులను గానుగ ఆడించి నూనె తీసేవారు.                
 ఆడవాళ్ళు ధరించే చీరెల నుంచి, మగవాళ్ళు కట్టుకునే దోవతులవరకూ వూళ్ళోని  నేతపనివారే నేసిపెట్టేవారు. ఏదయినా శుభాకార్యాలప్పుడే పట్నం వెళ్లి ఆలుగడ్డలు, టొమాటోలు వంటివి కొనుక్కుని వచ్చేవాళ్ళు. కాయలూ, పండ్లూ కూడా కొనుక్కోవాల్సిన అవసరం వుండేది కాదు. తోటల్లోనే కాసేవి. రుతువులనుబట్టి దొరికేవి. అరటి, జామ, మామిడి, సీమచింత, సపోటా, రేగిపళ్ళు  ఏవీ కొనాల్సిన పనివుండేది కాదు.
 ఆరోజుల్లో రకరకాల పండుగలు. కానీ ప్రతి పండగా పిల్లలకు పెద్ద  పండగే. అది ఆడవాళ్ళ వ్రతమయినా, మగవాళ్ళ వనభోజనాలయినా.
 వినాయక చవితి, మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీవ్రతం, కేదారేశ్వర వ్రతం, అట్లతద్దె, ఉండ్రాళ్ళ తద్దె, దసరా,  బతకమ్మ, దీపావళి, సంక్రాంతి, ఉగాది ఇలా పండగలే పండగలు. నోములే నోములు. నవకాయ పిండి వంటలతో పండగ భోజనాలన్నీ  అదిరి పోయేవి. ఆ పండగలన్నీ ఇప్పుడు లేవని కాదు. ఆనాడు  పిల్లల్లో పెద్దల్లో కానవచ్చే సంతోషం  సంబరాలు ఇప్పుడు మచ్చుకు కూడా కానరావడం లేదు. ఈ పండగలే  కాక, బంధు మిత్రులతో కలసిచేసే వన భోజనాలు, తిరునాళ్ళు, తీర్ధయాత్రలు. వ్రతాలు,పూజలు, పేరంటాలు, ఆ రోజుల్లో అలా  సందడే సందడి.”

ఇవండీ డాక్టర్ రంగారావు, మా ఊరిలో  తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పిన ముచ్చట్లు.