13, నవంబర్ 2014, గురువారం

చావుతో ఆటలంటే మాటలా!

  

సుబ్బారావుకు అందర్నీ ఆటలు పట్టించడం ఓ సరదా.
అతనో రోజు కంప్యూటర్ ముందు కూర్చుని ఫేస్ బుక్ లో ఎవర్నో ఆట పట్టిస్తుంటే కాలింగ్ బెల్ మోగింది. వెళ్లి తలుపు తీస్తే ఎదురుగా యమపాశంతో ఇద్దరు యమభటులు  కనిపించారు. ముందు గతుక్కుమన్నా తేరుకుని వాళ్ళని లోపలకు రమ్మన్నాడు. ఏవిటి విషయం అని అడిగాడు. వారిలో ఒకడు ఆ రోజు చావు మూడిన వాళ్ళ జాబితా ఒకటి తీసాడు. సుబ్బారావు పేరు అందరికంటే మొదట్లో వుంది. పద పద అని తొందర చేసారు.
సుబ్బారావు తరహా తెలుసుకదా.
రాకరాక వచ్చారు. మళ్ళీ మళ్ళీ వచ్చే ఉద్యోగాలు కావాయె మీవి.  ఒక్క నిమిషం  అలా  కూర్చోండి. ఒక కప్పు కాఫీ ఇస్తానుఅంటూ  వొంటింట్లోకి వెళ్ళాడు.  చెరో కప్పులో కాఫీ కలిపి తెచ్చి అందులో తెలివిగా నిద్ర మాత్రలు వేసాడు.
కాఫీ తాగి యమభటులిద్దరూ గుర్రు పెట్టి నిద్రపోయారు.      
ఈలోగా సుబ్బారావు  చావు రాసిపెట్టివున్న వాళ్ళ జాబితా తీసి అందులో మొదట్లో వున్న తన పేరు కొట్టేసి దాన్ని చిట్టా చివర్లో రాసేసి యేవీ తెలియని నంగనాచిలా  కూర్చున్నాడు.
మొత్తానికి యమ భటులు నిద్ర లేచారు. వారికి సుబ్బారావు ఇచ్చిన కాఫీ ఎంతో నచ్చింది.
చూడు సుబ్బారావూ చూడబోతే నువ్వు చాలా మంచాడిలా వున్నావు. అందుకని నీకో మేలు చేస్తాం. ఈరోజు మా డ్యూటీని జాబితా చివరి నుంచి మొదలు పెడతాం . ఏవంటావ్?’
ఏవంటాడు. అప్పటికే కుక్కిన పేనాయె.


(ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)
NOTE: Courtesy Image Owner 

కామెంట్‌లు లేవు: