7, జనవరి 2015, బుధవారం

దిల్ మాంగే మోర్



రాజుగారు ఉద్యానవనంలో వాహ్యాళి ముగించుకుని తిరిగి రాజప్రాసాదంలో అడుగిడే ముందు అతడు వున్నట్టుండి ఎదురుపడ్డాడు. చూడబోతే బిక్షగాడి మాదిరిగా వున్నాడు. బాగా  ఉల్లాసంగా వున్న రాజుగారికి ఆ క్షణంలో అతగాడికి ఏదయినా  సాయం చేయాలని అనిపించింది.
ఏం కావాలి నీకు ? కోరుకో! ఏదయినా సరే ఇస్తాను అన్నాడు రాజుగారు రాజసం వొలక బోస్తూ.
రాజా! తొందరపడి అలా అనకు. అనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో
అలా ధైర్యంగా నిలదీసే మనిషి రాజుగారికి ఇంతవరకు తారసపడలేదు. కానీ, అతడు అల్లాటప్పా రాజు కాదు. అనేక యుద్ధాల్లో ఆరితేరిన వాడు. అరివీరభయంకరులయిన శత్రురాజులను మట్టికరిపించి సువిశాల సామ్రాజ్యం నిర్మించుకున్న మహా చక్రవర్తి. అలాటి వాడు,  ‘కోరుకో ఇస్తాను అంటే ఆలోచించుకో అనే మనిషి మామూలువాడు అయివుండడు
అలా ఆలోచించుకున్న రాజు అన్నాడు అతడితో.
పరవాలేదు అడుగు. సంశయించాల్సిన పనిలేదు. ఇచ్చిన మాట తప్పే అలవాటు మా ఇంటావంటా లేదు.
సరే! రాజా! చూసారుగా నా చేతిలోని ఈ బిక్షాపాత్ర. ఇందులో ఏం వేస్తారో వేయండి. దీన్ని నింపండి. నాకంతే చాలు. అయితే మళ్ళీ చెబుతున్నాను మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి
రాజు విలాసంగా నవ్వాడు. నవ్వి అన్నాడు.
ఈ పాత్ర నింపడానికి అంతగా ఆలోచించుకోవాల్సిన అవసరం వుందనుకోను
రాజు అతడిని వెంటబెట్టుకుని రాజ ప్రాసాదంలోకి తీసుకువెళ్ళాడు. పరివారాన్ని పిలిచి అత్యంత విలువైన మణి మాణిక్యాలతో ఆ పాత్రను నింపమని ఆదేశించాడు.   
కృష్ణ తులాభారం  మాదిరిగా సన్నివేశం  మారిపోయింది. ఒకటికి రెండుసార్లు యెందుకు ఆలోచించుకోమన్నాడో రాజుకు క్రమంగా అవగతమవుతోంది. ఆ పాత్రలో ఏమి వేసినా, ఎన్ని వేసినా ఇట్టే అదృశ్యం అయిపోతున్నాయి. ఆ బిక్షాపాత్ర తిరిగి ఖాళీ అవుతూనే వుంది.
రాజదర్బారులో జరుగుతున్న ఈ వింత గురించి తెలిసి జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు.
ఖజానాలోని సమస్త ధనరాసులు, స్వర్ణాభరణాలను  భటులు గంపలకొద్దీ  తెచ్చి ఆ బిక్షాపాత్రలో వేస్తున్నారు. చిత్రం! వేసినవి వేసినట్టే మాయం అవుతున్నాయి. పాత్ర ఖాళీ అవుతూనే వుంది.
రాజుగారిలో పట్టుదల పెరిగింది. ముందూ వెనకా చూడకుండా తనకున్న సమస్తాన్ని ధారపోశాడు. ఫలితం శూన్యం.
చివరకి జరిగినదేమిటంటే సాయంత్రానికల్లా రాజ దర్బారులో ఇద్దరు బిక్షగాళ్ళు మిగిలారు.
ఒకడు ఆ వచ్చినవాడు. రెండోవాడు రాజుగారు.
సర్వం పోగొట్టుకున్న తరువాతగాని రాజుకు గర్వం దిగిరాలేదు. ఆగంతకుడి ముందు సాగిలపడి అన్నాడు.
మహానుభావా! నా అహంకారాన్ని మన్నించండి. నేను మీమాట పెడచెవిన పెట్టాను. ఇంతకీ ఈ బిక్షాపాత్ర సంగతి చెప్పండి. ఇందులోని మర్మం ఏమిటో సెలవివ్వండి
ఆగంతకుడు రాజును మించిన విలాసం ప్రదర్శిస్తూ మందహాసం చేసాడు.
రాజా! నిజానికి ఇది బిక్షాపాత్ర కాదు. మానవ కపాలం. నేను దాన్ని మెరుగు పెట్టి పాత్ర మాదిరిగా కనబడేట్టు చేసాను. ఇందులో ఎన్ని వేసినా, ఏం వేసినా అంతే! ఏమీ మిగలదు.  అధికారం, సిరి సంపదలు ఎన్ని వున్నా ఇది ఇంకా ఇంకా కావాలని కోరుకుంటుంది. దీని ఆశకు అంతు లేదు. ఎన్ని ఇచ్చినా వద్దనదు. యెంత ఇచ్చినా కాదనదు. మనుషులకు, ఈ ఆశ అనండి, అత్యాశ అనండి, దురాశ అనండి -  కాటికి పోయినదాకా అది వాళ్ల వెంటే వుంటుంది. ఆ వాస్తవం బోధపరచడానికే ఇదంతా
రాజుకు తత్వం బోధపడగానే మాయమయిన ధనరాసులు, సిరి సంపదలు ఆయనకు  మళ్ళీ దక్కాయి. అంతేకాదు, వాటికి అదనంగా ఒక  జీవిత సత్యం కూడా ఆయన ఖాతాలో చేరింది.
దిల్ మాంగే మోర్’ 



(ఇంగ్లీష్ కధకు స్వేచ్చానువాదం & Courtesy Image Owner)

6, జనవరి 2015, మంగళవారం

డస్ట్ బిన్


ఖరీదయిన మద్యం సీసాకు ఓ కరెన్సీ నోటు తారసపడింది.మద్యం సీసా కరెన్సీ నోటుతో అంది.
‘ఏం చూసుకుని నీకా మిడిసిపాటు? నువ్వొక కాగితం ముక్కవి. ఇంకా చెప్పాలంటే  నాతో  పోలిస్తే  ఎందుకూ పనికిరాని  చిత్తు కాగితానివి.’
కరెన్సీ నోటు తాపీగా జవాబిచ్చింది.
‘నువ్వన్నది నిజమే. నేనొక కాగితాన్నే. కానీ నా జన్మలో నేనెప్పుడూ నీలా ‘చెత్త బుట్ట’ని చూడలేదు’


NOTE: Courtesy Image Owner

కధకు మరణం లేదు


(అంతేకాదు, చక్కని కధకు 'పాతా కొత్తా' తేడాలేదు. అలాటికధలు ఎన్నిసార్లు చదువుకున్నా తృప్తి తీరదు. అందుకే కధా ప్రియులు దేవినేని మధుసూదన రావు గారు ఈ కధను మరోమారు నెమరు వేసుకొవడానికి నెట్లో పంపారు.
వండడం ఓ కళ. వండి వార్చడం మరో కళ. వండినదాన్ని వడ్డించడం ఇంకో అపురూప కళ. అదేమిటో శంకరమంచి సత్యం గారు తన 'అమరావతి కధ'ల్లో ఒకదానిలో చెప్పారు. ఆరగించండి.)




తృప్తి
పూర్ణయ్యని బావగాడంటారు అందరూ.
బావగాడు లేకపోతే సరదా లేదు, సంబరమూ లేదు. పెళ్ళి గాని, పేరంటం గాని, వంట హంగంతా బావగాడే. వంటవాళ్ళని కూర్చోనిచ్చేవాడు కాదు, నించోనిచ్చేవాడు కాదు. పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు.
ఒకసారి వనసంతర్పణం పెట్టుకున్నారు. జనం అంతా మామిడి తోపులో చేరారు. చాపలు పరిచి పిచ్చాపాటీ మాట్లాడుకునే వారు కొందరు. పేకాటలో మునిగిన వారు కొందరు. గాడిపొయ్యి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరుగెత్తుకొచ్చాడు. అందరూ వినండర్రాఅని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మానిపించాడు, పేకాట మూయించాడు. వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నానుఅంటూ లిస్టు చదివాడు.
వంకాయ మెంతికారం పెట్టిన కూర
అరటికాయ నిమ్మకాయ పిండిన కూర
పెసరపప్పుతో చుక్కకూర
వాక్కాయ కొబ్బరి పచ్చడి
పొట్లకాయ పెరుగు పచ్చడి
అల్లం, ధనియాల చారు
మసాలా పప్పుచారు
అయ్యా! జీడిపప్పు, పచ్చకర్పూరాలతో పాయసం
మామిడి కోరుతో పులిహోర
గుమ్మడి వడియాలు, వూరమిరపకాయలు.
అందరికీ సమ్మతమేనా?” అని అరిచాడు.
సమ్మతమేమిటి నామొహం - అప్పటికప్పుడు అందరి నోళ్ళలో నీరూరించి, ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. జిహ్వ గిలగిల లాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది.
అంతటితో ఆగాడు కాదు బావగాడు. మరో అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకూ ప్రదర్శనకు పట్టుకొచ్చాడు. చూశారా! లేత వంకాయలునవనవలాడుతున్నాయిమెంతికారం పెట్టి మరీ వండిస్తున్నానుదగ్గరుండి కోయించుకు వచ్చాను. …” అని అందరికీ చూపించి వెళ్ళి పోయాడు. ఆ తరవాత జనానికి వేరే ఆలోచనలు పోయినాయి కావు. వంకాయ గురించే చర్చలు. వంకాయ ఎన్ని రకాలుగా కూరలు చేయొచ్చు. కాయ కాయ పళంగా వండితే రుచా? తరిగి వండితే రుచా? అసలు రుచి వంకాయలో వుందా? వంకాయ తొడిమలో వుందా? ఇలా చర్చలు సాగాయి.
మరో అరగంటకి — –
నిగనిగలాడే వాక్కాయల బుట్టతో, లేత చుక్కకూర మోపుతో వచ్చి అందర్నీ పలకరించాడు. వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి,” అని తలా ఓ కాయ పంచాడు. చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహా చక్కగా మేళవిస్తుంది.అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు. మళ్ళీ జనం అంతా వంట కబుర్లలో పడ్డారు. బావగాడు ఇలా ప్రదర్శన లిస్తుంటే ఆకలి రెప రెప పెరుగుతోంది.
ఇక అక్కడ గాడిపొయ్యి దగ్గర వంటవాళ్ళని పరుగులు తీయిస్తున్నాడు. పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వెయ్యమని పురమాయిస్తున్నాడు.
ఓ పక్క పులిహోర తిరగమాత వెయ్యగానే రయ్యిన జనం దగ్గరికి పరిగెత్తుకు వొచ్చి, “ఆ వాసన చూశారా? పులిహోర తిరగమోతసన్న బియ్యంతో చేయిస్తున్నాను,” అని మాయమయ్యాడు.
మళ్ళీ జనానికి ఆకలి ఉవ్వెత్తున లేచింది. ఆకలి నిలువెత్తయింది. తాటి ప్రమాణమైంది. శరీరం అంతా ఆకలే అయి కూర్చుంది. జనం అంతా ఎప్పుడు వడ్డిస్తారా అని ఆవురావురు మంటున్నారు. ఎట్టకేలకు గంట కొట్టాడు బావగాడు. లేత అరిటాకులు, శుభ్రంగా కడుక్కోండి.అని వరుసల మధ్య కొచ్చి హెచ్చరించాడు.
సుబ్బయ్యన్నయ్యకు ఒక ఆకు వేస్తావేం? రెండు ఆకులు కలిపి వేయించుఅంటున్నాడు.
వడ్డనలు మొదలయ్యాయి.
నేతి జారీ పుచ్చుకొని పేరు పేరునా అందర్నీ అడిగి వడ్డిస్తున్నాడు. వంకాయ అలా వదిలేయకూడదు. నిమ్మకాయ పిండిన అరిటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియనిది కాదు.అంటూ మళ్ళీ కూర వడ్డింపించి ఆకలి పెంచుతున్నాడు. జనం ఆబగా తింటున్నారు.
చుక్కకూర పప్పులో వూరమిరపకాయలు మిళాయించండి.
పప్పుచారులో గుమ్మడి వడియాలు కలిపి చూడండి.
వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంచుకోవచ్చు. తప్పు లేదు.
ఇంకా విస్తట్లో మిగిల్చావేం. పూర్తి చేసి పాయసానికి ఖాళీగా ఉంచుకో.
అప్పుడే మంచినీళ్ళు తాగకు. మీగడ పెరుగుంది.” ….
ఇలా ఎగసన తోస్తుంటే ఎవరాగగలరు? జనం కలబడి భోంచేశారు. జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు. విస్తళ్ళ ముందు నుండి లేవడమే కష్టమయింది. అందరికీ తాంబూలాలు ఇచ్చిన తరవాత వంటవాళ్ళని కూర్చోబెట్టాడు బావగాడు. కష్టపడి వండారు, తినకపోతే ఎలా?” అని కొసరి కొసరి వడ్డించాడు. వాళ్ళ భోజనాలు కూడా అయిన తరువాత అందరికంటే ఆఖరున గాడిపొయ్యి పక్కన ఒక చిన్న ఆకు వేసుకొని తను కూర్చున్నాడు.
అప్పటికి కూరలు మిగల్లేదు.
ఓ గంటె పప్పు, కాస్తంత పచ్చడి, గుప్పెడు పులిహోర మిగిలితే అవే వడ్డింపించుకొని వంట రుచిని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నాను అన్నంతా హాయిగా భోంచేశాడు. తనకేం మిగల్లేదనే బాధ లేదు. నలుగురూ హాయిగా, తృప్తిగా, రుచిగా తిన్నారన్న సంతోషమే బావగాడి తాంబూలపు పెదాలపైని చిరునవ్వు. 

(అమరావతి కథలు - సత్యం శంకరమంచి. నవోదయ పబ్లిషర్స్, విజయవాడ. 1978. రూ. 150/-)
Cover Page Courtesy Shri 'BAPU'


5, జనవరి 2015, సోమవారం

స్వచ్ఛ భారత్ స్వప్నం సాకారం కావాలంటే


సూర్యదేవర రామచంద్రరావు అంటే చాలామందికి తెలియకపోవచ్చు, యస్.ఆర్. రావు అంటే గుర్తురాక పోవచ్చు. కానీ, సూరత్ మునిసిపల్ కమీషనర్ రావు అనగానే  చప్పున గుర్తొస్తారు ఈ 1978  బ్యాచ్ గుజరాత్ క్యాడర్  ఐ.ఏ.యస్. అధికారి. తదనంతర కాలంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో సహా కేంద్రంలో సయితం ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు. అయితే,  సూరత్ మునిసిపల్ కమీషనర్ గా పనిచేసిన కాలమే ఆయనను చరిత్రలో చిరస్థాయిగా నిలబెట్టింది.
1994 లో సూరత్ పట్టణాన్ని ప్లేగ్ వ్యాధి అతలాకుతలం చేసింది. అసలే సూరత్ కు దుర్గంధ నగరం అనే పేరు. దానికి తగ్గట్టు, ప్లేగ్ వ్యాధి జరిపిన ముట్టడితో మరింత మురికి పేరు, సూరత్ పేరులో పేరుకుపోయింది. ఆ నేపధ్యంలో యస్.ఆర్.రావు అనే యువ ఐ.ఏ.యస్.  అధికారిని ప్రభుత్వం 1995  లో సూరత్ మునిసిపల్ కమీషనర్ గా నియమించింది. పన్నుల వసూళ్లు, రహదారుల నిర్మాణాలు కాదు ఆయన మీద మోపిన బాధ్యత. ప్లేగ్ వ్యాధి తాకిడితో తలకిందయిన నగర పారిశుధ్యాన్ని తిరిగి గాడిలో పెట్టడం అనే పెను బాధ్యతను ఆయన భుజస్కంధాలపై పెట్టింది.
బాధ్యతలు స్వీకరించిన వెంటనే  ఏమాత్రం కాలయాపన చేయకుండా ఆయన నేరుగా  రంగంలోకి దిగిపోయారు. ముందు  సూరత్ నగరానికి వున్న మురికి పేరును వొదిలించడం మొదటి పనిగా పెట్టుకున్నారు. అయితే  ఇందుకోసం అయన చీపురు పట్టుకుని వీధుల్లోకి రాలేదు. మునిసిపాలిటీ నిధులు వెచ్చించి వాక్యూం క్లీనర్లు కొనలేదు. సాధారణంగా ఐ.ఏ.యస్. అధికారుల్లో కానవచ్చే బ్యూరోక్రాట్ మనస్తత్వం ఆయనలో లేకపోవడమే ఆయనకు కలిసివచ్చిన అంశం.  అంచేత  బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే ఆయన ప్లేగ్ వ్యాధిపై యుద్ధం ప్రకటించారు. నగరాన్ని దుర్గందానికి దూరం చేసి, పరిశుద్ధ నగరంగా చేయడానికి కసితో పని ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయనపై ఎన్నో రాజకీయ వొత్తిళ్ళు వచ్చాయి. స్థానిక నాయకులు ఆయన ప్రతిపనికీ అడ్డం పడ్డారు. కానీ ఆయన దేనినీ ఖాతరు చేయలేదు. ఎవరినీ లెక్కచేయలేదు. తను అనుకున్నది అనుకున్నట్టు చేస్తూ పోయారు. బిల్డర్లు, కాంట్రాక్టర్లు,  చోటా మోటా రాజకీయ నాయకులు వారి అనుచరులు అందరూ రావుగారికి వ్యతిరేకమే, ఒక్క సూరత్ ప్రజలు తప్ప, ఆ వూరిలో మురికివాడల్లో నివసించే జనాలు మినహా. ఏడాదిన్నర కూడా గడవక ముందే రావు ప్రజలకు దైవసమానుడిగా మారిపోయారు. ఆయన కనిపిస్తే చాలు నోట్లో వున్న పాన్ రోడ్డుమీద  ఉమ్మేయడానికి పౌరులు  సంకోచించేవాళ్ళు. చెత్త కాగితం కానీ, వాడేసిన సిటీ బస్సు టిక్కెట్టు కానీ  బయట పారేయడానికి సందేహపడేవారు. పరిసరాల పరిశుభ్రత పట్ల పౌర  సమాజంలో  ఆయన కల్పించిన అవగాహనా ఫలితం అది. రావుగారి పాలనలో సూరత్ ప్లేగ్ వ్యాధినుంచి శాశ్వితంగా విముక్తమయింది. పరిసరాలన్నీ పచ్చని  చెట్లతో అలరారడం మొదలయింది. పన్నుల వసూళ్లు స్వచ్చందంగా పెరిగాయి. తాము కట్టే పన్నులన్నీ తమకు  ఉపయోగపడే పనులకే ఖర్చు చేస్తారు అన్న ఆలోచన పౌరుల్లో  పెరగడమే పన్నుల వసూళ్ళ పెరుగుదలకు కారణం అని వేరే చెప్పనక్కరలేదు.  అనతికాలంలోనే దేశం మొత్తంలో చండీగర్ తరువాత అత్యంత పరిశుభ్ర నగరంగా సూరత్ ఎంపికయింది. ఇది సాధించడానికి ఏళ్ళూ పూళ్ళూ పట్టలేదు. వందలకోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టలేదు. ఒక అధికారి పట్టుదలతో, ప్రజలు అందించిన సహకారంతో ఇది సాధ్యపడింది. 'మన ఇంటిని శుభ్రంగా వుంచుకుందాం' అని ప్రతివారు అనుకుంటారు. 'మన పరిసరాలను కూడా అలాగే చక్కగా వుంచుకుందాం' అనే స్పృహ కల్పించడం  చాలా కష్టం. కృష్ణాజిల్లాలో జన్మించి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్న సూర్యదేవర రామచంద్రరావు ఈ అద్భుతాన్ని చేసి చూపారు. అందుకు  ఆయన అనుసరించిన విధానం కూడా చాలా చాలా మామూలుది. మునిసిపాలిటీలో పనిచేసే అధికారులు  ఆఫీసుల్లోని ఏసీ గదుల్ని వొదిలిపెట్టి ఉదయం ఏడుగంటలకల్లా వీధుల్లోకి వెళ్లగలిగితే సగం  సమస్య పరిష్కారం అయినట్టే అని ఆయన భావించారు. ఆయనా అలాగే చేశారు. తన అధికారులు, సిబ్బందితో చేయించారు. ఫలితం కనబడింది. అట్లా ఇట్లా కాదు  అద్భుతంగా కనబడింది.  పారిశుధ్య సిబ్బందికీ,  వారిపై అఆమాయిషీ చేసే అధికారుల నడుమ చక్కని కమ్యూనికేషన్ ఏర్పడింది. కలిగిన ఆసామీ ఎవరయినా ఇంటిముందే  రోడ్డుమీద చెత్త పారబోస్తుంటే అదేమని అడిగే ధైర్యం  మామూలు స్వీపర్ చేయలేడు. కానీ వెంట ఉన్నతాధికారి వుంటే, అలా అడిగే  ధైర్యం అదే వస్తుంది. ఇదీ, మనస్తత్వ శాస్త్రం చదివిన రావు గారి థియరీ.
అప్పటివరకు స్థానిక దినపత్రికల్లో సూరత్ అధ్వాన్నపరిస్తితుల గురించీ, అధికారుల అలసత్వం గురించీ కోకొల్లల్లుగా కధనాలు వెలువడేవి. కొద్దికాలంలోనే వార్తల స్వరూపస్వభావాల్లో ఎంతో తేడా వచ్చింది. విమర్శల పాలు పూర్తిగా తగ్గిపోయి,  ప్రశంసల జోరు పెరిగిపోయింది.
అనతికాలంలోనే అయన సూరత్ పట్టణాన్ని చక్కని పారిశుధ్య నగరంగా తీర్చిదిద్దారు. అత్యంత పరిశుద్ధమైన భారతీయ నగరాల్లో దానికి రెండో స్థానం కల్పించారు. ఈ బృహత్తర కర్తవ్యాన్ని జయప్రదంగా నిర్వర్తించినందుకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అరుదయిన పద్మశ్రీ అవార్డు బహుకరించింది. ఒక  సివిల్ సర్వీసు అధికారికి అటువంటి 'పద్మ' పురస్కారం లభించడం కూడా అరుదయిన విషయమే.




రెండు దశాబ్దాల నాటి ఈ నేపధ్యాన్ని యెందుకు గుర్తుచేసుకోవాల్సి వచ్చిందో దానికి కారణం ఏమిటో విపులంగా వివరించాల్సిన అవసరం లేదు. ఈనాడు దేశం నలుమూలల్లో 'స్వచ్ఛ భారత్' అనే నినాదం మారుమోగిపోతోంది. ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన ఈ పిలుపుకు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది.  పత్రికల్లో, మీడియాలో ఈ కార్యక్రమానికి అపూర్వమైన ప్రాచుర్యం దొరుకుతోంది. ప్రధాని మోడీ ప్రభ నలుదిక్కులా వెలిగిపోతూవుండడం కూడా ఒక కారణం కావచ్చు. దేశం నాలుగుచెరగుల్లో తమ ప్రతిభతో జనాలను ప్రభావితం చేయగల సమర్ధులు, తమ తమ రంగాల్లో అశేష  శేముషీ విభవం కలిగిన ప్రముఖులు అనేకమంది  స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో స్వచ్చందంగా పాల్గొని విశేష ప్రచారం అందిస్తున్నారు. సెలెబ్రిటీలు తలచుకుంటే ప్రచారానికేం కొరత.  మడత నలగని దుస్తులు ధరించి చీపుర్లు పట్టుకుని వీధులు వూడుస్తుంటే చూసేవారికి కన్నుల పండువ. అయితే ఇదంతా కనిబెట్టి  చూస్తున్నవారికి స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా మిగిలిన అన్ని సర్కారు పధకాల మాదిరిగా ఒక ప్రచారార్భాటంగా మారిపోతుందేమో అనే భయసందేహాలు కలక్కమానవు.
స్వచ్ఛ భారత్ అనేది ఒక చక్కటి కార్యక్రమం. సందేహం లేదు.  మోడీని విధానపరంగా వ్యతిరేకించేవారు సయితం దీన్ని తప్పుపట్టలేరు. తప్పుపట్టే పరిస్తితి వస్తే, అలాటి స్తితి తెచ్చుకుంటే  మాత్రం అది సర్కారు తప్పే అవుతుంది.
మన దేశంలోనే కాదు విదేశాల్లో వుండే భారతీయులు, ప్రత్యేకించి వేరే దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు స్వచ్ఛ భారత్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆర్ధిక సంస్కరణల  పుణ్యమా అని అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో మాదిరిగానే సకల సౌకర్యాలు మన దేశంలో కూడా  దొరుకుతున్నాయి. దొరకనిదల్లా స్వచ్చమైన వాతావరణం. పరిశుభ్రమైన పరిసరాలు. మాతృ దేశానికి తిరిగివచ్చేయాలన్న వారి బలమైన కాంక్షను బలంగా అడ్డుకుంటున్న కారణం ఇదొక్కటే.
సంస్కరణల ప్రభావం దేశంలో అన్ని రంగాల మీదా, పౌరులందరి మీదా పడింది. చదువుకుండే ఆడపిల్లల సంఖ్య పెరిగింది. ఉద్యోగాలు, ఉపాధుల పేరుతొ గడప దాటి వెళ్ళే ఆడంగుల సంఖ్యా బాగా పెరిగింది. ఇలాటివారిలో కాస్త కలిగిన ఆడవారికి ఎదురయ్యే ఇబ్బందులు తక్కువ. వాళ్లు పనిచేసే కార్యాలయాల్లో అన్ని సౌకర్యాలు వుంటాయి. ఉన్నత కుటుంబాలకు చెందిన ఆడపిల్లలు చదువుకునే స్కూళ్ళు కూడా అన్ని సదుపాయాలతో వుంటాయి.  పోతే, సర్కారు బళ్ళల్లో చదువుకునే ఆడపిల్లలకు,  పొద్దున్నే లేచి వెళ్ళి  పనిపాటులు చేసుకునేవారికీ, వీధుల్ని శుభ్రం చేసే ఆడవారికి అవసరమైనప్పుడు కాలకృత్యాలు తీర్చుకోగల వెసులుబాటు వుండదు. అలాటి వారు తమ ఇబ్బందిని ఎవరికీ చెప్పుకోలేరు. బలవంతంగా అణచుకుని లేనిపోని అనారోగ్యాలకు గురవుతుంటారు. స్వచ్ఛ భారత్ సంకల్పం చెప్పుకున్నప్పుడే  ప్రధాని మోడీ మనస్సులో కూడా ఈ అంశం  మొలకెత్తకపోలేదు.  యుద్ధప్రాతిపదికన పాఠశాలల్లో  ఆడపిల్లలకు మరుగు దొడ్లు నిర్మించాలని ఆయన  తలపెట్టారు. ఆలోచన మంచిదే. కానీ ఆచరణ మాత్రం అనుకున్నంత వేగంగా సాగుతున్నట్టు లేదు.
గొప్ప గొప్పవాళ్ళు చేత చీపుర్లు పట్టి వీధులు వూడవడం తప్పని ఎవ్వరూ అనరు. కానీ, ఏదో మొక్కుబడి తంతుగా సాగినప్పుడు మాత్రమే ప్రతికూల ఫలితాలు వస్తాయి. కార్యక్రమం యెంత మంచిదయినా అమల్లో నీరుకారిపోయేది చిత్తశుద్ధి కరువయినప్పుడే.
ప్రస్తుతం మన దేశంలో తీవ్రమైన కొరత వున్నది  'చిత్తశుద్ధి' ఒక్కదానికే అని  అందరికీ తెలుసు.(05-01-2015)

NOTE: Courtesy Image Owner 

4, జనవరి 2015, ఆదివారం

ఆఫ్ ది రికార్డ్


టీవీ చర్చల విరామ సమయంలో లేదా చర్చలకు, ముందూ తరువాత జరిగే తేనీటి సమావేశాల్లో రాజకీయ నాయకుకులు అనేక ఆసక్తికరమైన విశేషాలు చెబుతుంటారు. వాటిల్లో నిజం పాలెంతో తెలియదు కాని, విన్నప్పుడు నిజమేనేమో అనిపించేలా వుంటాయి ఆ కబుర్లు.  అలాటి ఉదంతం ఒకటి.
చాలా ఏళ్ళ కిందటి సంగతి. అధికార  పార్టీలో  పైకి వచ్చిన నాయకుడొకరు, అప్పుడప్పుడే పైకి వస్తున్న మరో ఛోటా నాయకుడికి గిరీశంలా రాజకీయ గీతాబోధ చేసాడిలా.



'నాయనా! రాజకీయాల్లో పైకి రావడానికి ఎన్నో కావాలి. కానీ నా అనుభవం మీద చెబుతున్నాను. అన్నింటిలోకి అతి ముఖ్యమైనది మీడియా మేనేజిమెంటు'
'మేనేజిమెంటు అంటే ఏమిటి గురువుగారూ?' అడిగాడు చోటా నాయకుడు.
'అది తరువాత చెబుతా కాని మన జిల్లా రిపోర్టర్ పలానా వాడు వున్నాడు చూసావు కదా. అతడికేదో డబ్బవసరం పడినట్టువుంది. నేను ఇచ్చానని చెప్పి ఈ ఇరవై  వేలు అతడికి ఇచ్చిరా. అలాగే, మన సీఎం గారి కారు డ్రైవర్ వున్నాడు తెలుసు కదా! అతడింటికి వెళ్ళి ఈ ఇరవై వేలూ  నేనిచ్చానని చెప్పి ఇచ్చేసిరా' అన్నాడు.
ఛో.నా.,  బ. నా. చెప్పినట్టే వెళ్ళి చెప్పిన పని చప్పున చేసేసి తిరిగొచ్చిఆ సంగతి చెప్పాడు. చెప్పి తన మనసులో తొలుస్తున్న సందేహం బయట పెట్టాడు.
'రిపోర్టర్ కు ఇవ్వమన్నారు. సరే. బాగుంది. వాళ్ళకు మనతో, మనతో వాళ్లకు సవాలక్ష పనులుంటాయి. కానీ సీ ఎం గారి కారు డ్రైవర్ సంగతే నా మట్టి బుర్రకు  అర్ధం అయి చావలేదు'
'అదేమరి.  నేర్చుకో అని చెప్పింది అందుకే. సీఎం గారిని మన పార్టీ కార్యకర్తలు ఎక్కడ కలుస్తారు ? ఆయన కారు ఎక్కుతున్నప్పుడో, దిగుతున్నప్పుడో కదా!  మామూలు వాళ్ళకి  అవకాశం అలాటప్పుడే   దొరుకుతుంది. మరి ఆయన కంట్లో పడాలంటే సీఎం గారి  కారు కాసేపు అక్కడే  ఆగాలి. ఆగాలి అంటే డ్రైవర్ కారు ఆపాలి. ఆపాలి అంటే  డ్రైవర్ ని మనం  మంచి చేసుకోవాలి.  అప్పుడే, మనం కనబడగానే, డ్రైవర్  కాలు, కాసేపు బ్రేక్ మీద నొక్కిపెడతాడు. అర్ధం అయిందా? సమ్జే!  అండర్ స్టాండ్!' అన్నాడు అన్ని భాషల్లో  బ. నా.
'అయింది మహాప్రభో!'  అనేసాడు ఛో.నా.
(తోకటపా: ఎవరా ఛో.నా. ? ఎవరా బ.నా.? ఇంతకీ ఎవరా రిపోర్టర్? ఇలాటి ప్రశ్నలు దయచేసి అడక్కండి. చెప్పినాయన చెప్పలేదు. అలా అడిగే అలవాటులేని నేనూ అడగలేదు, విని వూరుకున్నంత సుఖం మరోటి లేదు)
NOTE: Cartoon Courtesy SREE BAPU

బుద్దొచ్చింది దేవుడా బుద్దొచ్చింది


ఏకాంబరం ఎంతో ఏకాగ్రతతో తపస్సు చేసాడు. అతడి తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై  వరం కోరుకొమ్మన్నాడు పరమేష్టి.
'పరమేశా! మా ఆవిడ పరమ బద్ధకస్తురాలు. నేను పగలల్లా ఆఫీసులో పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తాను. ఆవిడేమో టీవీలో సీరియళ్ళు చూస్తూ ఎంచక్కా కాలక్షేపం చేస్తుంటుంది. ఒక్కరోజు మేమిద్దరం పరకాయ ప్రవేశం చేసేలా అనుగ్రహించు. నేను పడే కష్టం ఏమిటో ఆవిడకు తెలిసిరావాలి' అన్నాడు ఆత్రంగా. 'ఓస్ ఇంతేనా' అంటూ వరం ఇచ్చేసి పరమేశ్వరుడు కైలాసం వెళ్లాడు.
ఆ రాత్రి కలలు కంటూ నిద్రపోయిన ఏకాంబరం, తెల్లారి లేచేసరికి, ఒక ఆడదానిగా కళ్ళు తెరిచాడు.
మొహం కూడా కడుక్కోకుండానే వంటింట్లోకి వెళ్ళి మొగుడికి బ్రేకఫాస్ట్ తయారు చేసాడు. పిల్లల్ని లేపి మొహాలు కడిగించాడు. స్నానాలు చేయించి స్కూలు యూనిఫారాలు వేయించి టిఫిన్ తినిపించి, మధ్యాహ్న భోజనం బాక్సుల్లో సర్ది, వాళ్లని స్కూల్లో దింపి, తిరిగివస్తూ పచారీ సామాను దుకాణంలో ఇంటికి కావలసినవి కొనుక్కుని తిరిగివచ్చేసరికి ఇంట్లో తీరికలేని పని సిద్దంగా వుంది. ఉతకాల్సిన దుస్తులు వాషింగు మెషిన్ లో వేసి, అంట్ల గిన్నెలు కడిగి, ఇల్లంతా తుడిచి అన్నం పళ్ళెం ముందు పెట్టుకునేసరికి పిల్లలు ఇంటికి వచ్చే సమయం అయింది. ఆదరాబాదరాగా నాలుగు ముద్దలు నోట్లో కుక్కుకుని, స్కూలుకి వెళ్ళి పిల్లల్ని ఇంటికి తీసుకువచ్చి బట్టలు మార్పించి నాలుగు తినుబండారాలు వాళ్ల  ముందు పెట్టి, ఉతికిన బట్టలు ఇస్త్రీ చేసి టైం చూసుకుంటే  సాయంత్రం ఆరుగంటలు. ఆయన ఆఫీసునుంచి ఇంటికి వచ్చే సమయం. లేచివెళ్ళి వేడిగా పకోడీలు చేసి, కాఫీ డికాక్షన్ సిద్దం చేసేసరికి ఉస్సురుస్సురంటూ పతి దేవులు తయారు. మళ్ళీ వొంటిట్లో దూరితే రాత్రి భోజనాలు తయారుచేసే పని. కుక్కర్ స్టవ్ మీదకు ఎక్కించి చూస్తే పెరుగు తోడుకోలేదు. అది లేకపోతే పిల్లలకు ముద్ద దిగదు. పరుగు పరుగున బజారుకు వెళ్ళి డబ్బా పెరుగు కొనుక్కువచ్చి పిల్లలకు తినిపించి పడుకోబెట్టేసరికి రెండో మూడో పెగ్గులు బిగించిన భర్తగారు ఆవురావురుమంటూ అన్నానికి సిద్ధం. ఆయనకు పెట్టి, నాలుగు మెతుకులు తాను కొరికి, అంట్ల పళ్ళేలు సింకులోవేసి, వంటిల్లు తుడిచి చీరె మార్చుకుని, తలలో పూలు తురుముకుని  పడక గది చేరేసరికి పదిగంటలు. నడుం వాలుద్దామంటే మొగుడు వూరుకునే మొగుడు కాదాయె.   అలా రోజంతా అందర్నీ కనుక్కుంటూ, అందరికీ అన్నీ చేసిపెట్టి, చూసిపెట్టి కునుకుతీసి లేచేసరికి మళ్ళీ బండెడు పని,  ఇంటెడు చాకిరీ చెప్పాపెట్టకుండా తయారు.
'అమ్మో యేమో అనుకున్నాను. భార్యలు కాలు మీద కాలు వేసుకుని టీవీలు చూడడమే వాళ్ల పని అనుకున్నా కాని, వాళ్లకు  వొళ్ళు విరిగే ఇంత పని వుంటుందని కలలో కూడా అనుకోలేదు' ఏకాంబరం  ఆలోచనలు ఇలా సాగుతుండగానే అతగాడికి  పరమేశ్వరుడు ఇచ్చిన ఒక్క రోజు వరం జ్ఞాపకం వచ్చి ఓకే! ఒక్క రోజే  కదా! ఇవ్వాల్టితో పీడా పోతుందని సంతోషించాడు. కాని అది ఎంతో సేపు నిలవలేదు. తూరుపు తెల్లారుతున్నా చీరే జాకెట్ తో తన ఆకారం ఏమీ మారకపోవడం గమనించి, కంగారు పడిపోయి మళ్ళీ పరమేశ్వర ప్రార్ధన మొదలు పెట్టాడు. కాపోతే ఈసారి అట్టే ఆలశ్యం చేయకుండా దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. రోజు గడిచిపోయిందనీ, ముందు చెప్పిన విధంగా తిరిగి తనకు పాత మగ రోజులు ప్రసాదించమనీ కోరాడు. అందుకు ఆయన నోరారా నవ్వుతూ ఇలా అన్నాడు.
'నీ కోరిక తీరాలంటే మరో తొమ్మిది నెలలు ఆగాలి. రాత్రి నీకు నెలతప్పి గర్భవతివయ్యావు. అంచేత ఆడవాళ్ళు పడే ప్రసవ వేదన యెంత భయంకరంగా వుంటుందో అదీ తెలుసుకునే మహ్హత్తర వరం నీకు అదనంగా ఇస్తున్నాను' అంటూ అదృశ్యం అయిపోయాడు. ఏకాంబరం కొయ్యబారిపోయాడు.
నీతి: దేవుడు తేరగా దొరికాడని లేనిపోని వరాలు కోరరాదు


(నెట్లో కనిపించిన ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)

NOTE: Courtesy Image Owner 

3, జనవరి 2015, శనివారం

పీకే - 47



(దేవుడ్ని నమ్మని శ్రీ నరిసెట్టి ఇన్నయ్య గారికి, దేవుడ్ని నమ్మే నాలాటి వారికి ఇది అంకితం)
దేవుడు లేడని ఆయన్ని నమ్మనివాళ్ళంటారు.
వున్నాడని నమ్మేవాళ్ళంటారు.
దేవుడు పేరు చెప్పి సొమ్ములు పోగేసుకుంటున్నారని నాస్తికులు ఆరోపిస్తుంటే, దేవుడు లేడని చెబుతూ ఆ పేరుతొ డబ్బులు దండుకుంటున్నారని వారి ప్రత్యర్ధులు అంటుంటారు. నాకయితే ఇద్దరూ కరక్టే అనిపిస్తుంది.
దేవుడ్ని నమ్మినా నమ్మకపోయినా నమ్మినట్టు నటించడం వల్ల కొన్ని ప్రయోజనాలు వున్నట్టే, దేవుడ్ని నమ్ముతున్నా నమ్మనట్టు బూకరించడం వల్ల కూడా కొన్ని లాభాలు వున్నాయి. ఈ రెండు తరగతులవారు నిత్యం అందరికీ తారసపడుతూనే వుంటారు కాబట్టి వీరు కనబడడం కోసం ప్రత్యేకంగా తపస్సులు చేయనక్కరలేదు. ఏదో ఒక అంశంపై టీవీ తెరలపై అనునిత్యం దర్శనం ఇస్తూనే వుంటారు.
వీరుకాక మరో రెండు తరగతులవారు వున్నారు. దేవుడే సాక్షాత్తు దిగివచ్చినా దేవుడ్ని నమ్మని వారు ఒక బాపతు. కానీ ఆ విషయం పైకి టముకు వేసుకోరు. మనసా వాచా కర్మణా పూర్తిగా నమ్మేవారు రెండో రకం. వీరు కూడా భగవంతుడిని బజారుకు లాగరు. గుండెల్లోనే గుడికట్టుకుని వుంచుకుంటారు. కానీ, దేవుడంటే నమ్మకం లేని వీళ్ళను ఆ భగవంతుడూ  కనుక్కోడు. దేవుడ్ని నమ్మే వీళ్ళనూ ఆ దేవుడూ  పట్టించుకోడు. హీనపక్షం టీవీ ఛానళ్ళ కూడా వారికి కూడా వీరి అయిపూ ఆజా పట్టదు. ఎందుకంటె వారి రేటింగులకు కావాల్సినట్టు దేవుడు గురించి ఎద్దేవాగా మాట్లాడడం, లేదా దేవుడికోసం పోట్లాడడం వీరికీ, వారికీ బొత్తిగా తెలియదు కాబట్టి.
దేవుడున్నాడో లేదో తెలియదు కానీ దేవుడున్నాడా లేడా అన్న ప్రశ్న మాత్రం అనాదినుంచి వుంటున్నదే. ఆస్తికులు, నాస్తికుల మధ్య దేవుడిని గురించిన చర్చ కూడా అనాదినుంచి సాగుతున్నదే. ఈ ఎడతెగని చర్చకు దేవుడి మాదిరిగానే అంతం అంటూ లేదు. నమ్మనివాళ్లదీ నమ్మకమే. నమ్మే వాళ్లదీ నమ్మకమే.  
అందుకే అంటారు, తొక్కితే రాయి  మొక్కితే సాయి అని. అంతా నమ్మకమే.
దేవుడ్ని నమ్మడం ఎంత నమ్మకమో నమ్మకపోవడం కూడా అంతే నమ్మకమని నా నమ్మకం.

దేవుడు పేరు చెప్పి మోసం చేయడం ఎంత ద్రోహమో దేవుడు లేడంటూ పనికిమాలిన చర్చలు లేవదీయడం కూడా అంతే దారుణం. ఎందుకంటె దేవుడనే వాడు నా దృష్టిలో వ్యక్తిగతం. నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు మరొకడు వున్నాడని ఒప్పుకోవడానికి నామోషీ పడనక్కరలేదు. ఇతరులలోని గొప్పదనం గుర్తించేవారు,  వారు నాస్తికులు కావచ్చు కాని భగవంతుడో మరొకడో ఏ పేరు అయితేనేం తమకంటే  సర్వ శక్తిమంతుడు మరొకడు వుండేవుంటాడని అనుకుంటే పేచీ లేదు. అలాగే దేవుళ్ళని నమ్మేవాళ్ళు కూడా. భగవంతుడు వున్నాడని పూర్తిగా విశ్వసించే గజేంద్రుడే మొసలినోట చిక్కి విలవిలలాడుతున్నప్పుడు కలడు కలండనెడివాడు కలడో లేడో?’ అని సందేహపడతాడు. పరీక్ష పెట్టికానీ మార్కులు వేసే అలవాటులేని ఆ దేవదేవుడు, పందొమ్మిదో రీలు తరువాత కానీ 'సిరికిన్ చెప్పడు....తరహాలో' ఏనుగు రక్షణకు రాడు.
దేవుడ్ని నమ్మని గోరాగారు దేవుడు లేదు అనేవాడు. లేదు ఏమిటండి లేడు అనాలిగా అంటే అసలు లేనివాడు పుంలింగం అయితే ఏమిటి స్త్రీ లింగం అయితే ఏమిటని ఎదురు ప్రశ్న వేసేవారు. ఆయన వ్యక్తిత్వశోభ ముందు అలా చెల్లిపోయింది. కాకపోతే ఇప్పుడు బెజవాడ నాస్తిక కేంద్రం వారికి గోరానే దేవుడు. ఆ మాటకొస్తే దేవుళ్ళందరూ ఇలా అవతరించిన వాళ్ళేనేమో. వాళ్ల వాళ్ల కాలంలో తమ గుణగణాలచేత విఖ్యాతులయిన వాళ్లు తదనంతర కాలంలో దేవుళ్ళుగా కొలవబడ్డారేమో.
కానీ ఒక విషయంలో నాకు దేవుళ్ళను చూస్తే జాలి వేస్తుంది. వాళ్లు చెప్పిన మాట వాళ్ల భక్తులు కూడా వినరు. బుద్దుడు విగ్రహారాధన వద్దంటే శిష్యులు మాట వింటేనా. బహుశా అంతంత పెద్ద విగ్రహాలు ప్రపంచంలో మరే దేవుడుకి లేవేమో. (బుద్దుడు దేవుడా అంటే అది మరో చర్చ)
నేను సర్వవ్యాపితుడిని. ఎందెందు వెదకి చూసిన అందందే వుంటానని దేవుడు  ఎంత మొత్తుకున్నా వినేదెవరు?
చెట్టులో, పుట్టలో అంతటా నేనే అన్నా విన్నదెవరు?
చిన్నదో పెద్దదో ఓ గుడికట్టి అక్కడే కట్టిపడేశారాయన్ని.
మా చిన్నప్పుడు వంటింట్లో గోడమీద ఎర్రగా ఓ చదరంలో వేంకటేశ్వర స్వామి నామాలు వుండేవి. అదే అందరికీ పూజాగృహం. స్నానం చేసిన తరువాత అక్కడ నిలబడి ఓ దణ్ణం పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడో! పూజ రూమ్ వుందా?’ అన్నది ఫ్లాట్ కొనేముందు అడిగే మొదటి ప్రశ్న.

పూర్వం పిల్లలకు తల వెంట్రుకలు తీయించడానికి ఏడాదికో, రెండేళ్లకో తిరుపతి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పరీక్షలకు ముందు, తరువాత, రిజల్ట్స్ రాకముందు వచ్చిన తరువాత - అన్ని కుటుంబాల వాళ్లు పోలో మంటూ తిరుపతి యాత్రలే. మరి రద్దీ పెరిగిందంటే పెరగదా!
పోతే, ఈ దేవుడి సమస్యకు ఒకటే పరిష్కారం.
దేవుడ్ని నమ్మేవాళ్ళు ఆ నమ్మకాన్ని తమవరకే పరిమితం చేసుకోవాలి.
నమ్మని వాళ్లు అదేదో అంతర్జాతీయ సమస్య  అన్నట్టు అదేపనిగా దేవుళ్ల మీద ఒంటికాలు మీద లేవడం కూడా మంచిదికాదు. బాధాసర్పద్రష్టులను ఉద్దరించడానికి ఇంకా సవాలక్ష మార్గాలున్నాయి. దేవుడ్ని నమ్మేవారిని వారి మానానికి వొదిలేసి తమపని తాము చూసుకుంటే సగం వాతావరణ (శబ్ద) కాలుష్యం తగ్గిపోతుంది. 
సమాజం ఇప్పుడు ఎదుర్కుంటున్న సమస్యలు ఎన్నో వున్నాయి. వాటి ముందు దేవుడు ఒక సమస్యే కాదు. నిజానికి మనమే ఆయనకు సమస్య.



NOTE: Courtesy Image Owner