7, మార్చి 2014, శుక్రవారం

సంసారం నడిపే స్త్రీలు కారు నడపలేరా!

సంసారం నడిపే స్త్రీలు కారు నడపలేరా!
(మార్చి ఎనిమిదో తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం)
తేదీ: 2011, జూన్ 17 దేశం సౌదీ అరేబియా


ఆ రోజు వందలాదిమంది జనం  కార్లలో బయలుదేరారు. ఇందులో విచిత్రం ఏమిటి అనుకుంటున్నారా.  ఆ కార్లు నడుపుతున్నవారందరూ స్తీలే. అయితే ఏమిటంటారా! వారందరికీ కార్లు వున్నాయి కాని వాటిని నడపడానికి లైసెన్సులు మాత్రం  లేవు. మరి లైసెన్సులు లేకుండా వారంతా కార్లలో బయటకు ఎందుకు వచ్చినట్టు? లైసెన్సుల కోసమే అంటే నమ్ముతారా? నమ్మక తప్పదు. లైసెన్సుల కోసమే వారందరూ అలా రోడ్డెక్కాల్సి వచ్చింది. లైసెన్స్ లేకుండా కారు నడిపితే ఏం జరుగుతుందో వారికి తెలుసు. దానికి సిద్ధపడే వాళ్లు కార్లతో రోడ్డున పడ్డారు.
మూకుమ్మడి నిరసన కావడం వల్ల పోలీసులు అందర్నీ అరెస్ట్ చేయలేకపోయారు. కొందరికి చలాన్లు రాశారు. కొందర్ని హెచ్చరించి వొదిలేశారు. అరెస్ట్ అయిన కొద్దిమంది కూడా అందుకు బాధ పడలేదు. ఎందుకంటె తమ బాధల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే వారు ఈ ఆందోళనకు నడుం కట్టారు.
ఇంతకీ విషయం ఏమిటంటే ఆ దేశంలో స్త్రీలకు కార్లు నడిపే హక్కు లేదు. ప్రపంచంలోవున్న లగ్జరీ కార్లన్నీ సౌదీలో దర్శనమిస్తాయి. పెట్రోలు కూడా చాలా చవుక. కార్లు కొనుక్కోగల ఆర్ధిక స్తోమత ఆ దేశంలో చాలామందికి వుంది. మహిళలు కూడా  ఉద్యోగాలు చేస్తారు. కారు కొనుక్కోవడం వారికి ఓ లెక్కలోనిది కాదు. పైగా వృత్తి రీత్యా వాహనం అవసరం కూడా. ఆఫీసులకు వెళ్లడానికీ, పిల్లల్ని స్కూళ్ళలో దింపడానికీ ఉద్యోగినులకి సొంత వాహనం యెంత అవసరమో ఈ నాడు అందరికీ తెలిసిన విషయమే. ఆడా  మగా తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అందరూ  కారు నడపడం సర్వసాధారణంగా మారిపోయింది. అయినా సౌదీ అరేబియాలో ఆడవారికి ఈ హక్కు ఇంకా హక్కుభుక్తం కాలేదు. దీనికోసం వాళ్లు చాలాకాలంగా ఆందోళన  చేస్తూ వున్నారు. బహుశా, ఆడవారిని మోటారు కారులో డ్రైవింగ్ సీటులో చూడలేనిది మొత్తం ప్రపంచంలో ఈ ఒక్క దేశంలోనే కాబోలు. ఆ దేశంలో వుంటున్న తెలుగువారెవరయినా అనుమాన నివృత్తి చేస్తే బాగుంటుంది.

(ఇంటర్నెట్ లో సంచారం చేస్తున్న ఒక ఆంగ్లవ్యాసానికి స్వేచ్చానువాదం)

NOTE: Courtesy Image Owner

6, మార్చి 2014, గురువారం

ఓటర్ల మేనిఫెస్టో


‘రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో చేసిన వాగ్దానాలను అన్నింటినీ తుచ తప్పకుండా అమలు చేసిన పక్షంలో జనం స్వర్గానికి వెళ్లాలనే కోరికను సైతం చంపుకుంటారు.’ – విల్ రోగర్స్
ఎన్నికలకు ముందు ప్రతి రాజకీయ పార్టీ ఒక మేనిఫెస్టో ను విడుదల చేస్తుంది. ప్రజలు తమ పవిత్రమయిన వోటు వేసి తమను మాత్రమే ఎందుకు గెలిపించాలో, తమను గెలిపిస్తే ఆ పవిత్రమయిన వోటు వేసినందుకు (గెలిస్తేనే సుమా) బదులుగా వోటర్ల రుణం తీర్చుకునేందుకు తమ పార్టీ ఏమేమి చేయబోతున్నదో అనే అనేకానేక ఉచిత వరాలతో కూడిన ఎన్నో వివరాలు ఈ మేనిఫెస్టోలో వుంటాయి. దీన్ని తయారు చేయడం కోసం ప్రతి పార్టీ ఎంతో పెద్ద కసరత్తు చేస్తుంది. ఇందునిమిత్తం పార్టీ ఏర్పాటు చేసిన మేనిఫెస్టో కమిటీ పలు మార్లు సమావేశాలు జరిపి – ఎన్నికల ప్రణాళికలో చేర్చాల్సిన అంశాలను గురించి లోతుగా అధ్యయనం చేసి వాటిని సవివరంగా చర్చిస్తుంది. అర చేతిలో వైకుంఠం చూపించే తరహాలో రూపొందించే ఈ మేనిఫెస్టో తయారీకి పెద్ద పెద్ద పార్టీల నుంచి చిన్నా చితకా పార్టీల వరకు ఎంతో శ్రద్ధ తీసుకుంటాయి. ఇక మేనిఫెస్టో విడుదల అనేది మరో పెద్ద తంతు. వోటర్ల మనసులకు గాలం వేసి పట్టే విధంగా ఆ యా పార్టీలకు చెందిన మేధావులు అంతా కలసి మేధో మధనం చేసి అందించిన సలహాలనన్నింటినీ అంతకంటే అందంగా అక్షరాలలోకి మార్చి కూర్చే ఈ మేనిఫెస్టో విడుదలకు మెగా సినిమా రిలీజ్ మాదిరిగా ఎంతో హడావిడి చేస్తారు. దీనికి ప్రచారం కల్పించడానికి పార్టీలు పడే యాతన ఇంతా అంతా కాదు. కాలక్రమేణా ఇది ఎన్నికలకు ముందు ఓ తప్పనిసరి తతంగంగా తయారయింది. కాకపొతే, ఎన్నికల తరువాత మాత్రం మళ్ళీ దీని ఊసెత్తితే ఒట్టు.
‘మీరిలా వోటు వేసి గెలించండి. మేమలా చెప్పినవన్నీ చేసి చూపిస్తాం’ అనే రాజకీయ పార్టీల మేనిఫెస్టోల మాదిరిగానే, ‘ మీరిలా చేస్తామని మాట ఇవ్వండి. అప్పుడు మా వోటు అచ్చంగా మీకే’ అంటూ ఓటర్లే తమ మేనిఫెస్టోలతో ముందుకు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. జయ ప్రకాష్ నారాయణ గారు తమ లోక్ సత్తాను రాజకీయ పార్టీగా రూపు మార్చకుండా వుండి వుంటే బహుశా ఈ ప్రయోగం ఆయనే చేసివుండేవారేమో. ఇలా ఈ దిశగా సాగిన ఆలోచనలనుంచి పుట్టుకొచ్చినదే ఇదిగో ఈ ‘ఓటర్ల మేనిఫెస్టో’.

1. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చే ఎలాటి హామీ అయినా సరే, అధికారంలోకి రాగానే తాము దాన్ని యెలా అమలు చేయబోతున్నామో అన్న విషయాన్ని స్పష్టంగా, ఏవిధమయిన అసంగ్దిగ్ధతలకు తావివ్వకుండా, శష భిషలకు పోకుండా ఎన్నికల ప్రణాళికలో పేర్కొని తీరాలి. ఆకాశంలో చందమామను తెచ్చి చేతిలో పెడతామంటే సరిపోదు, అది యెలా సాధ్యమో కూడా వోటర్లకు తెలియచెప్పాలి. యేరు దాటినదాకా పడవ మల్లయ్య, దాటిన తరువాత బోడి మల్లయ్య సామెత మాదిరిగా కాకుండా గెలిచివచ్చిన తరువాత ఒక నిర్దిష్ట కాలంలో వాగ్దానాలు అమలుచేయలేని పక్షంలో అధికారం నుంచి తక్షణం తప్పుకుంటామని ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేయాలి. అంతేకాదు, ఉచిత వాగ్దానాల అమలుకు అయ్యే మొదటి ఏడాది వ్యయాన్ని తమ పార్టీ నిధులనుంచే ఖర్చు చేయాలి. ప్రభుత్వ సొమ్ముతో ప్రజల వోట్లకు గాలం వేసే ప్రస్తుత విధానాలకు స్వస్తి చెప్పాలి. (మీడియాకు మనవి: ఉచితానుచితాలు ఎరగకుండా ఆయా రాజకీయ పార్టీలు జనంపై వొదులుతున్న ‘ఉచిత’ హామీలను యెలా అమలు చేస్తారని మీడియా ప్రశ్నించి సమాధానాలు వారి నుంచి రాబట్టి ప్రజలకు తెలియచెప్పాలి.)
2. భారీ ఎత్తున ఎన్నికల ప్రచార సభలను ఏర్పాటు చేసి ప్రజలను తరలించే పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలి. సాధారణ జనం ఇబ్బందుల పాలు కాకుండా చిన్న సమావేశాల ద్వారా ఎన్నికల ప్రచారం సాగించాలి.
3. ఊరేగింపులుగా వెళ్లి అభ్యర్ధులు నామినేషన్లు వేయకూడదు. (ఆన్ లైన్ విధానంలో నామినేషన్ల దాఖలుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించాలి.)
4. ఎంతటి హేతుబద్ధమయిన కారణం వున్నా సరే, ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజాస్వామ్య హక్కు పేరుతొ నడిరోడ్లపై ధర్నాలు, బైఠాయింపులు, రాస్తా రోఖోలు నిర్వహించరాదు.(అలాగే ప్రజలను ఇబ్బందుల పాలు చేసే ఇలాటి ఆందోళనా కార్యక్రమాలను ఎటువంటి పరిస్తితిలోను ప్రసారం చేయబోమని టీవీ ఛానళ్ళ యాజమాన్యాలు వారికి స్పష్టం చేయాలి. అంతేకాదు, ఈ రకమయిన ఆందోళనల కారణంగా ఇబ్బందులకు గురయ్యే ప్రజల మనోభావాలను సాధ్యమయినంత ఎక్కువగా ప్రసారం చేయాలి. ఆందోళనకారులను చెదరగొట్టడం, వారిని బలవంతంగా పోలీసు వ్యానుల్లోకి ఎక్కించడం వంటి దృశ్యాలు ప్రస్తుతం చూపిస్తున్నారు. అలాకాకుండా రాస్తారోఖోల కారణంగా పడరాని పాట్లు పడుతున్న పౌరుల స్పందనలను ప్రత్యక్ష ప్రసారం చేయాలి)
5. ఎన్నికల క్రతువు ముగిసే వరకు రెచ్చగొట్టే విధంగా వుండే రాజకీయ ప్రకటనలు, అవాకులు చవాకులులతో కూడిన స్క్రోలింగులను మీడియా సంస్తలు నిలిపివేయాలి.
6. ‘త్వంశు౦ఠ అంటే త్వంశు౦ఠ’ అంటూ సాగే రాజకీయ నాయకుల చర్చా గోష్టులను పదే పదే ప్రసారం చేసే టీవీ ఛానళ్ళ నుంచి ‘ఉచిత వినోదపు పన్ను’ రాబట్టాలి.
7. సంకీర్ణాలకు సంబంధించిన ఒప్పందాలన్నీ పోలింగుకు ముందే కుదుర్చుకోవాలి. ఎన్నికలు ముగిసి పార్టీల బలాబలాలు నిర్ధారణ అయిన తరువాత ప్రభుత్వం ఏర్పాటుకోసం అవకాశవాద కూటముల ఏర్పాటును నిషేధించాలి.
గమనిక: ఇవి కేవలం తొలి ఆలోచనలే. ఎన్నికల ఘడియ దగ్గర పడే లోగా వీటికి మరింత స్పష్టమయిన పటిష్టమయిన రూపం ఇవ్వడంలో అంతా తలా ఓ చేయి వేయాలని మనవి

పాతికేళ్ళనాటి మాస్కో - 17






మెట్రో డిజైన్  మార్చిన స్టాలిన్ కాఫీ కప్పు




(స్టాలిన్)



మాస్కో మెట్రో పట్ల స్టాలిన్ యెంతో శ్రద్ధ కనబరిచేవారని చెబుతారు. రోజూ ఏదో ఒక వీలు చూసుకుని మెట్రో నిర్మాణ పురోగతిని అధికారులతో, ఇంజినీరులతో సమీక్షించేవారు. అంతకుముందు ఏటవాలుగా, నిలువుగా, అడ్డంగా మెట్రో రైలుమార్గాలను డిజయిన్ చేశారు.వాటిని స్టాలిన్ కు చూపించి, ఆ మాపులపై స్టాలిన్ అభిప్రాయం కోసం అధికారులు ఎదురుచూస్తున్న సమయంలో కాఫీ తాగుతున్న స్టాలిన్-ఆ కప్పును ఒక మ్యాప్ మధ్యలో వుంచారుట. కప్పుకు వున్న కాఫీ మరక గుండ్రంగా దానిపై పడింది. దాన్ని స్టాలిన్ అభిప్రాయంగా పరిగణించిన ఇంజినీర్లు - వృత్తాకారంలో మరో మెట్రో మార్గాన్ని- మిగిలిన అన్ని మార్గాలను కలుపుతూ 'మెట్రో రింగ్ రూట్' కు రూపకల్పనచేసి నిర్మించారు. భూగర్భంలో రైల్ జంక్షన్ ల నిర్మాణానికి స్టాలిన్ ' కాఫీ కప్పు మరక' పరోక్షంగా దోహదం చేసిందన్న ఒక కధ
ప్రచారంలోకి వచ్చింది.


(మాస్కో మెట్రో మ్యాప్)

అయిదు కోపెక్కులనుంచి రెండువేల రూబుళ్ళకు పెరిగిన మెట్రో టికెట్

మేమున్న రోజుల్లోనే మాస్కో మెట్రోలో నూటయాభయి స్టేషన్ల దాకా ఉండేవి. ఇప్పుడవి 180  దాకా పెరిగాయి. మాఇంటికి దగ్గరలో ప్రొఫ్ సోవూజ్నయా అనే మెట్రో స్టేషన్ వుంది. అక్కడిదాకా నడిచి వెళ్ళి మెట్రో ఎక్కేవాళ్లము.



(మెట్రో స్టేషన్)

 మాస్కో రేడియోకు వెళ్ళాలంటే త్రేత్యా కోవోస్కయా అనే పెరుకలిగిన మెట్రోలో దిగాలి. అక్కడ ఎస్కలేటర్ ద్వారా పైకి వస్తే పక్కన పది అడుగుల దూరంలో మాస్కో రేడియో భవనం. ఈ మధ్యలో మరో అయిదు స్టేషన్లు వున్నాయి. అకడమిస్కయా , లెనిన్ స్కీ ప్రాస్పెక్ట్, షావోలోస్కయా, అక్త్యా బ్రస్కయా (రింగ్ లైన్ లో వున్న మెట్రో జంక్షన్ ), నోవో కుజ్నిస్కయా అనేవి ఈ స్టేషన్ల పేర్లు .టంగ్ ట్విష్ట్ పదాలకోసం వెతుక్కోనక్కరలేదు. మాస్కో మెట్రో స్టేషన్ల పేర్లు సరిపోతాయి. నెలకు మూడు రూబుళ్ళు పెడితే మెట్రో పాస్ దొరికేది. దీన్ని కొనడానికి నియమనిబంధనలు ఏమీ లేవు . ఎక్కడబడితే అక్కడ దొరికే వీటిని ఎవరయినా, నెలలో ఎప్పుడయినా కొనుక్కోవచ్చు. ఒకరు కొనుక్కున్నదానితో మరొకరు ప్రయాణం చేయవచ్చు.


 పైగా ఈ పాస్ - మెట్రో రైళ్లల్లో, ట్రాముల్లో, ట్రాలీ బస్సుల్లో, సిటీ బస్సుల్లో - అన్నిటిలో పనికొస్తుంది. అంటే, మూడు రూబుళ్ళు పెట్టి అతి సులభంగా లభించే ఈ పాస్ కొనుక్కుంటే, నెల పొడుగునా మాస్కో అంతా వీర విహారం చేయవచ్చు. నెలసరి పాస్ అనవసరమనుకున్న వాళ్ళు - అంటే మాస్కోకి పనులమీద వచ్చే వాళ్ళు - ఒకే ఒక్క రూబుల్ తో పదిరోజులు వాడుకునే పాస్ కొనుక్కోవచ్చు. ఇన్ని సదుపాయాలతో, ఇంత చవకగా ప్రయాణించడానికి వీలున్న మెట్రో ప్రపంచంలో మరొకటి లేదన్న మంచి పెరు ఒక్క మాస్కో మెట్రో కే దక్కింది.


(కడిగిన ముత్యంలా తళతళ తళుకులీనే మెట్రో స్టేషన్)  

గత  కీర్తి  ఘనమెంతో....... ...

ఇది గతం. గత కీర్తి మరింత ఘనం. మాస్కో మెట్రో గురించి మనం మంచిగా చెప్పుకునే రోజులకు నూకలు చెల్లిపోయాయి. అయితే ఇది నా కళ్ళతో చూసి చెబుతున్నది కాదు. చెవులతో విన్నది, వింటున్నది.


(రెడ్ స్క్వేర్ వద్ద ఇండియన్ స్కూలు పిల్లలతో సందీప్)

అయిదు కోపెక్కులనుంచి రెండువేల రూబుళ్ళకు పెరిగిన మెట్రో టికెట్
1935 లో మాస్కో మెట్రో తొలిసారి ప్రారంభమయినప్పుడు దాని టికెట్ ధరను యాభయి కోపెక్కులుగా నిర్ణయించారు. 1961 లో దాన్ని అయిదు కోపెక్కులకు తగ్గించారు. అప్పటినుంచి  1991 వరకు అంటే ముప్పయి సంవత్సరాలపాటు మెట్రో టికెట్ ఖరీదుని ఒక్క పైసా కూడా పెంచలేదు. గోర్భచేవ్ ఆర్ధిక సంస్కరణల నేపధ్యంలో 1991 లో 15  కోపెక్కులకు, 1992 లొ యాభయి కోపెక్కులకు అదే ఏడాదిలో  ఒక్కసారిగా మూడు రూబుళ్ళకు పెంచేశారు. అంటే అంటే రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలో- అమాంతం అరవై రెట్లు పెంచారన్న మాట. మన దేశంలో పెట్రో ధరలు పెరిగినప్పుడల్లా గొడవలకు దిగే వాళ్ళు దీన్ని గమనిస్తే బాగుంటుందేమో. అంతటితో ఈ పెరుగుదల ఆగలేదు.అలా పెరుగుతూ పోయి మెట్రో టికెట్ ధర 1994 లో   నాలుగువందల రూబు ళ్లకూ,1995 లొ ఆరు వందలనుంచి పదిహేను వందల రూబుళ్లకూ, 1997 సంవత్సరం నాటికి ఏకంగా రెండువేల రూబుళ్లకూ పెరిగి ఇక పెరగడానికి వీలు లేక కాబోలు ఆగిపోయింది. పెరుగుట విరుగుట కొరకే అన్న సుమతీ శతక కారుడి సూక్తిని నిజం చేస్తూ ప్రస్తుతం మాస్కో మెట్రో టికెట్ ధర  మెట్రో  రైలులో  ఒక సారి ప్రయాణానికి 26  రూబుళ్ల వద్ద  నిలకడగా నిలచిపోయింది. ఇంతటి స్తాయిలో- అనేక వందల్ రెట్లు,అదీ అతి తక్కువ వ్యవధిలో ధరలు ఆకాశాన్ని దాటి చుక్కలను తాకినప్పటికీ కూడా నిబ్బరంగా  తట్టుకున్న మాస్కో పౌరులను అబినంధించి తీరాలి కదూ. అంతేకాదు - అంతటి ద్రవ్యోల్బన  ఉత్పాతాన్ని పది పదిహేనేళ్ళ వ్యవధిలోనే అధిగమించగలిగిన   లేదా  తట్టుకోగలిగిన విధంగా 'కుషన్' ఏర్పాటు చేసిన  'సోవియట్ ఎకానమీ'ని  అభినందించాలి.
ఉపసంహారం: నిశ్చింతగా ప్రయాణాలు సాగిన ఆ నాటి మాస్కో మెట్రో స్టేషన్లలో ప్రయాణాలు చేయాలనుకునే విదేశీయులకు వారి ఎంబసీలు ఈనాడు ఇస్తున్న ఉచిత సలహా వింటుంటే కడుపు తరుక్కు పోతుంది. అదేమిటంటే- 'మాస్కో మెట్రోల్లో జేబు దొంగలుంటారు జాగ్రత్త' - కళ్ళెదుటే  కలల సామ్రాజ్యం కనుమరుగు కావడం అంటే ఇదే.

(మెట్రో ధ్యాసలోపడి మరచిపోయిన  శంకరాభరణం శంకర శాస్త్రి గారి రష్యన్ పలుకులు వచ్చేసారి )   

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

పాతికేళ్ళనాటి మాస్కో - 16




మెట్రో
మన దేశంలో యెంత మారు మూల పల్లెటూరికి వెళ్ళినా హోటల్ అన్న పదం విననివాడు, తెలియనివాడు వుండడు. కానీ ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాలలో ఒకటయిన సోవియట్ యూనియన్ రాజధాని మాస్కోలో- ఆ రోజుల్లో 'హోటల్' అంటే తెలియనివాళ్ళు కోకొల్లలు. అంటే మాస్కోలో హోటల్స్ లేవని కాదు. హోటల్ అనే ఇంగ్లీష్ పదం కూడా వారికి తెలియదన్న మాట.   అదేమిటో గాని రష్యన్ తప్ప మరొక భాష వారికి అర్ధం అయ్యేది కాదు. ఒకసారి రాయపాటి సాంబశివరావు గారు వచ్చి మాస్కోలోని ఇంటర్నేషనల్ హోటల్ లో బస చేశారు.



 అక్కడికి వెళ్లాలని యెంతో మంది టాక్సీ డ్రైవర్ లను అడిగిచూసినా ప్రయోజనం లేకపోయింది. ఇంటర్నేషనల్ హోటల్ అంటే ఎవరికీ అర్ధం కాలేదు. రష్యన్లో హోటల్ ని గస్తనీచ్చ అంటారు. మేజ్దురోద్నయా గస్తనీచ్చ(ఇంటర్ నేషనల్ హోటల్) అని నాలుకను మూడు మడతలు చుట్టి అడిగితె కాని అర్ధం కాని పరిస్తితి. మిల్క్(పాలు), బటర్ మిల్క్ (మజ్జిగ) స్కూలు, రోడ్డు, స్ట్రీటు (వీధి), వంటి ఇంగ్లీష్ పదాలు సయితం వారికి తెలియవు. ఒక్క మెట్రో తప్ప.





ఒక మెట్రో స్టేషన్ - అయిదు పైసల టిక్కెట్టుతో నూటయాభయి స్టేషన్లు

మెట్రో ప్రసక్తి లేకుండా మాస్కో గురించి చెప్పడం అంటే రాముడు లేని రామాయణాన్ని పారాయణ చేయడమే.
మాస్కో వీదుల్లో సంచరిస్తున్నప్పుడు-
రోడ్లపై ట్రాముల్లో, సిటీ బస్సుల్లో, ట్రాలీ బస్సుల్లో (కరెంటు తో నడిచే బస్సులు) తిరుగుతున్నప్పుడు-
ఎత్తయిన ఆకాశ హర్మ్యాలవైపు మెడలురిక్కించి చూస్తున్నప్పుడు-
మన కాళ్ళ కింద, భూమి అడుగున, వందల సంఖ్యలో మెట్రో రైళ్ళు సొరంగ మార్గాల ద్వారా అతివేగంగా ప్రయాణిస్తూ ఉంటాయని చెబితే -
మాస్కో మెట్రో గురించి తెలియనివాళ్ళు ఒక పట్టాన నమ్మడం కష్టం.
సోవియట్ యూనియన్ ఏర్పడడానికి పూర్వమే- జార్ చక్రవర్తుల కాలంలోనే - మెట్రో నిర్మాణం గురించి ప్రతిపాదనలు సిద్దం చేసారని చెబుతారు. అయితే ఈలోగానే, కామ్రేడ్ లెనిన్ నాయకత్వంలో మొట్టమొదటి సోవియట్ నిర్మాణం జరిగిన తరవాత ఆనాటి ప్రాదాన్యతలనుబట్టి, మెట్రో నిర్మాణ ప్రతిపాదనలు కొంత వెనుకపడ్డాయి. 1935  లో తొలి మెట్రో రైలు మాస్కో భూగర్భంలో పరుగులు తీసింది. 13  కిలోమీటర్లతో మొదలయిన మెట్రో క్రమంగా విస్తరించి ౩౦౦ కిలోమీటర్ల   పరిధిలో 180  స్టేషన్లకు పెరిగింది. పనిదినాలలో, సగటున రోజూ 70  లక్షలమంది మెట్రో రైళ్ళలో ప్రయాణిస్తుంటారు. రద్దీ టైములో 90  సెకన్ల కొకటి చొప్పున మెట్రో రైలు ప్రయాణీకులకు అందుబాటులో వుంటుంది. 1935  లో 50  కోపెక్కులతో మొదలయిన  మెట్రో టిక్కెట్టు ధరను 1961  లో అయిదు కోపెక్కులకు తగ్గించారు. అంటే ఐదు పైసల (కోపెక్కుల) నాణెం - మెట్రో స్టేషన్ ప్రవేశ ద్వారం దగ్గరవున్న స్లాటులో వేసి లోనికి ప్రవేశిస్తే చాలు- ఎటునుంచి ఎటువైపయినా- ఎన్నిసార్లయినా సరే-స్టేషన్లతో నిమిత్తం లేకుండా  ప్రయాణం చేయవచ్చు. నగరం నలువైపులకు వెళ్ళే రైలు మార్గాలను కలుపుతూ వృత్తాకారంలో మరో మార్గాన్ని నిర్మించారు. అందువల్ల - అనేకవైపులకు ప్రయాణాలు చేసేవారు కూడా భూగర్భంలో ఒక స్టేషన్ నుంచి మరో స్టేషను కు ఎస్కలేటర్ల ద్వారా వెళ్లి రైళ్ళు మారుతూ తమ గమ్యాలను చేరుకోవచ్చు.అంటే, భూగర్భంలోనే రైల్వే జంక్షన్లు నిర్మించారన్న మాట.ఒక సొరంగ మార్గంలో రైలు వెడుతుంటే- దానికి కిందా పైనా వున్న మార్గాలలోమరికొన్ని రైళ్ళు  తిరుగుతూవుంటాయి.


 ఈ  అద్భుతమయిన ఇంజినీరింగ్ కౌశల్యాన్ని - అధునాతన  సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులో లేని రోజుల్లోనే రష్యన్ ఇంజినీర్లు  ప్రదర్శించిన తీరు అమోఘం. మాస్కో మెట్రోలో మరో వెసులుబాటు ఏమిటంటే - ఒక రైలు వెనుకనే మరో రైలు వెంటవెంటనే వస్తుంటుంది కాబట్టి తొక్కిసలాటలకు, తోపులాటలకు ఆస్కారం తక్కువ. రైలు వచ్చి ప్లాటుఫారంపై ఆగగానే తలుపులు తెరుచుకోవడం - దిగేవాళ్ళు ఒక పక్క నుంచి దిగుతుండగానే మరో పక్కనుంచి ఎక్కేవాళ్ళు ఎక్కడం- తలుపులు మూసుకోవడం - రైలు కదిలిపోవడం అంతా క్షణాలలో నిశ్శబ్దంగా జరిగిపోతూ వుంటుంది.రైలు ఒక స్టేషన్ దాటగానే వచ్చేది పలానా స్టేషన్   అని ముందుగానే  పబ్లిక్ అడ్రసు సిష్టం ద్వారా అనౌన్స్ చేస్తుంటారు. అలాగే డోర్లు తెరుచుకుంటున్నాయి, డోర్లు మూసుకుంటున్నాయని కూడా   ప్రయాణీకులను  హెచ్చరిస్తూ  వుంటారు.   అన్ని లక్షలమంది ప్రయాణాలు చేస్తున్నా - ప్లాటుఫారాలన్నీ కడిగిన అద్దంలా మెరిసిపోతూవుంటాయి. ఒక స్టేషనుకు మరో స్టేషనుకు పోలిక లేకుండా - రష్యాలోని వివిధ జాతుల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఒక్కొక్క మెట్రో స్టేషను ను ఒక్కో మ్యూజియంగా తీర్చిదిద్దారు.


(రెడ్ స్క్వేర్ లెనిన్ సమాధి వద్ద పొడుగుపాటి క్యూలు - కన్నడ న్యూస్ రీడర్ శ్రీ రామకృష్ణ భార్య శ్రీమతి సరోజతో కలసి మా ఆవిడ నిర్మల)


 మాస్కోని సందర్శించే విదేశీ అధినాయకులు సయితం తమకు సమకూర్చిన చయికా కార్లను ( యద్దనపూడి నవలల్లో కధానాయకులు వాడే పడవ లాంటి కార్లు - ఈ ఆరు డోర్ల కార్లు అత్యున్నత స్తాయి విదేశీ అతిధులకి మాత్రమే అందుబాటులో వుంటాయి) పక్కన పెట్టేసి మెట్రో ప్రయాణం పట్ల ఆసక్తి వెలిబుచ్చుతారంటే మాస్కో మెట్రో ప్రశస్తిని అర్ధం చేసుకోవచ్చు.

(స్టాలిన్ తాగిన కాఫీ కప్పుతో మారిన మెట్రో డిజైన్ - ఈ వయినం గురించి మరో సారి)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

5, మార్చి 2014, బుధవారం

పాతికేళ్ళనాటి మాస్కో - 15

మాస్కో గోంగూర 




మాస్కోలో పాలకు కొదవలేదు. ఉన్నదల్లా పెరుగుకే. అక్కడ దొరికే కిఫీర్ అనేది అటు పెరుగు ఇటు మజ్జిగ కాని బ్రహ్మపదార్ధం. పాలు తోడు పెట్టి పెరుగు చేసుకోవచ్చు. కానీ తోడుకు పెరుగేదీ?
డిల్లీనుంచి ఎవరో తెలిసిన పెద్దమనిషి వస్తుంటే ఓ గిన్నెడు పెరుగు పట్రమ్మని కోరాము. అలా దిగుమతిచేసుకున్న పెరుగుతో ప్రారంభించిన 'తోడు' ప్రయోగాలు కొద్దిరోజుల్లోనే విజయవంతమయి, సొంతంగా ఇంట్లోనే పెరుగు ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించగలిగాము.దాంతో  ఇక మాస్కోలోని తెలుగులోగిళ్ళలో  పెరుగు వడలు,పెరుగు పచ్చళ్ళు ,ఆవకాయకారంతో పెరుగన్నాలు,  మజ్జిగ పులుసులు - స్వైరవిహారం చేయడం మొదలెట్టాయి. గొప్పచెప్పుకోవడం కాదు కానీ, రీనక్ గోంగూర,మాస్కో పెరుగుకు పేటెంట్ ఇవ్వాల్సివస్తే అది మా ఆవిడకే ఇవ్వాలి.



పెరుగు సమస్య తీరిపోవడంతో బియ్యంపై దృష్టి పెట్టాము. అక్కడ దొరికే బియ్యం చాలా చాలా కారు చవక. అయితే పేరుకు బియ్యమే కానీ వండితే వచ్చేది అన్నం కాదు. తినడానికే కాదు చూడడానికి కూడా పసందుగా లేని రష్యన్ బియ్యం బదులు మామూలు బియ్యం సంపాదించడం ఎల్లా అన్నది మా దినసరి సమస్యగా మారింది.

శ్రీ రాయపాటి

 ఆ సమయంలో మాస్కో వచ్చిన రాజ్య సభ సభ్యులు రాయపాటి సాంబశివరావు గారు - ఒక రోజు సాయంత్రం నగరంలోని డిల్లీ రెస్టారెంట్ లో తెలుగు వాళ్ళందరికీ విందు ఇచ్చారు. ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నడిచే ఆ హోటల్ లో బాస్మతి బియ్యంతో చేసిన ఫ్రయిడ్ రయిస్ వడ్డించారు.



మాస్కోలో మా ఇంట్లో శ్రీ రాయపాటి

వెంటనే  ఆ రెస్టారెంట్ మేనేజర్ ను కదిలించి చూసాను.
 వాళ్లకు డిల్లీ నుంచి వారానికి ఒకసారి బియ్యం బస్తాలలో వస్తుంటాయట. బియ్యంకోసం మేము పడుతున్నపాట్లు విన్నవాడయి- మనసు కరిగిన వాడయి - నెలకిన్ని కిలోలని బియ్యం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అలాగే ఐ టీ డీ సీ నడిపే బాంబే రెస్టారెంట్ నుంచి మరికొంత నెలసరి బియ్యం కోటా సంపాదించుకునే తెలివితేటలను 'అవసరమే' మాకు నేర్పింది.




. కొంత ఎక్కువ ఖర్చయినప్పటికీ రెండు ప్రధాన సమస్యలు తీరిపోవడంతో - మాస్కోలో చదువుకునే తెలుగు పిల్లలకు శనాదివారాల్లో  మా ఇల్లు తెలుగు భోజనశాలగా మారిపోయింది. వాళ్ళంతా మా ఆవిడను అన్నపూర్ణ అని పిలిచేవాళ్ళు. ఇళ్ళకు దూరంగా, ఇంటి భోజనానికి  మరీ దూరంగా నాలుక చవిచచ్చిన ఆ పిల్లలు - మా ఆవిడ వడ్డించే  'రీనక్ గోంగూర పచ్చడి, గడ్డపెరుగు అన్నం' తినడానికి చాలా చాలా దూరాలనుంచి చచ్చీచెడీ వచ్చేవారు. వాళ్ళ ఆటా పాటలతో మా ఇల్లు సందడే సందడి.  రెండు రోజులు యిట్టే సరదాగా గడిచిపోయేవి. ఒకరికి పెట్టడంలోవున్న హాయినీ, ఆనందాన్నీ ఒక జీవితానికి సరిపడా మాస్కో జీవితం మాకు అందించింది. జీవితానికి ఇంతకంటే ఏం కావాలి?
(శంకరాభరణం  శంకర శాస్త్రి గారి నోట రష్యన్ మాట - ఆ కధా కమామిషు మరోసారి)  

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

పాతికేళ్ళనాటి మాస్కో - 14

ఇంతకీ ఆ కార్డు ముక్కలో ఏమున్నదంటే !

బందరులో   ఒక పెద్దమనిషి గారున్నారు. ఇస్కస్ (ఇండో సోవియట్ సాంస్కృతిక సంస్థ)ద్వారా  సోవియట్ యూనియన్ పర్యటనకు రావాలనుకుంటున్న ఆంద్ర ప్రదేశ్ ప్రతినిదివర్గంలో ఆయన వున్నారు. శాకాహారి అయిన ఆయన రష్యాలో తిండీ తిప్పలు గురించి ముందే వాకబు చేసుకుని, నా అడ్రసు తెలుసుకుని ఆ కార్డు రాసారు. ఫలానా రోజున మాస్కోలో ఫలానా హోటల్ లో ఉంటాననీ, వచ్చికలుసుకోవాల్సిందనీ అందులో కోరారు.



 దాని ప్రకారమే  ఆ ఫలానా రోజున ఆ ఫలానా హోటల్ కు వెళ్లి ఆయన్ని కలుసుకున్నాను. మాస్కో రావడానికి ముందే రష్యాలోని మరో రెండు మూడు నగరాలు  వారిని తిప్పి తీసుకువచ్చారు.బడలికతో నీరసించివున్న   ఆయన నన్ను పక్కకు తీసుకువెళ్ళి- 'ఈ రోజు మీ ఇంటికి రావాలనుకుంటున్నాను ఏమయినా అభ్యంతరమా' అని అడగలేక అడిగారు. పరిస్తితిని అర్ధంచేసుకుని వెంటనే ఆ పెద్దమనిషిని మా ఇంటికి  బయలుదేరదీసాను. ఈ విషయం ఎలాతెలిసిందో ఏమో ఒక్కక్కరుగా వచ్చి అదే కోరిక కోరారు. ఇప్పట్లోలాగా ఆరోజుల్లో సెల్ ఫోనులు లేవు. ఇంటికి ఫోను చేసి ఇంతమంది వస్తున్నారని చెప్పే వీలు లేదు. ఏమయితే అయిందని  వాళ్ళతో వున్న రష్యన్ దుబాసీతో సహా  అందర్నీవాళ్ళ కోసం ఏర్పాటు చేసిన  బస్సులో ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్లాను. బిలబిలమంటూ ఇంటికి వచ్చిన అతిధులను చూసి మా ఆవిడ ముందు కంగారు పడినా - తరవాత తమాయించుకుని  అందరికీ పచ్చళ్ళు, సాంబారు, పెరుగుతో భోజనాలు పెట్టింది. 'అన్నదాతా సుఖీభవా' అని అంతా ఆశీర్వదిస్తుంటే-' ఇచ్చుటలో వున్న హాయీ వేరెచ్చటనూ లేనేలేదనీ- లేటుగ తెలుసుకున్నాను' అన్న బాపూ రమణల బుద్దిమంతుడి పాట గుర్తుకు వచ్చింది. ఆ రోజు మా ఇంట్లో నాలుగు మెతుకులు తిన్న వారందరూ పోతూ పోతూ  ఇచ్చిన టీ పొట్లాలు, కాఫీ పొడి  పాకెట్లు, వక్కపొడి మొదలయిన- 'అమూల్య కానుకలతో' ఆ తరవాత  కొన్నాళ్ళు మాకు పండగే పండగ.


(రేడియో మాస్కోలో గుజరాతీ న్యూస్ రీడర్ శ్రీ వ్యాస్)

పోతే మరో విషయం తప్పక చెప్పాలి. అలా ఆ రోజు మా ఇంటికి వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఇన్నేళ్ళ తరవాత ఇప్పటికీ కూడా ఏటా గ్రీటింగ్ కార్డులు పంపిస్తూనే వున్నారు. వాళ్ళ సహృదయతకు ఖరీదు కట్టే షరాబు యెవ్వడు?
(మరికొన్ని మంచి జ్ఞాపకాలతో మరోసారి)    

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

పాతికేళ్ళనాటి మాస్కో - 13


బస్సులో బంధువులు 






ఆ వచ్చిన వాళ్ళెవ్వరూ మా బంధువులు కాదు. కనీసం ముఖ పరిచయం వున్న వాళ్ళు కూడా కాదు. కానీ ఒక్క పూట మా ఇంట్లోగడిపిన 'పుణ్యానికి' ఆత్మ బంధువులుగా మారారు.
నిజానికి అది మా ఆవిడ చేసుకున్న పుణ్యం.ఇంకా చెప్పాలంటే - ఆమెను కట్టుకుని నేను చేసుకున్న పుణ్యం. ఇది మూట కట్టుకోవడానికి చాలా రోజులముందు బందరు నుంచి నాకో రోజు ఓ కార్డు ముక్క వచ్చింది. నిజానికి రాలేదు. నేనే వెళ్లి తెచ్చుకున్నాను. మాస్కోలో వుండే విదేశీయులెవరికీ నేరుగా ఇళ్ళకు ఉత్తరాలు రావు. ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు వస్తాయి. అంటే  హైదరాబాదులో వున్న మా వాళ్ళెవారయినా నాకు ఉత్తరం రాయాలనుకుంటే నా పేరు రాసి  తరవాత  కేరాఫ్ మాస్కో రేడియో అని రాసి డిల్లీలో వున్న మన విదేశాంగ శాఖ కార్యాలయానికి పోస్ట్ చేయాలి. అలా వచ్చిన ఉత్తరాలనన్నింటినీ 'డిప్లొమాటిక్ బాగ్ లో' వారానికోసారి మాస్కోకు విమానంలో పంపుతారు.



 మన ఎంబసికి చేరిన ఉత్తరాలను మనమే వెళ్లి వెదికి తెచ్చుకోవాలి.అలా ఉత్తరాలను గాలించి తెచ్చుకోవడంలో వున్న తృప్తి అనుభవిస్తే కానీ అర్ధం కాదు. చుట్టపక్కాలనుంచివచ్చే  ఉత్తరం ముక్కకోసం ఎంతగా మొహం వాచిపోయేవాళ్లమో ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది.   మేము జవాబు రాయాలన్నా ఇదే వరస. ఇందులోవున్న ఏకైక సౌలభ్యం ఏమిటంటే మనకు ఉత్తరాలు రాసేవాళ్ళు ఎయిర్ మెయిల్ స్టాంప్  ఖర్చులు పెట్టుకోనక్కరలేదు. మామూలు తపాల స్టాంపులతో డిల్లీకి పోస్ట్ చేస్తే సరిపోతుంది. అక్కడనుంచి రాయాలన్నప్పుడు మాకూ అంతే. అందుకే ఎవరయినా వస్తున్నప్పుడు ఏమి పట్టుకురావాలని అడిగినప్పుడు ఇండియన్ స్టాంపులు తెమ్మని అడిగేవాళ్ళం. ఈ ఉత్తరాలతో పాటే ఇండియా నుంచి  ఇంగ్లీష్ దినపత్రికలు వచ్చేవి. వాటిల్లో బెంగళూరు నుంచి వెలువడే హిందూ వుండేది.



.మన రాష్ట్రం సమాచారం తెలియాలంటే హిందూలో హైదరాబాద్ నుంచి వారం వారం హెచ్ జే రాజేంద్రప్రసాద్ గారు రాసే ఆంద్ర ప్రదేశ్ న్యూస్ లెటర్ ఒక్కటే శరణ్యం.


(ప్రెస్ క్లబ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో శ్రీ రాజేంద్ర ప్రసాద్, కుడి నుంచి రెండోవారు)   

 తరువాతి రోజుల్లో మాస్కోకు వచ్చిన అప్పటి ఆంద్ర జ్యోతి ఎడిటర్ -  ఐ. వెంకట్రావు గారు  తెలుగు పత్రిక కోసం అక్కడి తెలుగువాళ్ళు పడుతున్న  ఆరాటాన్ని గమనించి- హైదరాబాద్ తిరిగి వెళ్ళగానే ఎంబసీ ద్వారా ఆంద్ర జ్యోతి దినపత్రికను పంపడం ప్రారంభించారు.


(శ్రీ  ఐ. వెంకట్రావు)


మాస్కోలో ఉంటున్న తెలుగు వారిలో నా పరపతి పెరగడానికి ఇది దోహదం చేసింది కూడా. ఇక కార్డు విషయానికి వస్తే-

కార్డు కదా! కొంత విరామం తీసుకుందాం. ఏమంటారు?



NOTE: All the images in this blog are copy righted to their respective owners.