1, నవంబర్ 2014, శనివారం

తిక్క కుదిరిస్తా!


ఏకాంబరం తన బాసుతో కలిసి పగటివేళ రైల్లో పోతున్నాడు. ఆ రైలు ఓ పెద్ద సొరంగ మార్గంలో పోతోంది. అదే బోగీలో మరో ఇద్దరు వున్నారు. ఓ వయస్సు మళ్లినావిడ, ఆవిడతో పాటు మాంచి వయస్సులోవున్న వాళ్ళమ్మాయి. రైలు సొరంగంలో ప్రవేశించగానే బోగీ అంతా చీకటి అలుముకుంది. ఎవరికెవరు కనిపించడం లేదు. వున్నట్టుండి ఎవర్నో ముద్దు పెట్టుకున్న ధ్వని, వెనువెంటనే చెంప చెల్లుమన్న చప్పుడు.
రైలు సొరంగం నుంచి బయటకు వచ్చింది. వెలుతురు వచ్చింది.
వృద్ధురాలు, ఏకాంబరం మొహాల్లో తెలియని కంగారు. మేనేజర్ చెంప కందిపోయి వుంది. తలదించుకుని కూర్చున్నాడు. ఏం జరిగిందో తెలియనట్టు అమ్మడు అమాయకంగా చూస్తోంది. మౌనంగా వున్నారు కానీ ఎవరి ఆలోచనలు వారివి.   
పెద్దావిడ మనసులో అనుకుంటోంది " పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు కానీ ఈ మేనేజర్లవన్నీ పిదప బుద్దులు. ఆఫీసులో అమ్మాయిలతో చనువు తీసుకున్నట్టే మా ఆమ్మాయిని కూడా ఏదో చేసివుంటాడు. ఇది చెంప చెళ్ళుమనిపించింది. మహ మంచి పనిచేసింది. ఇలాటి వెధవలకి ఇలాగే జరగాలి"
అమ్మాయి ఆలోచనలు వేరుగా వున్నాయి "బహుశా ఆ మేనేజర్ వెధవ నన్నే ముద్దుపెట్టుకోవాలని చూసివుంటాడు. చీకట్లో తెలియక  అమ్మకు పెట్టి ఉంటాడు. అమ్మ తక్కువదా! చాచి కొట్టి వుంటుంది"  
మేనేజర్ మరో విధంగా అనుకుంటున్నాడు "ఛ! ఛ! ఎంతపని జరిగింది. చెప్పుకుంటే సిగ్గుచేటు.  ఇది ఖచ్చితంగా ఏకాంబరం గాడి పనే అయివుంటుంది. వాడు ముద్దు పెట్టుకుంటే ఆ అమ్మాయి పొరబడి నా లెంపలు పగలగొట్టింది. కానీ ఎలా చెప్పడం? పగిలింది నా చెంప కదా!"
ఏకాంబరం ఆలోచనలు మరో విధంగా సాగుతున్నాయి. కానీ అవి చస్తే బయటపెట్టడు.
" ఈ మేనేజర్ పీనుక్కి తగిన శాస్తే జరిగింది. అస్తమానూ ఆఫీసులో నా మీద పెత్తనం చేస్తాడు. అయిన దానికీ, కాని దానికీ వంకలు పెట్టి నలుగురిలో అవమానిస్తాడు. ఇన్నాల్టికి దొరికాడు వెధవ. ఇంకో టన్నెల్ రానీ,  మరోసారి ముద్దు పెట్టిన చప్పుడు చేస్తాను. మేనేజర్ గాడిద రెండో చెంప కూడా  పగలగొడతాను. ఏకాంబరం అంటే అల్లాటప్పా అనుకుంటున్నాడు వెధవన్నర వెధవ"
(Usharani Nutulapati పోస్ట్ చేసిన ఇంగ్లీష్ కధనానికి స్వేచ్చానువాదం)

NOTE: Courtesy Image Owner 

పక్షి ప్రేమ



అనగనగా ఓ బ్రూనై,  పేరు లాగే ఈ దేశం  చాలా చిన్నది. అయితే డబ్బులో మాత్రం మాలావు. ఆదేశపు రాజుగారు, అంటే సుల్తాను ప్రభువులవారు  మొత్తం ప్రపంచంలోనే సంపన్నుడయిన రాజు. రాచరికం ఇంకా సాగుతున్న  ఆ దేశంలో దేనికీ కొదవలేదు. ఎందుకంటె అక్కడ సముద్ర గర్భంలో ముడి చమురు నిక్షేపాలకు కొదవలేకపోవడమే. పెట్రోలుకు, డీసెలుకు  ఈ  క్రూడ్ ఆయిల్ (ముడి చమురు) మూలాధారం. అది యెంత పుష్కలంగా లభిస్తుందంటే  వరసగా నాలుగు రోజులు ఎండ కాసిందంటే చాలు  నేల మీద పచ్చగడ్డి దానంతట  అదే అంటుకుని తగలబడిపోతుందట. అలాటి ప్రమాదాలు జరక్కుండా చూడడానికే  భగవంతుడు ఆ దేశంలో ఎప్పుడూ వానలు కురిపిస్తుంటాడు.
సరే! ఈ బ్రూనై కధ ఎందుకంటె అక్కడ ఓ తెలుగు కుటుంబం కాపురం ఉంటోంది. ఒక్కటే కాదు చాలా తెలుగు కుటుంబాలు, ఆ మాటకి వస్తే భారతీయులు పెద్ద సంఖ్యలోనే ఆ దేశంలో నివసిస్తున్నారు. ముందు చెప్పిన కుటుంబంతో ముఖ పరిచయం లేకపోయినా ముఖ పుస్తక పరిచయం చాలా రోజులుగా వుంది. ధూళిపూడి రాం ప్రసాద్ గారు  కాకినాడ వాస్తవ్యులు.  డిజైన్ ఇంజినీరు. ఆఫ్ షోర్ క్రూడాయిల్ డ్రిల్లింగులో రాం ప్రసాద్ గారి పాత్ర కూడా ఎంతో కొంత వుండే వుంటుంది. వారక్కడ ఒకింట్లో అద్దెకు వుంటున్నారు. జన సాంద్రత తక్కువ కాబట్టి అక్కడ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించరు. ఒకటి రెండు అంతస్తుల ఇళ్ళే ఎక్కువ. ఆయనది  పై పోర్షన్. ఇంటి యజమానులు కింద వుంటారు. మంచి మనుషులు కాబట్టి ఇంటి యజమాని కుటుంబంతో బాగా కలిసిపోయారు. ఇలా హాయిగా రోజులు గడుస్తున్న సమయంలో ఓ పక్షి జంట తమకు తాముగా ఆ ఇంటికి వచ్చి మంచి ముహూర్తం చూసుకుని  గృహ ప్రవేశం చేసింది.  మెట్లకింద, ట్యూబు లైట్  మీద జాగా చూసుకుని ఏకంగా ఓ  గూడుకట్టుకుని కాపురం పెట్టింది. చూస్తుండగానే పక్షి సంసారం పెరిగింది. గుడ్లు పెట్టడం పొదగడం జరిగిపోయింది. నల్లటి ఆకారంలో వుండే ఆ పక్షులు ఏజాతివో కూడా  రామప్రసాద్ గారికీ వారి భార్యకూ తెలవదు. మెట్లు ఎక్కేటప్పుడూ, దిగే టప్పుడూ వాటితో మొదలయిన అవినాభావ సంబంధం బాగా పెరిగిపోయింది. సంసారం పెరగడంతో గూడు సరిపోలేదు. గూడు పిల్లలకు ఇచ్చి తల్లి పక్షి, తండ్రి పక్షి ట్యూబ్ లైట్ పై కాలక్షేపం చేయడం చూసి రాం ప్రసాద్ దంపతులు ముచ్చట పడ్డారు.  పక్షులు కూడా  ఆ వాతావరణానికి అలవాటు పడిపోయాయి. అసలు సమస్యల్లా 'స్వచ్ఛపరిసరాల' నినాదంతో వచ్చింది. పక్షులకు గూడంటూ దొరికింది కానీ వాటికి విడిగా లెట్రిన్ సౌకర్యం లేకపోవడంతో అవి యధేచ్చగా వున్నచోటునుంచే కాలకృత్యాలు తీర్చుకోవడం మొదలెట్టాయి. అవి వేసే రెట్టలు ఇంటి యజమానురాలికి  చిరాకు తెప్పించాయి. మెట్ల నిండా రెట్టలు కనిపిస్తుంటే ఎవరికి మాత్రం కోపం రాదు. 'అదంతా ఎవరు శుభ్రం చేస్తారు' అని లా పాయింటు తీసి, ముందు ఆ పక్షి గూడును అక్కడినుంచి  తక్షణం తీసివేయాల్సిందే అని హుకుం జారీ చేసింది. పక్షుల మీద అకార  మమకారం పెంచుకున్న రామప్రసాద్ దంపతులు సుతారమూ దానికి వొప్పుకోలేదు. పక్షుల రెట్టల్ని శుభ్రం చేసే బాధ్యతను రామప్రసాద్ గారి భార్య స్వచ్చందంగా తలకెత్తుకోవడంతో సరిహద్దు వివాదం చల్లారి పోయింది.
కింద ఫోటోలో కనిపించేదే ఆ పక్షి గూడు. వాటిని ఎవరయినా గుర్తుపట్టగలరేమో ప్రయత్నించండి.





NOTE : Photo Courtesy Shri Dhulipudi Ramprasad



పొదుపు మంత్రం పఠిస్తున్న మోడీ ప్రభుత్వం

(Published by 'SURYA' Telugu Daily in its Edit Page on 02-11-2014, SUNDAY)

గత గురువారం నాడు మోడీ ప్రభుత్వం కొన్ని పొదుపు చర్యల్ని ప్రకటించింది. ఒకరకంగా ఇవి వ్యయ నియంత్రణ చర్యలు. ఖర్చు చేయని రూపాయే మనం మిగిల్చుకున్న రూపాయని అంటారు. అలాగే, ప్రభుత్వం కూడా కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలని తలపెట్టింది. ఖర్చులు పెంచుకుంటూపోయే ఈ రోజుల్లో 'తగ్గించుకుంటాం' అంటే మంచి మాటే కదా!. అయితే, గతంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయే సర్కారు కూడా రెండోవిడత పాలనలో ఇదేమాదిరి కొన్ని పొదుపు చర్యల్ని ప్రకటించింది. కాబట్టి దీనికి పూర్తి ఖ్యాతిని పూర్తిగా ప్రస్తుత ప్రభుత్వ ఖాతాలోనే వెయ్యాల్సిన  అవసరం లేదు. ప్రభుత్వాల నిర్వహణలో భాగంగానే వీటిని చూడాల్సివుంటుంది.
ద్రవ్యలోటు బాగా పెరిగిపోతూ ఉండడంవల్ల ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోకతప్పడం లేదు. ప్రణాళికేతర వ్యయం అపరిమితంగా పెరిగిపోతూ వుండడం అనేది ప్రభుత్వాలకు ఆందోళన కలిగించే విషయం. దీన్ని అదుపు చేయడం వల్ల  ముందు ఇబ్బంది పడేది కూడా ప్రభుత్వాన్ని నడిపేవారే  కావడం ఒక విశేషం. మంత్రులూ, అధికారులూ కొన్ని సౌకర్యాలు తాత్కాలికంగానైనా కోల్పోతారు. మునపటి మాదిరిగా సర్కారు సొమ్ముతో జల్సాలు చేయడం కుదరదు. ప్రస్తుతం అధికారరీత్యా పర్యటనలు చేసేటప్పుడు కొందరు ఉన్నతాధికారులకు విమానాల్లో ఫస్ట్ క్లాసులో ప్రయాణించే వెసులుబాటు వుంది. సాధారణ  టిక్కెట్టు ధరకంటే ఇది రెండు మూడు రెట్లు ఎక్కువ. ఇప్పుడు ఆ పద్దతికి ముగింపు పలికారు. అంతే  కాదు, విమానాల్లో చౌకగా దొరికే టిక్కెట్లతోనే  ప్రయాణాలు చేయాలి. ఒక స్థాయి అధికారులకు, అనధికారులకూ దేశ విదేశ ప్రయాణాలు చేసేటప్పుడు తమకు తోడుగా మరొకరిని వెంట తీసుకుని వెళ్ళే సదుపాయం వుంది. ఈ సౌకర్యం ఇక ముందు వుండదు.  సదస్సులు, గోష్టుల పేరుతొ పెట్టె ఖర్చులకు కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇలాటి సందర్భాలలో  విందు వినోదాల పేరిట చేసే ఖర్చు చుక్కల్ని తాకుతోందనడం వాస్తవ దూరమేమీ కాదు. ఎంతో అవసరమైన సందర్భాల్లో తప్ప సదస్సులు ఏర్పాటుచేయరాదని ఆదేశించింది.  ఒకవేళ సదస్సుల ఏర్పాటు తప్పనిసరి అయితే, ఎటువంటి పరిస్తితుల్లోను వాటిని ఖరీదయిన అయిదు నక్షత్రాల హోటళ్ళలో అసలే  ఏర్పాటు చేయకూడదన్నది మరో ఆంక్ష.  వీలయినంతవరకు, డబ్బు తక్కువ ఖర్చయ్యే వీడియో కాన్ఫరెన్సు విధానాలను అనుసరించాలనీ, పర్యటనలు, ప్రయాణాలు తగ్గించుకోవాలనీ  ప్రభుత్వం సూచించింది. పొదుపు మంత్రం ప్రభావం ప్రభుత్వ వాహనాల మీద కూడా పడుతుంది.  కొత్త వాహనాల కొనుగోళ్ళపై నిషేధం విధించింది. ఇలానే మరికొన్ని షరా మామూలు చర్యలు ఈ జాబితాలో వున్నాయి.
మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచీ అనవసర  వ్యయాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. అధికార పీఠం ఎక్కగానే,  ప్రధాని హోదాలో  వెంట వెంటనే  చేసిన అనేక విదేశీ ప్రయాణాల్లో కూడా కొన్ని సాంప్రదాయక పద్ధతులకు స్వస్తి చెప్పారు. గతంలో ప్రధానమంత్రి విదేశీ ప్రయాణం అంటే చాలా హడావిడి వుండేది. ఆయన వెంట వెళ్ళే పరివారంలో అనేకమంది పత్రికా విలేకరులు కూడా వుండేవారు. మోడీ వీటికి రాం రాం చెప్పేసారు. ప్రధానులు   ప్రయాణం చేసే ఎయిర్ ఇండియా విమానాల్లో  మద్యం ఏరులా ప్రవహించేదని గతంలో  ఆ అవకాశం దక్కిన విలేకరులు తమతోటివారికి చెప్పుకునేవారు. మోడీ వాటన్నిటికీ ఒకేసారి భరతవాక్యం పలికారు. ఇవన్నీ దేశ ప్రజల దృష్టిలో పడి, ఆయన వ్యక్తిత్వ శోభ మరింత ఇనుమడించే  మాట నిజమే. కానీ, ఇటీవల మోడీ జరిపిన అమెరికా పర్యటనలో ఆయన ధరించిన ఖరీదైన డిజైనర్ దుస్తులకు  సోషల్ మీడియాలో విపరీతమైన ప్రాచుర్యం లభించింది. గతంలో ఇందిరా గాంధీ విషయంలో ఇదే విధమైన ప్రచారం సాగేది. పర్యటనల సమయంలో ఆవిడ రోజు మొత్తంలో అనేక పర్యాయాలు ఎలా చీరెలు మార్చేవారు అనే సంగతులను ఫొటోలతో సహా ఆసక్తికర  కధనాలను  పత్రికలు  ప్రచురించేవి.  ఆరాధ్య దైవాలుగా ప్రజల్లో తమ ప్రభ  కొనసాగినన్నాళ్లు ఈ ప్రచారాలు ఆయా నాయకులకు  సానుకూలంగానే  సాగుతాయి. పరిస్తితులు తలకిందయినప్పుడు, తాడే పామయి కరిచినట్టు ఇలాటి అంశాలే,  వారిపై వ్యతిరేక  ప్రచారానికీ, వారి  వ్యక్తిత్వ హననానికీ దారితీసే ప్రమాదం వుంది. చరిత్ర చెప్పే ఈ  పాఠాలను  నేతలు సదా  గుర్తుపెట్టుకోవాలి.


కొన్ని విషయాలు వినడానికి ఆసక్తికరంగా వుంటాయి. తమ అభిమాన నాయకులు లేదా వ్యక్తుల జీవన శైలిని, విపరీత పోకడలను  అభిమానించేవారు కొందరయితే, ఆ పేరుతొ  ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని విమర్శించే ప్రత్యర్ధులు  కూడా వుంటారు. గతంలో కాంగ్రెస్  ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి అంజయ్య అధికారిక పర్యటనలకోసం యాదగిరి అనే ఒక  హెలికాఫ్టర్ వాడేవారు. ఆనాటి  ప్రభుత్వాలను విపరీతంగా విమర్శించి, ప్రజల్లో పెల్లుబికిన కాంగ్రెస్ వ్యతిరేకతతో  అధికారపగ్గాలు చేపట్టిన తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు సయితం ఆ తరువాతి రోజుల్లో హెలికాఫ్టర్ ని  విచ్చలవిడిగా  వాడిన విధానం విమర్శలకు  గురయింది. బెజవాడ నుంచి కృష్ణ అవతల వొడ్డున వున్న మంగళగిరి వెళ్ళడానికి కూడా ఎన్టీయార్ హెలికాఫ్టర్ వాడారని ఆరోజుల్లో ప్రత్యర్ధి కాంగ్రెస్ గగ్గోలు పెట్టింది. అయితే, ప్రజల్లో ఆయనకు వున్న విపరీతమైన అభిమానం వల్ల ఆ ఆరోపణలు గాలికి కొట్టుకుపోయాయి.
తన 'నోటి మాటే' జీవో అని ప్రకటించిన మర్రి చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ప్రభుత్వ వ్యయంపై అనేక ఆంక్షలు  ఉండేవి. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన వెంట వెళ్ళే అధికారులకు విమానయాన అర్హత  వుండేది కాదు. ప్రతిసారీ, ఆ అధికారులు విమానయానం కోసం ఆర్ధిక శాఖనుంచి ప్రత్యేకంగా  ముందస్తు అనుమతులు తీసుకోవాల్సివచ్చేది. ఆ అనుమతులను విడిగా జీవోల  రూపంలో విడుదల చేయాల్సిన పరిస్తితి వుండేది.  ఆయన పేషీ సిబ్బందిలో చాలామందికి ప్రభుత్వ వాహనాలు ఉండేవి కావు.
సచివాలయంలో అతికొద్దిమంది అధికారులకు తప్ప  ఏసీ సౌకర్యం వుండేది కాదు. తరువాత తరువాత ప్రపంచ బ్యాంకు రుణాలు ఇబ్బడిముబ్బడిగా రావడం మొదలయిన తరువాత నుంచి కాబోలు  ప్రభుత్వ కార్యాలయాల రూపురేఖలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. ఒక మంత్రి కార్యాలయంలో వాడిన ఫర్నిచర్ కొత్తగా వచ్చే  మరో మంత్రి వాడే ప్రసక్తి లేదు.  కిటికీ తెరలతో సహా మళ్ళీ అన్నీ కొత్తవే కొంటున్నారు. 'యధారాజా....' అన్నట్టు  ఉన్నతాధికారులదీ అదే వరస అయింది. వారి  అభిరుచులకూ, వారి జాతకాలకు  సరిపడే వాస్తుకు అనుగుణంగా వారి  కార్యాలయాలు, ఇళ్ళల్లో మార్పులూ, చేర్పులూ  ప్రభుత్వ ఖర్చుతో ఆఘమేఘాలమీద జరిగిపోతూ వుండడం నేడు చూస్తున్నాం. కాంగ్రెస్ ముఖ్యమంత్రి  ఒకరు ఉదయం ఢిల్లీ వెళ్లి సాయంత్రం హైదరాబాదు తిరిగొచ్చి, తిరిగి మర్నాడు ఉదయమే ఢిల్లీకి విమానంలో వెళ్ళిన సందర్భాలు వున్నాయి. 'రాత్రి ఢిల్లీలోనే ఉండొచ్చు కదా, రాత్రికి రాత్రి హైదరాబాదు వచ్చి చక్కబెట్టే  రాచకార్యాలు ఏమిట'ని ప్రతిపక్షాలు తప్పుబట్టిన ఉదంతాలు ఉన్నాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల విమాన ప్రయాణాలను ఎద్దేవా చేసిన వారే  ఇప్పుడు  ప్రత్యేక విమానాలు వాడుతున్నారు. ఇదొక రాజకీయ వైచిత్రి. ఒకప్పుడు   ప్రభుత్వ వాహనాలు అంటే  అంబాసిడర్ కార్లు మాత్రమె.  ఇందిరా గాంధి ప్రధానమంత్రిగా వున్నప్పుడు కూడా ఆవిడ అధికారిక వాహనం అంబాసిడర్ కారే. ఇప్పుడు మంత్రులూ, ఆ హోదా కలిగిన వారూ  వాడుతున్న అతి ఖరీదయిన కార్లు, వాటిని  విచ్చలవిడిగా వాడుతున్న విధానం  గమనిస్తే, దుబారా ఎక్కడ జరుగుతున్నదో ఇట్టే తెలిసిపోతుంది. ఇల్లు చక్కపెట్టే పని ఇలాటి వాటినుంచి మొదలు పెడితే బాగుంటుంది.
మనది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే.  కానీ మనకంటే బాగా అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో అధ్యక్షులు, ప్రధానమంత్రులు చాలా నిరాడంబరంగా విధులను నిర్వహించడం చూస్తున్నాం. ఒక దేశపు ప్రధాని ఎలాటి భద్రతా ఏర్పాట్లు లేకుండా భార్యతో కలిసి నడుచుకుంటూ సినిమాకు వెళ్ళే వాడని, మరో దేశం అధినేత విమానాశ్రయంలో బోర్డింగ్ పాసుకోసం  క్యూలో నిల్చునేవాడనీ, మరోదేశపు ప్రధాన మంత్రి సరదాగా టాక్సీ డ్రైవర్  వేషం కట్టి జనాలను అలరించాడనీ ఇలా వార్తలు వింటున్నప్పుడు, పత్రికల్లో చదువుతున్నప్పుడు, సోషల్ మీడియాలో గమనిస్తున్నప్పుడు   మన నాయకులు కూడా అలా వుంటే బాగుండు కదా అనిపిస్తుంది. ఇటువంటి వృత్తాంతాల నుంచి  పాఠాలు నేర్చుకుంటే మంచిది కానీ, ఉత్తుత్తి పొదుపు మంత్రాలవల్ల  చింతకాయలు రాలవు. సౌకర్యాలకు, సదుపాయాలకు అలవాటుపడ్డ ప్రాణాలు ప్రత్యామ్నాయ మార్గాలు ఇట్టే కనుక్కుంటాయి. పొదుపు చర్యలు, ఉత్తర్వులు కాగితాలకే పరిమితమైపోతాయి. నిబంధలను రూపొందించే వారికే వాటిని ఉల్లంఘించే  అడ్డదారులు ముందుగా తెలుస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. (01-11-2014)

NOTE: Courtesy Cartoonist 

31, అక్టోబర్ 2014, శుక్రవారం

కష్టే ఫలి


అయ్యన్నతో కలసి నగరానికి వచ్చినప్పుడు సుందరమ్మ సంతోషపడినదెంతో తెలియదు కాని భయపడింది మాత్రం వాస్తవం. అది బతుకు గురించిన భయం కాదు. కన్నవాళ్ళనీ, వున్న ఊరినీ విడిచి వెడుతున్నానన్న బెంగ.  చదువు సంధ్యలుండి అయ్యన్న బస్తీబాట పట్టలేదు. పొట్టచేతపట్టుకుని కూలీ నాలీ చేసి కడుపు నింపుకోవాలని అక్కడికి చేరాడు. కొత్తగా వెలుస్తున్న కాలనీలో కొత్తగా కట్టిన అపార్ట్ మెంటులో వాచ్ మన్ ఉద్యోగానికి కుదురుకున్నాడు.  తలదాచుకోవడానికి ఇబ్బంది లేదు. కరెంటు ఖర్చు లేదు. నీళ్ళ సమస్య లేదు. అందుకే జీతం తక్కువయినా అతడీ ఉపాధి ఎంచుకున్నాడు.

ఇక సుందరమ్మ.  ఏళ్ళు పైబడి సుందరమ్మ కాలేదు. పల్లెటూళ్ళల్లో అంతే!  పుట్టగానే ఆడపిల్లకు పెద్దరికం వచ్చేస్తుంది. బస్తీకి రాగానే సుందరమ్మ సుందరి అయిపోయింది. అయ్యన్నను మాత్రం అంతా 'అన్నా' అని పిలుస్తారు. పేరుమారింది సరే. కానీ జీవితం మారలేదు. మొగుడి జీతం గొర్రెతోక. పెరిగే ఆశ లేదు. అందుకే సుందరి కొంత భారాన్ని తన తలకు ఎత్తుకుంది. అపార్ట్ మెంటులో నాలుగు ఇళ్ళల్లో పనికి కుదిరింది. ఆలావచ్చిన డబ్బులతో మొగుడికి ఓ సెకండ్ హాండ్ సైకిల్ కొన్నది. అపార్ట్ మెంటులో కరెంటు బిల్లులు కట్టివస్తే పదో పరకో చేతిలో పెట్టేవాళ్ళు. కార్లు తుడిస్తే కొంత, చిన్నా చితకా పనులు చేసిపెడితే మరికొంతా చేతిలో పడేది. సుందరి పనిపాటులతోనే సరిపుచ్చకుండా అందరిళ్ళకు వెళ్లి వడియాలు అప్పడాలు పెట్టడంలో సాయం చేసేది. ఇంత ఇవ్వమని అడిగేది కాదు. ఇంతే ఇవ్వాలని వాళ్ళూ  అనుకునేవాళ్లు కాదు. కాబట్టి కష్టానికి సరిపడా గిట్టుబాటయ్యేది. మంచితనం మరికొన్ని పరిచయాలు చేసిపెట్టింది. ఆ కాలనీలో సుందరికి మంచి పేరువచ్చింది. క్రమంగా అవసరమయిన వారికి వంటలు చేసిపెట్టేది. పిండి వంటలు చేసిపెట్టేది. వూళ్ళో అమ్మ చేతికింద ఉంటూ నేర్చుకున్న విద్యలన్నీ బస్తీ కాపురానికి బాగా పనికి వస్తున్నాయి. బస్తీలో  కాపురం సులభం  కాదనుకుని వచ్చింది. కానీ కష్టపడాలే డబ్బు సంపాదించడం కూడా సులువే ఇప్పుడిప్పుడే అనిపిస్తోంది. పడుతున్న   కష్టాన్ని ఆ భావనే  మరిపిస్తోంది.


NOTE: Courtesy Image Owner

సబ్ కా మాలిక్ ఏక్ హై!


బుడుగును 'బుడుగూ' అని పిలుస్తారు బాపూరమణలు
'బుడ్గూ' అంటాడు గోపాళం
'హారి బుడుగు కన్నా' అంటుంది వాళ్ళమ్మ
'బుడుగా ఏంటి అసహ్యంగా మడుగూ బుడుగూ పేరు లేదా ఆయ్' అంటాడు అగ్నిహోత్రావధాన్లు
'బుడుగు అసలు పేరు చాలా పొడుగు. అందుకే బుడుగూ అంటాం వాయ్' అంటాడు రమణ గారి జోకుకి కాపీరైట్ తీసుకుంటూ గిరీశం  
'ఏంగురూ ఈ పేర్ల గోల' అంటుంది సీగానపెసూనాంబ
శాల్తీ ఒక్కడే. పేర్లు అనేకం. బుడుగన్నా, కన్నా అన్నా, ఏం గురూ అన్నా ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు. ఇక ఏమిటి సమస్య.
అలానే  దేవుడొక్కడే!


కావాల్సింది నమ్మకం. దేవుడున్నాడనే నమ్మకం. దేవుడి పేరుతొ మనుషులు ఘోరాలు చేయకుండా కనిపెట్టి చూడడం.
మిగిలినవి ఆ దేవుడే చూసుకుంటాడు.
'కలడు కలండనెడి వాడు కలడో  లేడో' అని పోతన్న గారికే అనుమానం వచ్చింది.
మనమనగానెంత?

30, అక్టోబర్ 2014, గురువారం

స్విస్ బ్యాంకుల కధాకమామిషు

(Published in 'SURYA' daily in its Edit page on 31-10- 2014, SUNDAY)

కధ ముగిసింది. కానీ మళ్ళీ  మొదలయింది.
స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న 'కుబేరుల జాబితా' వంద రోజుల్లో బయట పెడతా అన్న బీజేపీ నాయకత్వం అన్న మాట కాస్త అటూ ఇటూగా నిలబెట్టుకుంది. సుప్రీం ఆదేశం ప్రకారమో, ఇచ్చిన మాట ప్రకారమో మొత్తం మీద ఆ జాబితా సీల్డ్ కవర్లో సుప్రీం కోర్టు చేతిలో పెట్టి చేతులు కడిగేసుకుంది. సుప్రీం కూడా దాన్ని తెరిచి చూడకుండానే దర్యాప్తు సంస్థ
'సిట్' అధికారులకి అందించి  మార్చిలోగా దర్యాప్తు పూర్తిచేయమని ఆదేశించింది. 'ఆ జాబితా కొత్తదేమీ కాదు, పరమ  పాతదే' అని 'సిట్' చైర్మన్ స్వయంగా చెప్పినట్టు మీడియాలో వచ్చింది. మన మధ్యనే ఉంటూ గుట్టుచప్పుడు కాకుండా డబ్బుని విదేశాల్లోని బ్యాంకులకు తరలించిన వారెవ్వరో తేలిపోతుందని, తెలిసిపోతుందని దేశ ప్రజలు పెట్టుకున్న ఆశలపై నీళ్ళు చల్లినట్టయింది. కొండను తవ్వారు, కానీ ఎలుక తోక కూడా కనబడడం లేదు. మరి ఎందుకింత లాయలాస పడ్డట్టొ అర్ధం కాని విషయం. ఇక మరికొన్నాళ్ళపాటు  ఊహాగానాలు తప్పవు. ఆ ఊహాగానాలపై రాజకీయ చర్చోపచర్చలకు కొదవుండదు.  



     
జేమ్స్ బాండ్ సినిమాలు చూసేవారికి ఓ దృశ్యం గుర్తుండేవుంటుంది. 'బాండ్ ...జేమ్స్ బాండ్' అని చెప్పుకునే ఈ హాలీవుడ్ గూఢచారి, స్పెయిన్ లో ఒక స్విస్ బ్యాంక్ కి  వెడతాడు. బ్యాంకర్ ని కలిసేముందు అక్కడి భద్రతా సిబ్బంది జేమ్స్ బాండ్ ను పూర్తిగా జేబులూ అవీ తడిమి చూసిన తరువాతనే  లోపలకు పంపుతారు.  డా విన్సీ కోడ్ సినిమాలో రోబో హస్తంతో  ఒక త్రిభుజాకారపు తాళం చెవితో  రహస్యంగా గోడలో  దాచివుంచిన స్విస్ బాంక్  సేఫ్ లాకర్ తెరవడం కనిపిస్తుంది.
అయితే స్విస్ బ్యాంకుల్లో నిజానికి ఇలాటి దృశ్యాలు  ఏవీ కనబడవు. అవన్నీ సినిమాలకోసం చేసిన కల్పనలు. అలాగే స్విస్ బ్యాంక్  ఖాతాలు గురించి కూడా  ఎన్నెన్నో అభూత కల్పనలు ప్రచారంలో వున్నాయి. స్విస్ బ్యాంకుల్లో అన్ని బ్యాంకుల  మాదిరిగానే భద్రతా ఏర్పాట్లు వుంటాయి. కానీ సినిమాల్లో చూపించినట్టు రోబోలు గట్రా  కనబడవు. ఖాతాదారులు బ్యాంకుకు  వచ్చినప్పుడు నఖశిఖ పర్యంతం తడిమిచూడడం కూడా ఈ కల్పనల్లో ఒకటి.    
స్విస్ బ్యాంక్ ఖాతాదారులందరూ  పన్నులు ఎగ్గొట్టి  సొమ్ములు కూడబెట్టినవారనే అపప్రధ వుంది. ఆ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న వాళ్ళందరూ   అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించిన నేరస్తులో లేదా ప్రభుత్వ అధికారులనో అపోహ వుంది.  కోటికి పడగలెత్తిన  వాళ్ళే ఆ బ్యాంకుల గుమ్మం తొక్కగలరనే సందేహాలు  వున్నాయి. అత్యంత సంపన్నులయిన వారికి తమ మాజీ భార్యలతో డబ్బు లావాదేవీల చీకాకులు ఎక్కువ. అలాటి వారు విడాకులు తీసుకున్న తమ మాజీ భార్యల చేతికి చిక్కకూడదనే ఉద్దేశ్యంతో స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడం కద్దు. వీళ్ళే కాదు ఆ బ్యాంకుల  ఖాతాదారుల్లో  సాధారణ స్విస్ పౌరులు కూడా వుంటారు. ఈ బ్యాంకుల పట్ల మోజు పెరగడానికి మరో కారణం వుంది. అనేక దేశాల్లో ఈనాటి పరిస్తితులు రేపు వుండవు. అస్తిర ప్రభుత్వాలు రాజ్యం ఏలే దేశాల్లోని కుబేర స్వాములు, తమ డబ్బుకు స్వదేశంలో  భరోసా వుండదన్న అభద్రతాభావంతో స్విస్ బ్యాంకుల వైపు చూస్తుంటారు. కారణం ఒక్కటే. స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే ఇక గుండె మీద చేయివేసుకుని నిద్రపోవచ్చు. 'ఎక్కడిదీ డబ్బు' అని అడిగేవారుండరు.  అడిగినా చెప్పే నాధులు ఆ బ్యాంకుల్లో వుండరు. స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుకు  వడ్డీ రాదు. నిజమే. కానీ అసలుకు మోసం రాదు. అదీ సంగతి.

'భద్రత, గోప్యత' అనే రెండే రెండు  సూత్రాల మీద ఆధారపడి నడుస్తున్న స్విస్ బ్యాంకుల చరిత్ర ఈనాటిది కాదు. ఫ్రెంచ్ విప్లవం కాలంలో సంపన్న వర్గాల వారు దేశాన్ని విడిచి పారిపోయేటప్పుడు తాము కూడబెట్టుకున్న డబ్బును పదిలంగా దాచుకునేందుకు స్విస్ బ్యాంకులు  ఉపయోగపడ్డాయి. ప్రధమ ప్రపంచ సంగ్రామం, దరిమిలా ప్రపంచ దేశాలను కమ్ముకున్న తీవ్ర  ఆర్ధిక సంక్షోభం నేపధ్యంలో, ఆర్ధికంగా బాగా చితికిపోయిన తమ ఆర్ధిక వ్యవస్థలకు  ఊపిరి పోయడానికి జర్మనీ, ఫ్రాన్స్ ప్రభుత్వాలకు స్విస్ బ్యాంకుల్లో సంపన్నులు దాచుకున్న సొమ్ముపై కన్ను పడింది. 1932లో పారిస్ లోని స్విస్ బ్యాంకు శాఖపై ఫ్రెంచ్ అధికారులు దాడి చేసి స్వదేశంలో పన్నులు ఎగవేసి స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న వ్యక్తుల ఖాతాలను పట్టుకున్నాయి. అలా ఆ రోజుల్లోనే ఆ విధంగా పట్టుపడ్డ డబ్బు కొన్ని కోట్ల ఫ్రాంకులు.   దరిమిలా జర్మనీ  కూడా ఇదే పద్దతి మరింత కఠినంగా అనుసరించింది. స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నట్టు తెలిస్తే అటువంటివారికి ఏకంగా మరణ శిక్ష విధించాలని చట్టం చేసింది. చట్టం చేసి చేతులు దులుపుకోకుండా అటువంటి వారు పట్టుపడ్డప్పుడు ఆ శిక్షలను  అమలుచేసి కూడా  చూపించింది.
అయితే స్విట్జర్లాండ్ ఈ బెదిరింపులకు అదరలేదు,  బెదరలేదు. రెండు ప్రపంచ యుద్దాల కాలంలో కూడా  నిష్టగా పాటిస్తూ వచ్చిన స్విస్ బ్యాంకుల వ్యాపార సూత్రాలనే మరింత పటిష్టంగా అమలుచేయాలని  నిర్ణయించింది. ఫ్రాన్స్ జర్మనీల చర్యలను  పట్టించుకోకపోవడమే కాకుండా 1934 లో బ్యాంకు ఖాతాల  గోప్యతకు మరింత చట్టబద్దత కల్పిస్తూ ఒక శాసనం చేసింది. బ్యాంకు ఖాతాదారుడు మినహా అతడి ఖాతాకు సంబంధించిన  ఎలాటి వివరాలను మూడో వ్యక్తికి తెలపాల్సిన అవసరం లేకుండా ఈ  చట్టం బ్యాంకులకు అధికారం ఇచ్చింది.
ఈ నిబంధన పన్నుఎగవేత దారులకు బాగా ఉపయోగపడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో 1984 లో స్విట్జర్లాండ్ రిఫరెండం నిర్వహించింది. బ్యాంకు ఖాతాల వివరాలను పన్ను వసూలుచేసే అధికారులకు బహిర్గతం చేయాలా అనే అంశంపై నిర్వహించిన ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు ఆసక్తికరమైన తీర్పు ఇచ్చారు. 'స్విస్ బ్యాంకుల గోప్యత నిబందనను కొనసాగించాల్సిందే' అని 73 శాతం ప్రజలు అభిప్రాయపడ్డారు. అయితే కాలక్రమంలో - తొంభయ్యవ దశకం నాటికి  ఈ నిబంధన కారణంగా అనేక ఆర్ధిక కుంభకోణాలు వెలుగుచూశాయి. ఈ వేడి అటూ ఇటూ తిరిగి అమెరికాను కూడా తాకింది. అమెరికా కన్నెర్ర చేయడంతో, పన్నులను ఎగవేసి స్విస్ బ్యాంకుల్లో  డబ్బు దాచుకున్న అమెరికా పౌరుల వివరాలను ఆ దేశానికి ఇవ్వడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ అంగీకరించింది. ఇది జరిగింది 2008 లో.
ఆ తరువాత, స్విట్జర్లాండ్ ఆర్ధిక సహకార అభివృద్ధి సంస్థతో ఒక వొప్పందానికి వచ్చింది. ఆ ఆ సంస్థకు చెందిన సభ్య దేశాలకు తమ బ్యాంకుల్లోని ఖాతాల  వివరాలను అందచేయడానికి  ఆ బ్యాంక్ వొప్పుకుంది. ఈ సభ్య దేశాల్లో భారత దేశం ఉందా లేదా అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటె ఈ దిశగా అడిగినవాళ్ళూ లేరు, జవాబు చెప్పిన వాళ్ళూ లేరు. వీళ్ళిద్దరూ ఒకవేళ వున్నా ఆ సమాచారం జనాలకు తెలిసే వీలూ లేదు.
ఓ నలభై యాభయ్ ఏళ్ళక్రితం ఎలిమెంటరీ స్కూళ్ళల్లో వారానికి ఓమారయినా మోరల్’ క్లాసు పేరుతొ నీతి పాఠాలు బోధించేవాళ్ళు. చిన్నప్పటి నుంచే 'ఏది తప్పో ఏది ఒప్పో' చెప్పేవాళ్ళు. స్కూలుకు వెళ్ళే వీలులేనివాళ్లకి ఇలాటి మంచి మాటలు కధలుగా చెప్పి సరయిన దారిన పెట్టే పెద్దవాళ్ళు కూడా వెనుక ఇళ్ళల్లో వుండేవాళ్ళు. తప్పును తప్పని చెప్పేవాళ్ళు లేక ఓ పక్క తామే తప్పులు చేస్తూ తమ పిల్లలకు అవి తప్పని చెప్పే తలిదండ్రులు లేకదాదాపు ఒకతరం ఈ స్వతంత్ర భారతంలో పెరిగి పెద్దదయింది. 'ఎంత సంపాదించావు' అన్నది ప్రధానం కానీ 'ఎలా' అన్నది ముఖ్యం కాదనే మరో తరం మన కళ్ళెదుటే పెరిగి పెద్దదవుతోంది. ఈనాడు ప్రధానంగా ఆలోచించుకోవాల్సింది, భయపడాల్సింది  మానసికంగా మురికిపట్టిపోయిన ఈ నల్ల తరాన్ని గురించి. నల్ల డబ్బును గురించి కాదు.
(30-10-2014)

NOTE : Cartoon Courtesy "Modi Bharosa.com"

29, అక్టోబర్ 2014, బుధవారం

నీటి జగడాలు, కరెంటు కయ్యాలు

(Published by 'SURYA" Telugu Daily in it Edit page on 30-10-2014, Thursday)

ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రపంచంలో జరిగే యుద్ధాలు, పొరుగు  దేశాలను  ఆక్రమించుకోవడం కోసమో, ముడి చమురు  వనరులపై పెత్తనం కోసమో జరగవు. ముందు ముందు దేశాల నడుమ జరగబోయే యుద్ధాలకన్నింటికీ  ఒకే ఒక కారణం నీళ్ళు’.  నీటి కోసం జరిగే యుద్ధాలనే భవిష్యత్తులో జనం చూడబోతారు.
దాదాపు పదిహేడేళ్ళ క్రితం ఇస్మాయిల్ సెరగెల్దిన్ అనే ఈజిప్టు దేశస్తుడు ఈ జోస్యం చెప్పారు. ఆయన వరల్డ్ బ్యాంకు వైస్ ప్రెసిడెంటుగా వున్నప్పుడు భవిష్యత్తు గురించి వేసిన ఈ అంచనా అప్పట్లో ప్రపంచ రాజకీయ నాయకులను ఎంతగానో కలవర పరచింది. అదృష్టవశాత్తు ఇస్మాయిల్ గారి జోస్యం వెనువెంటనే నిజమవలేదు కానీ, కాలక్రమంలో  సాగు నీరు, తాగు నీటి  అవసరాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న దృష్ట్యా తలెత్తుతూ వచ్చిన నీటి  తగాదాలు మాత్రం  అనేక దేశాల నడుమ ఉద్రిక్తతల పెరుగుదలకు దోహదం చేసిన మాట వాస్తవం.
ఆసియా ఖండంలో ఇరిగేషన్ డాముల కింద నీరు పంచుకునే విషయంలో బోలెడు, బొచ్చెడు  తగాదాలు. భారత దేశం పాకిస్తాన్ నడుమ జలవిద్యుచ్చక్తి పంపిణీ విషయంలో ముదిరి పాకాన పడుతున్న వివాదాలు, మరోపక్క  చైనా, నేపాల్, బంగ్లాదేశ్ ల నడుమ నదీ జలాల చిక్కుముళ్ళు.
పోతే, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, కీర్గిజిస్తాన్ ల వ్యవహారం కూడా విభిన్నంగా లేదు. అముదారియా, సర్ దారియా నదులు, అలాగే నీటిమట్టం స్తాయి బాగా పడిపోతున్న అరల్ సీ విషయంలో ఈ దేశాల నడుమ సాగుతున్న నీటి పంచాయతీలు రోజురోజుకూ ముదిరిపోతున్నాయి కానీ ముగింపుకు రావడం లేదు.
ఇక, అర్జెంటీనా, ఉరుగ్వేలు - ప్లేట్ నదీ జలాలను పంచుకునే విషయంలో తలెత్తిన వివాదాన్ని హేగ్ లోని అంతర్జాతీయ న్యాయ స్తానం వరకూ తీసుకువెళ్ళాయి. రియో గ్రాండే, కొలరాడో నదీ జలాలు గురించి అమెరికా, మెక్సికో లు జుట్లు పట్టుకుంటున్నాయి.           

తిగ్రిస్ నదిలో తన వాటా నీళ్ళను ఇక ముందు వాడుకోవడానికి వీల్లేదని ఇరాక్ సిరియాను డిమాండ్ చేసి ఎంతో కాలం కాలేదు. మధ్యప్రాత్యంలో పాలస్తీనా ఇజ్రాయెల్ దేశాలు, ఇరాన్, ఇరాక్ దేశాలు టర్కీ డాం లనుంచి వచ్చే నీటి సరపరాల విషయంలో అవగాహన కుదరక తలలు పట్టుకుంటున్నాయి.
ఆఫ్రికాలో జమ్బెజీ నది ఉపనది అయిన చోబే నది, బోత్స్వానా, మొజాంబిక్ దేశాల నడుమ చిచ్చు రేపింది.
జీవనదులన్నా ఎండిపోతాయేమో కాని ఈ తగాదాలు, వివాదాలకు  మాత్రం ముగింపు  అంటూ వున్నట్టులేదు.
ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం వివిధ దేశాల నడుమ జలాల పంపిణీ జరిగే నదులు దాదాపు రెండు వందల యాభయ్ కి పైగా వున్నాయి. ఈ నదుల పరీవాహక ప్రాంతాన్ని లెక్క వేస్తే, అది ఈ భూగోళం ఉపరితలంలో సగానికి పైగా  వుంటుంది. అంతర్జాతీయంగా నదీ జలాల వివాదాలు వున్న దేశాలు మూడు వందలకు పైగా వున్నాయి కాని, వీటిల్లో సాయుధ సంఘర్షణలకు దారితీసే వివాదాలు చాలా తక్కువనే చెప్పాలి. గత శతాబ్ద కాలంలో నీళ్ళ కోసం జరిగిన యుద్ధాలు కేవలం ఏడు మాత్రమే లెక్క తేలాయి.
నీరే ప్రాణాధారమన్నారు శతకకారులు. సేద్యానికయినా, పరిశ్రమలకయినా, తాగడానికయినా నీళ్ళు అవసరం. నానాటికి పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని 2025 నాటికి  మానవాళి అవసరాలు తీర్చడానికి  ప్రపంచ వ్యాప్తంగా వున్న నదుల్లో పారే నీటిపై అపరితమయిన వొత్తిడి పెరగగలదని ఐక్యరాజ్య సమితి (ఐ.ఎన్.డి.పి.) అంచనా. ఈ నేపధ్యంలో నీళ్లపై హక్కులు, నీటి  కేటాయింపులు గురించిన ఉద్రిక్తతలు బాగా పెరిగే అవకాశం వుందని వరల్డ్ వాటర్ ఫోరం ఆందోళన వ్యక్తం చేసింది. రానున్న కాలంలో ప్రపంచ రాజకీయాల్లో నీటి  తగాదాలు ప్రధానాంశంగా మారే వీలుందని అమెరికా రక్షణశాఖ హెచ్చరించింది. దేశాల నడుమ సరిహద్దు వివాదాల్లో నదీ జలాల పంపిణీ అంశం కీలకం కాగలదని పేర్కొన్నది. చాద్, సోమాలియా, యెమెన్ దేశాల మధ్య సంఘర్షణలకు నీటి తగాదాలకు సంబంధం వుందన్నది పెంటగాన్ అభిప్రాయం.                  
ఈ పంచాయతీలు కేవలం దేశాలకే పరిమితం కాలేదు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని నీటి వినియోగదారులు కూడా వీటికి అతీతం కాదన్నది జగమెరిగిన సత్యం. పొలాల్లో నీరు కావిడి తగాదాలు, వీధి కొళాయిల వద్ద ఆడంగుల  కొట్లాటలు పాత సినిమాలు చూసేవారందరికీ  అనుభవైకవేద్యం.

మన దేశంలో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య రగిలిన చిచ్చుకు కావేరి నదీ జలాలు కారణం. అలాగే, ఆంధ్ర, ఒడిశాల నడుమ వంశధార నదీ జలాల  వివాదం. ఇప్పుడు తాజాగా కొత్తగా పురుడుపోసుకున్న రాష్ట్రాలు - ఆంద్రప్రదేశ్, తెలంగాణాల నడుమ రాజుకుంటున్న కృష్ణా నదీ జలవివాదం.


ఇది రోజురోజుకూ కాదు పూటపూటకూ ముదిరి ఇరువైపులా మాటల యుద్ధాలకు దారితీస్తోంది. విడివిడిగా వీరిద్దరి వాదనలు విన్నవారికి వారు చెప్పేది సబబే అనిపిస్తుంది. ఎందుకంటె ఉభయ పక్షాలవాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రజల కోణం నుంచే మాట్లాడుతున్నారు. అది నిజమే కావచ్చు. కానీ ఇరుపక్కలా నష్టపోయేది కూడా ప్రజలే కదా. నిన్న మొన్నటి దాకా కలిసివున్నవారే కదా! ఇప్పుడు గీతలు గీసుకుని వ్యవహరించడంలో ఉద్దేశ్యం ఏమిటి? ఇందులో రాజకీయ కోణం దాగుందని ఎవరయినా అనుకుంటే తప్పేమిటి?
ఆంద్ర ప్రదేశ్ లో తాగునీటికి నీళ్ళు కావాలని ఆ రాష్ట్రం వారు అడిగితే  తెలంగాణా వాదులకు కోపం. తెలంగాణలో ఎండిపోతున్న పంటలు కాపాడుకోవడానికి కరెంటు ఉత్పత్తికోసం  శ్రీశైలం నుంచి నీరు వొదిలితే  ఆంద్ర  నాయకులకు ఆగ్రహం.
కొందరికి నీళ్ళు  వెంటనే కావాలి. మరొకరికి అధ్యతన భవిష్యత్తులో పొంచి వున్న తాగునీటి, సాగునీటి అవసరాలు తీరాలి. నిజానికి  కాసింత సంయమనం, కాసింత సర్దుబాటు మనస్తత్వం వుంటే సరిచేసుకోలేని సమస్యేమీ కాదు. ఇరు పక్షాల వాళ్ళు, కొన్ని రోజులు మాటల యుద్ధాలకు విరామం ప్రకటించి, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని చర్చించుకుంటే పరిష్కారం కుదరని జటిల విషయం కూడా కాదు. అంతేకానీ, 'అక్కడికి రా! ఇక్కడికి రా! నీ వాదం గొప్పదో, నా వాదం గొప్పదో తేల్చుకుందాం' అని పరస్పరం సవాళ్లు విసురుకోవడానికి ఇది సినిమా స్క్రిప్ట్ కాదుకదా! వాదం నెగ్గించుకోవడం కాదిక్కడ సమస్య. సమస్యను పరిష్కరించుకోవడం ఒక్కటే ఇప్పుడు కీలకం. అది పూర్తిగా పక్కకుపోయింది.        
పారే నీటికి ప్రాంతం లేదు. ఎక్కడో పుట్టి, ఎక్కడెక్కడో ప్రవహించి సముద్రంలో కలిసే నదులకు ఒక రాష్ట్రం అంటూ లేదు. ఆ నదులు పారే ప్రాంతాలవాళ్ళు ఆ నీళ్ళు మాకే హక్కుభుక్తం అని వాదించుకుంటారు.
వచ్చిన చిక్కల్లా అలా అనుకునే నీటితోనే. ఆ నీటిని తమ స్వార్ధానికి వాడుకునే మనుషులతోనే.
(29-10-2014)   

NOTE: Courtesy Image Owner