13, సెప్టెంబర్ 2011, మంగళవారం

9/11 - తలకెక్కని చరిత్ర పాఠాలు - భండారు శ్రీనివాసరావు

9/11 - తలకెక్కని చరిత్ర పాఠాలు - భండారు శ్రీనివాసరావు


9/11




ఈ రెండంకెలు అమెరికన్ ప్రజల మనస్సులో ఎంత బలంగా నాటుకు పోయాయంటే పదేళ్లు గడిచిన తరువాత కూడా సెప్టెంబర్ 11 వ తేదీన జరిగిన ఘోర సంఘటనను వారెవ్వరూ మరచిపోలేకుండా వున్నారు. న్యూ యార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాలు ఉగ్రవాదుల వైమానిక దాడికి గురయి పేకమేడల్లా కూలిపోతున్న దృశ్యాలు ప్రతి అమెరికన్ మదిలో కళ్ళకు కట్టినట్టు కదలాడుతూనే వుండి వుండాలి.

ఈ దాడి జరిగి మొన్నటికి పదేళ్లు గడిచాయి. ఇందులో ప్రాణాలు కోల్పోయిన దాదాపు మూడువేలమంది తాలూకు కుటుంబ సభ్యులు ఆ దుఖం నుంచి, ఆ దిగ్భ్రమ నుంచి ఇంకా తేరుకున్నట్టు కనబడదు. అలాగే, అమెరికన్ అగ్రరాజ్య అభిజాత్య అహంకార పూరిత చర్యల ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక వేలమంది ఇన్నేళ్ళుగా ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. వారి కుటుంబాల పరిస్తితి ఇదే. ఇదంతా ఎందుకోసం, ఇంత మారణ హోమం ఎవరికోసం అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకదు. మానవ జాతిని పీడిస్తున్న పెను విషాదాల్లో ఇదొకటి.

తన అధికారానికీ, తన పెత్తనానికీ ఎదురులేదని విర్రవీగే అమెరికన్ పాలకులకు 2001 దాడితో తగిలిన తొలిదెబ్బతో తల బొప్పికట్టింది. ఇన్నాళ్ళుగా తన స్వార్ధ ప్రయోజనాలకోసం పెంచి పోషిస్తూ వచ్చిన ఉగ్రవాద భూతం కోరలు సాచి కబళించడానికి వచ్చిన తరువాత కానీ అగ్రరాజ్యానికి కళ్ళు తెరిపిళ్ళు పడలేదు. ఈ దారుణ అవమానం నుంచి బయటపడేందుకు 9/11 దాడి సృష్టికర్త ఒసామా బిన్ లాడెన్ ను, వెంటాడి, వేటాడి మట్టు పెట్టేంతవరకు అగ్ర రాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ప్రతీకారేచ్చలతో అట్టుడికి పోతున్న రెండు వైరి వర్గాల మధ్య పోరు నిరంతరంగా సాగుతోంది. ఈ కారణంగా ప్రపంచదేశాలకు నిష్కారణంగా జరుగుతున్న కీడు గురించి ఆలోచించే తీరిక ఎవరికీ లేదు.



సెప్టెంబర్ దాడి గురించి మీడియాలో జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. దీనికి కారణభూతుడయిన ఒక వ్యక్తి మాత్రం చరిత్ర పుటల్లో కనుమరుగయి పోయాడు. అతడి పేరు మహమ్మద్ అత్తా.

2001, సెప్టెంబర్, 11 వ తేదీన హైజాక్ చేసిన ఓ అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని నడుపుతూ, మన్ హటన్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లో ఒకటయిన ఆకాశ హర్మ్యాన్ని దానితో డీకొట్టి కూల్చివేసి, నేలమట్టం చేసిన ఉగ్రవాది పేరే మహమ్మద్ అత్తా.

అత్తా పుట్టింది ఈజిప్టులో. తనకు ముప్పయ్యేళ్ళు పైబడ్డ తరువాత, ఒక సెప్టెంబర్ మాసంలోనే, అమెరికాకు చెందిన ఒక అద్భుత కట్టడాన్ని కూల్చబోతున్నానన్న సంగతి, బహుశా 1968 సెప్టెంబర్ లోనే పుట్టిన అత్తాకు తెలిసుండదు.

అత్తా చిన్నప్పటినుంచి మితభాషి. వాళ్ల నాన్న మహమ్మద్ మాటల్లో చెప్పాలంటే జెంటిల్ మన్. తన పనేదో తనది తప్ప ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకునే తత్వం కాదు.

కెయిరో విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ కోర్సు చేశాడు. తరువాత జర్మనీ వెళ్లి హాంబర్గ్ లో అర్బన్ ప్లానింగ్ లో డిగ్రీ తీసుకున్నాడు. హాంబర్గ్ జీవితం అతని జీవన గమనాన్నే మార్చివేసింది. అక్కడ అతడికి ఇస్లాం ఉగ్రవాదులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారి వల్ల ప్రభావితుడై, వారి ప్రోద్బలంతో ఆఫ్ఘనిస్తాన్ చేరుకొని అక్కడ అల్ ఖయిదా శిక్షణా శిబిరంలో చేరాడు. చివరకి, ఒసామా బిన్ లాడెన్ తనకు ఒప్పగించిన కర్తవ్యాన్ని జయప్రదంగా ముగించి ఆ క్రమంలోనే తన జీవితానికి కూడా ముగింపు వాక్యం పలికాడు.

అత్తా మహమ్మద్ గురించిన మరో ఆసక్తికర కధనం అమెరికా మీడియాలో ప్రాచుర్యం పొందింది.

1986 లో అత్తా తనకు అప్పగించిన బాధ్యతల్లో భాగంగా ఇజ్రాయెల్ లో ఒక బస్సును పేల్చివేసి ఆ దేశపు పోలీసుల చేతికి చిక్కాడు. ఆ తరువాత, 1993 ఓస్లో ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తన అధీనంలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విదిచిపెట్టాల్సిన పరిస్తితి వచ్చింది. అయినా, ‘రక్తపు మరకలు’ అంటిన ఉగ్రవాద ఖయిదీలను వొదిలిపెట్టడానికి ఆ దేశం ఓ పట్టాన ఒప్పుకోలేదు. ఆ రోజుల్లో బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడు. వారెన్ క్రిష్టఫర్ విదేశాంగ మంత్రి (సెక్రెటరీ ఆఫ్ స్టేట్). ఖయిదీలనందరినీ విడుదలచేయాలని వారు ఇజ్రాయెల్ పై వొత్తిడి తెచ్చారు. దానితో ఇజ్రాయెల్ జైళ్లలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విడిచిపెట్టారు. మహమ్మద్ అత్తా కూడా వారిలో ఒకడు.

చూసే కంటిని బట్టి ప్రపంచం కనబడుతుందంటారు. అందుకే, ఉగ్రవాదుల దృష్టిలో అత్తా ఆత్మ బలిదానం చేసిన అమర వీరుడు. అమెరికా దృష్టిలో కరడుగట్టిన ఉగ్రవాది.

దశాబ్దం క్రితం ఈ సంఘటన చోటుచేసుకున్నప్పుడు అమెరికాతో పాటు ప్రపంచం యావత్తు నివ్వెరపోయింది. ఉగ్రవాదం ఎంత భయంకరమయినదో తెలియచెబుతూ, దాన్ని కూకటివేళ్ళతో పెకలించివేయాల్సిన ఆవశ్యకతను గురించి వివిధ దేశాల నాయకులందరూ నొక్కిచెప్పారు. ఈ కర్తవ్య దీక్షకు కట్టుబడివుంటామని వాగ్దానాలు చేశారు. కానీ, ఈ పదేళ్ళ కాలంలో జరిగిందేమిటి? ఉగ్రవాదం మరింతగా జడలు విరబోసుకుని చేస్తున్న కరాళ నృత్యం పదఘట్టనల కింద విశ్వవ్యాప్తంగా అసువులు బాస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతూనే వుంది. ముఖ్యంగా మన దేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉగ్రవాద నిర్మూలన అనేది భరించలేని భారంగా మారింది. ప్రజాసంక్షేమానికి ఖర్చుచేయాల్సిన విలువయిన వనరులను భద్రతా చర్యలకు మళ్ళించాల్సి వస్తోంది.

హైదరాబాదులో, ముంబైలో, మొన్నటికి మొన్న ఢిల్లీలో జరిగిన పేలుళ్లు జనంలో పెచ్చరిల్లుతున్న అభద్రతా భావానికి పునాది రాళ్ళుగా మారుతున్నాయి.

ఈ హింస ప్రతి హింసలను నిలుపుచేయడానికి కావాల్సింది కేవలం డంబాలతో కూడిన ప్రకటనలు కాదు. రాజకీయ దృఢ నిశ్చయం. కానీ, ఆధిపత్యపు పోరులో కత్తులు దూసుకునేటప్పుడు విచక్షణ పక్కకు తప్పుకుంటుంది. వివక్ష రెక్కలు తొడుక్కుంటుంది. రక్తం మరిగిన పులి రక్తాన్నే కోరుకుంటుంది. ప్రతీకారంతో రగిలిపోయేవారికి శాంతి వచనాలు చెవికెక్కవు.

చరిత్ర ప్రాముఖ్యం తెలిసిన వారు చరిత్ర నుంచి గుణ పాఠాలు నేర్చుకుంటారు. చరిత్ర క్రమంలో ఎదురయ్యే సంఘటనలను గుర్తుచేసుకుని నెమరు వేసుకోవడంతో సరిపుచ్చుకోరు. (13-09-2011)







11, సెప్టెంబర్ 2011, ఆదివారం

సరదాకి - భండారు శ్రీనివాసరావు

సరదాకి - భండారు శ్రీనివాసరావు





‘మీ కుక్క పెరటి గుమ్మంలో అదేపనిగా మొరుగుతోంది. అదేసమయంలో ఇంటి ముందు మీ ఆవిడ తలుపు తీయమని గట్టిగా అరుస్తోంది. ముందు ఎవరికి తలుపు తీస్తావ్?’ అడిగాడు ఏకాంబరం లంబోదరాన్ని.
‘ఇందులో పెద్దగా ఆలోచించేది ఏముంది. ఎంత మాత్రం మతి వున్నవాడయినా ముందు కుక్కనే ఇంట్లోకి రానిస్తాడు. లోపలకు రాగానే అది మొరగడం ఆపేస్తుంది కాబట్టి.' జవాబిచ్చాడు లంబోదరం.



ఏకాంబరం తన తల్లి చనిపోయిన రోజు ఆమె సమాధి వద్ద పూలుపెట్టి తిరిగివస్తుంటే మరో సమాధి వద్ద మోకాళ్ళ మీద నిలబడి ప్రార్ధన చేస్తున్న ఓ వ్యక్తి కనిపించాడు.


‘ఎందుకు అలా హటాత్తుగా చనిపోయి నన్ను తీరని వేదనలో ముంచి వెళ్ళావ్ ! ఇది నీకు ధర్మమేనా!’ అంటూ అతగాడు పెద్దగా ఏడుస్తూవుండడం చూసి ఏకాంబరం ఆశ్చర్య పోయాడు.


‘చనిపోయినవాళ్ల కోసం ఇంతగా బాధపడేవాళ్ళను నేను ఇంతవరకు చూడలేదు. ఇంతకీ పోయిందెవరు’ అని ఆరాతీశాడు.


‘మా ఆవిడ మొదటి మొగుడు’
టపీమని జవాబుచెప్పాడు అతగాడు కాసేపు ఏడుపాపి.







యాత్రలు చేస్తున్న దంపతులకి గైడ్ ఒక బావిని చూపించి చెప్పాడు.
‘అది ఎంతో మహిమ కలిగిన బావి. దానిలోకి తొంగి చూస్తూ మనసులో ఏమి కోరుకున్నా సరే అది వెంటనే జరిగి తీరుతుంది.'


ముందు భర్త బావిలోకి తొంగి చూశాడు.


తరువాత భార్య కూడా అందులోకి తొంగిచూస్తూ ప్రమాద వశాత్తు కాలు జారి అందులో పడి మునిగి పోయింది.
కంగారు పడుతున్న గైడ్ తో మొగుడు అన్నాడు నింపాదిగా.


‘నువ్వు చెప్పింది నిజమే! ఇది చాలా మహిమలు కలిగిన బావి అనడంలో ఎలాటి సందేహం లేదు. మనసులో ఇలా అనుకున్నానో లేదో అలా జరిగిపోయింది.’





ఇంటి ఖర్చులు గురించి భార్యా భర్తా గొడవ పడుతున్నారు.
‘ఎంత డబ్బూ నీ ఖర్చుకు చాలడం లేదు. నాకీ డబ్బే లేకుండా వుంటే ఈ సంసారం ఈ గోల వుండేవి కావు.’ మొగుడు తలపట్టుకుంటూ అన్నాడు.
‘ఇన్నాల్టికి ఓ మంచి మాట చెప్పావు. నీకు ఈ డబ్బే లేకపోతే నీ భార్యగా నేనూ వుండేదాన్ని కాదు.’



చేతిలో మిగిలేవి చిల్లిగవ్వలే !

‘పెళ్లి చేసుకుని సంసారం పెట్టాలంటే ఎంత ఖర్చవుతుంది?’ అడిగాడు ఓ బ్రహ్మచారి ఓ సంసారిని.
‘పెళ్ళయి పాతికేళ్లయింది. ఇంకా చెల్లిస్తూనే వున్నాను కానీ బాకీ చెల్లు కావడం లేదు.’

ఆడ మనసు

‘ఆడవారిని అర్ధం చేసుకోవడం అంటే మాటలు కాదు. పెళ్ళికి ముందు కాబోయే మొగుడి నుంచి ఏవేవో ఆశిస్తారు. పెళ్ళయిన తరువాత అతగాడిని శాసిస్తారు. భర్త చనిపోయిన తరువాత పూజిస్తారు'




పరాశరం ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. ఆ మాట ఆమెతో చెబుతూ ఆమెకోసం నరకానికి వెళ్ళడానికయినా సిద్ధం అన్నాడు


ఇద్దరికీ పెళ్లయింది.


తరువాత అతడన్నదే నిజమయింది.




'పెళ్ళాం దిగడానికి ఎవడయినా కారు డోరు తెరిచి పట్టుకున్నాడంటే ఒకటి మాత్రం నిజం.
ఆ కారయినా కొత్తదయివుండాలి లేదా కొత్త భార్య అయినా అయివుండాలి.'





భార్యను ఎత్తుకుపోయిన కిడ్నాపర్ల నుంచి ఏకాంబరానికి ఫోను వచ్చింది.
‘నీ భార్యను విడిచి పెట్టాలంటే వెంటనే యాభయి లక్షలు ఇస్తానని మాకు మాట ఇవ్వాలి. నువ్వలా ప్రామిస్ చేయకపోతే నీ భార్య తలకోసి పార్సెల్ చేస్తామని మేము వాగ్దానం చేయాల్సివుంటుంది. జాగ్రత్త!’
ఏకాంబరం జవాబు చెప్పాడు.
‘అంత డబ్బు ఇస్తానని మాట ఇచ్చి తప్పలేను. కనీసం మీరయినా మీ మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను.’





‘ఎందుకలా సర్వస్వం పోయినట్టు విచారంగా వున్నావు?’


‘భార్యతో గొడవగా వుంది.’


‘అసలేమి జరిగింది?’
‘నాతొ లడాయి పెట్టుకుని ముప్పయి రోజులు నాతో మాట్లాడేది లేదని భీష్మించుకుంది.'
‘దీంట్లో బాధ పడడానికి ఏముంది? అన్నాళ్ళు మాట్లాడకుండా వుంటే మంచిదేగా’
‘కరక్టే. కానీ ఈరోజే చివరి రోజు’

(11-09-2011)



(ఇమేజ్ సొంతదారులకు కృతజ్ఞతలు - రచయిత)  




























7, సెప్టెంబర్ 2011, బుధవారం

ఓరి భగవంతుడా ! – భండారు శ్రీనివాసరావు

ఓరి భగవంతుడా ! – భండారు శ్రీనివాసరావు



దేవుడు లేడని ఆయన్ని నమ్మనివాళ్ళంటారు.


వున్నాడని నమ్మేవాళ్ళంటారు.




దేవుడు పేరు చెప్పి సొమ్ములు పోగేసుకుంటున్నారని నాస్తికులు ఆరోపిస్తుంటే, దేవుడు లేడని చెబుతూ డబ్బులు దండుకుంటున్నారని వారి ప్రత్యర్ధులు అంటుంటారు. నాకయితే ఇద్దరూ కరక్టే అనిపిస్తుంది.


దేవుడ్ని నమ్మినా నమ్మకపోయినా నమ్మినట్టు నటించడం వల్ల కొన్ని ప్రయోజనాలు వున్నట్టే, దేవుడ్ని నమ్ముతున్నా నమ్మనట్టు బూకరించడం వల్ల కూడా కొన్ని లాభాలు వున్నాయి. ఈ రెండు తరగతులవారు నిత్యం అందరికీ తారసపడుతూనే వుంటారు కాబట్టి వీరు కనబడడం కోసం ప్రత్యేకంగా తపస్సులు చేయనక్కరలేదు. ఏదో ఒక అంశంపై టీవీ తెరలపై అనునిత్యం దర్శనం ఇస్తూనే వుంటారు. వీరుకాక మరో రెండు తరగతులవారు వున్నారు. దేవుడే సాక్షాత్తు దిగివచ్చినా దేవుడ్ని నమ్మని వారు ఒక బాపతు. కానీ ఆ విషయం పైకి టముకు వేసుకోరు. మనసా వాచా కర్మణా పూర్తిగా నమ్మేవారు రెండో రకం. వీరు కూడా భగవంతుడిని బజారుకు లాగరు. గుండెల్లోనే గుడికట్టుకుని వుంచుకుంటారు. కానీ, నమ్మకం లేని ఆ భగవంతుడూ నమ్మని వీళ్ళను కనుక్కోడు. నమ్మిన ఆ దేవుడూ నమ్మేవాళ్లను పట్టించుకోడు. హీనపక్షం టీవీ ఛానళ్ళ కూడా వారికి కూడా వీరి అయిపూ ఆజా పట్టదు. ఎందుకంటె వారి రేటింగులకు కావాల్సినట్టు దేవుడు గురించి ఎద్దేవాగా మాట్లాడడం, దేవుడికోసం పోట్లాడడం వీరికి, వారికి బొత్తిగా తెలియదు కాబట్టి.


దేవుడున్నాడో లేదో తెలియదు కానీ దేవుడున్నాడా లేడా అన్న ప్రశ్న మాత్రం అనాదినుంచి వుంటున్నదే. ఆస్తికులు, నాస్తికుల మధ్య దేవుడిని గురించిన చర్చ కూడా అనాదినుంచి సాగుతున్నదే. ఈ ఎడతెగని చర్చకు దేవుడి మాదిరిగానే అంతం అంటూ లేదు.


తొక్కితే రాయి – మొక్కితే సాయి. అంతా నమ్మకం.


దేవుడ్ని నమ్మడం ఎంత నమ్మకమో నమ్మకపోవడం కూడా అంతే నమ్మకమని నా నమ్మకం.


దేవుడు పేరు చెప్పి మోసం చేయడం ఎంత ద్రోహమో దేవుడు లేడంటూ పనికిమాలిన చర్చలు లేవదీయడం కూడా అంతే దారుణం. ఎందుకంటె దేవుడనే వాడు నా దృష్టిలో వ్యక్తిగతం. నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు మరొకడు వున్నాడని ఒప్పుకోవడానికి నామోషీ పడనక్కరలేదు. ఇతరులలోని గొప్పదనం గుర్తించేవారు వారు నాస్తికులయినా సరే భగవంతుడనే సర్వ శక్తిమంతుడు మరొకడు వుండేవుంటాడని అనుకుంటే పేచీ లేదు. అలాగే దేవుళ్ళని నమ్మేవాళ్ళు కూడా. భగవంతుడు వున్నాడని పూర్తిగా విశ్వసించే గజేంద్రుడే మొసలినోట చిక్కి విలవిలలాడుతున్నప్పుడు ‘కలడు కలండనెడివాడు కలడో లేడో?’ అని అనుమానపడతాడు. పరీక్ష పెట్టికానీ మార్కులు వేసే అలవాటులేని ఆ దేవ దేవుడు పందొమ్మిదో రీలు తరువాత కానీ ఏనుగు రక్షణకు రాడు.


దేవుడ్ని నమ్మని గోరాగారు ‘దేవుడు లేదు’ అనేవాడు. ‘లేదు’ ఏమిటండి ‘లేడు’ అనాలిగా అంటే ‘అసలు లేని వాడు పుంలింగం అయితే ఏమిటి స్త్రీ లింగం అయితే ఏమిట’ని ఎదురు ప్రశ్న వేసేవారు. ఆయన వ్యక్తిత్వశోభ ముందు అలా చెల్లిపోయింది. కాకపోతే ఇప్పుడు బెజవాడ నాస్తిక కేంద్రం వారికి గోరానే దేవుడు. ఆ మాటకొస్తే దేవుళ్ళందరూ ఇలా అవతరించిన వాళ్ళేనేమో. వాళ్ల వాళ్ల కాలంలో తమ గుణగణాలచేత విఖ్యాతులయిన వాళ్లు తదనంతర కాలంలో దేవుళ్ళుగా కొలవబడ్డారేమో.


దేవుళ్ళను చూస్తే జాలి వేస్తుంది. వాళ్లు చెప్పిన మాట వాళ్ల భక్తులు కూడా వినరు. బుద్దుడు విగ్రహారాధన వద్దంటే శిష్యులు మాట వింటేనా. బహుశా అంతంత పెద్ద విగ్రహాలు ప్రపంచంలో మరే దేవుడుకి లేవేమో. (బుద్దుడు దేవుడా అంటే అది మరో చర్చ).


‘నేను సర్వవ్యాపితుడిని. ఎందెందు వెదకి చూసిన అందందే వుంటాన’ని ఎంత మొత్తుకున్నా వినే దెవరు? ‘చెట్టులో,పుట్టలో అంతటా నేనే’ అన్నా విన్నదెవరు? చిన్నదో పెద్దదో ఓ గుడికట్టి అక్కడే కట్టిపడేశారు.


మా చిన్నప్పుడు వంటింట్లో గోడమీద ఎర్రగా ఓ చదరంలో వేంకటేశ్వర స్వామి నామాలు వుండేవి. అదే అందరికీ పూజాగృహం. స్నానం చేసిన తరువాత అక్కడ నిలబడి ఓ దణ్ణం పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడో! ‘పూజ రూమ్ వుందా?’ అన్నది ఫ్లాట్ కొనేముందు అడిగే మొదటి ప్రశ్న.


పూర్వం పిల్లలకు తల వెంట్రుకలు తీయించడానికి ఏడాదికో, రెండేళ్లకో తిరుపతి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పరీక్షలకు ముందు, తరువాత, రిజల్ట్స్ రాకముందు వచ్చిన తరువాత - అన్ని కుటుంబాల వాళ్లు పోలో మంటూ తిరుపతి యాత్రలే. మరి రద్దీ పెరిగిందంటే పెరగదా!


దేవుడ్ని నమ్మేవాళ్ళు ఆ నమ్మకాన్ని తమవరకే పరిమితం చేసుకోవాలి.


నమ్మని వాళ్లు అదేదో సమాజసేవ అన్నట్టు అదేపనిగా దేవుళ్ల మీద ఒంటికాలు మీద లేవడం కూడా మంచిదికాదు. బాధాసర్పద్రష్టులను ఉద్దరించడానికి ఇంకా సవాలక్ష మార్గాలున్నాయి. దేవుడ్ని నమ్మేవారిని వారి మానానికి వొదిలేసి తమపని తాము చూసుకుంటే సగం వాతావరణ (శబ్ద) కాలుష్యం తగ్గిపోతుంది.


సమాజం ఇప్పుడు ఎదుర్కుంటున్న సమస్యలు ఎన్నో వున్నాయి. వాటి ముందు దేవుడు ఒక సమస్యే కాదు.

(07- 09- 2011)

(ఇమేజ్ సొంతదారులకు ధన్యవాదాలు - రచయిత)

6, సెప్టెంబర్ 2011, మంగళవారం

తప్పులున్న క్షమించగలరు – భండారు శ్రీనివాసరావు

తప్పులున్న క్షమించగలరు – భండారు శ్రీనివాసరావు


పూర్వం కార్డులు, కవర్లు రాజ్యమేలే రోజుల్లో ప్రతి ఉత్తరం విధిగా ‘తప్పులున్న క్షమించగలరు’ అనే అభ్యర్ధనతో ముగిసేది.

సంఘజీవనంలో తెలిసో, తెలియకో, మాటలతోనో, చేతలతోనో సాటివారిని నొప్పించడానికి అవకాశాలెక్కువ. అందుకే, నాగరీకం బాగా ముదిరిన ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ‘సారీ’ అనే పదం ఉదారంగా వాడుతుంటారు. అలాగే రష్యన్లు కూడా మాట మాట్లాడితే ‘ఇజ్వెనీచ్ పజాలుస్త’ (సారీ ప్లీజ్) అంటారు. క్షమించమని కోరడం భారతీయ సంప్రదాయాల్లో భాగం. కానీ అన్ని సంప్రదాయాల్లాగే ఇది కాలక్రమేణా కనుమరుగు అవుతోంది. కాలు తొక్కి ‘సారీ’ చెప్పేవాళ్ళ సంఖ్య పెరుగుతోంది.

చర్చికి వెళ్లి కన్ఫెషన్ బాక్స్ లో నిలబడి చేసిన తప్పులను దేవుడికి నివేదింఛి క్షమాపణలు కోరే సంప్రదాయం క్రైస్తవుల్లో వుంది. జైనులు పాటించే విధానం ఒకటి ఇంటర్ నెట్ పుణ్యమా అని ప్రచారం లోకి వచ్చింది. దీని వాళ్లు ‘మిచ్చామి దుఖఃడం’ అని పిలుస్తారు. భాద్రపద మాసం నాలుగో రోజు అంటే వినాయక చవితి రోజున జైన మత విశ్వాసులు దీన్ని పాటిస్తారు. మిచ్చామి దుఖః డం అనేది ప్రాకృతంలో ఒక పద బంధం.



మిచ్చామి అంటే మరచిపోవడం, మన్నించడం అని అర్ధం.

దుఖః డం అంటే దుష్క్రు త్యాలు. చేసిన చెడ్డ పనులు అని అర్ధం.

జైనులు ప్రాయూషణ పర్వ కాలంలో ఎనిమిదో రోజున – భాద్రపద శుద్ద చవితి నాడు ఒకరికొకరు ‘ నేను చేసిన తప్పులను మన్నించండి’ అని మనవి చేసుకుంటారు. అంతకు ముందు ఏడాది కాలంలో తాము ఇతరులపట్ల చేసిన అపరాధాలకు క్షమాపణలు అర్ధిస్తారు. ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా ఈ తంతు కొనసాగుతుంది.

ఈమెయిలు లో వచ్చిన ఈ సమాచారాన్ని పురస్కరించుకుని ఉత్తేజితులయిన డాక్టర్ బాలాజీ ఊట్ల అప్పటికప్పుడు ఒక ఆంగ్ల కవితను రాసి నాకు మెయిల్ చేశారు. దాని స్వేచ్చానువాదం:

ఎప్పుడిక ? – డాక్టర్ బాలాజీ ఊట్ల

చిన్నప్పుడు మట్టిలో ఆడుకుంటూ బొక్క బోర్లా పడ్డాను.

దెబ్బ తాకింది, నొప్పి పుట్టింది.

‘ఛీ పాడు మట్టి

ఆ పాడు మట్టిదే తప్పు. నీది కాదులే చిట్టి కన్నా’ అన్నారు మా పెద్దాళ్లు.

చెయ్యి తెగింది.

నెత్తురు ధారగా కారింది

‘ఛా ఆ పాడు చాకునెందుకు పట్టుకున్నావు

ఆ చాకుదే తప్ప’న్నారు మళ్ళీ మా వాళ్లు.


మెట్ల మీద జారిపడ్డాను

తల బొప్పి కట్టింది

మళ్ళీ మెట్లకే పడ్డాయి అందరి మొట్టికాయలు.


ఇలా ఇంతప్పటినుంచి అందరూ నన్ను కాచుకున్నారు

కనురెప్పలా కనిపెట్టి చూసుకున్నారు.

నన్ను బాధ పెట్టిన వాటిని కసురుకున్నారు

కోపడ్డారు.

ఏమయినా ఒక్కటి నిజం

సాటివారిని బాధ పెట్టడం చాలా తేలిక

మన బాధలకు, వేదనలకు ఇతరులపై నెపం మోపడం ఇంకా సులువు

ఇక -

నేను నేర్చుకుండేది ఎప్పుడు?

నేర్చుకోకుండా వుండేది ఎప్పుడు?

పక్కవారిని తప్పు పట్టకుండా వుండడం

ఇక నేనెప్పుడు నేర్చుకుంటాను ?

నా చేతకానితనానికి

నేచేసే నిర్వాకాలకు

జరుగుతున్నవాటికి

కాకతాళీయంగా జరిగే వాటికి

ప్రమాదాలకు

ప్రమోదాలకు

అన్నింటికీ

కారణం నేనే అని నన్ను నేను నిందించుకోవడం

తప్పు నాదే అని హుందాగా ఒప్పుకోవడం

నేనెప్పుడు నేర్చుకుంటాను ?


తప్పుచేయడం మానవ సహజం అని తెలుసు

తప్పు నావల్లే జరిగినప్పుడు తటాలున గుర్తుకు వచ్చే ఈ సూక్తి

ఇతరులు చేసినప్పుడు

ఎందుకు స్పురణకు రావడం లేదో

ఎప్పుడు తెలుసుకుంటాను ?

బాధ పెట్టిన వాడిని మరింత బాధ పెట్టడం

పరిష్కారం కాదని

ఇంకెప్పుడు తెలుసుకుంటాను ?


కన్నుకు కన్ను జవాబు కాదని

రక్తం మరకను రక్తంతో కడుక్కోలేమని

ఎప్పుడు తెలుసుకుంటాను ?

ఎప్పుడు? ఇంకెప్పుడు ? ఆ రోజెప్పుడు ?

(స్వేచ్చానువాదం – భండారు శ్రీనివాసరావు)

(05-09-2011)

5, సెప్టెంబర్ 2011, సోమవారం

గురుద్దేవో నమో నమః ! - భండారు శ్రీనివాసరావు

గురుద్దేవో నమో నమః ! - భండారు శ్రీనివాసరావు


‘సంతః సదాభిగంతవ్యా యది నోపదిశం త్యపి

యాస్తు స్వైర కధాస్తేషాం ఉపదేశా భవంతి తాః’


మనకు పాఠాలు బోధించే గురువులు వుంటారు. చెప్పని గురుదేవులూ వుంటారు. ఇటువంటివారు ప్రత్యేకించి ఏవిధమయిన ఉపదేశాలు ఇవ్వకపోయినా వాళ్లు ఏం చెబితే అదే ఉపదేశం అవుతుందని ఈ శ్లోక తాత్పర్యం.

ఏ మంచి గురువయినా తన శిష్యుల ఎదుగుదలను కోరుకుంటాడు. ఈ క్రమంలో శిష్యుడు ఎవరయినా తనని దాటి పెరిగిపోతున్నా అసూయ పడనివాడే ఉత్తమ గురువు. ‘నేను పలానా అయ్యగారిదగ్గర పాఠాలు నేర్చుకున్నాను’ అని చెప్పుకోవడం శిష్యులకు గౌరవంగా వుంటుంది. అలాగే ‘పలానా వాడున్నాడే వాడు నా దగ్గరే చదువుకున్నాడు’ అని గుర్తుచేసుకోవడం గురువుకు ఆనందంగా వుంటుంది.

గురు శిష్యుల గురించి చెప్పుకునేటప్పుడు ఆకాశవాణి మాజీ డైరెక్టర్ డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ చెప్పిన ఒక చిన్న కధ (?) గుర్తుకువస్తోంది.

“ఆయన ఆ అబ్బాయికి పాఠాలు చెప్పాడు. కొన్నాళ్ళకు ఆ అబ్బాయి ఢిల్లీ సింహాసనం అధిష్టించి చక్రవర్తి అయ్యాడు. ఢిల్లీకి పాదుషా అయినా అయ్యవారికి విద్యార్థే కదా అని ఆ అబ్బాయికి ఒక ఉత్తరం రాశారు. అందులో తాము శ్రీవారికి చిన్నతనంలో చదువు చెప్పిన వివరాలు రాశారు. ఆ అబ్బాయి నుంచి అయ్యవారికి సమాధానం వచ్చింది.

“తమరు నాకు పనికి వచ్చే చదువు చెప్పలేదు. అక్కరలేనివన్నీ నా తలకెక్కించారు”

ఆ అయ్యవారి పేరు ఇక్కడ అప్రస్తుతం. కానీ ఆ అబ్బాయి పేరు ఔరంగజేబు.”

మరో అయ్యవారిని గురించి చెప్పుకుందాం.

1921 వ సంవత్సరం. అంటే దాదాపు తొంభయ్ ఏళ్ళ పైమాట. మైసూరు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఒక అయ్యవారికి కలకత్తాకు బదిలీ అయింది. ఆయనగారు మైసూరు నుంచి బయలుదేరుతుంటే ఆయన ఇంటినుంచి రైల్వే స్టేషన్ కు పెద్ద వూరేగింపు బయలుదేరింది. ఆయన ఎక్కిన బండికి గుర్రాన్ని కట్టకుండా విద్యార్ధులే రధాన్ని లాగినట్టు స్టేషను దాకా లాక్కువెళ్ళారట. ఆయన గారు ఎక్కిన రైలు బోగీని విద్యార్ధులు ఒక అందమయిన దేవాలయం మాదిరి పూలతో అలంకరించారు.”

పంతుళ్ళ చెవులకు శిష్యులు తాటాకులు కట్టే ఈ రోజుల్లో అటువంటి సంఘటన విడ్డూరమే.

ఇంతకీ ఆ అయ్యవారు ఎవరనుకున్నారు? తదనంతర కాలంలో భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు.

ఈ రోజు సెప్టెంబర్ ఐదో తేదీ. ఆ మహానుభావుడి పేరుతొ గురువులను సంస్మరించుకునే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకునే రోజు.

అక్షర బిక్ష పెట్టి జీవితంలో ఈ స్తాయికి చేర్చిన తొలి గురువులను గుర్తుచేసుకునే రోజు.

నాకు మా వూరిలో అక్షరాభ్యాసం చేసినదెవరో తెలియదు. తెలిసినదల్లా మాష్టారంటే అప్పయ్య పంతులు గారు. నిస్వార్ధంగా పిల్లలకు చదువు చెప్పిన పుణ్యమే ఆయన్ని ఈ రోజుకు కూడా ఆరోగ్యవంతుడిగా కాపాడుతోంది. ఆయన దగ్గర చదువుకున్న వాళ్లు కొంతమంది జీవితంలో పెద్దవాళ్ళయ్యారు. మరికొందరు వయస్సులో పెద్దవాళ్ళయ్యారు. కానీ ఆయన ఇప్పటికీ అప్పటిమాదిరిగానే సాధారణ జీవనం సాగిస్తున్నారు.

గురుపూజా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ మహానుభావుడికి మరోసారి మనః పూర్వకంగా -

“గురుద్దేవో నమః”

(05-09-2011)

ఆంధ్రజ్యోతి వాక్టూన్లు -11 - భండారు శ్రీనివాసరావు

ఆంధ్రజ్యోతి వాక్టూన్లు -11 - భండారు శ్రీనివాసరావు


‘కని పెంచుట’ లేదు!

డిష్యుం డిష్యుం



పక్కింటి పిల్లల రాక్షసి గోల 
విని గుండెల్లో బాంబులు పేల
అనుకుంది కొత్త కోడలు రమాబాల
ఇక కని పెంచుట ఏల ?



(మే, 29, 1975 నాటి ఆంధ్రజ్యోతి దినపత్రిక)



కాయ 'గోరా'లు



కుయ్యో మొర్రో



ఇంట్లోనే కూరగాయలు పెంచండని శ్రీ గోరా
ఇచ్చిన పిలుపును విని మా శ్రీవారా
రోజంతా పట్టుకు పలుగూ పారా
పెరడంతా తవ్వేస్తే రాత్రికి వొళ్ళు పట్టేది నేనా వారా



(జూన్, 11, 1975 నాటి ఆంధ్రజ్యోతి దినపత్రిక)



కార్టూనిష్టు/ఇమేజ్ సొంతదారుకు ధన్యవాదాలు – రచయిత


4, సెప్టెంబర్ 2011, ఆదివారం

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 10 - భండారు శ్రీనివాసరావు

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 10 - భండారు శ్రీనివాసరావు

ముద్రారాక్షసం




క్రిమినల్ లాయర్ శ్రీ కేజీ విమల్
తెల్లారి పేపర్లో మాజీ క్రిమినల్
ఎన్నివేస్తే మాత్రమేం సవరణల్
ఎంతమందికివ్వాలో ఆయన వివరణల్


(జూన్ - 4, 1975 - ఆంధ్ర జ్యోతి దినపత్రిక)


మైకేరియా







పేర్మోసిన మహావక్త రంగ రంగ భజరంగం
మైకు ముందు నిలవగానె పిల్లికూతలారంభం
పనిచేయని మైకు చూసి సభాసదుల సంరంభం
స్టేజి మీద భజరంగం – మొదలెట్టును వీరంగం

(జూన్, 10, 1975 - ఆంధ్ర జ్యోతి దినపత్రిక)





(కార్టూనిష్టులకు /ఇమేజ్ సొంతదారులకు కృతజ్ఞతలు - రచయిత)