ఎటు పోతున్నాం? – భండారు శ్రీనివాసరావు
సామాన్యుడికోసం రూపొందిన రాజ్యాంగ వ్యవస్థలన్నీ ఇటీవలి కాలంలో అసామాన్యులకోసం నిర్విరామంగా పనిచేస్తున్న క్రమంలో, అవి క్రమక్రమంగా తమ పూర్వ వైభవాన్ని కోల్పోతున్నాయనే చెప్పాలి. ఈ వ్యవస్థలు దారితప్పినప్పుడు సరిదిద్ది గాడిన పెట్టాల్సిన కర్తవ్యం భుజస్కందాల మీద వున్న ‘మీడియా’ సైతం ఆరోపణల నీలినీడలను తప్పించుకోలేకుండా వుండడం మరో విషాదం.
ప్రత్యర్ధి పార్టీలను నామరూపాలు లేకుండా చేయాలనుకోవడం రాజకీయ రంగంలో చాలా సహజమయిన విషయం. ఎన్నికల్లోనూ, ఇతరత్రా కూడా ఈ లక్ష్య సాధనకోసం రాజకీయ పార్టీలు పనిచేస్తూనే వుంటాయి. నైతికంగా ఇది తప్పే అయినా రాజకీయకోణం నుంచి చూస్తే వాటికి ఇది తప్పనిసరి వ్యవహారం. అందుకే ఎన్నికల్లో తేలని విషయాలను న్యాయస్తానాల ద్వారా తేల్చుకోవాలని ప్రయత్నించడం ఈ మధ్య కాలంలో ఎక్కువయింది. ఒకరకంగా చెప్పాలంటే సివిల్ కేసుల్లో సెటిల్మెంట్ మాదిరి. భూములు, ఆస్తి తగాదాలను పరిష్కరించే మిషతో లావాదేవీలు నడిపే పోలీసు అధికారులు, ఇతర సంబంధిత సిబ్బంది - ‘కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకో! మిగిలిన విషయాలు మేము చూసుకుంటాం!’ అనే రీతిలో హామీలు ఇస్తుండడం కద్దు. కోర్టు నిర్ణయాలను ప్రశ్నించడం కోర్టు ధిక్కారం కిందికి వస్తుంది కాబట్టి సెటిల్మెంట్ వ్యవహారాలు నడిపేవారికి మరింత వెసులుబాటుగా మారింది. ఇప్పుడిది రాజకీయ పార్టీలకు కొత్త అస్త్రంగా తయారయింది.
మొన్నటికి మొన్న జగన్ మోహన రెడ్డి పై ఇదే బాణం ఎక్కుబెట్టారు. మళ్ళీ ఈ రోజున అదే బాణం చంద్రబాబు వైపు తిరిగింది. అధికారం అండగా చేసుకుని ఆర్ధిక నేరాల ఆరోపణల్లో చిక్కుకున్న వారిపై దర్యాప్తులు జరిపి నేరం రుజువు చేస్తే తప్పుబట్టేవాళ్ళు ఎవ్వరూ వుండరు. అలా కాకుండా ఇది కేవలం రాజకీయ కక్షలను సెటిల్ చేసుకునే క్రమంలో సాగే వ్యవహారం అయితే పరిణామాలు దారుణంగా వుంటాయి. పొరుగున వున్న తమిళనాడులో ఈ విష సంస్కృతి ఇప్పటికే వూడలు దిగివుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అక్కడి పార్టీలు ప్రత్యర్ధులపై కక్షలు తీర్చుకునే విధానాలు ఏ మేరకు దిగజారాయో అందరికీ తెలిసిన విషయమే. కాకపొతే గుడ్డిలో మెల్ల అన్నట్టు అక్కడి ప్రధాన పార్టీల వాళ్లు తమ పోరాట క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే రీతిగా నడుచుకోరు. కానీ మన రాష్ట్రంలో పరిస్తితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. అందుకే రాజకీయ సెటిల్మెంట్ల వ్యవహారం ఇంతగా ఆందోళన కలిగిస్తోంది.
ఇది ఒక పార్శ్వం. దీన్ని మించిన ప్రమాదకరమయిన పరిణామం మరొకటి వుంది.
జగన్ మోహన రెడ్డి మీద సీ.బీ.ఐ. దర్యాప్తుకు కోర్టు ఆదేశించినప్పుడు ఆయనకు చెందిన సాక్షి పత్రిక, సాక్షి టీవీ- కొన్ని పత్రికలు, మరికొన్ని మీడియా సంస్తలు అందిస్తున్న సమాచారంపై అనేక ఆరోపణలు చేశాయి. దర్యాప్తు క్రమంలో ప్రచురితమవుతున్న వార్తలను అభూతకల్పనలుగా కొట్టివేశాయి. నాలుగు గోడలమధ్య జరుగుతున్నవిచారణ సంగతులను అక్షరం పొల్లుపోకుండా కళ్లకుకట్టినట్టు వైనవైనాలుగా వర్ణించి రాయడం ఫక్తు ‘ఎల్లో జర్నలిజం’ అని అభివర్ణించాయి. మీడియాలో ఒక వర్గం చంద్రబాబుకు కొమ్ముకాస్తోందని ఆరోపించాయి. గత కొద్ది రోజులుగా సాగుతూ వస్తున్న తతంగం ఇది.
సాక్షి అభియోగాలను ఖండించాల్సిన అగత్యం ఆ మీడియాకు వుండకపోవచ్చు. కాకపొతే తాము ఇన్ని రోజులు నిస్పాక్షికంగా వార్తలు అందిస్తున్నామనీ, ఎవరిపైనో బురదజల్లే వార్తాకధనాలు అందించడం లేదని నిరూపించుకునేందుకు వాటికి ఇప్పుడొక సువర్ణావకాశం లభించింది. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సీ.బీ.ఐ. ఇక ముందు జరపబోయే దర్యాప్తు గరించి కూడా మునుపటి విధంగానే, అదేవిధమయిన రీతిలో వార్తా కధనాలను అందించగలిగితే సాక్షి చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోతుంది. రాజకీయ దురుద్దేశాలతో వార్తలు వండివారుస్తున్నారన్న అపప్రధ కూడా తొలగిపోతుంది. (15-11-2011)








