17, మే 2013, శుక్రవారం

లెనిన్ సమాధి పునరుద్ధరణ



(17-05-2013  తేదీ ‘ఈనాడు’ దినపత్రిక, మూడో పేజీ)
“మాస్కో: రష్యా విప్లవ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ సమాధిని పునరుద్ధరణ అనంతరం ప్రజల సందర్శనార్ధం బుధవారం నుంచి మళ్ళీ తెరిచారు. నీటి తాకిడి కారణంగా సమాధి పునాది దెబ్బతినడంతో సమాధి అంతర్భాగంలో సిమెంట్ వేసి పటిష్ట పరిచారు. లెనిన్ అవశేషాలను కదల్చకుండానే ఈ పనులను పూర్తిచేశారు. గత 80 ఏళ్లలో సమాధికి ఇలాటి మరమ్మతులు చేయడం ఇదే మొదటిసారి. లెనిన్ భౌతిక కాయాన్ని అక్కడినుంచి తరలించి శాశ్వితంగా ఖననం చేయాలనే చర్చ రష్యాలో కొనసాగుతోంది. రష్యా కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం ఈ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.”
ఇదీ వార్త. ఇది చదవగానే ఎనభయ్యవ దశకం చివర్లో నేను మాస్కోలో వున్న రోజులు, ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ రాసిన ‘మార్పు చూసిన కళ్ళు’ అనే నా పుస్తకంలో లెనిన్ గురించిన ప్రస్తావన మనస్సులో మెదిలింది. ఆ రోజులు గురించి ఆసక్తి కలిగిన వారికోసం మరోసారి ఆ భాగాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.          
మార్పు చూసిన కళ్ళు – భండారు శ్రీనివాసరావు 

(కింది ఫోటోలో మంచు దారిలో లెనిన్ సమాధిని చూడడానికి బారులు తీరిన జనం - ఆ ముందు రష్యన్ పోలీసుల దాపున  మా పోరుగింటావిడ శ్రీమతి సరోజారామకృష్ణతో మా ఆవిడ శ్రీమతి నిర్మల -ఎనభైల్లో తీసిన ఫోటో)   


లెనిన్ సమాధి
1924 జనవరి 21 వ తేదీన సోవియట్ వ్యవస్థ  నిర్మాత,  అక్టోబర్ విప్లవ సారధి అయిన   వ్లాదిమిర్ లెనిన్ మరణించారు. స్టాలిన్ ఆదేశాలపై  ఆయన  శరీరాన్ని రసాయనిక ప్రక్రియల  ప్రకారం   భద్రపరచి ప్రత్యేకంగా నిర్మించిన మసోలియంలో  ప్రజల సందర్శనార్ధం వుంచారు. ఆ రోజుల్లో ఈ సమాధి చెంత సైనికులు  నిర్వహించే గార్డ్ ఆఫ్ ఆనర్ (గౌరవ సూచకమయిన కవాతు)ని చూడడానికి జనం ఎగబడేవారు. సుశిక్షితులయిన సైనికులు, చేతుల్లో తుపాకులతో మసోలియం ప్రధాన ద్వారం వద్ద  పోతపోసిన విగ్రహాల్లా నిలబడివుండేవారు. విధి నిర్వహణ సమయం ముగిసిన తరువాత  వారినుంచి బాధ్యతలు  స్వీకరించడానికి వచ్చిన వారి సహచరులు మరబొమ్మల మాదిరిగా కవాతు చేస్తూ వచ్చేవారు. కనుమూసి తెరిచేటంతలో వారి స్థానాలకి వీళ్ళు, వీళ్ళ స్థానాలలోకి వాళ్లు తటాలున మారిపోయే దృశ్యాన్ని రెప్పలార్పకుండా చూడడానికి సందర్శకులు చలినీ, మంచునీ లెక్కచేయకుండా అధిక సంఖ్యలో గుమికూడేవారు.
సోవియట్ యూనియన్  విచ్చిన్నం తరువాత  ఏర్పడ్డ  కమ్యూనిస్టేతర ప్రభుత్వాలు  ఈ సైనిక కవాతుకు స్వస్తి చెప్పాయి. అంతేకాదు,  రష్యన్ ప్రభుత్వం 1991 నుంచి  లెనిన్  మసోలియం నిర్వహణ వ్యయంకోసం ఇచ్చే  నిధులను నిలుపుచేసింది కూడా.  తదాదిగా,   అభిమానుల విరాళాలతోనే   నెట్టుకు వస్తున్నారు.
మసోలియం తెరిచి వుంచే  సమయాన్ని కూడా  బాగా తగ్గించారు. అయినా సందర్శకుల  సంఖ్య  తగ్గలేదు. భద్రతా కారణాల రీత్యా,  రెడ్ స్క్వేర్ లోకి ప్రజలను అనుమతించడంపై తరచుగా విధిస్తున్న  ఆంక్షల  వల్ల కూడా  లెనిన్ మసోలియం  సందర్శన  అనేది ఇప్పుడంత సులువయిన వ్యవహారంగా లేదు.
గత ఎనభై ఎనిమిది ఏళ్లుగా మసోలియంలో లెనిన్ శరీరాన్ని భద్రపరుస్తూ వస్తున్న తీరే  అపూర్వం. ఇన్నేళ్ళ నుంచి,  క్రమం తప్పకుండా ప్రతివారం  నిపుణులు లెనిన్ పార్ధివ  శరీరాన్ని  ప్రత్యేకించి చర్మాన్ని  చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. చర్మం ఏమాత్రం పొడిబారకుండా తగిన  జాగ్రత్తలు తీసుకుంటారు.
పద్దెనిమిది నెలలకు ఒక పర్యాయం లెనిన్ కాయానికి   రసాయనాలతో  ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు.  ఇందుకోసం రెండు నెలలపాటు సమాధిని మూసివేస్తారు. ఆ సమయంలో  లెనిన్ భౌతికకాయాన్ని నెల రోజులపాటు ప్రత్యేక ద్రావణంలో ముంచి వుంచుతారు. చర్మం నెమ్మదినెమ్మదిగా ఆ ద్రావణాన్ని పీల్చుకుని మళ్ళీ సరయిన రీతిలో  తేమను పొందేలా చేయడం ఈ శుద్ధి తతంగం  ఉద్దేశ్యం.
డాక్టర్ ఇల్యా  జబ్రస్కీ అనే 90 సంవత్సరాల  నిపుణుడు 1934 నుంచి   1952 వరకు లెనిన్ భౌతిక కాయాన్ని కనిపెట్టుకుని వున్నవారిలో  వున్నారు.   ఆయన తండ్రి బోరిస్, 1924 లో లెనిన్ మరణించినప్పుడు ఆయన  శరీరాన్ని భవిష్యత్ తరాలకోసం భద్రపరచిన తొలి బృందంలో పనిచేశారు.
ఈ డాక్టర్  చెప్పేదాని ప్రకారం లెనిన్ భౌతిక కాయంలో పైకి కనిపించే చర్మం తప్ప వేరే శరీర భాగాలు ఏవీ లేవు.  మొదటిసారి  ఎమ్బాల్మింగ్ (రసాయనిక పూత) చేసినప్పుడే వాటినన్నింటినీ  తొలగించారు. కాకపొతే కనుబొమలు,  మీస కట్టు, తల వెండ్రుకలను మాత్రం  యధాతధంగా వుంచేశారు.
పోతే,  లెనిన్ శరీరాన్ని మసోలియం నుంచి తొలగించి వేరేచోట ఖననం చేయాలన్న డిమాండ్ ఇటీవలి కాలంలో పెరుగుతూ వస్తోంది. ఈ విషయంపై  ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిపారు. యాభయ్ ఏళ్ళకంటే  తక్కువ వయసున్న రష్యన్లలో అరవై శాతం మంది ఈ ప్రతిపాదనను బలపరుస్తూవుండడం విశేషం. లెనిన్ ని ఆరాధ్య దైవంగా కొలుస్తున్న రోజుల్లో కూడా ఒకసారి మసోలియం నుంచి లెనిన్ భౌతిక కాయాన్ని  తొలగించి  సైబీరియా ప్రాంతానికి తరలించారు. కాకపొతే, ఆ  కారణం వేరు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో  నాజీల నుంచి  బాంబు దాడి ముప్పు వుండగలదన్న భయంతో ఆ పని చేశారు.
‘లెనిన్ మసోలియం నుంచి ఆయన  శరీరాన్ని  తొలగించాలి. ఆ ప్రదేశాన్ని ఒక ఆరాధనీయ స్థలంగా పరిగణించడాన్ని ఇక యెంతమాత్రం అనుమతించకూడదు’  అనేవారి సంఖ్య  ఇప్పుడు ఆ దేశంలో  క్రమంగా పెరుగుతోంది.  నిజానికి లెనిన్ కూడా తన తదనంతరం  తన భౌతిక కాయాన్ని ఇలా భద్రపరచాలని  ఎన్నడు  కోరుకోలేదు. లెనిన్ చనిపోయిన వెంటనే ఆయన  భార్య  నదేజ్డా కృపస్కయా చేసిన విజ్ఞప్తి  కూడా అదే.  లెనిన్ పేరు మీద ఏవిధమయిన  స్మృతి కట్టడాలు నిర్మించవద్దని ఆనాటి ప్రభుత్వ పెద్దలను  ఆవిడ కోరారు.
కానీ, అప్పటి  సోవియట్ అధినేత జోసెఫ్ స్టాలిన్ మాత్రం లెనిన్ భౌతిక కాయాన్ని భద్రపరిచే ప్రతిపాదన పట్లనే మొగ్గు చూపారు. దానితో  ఆవిడ సూచనలను  ఎవరూ  పట్టించుకోలేదు.
స్టాలిన్  చొరవతో పనులు శరవేగంతో సాగాయి. ముందు రెడ్ స్క్వేర్ లో చెక్కతో ఒక మసోలియాన్ని తాత్కాలికంగా నిర్మించారు.
ఇందుకోసం ఒక స్పెషల్ కమిషన్ ఏర్పాటు చేశారు. జర్మనీ నుంచి   ఫ్రీజర్ సదుపాయం కలిగిన ఒక పెద్ద  పేటికను తెప్పించడానికి ఉత్తర్వులు కూడా  జారీ అయ్యాయి. అయితే ఇందుకు   చాలా సమయం పట్టేట్టు వుండడం,  లెనిన్ భౌతిక కాయం శిధిలం అయ్యే సూచనలు కానరావడంతో  ఆ ప్రయత్నం మానుకున్నారు. ఎంబాల్మింగ్  చేసి,  రసాయనిక చర్యల ద్వారా శరీరాన్ని భద్రపరిచే పనికి పూనుకున్నారు.   కొద్ది రోజులపాటు మృత శరీరాన్ని చెడిపోకుండా చూడడం  ఈ విధానం ద్వారా సాధ్యం. ఇది అప్పటికే తెలిసిన ప్రక్రియ. కానీ రసాయనిక చర్యల ద్వారా మరణించిన వ్యక్తి శరీరాన్ని శాశ్విత ప్రాతిపదికపై  ఏళ్ళ తరబడి పాడయిపోకుండా  చేయడం యెలా అన్నది ఆనాటికి  కనీవినీ ఎరుగని  విషయం.
ఉక్రెయిన్ లో అనాటమీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్  వ్లాదిమిర్ వోరోబియోవ్ నాయకత్వంలోని ఒక నిపుణుల బృందం ఈ బృహత్తర  కార్యక్రమాన్ని తలకెత్తుకుంది. అంతేకాదు, అసాధ్యం అనుకున్న ఈ పనిని  జయప్రదంగా పూర్తిచేసింది.
అనితర సాధ్యం అనుకున్నది సాధ్యపడడంతో  ప్రభుత్వం చురుగ్గా కదిలింది.  సోవియట్  సైనికులు నిరంతరాయంగా శ్రమించి అరుణ వర్ణం కలిగిన చలువరాతితో మరో మసోలియాన్ని క్రెమ్లిన్ గోడ దాపునే  ఆఘమేఘాలమీద నిర్మించారు. లెనిన్ భౌతిక కాయాన్ని అందులోకి తరలించారు.
1953 లో స్టాలిన్ మరణించినప్పుడు ఆయన శరీరాన్ని కూడా ఎంబాల్మింగ్  చేసి లెనిన్ మసోలియంలోనే  ఆయన దేహం  సరసనే  భద్రపరిచారు.  ఆ తరువాత కృశ్చేవ్ హయాంలో స్టాలిన్ భౌతిక కాయాన్ని అక్కడనుంచి తొలగించి  క్రెమ్లిన్ గోడ పక్కన  ఖననం చేశారు.
గోర్భచెవ్ తరువాత అధికారానికి వచ్చిన బోరిస్ ఎల్త్ సిన్ ‘రెడ్ స్క్వేర్ అనేది ఒక శ్మశాన వాటికను  తలపించేదిగా వుండరాదని’  అభిప్రాయపడ్డారు. అయితే,  లెనిన్ శరీరాన్ని అక్కడనుంచి తొలగించడం  అప్పట్లో సాధ్యం కాలేదు.  పుతిన్ మూడో పర్యాయం రష్యా అధినేతగా ఎన్నికయిన  తరువాత మళ్ళీ ఈ మధ్యకాలంలో  ఈ ఆలోచన  కొత్త చిగుళ్ళు వేస్తున్నట్టు అనిపిస్తోంది.
2024 సంవత్సరానికి  కామ్రేడ్  లెనిన్ కన్ను మూసి వందేళ్ళు పూర్తవుతాయి. అప్పటిదాకా ఆగుతారా  లేక ఈ లోగానే  అంతపనీ చేస్తారా వేచి చూడాలి.(17-05-2013)

16, మే 2013, గురువారం

దొంగ నీతులు



ఒక వూళ్ళో  బ్యాంకు దోపిడీ జరిగింది.
బ్యాంకులో ప్రవేశించిన దొంగల నాయకుడు తుపాకీ చూపుతూ ఇలా అన్నాడు.
‘కదిల్తే కాల్చేస్తాం. ఒక విషయం గుర్తు పెట్టుకోండి. డబ్బు, ఆస్తులు ప్రభుత్వానివి. ప్రాణాలు మాత్రమే మీవి’
అంతే. బ్యాంకులో వున్న సిబ్బంది,ఖాతాదారులు అందరూ ఒక్కమాటుగా నిశ్శబ్దంగా నేలమీద పడుకున్నారు. దొంగలు తమ పని చేసుకు పోయారు.
దీన్నే మనసుమార్చే టెక్నిక్ అంటారు. ఒక రకంగా ధ్యాస మళ్ళించడం.




ఈ లోగా, బ్యాంకు సిబ్బందిలో ఒకమ్మాయి అతితెలివికి పోయి ఓ బల్లమీద వొయ్యారంగా పడుకుని, దొంగలను లోబరచుకోవడానికి  తన వొంపుసొంపులు ప్రదర్శించింది.
దొంగల నాయకుడు అది చూసి హెచ్చరించాడు. ‘కాస్త నాగరీకంగా ప్రవర్తించు. మేమొచ్చింది దోపిడీకి. అత్యాచారానికి కాదు’
దీన్ని వృత్తి చాతుర్యం అంటారు. చేసే పనిమీద తప్ప వేరే అంశాలపై దృష్టి పెట్టకపోవడం అన్నమాట.

సరే. దోపిడీ పూర్తిచేసుకుని దొంగలు తమ స్థావరానికి వెళ్ళిపోయారు.
వారిలో ఓ జూనియర్ దొంగ,  దొంగ సొమ్ము లెక్కపెట్టే పనిలో మునిగిపోయాడు.
అది గమనించిన సీనియర్ దొంగ ఇలా అన్నాడు.
‘అంత డబ్బు లెక్కపెట్టేసరికి తెల్లారుతుంది. కాసేపట్లో టీవీ వార్తల్లో యెంత సొమ్ముపోయిందీ వాళ్ళే చెబుతారు’
దీన్ని అనుభవం అంటారు. అందుకే ఈ రోజుల్లో కాగితం డిగ్రీలకంటె అనుభవమే ప్రధానం అంటున్నారు.

దోపిడీ దొంగలు వెళ్ళిపోగానే బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫోను చేయమని అసిస్టెంట్ కు చెప్పాడు.
‘తొందరపడి ఆ పని చేయకండి. ఇంతకుముందు లావాదేవీల్లో మనం నొక్కేసిన సొమ్మును కూడా కలిపిచెబుదాం, ఓ పనయిపోతుంది’
‘ప్రతి నెలా ఇలా ఒక దోపిడీ జరిగితే యెంత బాగుంటుందో’ అన్నాడు మేనేజర్ ఆనందంగా.
దీన్ని అలలకు అనుగుణంగా ఈతకొట్టడం అంటారు.  అనూహ్యంగా ఎదురయిన అననుకూల పరిస్తితిని  సయితం తమకు  అనుకూలంగా మార్చుకోవడం అన్నమాట.

మరునాడు పేపర్లన్నీ బ్యాంకు దోపిడీ గురించి మొదటి పుటల్లో ప్రచురించాయి.
ఆ వార్తలు చదివి దొంగల నాయకుడు నోరు వెళ్ళబెట్టాడు.
దోచుకొచ్చిన సొమ్మును ఎన్ని సార్లు లెక్కబెట్టినా పత్రికల్లో వచ్చిన సొమ్ముతో సరిపోలడం లేదు.
కొట్టుకొచ్చింది కాసింతయితే, పోయిందని  బ్యాంకు వాళ్ళు గగ్గోలు పెడుతోంది కొండంత.  
‘మనమేమో ప్రాణాలను పణంగా పెట్టి బ్యాంకు దోపిడీ చేశాం. వాళ్లేమో ఒకే ఒక్క దొంగ లెక్క చెప్పి మనం దోచుకున్నడానికి రెండు రెట్లు నొక్కేసారు. ఇలా అడవిలో దొంగగా బతికే కంటే బ్యాంకులో మేనేజర్ గా వుండడం మేలేమో!’ అని
దొంగల నాయకుడు బెంగ పడ్డాడు. (16-05-2013)
Note: Courtesy Cartoonist 

ఇలాటివాళ్ళు కూడా వుంటారా?






ఆ దేశానికా? అక్కడేముందిరా!అన్నాను ఠక్కున.
ప్రపంచంలోకెల్లా చెప్పుకోదగ్గ  మంచి మనుషుల్ని, మంచి మనసుల్ని చూపిస్తాను రండి నాన్నా!అన్నాడు మా అబ్బాయి శ్రీహర్ష.
సురేంద్రనాథ్ మాజేటి తన  విదేశీ  పర్యటన అనుభవాలను ఇలాటి చదివించే ఎత్తుగడతో  ప్రారంభించి  నాలుగే పేజీల్లో వాళ్ల అబ్బాయి చెప్పిన మంచి మనుషుల దేశాన్నీ, మంచి మనసుల దేశాన్నీ మనకు ఎంచక్కా పరిచయం చేశారు.
మరో విషయం. వాళ్ల అబ్బాయి ఆదేశంలో  ఏదో ఉద్యోగమో, వ్యాపారమో చేస్తూ తల్లిదండ్రులను అక్కడికి ఆహ్వానించలేదు. అతగాడికో చక్కటి కోరిక వుంది. దేశాలు చుట్టిరావడం. ఉద్యోగరీత్యా కొన్నాళ్ళు లండన్ లో వున్నాడు. ఏడాది తరువాత దానికి రాజీనామా చేసాడు. సామాన్లు ఇండియా పంపేసాడు. ఒక సైకిల్ కొనుక్కున్నాడు. తోడుకోసం చూసుకోకుండా, తోడెవరూ లేకుండా సైకిల్ మీద వొంటరిగా బయలుదేరి వరసగా దేశాలు చుట్టబెట్టాడు. పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీసు, టర్కీ, జార్జియా, ఆర్మీనియా, అల్లా తిరుగుతూ తిరుగుతూ ఇదిగో ఈ మంచి మనుషుల దేశం ఇరాన్’  చేరుకున్నాడు. ఇండియా తిరిగివచ్చేముందు వెళ్ళాల్సిన దేశాల జాబితా కూడా తక్కువేమీ  కాదు. తుర్కుమేనియా, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ ఇందులో వున్నాయి.  ఈ పర్యటనలో శ్రీహర్ష  ఎక్కడా యే దేశంలో కూడా  హోటల్లో బస చేయలేదు. అంతర్జాలంలో పరిచయం అయి, స్నేహితులుగా మారినవారి  ఆతిధ్యం స్వీకరిస్తూ ఆయా దేశాలు చుట్టబెడుతూ, స్తానిక ఆచారవ్యవహారాలు అధ్యయనం చేస్తూ, అక్కడివారితో మమేకం అయిపోతూ మధ్యలో తనకు  ఎదురయిన అద్భుత అనుభవాలను, వ్యక్తులను  తలిదండ్రులకు కూడా పరిచయం చేయాలని  ఫోను చేసి వారిని కూడా రమ్మన్నాడు.    
తమ పిల్లవాడు దేశం కాని దేశంలో ఇల్లు కొనుక్కునో, కట్టుకునో గృహప్రవేశానికి రమ్మనలేదు. అతడే ఒక అంతర్జాల మిత్రుడి ఇంట్లో మకాం పెట్టి వారితో కలిసివుంటున్నాడు. అలాటి పరిస్తితిలో యే తలిదండ్రులు కూడా అలాటి ప్రయాణం పెట్టుకోవడానికి అంత సుముఖంగా వుండరు.
కానీ సురేంద్రనాథ్ దంపతుల తీరే వేరు. తండ్రి సురేంద్రనాథ్ ది కూడా విభిన్నమైన వ్యక్తిత్వం.   అందుకే ఠక్కున ఒప్పేసుకున్నారు.
అందుకే పెద్దమనసుతో  వారి అబ్బాయి ఆహ్వానాన్ని మన్నించి భార్యాబిడ్డల్ని తీసుకుని ప్రయాణమై ఆ దేశానికి వెళ్ళి వచ్చారు. వెళ్ళి రావడంతో సరిపెట్టుకోకుండా నాలుగంటే నాలుగు పేజీల్లో తమ అనుభవాలను రంగరించి తమ సన్నిహితులతో పంచుకున్నారు.
ఈ రచన పీడీఎఫ్ లోవుండడం వల్ల ఇలా క్లుప్తంగా పరిచయం చేసి చేతులు దులుపుకోవాల్సివస్తోంది. పూర్తి పాఠం కావాల్సిన వారు సురేంద్రనాథ్ గారి మిత్రుడు దేవినేని మధుసూదనరావు గారిని సంప్రదిస్తే బాగుంటుంది. వారి చిరునామా -<mdevineni@gmail.com
(పై ఫోటో ఈనాడు సౌజన్యంతో ) 

15, మే 2013, బుధవారం

విందామయా నరుడ విందామయా - భండారు శ్రీనివాస రావు



చిన్నప్పుడు చదివిన ముళ్ళపూడి వారి జోక్ గుర్తొస్తోంది.
"పెళ్ళయిన కొత్తల్లో పెళ్ళాం మాట మొగుడు వింటాడట.
తరవాత్తరవాత - మొగుడి మాట పెళ్ళాం వింటుందట.
పొతే, ఆ తరవాత మాత్రం - ఆ ఇద్దరి మాటలు ఇరుగూ పొరుగూ వింటారట."



ఈ వినడం అన్నది చెవికి సంబంధించిన విషయం. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే పోలా - అనే చెవలాయిలు- వినదగునెవ్వరు చెప్పిన అని- ఎవరేది చెప్పినా చెవులు రెండూ వొగ్గించి, రిక్కించి మరీ వింటారు.

కొందరు భార్యలు - " నా (మా) మొగుడు నా (మా) మాట వింటాడు " అన్న తృప్తిలో అన్ని అసంతృప్తులు మరచిపోతుంటారు. మగవాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి, మాట వినే పెళ్ళాం దొరికిందని బయట చెప్పుకుంటూ, మురిసి ముక్కచెక్కలవుతూ మగధీరులమని మీసం మెలేస్తుంటారు.

వినికిడి సమస్య అంటూ లేకపోతె, ఈ వినకపోవడం అన్న ప్రసక్తే వుండదు. ఆ సమస్య వుంటే ఈ వినే సమస్యకు తావుండదు. ఎంచక్కా, ఎవరేం చెబుతున్నా వింటున్న ఫోజు పెట్టి- చెప్పేవాళ్ళ నోటి దురద వొదిలించవచ్చు.
విని, తలాడించే అలవాటు మగవాళ్ళలో ముఖ్యంగా పెళ్ళయిన వాళ్లలో ఎక్కువన్న థియరీ ఒకటుంది. ఈ బాపతు మగాళ్ళు ఆ బాపతు అపప్రధ వొదిలించుకోవడానికి ఆదర్శ పురుషుల అవతారం ఎత్తుతుంటారు. " భార్య మాట వింటే తప్పేమిటి? ఆవిడా మనలాంటి మనిషే కదా." అంటూ తమకి తాము సర్ది చెప్పుకుంటారు.

కాగా మరో రకం మగాళ్ళు- తమ మగాడితనాన్ని - వేరే రకంగా ప్రదర్శిస్తుంటారు.

" నన్నడిగితే అసలు మగాళ్ళ మాటల్ని ఆడవాళ్ళు వినకపోవడమే కాదు, ఎదిరించమని కూడా చెబుతాను. నా విషయమే తీసుకోండి. మామూలుగా మొగుళ్ళు రాగానే భార్యలు లేచినిలబడడం ఆనవాయితీ కదా. మా ఇంట్లో అలా కాదు. నేను బయట నుంచి రాగానే మా ఆవిడ లేచి నిలబడబోతుంది. పరవాలేదు కూర్చో అంటాను. నా మాట వినొద్దన్నది మా ఇంట్లో నా రూలు కాబట్టి లేచి నిలబడుతుంది. చూసారా! అదీ నేను నా భార్య కిస్తున్న స్వేఛ్చ." అంటుంటారు ఈ కోవలోకి వచ్చే మొగుళ్ళు.

బొత్తిగా మాట వినని జనం -జనాభాలో ఎక్కువ. వీళ్ళని 'సీతయ్యలు' అంటారని కూడా ఈ మధ్యనే తెలిసింది - ఓ సినిమా పుణ్యమా అని.

పొతే,వినడం వినకపోవడం అన్న రూట్లో ముందుకుపోయే పని కాసేపు పక్కనపెడదాం.

హైదరాబాద్ ఆలిండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీ పీ ఎస్ గోపాల కృష్ణ -'విన్నవింత' అనే శీర్షికతో రేడియో లో ఒక కార్యక్రమం కొన్నాళ్ళు నడిపారు. విన్న వింతలను శ్రోతలతో పంచుకోవడం రచయిత ఉద్దేశ్యం. అయితే వినేవారికి పెద్దపీట వేసే పెద్ద మనసు వున్నవాడు కనుక, విన్నవించుకోవడం అనే అర్థంతో దానికి "విన్నవింత" అని పేరు పెట్టారు.

మా బోటి రేడియోలో పనిచేసిన వాళ్లకి వినే వాళ్ళే 'దేవుళ్ళు' కాబట్టి , పొద్దునపూట వచ్చే ఆ ప్రోగ్రాం వాళ్ళకో 'నివేదన' గా భావించే వాళ్ళం. ఆయన చెప్పే వన్నీ మంచి విషయాలే కాబట్టి , ఆ రోజుల్లో శ్రోతలు కూడా మంచి సంగతులు వినే బాపతు కాబట్టి- ఆయన కూడా రకరకాల పనికొచ్చే కబుర్లతో దాన్ని తీర్చిదిద్దేవారు.(ఇన్ని కా'బట్టీలు' అవసరమా అంటే- ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పకపోతే రేడియో వాళ్లకి తెలుగు రాదు అని అపోహపడే ప్రమాదం సయితం లేకపోనూ లేదు) . శ్రోతలు కూడా 'రేడియోలోచెప్పడమేమిటి? మనం వినడమేమిటి?' అని భేషజాలకు పోకుండా బుద్దిగా వినేవారు. ఆ విధంగా చెప్పేవారికి వినేవారు, వినేవారికి చెప్పేవారు లేరనే కరువు లేకుండా పోయింది. ఆ మాటకు వస్తే ఆ రోజుల్లో రేడియోలో ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఎన్నో వినేవాళ్ళం అని గుర్తు చేసుకునే ఆనాటి శ్రోతలు ఈ రోజుల్లో కూడా తారసపడడం కద్దు.
మళ్ళీ అసలు సంగతికొస్తే-
'వినంగానే సరిపోదు- విన్నది ఆచరించాలనీ - అప్పుడే విన్నదానికి సార్ధకత' అనే వాళ్ళున్నారు.
'ఒరేయ్ కన్నా! మోటార్ సైకిల్ పై అంత స్పీడ్ గా వెళ్లకురా!' అని తండ్రి అంటే- పిల్లాడు విన్నట్టుగా తలాడిస్తే - నిజానికి అది వినడం కిందికి లెక్క రాదు.
విని పాటించినప్పుడే - 'రాముడు మంచి బాలుడు, తలిదండ్రుల మాట జవదాటడు' అని కన్నవాళ్ళు - వినే వాళ్లకు చెప్పుకునే వీలుంటుంది.

వినడంలో ఇంత విషయం వుంది కాబట్టే- నోములు, వ్రతాలు చేసేటప్పుడు వ్రత కధలు విన్నవాళ్ళకు కూడా 'వ్రత ఫలం' లో భాగం కల్పించారని - సూతుడు శౌనకాది మునులకు చెప్పగా-అది విన్నవాళ్ళలో ఒకడు తెలియచేయడమైనదని సర్వజనులకు ఇందుమూలముగా తెలియపరచడమైనది.

(THANKS TO IMAGE OWNER)


ఈ రోజు ఈనాడు మొదటి పేజీ చూశారా?





ఓ నలభై ఏళ్ళక్రితం పేపర్లు ఇలాగే వుండేవి. సమాజానికి కావాల్సిన వార్తలు. చికోరీ తక్కువ కాఫీ ఎక్కువ లాగా అన్నమాట.
ఈనాటి ఈనాడు ప్రధాన శీర్షిక – గాలి సోకుతోంది. ‘గాలి’ వార్తలు చదివీ చదివీ ఇదీ మరో ‘గాలి (జనార్ధన రెడ్డి) వార్త కాబోలు అనుకున్నవాళ్ళు వున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ‘పీల్చే గాలిలో పెరుగుతున్న సీసం – దానివల్ల జనాలకు వాటిల్లే ప్రమాదాలు’ గురించిన సమాచారం చాలా వివరంగా వుంది.
మరో వార్త ప్రఖ్యాత హాలీవుడ్ నటి ఏంజెలినా గురించి. రొమ్ము కేన్సర్ పై ఆమె సాధించిన విజయం గురించి. యెంత గొప్పగా వుందో.
ఇంకోటి-  చిన్నపిల్ల మరణాలకు కారణమవుతున్న  ‘రోటా వైరస్ పై భారతీయ అస్త్రం’ అనే చక్కటి వార్త.
కుడి వైపు పైన ఇంజినీరింగ్ కాలేజీల్లో విదేశీ విద్యార్ధులకు ప్రవేశం కల్పించే అంశం గురించిన వార్త.
సీ.బీ.ఐ. స్వతంత్రత కోసం చట్టం తెచ్చే వార్త.
మండు వేసవిలో పండు వెన్నెల మాదిరిగా సేద తీర్చే వార్తలు.
జన్మానికో శివరాత్రి. రోజూ ఇలాటి వార్తలే వేస్తె ఇంతే సంగతులు.
ఈ సంగతి వారికీ తెలుసు.
అందుకే-
‘లబ్ది పొందింది జగనే – పితాని, దోపిడీ నాయకుడు జగన్- మంత్రి ఆనం, జగన్ స్వార్ధానికి మంత్రులు బలి –కన్నా’ అంటూ సింగిల్ లైన్ లో క్లుప్తంగా ఇచ్చారు. (15-05-2013)