5, ఏప్రిల్ 2013, శుక్రవారం

తెలుగువారి తొలి పండగ ఉగాది





రుతువులు మారుతుంటాయి...వాటితోపాటే అవి మనకు పంచిచ్చే అనుభూతులూ మారుతుంటాయి. అందుకే ప్రకృతి ఎప్పుడూ నిత్యనూతనంగా ఉంటుంది.
శిశిరంలో మోడైపోయిన చెట్లన్నీ వసంతంలో చిగుళ్లు తొడిగి కొత్త సింగారాలొలుకుతుంటాయి. పచ్చగా కళకళలాడుతుంటాయి. రుతువుల్లో వసంతం మనోహరమైనదీ ఆహ్లాదకరమైనదీనూ. రుతువుల్లో వసంతరుతువు తానే అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. అందుకే సంవత్సర ఆరంభానికి దీన్నే కాలమానంగా తీసుకుని తొలిరుతువుగానూ చెబుతారు. అలాంటి వసంతంలో వచ్చే తొలి మాసం చైత్రం. తిథుల్లో తొలి గౌరవం పాడ్యమిది. బ్రహ్మ సృష్టి ఆరంభించినది ఈ చైత్ర శుద్ధ పాడ్యమినాడే అంటోంది బ్రహ్మపురాణం. అదే యుగాది. అన్నీ తొలిగా వచ్చే ఆ రోజే తెలుగువారి తొలిపండగ... ఉగాది!
రామపట్టాభిషేకం జరిగిందీ , శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిందీ , కలియుగం ప్రారంభమైందీ ఆ రోజేనని పండితులు చెబుతారు. ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త వరాహమిహిరుడి అంచనాల ప్రకారం చైత్రమే తొలిమాసం. ఆ రోజే తొలి పంచాంగాన్ని జనజీవన స్రవంతికి అంకితం చేశాడాయన. విక్రమార్కుడూ , ఆంధ్రరాజుల చక్రవర్తి శాలివాహనుడూ సింహాసనాన్ని అధిష్ఠించిందీ ఈ చైత్ర శుద్ధ పాడ్యమినాడే. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే చాంద్రమానాన్ని అనుసరించే తెలుగు, కన్నడ, మహారాష్ట్ర ప్రజలు చైత్రశుద్ధపాడ్యమినే నూతన సంవత్సర ఆరంభదినంగా కొత్తదనానికి ప్రారంభంగా భావించి పండగ జరుపుకుంటారు. సౌరమానాన్ని పాటించే తమిళులు, మలయాళీలు, బెంగాలీలు, సిక్కులు చేసుకునే ఉగాది కూడా వసంతంలోనే రావడం విశేషం.
ఉగాది పచ్చడి
ఈ పండగ పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. మామిడిపిందెలు, వేపపువ్వు, కొత్తబెల్లం, చింతపండు, పచ్చిమిరప, ఉప్పు వేసి చేసే ఈ పచ్చడిలోని ఆరురుచులూ జీవితంలోని సుఖదుఃఖాలకు ప్రతీకలు. ఈ జీవనతత్త్వం సంగతెలా ఉన్నా వేసవి ఆరంభంలో షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తినడం వల్ల శరీరంలోని వాత, కఫ, పిత్త దోషాలేమయినా ఉంటే పోతాయంటోంది ఆయుర్వేదం. వేపపువ్వులో యాంటీసెప్టిక్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఉంటాయి. క్రిములనీ చర్మరోగాలనీ నివారించే శక్తీ ఉంది. మామిడిముక్కలు రక్తప్రసరణదోషాలను నివారిస్తాయి. చింతపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొత్తబెల్లం వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. పచ్చిమిరప చెవిపోటు, గొంతువాపు వంటి దుర్లక్షణాలను అరికడుతుంది. ధమనుల్లో కొవ్వు పేరుకోకుండా చూసే పని ఉప్పుది. కొత్తకుండలోనే ఈ పచ్చడిని చేయడంవల్ల అది చల్లగా ఉంటుంది. వీటితోపాటు చెరకుముక్కలు, అరటిపండు... కూడా కలుపుతుంటారు కొందరు.
అయితే ధర్మసింధు వంటి గ్రంథాలు అసలు ఉగాది పచ్చడి ఇది కాదంటాయి.
ఈ పచ్చడిని పూర్వం 'నింబ కుసుమ భక్షణం' అనేవారట. రుతుమార్పు కారణంగా వచ్చే అన్ని ఇబ్బందులూ తొలగిపోవాలంటే ఉగాదిపచ్చడిలో మామిడిచిగురూ, అశోకవృక్షం చిగుళ్లూ కూడా కలపాలట. అందుకే దీన్ని 'అశోక కళికా ప్రాసనం' అనేవారట.
'త్వామష్ఠ శోక నరాభీష్ట మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం మామశోకం సదాకురు'
(నేను జీవిత సమస్యలతో బాధపడుతున్నాను. ఓ అశోకమా! ఈ మధుమాసంలో నీవు చిగురించి కళకళలాడుతున్నట్లుగా నా జీవితానికి కూడా సుఖసంతోషాలు కలిగించుమా) అనే మంత్రం చదువుతూ దీన్ని తినాలట. అదీ ఒక్క పండగరోజే కాదు. శ్రీరామనవమి వరకూ అంటే తొమ్మిదిరోజులపాటు తినాలట. కాలక్రమంలో మామిడి చిగుళ్లు పోయి ముక్కలొచ్చాయి.
అయితే ఇప్పటికీ కర్ణాటక వాళ్లయితే 'బేవు బెలాల పేరుతో వేపచిగుళ్లూ బెల్లం కలిపి పచ్చడిలా చేసుకుని తింటారు. మరాఠాలు పచ్చడిలో వేపాకులూ వామూ కూడా కలుపుతారు.
ఉగాది అనగానే గుర్తుకొచ్చే మరో అంశం నూతన వస్త్రధారణ. కొత్త చిగుళ్లతో కళకళలాడే ప్రకృతికాంతను సూచిస్తూ కొత్తదుస్తుల్ని ధరించడం ఆనవాయితీగా వస్తోంది. అదీ తెలుపురంగు లేదా లేలేతరంగుల్లో ఉండే పలుచని దుస్తులే ఎక్కువగా ధరిస్తారు. వచ్చేది వేసవికాలం కాబట్టి ఆ సమయంలో ధరించడానికి హాయిగా చల్లగా ఉండేందుకు ఎండని గ్రహించని తెలుపురంగు దుస్తుల్నే ముందు జాగ్రత్తగా కుట్టిస్తారన్నమాట.
ఉగాదినాడు విధిగా పంచాంగశ్రవణమూ ఉంటుంది. ఇందులోనూ పరమార్థముంది. ఇది మన ఖగోళ శాస్త్రీయ దృక్కోణానికి అద్దంపట్టే సంప్రదాయం. ఎందుకంటే ఖగోళ స్థితిగతులను అనుసరించే పంచాంగాన్ని రూపొందిస్తారు. ఇందులో ఐదు అంగాలుంటాయి. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణంలను పంచాంగం అంటారు. ఈ ఏడాది వాతావరణం ఎలా ఉండబోతుందీ ఏయే పంటలు వేస్తే మంచిదీ వంటి విషయాలన్నీ రైతులు ఈ పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవడం పల్లెల్లో ఆనవాయితీగా వస్తోంది.
తెలుగువారు ఉగాది, కన్నడిగులు యుగాది, మహారాష్ట్రీయులు గుడిఫడ్వా, సిక్కులు వైశాఖీ, తమిళులు పుత్తాండు, మలయాళీలు విషు, బెంగాలీయులు పొయ్‌లా బైశాఖ్‌... ఇలా ఎవరు ఏ పేరుతో ఉగాది పండగను జరుపుకున్నా అంతటా ఒకటే భావన. అదే... ఆశావహ దృక్పథం... నిన్నటి నిరాశల్ని విడనాడి కొత్త ఆశలతో భవిష్యత్తుని స్వాగతించడం... వసంతం సాక్షిగా!
(తెలుగు పండగలు బ్లాగ్ స్పాట్ డాట్ కామ్ సౌజన్యంతో)

ఏప్రిల్ ఫూల్



ఇంకా ఏప్రిల్ మాసమే నడుస్తోంది కాబట్టి ఎంచక్కా ఏప్రిల్ ఫస్ట్ – ‘ఆల్ ఫూల్స్  డే’ కబుర్లు కొన్ని- ఆఫ్ కోర్స్ - అందరికీ కాకపోయినా కొందరికి తెలిసినవే అనుకోండి – చెప్పుకోవచ్చు. ఫూల్స్ గురించి ప్రముఖులు కొందరు నుడివిన మాటలు, కొన్ని దేశాల్లో ప్రాచుర్యంలో వున్న సామెతలు ఇవిగో కొన్ని. 


 ‘మనమంతా ఫూల్స్ కి రుణపడి వున్నాం. వాళ్ళే లేకపోతే మన తెలివితేటలు ప్రపంచానికి తెలిసేవి కావు’ – మార్క్ ట్వైన్

‘ఏమయినా చెప్పండి కాని, నాకు మాత్రం ఫూల్స్ అంటే ఎంతో నమ్మకం. అది నాపట్ల నాకున్న విశ్వాసం అని నా స్నేహితులు ఆట పట్టిస్తుంటారు.అది వేరే సంగతి.’ – ఎడ్గార్ అలెన్ పా   

‘తెలివైన వాళ్లకి ఇతరుల సలహాలు అవసరం లేదు. తెలివితక్కువ వాళ్లు ఎవరి సలహాలు తీసుకోరు.’ - బెంజమిన్ ఫ్రాంక్లిన్  

‘నిజమైన హాస్య ప్రియులు జోకులు వేయరు. ఇతరుల జోకులను హాయిగా ఆస్వాదిస్తారు. - మాక్స్ ఈస్ట్ మన్

‘నాకెందుకో నా తెలివితేటలపట్ల నాకు అపారమైన నమ్మకం. అంత తెలివికలవాడిని కావడం వల్లనో యేమో ఒక్కోసారి నా మాటలు నాకే అర్ధం కావు’ – ఆస్కార్ వైల్డ్  

‘పందులకు పనసపండు  ముక్కలు పెట్టకు. బుద్ధి వుంటే బుద్ధిహీనులకు ఎప్పుడూ  సలహాలు ఇవ్వకు’ – ఐరిష్ సామెత  

‘తెలివితక్కువవాళ్ళతో కూర్చుని నవ్వడం కంటే తెలివైన వాళ్ళతో కలసి ఏడవడం మంచిది’ – స్పెయిన్ నానుడి     

‘నన్నొకసారి ఫూల్ ని చేసావనుకో అది నీకు అవమానం. మళ్ళీమళ్ళీ మరోమారు ఫూల్ ని చేసావనుకో అది నాకు అవమానం.’ – చైనా సామెత

NOTE: Courtesy Image Owner

4, ఏప్రిల్ 2013, గురువారం

తిరగేసిన తాతా మనుమడు కధ






న్యూ యార్క్ లో హడావిడిగా ఆఫీసుకు వెడుతున్న సమయంలో ఫోను మోగింది. నెంబరు చూస్తే ఇండియాది. తండ్రి మాధవయ్య నుంచి. ‘హలో’ అన్నాడు ఆనంద్ కారు డ్రైవ్ చేస్తూనే.
తండ్రి రెండే ముక్కలు మాట్లాడి ఫోను పెట్టేసాడు.  ఆనంద్ ఆందోళనగా బోస్టన్ లో వున్న తన అన్నతో  కనెక్ట్  అయ్యాడు. ఆ కాల్ కోసమే ఎదురుచూస్తున్నట్టుగా వున్నాడేమో  తమ్ముడితో అన్నాడు - ‘నాన్న నీకూ కాల్  చేసాడా? అంతా చెప్పాడా’.
‘అంతా ఏముంది. అంతా రెండు ముక్కల్లో చెప్పాడు. అమ్మకు విడాకులిస్తాడట. రేపే లాయర్ను కలుస్తాడట.  ఇండియాలో ఇదేం పొయ్యే  కాలం? ఇక్కడంటే డైవర్సులు  మామూలు. అయినా నలభై ఏళ్ళు కాపురం చేసి ఇప్పుడీ వయస్సులో ఇవేం బుద్ధులు?’
‘సరే! ఇప్పుడేమి చేద్దాం’
‘చేసేది ఏవుంది. రేపే బయలుదేరి హైదరాబాదు వెడదాం. నాతో పాటు నీకు కూడా ఫ్లయిట్  టిక్కెట్లు బుక్ చేసాను. ఆ విషయం చెబుదాం అనుకుంటువుండగానే నువ్వే కాల్ చేసావు”
‘సరే రేపే వెడదాం! ఆ సంగతి నాన్నకు ఫోను చేసి ఇప్పుడే చెప్పేసెయ్. మేము ఇద్దరం వస్తున్నాం వచ్చేదాకా విడాకులు, లాయరు అంటూ హడావిడి చేయొద్దు’ అని నాన్నకు గట్టిగా  చెప్పు’
కట్ చేస్తే ఇక్కడ ఇండియాలో మాధవయ్య భార్యతో అంటున్నాడు.
‘పదేళ్లయింది పిల్లల్ని చూసి అని  నువ్వేం బెంగ  పడకు. ఎల్లుండి తెల్లారేకల్లా పిల్లలిద్దరూ మన కళ్ళ ముందు వుంటారు.’   
(ఇంగ్లీష్ వ్యాసదాతలకు, ఇమేజ్ ఓనర్ కు  షరా మామూలు కృతజ్ఞతలు)

2, ఏప్రిల్ 2013, మంగళవారం

డేరింగ్ చీఫ్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి !!??!!



కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన తరువాత త్వరితగతిన  నిర్ణయాలు తీసుకోవడంలో  విఫలం అవుతున్నారన్నది ఆయన్ని సమర్ధించేవారు కూడా  చేస్తూవస్తున్న ప్రధాన విమర్శ.  కిరణ్  ఎక్కువగా అధికార గణం మీదనే ఆధారపడతారని, కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మంత్రివర్గ సహచరులను కూడా విశ్వాసం లోకి తీసుకోరని సొంత పార్టీ నాయకులే చెణుకులు విసురుతుంటారు.  సాధారణ రాజకీయ నాయకులకు భిన్నంగా ఆయన లోగుట్టు మనిషి అనే పేరు.   రేడియో, దూరదర్శన్ విలేకరిగా పనిచేసే రోజుల్లో  మిగిలిన కాంగ్రెస్ నాయకులలాగానే ఆయన కూడా నాకు    బాగా తెలిసిన మనిషే. గతంలో అసెంబ్లీ స్పీకర్ గా ప్రెస్  గ్యాలరీ పాసులను నియంత్రిస్తూ  ధైర్యంగా నిర్ణయం తీసుకున్నప్పుడు, మూడు దశాబ్దాలకు పైగా నాకున్న అసెంబ్లీ ప్రెస్ పాసు రద్దయినా కూడా   నేను ఆయన నిర్ణయాన్ని స్వాగతించాను. అసెంబ్లీ ప్రెస్ గ్యాలరీ పాసు అంటే ఆషామాషీ కాదనీ, పరిమిత సంఖ్యలో పాసులను  ఇవ్వడం వల్ల వాటికి వుండే   గౌరవం, విలువలను మరింత పెంచినట్టు  అవుతుందని  భావించి  కిరణ్ కుమార్ రెడ్డి  తీసుకున్న ఆ నిర్ణయం వల్ల పదవీ విరమణ చేసిన మా బోటివారికి ఆ ప్రివిలేజ్ లేకుండాపోయిన మాట నిజమే. అయినా కూడా  స్పీకర్  మంచి పనే చేసారని అభిప్రాయపడ్డ జర్నలిస్టులలో నేనొకడిని.

ఇక కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేనాటికి నేను  క్రియాశీలక పాత్రికేయ  వృత్తి నుంచి తప్పుకోవడంవల్ల  ముఖ్యమంత్రి  వ్యవహార శైలిని గతంలో మాదిరిగా దగ్గరనుంచి పరిశీలించే అవకాశం నాకు  లేకుండాపోయింది. కాకపొతే, పైవేట్ టీవీ ఛానళ్ళ పుణ్యమాఅని జర్నలిజం రంగంతో నా సాన్నిహిత్యం కొనసాగుతూ వచ్చింది. ఆ రీత్యా   ఎప్పటికప్పుడు ఆయన పరిపాలన గురించి బేరీజు వేసుకోవాల్సిన అవసరం, వేసుకోగలిగిన అవకాశం నాకు లభించాయి.
ఆయన ముఖ్యమంత్రి అయిన ఇన్నేళ్ళకు డేరింగ్ చీఫ్ మినిస్టర్ అని కితాబు ఇవ్వడానికి సరయిన ప్రాతిపదిక కరెంటు చార్జీల పెంపు రూపంలో నాకు కనబడింది.
నిజమే, పవర్ చార్జీలను ఆయన తప్ప ఇంత భారీ స్థాయిలో ఒకేసారి  పెంచగల ధైర్యం ఏ రాజకీయ నాయకుడికి  వుంటుంది?  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, గతించిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సయితం ఇంతటి సాహసోపేత నిర్ణయానికి పూనుకుని వుండేవారు కాదేమో.
రెండేళ్లుగా ముఖ్యమంత్రి ఆధారపడుతూ వచ్చిన అధికారులు కూడా ఒకే తడవ ఇంత భారీగా పెంచే ప్రతిపాదనలు సమర్పించలేదనీ, ఇప్పుడు కాకపొతే (వచ్చే ఏడాదికి ఎన్నికలు ముంగిట్లోకి వస్తాయి కాబట్టి) మరెప్పుడూ పెంచే అవకాశం ప్రభుత్వానికి దొరకదనీ (నౌ ఆర్ నెవ్వర్) వాదించి కిరణ్ కుమార్ రెడ్డే పూనుకుని ‘వడ్డన’ పరిమాణాన్ని బాగా పెంచమని అధికారులకు  సలహా ఇచ్చారని ముఖ్యమంత్రి అనుకూల మీడియా కూడా కోడై కూసింది. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. కానీ, ఆయన  తరహా చూస్తుంటే వెనక్కు తగ్గే సూచనలు కానరావడం లేదు.
వాస్తవానికి కాంగ్రెస్ ఈ నాడు అధికారంలో వున్నదంటే అందుకు ప్రధాన కారణాల్లో ఒకటి ఈ అంశం కూడా. నాడు తెలుగుదేశం పార్టీ  సంస్కరణల పేరుతొ విద్యుత్ చార్జీలను పెంచడం అనేది  ఆనాడు ప్రతిపక్షంలో వున్న కాంగ్రెస్ పార్టీకి బాగా కలసి వచ్చింది. మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత , ‘పవర్ డిస్కం’ ల ఆర్ధిక పరిస్తితిని చక్కదిద్దేందుకు ముఖ్యమంతి కిరణ్ కుమార్ రెడ్డి ‘హరాకిరీ’ వంటి ఆత్మహత్యాసదృశ్య నిర్ణయాన్ని తీసుకోగలిగారంటే నిజంగా ఆయన డేరింగ్ చీఫ్ మినిస్టరే. డేర్ డెవిల్ చీఫ్ మినిస్టరే.
గతంలో వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా ప్రజలపై పడే భారాన్ని లెక్కచేయకుండా  ఆయన రాష్ట్ర ఖజానా సంక్షేమానికే పెద్ద పీట వేశారన్న పెద్ద అపవాదు మోశారు.
రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్య శ్రీ, 104, 108,  ఫీజు రీయింబర్సుమెంటు వంటి వోట్ల గుడ్లు పెట్టే  అనేక సంక్షేమ   పధకాలను అధికారుల మాట విని అటకెక్కించే ప్రయత్నం చేయడం వల్లనే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి ఇంత దిగజారిందని, తెలుగుదేశం వారు కూడా విమర్శించడానికి సంకోచించిన ఆరోగ్య శ్రీ పధకాన్ని అధికారగణం సలహా మేరకు   ప్రభుత్వ నిధులను  ఆచి తూచి ఖర్చు పెట్టే విధానానికే  పచ్చ జెండా వూపి, పార్టీకి పుట్టగతులు లేకుండా చేసారని సొంత పార్టీ నుంచే విమర్శలను ఎదుర్కోవడానికి చాలా తెగువ కావాలి. అది తనలో పుష్కలంగా వుందని  కిరణ్ కుమార్ రెడ్డి నిరూపించారు.    
భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు, మద్యం పన్నులు కూడా కిరణ్ హయాం లోనే ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. కాకపొతే అవి కలిగినోళ్ల వ్యవహారాలు కనుక ప్రజల్లో అత్యధికులు పట్టించుకునే అవకాశం వుండదు.
కానీ, కరెంటు చార్జీల సంగతి అలా కాదు. ఈ మంట రాజుకోవడం చాలా తేలిక. ఈ అగ్నికి ఆజ్యం పోసేవాళ్లు కూడా తక్కువేమీ కాదు. ఆ రకమయిన విభీషణులకు కాంగ్రెస్ పార్టీలో కొదవ వుంటుందని అనుకోలేము.
ఇంకో  ఏడాదిలో ఎన్నికలు పెట్టుకుని ఇలా ధైర్యం చేసి నిర్ణయాలు తీసుకోవడం ఆషామాషీ కాదు. అయినా ధైర్యం చేస్తున్నారంటే ఏమిటి అర్ధం?
రెండు రకాల రాజకీయ నాయకులే ఈ రకమైన సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
ఒకరు – రాజనీతిజ్ఞులు. వీళ్ళు రేపు గురించి భయపడరు. పదేళ్ళ తరువాత పరిస్థితులు గురించి ఆలోచిస్తారు. దేశం, దేశ భవితవ్యమే వీరికి ముఖ్యం. వోట్లు, సీట్లు, అధికారం కాదు.
ఆ విధంగా చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం ఆహ్వానించదగిందే.
మరో రకం – వీరికి రేపు అనేదే లేదు.  తనని నమ్ముకుని బాధ్యత అప్పగించిన పార్టీని ఎన్నికల రేవు దాటించి అధికార తీరం చేర్చాల్సిన అవసరం ఇలాటి వారికి వుండదు. తాత్కాలిక ప్రాతిపదికన కొనసాగే పదవులు వీరివి. అటువంటప్పుడు ఇలా తెగించి నిర్ణయాలు తీసుకోవడానికి అడ్డేమివుంటుంది?
మరి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రెండింటిలో ఏ రకం.
కాలమే జవాబు చెప్పాలి. (02-04-2013)

వినదగునెవ్వరు చెప్పిన -10



నీళ్ళకు కటకటగా వున్నప్పుడే వాటి  విలువ పెరుగుతుంది. అలాగే పొదుపుగా వాడే మాటలకు కూడా.
నీళ్ళు  వరదగా మారి  వూళ్ళపై విరుచుకు పడితే  వినాశనకారకమవుతాయి.
మాటలు కూడా అంతే. ఒక స్థాయి దాటితే, అవి మంచి  చేయవు. 


COURTESY:IMAGE OWNER

వాళ్ళనే ‘గొప్పవాళ్ళు’ అని యెందుకు అంటామంటే?



మహాత్మా గాంధి జైల్లో వున్నప్పుడు కస్తూరి బా, ఆయన్ని  చూడడానికి వెళ్లారు.


భార్యాభర్తలకు మాట్లాడుకునే ఏకాంతం కల్పించాలనే  సదుద్దేశ్యంతో జైలు సార్జంటు వారిని  వొంటరిగా వొదిలేసి ఓ అరగంటసేపు బయటకు వెళ్లాడు. కస్తూరి బా వెళ్ళిన తరువాత ‘భార్య యోగక్షేమాలు అడిగారా, కుటుంబ సభ్యుల గురించి అడిగి తెలుసుకున్నారా ? వాళ్ళెలా వున్నారు?’ అంటూ  యధాలాపంగా గాంధీని అడిగాడు. ఆయన ఇచ్చిన సమాధానం ఆ బ్రిటిష్ అధికారిని నివ్వెర పరచింది.
‘జైల్లో వున్నప్పుడు ఇక్కడి నియమాలను పాటించి తీరాలి. జైలు సిబ్బంది పరోక్షంలో సొంతమనుషుల వద్ద కూడా నోరు విప్పకూడదని నాకు తెలుసు. అందుకే మీరు వెళ్ళి తిరిగివచ్చేదాకా మా ఆవిడతో నేను ఏవీ మాట్లాడకుండా మౌనం పాటించాను’
గాంధీ ఇంకా ఇలా అన్నారు.
‘మీరు బయటకు వెళ్ళకుండా వుండి వుంటే నేను నా భార్యతో ఏవయినా సంగతులు ముచ్చటించి వుండేవాడినేమో. మీరు లేకపోవడంతో నాకు ఆ అవకాశం లేకుండా పోయింది’
సార్జంటుకు నోటమాట రాలేదు. నెత్తి మీది టోపీ తీసి గాంధీకి వొంగి నమస్కారం చేసిన సంగతి కూడా వేరుగా  చెప్పేపనిలేదు. 
ఆయన అందుకే మహాత్ముడు అయ్యాడు.

(From some classic english narrations of Shri AS Murthy, Dy. Director, Ramakrishna Math during his speech  at TTD Tiru Nilayam Hyderabad, on 28.3.2013.)

1, ఏప్రిల్ 2013, సోమవారం

అమరం అమరం అమరం – మన వీరుల చరిత అమరం




కొన్ని వీరోచిత గాధలు  వింటుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. మరి కొన్ని అవి యెంత పాత కాలానికి చెందినవైనా సరే తలచుకున్న మాత్రంలోనే  సరికొత్తగా జనాలను ఉత్తేజపరుస్తుంటాయి.
ఈ ప్రస్తావనకు నేపధ్యం 1962 నాటి భారత చైనా యుద్ధం. దేశానికి ఉత్తరాన హిమాలయాల్లో  16000  అడుగుల ఎత్తునవున్న రెజాంగ్ లా కనుమలో,  ఎముకలు కొరికే చలిలో కుమాన్ బెటాలియన్ సరిహద్దుల్ని  కాపుకాస్తోంది. నిండా నూటపాతిక మంది కూడా లేని ఆ భారత సైనికదళంలోని జవానులందరూ ఆహిర్లు. ఆహిర్లు జన్మతః వీరులు. వెన్ను చూపి పారిపోయే రకం కాదు. అందుకే ఆహిర్లను  చూడగానే శత్రువులవొంట్లో ఆవిర్లు పుడతాయని  చెప్పుకునేవారు.


(రెజాంగ్ లా  యుద్ధరంగం - చిత్రకారుడి వూహాచిత్రం)

 ఈ దళానికి వీరికి జోద్ పూర్ కు చెందిన  రాజ్ పుట్ వీరుడు మేజర్ షితాన్ సింగ్ కమాండర్ గా వున్నాడు. దళపతి గట్టివాడే కాని, నాటి వాతావరణమే అత్యంత దుర్భరంగా వుంది. అందుకుతగ్గ వసతులు ఏమీ లేవు. నిజానికి ఆ పరిస్థితుల్లో ప్రాణాలు నిలుపుకోవడానికే ఎన్నో సదుపాయాలు అవసరం. అవేవీ  వారికి లేవు. కేవలం   ప్రాణాలు వొడ్డి పోరాడడానికి అవసరమయ్యే  చెక్కుచెదరని  మనోధైర్యం, ఆత్మ విశ్వాసం మాత్రమే వారివద్ద పుష్కలంగా   వున్నాయని  ప్రపంచ ప్రసిద్ధి చెందిన టైమ్  మేగజైన్ రాసిందంటే  ఆ  వీర సైనికులకు అంతకంటే  చక్కటి కితాబు ఏం కావాలి?
123 మంది ఆహిర్లు వున్న ఆ దళానికి పై అధికారులనుంచి  ఒక ఆదేశంలాటి సందేశం అందింది.  'మీరు ఏమైనా చేయండి. చుషూల్ పట్టణం మాత్రం చైనా సైనికుల పరం కాకుండా చూడండి.'
అటేమో పరాయి సైన్యం  పూర్తి సమాయత్తంగా వచ్చింది.  భారత సైన్యం  వారికి సరితూగే పరిస్తితిలో  లేదు. శత్రు సైనికులు ఒకరి యాభయ్ మంది చొప్పున వున్నారు. సంఖ్యాపరంగా అంత తేడా వుంది. వారి ఆయుధాలు కూడా అత్యంత ఆధునిక మైనవి. వారికి వెనుకనుంచి  దన్నుగా అందే ఇతర సహాయాలు, తోడ్పాటు విషయంలో కూడా వాళ్లు  భారత సైనికులకంటే ఎన్నో రెట్లు  మెరుగ్గా వున్నారు.
నవంబర్, 18, ఆదివారం. చైనా సైన్యం ఒక్కుమ్మడిగా  భారత సైనిక స్థావరం పై విరుచుకుపడింది.
భారత సైన్యం వారిని ఎదురొడ్డి నిలచింది. ఒకరు పోతే మరొకరు అన్నట్టు చైనా సైనికులు నేల ఈనినట్టు పుట్టుకువస్తున్నారు. వారిని  నిలవరించడం భారత సైన్యానికి తలకు మించిన భారంగా పరిణమించింది. కమాండర్ మేజర్ షితాన్ తన సైనికులను ఉత్సాహపరుస్తూ ఒకచోటి నుంచి మరో చోటికి వేగంగా కదులుతూ తన జవానులకు వెన్నుదన్నుగా నిలిచాడు. శత్రువులు మాత్రం  మిడతల దండు మాదిరిగా వస్తూనే వున్నారు. భారత సైనికులు స్థైర్యం కోల్పోకుండా ఎదురు నిలుస్తూనే వున్నారు. ఇంతలో శత్రు సైన్యం భారత  కమాండర్ పైనే నేరుగా కాల్పులు జరిపింది. ఒక తూటా షితాన్  భుజంలోకి దూసుకుపోయింది. మరోటి నేరుగా పొట్టలో దిగబడింది. అయినా ఆ వీరుడు వెన్ను చూపలేదు. సరికదా శత్రుసైన్యంపై  కాల్పులు జరుపుతూనే పోయాడు. నిమిష నిమిషానికీ రక్త స్రావం అధికం అవుతోంది. శరీరం సహకరించడం లేదు. అయినా ఆ వీరుడు మడమ చూపలేదు. ప్రాణాలతో మిగిలిన కొందరు బారత జవాన్లు అతడిని చేతులమీద వేసుకుని యుద్ధరంగం నుంచి దూరంగా తీసుకుపోయి కాపాడాలని ప్రయత్నించారు. కానీ షితాన్ సింగ్  పడనివ్వలేదు. ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా శత్రు సైన్యాన్ని మట్టుపెట్టాలనే తుదివరకు పోరాడాడు. ఆ పోరాటంలో రక్తస్రావం అధికం అయి యుద్ధరంగంలోనే అతడు వీరమరణం పొందాడు. భారత ప్రభుత్వం షితాన్ సింగ్ ధైర్యసాహసాలకు గుర్తింపుగా మరణానంతర  పరమ వీర చక్ర పురస్కారం ప్రదానం చేసి గౌరవించింది.
కుమాన్  దళంలోని 123 మందిలో అనేకమంది వీరోచితంగా పోరాడి అసువులుబాసారు. ఈ యుద్ధంలో పాల్గొన్న ప్రతి   భారత సైనికుడు  కనీసం అయిదుమంది శత్రువులను మట్టుబెట్టిన తరువాతనే  నేలకొరగడం జరిగింది.
నాటియుద్ధం యెంత భయంకరంగా సాగిందన్నది తరువాత ఆ ప్రాంతాన్ని సందర్శించిన తరువాత కాని అధికారులకు బోధపడలేదు. ఆ దృశ్యాలు కడు దయనీయంగా వున్నాయి. కందకాల్లో కానవచ్చిన మృత సైనికుల చేతుల్లో గురిపెట్టిన తుపాకులు కడవరకు వారు పోరాడిన తీరుకు సజీవ సాక్ష్యంగా వున్నాయి. కొందరి దేహాలు శత్రు సైనికుల కర్కశ దాడికి గురై  చిద్రమై కానవచ్చాయి. వారి చేతుల్లో తుపాకులు మాత్రం అలాగే వున్నాయి. భారత సైనిక  దళంలోని ప్రతి ఒక్కడూ వీరమరణాన్ని ఆహ్వానించాడే కానీ ప్రాణాలు దక్కించుకోవాలని ఎంతమాత్రం ప్రయత్నించలేదు. శత్రువుల దాడికి ఖండ ఖండాలుగా మారిన వారి శరీర భాగాలు అక్కడి కందకాల్లో పడివున్నాయి. తూటాలతో వారి శరీరాలు చిల్లులు పడిపోయాయి. ఒక సైనికుడి చేతిలో విసరడానికి సిద్ధంగా  వుంచుకున్న  బాంబు కనిపించింది. కానీ అతడిలో ప్రాణం మాత్రం లేదు.  చైనా సైనికుడి తుపాకీ తూటాకు బలైన మరో భారత మెడికల్  ఆర్డర్లీ చేతిలో సిరంజి, బ్యాండేజీ కనిపించాయి. ఒక డజను మందికి పైగా ఆహిర్ల శవాలు వారి స్థావరాలకు దూరంగా కానవచ్చాయి. అంటే  సైనికులను తరుముతూ వారు అంత దూరం వెళ్లారన్నమాట.
ఈ యుద్ధంలో చనిపోయిన ఒక ఆహిర్  హర్యానాలోని కోస్లి గ్రామం నుంచి వచ్చాడు. ఈ గ్రామానికి  ఒక ప్రత్యేకత వుంది. ఆహిర్ల ధైర్య సాహసాలకు, పోరాట స్పూర్తికి   ఈ గ్రామమే   ప్రత్యక్ష ఉదాహరణ. రెండో ప్రపంచ యుద్ధకాలం నుంచి ఈ నాటి వరకు  ఈ వూరిలోని ప్రతి కుటుంబం సైన్యంలోకి ఒకరిని పంపుతూనే వస్తోంది. ఈ చిన్న గ్రామంలో భారత సైన్యానికి చెందిన 106  మంది అధికార్లు, 500 మంది జవాన్లు ఈనాటికి కూడా పనిచేస్తున్నారంటే ఈ గ్రామం విశిష్టత అర్ధం చేసుకోవచ్చు.
ఆహిర్ జిందాబాద్ !
సెహభాష్ కోస్లి !
Note: Courtesy Artiste of the picture.