25, జనవరి 2013, శుక్రవారం

మన జీవితమే మనకు గురువు





మన జీవితమే మనకు గురువు

ఎక్కడో చదివినట్టు, ఏదో సినిమాలో చూసినట్టు  అనిపించే ఓ కధ ఇది.
అనగనగా ఓ అమ్మడు. పొద్దున్న బెంగళూరు వెళ్ళి ఆఫీసు పనిచూసుకుని  సాయంత్రానికల్లా   హైదరాబాదు తిరిగొద్దామని  శంషాబాదు  ఎయిర్ పోర్ట్ కు వెళ్ళింది. కాస్త వ్యవధానం వుండడంతో  ఓ ఇంగ్లీష్ నవలను,  దాంతో పాటే ఓ బిస్కెట్ ప్యాకెట్టును  కొనుక్కుని  వెయిటింగ్ హాలు కుర్చీలో తీరుబడిగా చేరగిలపడి పుస్తకం చదువుతూ ఒక్కో బిస్కెట్ తీసుకుని నోట్లో వేసుకుంటున్నతరుణంలో ఆ అమ్మడికి వున్నట్టుండి ఓ అనుమానం పొడసూపింది. పక్కన కూర్చున్న కుర్రాడు కూడా తాపీగా తన ప్యాకెట్ నుంచే ఒక్కో  బిస్కెట్టు  తీసుకుని తింటున్నట్టు అనిపించి అతడివైపు తేరిపార చూసింది. అతగాడు ఆమెను, ఆమె చూపుల్ని ఏమాత్రం  పట్టించుకోకుండా ప్యాకెట్ లోనుంచి బిస్కెట్లు తీసుకుని తింటూ చదువుతున్న పేపరులో మునిగిపోయాడు.  అలా ఇతరుల ప్యాకేట్ నుంచి  తింటూ కూడా ఏమీ తెలియని నంగనాచిలా పేపరు చదువుకుంటున్న అతడి తరహా చూసి ఆమెకు  చిరాకేసింది. మొహం మీదే కడిగేయాలన్నంత కోపం వచ్చినా  సభ్యతకోసం పైకి ఏమీ అనకుండా మిగిలిన ప్యాకెట్ ను  అక్కడే వొదిలేసి, చరచరా అడుగులు వేసుకుంటూ వెళ్ళి    బెంగుళూరు విమానం ఎక్కి తన సీట్లో సర్దుకుని కూర్చుంది.  రీడింగ్ గ్లాసులకోసం హ్యాండ్ బ్యాగు ఓపెన్ చేస్తే ఓపెన్ చెయ్యని బిస్కెట్ ప్యాకెట్ కనిపించింది. అప్పుడు కాని ఆమెకు జరిగిన పొరబాటు అర్ధం కాలేదు. నిజానికి తానే అతడి ప్యాకెట్ లోనుంచి బిస్కట్లు తీసుకున్న సంగతి తెలిసివచ్చి ‘అయ్యో ఇంకా ఏదన్నా మాట తూలాను కాదు’ అని మధనపడింది.
ప్రతికధకు ఏదో ఒక నీతి వున్నట్టే  ఈ కధనుంచి నేర్చుకోవాల్సిన నీతి కూడా వుంది.
జీవితంలో  వెనక్కు తీసుకోలేని విషయాలు  మూడు  వున్నాయి. అవేమిటంటే:
1. రాయి :  ఒకసారి విసిరితే దాన్ని మల్ళీ  వెనక్కు తీసుకోవడం కష్టం.
2. మాట : ఒక్కసారి నోరు జారితే అంతే సంగతులు.
3.  కాలం :  క్షణం గడిచిందంటే  అది శాశ్వితంగా  గతంలో కలసిపోయినట్టే.
ఇంకా ఇలాటివి మరికొన్ని వుండవచ్చు. నేర్చుకునే తీరిక వుండాలే కాని జీవితమే ఈ మాదిరి  నీతి పాఠాలను నేర్పుతుంది.

(Image Courtesy :  inspired.gumnet.net)

22, జనవరి 2013, మంగళవారం

వెనక్కు తీసుకోలేనిది నోరు జారిన మాట ఒక్కటే!





వెనక్కు తీసుకోలేనిది నోరు జారిన మాట ఒక్కటే!

మాధవరావుకు ఎదురుగా ఎవరన్నా కనిపిస్తే నమిలి మింగేయాలన్నంత కోపంగా వుంది. ఆస్పత్రి కారిడారులో అసహనంగా తిరుగుతున్న తీరే ఆయన మానసిక స్తితిని తెలుపుతోంది. మద్ధ్యమధ్యలో ఆసుపత్రి సిబ్బందిని వాకబు చేస్తున్నాడు. డాక్టర్ ఇంకా రాలేదా అని అడుగుతున్నాడు. రోడ్డుప్రమాదంలో గాయపడ్డ తన కొడుకుని తీసుకుని ఆసుపత్రికి వస్తే డాక్టర్ అయిపు లేడు.  ‘కబురు చేశాం! వచ్చి చూస్తారు’ అన్న సిబ్బంది అరకొర జవాబులు పుండు మీద కారం చల్లిన చందంగా ఆయనకు మరింత ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. చుట్టుపక్కలే కాదు చుట్టుపక్కల వూళ్ళల్లో కూడా మరో ఆసుపత్రిలేదు. ఇటు కొడుకు పరిస్తితి ఆయనకు ఆందోళన కలిగిస్తోంది. అటు డాక్టర్ లేకపోవడం ఆ ఆందోళనను ఆగ్రహంగా మారుస్తోంది.
కాసేపటికి ఎదురు చూస్తున్న డాక్టర్ వచ్చాడు. ఆయన మొహం నిర్వికారంగా వుంది. రాగానే గాయపడ్డ బాలుడి గురించి సిబ్బందిని అడిగి లోపలకు వెడుతుంటే మాధవరావుకు కోపం కట్టలు తెంచుకుంది. ఆ కోపం మాటల రూపంలో బయటకు వచ్చింది.
‘నువ్వేనా ఇక్కడ డాక్టరువి. ఇక్కడ పేషెంట్లు చావుబతుకుల్లో కొట్టుకు చస్తుంటే ఇప్పటిదాకా ఎక్కడ చక్కర్లు కొడుతున్నావు.’
సిబ్బంది మాధవరావుని వారించాలని చూసారు. కానీ ఆయన వినే పరిస్తితిలో వుంటే కదా. అతడి కళ్ళ ముందు గాయపడి రక్తంవోడుతున్న కొడుకు రూపమే కనబడుతోంది.
‘ఏం మాట్లాడవు. అవునులే ఏం  చెబుతావు. ఇదే నీ కన్న కొడుకు ఇలా ఆసుపత్రిలో పడివుంటే ఇలానే తాపీగా, నింపాదిగా  వస్తావా? అసలు  జనం ప్రాణాలంటే మీకు లెక్కలేకుండా పోతోంది’
మాధవరావు మాటల తీవ్రత పెరుగుతూనే  వుంది. డాక్టర్ మాత్రం  ఏమీ పట్టించుకోనట్టు ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లిపోవడం చూసి ఆయన అరికాలు మంట నెత్తికెక్కింది.
ఆపరేషన్ జరిగినంత సేపు మాధవరావు శాపనార్ధాలు సాగుతూనే వున్నాయి.
కాసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. డాక్టర్ బయటకు వచ్చాడు.
‘భగవంతుడు దయామయుడు. నా మానవ ప్రయత్నానికి ఆయన పూర్తిగా సహకరించాడు. మీ అబ్బాయికి ఇక ఏం భయం లేదు, మా వాళ్ళు చూసుకుంటారు’  అంటూ ఎవరో తరుముతున్నట్టుగా వెళ్ళిపోయాడు.
మాధవరావుకు డాక్టర్ మాటలు యెంత ఉపశమనం కలిగించాయో, ఆయన అలా ఉరుకులు పరుగుల మీద బయటకు వెళ్లిపోవడం అంతే  ఆగ్రహాన్ని కలిగించింది.
‘ఛీ! ఏం డాక్టర్లు. బయట ఇంత ఆందోళనగా ఎదురు చూస్తున్న మమ్మల్ని  ఏమాత్రం పట్టించుకోకుండా, ఏదో మా ప్రయత్నం మేము చేసాము. దేవుడి దయవల్లే మీ వాడు బతికాడంటూ  పొడిపొడిగా చెప్పేసి అలా  వెళ్ళిపోతాడా? యెంత నిర్లక్ష్యం? యెంత పొగరు?’ అంటూ చిందులు వేసాడు.
నర్సు కళ్లనీరు పెట్టుకుంటూ చెప్పింది.
‘అయ్యా! మీ పిల్లవాడికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మా డాక్టర్ గారిది అమృత హస్తం.  పోతే, మీరు వచ్చినప్పుడు ఆసుపత్రిలో డాక్టరు గారు లేని మాట నిజమే. ఆ సమయంలో ఆయన శ్మశానంలో వున్నారు. వొక్కగానొక్క కొడుకు రాత్రే రోడ్డు  ప్రమాదంలో అక్కడికక్కడే  చనిపోయాడు. కర్మకాండలో వున్నాకూడా,  మేము కబురు చేయగానే  అంత్య క్రియల కార్యక్రమం మధ్యలో వొదిలేసి వచ్చారు. మీ అబ్బాయికి ఆపరేషన్ చేసి మళ్ళీ మిగిలిన తంతు పూర్తిచేయడం కోసం అక్కడికే వెళ్లారు’

(నెట్లో కనబడిన ఒక ఇంగ్లీష్ కధనానికి స్వేఛ్చానువాదం - ఇమేజ్ సొంతదారుకు కృతజ్ఞతలు)


19, జనవరి 2013, శనివారం

డస్ట్ బిన్



డస్ట్ బిన్
ఖరీదయిన మద్యం సీసాకు ఓ కరెన్సీ నోటు తారసపడింది. ఎంతో గొప్ప  గొప్పవాళ్ళు తనంటే ఎంతో మోజుపడతారు. కానీ, అదేమిటో కరెన్సీ నోటు కళ్లబడగానే వాళ్ల మొహాల్లో తెలియని ఆనందం.
మద్యం సీసా కరెన్సీ నోటుతో అంది. ‘ఏం చూసుకుని నీకా మిడిసిపాటు? నువ్వొక కాగితం ముక్కవి. ఇంకా చెప్పాలంటే  నాతో  పోలిస్తే  ఎందుకూ పనికిరాని  చిత్తు కాగితానివి.’
కరెన్సీ నోటు తాపీగా జవాబిచ్చింది.
‘నువ్వన్నది నిజమే. నేనొక కాగితాన్నే. కానీ నా జన్మలో నేనెప్పుడూ నీలా ‘చెత్త బుట్ట’ని చూడలేదు’
(19-01-2013)

చింతించి వగచిన ఏమి ఫలము ?




చింతించి వగచిన ఏమి ఫలము ?


వచ్చే సార్వత్రిక ఎన్నికల అనంతరం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే కలను సాకారం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి వోట్లు, సీట్లు కావాలి.
అందుకు మొదటి మెట్టయిన ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక వోట్లు, సీట్లు  గతంలో మాదిరిగా కాంగ్రెస్ కు రావాలి.
ఇందుకు అవసరమయితే రాష్ట్రాన్ని రెండుగా చీల్చాలి.
ప్రజల ఆకాంక్షలమేరకు ఇలాటి నిర్ణయం తీసుకుంటే ఎవ్వరూ తప్పుపట్టరు. కానీ రాజకీయ ప్రయోజనాలకోసం రాష్ట్ర విభజనకు పూనుకునే ప్రయత్నం చేస్తే మాత్రం  అంతకంటే అమానుషం మరొకటి వుండదు.
కిందటి ఎన్నికల్లో రెండోమారు యూపీయే అధికార పీఠం ఎక్కడానికి తోడ్పడింది రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న అత్యధిక స్థానాలు. ఈ సంగతి కేంద్ర మంత్రివర్గ విస్తరణ సమయంలో ఆ పార్టీ  అధినాయకులకు గుర్తు రాదు. కొత్త రైళ్ళు మంజూరు చేసేటప్పుడు స్మరణకు రాదు. నిధుల కేటాయింపుల సమయంలో సరేసరి.  
పోతే, జైపూర్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సమావేశం గురించి  ‘చింతన్ శిబిర్, చింతన్ సివిర్’ అంటూ తెలుగు మీడియాలో వస్తున్న పదాలు వింటుంటే, తాము వోట్లు,సీట్లు కోరుకుంటున్న  దక్షిణాది రాష్ట్రాల  పౌరులకు కూడా  అర్ధమయ్యే రీతిలో ఈ సమావేశానికి పేరు పెడితే బాగుండేది అనిపిస్తోంది.  అందరికీ అర్ధం అయ్యే పదాలు హిందీలో కూడా వున్నాయి. ఈ  విషయం నిర్వాహకులకు గుర్తు రాకపోవడమే నిజానికి చింతించ వలసిన విషయం.
(19-01-2013)

18, జనవరి 2013, శుక్రవారం

ఈ నెల 28 న ఏం జరుగుతుంది ?



 ఈ నెల 28 న ఏం జరుగుతుంది ?

ఢిల్లీ నుంచి  గల్లీ దాకా ఇదే చర్చ. ఈ నెల 28 న ఏం జరుగుతుంది ?
తెలంగాణాకు పచ్చ జెండా చూపుతారా?
సమైక్యానికే ‘సై’ అంటారా?
‘ప్యాకేజీలతో’ సరిపుచ్చాలని చూస్తారా?
హైదరాబాదును ఏం చేస్తారు?  
అసలేమీ చేయకుండా  ఏదో నెపం, ఎవరిమీదో మోపి, తాము  చల్లగా తప్పుకుని మొత్తం సమస్యను శీతల గిడ్డంగిలోకి నెట్టేస్తారా?
అన్నీ ప్రశ్నలే. సమాధానం లేని ప్రశ్నలు. అన్ని రకాల సమాధానాలు వస్తున్న ప్రశ్నలు. ఎవరికి తోచిన జవాబు వారిస్తున్నారు. తమ మనసులోని మాటనే వాటికి  సమాధానంగా ఇస్తున్నారు. తాము ఏమి కోరుకుంటున్నారో దానికే అక్షర రూపం కల్పిస్తున్నారు.
కాంగ్రెస్ సంస్కృతిని గమనం లోకి తీసుకుంటే ఇలాగే జరిగితీరుతుందని చెప్పడానికి  వీలులేదు. కానీ ఇలా జరగొచ్చని చెప్పడానికి మాత్రం వీలుంది.
అలా వీలున్న ప్రత్యామ్నాయాలు  ఇప్పటికి ఇలా కనబడుతున్నాయి.
ఆప్షన్ నెంబర్ వన్ – ఏమయినా జరగనీ. తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం.
(ఈ అంచనాకు ఆధారాలు: వాయలార్ రవి వ్యాఖ్యలు. సమైక్యంగా వుంచినా సీమాంధ్ర లో జగన్ పార్టీని ఎదుర్కొని కాంగ్రెస్ ను బట్టకట్టించడం కుదరని పని అని నిర్ధారణకు రావడం. తెలంగాణలో అయినా నష్టాన్ని కొంత మేరకు భర్తీ చేసుకోవచ్చన్న ఆలోచన. ఒకవేళ జగన్ పార్టీ  పైకి  అనుకున్నంత బలంగా లేకపోయినా దానికున్న బలం వోట్లను చీల్చి తెలుగుదేశానికి లేనిపోని లాభం కలిగించడానికి పనికొస్తుందేమో  అన్న సందేహం. అదీ ఇదీ కాకుండా, తెలంగాణా ఏర్పాటు నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన  కారణం జగన్ పార్టీయే అన్న భావన ప్రజల్లో  కలిగించి సీమాంధ్ర లో  దాని ప్రభావాన్ని తగ్గించడం.)
ఆప్షన్ నెంబర్ టు – రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడం.
(ఈ అంచనాకు ఆధారాలు : ఈ రకమైన ప్రకటన చేయాల్సివస్తే  ఉత్పన్నమయ్యే శాంతి భద్రతల సమస్యలను ఎదుర్కోవడానికి  తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై  అత్యున్నత స్థాయిలో జరుగుతున్న సమాలోచనల గురించి వెలువడుతున్న సమాచారం)
ఆప్షన్ నెంబర్ త్రీ : హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా లేక కేంద్రపాలిత ప్రాంతంగా చేసి రాష్ట్రాన్ని విభజించడం
( ఈ అంచనాకు ఆధారాలు : ప్రత్యేక తెలంగాణా కోసం పట్టుబడుతున్న టీ.ఆర్.ఎస్. వంటి ఉద్యమ పార్టీల నాయకులను విశ్వాసంలోకి తీసుకుని కనీసం కొన్ని సంవత్సరాల వరకైనా  ఈరకమైన  ఏర్పాటుకు అంగీకరించేలా వొత్తిడి చేయడం – ‘హైదరాబాదు విషయంలో రిఫరెండానికి సిద్ధం’ అంటూ టీ.ఆర్.ఎస్. అధినేత చేసిన ప్రకటనను  ఇందుకు సంకేతంగా తీసుకోవచ్చు. పుష్కర కాలంగా చేస్తున్న పోరాటానికి ఫలితం కనుచూపుమేరలోకి వచ్చిన సూచనలు స్పష్టంగా కానవస్తున్నప్పుడు, సిద్దాన్నాన్ని మరో మారు నేలపాలు చేసుకోకుండా, కొన్ని  సడలింపుల ద్వారా లక్ష్యాన్ని సాధించుకోగలిగామన్న సంతృప్తితోనైనా  వారు అంగీకరించకపోతారా అన్న  ఆశ.)
ఆప్షన్ నెంబర్ ఫోర్: ‘రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు వుండవు’ అన్న సూక్తిని మరోమారు రుజువు చేస్తూ ఇరవయ్యెనిమిదవ తేదీన ‘అంతా హుష్ కాకీ’ అన్న తరహాలో సమస్యను తేల్చకుండా మరింత నానబెట్టే ధోరణిని కొనసాగించడం. (దీనికి ఆధారాలు కనబడవు. ఎందుకంటే ఇలాటి  ఎత్తుగడలన్నీ ఎలాటి  ఆధారాలు కనబడకుండా పన్నుతుంటారు కాబట్టి)
ముహూర్తం దగ్గర్లోనే వుంది కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. ‘కానున్నది కాకమానదు. కానిది కానే కాదు’ అనే వేదాంతం వొంటబట్టించుకున్న బాపతుకదా!
‘విదియనాడు కళ్ళు చికిలించుకున్నా కనబడని చంద్రుడు తదియనాడు తానే కనబడతాడ’ని  కదా నానుడి.
చూద్దాం. ఇరవయ్యెనిమిదిన చంద్రుడు కనబడతాడేమో! (18-01-2013)            

    

17, జనవరి 2013, గురువారం

చావు తెలివి


చావు తెలివి
సుబ్బారావుకు అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయి.



ప్రాణాలు పట్టుకు పోవడానికి వచ్చిన యమదూత  మంచం పక్కన నిలబడి పోదాం పదఅనేదాకా అతగాడికావిషయం తెలియదు.
అల్లా అంటే ఎల్లా? ఇలా వచ్చి హడావిడి పెడితే యెలా?’ అన్నాడు సుబ్బారావు యమదూతతో.
అదంతా నాకు తెలియదు. నా లిస్టులో ఈరోజు నీ పేరే మొదట వుంది.
సరే! వచ్చినవాడివి వచ్చావు. పోయే వాడిని నేను ఎలాగో పోతున్నాను. పిలవకుండా  ఇంటికి వచ్చిన అభ్యాగతికి అతిధి మర్యాద చేయకపోతే ఏం మర్యాదగా వుంటుంది చెప్పు. ఎండనబడి ఇన్ని లోకాలు దాటుకుంటూ నాకోసం వచ్చావు. అలా కూర్చో. నిమ్మ కాయ పిండి తేట మజ్జిగ కలిపి ఇస్తాను’ అన్నాడు సుబ్బారావు.
సుబ్బారావు వొంటింట్లోకి వెళ్ళి పెద్ద గ్లాసుడు మజ్జిగ తెచ్చాడు. చావు తెలివి చూపించబోయి అందులో నిద్ర మాత్రలు గుప్పెడు కలిపి మరీ తెచ్చి ఇచ్చాడు.
మజ్జిగ తాగిన యమదూత నిద్రలోకి జారిపోయాడు. అదే సందనుకుని సుబ్బారావు యమదూత దగ్గర వున్న జాబితా తీసుకుని  అందులో ముందు రాసివున్న  తన పేరు చెరిపేసి దాన్ని  ఆఖరున రాసాడు.  సుబ్బారావు తన తెలివికి తానే మురిసిపోయేలోగా యమదూత నిద్ర నుంచి లేచాడు.
లేచి ఇలా అన్నాడు. మజ్జిగ మహత్తరం. దాని రుచి అద్భుతః. నీ ఆతిధ్యం మరింత అద్భుతః. నేను కనబడగానే ఏడుపులు పెడబొబ్బలు పెట్టేవాళ్ళే  కాని నీలా మర్యాద చేసిన వాడు నాకు ఇంతవరకు కనబడలేదు. అందుకని నీకో మేలు చేద్దామనుకుంటున్నాను. యమలోకానికి తీసుకువెళ్ళే మనుషుల జాబితాను పైనుంచి కాకుండా అడుగునుంచి మొదలుపెడతాను
చావు దగ్గరపడ్డ సుబ్బారావు ఆ మాటలతో బిక్క చచ్చిపోయాడు.
(17-01-2013)

15, జనవరి 2013, మంగళవారం

మిధునం సినిమా మహిమ





మిధునం సినిమా మహిమ

ఓ మూడు రోజులపాటు హైదరాబాదు వొదిలిపెట్టి - దాదాపు యాభై ఏళ్ళ తరువాత మా స్వగ్రామం కంభంపాడులో నిద్ర చేసాము. దాదాపు ముప్పై మందిమి -  కొడుకులూ,  కోడళ్ళు, పిల్లజెల్లాతో కలసి ఈ 'పల్లెకు పోదాం’  కార్యక్రమంలో పాల్గొన్నాము. వీళ్ళల్లో సగానికిపైగా ఎప్పుడూ పల్లెటూరు మొహం చూసిన వాళ్లు కాదు.  ‘మిధునం’ సినిమా చూసిన తరువాత  వీళ్ళందరికీ పల్లెటూరు చూడాలన్న కోరిక పుట్టుకొచ్చింది. ఎన్నడూ రుచి చూడని జొన్నన్నం వండడం కోసం నగరాల్లో పుట్టి పెరిగిన మా కోడళ్ళు జొన్నలు దంచేందుకు రోకళ్ళు చేతబట్టారు. ఆ సన్నివేశం  అద్భుతః