17, జనవరి 2013, గురువారం

చావు తెలివి


చావు తెలివి
సుబ్బారావుకు అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయి.ప్రాణాలు పట్టుకు పోవడానికి వచ్చిన యమదూత  మంచం పక్కన నిలబడి పోదాం పదఅనేదాకా అతగాడికావిషయం తెలియదు.
అల్లా అంటే ఎల్లా? ఇలా వచ్చి హడావిడి పెడితే యెలా?’ అన్నాడు సుబ్బారావు యమదూతతో.
అదంతా నాకు తెలియదు. నా లిస్టులో ఈరోజు నీ పేరే మొదట వుంది.
సరే! వచ్చినవాడివి వచ్చావు. పోయే వాడిని నేను ఎలాగో పోతున్నాను. పిలవకుండా  ఇంటికి వచ్చిన అభ్యాగతికి అతిధి మర్యాద చేయకపోతే ఏం మర్యాదగా వుంటుంది చెప్పు. ఎండనబడి ఇన్ని లోకాలు దాటుకుంటూ నాకోసం వచ్చావు. అలా కూర్చో. నిమ్మ కాయ పిండి తేట మజ్జిగ కలిపి ఇస్తాను’ అన్నాడు సుబ్బారావు.
సుబ్బారావు వొంటింట్లోకి వెళ్ళి పెద్ద గ్లాసుడు మజ్జిగ తెచ్చాడు. చావు తెలివి చూపించబోయి అందులో నిద్ర మాత్రలు గుప్పెడు కలిపి మరీ తెచ్చి ఇచ్చాడు.
మజ్జిగ తాగిన యమదూత నిద్రలోకి జారిపోయాడు. అదే సందనుకుని సుబ్బారావు యమదూత దగ్గర వున్న జాబితా తీసుకుని  అందులో ముందు రాసివున్న  తన పేరు చెరిపేసి దాన్ని  ఆఖరున రాసాడు.  సుబ్బారావు తన తెలివికి తానే మురిసిపోయేలోగా యమదూత నిద్ర నుంచి లేచాడు.
లేచి ఇలా అన్నాడు. మజ్జిగ మహత్తరం. దాని రుచి అద్భుతః. నీ ఆతిధ్యం మరింత అద్భుతః. నేను కనబడగానే ఏడుపులు పెడబొబ్బలు పెట్టేవాళ్ళే  కాని నీలా మర్యాద చేసిన వాడు నాకు ఇంతవరకు కనబడలేదు. అందుకని నీకో మేలు చేద్దామనుకుంటున్నాను. యమలోకానికి తీసుకువెళ్ళే మనుషుల జాబితాను పైనుంచి కాకుండా అడుగునుంచి మొదలుపెడతాను
చావు దగ్గరపడ్డ సుబ్బారావు ఆ మాటలతో బిక్క చచ్చిపోయాడు.
(17-01-2013)

1 కామెంట్‌:

కుమార్ దేవరింటి చెప్పారు...

నీతి:- చావు తెలివి ఉన్న చావు ను వాయీదా వెయ్యలేరు