14, జనవరి 2014, మంగళవారం

కాపీ ;రైట్'



“జోకులకి కూడా కాపీ రైట్లు వుంటాయా మాస్టారూ”
“కాపీ రైట్ అంటేనే  కాపీ కొట్టే రైట్ శిష్యా!”

“ఆరంజి పండుకి యాపిల్  పండుకి వున్న తేడా ఏమిటి?”
“ఆరంజి పండు ఆరంజి రంగులో వుంటుంది. యాపిల్ పండు యాపిల్ రంగులో వుండదు”

యాదగిరి కొత్త మొబైల్ ఫోను కొని తెలిసిన వాళ్ల నెంబర్లకు 
ఎస్.ఎం.ఎస్. లు పంపాడు.
“నా ఫోను నెంబర్ మారింది. మునుపు నాది   నోకియా  3310  అయితే ఇప్పుడది నోకియా 6610  గా మారింది. దయచేసి   ఈ నెంబరు మార్పు నోటు చేసుకోండి.”

“డాక్టర్ గారు  ఫుట్ బాల్ ఆడుతున్నట్టు కలలు వస్తున్నాయి”
“అయితే ఈ రాత్రి నిద్రపోయేముందు ఈ మాత్ర వేసుకోండి. సర్దుకుంటుంది”
“రేపటి నుంచి వేసుకుంటా డాక్టర్. ఇవ్వాళే ఫైనల్ మ్యాచ్”

“నేను చనిపోయాననుకో! నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా”
“లేదు. నా చెల్లెలు  దగ్గరకి వెళ్ళి వుంటాను కాని, మళ్ళీ పెళ్లి చేసుకోను. మరి మీ సంగతేమిటి? నేను పోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా?”
“లేదు లేదు. నేనూ  మీ చెల్లెలితోనే వుంటాను”
  
“రాత్రి ఇంట్లో దొంగలు పడ్డారు. ఒక్క టీవీ తప్ప అన్నీ ఎత్తుకెళ్లారు ఇనస్పెక్టర్”
“అదేమిటి టీవీ ఒక్కదాన్ని యెందుకు పట్టుకుపోలేదు”
“దొంగలు వచ్చినప్పుడు నేను టీవీ చూస్తున్నాను”

“ఎందుకలా అంతా పరిగెడుతున్నారు?”
“పరుగు పందెం. గెలిచిన వాళ్లకు మెడల్  ఇస్తారు?”
“గెలిచినవాళ్లకు  మెడల్  ఇస్తారు సరే!  కానీ మిగిలినవాళ్ళెందుకు పరిగెత్తుతున్నట్టు”

“నేను ఒకడిని హత్య చేసాను. ఈ వాక్యాన్ని భవిష్యత్ కాలంలోకి మార్చి చెప్పు”
“నువ్వు జైలుకు వెడతావ్”

“ వెళ్ళు. వెళ్ళి మొక్కలకు నీళ్ళు పొయ్యి”
“వర్షం పడుతున్నట్టుంది”
“అయితే ఏమిటట! గొడుగు తీసుకెళ్ళు”

“నా మొబైల్ బిల్లు యెంత వచ్చిందో చెబుతారా”
“దానికి నా సాయం అక్కరలేదు. మీ మొబైల్ నుంచి  121 డయల్ చేస్తే  మీ కరెంట్ బిల్లు ఎంతో ఏమిటో  మీకు వెంటనే ఎస్.ఎం. ఎస్’ వస్తుంది”
“ఏడిచినట్టే వుంది. నేను అడుగుతోంది నా మొబైల్ బిల్లు సంగతి. కరెంటు బిల్లు కాదు”

“ఆ అమ్మాయికి పుట్ట చెముడులా వుంది”
“ఏం అలా అంటున్నావు”
“ ఇందాక ఆ అమ్మాయిని కలిసి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పా. అలా చెప్పాక కూడా ‘నా చెప్పులు కొత్తవి తెలుసా’ అంటోంది”
“నిన్ను నా  కోర్టులో మళ్ళీ మళ్ళీ  చూస్తున్నాను. మూడో సారి కూడా ముద్దాయిగా కోర్టుకు  రావడానికి నీకు సిగ్గనిపించడం  లేదా”
“యెందుకు సిగ్గు!  మీరు మాత్రం రోజూ కోర్టుకు రావడం లేదా”
 
“రాముడు, బుద్ధుడు, మహమ్మదు ప్రవక్త,  ఏసు క్రీస్తు, గాంధీ -  వీరిలో నీకు కామన్ గా కనిపించే విషయం ఏమిటి”
“అందరూ ప్రభుత్వ సెలవుదినాల్లోనే  పుట్టారు
“మిస్ నిన్న నా మొబైల్ కేమైనా ఫోను చేసారా?”
“లేదే! ఎందుకలా  అడిగారు”
“ఏమీ లేదు నా ఫోన్ లో ఒక మిస్ కాల్ వుంది.”



(ఇవన్నీ నెట్లో విహారం చేస్తున్న ఇంగ్లీష్ జోకులు. ముందే చెప్పినట్టు తెలుగులోకి కాపీ కొట్టే రైట్ కొట్టేశానన్నమాట. మొట్టమొదటిదొక్కటే అచ్చంగా నా సొంతం. పోతే ఇమేజ్ సొంతదారుకు ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు)

జెయిల్లో సాటి ఖయిదీని గర్భవతిని చేసిన రాజకీయ ఖైదీలు ఎవ్వరు?






(తొలి వెలుగు సౌజన్యంతో)
http://www.youtube.com/watch?v=XP5Qch--DGk


(హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో వయోధిక పాత్రికేయ సంఘం ఏర్పాటుచేసిన సదస్సులో ప్రసంగిస్తున్న కేంద్ర సమాచార కమీషనర్ శ్రీ మాడభూషి శ్రీధర్) 


ఆర్టీఏకి తూట్లు పొడుస్తున్న ఐఏఎస్‌లు..!
టీటీడీ ఆర్టీఏ లెక్కల్లోకి ఎందుకు రాదు..?
కొందరు జర్నలిస్టుల అనైతిక దాడికి ఆర్టీఏ కమిషనర్ల రియాక్షనేంటి..?
టీటీడీ ఫైళ్లమీద పోరాడి గెలిచిన జర్నలిస్టు..?
ఆర్టీఏ రావడానికి 20 ఏళ్లకు ముందే 'సమాచారాన్ని' రాబట్టిన జర్నలిస్టు..?
కేజ్రీవాల్ ఎంట్రీకి భయపడి 'తగలబడ్డ' ఢిల్లీ సెక్రటేరియట్ ఫైళ్లపై 'మాఢభూషి' స్పందనేంటి? (పూర్తి వివరాలకు ఈ లింకు పై నొక్కండి)

(1) RTI Commissioner Madabhushi Sridhar at Symposium on RTI and journalists.
http://www.youtube.com/watch?v=XP5Qch--DGk

13, జనవరి 2014, సోమవారం

చదవడానికెందుకురా తొందరా!


చదువుకునే రోజుల్లో ప్రతిఒక్కరికీ  ఫస్ట్ క్లాస్  మీద ఆసక్తి ఫస్ట్ క్లాస్ గా వుంటుంది. బళ్ళో లాస్ట్ బెంచీలో కూర్చునే వాళ్లకు కూడా  క్లాసులో ఫస్ట్ రావాలనే తాపత్రయం. అయితే ఈ ఫస్ట్ క్లాస్ థియరీపై  పరిశోధన చేసి ఒకాయన కనుక్కున్న సంగతులు మాత్రం వేరుగా  వున్నాయి.

చదువులో ఫస్ట్ క్లాస్  సంపాదించే వాళ్ళలో చాలామంది  టెక్నికల్ కోర్సుల్లో చేరి   డాక్టర్లో  ఇంజనీర్లో అవుతుంటారు.

ఇక సెకండ్ క్లాస్ స్టూడెంట్లు ఎంబీయే లాటి కోర్సులు ఏవో చేసి, ఐ ఎ ఎస్ లయి డాక్టర్లను, ఇంజినీర్లను ఆజమాయిషీ చేస్తుంటారు.

పోతే, థర్డ్ క్లాస్ స్టూడెంట్లు డింకీలు కొట్టి అత్తెసరు మార్కులతో పాసయినామని అనిపించుకుని  ఏ ఉద్యోగాలు దొరక్క రాజకీయాల్లో చేరి మంత్రులుగా మారి  పై ఇద్దర్నీ తమ చెప్పుచేతల్లో వుంచుకుంటారు.

ఇక ఆఖరు రకం అంటే పరీక్షల్లో పాసుకాకుండా చదువుకు స్వస్తి చెప్పి అల్లరి చిల్లరగా తిరిగేవాళ్ళు అండర్ వరల్డ్ డాన్ లుగా అవతారం ఎత్తి  పైఅందరిపై పెత్తనం చేస్తుంటారు.

కాబట్టి చదవడానికెందుకురా తొందరా! అని పాడుకోవడం మంచిదేమో.


తోక వాక్యం: ఏదో సరదాకు ఎవరో ఇంగ్లీష్ లో రాస్తే ఉబుసుపోక తెలుగులోకి మార్చి  రాసిందాన్ని  సీరియస్ గా తీసుకుని చదువులు చెడగొట్టుకోవద్దు సుమీ!

12, జనవరి 2014, ఆదివారం

నవ్వడం మరచిపోతున్నామా!


(ఎల్లుండి జనవరి పద్నాలుగు జంధ్యాల జయంతి)
మా పక్కింటి పాపాయి పది నెలల పాప నన్ను చూడగానే నోరంతా తెరిచి పలకరింపుగా నవ్వుతుంది. పుట్టెడు దిగుళ్లను సయితం మటుమాయం చేయగల మహత్తరమయిన నవ్వది. అలా హాయిగా నవ్వుకుని ఎన్నాళ్లయిందన్న బెంగ  వెంటనే మనస్సుని తొలిచివేస్తుంది.
మనిషి ఏడుస్తూ పుట్టేది నవ్వుతూ చనిపోవడానికి
ఈ వాక్యం రాసిపెట్టుకున్న కాగితాన్ని  ముప్పయ్ ఏడేళ్ళ క్రితం నేను రేడియోలో ఉద్యోగం మొదలు పెట్టిన కొత్తల్లో నా ఆఫీసు బల్ల మీది అద్దం కింద హమేషా కనబడేలా పెట్టుకునేవాడిని. దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటే – ‘చనిపోయినప్పుడు నా మొహం మీద చిరునవ్వు చెరగకుండా  వుందో లేదో చూసి చెబుతావా స్వామీ!అని చెప్పుకున్న రోజులవి.
నవ్వగలగడం ఒక భోగం -  నవ్వలేకపోవడం ఒక రోగంఅని నవ్వు గురించి నవ్వులరేడు, కాలేజీలో నా క్లాసుమేటు ఆ తరువాత గ్లాసుమేటు అయిన జంధ్యాల చెప్పిన ఈ సూక్తి సూర్యచంద్రులున్నంతవరకు జనం నోళ్ళలో నానుతూనే వుంటుంది. ఈ పోటాపోటీ కాటా కుస్తీ యుగంలో, ఉరుకులు పరుగులమీద సాగుతున్న జీవితాల్లో నవ్వనేది మరింత అపురూపం కాగలదన్న భయం కూడా పట్టుకుంటోంది.
నిజం. హాయిగా నవ్వలేకపోవడం ఒక రోగం. పైగా ఇది అంటు  రోగంలా అందర్నీ అంటుకుంటోంది.
విశ్వనాథవారు అన్నట్టు ఇదొక విషాదం. 

12-01-2014

చరిత్రకెక్కని చరిత్రకారులు


ఇరీనా సెండ్లర్. ఆరేళ్ళ క్రితం పోలాండ్ లోని వార్సాలో తన తొంభయ్ ఎనిమిదో ఏట చనిపోయింది.
రెండో ప్రపంచ యుద్ధకాలంలో నానా తంటాలు పడి  అధికారులనుంచి ప్లంబర్ గా పనిచేయడానికి అనుమతి సంపాదించింది. ఈ యుద్యోగం దొరకపుచ్చుకోవడంలో ఆవిడ ఉద్దేశ్యం వేరు. తన పనిముట్లు పెట్టుకునే ఒక పెట్టె అడుగున బయటకి కనబడని ఒక అర వుండేది. అందులో పసిపిల్లలను వుంచి సరిహద్దుల అవతలకు చేరవేసేది. పెద్దపిల్లలను చేరవేయడానికి తన ట్రక్కులో ఎప్పుడూ ఓ గోనె సంచీ సిద్ధంగా వుంచుకునేది. తన ‘అక్రమ’ రవాణా వ్యవహారం నాజీ సైనికుల కంట పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకునేది. పిల్లలు ఏడ్చిన ధ్వనులు వినబడకుండా ఒక కుక్కను వెంటబెట్టుకుని వెళ్ళేది.పిల్లలు  ఏడ్చినప్పుడల్లా ఆ కుక్క పెద్దగా మొరిగేలా దానికి శిక్షణ ఇచ్చింది. చాలాకాలంపాటు రహస్యంగా సాగించిన ఈ కార్యక్రమం ఫలితంగా మొత్తం మీద రెండు వేళ అయిదువందల పైచిలుకు పిల్లల్ని దేశ సరిహద్దులు దాటించి నాజీల బారినుంచి వారి ప్రాణాలు కాపాడింది.


(ఇరీనా స్లెండర్) 

ఒకరోజు రహస్యం బయట పడి నాజీలకు దొరికిపోయింది. వాళ్లు ఆవిడ రెండు కాళ్ళు విరగగొట్టి చిత్రహింసలకు గురిచేశారు. అయినా తాను తరలించిన పిల్లల ఆచూకీ గురించి ఒక్క మాట కూడా బయటకు పొక్కలేదు.
కాకపోతే ఆ పిల్లల వివరాలు, వారి తలితండ్రుల వివరాలను రాసిన ఒక దస్త్రాన్ని జాగ్రత్తగా ఒక గాజు జాడీలో భద్రపరచి దాన్ని తన ఇంటి పెరట్లో ఒక చెట్టు మొదట్లో ఒక గొయ్యి తవ్వి అందులో పూడ్చిపెట్టింది.
యుద్ధం ముగిసింది. నాజీల నుంచి ఇరీనాకు విముక్తి లభించింది. తన దగ్గర వున్న వివరాలతో ఆ పిల్లలని  వారి తలితండ్రులవద్దకు చేర్చాలని విశ్వప్రయత్నం చేసింది. కాని వారిలో చాలామంది నాజీల గ్యాస్ చాంబర్లలో అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. పిల్లలు అనాధ శరణాలయాల్లోనో, తమను  దత్తుకు  తీసుకున్న వారివద్దనో పెరిగి పెద్దవారయ్యారు.

2007 లో ఇరీనా పేరు మళ్ళీ తెర మీదకు వచ్చింది. ఆవిడ చేసిన మానవతా దృక్పధంతో ఆవిడ చేసిన సేవకు గుర్తింపుగా ఆమె పేరు నోబుల్ పురస్కారానికి సిఫార్సు చేశారు. కానీ దురదృష్టం ఆ ఏడాది ఆమెకు  బదులు ఆల్ గొరె ను ఎంపిక చేశారు. ఆ తరువాత కూడా అదే జరిగింది. ఆయేడు బరాక్ ఒబామా ఆ పురస్కారాన్ని ఎగరేసుకుపోయారు. ఈలోగా ఆ దయార్ధహృదయురాలిని ఆ భగవంతుడే కరుణించాడు. తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఎందరో పసికందుల ప్రాణాలను కాపాడిన ఆమెను తన అక్కున  చేర్చుకున్నాడు. 2008 లో ఆ కరుణామూర్తి   కన్నుమూసింది.         
NOTE: Courtesy Image Owner

చదివించే ‘గుణకారుడు’


 ''ప్రతి తెలుగు బాలుడూ నూరు పద్యాలు నేర్చుకోవాలి. పద్యాల్లో ఉండే నీతి, విలువలు జీవితానికి ఉపయోగపడడమే కాక, అతడికి తెలుగు భాషా ప్రాచీన ఔన్నత్యాన్ని తెలియజేసినవాళ్ళమవుతాం. జీవితాన్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవడానికి ఈ తరం పిల్లలతో పద్యాలు చదివించాలి'' అంటారు దేవినేని మధుసూదనరావు.
పిల్లలకూ, వారికి మార్గదర్శనంచేసే పెద్దలకూ ఉత్తమ గ్రంథాలను పంపిణీ చేయడం ద్వారా నీతి, విలువలు, తెలుగు భాషా ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు ఆయన శ్రీకారం చుట్టారు. కృష్ణాజిల్లా తెన్నేరు గ్రామానికి చెందిన దేవినేని మధుసూదనరావు మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించినప్పటికీ ఛార్టర్డ్‌ అక్కౌంటెన్సీ చదివారు. హైదరాబాద్‌లో 'ఎపి రేయాన్స్‌', 'విజరు ఎలక్ట్రికల్స్‌' తదితర కంపెనీల్లో పదేళ్లపాటు ఛార్టర్డ్‌ ఎక్కౌంటెంట్‌గానూ పనిచేశారు. తనకు 60 ఏళ్లు పూర్తయిన తరువాత  సతీమణితో సహా స్వగ్రామంలో శేష జీవితాన్ని గడుపుతూ.. చిన్నతనంలో తన ఉన్నతికి దోహదపడిన అంశాలను ఈ తరానికి అందించేందుకు కృషి చేస్తున్నారు. ఇందుకు ఆయన ఎంచుకున్న ఆయుధం - విలువలు పెంచే పుస్తకాలను పంపిణీ చేయడం. ఈ పనిలో ఎంతో ఆనందం పొందుతున్నారాయన.
“దురదృష్టవశాత్తూ, ఇవాళ సమాజంలో పుస్తకాలు చదివే అభిరుచి బాగా తగ్గిపోయింది. కొనుక్కుని చదవగలిగే స్థోమత ఉన్నవారు సైతం పుస్తకాలు చదవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత మంచిని పంచే పుస్తకాలు చదివించి, వారిలో మార్పు తీసుకురావచ్చని భావించా. అందుకే పద్యాలను నేటితరం పిల్లల దగ్గరకు తీసుకు వెళుతున్నాను.
“అందుకే పుస్తకాలు కొని.. వాటిని స్నేహితులతో పంచు కుంటున్నా. నేనిచ్చిన పుస్తకాలను వారితో చదివింపజేయడం హాబీగా మార్చుకున్నా.
2010
లో మా అమ్మాయి పెళ్లి జరిగింది. ఇక్కడో కొత్త ప్రక్రియ ప్రవేశపెట్టాను. 2010లో వెలువరించిన కథల సంకలనమొకటి పెళ్లికొచ్చిన వారందరికీ పంపిణీ చేశాను. అందరూ సంతోషించారు. దీంతో నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేయడం, స్నేహితులు, ఇష్టమైనవారికి ఇవ్వడం, వారితో చదివింపజేయడం చేస్తున్నాను. ఇది నాతోపాటు నా శ్రీమతికి కూడా అలవాటైంది.
2011లో విజయవాడలో నా స్నేహితుడు ఫణి ప్రసాద్‌ షష్టి పూర్తి సందర్భంగా శ్రీరమణ రచించిన 'మిథునం' పుస్తకాన్ని అచ్చు వేయించి, 1500 కాపీలను అక్కడికి వచ్చిన అతిథులందరికీ పంపిణీ చేశాను. 2012లో నా స్నేహితుడు 'శాంతా బయోటెక్‌' వరప్రసాద్‌రెడ్డి నూతన గృహప్రవేశం సందర్భంగా ఐదారు కథలతో సంకలనం వేయించి, అక్కడకొచ్చిన అతిథులందరికీ ఇచ్చాను. నా భార్య చెల్లెలి కుమార్తె పెళ్లి సందర్భంగా  కూడా పెళ్లి, పిల్లలు, జీవితానికి సంబంధించిన ఐదు కథలతో సంకలనం వేసి రెండు వేల కాపీలను పంచిపెట్టాను. దీనికి మంచి స్పందన వచ్చింది.
ఇక పిల్లలకు పద్యాలు నేర్పించాలనే ఉద్దేశంతో 2012 మార్చి నుంచి శతకాలు పంపిణీ చేయడం ప్రారంభించాను. ఈ రెండేళ్లలో దాదాపు 45 వేల పుస్తకాలు ('పద్య పారిజాతాలు, బాలగేయాలు') పంచిపెట్టాను. 2013 మార్చిలో నీతి కథలకు సంబంధించి 25 పుస్తకాలు వచ్చాయి. వీటిన్నిటినీ కలిపి 'కథా చిత్రాలు', 'బతుకు పాఠాలు' పేరుతో 2 వేల కాపీలు ముద్రించి పంపిణీ చేశాను. చిత్తూరు జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు ఎనిమిది రకాలు పుస్తకాలు ముద్రించి, చిత్తూరు సబ్‌ జైలులో పంపిణీ చేశారు. ఇలాంటి మంచి ప్రయత్నాన్ని అందరూ అభినందించాలి. నాకు తెలిసినంతర వరకూ ఈ రెండు పుస్తకాలు 20 వేల వరకూ ముద్రించి, పంపిణీ చేశా.
కడపలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న డాక్టర్వేంపల్లి గంగాధర్‌ రాసిన 'తెలుగులో తొలి శాసనం' పుస్తకం, అలాగే తెలుగు భాష ప్రాచీన ఔన్నత్యాన్ని తెలియజేసే పలు పుస్తకాలను నా తల్లిగారి పేరు మీద నెలకొల్పిన 'దేవినేని సీతారావమ్మ పౌండేషన్‌' పేరిట ప్రచురించాం.
ఇలా పిల్లల్లో విలువలు పెంచేందుకు ఎంతైనా కృషి చేయాల్సిన అవసరముంది. ఇది అందరూ గుర్తించాలి. ఇదో ఉద్యమంగా సాగాలి. తెలుగు భాష ఔన్నత్యాన్ని నిలబెట్టాలి. అదే నేను కోరుకునేది.''
(-
యు. రామకృష్ణ, 12-01-2014 - ప్రజాశక్తి  దినపత్రిక)

10, జనవరి 2014, శుక్రవారం

ఏనుగు శీర్షాసనం చూశారా!



(ఈనెల పద్నాలుగో తేదీ జంధ్యాలజయంతి)




ఆయనతో పరిచయం యెలా జరిగిందో గుర్తు రావడం లేదు. ఆయనో లాయరు. మహాకాయానికి తక్కువగా, స్తూలకాయానికి ఎక్కువగా వుండేవారు. పేరు మాత్రం కురచ. వరప్రసాద్.  వయస్సులో నాకంటే రెండు పదులు తక్కువ. బుద్ధిలో బృహస్పతి. రాజ్యాంగ శాసనాలు కొట్టిన పిండి. ప్రాచీన ధర్మ సూక్ష్మాలు, శాస్త్రీయ విషయాలు కరతలామలకం. భారత, భాగవత, రామాయణాలు ఆసాంతం  ఆపోసన పట్టిన వ్యక్తి. పద్యాలు, వేల సంఖ్యలో సంస్కృత  శ్లోకాలు కంఠతా వచ్చు. అష్టాదశ పురాణాలు తడుముకోకుండా చెప్పగల సామర్ధ్యం ఆయన సొంతం. కుతర్కంతో కాక  తర్కంతో తన వాదన నెగ్గించుకునే ఈ మహానుభావుడు సూర్యోదయానికి పూర్వమే లేచి ఎంతో నిష్టగా అనుష్టానలన్నీ పూర్తిచేసుకుని ఇంటి నుంచి బయట పడడం తరువాయి ఆయన జీవన శైలి ఈనాటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా మారిపోయేది.
ఎమర్జెన్సీ తరువాత జనతా సర్కారు ఇందిరా గాంధీపై పెట్టిన అనేక కేసులను ఆవిడ తరపున వాదించానని ఆయనే అనేకసార్లు చెప్పుకున్నారు. జ్వాలా నేనూ ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇందుకు దాఖలా అన్నట్టు పలువురు పెద్దలను మాకు పరిచయం చేసి, వారితో తన సాన్నిహిత్యాన్ని తెలియచెప్పారు. దేశ రాజధానిలో   అంతంత స్థాయిలో పరిచయాలు కలిగిన వ్యక్తి  హైదరాబాదులో మాత్రం లాంబెట్రా స్కూటరు మీద తిరిగే వాడు. ఆరోజుల్లో మాకు స్కూటరు సరే సైకిల్ కూడా వుండేది కాదు. కాబట్టి ఆయన్ను సందేహించే పరిస్తితి మాది కాదు. అంత పెద్ద శరీరంతో స్కూటరు మీద చిక్కడపల్లిలో మేముంటున్న ఇంటికి వస్తుంటే మా పిల్లలు వినాయకుడు ఎలక వాహనంపై వస్తున్నాడని ఆట పట్టించేవారు.
ఎక్కడ వున్నా త్రికాలసంధ్యాదులు సక్రమంగా నిర్వర్తించడం ఆయన అలవాటు. ఢిల్లీలో మేము ఆయనతో కలసి కుతుబ్ మినార్ చూసివస్తున్నప్పుడు సూర్యాస్తమయం కావొస్తుండడం గమనించి దారిపక్కన నీటి  చెలమ వున్నచోట కారు ఆపించి సంధ్యావందనం చేసివస్తుంటే టాక్సీ డ్రైవర్ కూడా ఆశ్చర్య పోయాడు.



అలా, ఆయనతో కలసి తిరుగుతూ ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్ళాము. అక్కడి బుక్ స్టాల్లో పుస్తకాలు తిరగేస్తూ మాలో మేము తెలుగులో మాట్లాడుకుంటుంటే ఒకాయన మా వైపు తెలుగు వాళ్ళా అన్నట్టు చూసారు. ఒక్క క్షణం ఆగి మీరు శ్రీనివాసరావు కదూ!అని పలకరించారు. ఆయన ఎవరో కాదు హాస్య సినీ బ్రహ్మ జంధ్యాల. బెజవాడ ఎస్సారార్ కాలేజీలో బీకాంలో క్లాసుమేటు. సినీ రంగంలో అడుగుపెట్టి బాగా పేరు తెచ్చుకుంటున్న రోజులవి. ఆయన అసలు పేరు జే.వీ.డీ.ఎస్. శాస్త్రి. ఆయన ఆ హోటల్లోనే దిగారుట. చాలా ఏళ్ళ  తరువాత కలిసిన మమ్మల్ని జంధ్యాల తమ రూముకు తీసుకు వెళ్లారు. వెళ్ళీ వెళ్ళగానే, మాతో వచ్చిన లాయరు గారు ఎలాటి మొహమాటం లేకుండా, కొత్త చోటని సందేహించకుండా ఒకసారి మీ బాత్రూం వాడుకోవచ్చాఅని అడుగుతూనే జవాబుకోసం ఎదురుచూడకుండా అందులో దూరిపోయి స్నానం చేసి బయటకు వచ్చారు. రావడం రావడమే ఆ గదిలో పరచిన తివాచీ పై తల కిందకు పెట్టి కాళ్ళు పైకి లేపి లిప్త మాత్రంలో శీర్షాసనంలో దర్శనమిచ్చారు. మా అందరికీ కళ్ళు తిరిగిపోయాయి. చిన్న తల, పెద్ద బొజ్జ, అంత భారీ కాయంతో ఆయన వేసిన ఈ ఆసనం చూసి జంధ్యాల కూడా నివ్వెర పోయారు. తరువాత వారిరువురి నడుమ సాగిన కవి పండిత చర్చ విని తీరాలి. అప్పటికే  ‘శంకరాభరణంసినిమాకి సంభాషణలు సమకూర్చిన జంధ్యాల విశ్వనాద్ గారిదే మరో సినిమా సప్తపదికి మాటలు రాస్తున్నారు. అనేకానేక అంశాలను స్పృశిస్తూ జరిగిన సంభాషణ నిజానికి ఇద్దరు పండిత శ్రేష్ఠుల మధ్య జరిగే వాదోపవాదాన్ని తలపించింది. ఏమాత్రం స్వరం పెంచకుండా, ఎదుటివారి వాదాన్ని పూర్వపక్షం చేస్తూ ఒకర్ని మించి మరొకరు అక్షర లక్షలు చేసే తర్కవిన్యాసాలు ప్రదర్శించారు. ధర్మాధర్మ విచక్షణకు సంబంధించిన వీటిలో కొన్నింటిని సప్తపదిసినిమాలో జంధ్యాల పొందుపరచినట్టున్నారు కూడా.
ఈ చర్చ సాగిన తీరు గమనిస్తే నాకు కాలేజీలో తెలిసిన శాస్త్రి, ఈ జంధ్యాల ఒకరేనా అన్న సందేహం కలిగింది. అంతటి పరిణతి ఆయనలో కనబడింది. ఆ రోజుల్లో జంధ్యాల ఒక్కడే మొత్తం కాలేజీలో కారున్న కుర్రకారు’. ప్రిన్సిపాల్ కూడా కాలేజీకి రిక్షాలో వస్తుంటే, జంధ్యాల మాత్రం సొంత కారులో వచ్చేవారు. సంధ్యారాగంలో శంఖారావంవంటి నాటకాలు రాస్తూ,వేస్తూ సరదాగా వుండేవారు. అలాటి జంధ్యాలలోని మరో కోణాన్ని ఢిల్లీలో చూడగలిగాను. అలాగే మా వెంట వచ్చిన లాయరు గారు. ఆయనకున్న విషయ పరిజ్ఞానాన్ని కళ్ళారా చూసి, చెవులారా విన్న తరువాత ఆయనపై వున్న దురభిప్రాయం దూదిపింజెలా ఎగిరిపోయింది. వినదగునెవ్వరు చెప్పినసూక్తిలోని  వాస్తవం మరోమారు  బోధపడింది.
మనం చెప్పిందే ఇతరులు వినాలన్న ఆత్రంలో యెంత నష్టపోతామో అర్ధం అయింది. సజ్జన సాంగత్యంలో వొనగూడే లాభం ఎరుకలోకి వచ్చింది.
ఇప్పుడు వారిద్దరూ లేరు. వారి జ్ఞాపకాలే మిగిలాయి. 
(అక్టోబరు 10,2010)      
NOTE: Courtesy Image Owner