14, నవంబర్ 2014, శుక్రవారం

సారీ! గుర్తు పట్టలేకపోయాను!


అరవయ్యవ పడిలో పడ్డ సూర్యాకాంతానికి గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆపరేషన్ బల్ల మీద పడుకోబెట్టగానే ఇక తనకు చావు తధ్యం అనుకుంది. ఆ సమయంలో ఆమెకు  దేవుడు కనబడ్డాడు. 'నాకిక భూమ్మీద  నూకలు చెల్లినట్టేనా సామీ' అని అడిగింది.
'నీకేమయింది, నిక్షేపంలా  ఇంకా నలభయ్ ఏళ్ళు బతుకుతావు' అంటూ దేవుడు మాయమై పోయాడు.
ఆయనన్నట్టే ఆమెకు నూకలు మిగిలే వున్నాయి. బతికిబట్టకట్టింది. ఆపరేషన్ అవసరం లేదన్నారు డాక్టర్లు. ఇంటికి పంపేముందు కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండమన్నారు.
మరో నలభయ్ ఏళ్ళు  బతుకుతావని దేవుడు చెప్పిన విషయం బాగా గుర్తుండి పోయింది. అంత ఆయుస్సు పెట్టుకుని ఈ ముసలి అవతారం ఎందుకనిపించిందో ఏమో, చీరె కట్టు నుంచి  పంజాబీ సూట్ లోకి  దూరిపోయింది. జుట్టుకు నల్ల రంగు వేయించింది. మొహంలో ముడతలు కనబడకుండా  ట్రీట్ మెంట్ తీసుకుంది. ఆసుపత్రిలో అందరూ నోళ్ళు వెళ్ళబట్టి చూస్తుండగానే  అరవై నుంచి ఇరవై వయసు పిల్ల మాదిరిగా మారిపోయింది. ఆసుపత్రి నుంచి డిస్  చార్జ్ అయి ఇంటికి వస్తుంటే వేగంగా వస్తున్న కారు డీకొట్టి అక్కడికక్కడే కన్ను మూసింది. కళ్ళు తెరిచి చూస్తే, 'ఇంకా నలభయ్ ఏళ్ళు బతుకుతావు' అన్న భగవంతుడు తన కళ్ళల్లోకి చూస్తూ కనిపించాడు. 'ఇదేమిటయ్యా ఇలా చేసావు. బోలెడు ఆయుస్సు వుందని గొప్పలు చెప్పావు. ఆ మాత్రం కారు కింద పడకుండా తప్పించలేకపోయావా' అని గదమాయించింది.
దేవుడు మందహాసం చేస్తూ చెప్పాడు. 'ఆ కారుకింద పడింది నువ్వా! నేనసలు గుర్తే పట్టలేకపోయాను సుమా!'  
      

(శ్రీ కొల్లూరు సురేష్ బాబు గారు పోస్ట్ చేసిన ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)

13, నవంబర్ 2014, గురువారం

మా బావగారు చెప్పిన నెహ్రూ గారి కధ

  
మా రెండో బావగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్రరావు గారు. ఖమ్మం జిల్లా రెబ్బవరం కాపురస్తులు. కొద్దికాలం అస్వస్థులుగా వుండి కన్ను మూశారు. గతించి కూడా చాలా కాలం అయ్యింది. స్వాతంత్రోద్యమ కాలంలో పద్నాలుగు మాసాలకు పైగా కఠిన కారాగార శిక్ష అనుభవించారు. మా పెద్ద బావగారు అయితరాజు రాం రావు గారు కూడా ఆయనతో పాటే జైల్లో వున్నారు. ఈ ఇద్దరు గర్భంతో వున్న భార్యలను పుట్టింట్లో (అంటే మా ఊరు కంభంపాడులో మా అమ్మానాన్నల వద్ద వొదిలి) దేశం కోసం జైలుపాలయ్యారు. సరే! అది అలా వుంచితే -
ఓరోజు బంధువుల ఇంట్లో జరిగిన  కార్యక్రమంలో మా మేనల్లుడు అంటే రామచంద్ర రావుగారి కుమారుడు కొలిపాక రాంబాబు  ఓ వృత్తాంతం చెప్పాడు. మా బావగారు సుస్తీ చేసి ఆసుపత్రిలో వున్నప్పుడు ఆయన్ని అడిగాడట. 'నాన్నా! మీలాటివాళ్ళు లక్షల మంది నానా కష్టాలు పడితే ఈ స్వాతంత్రం వచ్చింది. మీరు నిజంగా కోరుకున్నది ఇలాటి దేశాన్నేనా'
ఆయన ఇలా జవాబు చెప్పారట.
'స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో  నెహ్రూ గారు ఆంధ్రాలో ఓ మీటింగులో మాట్లాడడానికి వచ్చారు. ఖమ్మం నుంచి నలభై యాభయ్ మందిమి  బయలుదేరి రైల్వే స్టేషన్ కు వెళ్లాము. టిక్కెట్లు కొనడానికి వెడితే అక్కడి స్టేషన్ మాస్టారు అన్నారట 'నెహ్రూ గారి మీటింగుకు టిక్కెట్లు ఎందుకండీ' అని. బహుశా ఆరోజు గట్టిగా 'కాదుకూడదు' అని గట్టిగా వాదించి వుంటే దేశం ఈనాడు ఈ స్తితిలో వుండేది కాదేమో!  ఫ్రీ ఇండియా అంటే  జనాలకు  అన్నీ ఫ్రీ అనే భావన ప్రబలేది కాదు. ఇది మనదేశం, దీని లాభనష్టాలన్నీ  మనవే అన్న అభిప్రాయం బలపడకుండా పోయింది. మేము కోరుకున్న దేశం ఇదా అంటే ఇది కాదని చెప్పగలను కానీ కోరుకున్న ఆ దేశం యెలా వస్తుందో, ఎప్పుడూ వస్తుందో  మాత్రం చెప్పలేను. బహుశా నేనయితే చూస్తానన్న ఆశలేదు'



(ఫోటోలో మా బావగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్రరావు)

నెహ్రూ - ఓ జ్ఞాపకం



నెహ్రూ గారు నారాయణ దొరగారిని అమాంతం ఎత్తి సోఫాలో కుదేశారు.
ఎవరీ నారాయణ దొర గారు ? ఆయనకూ నెహ్రూ గారికీ ఏమిటి సంబంధం?
అప్పట్లో కలం కూలీ జీ. కృష్ణ గారు ఢిల్లీ లో ఆంధ్ర పత్రిక విలేఖరిగా పనిచేస్తుండేవారు. ఆ రోజుల్లో పార్లమెంటు సభ్యులయిన బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి నివాసానికి ఈ నారాయణ దొరగారు వచ్చారు. సాలూరు ప్రాంతీయుడయిన కునిసెట్టి వెంకట నారాయణ దొర పాత కాలపు కాంగ్రెసువాది.
అప్పటి సంగతులను గురించి శ్రీ జీ. కృష్ణ తమ ‘విలేఖరి లోకం’లో ఇలా గుర్తు చేసుకున్నారు.
“దొరకు ఇంగ్లీష్ రాదు. హిందీ కూడా రాదు. వచ్చీ రాగానే జవహర్ లాల్ నెహ్రు గారితో మాట్లాడాలన్నాడు. వెంటనే వచ్చి కలవవచ్చని ప్రధాని కార్యాలయం నుంచి వర్తమానం వచ్చింది. పదిహేను నిమిషాలు టైం ఇచ్చారు.
“దొరగారు ఖద్దరు దుస్తులు ధరించి వెళ్లారు. వెంటనే దర్శనం లభించింది. దొరగారు గదిలోకి వెళ్ళగానే గులాబీ పువ్వు నెహ్రూ షేర్వాణీకి తగిలించడానికి ముందుకు కదిలాడు. నెహ్రూ గారు అమాంతం అతడిని పట్టి ఎత్తి సోఫా మీద పడేశాడు. అప్పటినుంచి కాసేపటిదాకా ఇద్దరూ నవ్వులే నవ్వులు. దీనికి కొంత  నేపధ్యం  వుంది.
1936 లో ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రాలో ప్రచారానికి వచ్చిన నెహ్రూకు అంగరక్షకుడిగా అప్పటి ఆంధ్ర కాంగ్రెస్ కార్యదర్శి బులుసు సాంబమూర్తి గారు వెంకట నారాయణ దొరను నియమించారు. నెహ్రూకు తెలుగు రాదు.. దొరకు హిందీ రాదు. అయినా సైగలతో గడిపేశారు. బొబ్బిలిలో నెహ్రూ పై  జస్టిస్ పార్టీవాళ్లు రాళ్లవర్షం కురిపించారు. అంతే! దొర అమాంతం నెహ్రూను  ఎత్తుకుని ఫర్లాంగు దూరం తీసుకువెళ్లాడు. జవహర్ లాల్ యెంత గింజుకున్నా దొర వొదలలేదు.
మళ్ళీ 1953 లో ఢిల్లీలో తనను చూడవచ్చిన దొరను కూడా నెహ్రూ అమాంతం ఎత్తి సోఫాలో కుదేసి పాత స్మృతులను నెమరువేసుకున్నారని కృష్ణ గారు రాశారు.
(చిత్రంలో శ్రీ జి.కృష్ణ గారు)

చావుతో ఆటలంటే మాటలా!

  

సుబ్బారావుకు అందర్నీ ఆటలు పట్టించడం ఓ సరదా.
అతనో రోజు కంప్యూటర్ ముందు కూర్చుని ఫేస్ బుక్ లో ఎవర్నో ఆట పట్టిస్తుంటే కాలింగ్ బెల్ మోగింది. వెళ్లి తలుపు తీస్తే ఎదురుగా యమపాశంతో ఇద్దరు యమభటులు  కనిపించారు. ముందు గతుక్కుమన్నా తేరుకుని వాళ్ళని లోపలకు రమ్మన్నాడు. ఏవిటి విషయం అని అడిగాడు. వారిలో ఒకడు ఆ రోజు చావు మూడిన వాళ్ళ జాబితా ఒకటి తీసాడు. సుబ్బారావు పేరు అందరికంటే మొదట్లో వుంది. పద పద అని తొందర చేసారు.
సుబ్బారావు తరహా తెలుసుకదా.
రాకరాక వచ్చారు. మళ్ళీ మళ్ళీ వచ్చే ఉద్యోగాలు కావాయె మీవి.  ఒక్క నిమిషం  అలా  కూర్చోండి. ఒక కప్పు కాఫీ ఇస్తానుఅంటూ  వొంటింట్లోకి వెళ్ళాడు.  చెరో కప్పులో కాఫీ కలిపి తెచ్చి అందులో తెలివిగా నిద్ర మాత్రలు వేసాడు.
కాఫీ తాగి యమభటులిద్దరూ గుర్రు పెట్టి నిద్రపోయారు.      
ఈలోగా సుబ్బారావు  చావు రాసిపెట్టివున్న వాళ్ళ జాబితా తీసి అందులో మొదట్లో వున్న తన పేరు కొట్టేసి దాన్ని చిట్టా చివర్లో రాసేసి యేవీ తెలియని నంగనాచిలా  కూర్చున్నాడు.
మొత్తానికి యమ భటులు నిద్ర లేచారు. వారికి సుబ్బారావు ఇచ్చిన కాఫీ ఎంతో నచ్చింది.
చూడు సుబ్బారావూ చూడబోతే నువ్వు చాలా మంచాడిలా వున్నావు. అందుకని నీకో మేలు చేస్తాం. ఈరోజు మా డ్యూటీని జాబితా చివరి నుంచి మొదలు పెడతాం . ఏవంటావ్?’
ఏవంటాడు. అప్పటికే కుక్కిన పేనాయె.


(ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)
NOTE: Courtesy Image Owner 

అణుబాంబు : భగవద్గీత



ప్రపంచ అద్భుత సంఘటనల్లో ఒకదానిగా ప్రసిద్ధి చెందిన మొట్టమొదటి అణు బాంబు పరీక్ష జరిగి ఇప్పటికి కాస్త అటూ ఇటూగా డెబ్బయ్ ఏళ్ళు. న్యూ మెక్సికోలోని సోకొర్రోకు ఆగ్నేయంగా 35 మైళ్ల దూరంలో 1945 జులై 16 వ తేదీన  ట్రినిటీఅనే గుప్త నామంతో అమెరికా అణు పరీక్ష జయప్రదంగా నిర్వహించింది. అప్పటినుంచి లోకంలో  అణు శకం మొదలయిందని చెప్పుకోవచ్చు.
అప్పట్లో అమెరికా జరిపిన అణు పరీక్షకూ, భగవద్గీతకూ సంబంధమేమిటన్న అనుమానం రావచ్చు.  దాన్ని నివృత్తి చేసుకోవాలంటే గతాన్ని కొంత నెమరు వేసుకోవాలి.
అమెరికా ఈ పరీక్షకు పెట్టిన పేరు ట్రినిటీఅయితే పరీక్షించిన అణుబాంబు కు నిర్దేశించిన నామం ది గాడ్జెట్’ . తొలి అణు పరీక్షను విజయవంతంగా  జరిపిన విజయోత్సాహంతో  అమెరికా కొద్ది వ్యవధిలోనే   రెండు అణు బాంబులను జపాను పై ప్రయోగించి అణు బాంబు శక్తిసామర్ధ్యాలను లోకానికి ఎత్తిచూపింది.
1945  ఆరోతేదీన తొలి బాంబు ప్రయోగం జపాను లోని హిరోషిమాపై జరిగింది. మరో మూడురోజులకే తొమ్మిదో తేదీన రెండో అణు బాంబును నాగాసాకీపై అమెరికా ప్రయోగించింది.
హిరోషిమాపై  జారవిడిచిన అణుబాంబు  గుప్తనామం లిటిల్ బాయ్’  కాగా,  నాగాసాకీని మట్టుబెట్టిన  బాంబుకు పెట్టిన పేరు ఫ్యాట్ మ్యాన్
నిజానికి హిరోషిమాపై  ప్రయోగించిన తొలి బాంబు  పరీక్ష చేసి ప్రయోగించినది కాదు. అయినా విజయవంతం అయింది. ఈ బాంబును  ముందుగా  పరీక్షించకపోవడానికి కూడా ఒక కారణం వుంది. ఒకే ఒక్క బాంబుకు కావాల్సిన  యురేనియం -235 నిల్వలు మాత్రమే అమెరికా వద్ద మిగిలివుండడంతో ఆ బాంబును  ముందుగా పరీక్షించి చూసే  వీలు లేకుండా పోయింది. పోతే నాగాసాకీపై ప్రయోగించిన బాంబు ట్రినిటీ మాదిరి తయారు చేసిన అణు బాంబు.
ఈ రెండు బాంబులు కలసి సృష్టించిన మారణ హోమం ఇంతా అంతా కాదు. ప్రయోగించిన ఒకటి రెండు క్షణాల వ్యవధిలోనే లక్షా నలభై ఎనిమిది వేలమంది ప్రాణాలు గాలిలో కలసి పోయాయి. ఆ  బాంబులు కలిగించిన అణు ధార్మిక ప్రభావం కారణంగా ఆ తరువాత అయిదేళ్ళలోమరణించిన వారి సంఖ్య  లక్షలకు చేరింది. దీన్నిబట్టి అణ్వస్త్రాల వల్ల అవనికి పొంచివున్న ముప్పు యెంతటిదో   అర్ధం చేసుకోవచ్చు. 

పోతే, ట్రినిటీ పరీక్షకు అంతా సిద్ధం చేసుకున్న  అమెరికా శాస్త్రవేత్తలకు వర్షం రూపంలో తొలి అడ్డంకి ఎదురయింది. అణు విస్పోటన  పరీక్షకు తెల్లవారుఝామున నాలుగు గంటలకు ముహూర్తం నిర్ణయించారు. కానీ వాతావరణం  ఉరుములు, మెరుపులు వర్షంతో అనుకూలించలేదు. ఆ పరిస్థితుల్లో పరీక్ష నిర్వహిస్తే పరిణామాలు దారుణంగా వుంటాయని అధికారులు భావించి కొద్ది సేపు వాయిదా వేసారు. ప్రెసిడెంట్ ట్రూమన్ తో సహా అంతా  ఎదురు చూస్తున్న వాతావరణ నివేదిక ఉదయం నాలుగు గంటల నలభై అయిదు నిమిషాలకు శాస్త్రవేత్తలకు  అందింది. పరీక్షకు అధికార్లు పచ్చ జెండా  చూపారు.  సరిగ్గా 5-10 కి  20 నిమిషాల కౌంట్ డౌన్ మొదలయింది. అక్కడికి  16 మైళ్ల దూరంలో  నిర్మించిన  ఎత్తయిన టవర్ నుంచి  ఉన్నతాధికారులు  ప్రయోగ ప్రక్రియని  పరిశీలిస్తున్నారు. స్తానిక కాల మానం ప్రకారం ఉదయం అయిదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నలభై అయిదు సెకన్లకు మానవాళి  భవిష్యత్తును  ప్రశ్నార్ధకం చేస్తూ తొలి  అణు విస్పోటనం తన భీషణ రూపాన్ని ప్రదర్శిస్తూ లోక భీకరంగా ఆవిష్కృతమయింది.   పేలుడుకు  ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి.  క్షణంలో వందోవంతులో   20 కిలో టన్నుల టి.ఎం.టి. శక్తికి సరిసమానమైన ఎనర్జీవిడుదలయింది. ఒకటి రెండు క్షణాలపాటు ఆ ప్రదేశం,  చుట్టుపక్కల కొండలు పట్టపగలు వెలుతురును తలదన్నే విధంగా  వేయి సూర్యుల కాంతితో (దివి సూర్య సహస్రస్య భగవద్గీత 11 వ అధ్యాయం 12 వ శ్లోకం ప్రధమ పాదం)  వెలిగిపోయాయి.  బాంబు పేలిన చోట పది అడుగుల లోతు  వంద అడుగుల వెడల్పు కలిగిన గొయ్యి   ఏర్పడింది.  ఆ ప్రదేశం యావత్తు నిప్పుల కొలిమిలా మారింది. నీలంనుంచి ఎరుపు, ఎరుపు  నుంచి పచ్చ, పచ్చ నుంచి తెలుపు -  ఇలా రకరకాలుగా రంగులు మారుతున్న దృశ్యాలు ఆకాశంలో దర్శనమిచ్చాయి. పెద్ద పుట్టగొడుగు మాదిరిగా  నల్లటి నలుపు రంగుతో మిశ్రితమయిన ఎర్రటి పొగ మేఘాలు  గగన తలంలో ఏడున్నర మైళ్ల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి.
ట్రినిటీ పరీక్ష డైరెక్టర్ కెన్నెత్ బ్రెయిన్ బ్రిడ్జ్  బాంబు పేలుడు సృష్టించిన ఉత్పాతానికి విభ్రమ చెందాడు. ప్రపంచ వినాశనానికి దోహదం చేసే దారుణ  ప్రక్రియలో పాలుపంచుకున్న నిర్వేదం ఆయన తొలి పలుకుల్లో ధ్వనించింది. ఛీ! జరగరానిది జరిగి పోయింది ‘Now we all sons of bitches’- అదీ ఆయన వ్యాఖ్య.
ట్రినిటీ పరీక్షకు సాక్షీభూతంగా నిలచిన మరో శాస్త్ర వేత్త , ఈ నాటి ఈ వ్యాసానికి ప్రేరకుడు అయిన జె.రాబర్ట్  ఓపెన్ హీమర్    (J.Robert Oppenheimer) వేయి సూర్యుల కాంతి అన్న భగవద్గీత లోని సంస్కృతపాదం ఆధారంగా ఆనాటి దృశ్యాన్ని వర్ణించారు.   ఆ తరువాత  చాలా ఏళ్ళకు అణు పరీక్షను గురించి మాట్లాడుతూ మరో మాట చెప్పారు. ముందు అది ఎవరికీ అర్ధం కాలేదు  ఎందుకంటె అది సంస్కృతంలో వుంది.  భగవద్గీతలోని వాక్యం అది. కాలోస్మి  లోకక్షయకృత్ ప్రవ్రుద్దో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః
("kālo'smi lokakṣayakṛtpravṛddho lokānsamāhartumiha pravṛttaḥ"  which he translated as "I am become Death, the destroyer of worlds)[
అంటే-
నేనే మృత్యువును. లోకాలను నాశనం చేసే సర్వంసహా శక్తిని


NOTE: Courtesy Image Owner 


12, నవంబర్ 2014, బుధవారం

ఎటు పోయాయ్‌ ఆ రోజులు ?



మా తాత గారి కాలం నాటికి మా వూళ్లో కరెంటు లేదు. ఆముదపు దీపాలు మినహా - కరెంట్‌  బల్బ్ ని కూడా చూడకుండానే ఆయన కాలం చేశారు.
మా నాన్న గారి కాలం వచ్చేసరికి కరెంట్‌ రాలేదు కానీ - రేడియోలు, గ్రామఫోన్లూ ఉండేవి. కాకపోతే ఆ రేడియోలు - మోటారుకార్లలో వాడే పెద్దసైజు బ్యాటరీల సాయంతో పనిచేసేవి.
మా వూరి మొత్తం జనాభాలో- ఆరోజుల్లో - యాభయి మైళ్ల దూరంలో వున్న బెజవాడకి వెళ్లి, సినిమా చూసొచ్చిన పెద్దమనిషి ఆయన ఒక్కరే. ఆ మాటకి వస్తే ఆయన తప్ప- రైలుని చూసిన  వాళ్ళు  కానీ, బస్సు ఎక్కిన వాళ్ళు కానీ, మా వూళ్లో ఎవరూ లేరని కూడా చెప్పుకునే వారు.
ఇక మా అమ్మ-
కట్టెల పొయ్యి ముందు కూర్చుని - పొగచూరిన వంటింట్లో పదిమందికి వండి వార్చేది. ఆమె సామ్రాజ్యంలో రకరకాల పొయ్యిలు ఉండేవి. పాలు కాగబెట్టడానికి దాలిగుంట - కాఫీ కాచుకోవడానికి బొగ్గులకుంపటి, వంట చేయడానికి మూడు రాళ్ల పొయ్యి, ఇలా దేనికి దానికి విడివిడిగా ఉండేవి. ఇక పెరట్లో బావి ప్రక్కన స్నానాలకోసం కాగులో నీళ్ళు  మరగపెట్టడానికి మరో పెద్ద పొయ్యి సరేసరి. దాలిగుంట విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వంటింటి వసారాలోనే ఓ మూలగా ఉండేది. నిప్పంటించిన పిడకలను ఆ దాలిగుంటలో దొంతరగావేసి పాలకుండని వాటిపై ఉంచి - పైన ఒక రాతిపలకని కప్పేవారు. సన్నటి సెగపై ఆ పాలు తీరిగ్గా కాగేవి. ఎరగ్రా కాగిన ఆ పాలపై - అరచేతి మందాన మీగడ కట్టేది. మర్నాడు - ఆ కుండలోని పెరుగుని నిలబడి వయ్యారంగా కవ్వంతో చిలికేవారు. మజ్జిగ నీటిపై తెట్టెలా కట్టిన తెల్లటి వెన్నని చేతుల్లోకి తీసుకుని, అరచేతిలో ఎగురవేస్తూ ముద్దగా చేసేవారు. పక్కన నిలబడి ఆశగా చూసే చిన్న పిల్లలకి చిన్న చిన్న వెన్న ముద్దలు పెట్టే వాళ్ళు . ఆహా ఏమి రుచి! అని లొట్టలు వేస్తూ తినేసి- ఆటల్లోకి జారుకునే వారు.  మగవాళ్ల సంగతేమో కానీ, ఆడవాళ్లకి ఆ రోజుల్లో చేతినిండా పనే. భోజనాలు కాగానే - అంట్లగిన్నెలు సర్దేసి - వంటిల్లు ఆవు పేడతో అలికేవారు. బాదం ఆకులతో విస్తళ్ళు కుట్టే వారు.  రోకళ్లతో వడ్లు దంచేవారు. ఇంటికి దక్షిణాన ఉన్న రోటిపై కూర్చుని పప్పు రుబ్బేవారు. ఈపనులు చేయడానికి విడిగా పనిమనుషులు ఉన్నా వారితో కలిసి ఈ పనులన్నీ చేసేవారు. వాటితో పాటు శ్రమతెలియకుండా పాటలు పాడుకుండేవారు. విలువ కట్టని వారి శ్రమా, విలువ కోరని వారి నిబద్ధతా చిన్న నాటి జ్ఞాపకాల దొంతర్లలో పదిలంగా ఉండిపోయాయి.
ఇక మారోజులు వచ్చే సరికి - రోజులు పూర్తిగా మారిపోయాయి. కట్టెల పొయ్యిలు పోయి - గ్యాస్‌ స్టవ్‌లు వచ్చాయి. నీళ్ల కాగుల్ని బాయిలర్లు భర్తీ చేశాయి. కరెంట్‌ దీపాలు వచ్చి లాంతర్లని వెనక్కి నెట్టేశాయి. కరక్కాయ సిరాలు- పుల్ల కలాలు తరువాతి రోజుల్లో రూపాలు మార్చుకుని ఫౌంటెన్‌ పెన్నులుగా, బాల్‌పాయింట్‌ పెన్నులుగా అవతరించాయి. రూపాయికి పదహారణాలు అనే లెక్కకాస్తా మా చిన్నతనంలోనే నూరు నయాపైసలుగా మారిపోయింది. బేడలూ, అర్ధణాలూ, కాసులూ, చిల్లికాసులూ జేబుల్లోంచి జారిపోయి నిగనిగలాడే రాగి నయా పైసలు, నికెల్‌ నాణేలు చెలామణిలోకి వచ్చాయి. రామాయణ కాలంనుంచీ ఎరిగిన ఆమడలు, కోసులు, మైళ్ళు  కాలగర్భంలో కలిసిపోయి, కిలోమీటర్‌  రాళ్ళు  రోడ్లపై  వెలిసాయి.  ఏడాదికోమారు జరిగే తిరుణాళ్లు  నిత్యకృత్యంగా మారి - అశ్లీల నృత్యాల వేదికలుగా మారిపోతున్నాయి. కోలాటాలు, పందిరి నాటకాలు, హరికథలు, బురక్రథలు, పిట్టలదొర కథలు చరిత్రపుటల్లో చేరి కనుమరుగవుతున్నాయి.
ఆరోజుల్లో సెలవులు ఇస్తే చాలు - పిల్లలంతా పల్లెటూళ్లకి పరిగెత్తే వాళ్ళు.  ఇన్ని రకాల ఆటలుంటాయా అనేట్టు అనేక రకాల ఆటలతో, పాటలతో కాలం గిర్రున తిరిగిపోయేది. అష్టాచెమ్మాలు, తొక్కుడు బిళ్లలు, వామన గుంటలు, వెన్నెలముద్దలు, వైకుంఠపాళీలు, పచ్చీసాటలు, చింతపిక్కలు, బావుల్లో ఈతలు, వాగు ఒడ్డున కబడ్డీ పోటీలు- ఒకటేమిటి - ఒక జీవితానికి సరిపడా ఆనందాన్ని గుండెల్లో నింపేసుకుని- ఇంకా ఇంకా ఇలాగే రోజుల్ని సరదాగా గడపాలన్న కోరికని మనసులోనే చంపేసుకుని - పాడు సెలవులు అప్పుడే అయిపోయాయా అని నిట్టూరుస్తూ బడిబాట పట్టేవాళ్ళు.
ఇక మా పిల్లల కాలం వచ్చేసరికి - మాయాబజారు సినిమాలో మాదిరిగా - కళ్లముందు ప్రపంచం ఒక్క మారుగా మారిపోయింది. గతం తలచుకోవడానికే మిగిలింది. చిన్నతనంలో చూసినవేవీ - ఈనాడు కలికానికి కూడా కానరావడం లేదు. జీవితం, ఇంత చిన్నదా అనిపించేలా, విన్న పదాలు, చూసిన దృశ్యాలు - ఆడిన ఆటలు, పాడిన పాటలు - కనురెప్పలకిందే కరిగి పోతున్నాయి. జ్ఞాపకాల పొరల్లోకి జారిపోతున్నాయి.
ఆ గురుతుల దారుల్లో వెనక్కి వెడుతుంటే - జొన్న చేల నడుమ కాలిబాటలో పరుచుకున్న దోసతీగెలూ-
లేత జొన్న కంకుల్ని వొడుపుగా కొట్టి తీసి వేయించిన ఊచ బియ్యం-
రోజూ తినే వరి అన్నానికి - ఎప్పుడో ఒకప్పుడు సెలవిచ్చేసి - పని వాళ్ళు  వండిన జొన్నన్నంతో కూడిన మృష్టాన్న భోజనం-
కళ్లాల„సమయంలో - కొత్త వడ్లు కొలిచి - కొనుక్కుతినే కట్టె మిఠాయి-
సాయంత్రం చీకటి పడేవేళకు - మైకులో ఊరంతా వినవచ్చే పంచాయితీ రేడియోలో సినిమా పాటలు-
వెన్నెల్లో ఆరుబయట నులకమంచాలపై పడుకుని ఊ కొడుతూ వినే అమ్మమ్మ కథలూ-
ఏవీ ! అవేవీ! ఎక్కడా కనబడవేం! ఇవన్నీ ఒక నాడు వున్నాయని అన్నా - కంప్యూటర్లతో ఒంటరిగా ఆడుకునే ఈనాటి పిల్లలు  నమ్ముతారా?? కళ్లతో చూసిందే  నమ్ముతాం  అని వాళ్లంటే మీరేం చేస్తారు?




16 -7-2008 (Note: Courtesy Image Owner)



నాయకులు - నమ్మకాలు


(Published by 'SURYA' telugu daily in its edit page on 13-11-2014, Thursday)
ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ సమాచార శాఖ విడుదలచేసిన 'జన్మభూమి - మా వూరు' పత్రికా ప్రకటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక చేతిలో మైకు పట్టుకుని, మరో చేతిని ప్రజలకు చూపుతూ కానవస్తారు. అందులో విశేషం ఏముంది అనిపించవచ్చు. కానీ దాన్ని పరిశీలనగా చూస్తె చంద్రబాబు నుదుటిపై ఎర్రటి బొట్టు కనిపిస్తుంది. ఆయన్ని చాలా ఏళ్ళుగా తెలిసిన వాళ్ళకు మాత్రం చిత్రంగానే అనిపిస్తుంది. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన తరువాత లేదా ఆయన మంత్రిగా ముఖ్యమంత్రిగా గతంలో పాలించిన రోజుల్లో కూడా తన వ్యక్తిగత విశ్వాసాలను ఇంటికే పరిమితం  చేసుకునే వారు. వాస్తు, జాతకం వంటి నమ్మకాలు వున్నా వాటిని బహిరంగంగా బాహాటంగా ప్రదర్శించేవారు కారు. చంద్రబాబు ముఖ్యమంత్రి  అయినందువల్ల నుదుటిపై బొట్టు పెట్టుకోవడం అపరాధం అని చెప్పడం కానీ,  పొరబాటు అని సూత్రీకరించడం కానీ ఈ వ్యాసకర్త  ఉదేశ్యం ఎంతమాత్రంకాదు. లోగడ ఎప్పుడూ  ఇటువంటివాటిని పది మంది ముందు ప్రదర్శించడం ఆయనకు అలవాటులేని పని. అయితే పదేళ్ళ విరామం తరువాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన అనంతరం కొన్ని నమ్మకాలపట్ల ఆయనకున్న నమ్మకం మరింత పెరిగిందన్నది మాత్రం వాస్తవం.
పదవీ ప్రమాణ స్వీకారాలకు మాత్రమే  ప్రస్తుతం పరిమితం అయివున్న ముహూర్తాలను  ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఈసారి శాసన సభ తొలి సమావేశం ప్రారంభానికి కూడా విస్తరించారు. తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఈ విషయాల్లో నాలుగాకులు ఎక్కువే చదివారు. అయితే వాస్తు, ముహూర్తాలు మొదలయిన విషయాల్లో ఆయన యెప్పుడూ గోప్యత పాటించిన దాఖలా లేదు. ఏదిఏమైనా ఇటువంటివన్నీ వ్యక్తిగత నమ్మకాలు. వాటిని తప్పుబట్టి ఎత్తి చూపే హక్కు ఎవ్వరికీ వుండదు. కాకపొతే తమ నమ్మకాలు, విశ్వాసాలు తమ వరకే పరిమితం చేసుకుని తద్వారా ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా చూసుకోగలిగితే ఎవ్వరూ వారిని  వేలెత్తి చూపే అవకాశం కూడా వుండదు.
దేశ విదేశాల్లో సయితం రాజకీయ నాయకులకు కొన్ని విశ్వాసాలు వుండడం కొత్త విషయం ఏమీ కాదు. హిట్లర్, ముస్సోలినీల కాలంలో కూడా ఇవి వున్నాయి. హిట్లర్ కి సంఖ్యా శాస్త్రం పట్ల నమ్మకం ఎక్కువ. ఏడు అంకె తనకు బాగా కలిసి వస్తుందని విశ్వసించేవారు. అంతే  కాదు యుద్ధ వ్యూహాల విషయంలో కూడా హిట్లర్ జ్యోతిష్కులను సంప్రదించేవాడని  ప్రతీతి. ఇది ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే జర్మనీ సైన్యాలు ఎలా, ఏ దిక్కుగా కదులుతున్నాయో తెలుసుకోవడానికి మిత్ర దేశాల సైన్యాధిపతులు హిట్లర్ హారోస్కోప్ ని ఆధారం చేసుకునేవారని ఆరోజుల్లో కధలుగా చెప్పుకునేవరకూ వెళ్ళింది.       
అలాగే మరో నియంత ముస్సోలినీ. హిట్లర్ కి మంచి స్నేహితుడు కూడా. అంచేతేనేమో ముస్సోలినీకి కూడా ఈ పట్టింపులు జాస్తి. విమానాల్లో తోటి ప్రయాణీకుల మీద అనుమానం కలిగిందంటే చాలు ఆ విమానం దిగి మరో విమానం ఎక్కేవాడు. తోటి ప్రయాణీకుడి మీద అనుమానం తన ప్రాణాలు తీస్తాడని కాదు. ఆ ప్రయాణీకుడివి పిశాచ నేత్రాలు అన్న సందేహం తోటే.   
అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన రొనాల్ద్ రీగన్ గురించి కూడా ఇదే విధమైన ప్రచారం వుంది. వెయిట్ హౌస్ లో ఏదయినా కీలకమైన నిర్ణయం తీసుకునే ముందు రీగన్, కాలిఫోర్నియాలో వుండే ఒక మహిళను సంప్రదించేవారు. ఆవిడ ప్రెసిడెంట్ రీగన్ జాతక చక్రం చూసి, గ్రహాలూ, వాటి స్థానాలను బట్టి వాటికి  అనుగుణంగా వుండే సలహాలు, సూచనలు ఇచ్చేవారుట. వైట్ హౌస్  నిర్ణయాలు కూడా తదనుగుణంగా మారిపోయేవట. అక్కడ ఇవన్నీ బహిరంగ రహస్యాలు. అలాగే ముందుగా నిర్ణయమైన  ప్రెసిడెంట్ పర్యటనలు, ప్రసంగాలు, విలేకరుల సమావేశాలు సయితం 'ఆ రోజు జాతకరీత్యా  మంచిది కాదు' అనే కారణంతో రద్దయిన సందర్భాలు ఉండేవి.   
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఇదే మాదిరి. ఎలెక్షన్ జరిగే రోజున ఆయన ఎన్ని పనులున్నా మానుకుని బాస్కెట్ బాల్ ఆట ఆడతారు. అలా చేస్తే ఎన్నికలలో విజయం వరిస్తుందని ఒబామా నమ్మకం. కాకపొతే ఒక్కసారి మాత్రం ఈ మంత్రం పనిచేయలేదు. న్యూ హాంప్ షైర్  ప్రైమరీ ఎలెక్షన్ రోజున బరాక్ ఒబామా బాస్కెట్ బాల్ ఆడారు కానీ, ఫలితం మాత్రం వేరేగా వచ్చింది. అయినా సరే ఆయన మాత్రం తన నమ్మకాన్ని వొదులుకోలేదు.
కమ్యూనిస్ట్ చైనాలో కూడా ఈ నమ్మకాలకు కొదవలేదు. అక్కడి వారికి ఎనిమిది సంఖ్య అదృష్టం తెస్తుందని విశ్వాసం. 2008 లో బీజింగులో జరిగిన ఒలింపిక్స్ పోటీల ప్రారంభ ముహూర్తాన్ని  ఆగస్టు ఎనిమిదో తేదీ, రాత్రి ఎనిమిది గంటలకు నిర్ణయించడం వెనుక ఎనిమిది అంకె మీదగల మమకారమే అని నోళ్ళు నొక్కుకున్న వాళ్ళు లేకపోలేదు.
ఇక మన దేశం సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటువంటి విశ్వాసాలకు పుట్టిల్లు అనే పేరు పడిన దేశం మనది.
బీహారు మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్  రాజకీయంగా కలిసి రావడంలేదని ఇంట్లో వున్న స్విమ్మింగ్ పూల్ ని  రాత్రికి రాత్రే ఇసుకతో  పూడ్పించారు.
ఈ మధ్య బీహార్ లో జరిగిన ఉపఎన్నికల సభల్లో లాలూ మహాశయులు ఈ నమ్మకాలపై తనకున్న నమ్మకాన్ని మరో రకంగా ప్రదర్శించే ప్రయత్నం చేసారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన ముహూర్తం మంచిదికాదని అయన సెలవిచ్చారు.  ఉత్తరాంచల్ లో ఆకస్మిక వరదల్లో హైదరాబాదు విద్యార్ధుల మరణానికి  ఆ ముహూర్తమే కారణమని ముడిపెట్టారు. మోడీ నేపాల్ పర్యటనకు వెళ్ళగానే అక్కడకూడా వరదలు వచ్చిన విషయాన్ని లాలూ ప్రస్తావించారు.
ఇక చత్తీస్ ఘర్  మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ ఈ విషయంలో ఒక అడుగు ముందుకే వేసారు. ఓసారి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, ఎలెక్ట్రానిక్ వోటింగ్ యంత్రంలో 'కాంగ్రెసేతర అభ్యర్ధి గుర్తుపై మీట నొక్కితే ఎలెక్ట్రిక్ షాక్ కొడుతుంద'ని గిరిజనులను బెదరగొట్టారు.     
కర్ణాటకలో పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకుల్లో చాలామందికి ఈ నమ్మకాలు మెండుగా వున్నాయి. ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వెళ్ళేటప్పుడు చొక్కా మీద చొక్కా అలా ఎనిమిది చొక్కాలు వేసుకుని వెడితే మంచిదనే నమ్మకంతో ఒక నాయకుడు ప్రతి ఎన్నికలో ఇదే సూత్రాన్ని విధిగా పాటిస్తూ వస్తున్నారు.


అందుకే, తెలివితేటలతో పుట్టడం కంటే అదృష్టంతో పుట్టడం మంచిదని డాక్టర్ గో కెంగ్ స్వీ ఏనాడో చెప్పారు. (12-11-2014)