20, జనవరి 2015, మంగళవారం
19, జనవరి 2015, సోమవారం
తెరిచి పెట్టిన పుస్తకం
“మరుగేలరా ఓ రాఘవా” అని పాడుకునే రోజులకు
రోజులు దగ్గర పడుతున్నాయి. ఇక ముందు ముందు మనుషుల జీవితాల్లో చాటు
మాటులు వుండవు. అంతా బహిరంగమే. ‘బతుకు
బస్ స్టాండ్’ అనుకుంటూ
బాధపడే భవిష్యత్తు ఎలా వుంటుందో తెలిపే ఓ ఆంగ్ల కధనం ఒకటి ఇప్పుడు నెట్లో
షికార్లు చేస్తోంది. దానికి స్వేచ్చానువాదం:
2020లో బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్
చేయడం కోసం చట్నీస్ కు ఫోన్ చేస్తే ఆ సంభాషణ ఇలా సరసంగా సాగుతుంది.
“గుడ్ మార్నింగ్. నాకు
వెంటనే నాలుగు ప్లేట్లు .....”
“ఒక్క నిమిషం సర్! మీ మల్టీ
పర్పస్ కార్డ్ నెంబర్ చెబుతారా?”
“కార్డు నెంబరా! ఒక్క నిమిషం
ఆగండి చూసి చెబుతాను..... నా నెంబరు ... 889861356102049
998-45-54610"
“థాంక్స్. అయితే మీ పేరు
శ్రీనివాసరావు. మాదాపూర్ లో మహారాజా ఛాట్ ఎదురుగా వున్న అపార్ట్ మెంటులో నాలుగో
అంతస్తులోని ఫ్లాట్లో వుంటారు. మీరక్కడ ఏడాదిగా అద్దెకు వుంటున్నారు. మీ లాండ్
లైన్ నెంబరు 23731056. సారీ అది బీ యస్ ఎన్ ఎల్ కనెక్షన్
కావడం వల్ల కేబుల్ షార్టేజ్ కారణంగా ఇంకా షిఫ్ట్ చేయలేదు. ప్రస్తుతం ,మీ మొబైల్
నెంబరు 9849130595. ఇప్పుడు
చెప్పండి. మీకేమి కావాలి?”
“నాకేమి కావాలో చెబుతాను
సరే! ఇంతకీ నా ఫోను నెంబర్లు, నా వివరాలు మీ దగ్గర ఎలావున్నాయి?”
“సిష్టంతో కనెక్ట్
అయివున్నాం సర్”
“సరే! నాకు త్వరగా నాలుగు
ప్లేట్లు బాబాయి ఇడ్లీ ...”
“వన్ మినిట్ సర్! మీరు మొన్న ఉదయం మీ భార్యతో కలసి వెళ్లి
శ్రీనగర్ కాలనీలోని క్లినిక్ లో షుగర్ చెక్ చేయించుకున్నారు. ఆ
రిపోర్ట్ ప్రకారం మీరు ఉదయం పూట ఇడ్లీ తినడం అంత శ్రేయస్కరం కాదు. మీ ఆవిడ
రిపోర్ట్ బాగానే వుంది. ఆమెకు ఇడ్లీ చెబుతాను. మీకు బ్రౌన్ బ్రెడ్ శాండ్
విచ్ ఆర్డర్ చేస్తాను.”
“ఓకే! బిల్లు సుమారుగా ఎంతవుతుంది?”
“యెంత సర్! చాలాతక్కువ. సర్వీస్ చార్జ్ కాకుండా పన్నెండు వందలు”
“కార్డు మీద పే చెయ్యవచ్చా?”
“తప్పకుండా. కాకపోతే చిన్న ప్రాబ్లం సర్! కంప్యూటర్
చెబుతున్నదాన్నిబట్టి చూస్తే మీ క్రెడిట్ కార్డు క్రెడిట్ రికార్డు ఏమీ
బాగాలేదు. ఇప్పటికే మూడు వాయిదాలు కట్టలేదు. హౌసింగ్ లోన్ బకాయి కూడా పేరుకు
పోయివుంది. అందువల్ల మీరు ఖచ్చితంగా క్యాష్ మాత్రమే కట్టాల్సి వుంటుంది”
“ ఓ షిట్! ************”
“సర్! మీరు అసభ్యంగా మాట్లాడుతున్నారు. అసలే మీ మీద బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో ఒక కేసు
నమోదయి వుంది. మూడు రోజుల క్రితం బార్ నుంచి కారులో వస్తూ పోలీసులకు పట్టుపడి
వాళ్ళతో తగాదా పెట్టుకున్నారని రికార్డ్ చెబుతోంది. కాబట్టి మరో కేసుకు అప్పుడే
తొందర పడవద్దని మర్యాద పూర్వకంగా సలహా ఇస్తున్నాను.”
“ఓ! షి..... వద్దులే. మీ టిఫిన్ వద్దు నా పిండా కూడూ వద్దు. ఈ పూటకు
ఇంట్లోనే ఏదో వండుకు తింటాం తల్లీ!”
“అదిగో సర్! అదే వద్దన్నాను. తల్లి ఏమిటి తల్లి! బల్లి లాగా...”
ఇవతల
వ్యక్తి పరిస్తితి చెప్పక్కరలేదు. ఊహించుకోవచ్చు. ఏదో చిత్రంలో బ్రహ్మానందం
పాత్ర మాదిరిగా కింద పడి గిల గిలా కొట్టుకుంటున్నాడు.
లేబుళ్లు:
తెరిచి పెట్టిన పుస్తకం
17, జనవరి 2015, శనివారం
రాజకీయాల రంగూ రుచీ మార్చిన యన్టీయార్
PUBLISHED IN 'SURYA'TELUGU DAILY IN ITS EDIT PAGE ON 18-01-2015,SUNDAY
(జనవరి, 18 యన్టీఆర్ వర్ధంతి)
యన్టీయార్ అని అభిమానులు ముచ్చటగా పిలుచుకునే
నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో కొందరు తెలుగు దేశం
నాయకులు ఆయన్ని కలిసి, 'పలానా జిల్లా ఎస్పీ ని బదిలీ చేయాల'ని కోరారు. వారిని యన్టీయార్ రెండే రెండు ప్రశ్నలు
అడిగారు.
"ఆ పోలీసు అధికారి అవినీతి పరుడా? చేతకానివాడా?"
కాదన్నారు వాళ్లు.
"మరేమిటి?" సీ.ఎం. అరా.
"మన పార్టీకి పనికి రాడు" పార్టీ నేతల
జవాబు.
"పార్టీకి పనికి రాకపోతే మీకేమిటి నష్టం?
పార్టీ పని మీరు చేయండి. ప్రభుత్వం చేయాల్సింది అధికారులు చేస్తారు" సంభాషణ
ముగించారు యన్టీయార్.
ఆ ఎస్.పీ. ఎవరో కాదు ఉద్యోగపర్వంలో అత్యంత సమర్ధుడనీ,
నిజాయితీపరుడనీ పేరు తెచ్చుకుని తదనంతర కాలంలో పోలీసు డైరెక్టర్ జనరల్ గా పదవీ
విరమణ చేసిన ఐ.పీ.ఎస్. అధికారి శ్రీ ఏ.కే.
మహంతి. ఒక టీవీ ఛానల్ చర్చలో ఆయనే ఈ ఉదంతం వెల్లడించారు.
రాష్ట్ర రాజకీయ చరిత్రలో యన్టీయార్ ది ఒక ఉత్కృష్ట
అధ్యాయం. రాజకీయాల దశను దిశను ఆయన ఒక మలుపు తిప్పారు. నిజం చెప్పాలంటే రాజకీయాల
రంగూ, రుచీ మార్చారు. సమాజంలో కొన్నివర్గాలకే పరిమితమైవున్న రాజకీయ అవకాశాలను బడుగు బలహీన వర్గాలకు సైతం అందుబాటులోకి
తెచ్చారు. ఒక ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు, ఒక సామాన్య గృహిణి, ఒక లాయరు, ఒక చిన్న
వ్యాపారి ఇలా అనేకమంది ఆయన హయాములో ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు
కాగలిగారు. మొత్తం రాజకీయ రంగం రూపురేఖలు మారిపోయింది కూడా యన్టీయార్ తెలుగుదేశం
పేరుతొ ఒక ప్రాంతీయ పార్టీని పెట్టిన తరువాతనే.
తెలుగుదేశం
పార్టీ తొలిసారి ఎన్నికల కురుక్షేత్రంలో అడుగుపెట్టి, తొలి అడుగులోనే విజయభేరి
మోగించి 1983 లో అధికారంలోకి వచ్చింది. ఈ అపూర్వ విజయానికి
ఎన్టీ రామారావు వ్యక్తిగత ఆకర్షణ, గత కాంగ్రెస్ పాలనపై ప్రజలకు కలిగిన ఏష్టత
ప్రధానంగా దోహదం చేసాయి. రాష్ట్రావతరణం నుంచి ఏకఛత్రాధిపత్యంగా సాగుతూ వచ్చిన
కాంగ్రెస్ పాలనకు గండి పడింది. అంతవరకూ ప్రాంతీయ పార్టీల పొడ ఎరుగని తెలుగు ఓటర్లు,
'తెలుగుజాతి ఆత్మ గౌరవం' నినాదంతో ముందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీకి అఖండ విజయం కట్టబెట్టారు. రాజకీయాల్లో
తొమ్మిది మాసాల పసికూన తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో 203 స్థానాల్లో విజయ బావుటా ఎగురవేసింది. పాలకపక్షం అయిన
కాంగ్రెస్ 60 సీట్లకే
పరిమితమయింది. ఈ అసాధారణ విజయంతో ఎన్టీయార్ ప్రతిభ దేశం నలుమూలకు పాకింది.
అంతవరకూ తెలుగు సినీ పరిశ్రమను ఏలిన శ్రీ
రామారావుకు, రాజకీయరంగంలో సయితం లభించిన ఈ ప్రజాకర్షణ ఆత్మ స్తైర్యాన్ని మరింత
పెంచింది. ఈ విజయం వల్ల వొనగూడిన ఆత్మవిశ్వాసంతో ఆయన మరింత దూకుడు ప్రదర్శించి
జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ వ్యతిరేకులను కూడగట్టి ఆ పార్టీకి రాజకీయ
ప్రత్యామ్నాయం ఏర్పాటుచేయాలనే ఉద్దేశ్యంతో పావులు కదిపారు. సహజంగానే ఇది కేంద్ర
రాష్ట్ర సంబంధాలను దెబ్బతీసింది. 'కేంద్రం ఒక మిధ్య' అని అభివర్ణిస్తూ, 'కేంద్ర
పెత్తనాన్ని ఇక సహించేది లేదు' అనే రీతిలో తెలుగుదేశం అధినేత ప్రదర్శించిన ధిక్కార ధోరణి యన్టీయార్ కు జనబాహుళ్యంలో
మరింత ఆదరణను, రాజకీయాల్లో మరిన్ని నిరసనలను సంపాదించి పెట్టింది. పైకి అహంభావంగా కానవచ్చే
ఎన్టీయార్ మనస్తత్వం, స్వపక్షంలోనే విపక్షం పురుడుపోసుకోవడానికి ఉపకరించింది.
ఏడాది తిరక్కుండానే ఆయన మంత్రివర్గంలోని సీనియర్ మంత్రి శ్రీ నాదెండ్ల భాస్కరరావు నాయకత్వంలో జరిగిన తిరుగుబాటు ఆగస్టు
సంక్షోభం రూపంలో శ్రీ రామారావు పదవికే ముప్పుతెచ్చింది. దరిమిలా జరిగిన
ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నిద్రాణంగా వున్న తెలుగుప్రజల రాజకీయ చైతన్యాన్ని
మళ్ళీ కొత్త చిగుళ్ళు తొడిగించింది. రాష్ట్ర రాజకీయాన్ని ఓ మలుపు తిప్పి సరికొత్త
రాజకీయాలకు తెర తీసింది. ఎన్నికల ద్వారా కాకుండా ఎన్నికయిన సభ్యులను తమ వైపు
తిప్పుకుని, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాలను అడ్డదోవలో కూలదోసే దుష్ట
సంస్కృతి అప్పటినుంచే తెలుగు రాజకీయాల్లో వేళ్ళూనుకుంది. ఈనాడు యధేచ్చగా
సాగిపోతున్న పార్టీ మార్పిళ్ళ రాజకీయాలకు ఆనాడే బీజం పడింది. తెలుగుదేశం పార్టీ
అవిర్భావంవల్ల రాజకీయాలు ఎంతగా చైతన్యవంతం అయ్యాయో, ఎంతగా బడుగు బలహీన వర్గాలకు
ప్రాతినిధ్యం పెరిగిపోయిందో, అంతే స్థాయిలో రాజకీయాలు కాలుష్య కాసరాలు కావడం, నైతిక విలువలు దారుణంగా క్షీణించడం ఇటువంటి అవలక్షణాలు అన్నీ అలాగే
పెరిగిపోయాయి అనడం సత్య దూరం కానేరదు. ఈ
మంచి చెడులకు రామారావు గారిని బాధ్యుడిని
చేయడం కూడా సమజసం కాదు. ఎందుకంటే అయన తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రాజకీయాల
పట్ల ఆయనకు ఒక నిర్దుష్టమైన అవగాహన వుండేది. ఆయన్ని బాగా ఎరిగినవారికీ,
సన్నిహితంగా మెలిగిన అధికారులకు, కొందరు
విలేకరులకు ఈ విషయం ఎరుకే. దానికి మహంతి
వంటి సీనియర్ పోలీసు అధికారులే ప్రత్యక్ష సాక్షులు. ఆ ఉదంతంతో ఈ వ్యాసాన్ని మొదలు పెట్టిన కారణం కూడా
అదే.
ఏ కాంగ్రెస్ పార్టీని యన్టీయార్ సకల పాపాలకు కూపంగా
అభివర్ణిస్తూ వచ్చారో, చివరికి ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీలో సయితం అవే అవలక్షణాలు చోటు చేసుకోవడాన్ని ఆయన
కళ్ళారా గమనించారు. కానీ, ప్రస్తుత రాజకీయాల్లో చేయగలిగింది ఏమీ లేదని అందరూ
నాయకుల్లాగానే అయన కూడా సమాధానపడ్డారేమో తెలియదు. కానీ తను నమ్మిన విషయాల్లో
యన్టీయార్ కు వున్న చిత్తశుద్ధిని ఆయన వ్యతిరేకులు కూడా సందేహించలేరనేది మాత్రం
వాస్తవం.
గతం తవ్వడం వల్ల ప్రయోజనం వుండదు. అయితే
సినిమాల్లో, రాజకీయాల్లో తనదయిన శైలితో ప్రకాశించిన శ్రీ రామారావు గారి జీవితం 'ముగింపు'
మాత్రం చాలా బాధాకరం. ఆయన అభిమానులు, వ్యతిరేకులు సైతం ఖేధపడే రీతిలో ఆయన మరణించడం
విధి వైపరీత్యం. చనిపోయిన తరువాత నేల
ఈనినట్టు రాష్ట్రం నలుమూలలనుంచి తరలివచ్చిన అశేష జనవాహినిని చూసిన ప్రతి ఒక్కరూ, జనం
గుండెల్లో ఆయన ఎంతగా గూడుకట్టుకుని వున్నారో అర్ధం చేసుకుని వుంటారు.
చనిపోయినవాడి కన్నులు చారడేసి అని సామెత. పోయినవాళ్ళను
గౌరవంగా తలచుకోవడానికి అలా అంటారు. బతికివున్నప్పుడు కూడా అదేవిధమైన గౌరవ,ప్రతిపత్తులు,
మర్యాద మన్ననలు సంపాదించుకున్నవాళ్ళు మరింత అదృష్టవంతులు. ఆ కోవకు చెందిన
వ్యక్తుల్లో మొట్టమొదట స్మరించుకోదగినవారు యన్.టీ. రామారావు గారు.
ఆయన చనిపోయి ఈనాటికి (జనవరి, 18) పందొమ్మిదేళ్లు గడిచిపోయాయి. ఒకరకంగా అప్పటికీ ఇప్పటికి ఒక తరం మారిపోయింది. అయినా తెలుగు ప్రజల
గుండెల్లో ఆయన స్మృతి పదిలంగానే వుంది. (18-01-2015)
లేబుళ్లు:
రాజకీయాల రంగూ రుచీ మార్చిన యన్టీయార్
16, జనవరి 2015, శుక్రవారం
అమెరికా పత్రిక్కి ఎక్కిన తెలుగు అత్తాకోడళ్ళ అనురాగాలు
అమెరికా పశ్చిమ భాగంలో
వున్న సియాటిల్ కి దాదాపు మూడువందల మైళ్ల దూరంలో వుంది స్పోకెన్ నగరం. లోగడ హైదరాబాదు ఆలిండియా
రేడియోలో నా సహోద్యోగిగా పనిచేసిన పవని విజయలక్ష్మి – ఆమె భర్త బాలాజీ
ఉద్యోగరీత్యా ఆ నగరంలో వుంటున్నారు. అక్కడ వాళ్లు చూడ ముచ్చటయిన ఇల్లు
కొనుక్కున్నారు. అమెరికాలో ఇది ఏమంత విచిత్రం ఏమీ కాదు. వాళ్లకు విచిత్రం
అనిపించిన విషయం వేరే వుంది. అదేమిటంటే బాలాజీ తలిదండ్రులు హైదరాబాద్ నుంచి వచ్చి
కొడుకూ కోడలి దగ్గర ఆరు నెలలు వుండి తిరిగి ఇండియాకు వెళ్లారు. వేరు కాపురం
పెట్టుకున్న కొడుకు దగ్గర తలిదండ్రులు అన్ని నెలలు గడపడం అక్కడి అమెరికన్లకు ఎంతో
వింతగా అనిపించింది. ఆ నోటా ఈ నోటా పడి ఈ సంగతి ఆ నగరం నుంచి వెలువడే ప్రసిద్ధ దినపత్రిక
'స్పోక్స్ మన్ రివ్యూ' పత్రిక
విలేఖరి రెబెక్కా నప్పీ చెవిన పడింది. ఇంకేముంది ఆమె అమాంతం విజయలక్ష్మి అడ్రసు
కనుక్కుని ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేసి మొత్తం ఫామిలీ ఫొటోలతో సహా మొదటి పుటలో
ప్రచురించింది.
ఈ నేపధ్యం అంతా ఎందుకంటే ఈ విజయలక్ష్మి ఇవ్వాళ ఇల్లు వెతుక్కుని మరీ
మా ఇంటికి వచ్చింది. లోగడ హైదరాబాదులో వున్నప్పుడు ఆవిడకు మా ఆవిడకు మంచి పరిచయం.
మేము అమెరికా వెళ్ళినప్పుడు కూడా వాళ్ల వూరు వెళ్ళాము. కూర్చున్నది కాసేపయినా
గలగలా ఎన్నెన్నో కబుర్లుచెప్పి వెళ్ళింది. స్నేహమంటే ఇదే కదా అనిపించింది.
రేపో
ఎల్లుండో తిరిగి వెళ్ళే హడావిడిలో కూడా గుర్తు పెట్టుకుని మరీ మా ఇంటికి వచ్చింది
పవని విజయలక్ష్మి. ఆమె సహృదయతకు ధన్యవాదాలు.
14, జనవరి 2015, బుధవారం
అది అదే! ఇది ఇదే!
కొన్ని విషయాలు విన్నప్పుడు కొన్ని పాత సంగతులు
గుర్తుకు రావడం సహజం.
మూడు దశాబ్దాల క్రితం నా మొదటి విదేశీ ప్రయాణం. పాత సూట్ కేసులో బట్టలు సర్దుకుని వెళ్లి, వచ్చేటప్పుడు
కొత్త సూటుకేసు కొనుక్కుని తిరిగివస్తే లగేజి బరువు కొంత కలిసి వస్తుందని మిత్రుడు ఒకరు చెప్పిన మాట విని ఓ పరమ చెత్త సూటుకేసుతో సింగపూరులో
దిగబడ్డాను. అప్పటివరకు బేగం పేట ఎయిర్
పోర్ట్, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ మాత్రమె చూసిన అనుభవం. అదే కళ్ళతో సింగపూరు ఎయిర్ పోర్ట్
చూసినప్పుడు కళ్ళు గిర్రున తిరిగాయి. కొత్తగా నిర్మించిన ఎయిర్ పోర్ట్ మాదిరిగా తళతళలాడి
పోతోంది. ఊళ్ళోకి తీసుకెళ్ళాల్సిన బస్సుకు కాస్త వ్యవధానం ఉండడంతో ఇంగ్లీష్ వచ్చిన ఓ పెద్దమనిషితో
మాటలు కలిపాను. ఎయిర్ పోర్ట్ గొప్పతనం గురించి ప్రస్తావిస్తే, అతడు తాపీగా విని, 'మరో
మూడు నెలలు ఆగి రండి. అప్పటికి కొత్త ఎయిర్ పోర్ట్ తయారవుతుంది' అన్నాడు చాలా
సింపుల్ గా. బదులు ఏం చెప్పాలో తోచక, 'కాస్త
ఈ సూట్ కేసు చూస్తుంటారా, ఇప్పుడే బాత్
రూమ్ కి వెళ్లి వస్తాను' అన్నాను నా లగేజి చూపిస్తూ.
'అక్కడ వుంచి మూడు రోజుల తరువాత రండి. అదక్కడే
వుంటుంది' అన్నాడతను మరింత తాపీగా.
ఈ పాత సంగతి ఇప్పుడు ఎందుకు గుర్తుకు
వచ్చిందంటారా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంట బెట్టుకుని
వెళ్ళిన సింగపూరు బృందంలోని ఒకరు తిరుమల
కాటేజీలో లాప్ టాప్ వుంచి దైవ దర్శనానికి
వెళ్లి తిరిగి వచ్చేసరికి అది గల్లంతయిందని ఈరోజు పత్రికల్లో చదివినప్పుడు, అలనాటి
నా సింగ పూరు అనుభవం స్పురణకు వచ్చింది.
(Note: Image Courtesy Andhra Jyothy, Dated 14-01-2015)
లేబుళ్లు:
అది అదే! ఇది ఇదే!,
andhra jyothy
13, జనవరి 2015, మంగళవారం
బొటనవేలి కధ
చదువు రానివాళ్ళని, సంతకం చేయడం తెలియనివాళ్ళని అంగుష్టమాత్రులని
సంస్కృతంలో, నిశానీగాళ్ళని సంకర భాషలో, వేలిముద్రగాళ్ళని అచ్చ తెలుగులో ఎద్దేవా
చేస్తుంటారు. కాని వారికి తెలియంది ఒకటుంది. వేలెడు బొటనవేలే కదా అనుకోకండి దానికి
కూడా బోలెడు చరిత్ర వుంది సుమా!
ఒక్కసారి అరచేయి ఎలావుంటుందో, అందులో వేళ్ళ అమరిక
ఎలా వుంటుందో గమనించండి. చూపుడు వేలు, మధ్యవేలు, ఉంగరం వేలు, చిటికిన వేలు
పక్కపక్కన వుంటే ఒక్క బొటనవేలు ఒక్కటే విడిగా వుంటుంది. ఆ ఒక్కటి లేదనుకోండి
ఇంతోటి నాగరీకం ఉండేదే కాదు. మనుషులందరూ పాత రాతియుగంలోనే ఉండిపోయేవారు. బొటనవేలు
ప్రాశస్త్యం తెలిసిన వాడు కనుకనే ద్రోణాచార్యుడు ఆ వేలిని గురుదక్షిణగా ఇమ్మంటాడు తన
శిష్యుడు కాని ఏకలవ్యుడిని. ప్రియ శిష్యుడు అర్జునుడికి పోటీ అతడొక్కడే అని
గ్రహించిన ద్రోణుడు బొటనవేలును గురుదక్షిణగా కోరి ఏకలవ్యుడిని శాశ్వితంగా విలువిద్యకు దూరం చేసినట్టు పురాణ కధనం.
నిజమే. మనిషికి బొటనవేలు అనేది లేకపోతే చేతికి
పట్టు చిక్కదు. దేన్నీ పట్టుకోలేదు. పట్టుకోలేకపోతే ఇన్నిన్ని విద్యలు అతగాడికి అలవడేవి
కావు. ఒక చేత్తో రాతిని పట్టుకుని మరో రాతితో దాన్ని కొట్టి నిప్పు రాజేసిన విధానమే
ఆదిమజాతి మనుషుల జీవితాలనే సమూలంగా మార్చివేసింది. మొత్తం నరజాతి చరిత్రనే
పెద్ద మలుపు తిప్పింది. ఆయుధం పట్టాలన్నా,
అన్నం తినాలన్నా, అసలు ఏపని చేత్తో చేయలన్నా బొటనవేలే కీలకం. మనిషి చేతికి ఆ బొటనవేలే లేకపోతే మానవుడు ఇప్పటికీ ఆదిమ
మానవుడి మాదిరిగానే మిగిలిపోయి ఉండేవాడని సూతుడు సౌనకాది మునులకు చెప్పగా వారిలో
ఒకండు ఆ విషయాన్ని భవదీయుడితో పంచుకోవడం జరిగింది.
మంగళం మహత్! శ్రీ! శ్రీ! శ్రీ!
NOTE: Courtesy Image Owner
12, జనవరి 2015, సోమవారం
శాశ్వితమైనది అశాశ్వితమొక్కటే
ఆశాశ్వితమైనదానిని శాశ్వితమని
నమ్మడం మానవ సహజం. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శ్రీ మోహన్ కందా
ఇందుకు సంబంధించి ఒక విషయం చెబుతుండేవారు. 'ప్రభుత్వ అధికారులకు పలానా రోజు పదవీ విరమణ చేయాల్సి
వుంటుందని బ్రహ్మలిఖితం మాదిరిగా ముందే రాసివుంటుంది. అయినా ఆఖరు రోజు దగ్గర
పడుతున్నా కూడా ఆ పదవి శాశ్వితమనే భ్రమలోనే వారుంటార'ని ఆయన అనేవారు. కందా గారి
అభిప్రాయం రాజకీయ నాయకులకి కూడా వర్తిస్తుంది.
కాకపొతే వారిది ఓ విధంగా
విచిత్ర మనస్తత్వం. 'వుంటే పదవిలో అయినా వుండాలి. పదవి లేకపోతే వార్తల్లో అయినా
వుండాలి' అనేది వారి తత్వం.
వై.యస్.ఆర్.సీ.పీ.
అధ్యక్షుడు వై.యస్.జగన్ మోహన రెడ్డి ప్రస్తుతం అధికారంలో లేరు. విభజిత ఆంద్రప్రదేశ్
రాష్ట్రంలో ప్రస్తుతం ఆయన పాత్ర ప్రతిపక్ష నాయకునికే పరిమితం. పాత్రను మార్చగలిగే
శక్తి కేవలం ఎన్నికలకు మాత్రమే వుంది. అవీ
ఇప్పట్లో లేవు. 2019 దాకా ఆగాలి. అయినా సరే ఇటీవల ఆయన కొన్ని విచిత్రమైన వ్యాఖ్యలు
చేసారు.
'చంద్రబాబు నాయుడు
నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ రెండేళ్ళలోనే అధికారం కోల్పోతుందని, ఒకవేళ పూర్తి కాలం
పాలించినా తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందనీ,
ఏకంగా ముప్పై ఏళ్ళపాటు జనరంజకంగా పాలించి జనం గుండెల్లో శాశ్వితంగా నిలిచిపోతాన'నీ
ఆయన వ్యాఖ్యల సారాంశం.
ఒక రకంగా చూస్తె ఇది కొత్త
విషయం ఏమీ కాదు. నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా అయన ఈ సంగతి పలుమార్లు
చెప్పారు.
జగన్ వ్యాఖ్యలు సహజంగానే
టీడీపీలో కలకలం రేపాయి. రకరకాలుగా ప్రతి వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. అవి ఇక్కడ
అప్రస్తుతం. ఎందుకంటె ఏ రాజకీయ నాయకుడయినా తను అధికారంలోకి రావాలనీ, ఆ అధికారం కూడా శాశ్వితమనే అనుకుంటాడు. అందులో అసహజమేమీ లేదు. ఈ
విషయంలో మినహాయింపు ఇవ్వగల రాజకీయ నాయకుడు ఎవ్వరూ ఈ రోజుల్లో కలికానికి కూడా
దొరకరు. ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరూ తమ అధికారం సుదీర్ఘ కాలం
సాగాలనే తమ మనసులోని మాటను చెప్పకనే చెబుతుంటారు. అయిదేళ్ళ కాల వ్యవధికి ప్రజలు
అధికారం ఇస్తే ముప్పయ్యేళ్ళ ప్రణాళికలు గురించి మాట్లాడుతుండడం దీనికి ఒక ఉదాహరణ.
ఇది సరే! అధికారాన్ని
పదికాలాలపాటు పదిలంగా కాపాడుకున్న నాయకులు
కూడా చరిత్రలో వున్నారు. చరిత్రలో ఎందుకు, సిక్కిం ప్రస్తుత ముఖ్యమంత్రి పవన్
చాల్మింగ్ నే తీసుకోండి. నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విజయబావుటా
ఎగురవేసి అయిదోమారు ముఖ్యమంత్రి కాగలిగారు. ఇప్పటికే అంటే 1994 డిసెంబరు 12 వ తేదీన మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటినాటినుంచి దరిమిలా అయిదేళ్ళకోమారు జరిగిన ఎన్నికల్లో వరుస విజయాలు
సాధిస్తూ నాలుగు పర్యాయాలు అంటే ఏకంగా ఇరవై ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన ఘనత పవన్ చాల్మింగ్ ఖాతాలో వుంది.
ఈసారి అయిదేళ్ళు పూర్తయితే సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన జ్యోతిబసు
రికార్డును ఆయన అధిగమిస్తారు. ముఖ్యమంత్రిగా రజితోత్సవం జరుపుకోగల అరుదయిన
అపూర్వమయిన ఘనత ఈ సిక్కిం నాయకుడిదవుతుంది.
పొతే, జ్యోతిబసు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా (1977-2000) వరుసగా
ఇరవై మూడు సంవత్సరాల మూడున్నర మాసాలు పాలించారు.
అదీ సీపీఎం నాయకత్వంలోని వామపక్ష కూటమి ముఖ్యమంత్రిగా. వార్ధక్య కారణాలతో పదవి
నుంచి తనకు తానే తప్పుకున్నారు. ఇది కూడా చాలా అరుదయిన విషయమే.
ఇంత సుదీర్ఘ కాలం కాకపోయినా,
వరసగా మూడు పర్యాయాలు ముఖ్యమంత్రులయిన వారు మరో ఆరుగురు వున్నారు. వీరిలో ముగ్గురు,
శ్రీమతి షీలా దీక్షిత్, (ఢిల్లీ), శ్రీ తరుణ్ గగోయ్,(అసోం), ఓక్రామ్
ఇబోబి సింగ్ - కాంగ్రెస్ వారే కావడం విశేషం. పొతే మిగిలిన ముగ్గురిలో ఒకరు
ప్రస్తుత భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ, బీజేపీ, (గుజరాత్, 2001 - 2014) శ్రీ
మాణిక్ సర్కార్, సీపీఎం (త్రిపుర), శ్రీ నవీన్ పట్నాయక్, బీజేడీ, (ఒడిషా).
ఈ జాబితాలో చేరినవారు మరికొందరు వున్నారు.
శ్రీ మోహన్ లాల్ సుఖాడియా,
కాంగ్రెస్ (రాజస్తాన్, పదహారు సంవత్సరాల ఎనిమిది మాసాలు, 1954
- 1971)
శ్రీ
గెగాంగ్ అపాంగ్ (అరుణాచల్ ప్రదేశ్, 1980
- 1999)
శ్రీ బీ.సీ. రాయ్ (కాంగ్రెస్,
పశ్చిమ బెంగాల్, 1948 - 1962)
శ్రీ కామరాజ్
నాడార్ (కాంగ్రెస్, తమిళ్ నాడు, 1954 - 1963)
శ్రీ వసంత రావు నాయక్ (కాంగ్రెస్,
మహారాష్ట్ర, 1963 - 1975)
శ్రీ ఎం.జీ. రామచంద్రన్ (అన్నా
డీ.ఎం.కే., తమిళ్ నాడు, 1977 - 1987)
తెలుగు రాష్ట్రం ప్రత్యేకించి మొట్టమొదటి భాషా ప్రయుక్త
రాష్ట్రం అయిన ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో శ్రీ చంద్రబాబునాయుడికి అత్యధిక కాలం
ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు వుంది. ఆయన వరసగా రెండు దఫాలు, 1995
సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 2004 మే
నెల 13
వరకు తిరిగి మూడో సారి
2014 జూన్ 8
నుంచి ఈరోజు వరకు మొత్తం 3600
రోజులు అధికారంలో వున్న ఘనత సంపాదించుకున్నారు. 2009
వరకు సుదీర్ఘకాలం పాలించిన రికార్డు అంతవరకు చంద్రబాబు పేరిటే వుండేది. ఆ ఏడాది రాజశేఖరరెడ్డి రెండో
పర్యాయం ముఖ్యమంత్రి అయినప్పుడు, అయిదేళ్ళ తరువాత, మొత్తం పదేళ్ళ పాలనాకాలం
పూర్తిచేసుకుని వైయస్సార్ దాన్ని అధిగమించే అవకాశం ఉంటుందని భావించారు. అయితే దురదృష్టవశాత్తు హెలికాప్టర్ దుర్ఘటనలో
వైయస్సార్ ఆకస్మికంగా కన్నుమూయడంతో ఆయన మొత్తం 1938 రోజులు
మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేయగలిగారు. ఇక ముందు ముందు రాజకీయ
సుస్థిరతకు రోజులు చెల్లిపోయి, సంకీర్ణశకం
రాజకీయాలే రాజ్యమేలే అవకాశాలు ఉన్నందువల్ల, మూడో టరం కూడా
ముఖ్యమంత్రిగా ఎన్నికయిన చంద్రబాబు
రికార్డును భవిష్యత్తులో తిరగరాయడం
ఎవరికయినా కష్టసాధ్యమే కాగలదు. వీరిద్దరి
తరువాత మూడో స్థానంలో కాసు బ్రహ్మానంద రెడ్డి (2777 రోజులు)
వున్నారు. ఎన్టీయార్ సయితం 2751 రోజులే
సీ.ఎమ్. పీఠం మీద ఉండగలిగారు.
చాలాకాలం ముఖ్యమంత్రులుగా పనిచేసి కొందరిలా చరిత్రపుటలకు
ఎక్కితే మరికొందరు మరో రకంగా చరిత్ర
సృష్టించారు. కాళ్ళ పారాణి సామెత చందంగా అలా ప్రమాణ స్వీకారం చేసి ఇలా గద్దె
దిగిపోయిన బాపతు. వీరిలో ముందు చెప్పుకోవాల్సింది జగదంబికా పాల్ గురించి. ఎక్కడా
విన్నట్టు కూడా అనిపించని ఈ పేరుగల ఆసామీ ఉత్తర ప్రదేశ్ వంటి అతిపెద్ద
రాష్ట్రానికి అతి పిన్నకాలం - 'మూడంటే మూడు రోజులు' ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1998 ఫిబ్రవరి
21 న
అప్పటి యూపీ గవర్నర్ రొమేష్ భండారీ, కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని బర్తరప్ చేయడంతో
జగదంబికా పాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. గవర్నర్ నిర్ణయాన్ని కళ్యాణ్
సింగ్ సుప్రీం కోర్టులో సవాలు చేసారు. సింగ్ తొలగింపు రాజ్యాంగ విరుద్ధం అని
సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించడంతో మూడో
రోజునే జగదంబికా పాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. కళ్యాణ్
సింగ్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఇక బీహారులో సతీష్ ప్రసాద్ సింగ్ అనే
పెద్దమనిషి అయిదే రోజులు ముఖ్యమంత్రి వైభోగం అనుభవించారు. 1968
జనవరి 28 న
ముఖ్యమంత్రి అవడం, ఫిబ్రవరి ఒకటో తేదీకల్లా పదవి నుంచి దిగిపోవడం చకచకా
జరిగిపోయాయి. కాకపొతే అసలు ముఖ్యమంత్రి ఎంపికలో జరిగిన ఆలస్యం ఆయనకి ఆవిధంగా కలిసివచ్చింది. మేఘాలయలో యస్ సీ మారక్ 1998 ఫిబ్రవరి
ఇరవై ఏడు నుంచి మార్చి మూడో తేదీ వరకు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నారు. ఒకానొక
కాలంలో అక్కడ రాజకీయ అనిస్థితి ఏ దశకు
చేరుకుందంటే, 'విందు భోజనాల్లోనే రాత్రికి
రాత్రే ముఖ్యమంత్రులను మార్చే స్థాయికి
వెళ్లిందని హాస్యోక్తిగా చెప్పుకునేవారు.
ఇక దక్షిణాదిన తమిళనాడులో ఎమ్జీ
రామచంద్రన్ మరణానంతరం ఆయన భార్య జానకీ
రామచంద్రన్ ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆవిడ ఆ పదవిలో, 1998 జనవరి
ఏడోతేదీ నుంచి జనవరి ముప్పయ్యోతేదీ వరకు, ఇరవయ్
నాలుగు రోజులు మాత్రమే ఉండగలిగారు.
ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి కూడా
ఈ విశిష్ట స్థానం లభించింది. తెలుగుదేశం
పార్టీ ఎన్టీ రామారావు నేతృత్వంలో తొట్టతొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి
రోజుల్లోనే అప్పటి గవర్నర్ శ్రీ రాం లాల్, ఎన్టీయార్ ని తొలగించి శ్రీ నాదెండ్ల భాస్కర
రావుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారు.
అప్పుడు రగిలిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం దరిమిలా ఆయన నెల రోజుల్లోనే (1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 16 ) ముఖ్యమంత్రి పదవికి
రాజీనామా చేయాల్సివచ్చింది. శ్రీ రామారావు సరిగ్గా నెల తిరిగేసరికల్లా మళ్ళీ
ముఖ్యమంత్రి కాగలిగారు.
ఇటువంటి ఉదంతాలు మరికొన్ని వున్నాయి. బీహారు ముఖ్యమంత్రిగా బీపీ
మండల్ 31 రోజులు (1968), కేరళలో మహమ్మద్ కోయా 45 రోజులు (1979), హర్యానాలో ఓపీ చౌతాలా 20 రోజులు (1989 ) ముఖ్యమంత్రి పదవిని వెలగబెట్టారు.
అయినా పదవిలో ఎన్నాళ్ళు వున్నామన్నది
కాదు లెక్క. ప్రజలకు పనికొచ్చే పనులు ఎన్ని చేసామన్నదే చివరికి లెక్కలోకి వచ్చే ముక్క.
ఎవరో
వేదాంతి చెప్పినట్టు శాశ్వితమైనది అశాశ్వితమొక్కటే. (12-01-2015)
NOTE: Courtesy Image
Owner
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)





