13, అక్టోబర్ 2013, ఆదివారం

తురగా కృష్ణమోహనరావు అవార్డ్


తురగా కృష్ణ మోహన రావుగారు.
ఎందుకో ఆయన కూడా ఈ వేదిక మీద వున్నట్టే నాకనిపిస్తోంది. నిన్న పోతే రేపటికి మూడు అనుకునే ఈ పాడులోకంలో కృష్ణ మోహనరావుగారు చనిపోయి ఒకటా రెండా – మరో  ఒకటిరెండేళ్ళలో నలభై ఏళ్ళు కావస్తోంది. అయినా, ఇన్నేళ్ళ తరువాత కూడా  ఆయన్ని స్మరించుకుంటూ ఇంతమంది ఇక్కడకు వచ్చారంటే -  ఏ లెక్కన చూసుకున్నా – నా దృష్టిలో   ఆయన బతికున్నట్టే లెక్క. అంత గొప్ప మనిషి కాబట్టే ఆయన పేరుమీద ఇస్తున్న ఈ అవార్డ్ తీసుకోవడానికి గర్వపడుతున్నాను. అందుకే జానకీరాణి గారు ఫోను చేసి చెప్పినప్పుడు కాదనలేకపోయాను. కాకపొతే, ముసలితనంలో వసంతం అన్నట్టుగా రిటైర్ అయి ఎనిమిదేళ్ళు పూర్తి అవుతుంటే ఇప్పుడు ఉత్తమ జర్నలిస్టో, అలాటిదో ఈ  అవార్డ్ ఏమిటి చెప్పండి.  కానీ రేడియోలో పనిచేసిన మా బోంట్లకు జానకీరాణి గారంటే భయంతో కూడిన గౌరవం ఏం చేస్తాం? కాదనే ధైర్యం ఎక్కడిది ?
జానకీరాణి గారు అంటే గౌరవం. ఆవిడ వయస్సు కొంతా, ఆవిడ కలివిడితనం కొంతా కలిపి గౌరవం ఆవిడంటే. భయం దేనికంటే- నేనే గలగలా మాట్లాడుతానని అంతా అంటారు. జానకీరాణి గారు గలగలా మాత్రమే కాదు – దడ దడలాడిస్తూ దడదడా కూడా మాట్లాడతారు.
ఇక అసలు విషయానికి వస్తే – నేను చదువుకుండే రోజుల్లో ఆంధ్ర పత్రిక వారపత్రికలో ‘రాజధాని కబుర్లు’ అనే శీర్షిక వచ్చేది. ప్రవీణ్ అనే ఆయన రాస్తుండేవారు. ఆ రాసే విధానం నాకు బాగా నచ్చేది. ఎప్పుడయినా హైదరాబాదు వెడితే ఆయనగారిని కలవాలని అనుకునేవాడిని. ఆయన  అంటే ఎందుకో ఇష్టం. ఆయనే తురగా  కృష్ణ మోహన రావు గారని చాలాకాలం తరువాత తెలిసింది. నాకు వారితో మరో బాదరాయణ సంబంధం కూడా వుంది. కృష్ణ మోహన రావుగారు అకాల మృత్యువాత పడిన తరువాత వారు చేసిన రేడియో విలేకరి ఉద్యోగంలోకే నేను ప్రవేశించాను. అది చిన్న ఉద్యోగం కావచ్చు.  అయినా అంత పెద్ద మనిషి చేసిన ఉద్యోగం కాబట్టి నాకది పెద్ద ఉద్యోగమే.
కృష్ణ మోహన రావుగారు మంచి హాస్య రచయిత. అంటే నా అర్ధం మంచి హాస్యం రాస్తారని. ఆహ్లాదకరమైన హాస్యం రాస్తారని. ఆరోగ్యకరమైన హాస్యం రాస్తారని. ఆయన రచనలు  చదివిన అనుభవంతో నేను ఈ మాట  చెబుతున్నాను.
తురగా వారు చిలికించిన  హాస్యం లాంటి హాస్యం  ఈ నాటి సమాజానికి ఎంతో  అవసరం. జనంలో  ‘నవ్వు’ చచ్చిపోతోందేమో అని నాకు ఒక్కోసారి చచ్చేంత భయం వేస్తుంటుంది. నవ్వుతూ మాట్లాడేవాళ్ళతో మాట్లాడిచూడండి. కోపాలు తాపాలు మాయమైపోతాయి. బీపీలు గట్రా తగ్గిపోతాయి. దురదృష్టం ఏమిటంటే అలా నవ్వేవాళ్ళు, నవ్వించే వాళ్ళు  బాగా తగ్గిపోతున్నారు. ఇదొక విషాదం.
మరి ఏమిటి శరణ్యం. వుంది.  ఇదిగో కృష్ణ మోహనరావు గారు రాసిన ఈ ‘మాట కచ్చేరీ’ మొదలుపెట్టండి. పుస్తకం చదువుతూ మీరేమో ముసిముసినవ్వులు. ఆ నవ్వుల్ని చూస్తూ మీ ఆవిడ కూడా ‘ఏమిటీ నవ్వేది మా ఆయనేనా’ అని అనుమానంతో కూడిన నవ్వులు. ఇక ఆ ఇంట్లో ఒకటే నవ్వులవాన. మళ్ళీ మాట్లాడితే నవ్వుల తుపాన్.
ఒక విషయం నేను గట్టిగా చెప్పగలను.
ఈనాడు మనం అనుభవిస్తున్న అన్ని రకాల రుగ్మతలకీ నవ్వే చక్కటి ఔషధం. కాణీ ఖర్చులేని ‘ఆరోగ్య శ్రీ’
రేడియోలో పనిచేసే రోజుల్లో నా బల్ల మీద అద్దం కింద ఒక కాగితం మీద రాసిపెట్టుకున్నాను.
“మనిషి ఏడుస్తూ పుట్టేది నవ్వుతూ చనిపోవడానికి.”
పుట్టగానే ఏడిస్తేనే బతికినట్టు లెక్క. బతికివున్నప్పుడు నవ్వితేనే బతికున్నట్టు లెక్క. ఈ లెక్క కుదరాలంటే తురగా కృష్ణ మోహనరావు గారి రచనలు  చదవండి. వాటిని  ఆస్వాదించండి. అన్ని లెక్కలు, అన్ని తిక్కలు ఇట్టే కుదిరిపోతాయి.
ఎనీ డౌట్ ?  నాకయితే లేదు.
ఇది సగర్వంగా  నేనిస్తున్న సర్టిఫికేట్.



( ఈరోజు -13-10-2013- తురగా కృష్ణ మోహన రావు గారి పేరిట ఇచ్చిన అవార్డ్ స్వీకారం సందర్భంగా నా ప్రసంగ పాఠం)

దసరా పండుగ శుభాకాంక్షలు

మీ గృహ ప్రాంగణంలో - మీ హృదయాంగణంలో - దసరా పండుగ  శుభపరిమళాలు వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ - నిర్మలాదేవి, భండారు శ్రీనివాసరావు
  

12, అక్టోబర్ 2013, శనివారం

కొట్టిన చెయ్యే కోరు.......

  
కొట్టిన చెయ్యే  కోరుఅని పాత సినిమాలో ఒక పాట వుంది.
1973 లో స్వీడన్ లోని స్టాక్ హోం లో బ్యాంకు దోపిడీ జరిగింది. ఈ సందర్భంలో దోపిడీ దొంగలు కొంతమంది సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు. తమని చంపేస్తారేమోనని ముందు బందీలు భయపడ్డా దొంగలు వారిని ఏమీ చేయలేదు. బందీలుగా వున్న రోజుల్లో వారికీ వీరికీ నడుమ ఒకరకమయిన ఆత్మీయ బంధం ఏర్పడింది. ఆరు రోజుల తరువాత వారిని విడిచిపెడతామన్నా బందీలు అంగీకరించలేదు. పైపెచ్చు,  తమని బందీలుగా పట్టుకున్న దొంగలనే  వారు సమర్ధించారు. వారిపై పెట్టిన కేసు ఖర్చులను కూడా భరించడానికి  సిద్ధపడ్డారు. అంతేకాదు, బందీల్లో వున్న ఒక అమ్మాయి బందిపోటు దొంగల్లో ఒకడిపై మనసు పారేసుకుని అతడినే ఆ తరువాత మనువాడింది కూడా. ఈ రకమయిన మనస్తత్వానికి తదుపరి రోజుల్లో స్టాక్ హోం సిండ్రోంఅనే పేరు స్తిరపడింది.
ఈ విషయం గుర్తు చేసుకోవడానికి పూర్వరంగం ఒకటుంది.         
మేధావులు తమకు తెలిసింది చెబుతారు. సామాన్యులు తమ మనసులోని మాట చెబుతారు. సామాన్యుల  మాటలు -  రంగూ రుచీ వాసన లేని స్వచ్ఛమయిన నీరు మాదిరి’
ఒక టీవీ చర్చలో పాల్గొంటూ నేను చెప్పిన ఈ మాటతో  నాతోపాటు ఈ కార్యక్రమానికి హాజరయిన  మరో  విశ్లేషకుడు ఏకీభవించలేదు.
మేధావులు, చదువుకున్నవాళ్ళు - తమకున్న పరిజ్ఞానంతో,  'ఆ జ్ఞానం’ లేని వారికి విషయం విడమరచి చెప్పి  సరయిన తీరులో వాళ్ళు  కూడా ఆలోచించేలా చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు. కాకపోతే మా ఇరువురి నడుమా ఈ  సంభాషణ బ్రేక్టైం లో సాగింది.
ఆయన అభిప్రాయం కూడా కొట్టిపారేసేది కాదు. కాని మేధావి అంటే ఎవరు? ఒక మేధావి చెప్పింది మరో మేధావి ఒప్పుకునే పరిస్తితి వుందా? అలా వుంటే మేధావి ఎలా అవుతాడు?
సరే! మా సంభాషణ సాగుతుండగానే లైవ్ షో మొదలయింది. నా అభిప్రాయాన్ని సమర్ధించుకుంటూ నేను ఓ అనుభవాన్ని ఉదహరించాను.
ఎనభయ్యవ దశకం ఆఖరులో నేను మాస్కోలో వున్నప్పుడు టీవీలో ఒక టాక్ షో చూసాను. భాష అర్ధం కాకపోయినా భావం అర్ధం అయ్యేలా ఆ షో నడిచింది. ఆ టాక్ షోలో పాల్గొనాల్సివున్న పెద్దమనిషి సమయానికి రాకపోవడంతో అక్కడ పనిచేసే లైట్ బాయ్ ని పెట్టి ఆ షో నడిపిస్తారు. అతడు దాన్ని యెంత సమర్ధంగా నడిపిస్తాడంటే ప్రేక్షకులు అతడికి బ్రహ్మరధం పడతారు. అవకాశం వచ్చినప్పుడు సామాన్యులు కూడా తమలోని ప్రతిభను బయట పెడతారని అతగాడు రుజువు చేస్తాడు.
ఇది చెప్పి, టీవీ ఛానళ్ళవాళ్లు కూడా సామాన్యుల అభిప్రాయాలతో కార్యక్రమాలు రూపొందిస్తే జనసామాన్యం అభిప్రాయాలు మరింత బాగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని  నా అభిప్రాయం వెల్లడించాను.
అసలింతకీ విషయం  ఏమిటంటే, సమాజంలో నానాటికీ విస్తరిస్తున్న అవినీతి భూతాన్ని  సామాన్యులు  అంతగా పట్టించుకోవడం లేదని, వారి నిర్లిప్తత వల్ల ఎంతో అనర్ధం జరుగుతుందని ఈనాడు అనేకమంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో వారిని జాగృతం చేయాల్సిన బాధ్యత వివేకులు, విజ్ఞానులు, మేధావులు తీసుకోవాలని వారి డిమాండు. అయితే, ఇతరులని అవినీతిపరులని ముద్ర వేస్తున్న వాళ్లు సయితం  ఏమీ తక్కువ తిన్నవాళ్ళు కాకపోవడం వల్లనే  ప్రజలు అవినీతిపట్ల అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న సంగతిని వాళ్లు మరచిపోతున్నారేమో అనిపిస్తున్నది. ఆరోపణలు చేసేవారికి విశ్వసనీయత అడుగంటడమే ఈ పరిస్తితికి దారితీసింది. అందరూ అవినీతిపరులే అన్న భావన ప్రజల్లో ప్రబలిన తరువాత ఈ నీతివాక్యాలు వారి చెవులకు సోకడం లేదు.
రాజకీయాల్లో వున్నవారు ఓ పదవికి ఆశపడితే అది ధర్మం. సామాన్యులు వోటు కోసం ఏదయినా కోరుకుంటే అది అధర్మం. కనీస అవసరాలు కనుక్కునేవారికి మద్దతుగా నిలబడితే బిస్కెట్లకుఆశపడేవారిగా ముద్ర.  రాజకీయులు ఏదయినా ఓ పార్టీకి కొమ్ముకాస్తూ తమ పనులు చక్కబెట్టుకుంటే అది నైతికత. సమాజం మొత్తం అవినీతిరహితంగా వుంచగలిగితే అందరూ సంతోషిస్తారు. అంతేకాని పక్కవానికి చెప్పేటందుకే నీతులు వున్నాయి అని అంటే కుదరదు అన్నది వారి వాదంగా కనబడుతోంది.   
పూర్వం ఓ మహారాజు పెద్దమనసుతో ప్రతిరోజూ అన్నార్తులకు అన్నదానం చేస్తుండేవాడు. ఎంతో పుణ్యం చేసుకుంటూ స్వర్గంలో మంచి స్థానాన్ని ఇప్పటినుంచే సంపాదించుకుంటున్నాడని అంతా వేనోళ్ళ చెప్పుకునేవారు.అయితే అలా దానం చేస్తున్న అన్నం, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎంగిలిఅవుతోందన్న విషయం ఆ రాజు గారికి తెలియదు. కాని ఈయనగారు ఇలా నిత్యాన్నదానం కొనసాగిస్తూవుంటే, మరో పక్క నరకంలో ఆ ఎంగిలి కూడుఓ కొండలా పెరగడం మొదలయింది. త్రిలోక సంచారి అయిన నారదుడు ఈ కొండ విషయం గమనించి ఆ విషయాన్ని భూలోకానికి వచ్చినప్పుడు ఆ రాజుగారి చెవిన వేసాడు. రాజు కంగారు పడిపోయి తరుణోపాయం కోరాడు. అప్పుడు నారదుడు ఇచ్చిన సలహా రాజుగారికి నచ్చకపోయినా గత్యంతరం లేక అమలు చేసాడు. నారద ముని సూచన మేరకు ఓ ఒంటిస్థంభం మేడ కట్టించి అందులో యుక్తవయస్సులో వున్న తన ఏకైక కుమార్తెను ఒంటరిగా  వుంచాడు. ప్రతిరోజూ సాయం సంధ్యవేళలో  ఆ భవనానికి వెళ్లి కుమార్తె పడకగది బయట తెల్లవారేవరకు ఆమెకు తెలియకుండా గడిపి తిరిగి రాజభవనం చేరుకునేవాడు. రాజుగారి ఈ వ్యవహారం ఆ నోటా ఈనోటా పడి చివరకు ప్రజలు చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. సొంత కుమార్తెతో రాజు గారికి అక్రమ సంబంధం అంటగట్టి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. భూలోకంలో  రాజుగారికి వ్యతిరేకంగా అపనిందల ప్రచారం పుంజుకుంటున్నకొద్దీ అక్కడ నరకంలో రాజుగారి ఎంగిలి కొండక్రమంగా తరిగిపోవడం మొదలయింది.
త్రిలోక పూజ్యుడయిన నారద మునీంద్రులు రాజుగారి పాప ప్రక్షాళన కోసం ఇచ్చిన సలహా మహిమ  అది.            

మాదోరి పాప. ఆదోరి  బయ్యాలిఅని కన్నడంలో ఒక సూక్తి. అంటే ఒకరు చేసిన పాపాన్ని వేరొకరు అదేపనిగా చెబుతుంటే ఆ పాపంలో వాటా వాళ్ల ఖాతాలోకి కూడా చేరుతుంది. 

11, అక్టోబర్ 2013, శుక్రవారం

వినుడు వినుడు ........



చిన్నప్పుడు చదివిన ముళ్ళపూడి వారి జోక్ గుర్తొస్తోంది.
"పెళ్ళయిన కొత్తల్లో పెళ్ళాం మాట మొగుడు వింటాడట.

తరవాత్తరవాత - మొగుడి మాట పెళ్ళాం వింటుందట. 
పోతే, ఆ తరవాత మాత్రం - ఆ ఇద్దరి మాటలు ఇరుగూ పొరుగూ వింటారట." 

ఈ వినడం అన్నది చెవికి సంబంధించిన విషయం. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే పోలా - అనే చెవలాయిలు- ‘వినదగునెవ్వరు చెప్పిన’ అని- ఎవరేది చెప్పినా చెవులు రెండూ వొగ్గించి, రిక్కించి మరీ వింటారు.

కొందరు భార్యలు - " నా (మా) మొగుడు నా (మా) మాట వింటాడు " అన్న తృప్తిలో అన్ని అసంతృప్తులు మరచిపోతుంటారు. మగవాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి, మాట వినే పెళ్ళాం దొరికిందని బయట చెప్పుకుంటూ, మురిసి ముక్కచెక్కలవుతూ మగధీరులమని మీసం మెలేస్తుంటారు. 

వినికిడి సమస్య అంటూ లేకపోతె, ఈ వినకపోవడం అన్న ప్రసక్తే వుండదు. ఆ సమస్య వుంటే ఈ వినే సమస్యకు తావుండదు. ఎంచక్కా, ఎవరేం చెబుతున్నా వింటున్న ఫోజు పెట్టి- చెప్పేవాళ్ళ నోటి దురద వొదిలించవచ్చు.
విని, తలాడించే అలవాటు మగవాళ్ళలో ముఖ్యంగా పెళ్ళయిన వాళ్లలో ఎక్కువన్న థియరీ ఒకటుంది. ఈ బాపతు మగాళ్ళు ఆ బాపతు అపప్రధ వొదిలించుకోవడానికి ఆదర్శ పురుషుల అవతారం ఎత్తుతుంటారు. " భార్య మాట వింటే తప్పేమిటి? ఆవిడా మనలాంటి మనిషే కదా." అంటూ తమకి తాము సర్ది చెప్పుకుంటారు.

కాగా మరో రకం మగాళ్ళు- తమ మగాడితనాన్ని - వేరే రకంగా ప్రదర్శిస్తుంటారు. 

" నన్నడిగితే అసలు మగాళ్ళ మాటల్ని ఆడవాళ్ళు వినకపోవడమే కాదు, ఎదిరించమని కూడా చెబుతాను. నా విషయమే తీసుకోండి. మామూలుగా మొగుళ్ళు రాగానే భార్యలు లేచినిలబడడం ఆనవాయితీ కదా. మా ఇంట్లో అలా కాదు. నేను బయట నుంచి రాగానే మా ఆవిడ లేచి నిలబడబోతుంది. పరవాలేదు కూర్చో అంటాను. నా మాట వినొద్దన్నది మా ఇంట్లో నా రూలు కాబట్టి లేచి నిలబడుతుంది. చూసారా! అదీ నేను నా భార్య కిస్తున్న స్వేఛ్చ." అంటుంటారు ఈ కోవలోకి వచ్చే మొగుళ్ళు. 


బొత్తిగా మాట వినని జనం -జనాభాలో ఎక్కువ. వీళ్ళని 'సీతయ్యలు' అంటారని కూడా ఈ మధ్యనే తెలిసింది - ఓ సినిమా పుణ్యమా అని.

పొతే,వినడం వినకపోవడం అన్న రూట్లో ముందుకుపోయే పని కాసేపు పక్కనపెడదాం.

హైదరాబాద్ ఆలిండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీ పీ ఎస్ గోపాల కృష్ణ -'విన్నవింత' అనే శీర్షికతో రేడియో లో ఒక కార్యక్రమం కొన్నాళ్ళు నడిపారు. విన్న వింతలను శ్రోతలతో పంచుకోవడం రచయిత ఉద్దేశ్యం. అయితే వినేవారికి పెద్దపీట వేసే పెద్ద మనసు వున్నవాడు కనుక, విన్నవించుకోవడం అనే అర్థంతో దానికి "విన్నవింత" అని పేరు పెట్టారు.

మా బోటి రేడియోలో పనిచేసిన వాళ్లకి వినే వాళ్ళే 'దేవుళ్ళు' కాబట్టి , పొద్దునపూట వచ్చే ఆ ప్రోగ్రాం వాళ్ళకో 'నివేదన' గా భావించే వాళ్ళం. ఆయన చెప్పే వన్నీ మంచి విషయాలే కాబట్టి , ఆ రోజుల్లో శ్రోతలు కూడా మంచి సంగతులు వినే బాపతు కాబట్టి- ఆయన కూడా రకరకాల పనికొచ్చే కబుర్లతో దాన్ని తీర్చిదిద్దేవారు.(ఇన్ని కా'బట్టీలు' అవసరమా అంటే- ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పకపోతే రేడియో వాళ్లకి తెలుగు రాదు అని అపోహపడే ప్రమాదం సయితం లేకపోనూ లేదు) . శ్రోతలు కూడా 'రేడియోలోచెప్పడమేమిటి? మనం వినడమేమిటి?' అని భేషజాలకు పోకుండా బుద్దిగా వినేవారు. ఆ విధంగా చెప్పేవారికి వినేవారు, వినేవారికి చెప్పేవారు లేరనే కరువు లేకుండా పోయింది. ఆ మాటకు వస్తే ఆ రోజుల్లో రేడియోలో ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఎన్నో వినేవాళ్ళం అని గుర్తు చేసుకునే ఆనాటి శ్రోతలు ఈ రోజుల్లో కూడా తారసపడడం కద్దు.
మళ్ళీ అసలు సంగతికొస్తే-
'వినంగానే సరిపోదు- విన్నది ఆచరించాలనీ - అప్పుడే విన్నదానికి సార్ధకత' అనే వాళ్ళున్నారు.

'ఒరేయ్ కన్నా! మోటార్ సైకిల్ పై అంత స్పీడ్ గా వెళ్లకురా!' అని తండ్రి అంటే- పిల్లాడు విన్నట్టుగా తలాడిస్తే - నిజానికి అది వినడం కిందికి లెక్క రాదు.

విని పాటించినప్పుడే - 'రాముడు మంచి బాలుడు, తలిదండ్రుల మాట జవదాటడు' అని కన్నవాళ్ళు - వినే వాళ్లకు చెప్పుకునే వీలుంటుంది.

వినడంలో ఇంత విషయం వుంది కాబట్టే- నోములు, వ్రతాలు చేసేటప్పుడు వ్రత కధలు విన్నవాళ్ళకు కూడా 'వ్రత ఫలం' లో భాగం కల్పించారని - సూతుడు శౌనకాది మునులకు చెప్పగా-అది విన్నవాళ్ళలో ఒకడు తెలియచేయడమైనదని సర్వజనులకు ఇందుమూలముగా తెలియపరచడమైనది. 

9, అక్టోబర్ 2013, బుధవారం

తెలుగు సినీ నటుడు శ్రీహరి మరి లేరు



మంచి నటుడు, మంచి మనసున్న నటుడు శ్రీహరి మరి లేరు. కేవలం 49 ఏళ్ళ చిన్న వయస్సులోనే ముంబై లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కాలేయ వ్యాధికి చికిత్స తీసుకుంటూ కన్ను మూశారు.






8, అక్టోబర్ 2013, మంగళవారం

ఎందుకిలా జరిగింది? ఎవరిలా చిదిమేశారు?

(ఈరోజు హెచ్.ఎం.ఆర్.ఐ. ఆవిర్భావదినం సందర్భంగా)
కారణం ఎవరయినా జరగరానిది జరిగిపోయింది. మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా నిలవాల్సిన ఓ అద్భుత పధకం కొందరి నిర్వాకాలకు నీరుకారిపోయింది. మరి కొందరి స్వార్ధాలకు బలయిపోయింది. ఇంకొందరి ఆహాలను చల్లార్చడానికి మాడి మసయిపోయింది. రాజకీయ చదరంగంలో చిక్కుకుపోయి  ఎత్తులు పైఎత్తులకు  చిత్తయిపోయింది.
ఇంత జరిగినా ఏమీ జరగనట్టే వుండడానికి కారణం వుంది. ఈ పధకం వల్ల లబ్ది పొందుతున్న వారు నిరుపేదలు. వారికి నోరూవాయీ లేదు.
కష్టం వచ్చినా చెప్పుకోలేరు. ఆ కష్టం తొలగినా చెప్పుకోలేరు. ఎందుకంటె చెప్పుకోవడానికి వారికెవరూ లేరు.
వారి గురించి రాసేవారు లేరు. ఎందుకంటె వారిలో చాలా మంది నిరక్షరాస్యులు.
వారి గురించి బుల్లి తెరలపై చూపించేవారు లేరు. ఎందుకంటె అలాటి ఆధునిక సౌకర్యాలకు దూరంగా ఎక్కడో బతుకులీడుస్తున్న బడుగులు వాళ్ళు. అందుకే, ప్రచారానికి పనికిరాని  ఈ పధకం నీరుకారిపోతున్నా ఎవరికీ పట్టలేదు.  
అరయంగా కర్ణుడీల్గె ఆర్గురి చేతన్అన్నట్టు  భ్రష్టుపట్టిపోతున్న ఈ పధకం గురించి తెలుసుకోవాలంటే కొంత నేపధ్యం అర్ధం చేసుకోవాలి.
ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తోంది.ఇందులో సింహ భాగం నిర్వహణ వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కొంత మేరకు ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను తీరుస్తున్నప్పటికీ- డాక్టర్ల కొరత అన్నది ఎప్పటికీ తీరని సమస్యగానే మిగిలిపోతున్నది. మన రాష్ట్రంలో ఎనభయి వేల గ్రామాలుంటేకేవలం పదిహేను వందల చోట్ల మాత్రమే వైద్యులు అందుబాటులో ఉన్నారు. వైద్య కళాశాలలో పట్టా పుచ్చుకున్న ఏ ఒక్కరు కూడా పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి సిద్దంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా వున్న పల్లెల్లో నివసించే వారికి ఈ అరకొర సదుపాయం కూడా అందుబాటులో లేదు. నాటు వైద్యుల దయా దాక్షిణ్యాల పైనా, వారిచ్చే నాటు మందుల పైనా  ఆధారపడాల్సిన దీన స్తితి వారిది. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా అరణ్య ప్రాంతాలలో - అంత సులువుగా చేరుకోలేని కోయ గూడాలులంబాడి తండాల్లో వుండే పేద వారికి రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాటివారు సాధారణంగా షుగరురక్త పోటుఉబ్బసంకీళ్ళ వ్యాధులతో బాధపడుతుంటారు. అసలు ఇలాటి జబ్బులు తమకు వున్నట్టు కూడా వీరికి తెలియదు. ఎందుకంటె ఎలాటి వైద్య పరీక్షలు ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి  ఏపక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీవున్నట్టు కూడా తెలియదు.

వైద్య ఆరోగ్య శాఖ ఎన్ని నిధులు ఖర్చుచేస్తున్నా ఫలితాలు ఆశాజనకంగా వుండడం లేదు. ఈ శాఖ పేరులో వైద్యం ముందు ఆరోగ్యం తరువాత వున్నాయి. వైద్యం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడడం అనే అర్ధం వుంది. అసలు ప్రజలు ఆరోగ్యంగా వుంటే వైద్యంతో నిమిత్తం ఏముంటుంది. ఇదిగో ఈ ఆలోచనలోనుంచి పురుడు పోసుకున్నదే 104 పధకం.


అప్పటికే - ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం ప్రాతిపదికన ఏర్పాటయిపనిచేస్తున్న -104- ఉచిత వైద్య సలహా కేంద్రం నిర్వాహకులు - హె చ్ ఎం ఆర్ ఐ (హెల్త్ మానేజిమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) వారు ఈసమస్యపై దృష్టి సారించారు. అందుబాటులో వున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు కిలోమీటర్ల ఆవల వుండే ప్రతి పల్లెకు- నెల నెలా క్రమం తప్పకుండా వెళ్లి - వూరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించే వాహనానికి రూపకల్పన చేశారు. 108 అంబులెన్సు ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినదయితే ఈ 104 సంచార వైద్య వాహనం - పేద పల్లె ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది. ఇంతా చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే- ఒక్కొక్కరిపై పెట్టె ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే - వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.
 104 వాహనం ప్రతి నెలా ఒక నిర్దేశిత దినం నాడు క్రమం తప్పకుండా ఒక గ్రామాన్ని సందర్శిస్తుంది. ఇందులో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ముగ్గురు ఏ ఎన్ ఎం లు(నర్సులు)ఒక ఫార్మసిస్టుఒక లాబ్ టేక్నీషియన్ఒక డ్రయివర్తో సహా మొత్తం ఏడుగురు సిబ్బంది వుంటారు. బయో మెట్రిక్ పద్దతి ద్వారా రోగుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. గర్భిణీ స్త్రీలనుబాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు. గర్భిణి కడుపులో పిండం పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు సూచిస్తారు.అవసరమని భావిస్తే,108 అంబులెన్సుకి ఫోన్ చేసి రప్పించి ఆసుపత్రిలో చేర్పిస్తారు.రక్త పోటుషుగర్ ఉన్నవారికి నెలవారీగా చేయాల్సిన రక్త పరీక్షలు ఇతర పరీక్షలు నిర్వహిస్తారు.
నిజానికి ఇలాటి వారందరూ ప్రతినెలా పరీక్షలు చేయించుకుని  మందు మోతాదులు మార్చుకుంటూ వుండాలి. బస్తీల్లో వున్నవాళ్ళే ఈ విషయాల్లో అశ్రద్ధ చేస్తుంటారు. పల్లె ప్రజల సంగతి చెప్పేది ఏముంటుంది. కనుకే ఈ వాహనం ప్రతినెలా ఒక నిర్దిష్ట దినం నాడు విధిగా ఆయా గ్రామాలకు వెడుతుంది. ఖచ్చితంగా వస్తుందని తెలుసుకనుక రోగులు కూడా శ్రద్ధగా పరీక్షలు చేయించుకుంటారు. మందులు వాడతారు. ఫలితంగా చిన్న చిన్న  శారీరక రుగ్మతలు  అలవికాని పెద్ద పెద్ద రోగాలుగా మారవు. ప్రజలు ఆరోగ్యంగా వుంటే వైద్యం అవసరమే వుండదు. అప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ఆరోగ్య వైద్య శాఖగా మారుతుంది.
ఇంత చక్కటి పధకం కార్య రూపం ధరించేసరికల్లా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఒక్కమారుగా మారిపోయాయి. ప్రాధాన్యతలు మారాయి. రాజకీయ నిర్దేశకత్వం కొరవడడంతో అధికారులు తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. ఈ మాత్రం దానికి స్వచ్చంద సంస్థల ప్రమేయం యెందుకు మనమే చేస్తే పోలా అనుకున్నారు. కొందరు సిబ్బంది కూడా వారికి సహకరించారు. ప్రభుత్వమే నిర్వహిస్తే తాము కూడా ప్రభుత్వ సిబ్బందిగా మారతామని ఆశ పడ్డట్టున్నారు. సమ్మెలు చేశారు. ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు మందగించింది. ఏతావాతా జరిగిందేమిటంటే  ప్రజలకు మేలు చేసే ఒక మంచి పధకం అటకెక్కింది. అటకనుంచి దించామంటున్నారు సర్కారువారు. దించినా పధకం మొదలు పెట్టిన నాటి చిత్తశుద్ధి యెంత మిగిలి వున్నదనేదే జవాబు దొరకని ప్రశ్న. 
(08-10 - 2013)

6, అక్టోబర్ 2013, ఆదివారం

నా గురించి నలుగురూ - 5 (ఆఖరి భాగం)

నా గురించి డి.వెంకట్రామయ్య గారు - 5
“నా ఉద్యోగం న్యూస్ రీడర్ అయినప్పటికీ ఓసారి న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావు గారు (ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ వద్ద ప్రెస్ సెక్రెటరీగా వున్న మల్లాది కృష్ణానంద్ అన్నగారు) నన్ను పిలిచి ‘ మాస్టారూ ఎన్నాళ్ళని ఇక్కడ కూర్చుని న్యూస్ బులెటిన్లతో కుస్తీ పడతారు. మధ్యమధ్య  రిపోర్టింగ్ కు వెళ్ళి వస్తుండండి. రేపు ఉదయం అసెంబ్లీకి వెళ్ళండి’ అన్నారు. అవి శాసన సభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నరోజులు. నేను ఉదయం వెళ్ళే సరికే అసెంబ్లీలో ‘QUESTION HOUR’  నడుస్తోంది. అప్పట్నించి భోజన విరామానికి సభ వాయిదా పడేవరకు మూడు నాలుగు గంటలపాటు అక్కడే కూర్చున్నాను. ఛాతీలో కాస్త నొప్పిగా వున్నట్టు అనిపించింది కాని పట్టించుకోలేదు. ఆఫీసుకు వచ్చి రిపోర్ట్ రాస్తుండగా నొప్పి మరికాస్త పెరిగింది. ఛాతీ ఎడమ వైపు నుంచి భుజానికి ఏదో సర్రున పాకినట్టనిపించింది. వొళ్ళంతా ముచ్చెమటలు పోశాయి. శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా వుంది. ఇక నా వల్ల కాదని అర్ధమై పోయింది. ‘వొంట్లో బాగాలేదు. ఇంటికి పోతున్నాన’ని రామారావు గారికి చెప్పేసి వెళ్ళిపోయాను. అవేళలో అంత  త్వరగా వచ్చిన నన్ను చూసి మా ఆవిడ ఆశ్చర్యపోయింది. ‘ఏమిటిలా వచ్చారు. ఏమైంది మీకు వొంట్లో ఎలావుంది’ అని కంగారు పడడం మొదలు పెట్టింది. విషయం చెబితే డాక్టరు దగ్గరకు వెడదామని హడావిడి చేస్తుందని పొడి పొడిగా నాలుగుముక్కలు చెప్పి ‘ఏమీ వద్ద’ని కసరి అలాగే పండుకున్నాను.
“ఎన్నడూ లేనిది ఆవిధంగా పని మధ్యలో వొదిలేసి వెళ్ళిపోయానని తెలిసి శ్రీనివాసరావు, జ్వాలా నరసింహారావూ (వీరిద్దరినీ జంట కవులనేవారు. నిద్రపోయేటప్పుడు తప్ప ఎప్పుడూ కలిసేవుండేవారు) ఆ సాయంత్రం మా ఇంటికి విషయం కనుక్కుందామని  వచ్చారు. నేను చెప్పేది  వినిపించుకోకుండా డాక్టర్ మనోహరరావు (శ్రీనివాసరావు మేనల్లుడు) దగ్గరకు తీసుకువెళ్ళారు. తరువాత డాక్టర్ గారిని కూడా వెంటబెట్టుకుని గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్ళి అందులో చేర్పించారు. ‘ANGINA PECTORIS’  అనే హృదయ సంబంధమైన రుగ్మత వల్ల నాకలా అయిందని నిర్ధారించిన వైద్యులు రెండు రోజులపాటు ఐ సీ యూ లోనే వుంచి ఆ తరువాత ఇంటికి పంపారు. మరునాడు కాబోలు జ్వాలా నరసింహారావూ. శ్రీనివాసరావు సతీ సమేతంగా మా ఇంటికి వచ్చారు.
మాటల మధ్య మా ఆవిడ శ్రీనివాసరావుతో – ‘ ఆరోజు మీరు దేవుడల్లే వచ్చి ఆసుపత్రిలో చేర్పించార’ని  ఏదో  చెప్పబోతుంటే ఆయన తన మామూలు తరహాలోనే ‘ఈ ఇంట్లో దేవుడు అనే మాట వినడం విచిత్రంగా వుంది’ అన్నారు చిరునవ్వుతో.
నా నాస్తికత్వం మీద ఆయన విసిరిన వ్యంగ బాణం అది.
ఇలా అన్ని సందర్భాలలో నవ్వుతూ నవ్విస్తూ వుండే ఈ మనిషి ఎప్పుడయినా కంట నీరు పెట్టుకుంటాడా అనిపించేది. అదీ చూశాను. నేను రిటైర్ అయినప్పుడు జరిగిన వీడ్కోలు సభలో నా గురించి మాట్లాడబోయి, మాటలు పెగలక కంట తడిపెట్టారు.”
(అయిపోయింది)


(శ్రీ డి.వెంకట్రామయ్య వీడ్కోలు సభ)


(ఆకాశవాణిలో నా అనుభవాలు – శ్రీ డి వెంకట్రామయ్య, ‘రచన’ అక్టోబర్, 2013 సంచిక నుంచి – రచన సంపాదకులు శాయి గారికి కృతజ్ఞతలు)