20, ఆగస్టు 2011, శనివారం

రేడియో రోజులు - భండారు శ్రీనివాసరావు

రేడియో రోజులు - భండారు శ్రీనివాసరావు



బ్రహ్మ లోకంలో విధాత తన పద్మాసనంపై బాసింపట్టు వేసుక్కూర్చుని సృష్టికర్తగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న సమయంలో ఆయన సతీమణి, హాటుకగర్భురాణి అయిన చదువులతల్లి పక్కనే వుండి ఓరకంట తన భర్త చేతివేళ్లల్లో రూపుదిద్దుకుంటున్న జీవరాశుల్ని తదేకంగా గమనిస్తోంది.

సృష్టికార్యంలో నిమగ్నుడయివున్న బ్రహ్మదేవుడు పక్కన భార్య వున్న సంగతి సయితం మరచిపోయి, ఒక లావణ్యవతి రూపాన్ని రూపొందించి దానికి స్త్రీమూర్తి అని పేరుపెట్టాడు. ప్రాణం పోసి భూమిమీదకు పంపే సమయంలో సరస్వతమ్మకు ‘కరణేషు మంత్రి’ అనే సతీ ధర్మం తటాలున గుర్తుకువచ్చి ‘ఆగండాగండి! తొందరపడి యావత్ సృష్టినే గందరగోళంలోకి నెట్టకండి’ అని వేడుకుంది. వేడుకుంటూనే మరోపక్క మాటల్లో వేడిని కాస్త పెంచి -
‘ఇన్ని తలలున్నాయని పేరే కానీ చేస్తున్నదేమిటో, దాని పరిణామాలేమిటో ఒక్క మారయినా, కనీసం ఒక్క తలకాయతో నయినా ఆలోచించారా ?’ అని వాగ్దేవి తన వాగ్ధాటితో మొగుడ్ని అడ్డుకుంది.

ప్రతిక్షణం లక్షల కోట్ల జీవరాసులను ఒకదానితో మరొకటి పోలిక లేకుండా సృష్టించగల అపారమయిన శక్తియుక్తులున్న ఆ బ్రహ్మదేవుడు కూడా, ఎంతవారలయినా కాంతాదాసులే అన్నట్టు పెళ్ళాం మాటకు బద్ధుడే. అవటాన,

రెండో మాట లేకుండా సతీమణి సలహాకు అంగీకార సూచకంగా మూడు తలలు ఒకేమారు వూపుతూ కాసేపు చేస్తున్న పనికి విరామం ఇచ్చాడు.

అదే అనువుగా తీసుకుని, హితవచన రూపంలో ఆయన అర్ధాంగి వాణి తనదయిన బాణీలో విధాతకు భగవద్గీత బోధించడం ప్రారంభించింది.

‘మీరు సృష్టించిన ఆ స్త్రీ మూర్తి అందాన్ని చూసి ఆడదాన్నయిన నాకే మతిపోతున్నది. ఇక భూలోక వాసుల సంగతి వేరే చెప్పాలా! ఏమయినా సరే ఇటువంటి భూలోక సుందరిని భూలోకానికి పంపడానికి సుతరామూ వీల్లేదు. సత్యలోకంలో కూడా వుంచడానికి ఒప్పుకోను. ఇటువంటి ఆడవాళ్ళ పొడ నాకు గిట్టదు గాక గిట్టదు.’ అని గట్టిగా తెగేసి చెప్పింది.

భగవతి మాటలతో విధాత మూడు తలలు పట్టుకున్నాడు. సత్యలోకం నిబంధనల ప్రకారం ఒకసారి తన చేతులతో సృష్టించిన జీవిని భూలోకానికి పంపకుండా వుండేందుకు వీలులేదు. ఆ సంగతే అర్ధాంగికి అవగతమయ్యేలా చెప్పి తరుణోపాయం కూడా చెప్పి పుణ్యం కట్టుకోమని కోరాడు.

ఎంతకట్టుకున్నవాడయినా, ఎంత తన కట్టుబాట్లలో వున్న మొగుడయినా బ్రహ్మ సామాన్యుడేమీ కాదు. సాక్షాత్తు త్రిమూర్తుల్లో ఒకడు. ఆ ఎరుక ఎరిగినది కనుక సరస్వతి కొంత మెత్తబడింది.

అలా మెత్తబడ్డ వీణావాణి మనసులో ఓ కొత్త ఆలోచన పురుడు పోసుకుంది.

మొగుడు ముచ్చటపడి సృష్టించిన ఆ స్త్రీ మూర్తి అద్భుత సౌందర్య రాశి. అంతే కాదు. పరమాద్భుతమయిన తెలివితేటలూ ఆమె సొంతం. ఇంతటి ప్రతిభాశాలినీ, అసాధారణ ప్రజ్ఞాధురీణనీ అదుపులో వుంచడం మానవమాత్రులకు అసాధ్యం. దాన్ని సాధ్యం చేయాలంటే, ఆ పడతి తన ప్రతిభాపాటవాలను మరచిపోయేలా, అవి మరుగున పడిపోయేలా ఆమె దృష్టిని మళ్లించి, ఆ లలన మనసును ఆకట్టుకోగల మరికొన్నింటిని సృష్టించాలి. చదువులలో సారం తెలిసిన చదువుల తల్లికి ఆ ఆనుపానులేవిటో వెంటనే తెలిసిపోయాయి.

ఫలితం ఆ అందాల సుందరితో పాటే బ్రహ్మ దేవుడు, ఇల్లాలి సలహాపై మరో రెండింటిని సృష్టించి భూలోకానికి పంపాడు. అవే పట్టు చీరెలు, స్టీలు గిన్నెలు.

(ఉపసంహారం: డెబ్బయ్యవ దశకంలో హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రతి వారం ప్రసారం అయ్యే ‘జీవన స్రవంతి’ అనే కార్యక్రమానికి నేను కర్తా, కర్మా క్రియగా పనిచేస్తున్న రోజుల్లో ఓ వారం ఆ కార్యక్రమంలో భాగంగా పైన పేర్కొన్న ఈ పిట్ట కధ చదివాను. అంతే! ఆనాడు నేను ఆఫీసుకు వెళ్ళగానే రేడియో కార్యక్రమాలలో దిట్టలుగా పేరుగాంచిన నలుగురు మహిళా మూర్తులు, నా సీనియర్లు – తురగా జానకీ రాణి, మాడపాటి సత్యవతి, వింజమూరి సీతాదేవి, సునందిని ఐప్ - నాకోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. నన్ను చూసిందే తడవుగా ఒక్కుమ్మడిగా నా మీద మాటల దాడికి దిగారు. ‘స్త్రీజాతిని కించబరిచే విధంగా ఇలాటి కాకమ్మ కధలు ప్రసారం చేయడానికి ఎంత ధైర్యం!’ అవటాని కేకలు వేసారు. వయస్సులో, అనుభవంలో వారందరికంటే నేను చాలా చిన్నవాడిని. అంచేత ఆ పెద్దల అక్షింతలను ఆశీస్సులుగా తీసుకున్నాను. హాస్యానికి కూడా ఎవరినీ నొప్పించడం తగదన్న నీతి నాకానాడే బోధపడింది. అందుకే అప్పటినుంచి నా కార్యక్రమంలో నేను ఏనాడు ఎవరినీ కించబరిచే వ్యాఖ్యలు చేయలేదు. ఈ ఉదంతాన్ని కూడా ‘రేడియో రోజులు’ శీర్షిక కింద బ్లాగులో రాయడానికి ఇదే కారణం.

పీ ఎస్: కాకపొతే, ఆనాటి జీవనస్రవంతిని మెచ్చుకుంటూ శ్రోతలు అనేకమంది ఉత్తరాలు రాసారు. అది వేరే సంగతి.)

దేవుడే రక్షిస్తాడు నా దేశాన్ని – భండారు శ్రీనివాసరావు

దేవుడే రక్షిస్తాడు నా దేశాన్ని – భండారు శ్రీనివాసరావు


శ్రీ రామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా వనవాసం చేస్తూ ఒకానొక ప్రదేశంలో ఓ శీతల తరుచ్ఛాయకు చేరి ధనుర్బాణాలను పక్కన బెట్టి విశ్రమించాడు. విశ్రాంతి అనంతరం లేచి కూర్చున్న రామునికి తన విల్లుకింద నలిగిపోయి నెత్తురోడుతున్న ఒక మండూకం కనిపించింది. ఆ కప్ప దుస్తితికి తానే కారణం అని మధనపడుతూ ఆ చిరుజీవిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. తన వింటి బరువును మోస్తూ, అమితమయిన బాధను భరిస్తూ కూడా ఎందుకలా మౌనంగా వున్నావని ప్రశ్నించాడు. దానికా మండూకం జవాబు చెబుతూ - ‘సమస్త లోకాలను కాపాడే దేవదేవుడివి నువ్వు. ఏదయినా కష్టం వస్తే లోకులందరూ నీకే మొరబెట్టుకుంటారు. అలాటిది నీ బాణం కిందే నలిగిపోతున్న నేను, కాపాడవలసిందని ఇక ఎవర్ని వేడుకునేది?’ అని ఎదురు ప్రశ్న వేయడంతో శ్రీరాముడు అవాక్కయాడు.

మన దేశానికి స్వతంత్రం వచ్చి అరవై నాలుగేళ్ళు నిండాయి. స్వతంత్ర ఫలాలను భావితరాలకు భద్రంగా అప్పగించే పవిత్ర లక్ష్యంతో బాబా సాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రాసుకుని, దాన్ని కాపు కాయడానికి ఒకదానికి మరొకటి దన్నుగా మూడు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాము. ఈ అరవై ఏళ్ళ పైచిలుకు కాలంలో ఎన్ని అవాంతరాలు ఎదురయినా, ఎన్నెన్ని అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకున్నా – పార్లమెంటు, ఎక్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనే ఈ మూడు వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడి పనిచేస్తూ ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశమన్న కలికితురాయిని భారత కీర్తి కిరీటానికి అమర్చిపెట్టాయి. ఈ మూడింటికీ చెదలుపట్టే పరిస్తితే దాపురిస్తే నేనున్నానంటూ దీన జనానికి బాసటగా నిలబడే నాలుగో వ్యవస్థ మీడియా వుండనే వుంది. అందుకే దానికి ఫోర్త్ ఎస్టేట్ అన్న అనధికారిక నామం స్తిరపడింది.


అయితే, ఇటీవలి కాలంలో ఈ వ్యవస్థలన్నీ రాజ్యాంగం తమపై వుంచిన బాధ్యతలను పాటిస్తున్నాయా కర్తవ్యాలను నెరవేరుస్తున్నాయా లేదా వాటినుంచి దూరంగా జరుగుతున్నాయా అన్న అనుమానం సామాన్య జనంలో కలుగుతోంది. బ్రోచేవాళ్ళే దోచేవాళ్ళుగా మారుతున్న విషాద పరిస్థితుల్లో భారతావని లోని దీన జనావళి స్తితి రాముని కాలం నాటి కధలోని కప్పను తలపిస్తోంది.


ప్రజాధనాన్ని అప్పనంగా ఆరగిస్తున్న ప్రజాప్రతినిదుల అవినీతి కుంభకోణాలు తవ్విన కొద్దీ బయటపడడం, నియమనిబంధనల చట్రంలో వారిని వుంచాల్సిన బాధ్యత కలిగిన అధికారగణం సయితం అదే అవినీతి కూపంలో ఇరుక్కునిపోవడం, చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయవ్యవస్త లోని కొందరు న్యాయాధీశులే - కంచే చేనుమేసిన చందంగా దొరికిపోయి అభిశంసనలకు గురికావడం, అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినప్పుడు వాటిని సరిదిద్దే పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన మీడియా లోని అత్యధిక భాగం ఈ యావత్తు భాగోతంలో భాగం కావడం అరవై అయిదేళ్ళ వయస్సులో స్వతంత్ర భారతానికి అంటుకున్న మకిలి. కడిగినా వొదలని మురికి.


ఈనాటి పరిస్తితుల్లోని మరో విషాద కోణం ఏమిటంటే-


నిస్సిగ్గుగా లంచాలు మేస్తున్నవాళ్ళు అందుకు ఏమాత్రం సిగ్గుపడడం లేదు. ప్రజల డబ్బును తేరగా భోంచేసి త్రేనుస్తున్నవాళ్ళు అందుకు తత్తరపాటు పడడం లేదు. పైపెచ్చు అదొక హక్కుగా భావించి సమర్ధించుకుంటున్న తీరు మరింత బాధాకరం. విచారణ సంస్తల దర్యాప్తు క్రమంలో వెలుగు చూస్తున్న వాస్తవాలు నివ్వెరపరుస్తున్నాయి. చివరకు నిగ్గుతేలే నిజాలు న్యాయస్తానాలలో ఏమేరకు నిలుస్తాయో ఆ దేవుడికే ఎరుక. ఎందుకంటె వ్యవస్థలోని లోపాలను పసికట్టి, వాటికి తగిన తరుణోపాయాలను కనిపెట్టి కాచుకోవడం ఎలాగన్నది అక్రమార్కులకు వెన్నతో బెట్టిన విద్య. ప్రజాధనం దోపిడీలో హెచ్చుతగ్గుల తేడాలే కాని అందరూ అందరే అన్న నగ్న సత్యాన్ని ఎవరికి వారే బయటపెట్టుకుంటున్నారు. కొన్ని అవినీతి పురాణాలు వెలుగు చూస్తున్న సందర్భాలను గమనిస్తుంటే, తాముతిన్న దానికన్నా ఎదుటి పక్షం వారు నాలుగాకులు ఎక్కువ తిన్నారన్న దుగ్దే వారిని ఎక్కువగా వేధిస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు ఒక స్తాయిని దాటిపోయి వెగటు కలిగిస్తున్నా దొంగని దొంగే పట్టించిన చందంగా అందరి భాగోతాలు తెర చాటునుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుడ్డిలో మెల్ల అంటే ఇదే కాబోలు. ఏదో ఒక రకంగా భవిష్యత్ తరాలకు మేలుచేసేదే కాబట్టి ఆహ్వానించదగ్గ పరిణామమే అనుకోవాలి. ఇక్కడ వ్యక్తులను పేరు పేరునా పేర్కొనాల్సిన పని లేదు. అందరూ ఓ తానులోని ముక్కలే. ఈ వ్యవస్థలోని అస్తవ్యస్త పరిస్థితులు సృష్టించిన అష్టావక్రులే. ఒకరిని మరొకరు నిందించుకుంటున్న తీరుతెన్నుల్ని చూసి ఆనందించడం కాదు ఈ రోజున చేయాల్సింది. ఇలాటి అస్తవ్యస్త వ్యవస్థ నిర్మాణానికి ఏదో ఒకరూపంలో ‘రాళ్ళెత్తి’న కూలీలు’ గా తమకూ భాగం వుందని ప్రజలందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి.


అవినీతి అంశంగా ఈ రోజున దేశంలో, రాష్ట్రంలో సంభవిస్తున్న పరిణామాలు అవినీతిని ఈసడించుకునే పౌరులందరినీ కలత పరుస్తున్నాయి. అక్కడ అన్నా హజారే ఉద్యమం తీసుకున్నా, ఇక్కడ జగన్ ఆస్తులపై సీ.బీ. ఐ. సాగిస్తున్న సోదాల విషయం తీసుకున్నా మేధావులు, రాజకీయపార్టీల నడుమ సాగుతున్న చర్చలు పక్కదోవపడుతున్నాయి. ఉభయపక్షాల్లో దేన్నో ఒకదానిని గుడ్డిగా సమర్ధించడం మినహా నిష్పక్షపాతంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి అవకాశం లేని స్తితి. మీడియాలో జరిగే చర్చల్లో కూడా అసలు అంశం వెనక్కు పోయి అనవసర విషయాలు తెరమీదకు వస్తున్నాయి. నిజాలకంటే నెపాలకు పెద్దపీట వేస్తున్నారు.


ఈ సందర్భంలో- కొన్నేళ్ళక్రితం మన దేశానికి వచ్చిన ఒక విదేశీ యాత్రికుడు తన అనుభవాలను రాస్తూ పేర్కొన్న విషయాలను ప్రస్తావించడం సముచితంగా వుంటుంది.


“భారత దేశానికి రాకముందు నేను నాస్తికుడిని. ఇక్కడకు వచ్చిన తరువాత క్రమక్రమంగా నా కళ్ళు తెరిపిళ్ళు పడడం మొదలయింది. ఈ దేశంలో బీదా బిక్కీ తాగుతున్న నీళ్ళు చూసిన తరువాత ఈ జనాలను ఏదో అదృశ్య శక్తి కాపాడుతోందన్న భావన నాలో ప్రబలింది. అలాటి మురికి నీళ్ళు తాగుతూ కూడా జనం జీవించి మనగ లుగుతున్నారంటే ఖచ్చితంగా ఆ దేవుడి కృప లేనిది సాధ్యం కాదు. ఇక్కడి రోడ్లమీద వాహనాలు విచ్చలవిడిగా తిరుగాడుతున్న తీరుకు రోజూ ఎన్నో వందలమంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తూ వుండాలి. అలా జరగడం లేదంటే వీరిని భగవంతుడే కాపాడుతూవుండాలి.”


ఈ యాత్రీకుడి అనుభవాలు దేశంలో ఈ నాటి పరిస్తితులకు అన్వయించుకోవచ్చు.


లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వార్తల నేపధ్యంలోనే కనిమొళిలు, రాజాలు, కల్మాడీలు కటకటాల్లో వూచలు లెక్కబెడుతున్నారు. లెక్కలేనన్ని ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తిన వై.ఎస్.జగన్ వంటి రాజకీయనాయకులపై న్యాయస్తానాలు సీ.బీ.ఐ. దర్యాప్తుకు ఆదేశించాయి. అవినీతి ఆరోపణలపై కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్రీ సేన్ పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని రాజ్య సభ ఆమోదించింది. నేడో రేపో లోక్ సభ కూడా ఆ పని చేయబోతోంది.

అంటే ఏమిటన్న మాట. వ్యవస్థ అనుకున్నంత అస్తవ్యస్తంగా లేదనుకోవాలి. పనిచేస్తున్నదనే అనుకోవాలి.


కాబట్టి పూర్తిగా నిరాశ చెందాల్సిన పని లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ముప్పూటలా వాక్రుచ్చే రాజకీయనాయకుల మాటలు నీటి మూటలని అనుకోనక్కరలేదు. ఎందుకంటె ఆ విదేశీ యాత్రీకుడు పేర్కొన్నట్టు మచ్చలు పడ్డ ఇంతమంది రాజకీయ నాయకులు, ఇంతమంది అధికారులు, ఇంతమంది న్యాయకోవిదులు, ఇంతమంది మీడియా వారు వున్నాకూడా దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బతికే వుంది.


కవికుల తిలకుడు తిలక్ తన కవితా ఖండిక ‘ప్రార్ధన’ లో కోరుకున్నట్టు – ‘దేవుడే రక్షిస్తాడు నా దేశాన్ని’.


(19-08-2011)


19, ఆగస్టు 2011, శుక్రవారం

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు- 2 - భండారు శ్రీనివాసరావు

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు- 2 - భండారు శ్రీనివాసరావు


గుడి పదిలం



ఇంటిలో నిద్దుర పోనీయకుండా
రక్కసి పిల్లల రాక్షసి గోల
హాయిగా చెక్కేసి సడి చేయకుండా
ఆఫీసులోనే కునికితే పోల

(జూన్ 27, 1975  ఆంధ్ర జ్యోతి దినపత్రికలో ప్రచురితం)

జ్వరాల వారం



రొంప బాధ శ్రీమతికి వేల్పివ్వని వరం
చిన్నవాడు, చంటివాడు అందరికీ వరుస జ్వరం
చూడొచ్చిన చుట్టం పడక వేసె ఒక వారం
లాస్ట్ వీక్ ఆఖర్లో ఇంటి ఖర్చు గరం గరం

(ఆగస్టు 1, 1975  ఆంధ్ర జ్యోతి దినపత్రికలో ప్రచురితం)


కార్టూనిష్టులకు/ఇమేజ్ సొంతదారులకు  ధన్యవాదాలు - రచయిత 

18, ఆగస్టు 2011, గురువారం

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు- 1- భండారు శ్రీనివాసరావు


ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు- 1 - భండారు శ్రీనివాసరావు
గుండెలమీది కుంపట్లు

ఎదిగొచ్చిన ఆడపిల్ల
ఎంత చదువు చదివినా మల్ల 
కట్నం లేకుండా పెళ్లి కల్ల
నలుగురున్న తండ్రి ఇల్లు గుల్ల  


(03-06-1975 ఆంధ్ర జ్యోతి దినపత్రిక)




ఎడతెగని ముచ్చట్లు


'మా కోడలు సంగతంటారా పిన్ని గారు
'అదిగో అవతల పిలుస్తున్నారు మావారు
'చెబుతాలెండి వివరంగా మరోమారు
'అన్నట్టు ఆవకాయ కారం పెట్టారా మీరు....'

(07-06-1975-ఆంధ్ర జ్యోతి దినపత్రిక)



(కార్టూనిస్టులకు ధన్యవాదాలు)




16, ఆగస్టు 2011, మంగళవారం

ఆంధ్ర పత్రిక మూడో పేజీ చూశారా గురూ గారూ! – భండారు శ్రీనివాసరావు

ఆంధ్ర పత్రిక మూడో పేజీ చూశారా గురూ గారూ! – భండారు శ్రీనివాసరావు




నా చిన్నతనంలో చదివిన జోకు ఇది.

ఒకతను పత్రిక చేతబట్టుకుని వీధిలో అందరి వెంటా పడుతూ ‘మూడో పేజీ చూశారా’ అని వేధిస్తుంటాడు. విషయం ఏమిటంటే అతగాడు రాసిన ఉత్తరాన్ని ఆ రోజు ‘పాఠకుల లేఖలు’ శీర్షికలో ప్రచురించారు. దాన్ని గురించి నలుగురికీ తెలపడానికి అతడెన్నుకున్న మార్గం ఇది. (ఆదుర్తి వారు తీసిన తేనె మనసులు/కన్నెమనసులు సినిమాలో కూడా ఈ మాదిరి సన్నివేశం వున్నట్టు గుర్తు)

తాము చేసిన పనులు ( వారి దృష్టిలో ఘనకార్యాలు) నలుగురి దృష్టికి తీసుకురావడానికి రక రకాల పద్ధతులు అనుసరిస్తూ వుండడం మనకు కొత్తేమీ కాదు. కొందరు బాహాటంగా బయటపడి నిస్సిగ్గుగా చెప్పుకుంటే మరికొందరు నర్మగర్భంగా పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. రాజుల కాలంలో భట్రాజులు ఈ పని తమ నెత్తిన వేసుకునేవారు.కొండొకచో, వారి ఆస్తాన కవులు కూడా ప్రత్యేక సందర్భాలలో అన్యాపదేశంగా ఈ కర్తవ్య పాలన చేసి తమ రాజ భక్తిని కవితాత్మకంగా చాటుకునేవారు. తదుపరి జమీందారుల కాలంలో సయితం కొనసాగిన ఈ విధానం ప్రజాస్వామ్య యుగంలో సమాచార పౌర సంబంధ శాఖ రూపంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ‘ప్రచారం కోసం ఇన్నిన్ని కోట్లు ప్రజాధనం ఖర్చు చేస్తారా ? ఆయ్!’ అంటూ హుంకరించి పత్రికల కెక్కి విమర్శలు గుప్పించిన ప్రధాన ప్రతిపక్షం వాళ్ళే తాము అధికారంలోకి రాగానే ఆ విషయం వీలుచేసుకుని మరీ మరచిపోతారు. మరచిపోవడమే కాదు, పబ్లిసిటీ ఇచ్చుకునే విషయంలో తమ వైరి పక్షం కన్నా నాలుగాకులు ఎక్కువే చదివామని అనిపించుకుంటున్నారు. కాలక్రమంలో ఇది మరింతగా ముదిరిపోయి ప్రభుత్వ పధకాల ప్రచారం కాస్తా అధికారంలో కీలక స్తానాల్లో వున్న వారి వ్యక్తిగత ప్రచారంగా రూపుదిద్దుకోవడం, ఆ ఖర్చును పన్నుల రూపంలో ప్రజల మీద రుద్దడం - ఇవన్నీ ప్రజాస్వామ్య యుగంలో సహజాతి సహజంగా జరిగిపోతున్నాయి.


వ్యక్తిగతం అంటే గుర్తుకొచ్చింది. వ్యవస్థలు, ఆ వ్యవస్థలను శాసించే వ్యక్తుల సంగతి అటుంచండి. ఇప్పుడీ ప్రచార ఉధృతి అనేది సామాన్య జనజీవనంలోకి కూడా ప్రవేశించింది. పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, పూజలు, పునస్కారాలు అన్నీ ప్రచార ప్రాతిపదికనే జరిగిపోతున్నాయి. సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తున్నామన్న భావనకన్నా ఎంత ఆడంబరంగా జరుపుకుంటున్నామన్న అభిజాత్యమే వీటిల్లో బాగా కానవస్తోంది.

కొత్తగా ఫ్రిజ్ కొనుక్కున్నావిడ ఇంటికొచ్చిన ప్రతి వాళ్లకు అడగకుండానే ‘మంచినీళ్ళు తాగుతారా పిన్ని గారు’ అని అడిగి నీళ్ళ గ్లాసు చేతికిచ్చి- ‘చల్లగానే వుంటాయి లెండి కొత్త ప్రిజ్ కదా’ అంటూ ప్రిజ్ కొన్న సంగతి చల్లగా బయటపెట్టే సన్నివేశాలకు సినిమాల్లో కొదవ వుండదు. అలాగే కొన్న చీరెలు గురించీ, నగల గురించీ ఇరుగూ పొరుగుతో చెప్పుకుని తృప్తిపడే ఆడంగులు కొల్లలుగా కనిపిస్తారు. ఇలాటి వాళ్ళతో పేచీ ఏమీ లేదు. ఆహా ఒహో అంటే చాలు మురిసి ముక్కచెక్కలవుతారు.


మరోరకం వాళ్ళతోనే ఇబ్బంది. వాళ్లు ఏది కొన్నా అదే బెస్ట్ అంటారు. తాము ఏది చేసినా అది ఇతరులు ఎవ్వరూ చేయలేరన్న ధీమా అనండి, అతిశయం అనండి వారి మాటల్లో పెల్లుబుకుతుంటుంది. వాళ్ల రూటే సపరేటు. వాళ్లు వెళ్ళిందే మంచి హోటలు. వాళ్లు చూసిందే భేషయిన సినిమా. వాళ్లు చదివిందే చక్కటి పుస్తకం. వాళ్లు చెప్పిందే వేదం. ఇంతెందుకు! వాళ్లు పట్టిన కుందేటికి నాలుగు కాళ్ళు వుంటే నా మీద వొట్టు.

దీన్ని ‘వన్ వే’ పబ్లిసిటీ అనాలేమో. ఇతరులకి ఎంత మాత్రం ఛాన్స్ ఇవ్వరు మరి.

ఈ మధ్య ఓ కొత్తరకం సెల్ఫ్ డబ్బా ఒకటి మొదలయింది. ‘పలానా టీవీ పలానా టైం కు పెట్టండి. నా ప్రోగ్రాం వస్తుంది’ అని తెలిసిన వాళ్లకు, తెలియని వాళ్లకు మొబైల్ ఫోన్లల్లో ‘ఎస్సెమ్మెస్’ లు ఇస్తుంటారు. ‘దయచేసి పలానా వారపత్రికలో/దినపత్రికలో నా వ్యాసం వచ్చింది చదవండి ప్లీజ్’ అని వచ్చే ఎస్సెమ్మెస్ ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. టీవీ చర్చల్లో పాల్గొనే మేధావులలో కొందరు ‘పలానా పత్రికలో ఈ విషయం గురించి ఇప్పటికే రాసేసాను’ అని చెప్పుకోవడం సెల్ఫ్ పబ్లిసిటీకి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఇక ‘ఈ’ మెయిల్ సౌకర్యం వుంటే చాలు పైసా ఖర్చు లేకుండా ప్రచారం చేసుకునే అవకాశాలు అన్నీ ఇన్నీ కాదు.

‘నిన్ను గురించి నువ్వు ఎప్పుడూ చెప్పుకోకు. నిజం చెప్పుకుంటే ఎవ్వరూ నమ్మరు. అబద్ధం చెబితే మాత్రం ఇంకా యెంత వున్నదో అని సందేహిస్తార’ని మా అన్నయ్య ఎప్పుడూ చెబుతుండేవాడు. కానీ ఈ నాటి సూత్రాలకు ఇది పూర్తిగా విరుద్ధం. సిద్ధాంతాలయినా, ఆదర్శాలయినా దెశ, కాల, మాన పరిస్తితులనుబట్టి మారిపోతుంటాయి. ఒకప్పుడు కమ్యూనిస్ట్ గా వున్నవాడు ఎప్పటికీ అలాగే వుండి పోనక్కరలేదు. పక్కా సమైక్యవాదులు అని ముద్ర పడ్డవారు రాత్రికి రాత్రే విభజనవాదులుగా మారిపోయి తమ వితండ వాదాలతో టీ వీ చర్చావేదికలపై కుండలు, బల్లలు బద్దలు కొడుతూ వుండవచ్చు. మార్పు మానవులకు సహజం అన్న సిద్ధాంతం సమర్ధించుకోవడానికి ఎలాగూ వుంది.


అంచేత మాస్టారూ, ప్రతివాడూ తన గురించి తానే చెప్పుకోవాలి. ఇతరుల గురించి నాలుగు మంచి మాటలు చెప్పే మంచితనం ఈనాడు కలికానికి కూడా దొరకని పరిస్తితి. అందువల్ల, ఏతావాతా చెప్పేదేమిటంటే మనకి మనమే పీఆర్వోలం. మన గురించి మనమే ప్రచారం చేసుకోవాలి. అవతల మనిషి నమ్మడం లేదని తెలిసినా మన గురించి మనం చెప్పుకుంటూనే పోవాలి. ఎదుటివాడు నమ్మకపోయినా కనీసం అతడి పక్కవాడు మన మాటల్ని నమ్మే ఛాన్సు కొంతయినా వుంటుంది. ఆలశ్యం ఎందుకు? స్వయం భజన బృందంలో చేరుదాం పదండి.

ఇక సిగ్గంటారా! దాన్ని వొదలకపోతే ఈ పాడు ప్రపంచంలో ఎదగడం కష్టం!!

(16-08-2011)

14, ఆగస్టు 2011, ఆదివారం

చీమ చెప్పే భగవద్గీత - భండారు శ్రీనివాసరావు

చీమ చెప్పే భగవద్గీత - భండారు శ్రీనివాసరావు 




ఒకానొక మానవాధముడికి జీవితం భారమై, సమస్యలు సమాహారమై, మనశ్శాంతి దూరమై దేవుడిని గూర్చి ఘోర తపస్సు మొదలు పెట్టాడు. చివరాఖరుకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనవాడు కళ్ళు తెరిచి తనను ఎదుర్కుంటున్న కష్టనష్టాల జాబితా ఏకరువుపెట్టి విజయసాధనకు మార్గం చూపెట్టమని మోకరిల్లాడు. దేవుడు విలాసంగా ఓ చిరునవ్వు విసిరి ‘దీనికోసం నన్ను పనికట్టుకుని పిలవాలా! అటు చూడు! అదిగో. అటుగావెడుతున్న ఆ అల్పజీవిని చూడు. దాన్ని చూసి నేర్చుకో ‘ అనేసి చక్కాపోయాడు. ఇతగాడటు చూస్తే నెమ్మదిగా కదిలి వెడుతున్న ఒక చిన్న చీమ కనిపించింది.


అంత పెద్ద దేవుడు ఇంత చిన్న చీమ నుంచి జీవితం గురించిన పాఠాలు నేర్చుకోమని అంటున్నాడు ఇతడేమి దేవుడు అని అనుకోకండి.


దారీ తెన్నూ తెలియని స్తితిలో వున్న మనుషులకు ఒక మంచి మార్గాన్ని చూపించి వారిని కార్యోన్ముఖుల్ని చేయడంలో ‘మోటివేషన్ గురు’ అని విశ్వవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న 'జిన్  రాన్' కూడా  చీమల నుంచే తన ‘విజయ సూత్రాలకు’ స్పూర్తిని పొంది ఏకంగా ఒక పుస్తకమే రాసాడు. దాని పేరు ‘యాం ట్స్' ఫిలాసఫి’ అంటే ‘చీమలు బోధించే తత్వశాస్త్రం’ అని దగ్గరి అర్ధం.


చీమల జీవన సరళిని బాగా అధ్యయనం చేసిన జిన్ రాన్ మహాశయులవారు  జీవితంలో విజయాలు సాధించడానికి  కొన్ని  సూత్రాలను వాటినుంచి నేర్చుకోవాల్సి వుంటుందని సెలవిచ్చారు.





ఈ సారి సమయం దొరికినప్పుడు మీ చేతివేలును చీమ వెళ్ళే దారిలో అడ్డంగా వుంచి గమనించండి. ఆ చీమ మీ వేలును దాటివెళ్ళడానికయినా ప్రయత్నిస్తుంది లేదా మీ వేలి చుట్టూ తిరిగి వెళ్ళడానికయినా చూస్తుంది. అంతేకాని అక్కడే ఆగిపోయి బిత్తర చూపులు చూడదు. ఎందుకంటె మడమ తిప్పడం వెన్ను చూపడం దాని ఇంటా వంటా లేదు. ఓటమిని అంగీకరించడం దాని రక్తంలో లేదు.(చీమ వొంట్లో రక్తం వుంటుందా? వుంటే అది ఏ గ్రూపు అని చర్చిస్తూ కాలక్షేపం చేయడం మనుషులకే చెల్లు) అంటే ఏమిటన్న మాట. జీవితం అన్నాక మనం చేసే పనులకు అవరోధాలు ఎదురవడం సహజం. అడ్డంకులను అడ్డం పెట్టుకుని కాడి కింద పారేసి ‘సారో సాంగులు సోలో సాంగులు’ మొదలు పెట్టకూడదు. ఎన్ని సవాళ్లు ఎదురయితే మనం మనస్సును అంత దృఢపరచుకుని ముందుకు సాగాలి. అప్పుడే విజయాలు వచ్చి వొళ్ళో వాలతాయి. లేదంటే చక్కా ఎగిరిపోతాయి. రెండో ప్రపంచ యుద్ధకాలంలో విన్ స్టన్ చర్చిల్ ఏమన్నాడు. ‘సాధించేదాకా సాధన మానకండి. ప్రయత్నం వొదిలిపెట్టకండి’ అని తన సైన్యాలను ఉత్తేజపరిచాడు. బహుశా చీమలనుంచే ఆయన ఈ స్పూర్తిని గ్రహించి వుంటాడు.


చీమలు వేసవి కాలంలో ఏమి చేస్తుంటాయి?


రానున్న వర్షాకాలం గురించే అస్తమానం ఆలోచిస్తుంటాయట. చిన్నప్పుడు చదువుకున్న కాకీ పిచ్చుక కధ జ్ఞాపకం వస్తోంది కదూ. చీమలకు ఒక సత్యం తెలుసు. ఎండాకాలం ఎంత మంచిదయినా అది ఎల్లకాలం అలాగే వుండిపోదు. వేసవి పోయి వర్షాలు కురుస్తాయని తెలుసు. అందుకే రానున్న కాలంకోసం, అప్పటి అవసరాలకోసం ఇప్పటినుంచే జాగ్రత్త తీసుకోవాలనీ తెలుసు. అందుకని అన్నీ సజావుగా హాయిగా జరిగిపోయే సమయంలో బద్దకించి పడుకోకుండా ముందు ముందు కావాల్సిన సంబారాలను సమకూర్చుకోవడం చీమల అలవాటు. మనం నేర్చుకోవాల్సింది కూడా ఇదే. కడుపులో చల్ల కదలకుండా, జీవితం వడ్డించిన విస్తరిలా, వర్తమానం హాయిగా జరిగిపోతున్నది కాబట్టి ఎల్లకాలం ఇలాగే సాగిపోతుందని నమ్మకంగా నమ్మకం పెంచుకుని కాళ్ళు బారజాపి కాలక్షేపం చేయడం కూడదన్నమాట.


మరో విషయం ఏమిటంటే కష్టపడడం చీమల సహజ  స్వభావం. పనిపాట్ల విషయంలో  సాటి చీమలతో పోల్చుకోకుండా తమ పని తాము చేసుకుపోవడం చీమల నైజం. నేనొక్కదాన్నే ఇంత కష్టపడాలా  అని  ఏ ఒక్క చీమా ఏఒక్క రోజూ ఆలోచించదు. తను పడ్డ కష్టానికి ఎంత గిట్టుబాటయ్యిందన్న విషయం కూడా దానికి పట్టదు. అలాటి విషయాలు గురించి పిర్యాదు చేయడం కూడా చీమలకు అలవాటు లేని పని. ‘నీ ధర్మం నువ్వు చెయ్యి. ఫలితం నాకు వొదిలి వెయ్యి.’ అనే గీతాకారుడి బోధ చీమలకు వర్తించదు. చేతనయిన వరకూ చేసుకుంటూ పోవడం అన్న కర్తవ్య పాలన ఒక్కటే వాటికి తెలిసింది. దాన్ని నూటికి నూరుపాళ్ళు నిర్వర్తించడం ద్వారా విజయాన్ని, ఆనందాన్ని సొంతం చేసుకోవడం ఎలాగో జనం చీమలనుంచి నేర్చుకోవాలి. తమకు చేతయిన దానిని చేయడం ద్వారా మాత్రమే విజేతలు ఆ స్తానానికి చేరుకోగలుగుతారన్నది మోటివేషన్ గురు గారి ఉవాచ.

మరో విషయం.

చిన్న ఆకారాలను పోల్చడానికి చీమలను ఉదాహరణగా తీసుకోవడం మనకు తెలిసిందే. కానీ అవి తమ తూకానికి  ఇరవై రెట్లు ఎక్కువ బరువుగల ఆహారాన్ని  మోసుకు వెళ్ళ గలవన్నదే చాలామందికి తెలియని విషయం.


మనుషులు కూడా అంతే. ఒక్కోసారి వాళ్లు అలవికాని సంసార భారాలను మోస్తుంటారు. అనేకసార్లు ‘ ఈ సంసారాన్ని లాగడం, ఈ బరువు మోయడం   ఇక నా  వల్లకాదు’ అన్న నిర్వేదం వారిని ఆవహిస్తుంటుంది. అల్లాటి సమయాల్లో చీమను గుర్తుచేసుకుంటే సరి. మనసు తేలికపడుతుంది. చిన్న పాటి చీమే అంతంత బరువులు మోయగాలేనిది ఆ పాటి బరువు బాధ్యతలు మేము మొయ్యలేమా అన్న ధీమా పెరుగుతుంది.


మోటివేషన్ గురు జిన్ రాన్ చెప్పినా అదే. కంటికి కనబడని దేవుడు చెప్పినా అదే.
(14-08-2011)





13, ఆగస్టు 2011, శనివారం

అనుభవాలు – నేర్చుకోవాల్సిన పాఠాలు - భండారు శ్రీనివాసరావు

అనుభవాలు – నేర్చుకోవాల్సిన పాఠాలు - భండారు శ్రీనివాసరావు


రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు మంచి రసకందాయంలో పడుతున్న సందర్భంలోనే రెండు ప్రధానమయిన అంతర్జాతీయ వార్తలు స్తానిక పరిణామాల నేపధ్యపు వెల్లువలో కొట్టుకుపోయాయి.


అమెరికాలో ఆర్ధిక సంక్షోభం గురించి, ఆ దేశపు క్రెడిట్ రేటింగ్ గురించి అక్కడి వాళ్లు ఎంత ఆందోళనకు గురయ్యారో తెలియదుకాని అనేక దేశాలు మాత్రం అమెరికా పరిస్తితులపట్ల ఆందోళన చెందిన మాట వాస్తవం. సూర్యుని కాంతి చంద్రుని మీద పడి ప్రతిఫలించినట్టు అమెరికా ఆర్ధిక వ్యవస్థలో ఏర్పడే ఒడిదుడుకులు ఆయా దేశాలపై ప్రభావం చూపడం ఖాయమనే నిపుణుల అభిప్రాయం.

ఈ మాదిరి ఆర్ధిక మాంద్యాలు అమెరికాకు కొత్తవేమీ కాదు. గతంలో పలు పర్యాయాలు ఇలాటి విపత్కర పరిస్తితులను ఆ దేశం తట్టుకుని ఒడ్డెక్కిన ఉదంతాలు అనేకం వున్నాయి. మొన్నటికి మొన్న2008 లో అమెరికాలో అనేక బ్యాంకులు దివాళా తీసాయి. దానివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక సంక్షోభం తలెత్తిన సంగతి గుర్తుండే వుంటుంది. మొత్తం మీద అమెరికా ఆ స్తితినుంచి గట్టెక్కగలిగింది. కానీ లోగడ కన్నా పరిస్థితులు ఇప్పడు వేగంగా మారిపోతున్నాయి. నూతన ఆర్ధిక సంస్కరణలు, ప్రపంచీకరణ ఫలితాలు ఏదో ఒక రీతిలో అన్ని దేశాలను తాకుతున్నాయి. కొన్నింటి పాలిట ఈ సంస్కరణలు వరప్రసాదం అయితే, మరికొన్ని దేశాలు దుర్భర వైరుధ్య పరిణామాలను ఎదుర్కుంటూ వుండడం విషాదకరం. ప్రపంచ ఆర్ధిక స్తితిగతులనే సమూలంగా మార్చివేస్తున్న ఈ విధానాల దిక్కుగా వేస్తున్న అడుగు అగాధంలోకి లాగుతుందో ఆకాశానికే చేరుస్తుందో తెలియని అయోమయ పరిస్తితిలో దేశాలన్నీ ఆర్ధిక సంస్కరణల సునామీలో కొట్టుకుపోతున్నాయి. సింద్ బాద్ కధల్లో మాదిరిగా వున్నట్టుండి ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడం అసాధ్యం కాదనిపిస్తోంది. పరాయి ప్రాంతాలకు వెళ్లి వ్యాపార లావాదేవీల్లో అపార ధన రాశులను మూటగట్టుకుని స్వదేశానికి చేరే సమయంలో సముద్రంలో చెలరేగిన తుపాను కారణంగా సమస్తం కోల్పోయి బికారిగా మారే సింద్ బాద్ పాత్ర మాదిరిగా ఈనాడు అనేక దేశాలు అమెరికా లోని ఆర్ధిక పరిస్తితులనే తుపాను మూలంగా పతనం అంచుకుకు చేరుకునే ప్రమాదకర పరిస్తితులను ఎదుర్కుంటున్నాయి.

అమెరికా ఆర్ధికరంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలకంటే ప్రస్తుతం యూరోప్ దేశాలలో ఏర్పడిన సంక్షోభం మరింత ఆందోళన కలిగిస్తున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సంక్షోభం ఫలితంగా యూరోపులోని బడా దేశాల ఆర్దికవ్యవస్తలు కుదేలయ్యే సూచనలు కానవస్తున్నాయి. వేగంగా సంభవిస్తున్న ఈ మార్పులకు తగ్గట్టుగా విదేశీ సంస్తాగత పెట్టుబడిదారులు తమ వ్యూహాలను మార్చుకుంటున్న సంకేతాలు బలంగా అందుతున్నాయి. వారందరూ తమ పెట్టుబడులను త్వరితగతిన ఉపసంహరించుకునే పనిలో పడడం, అలా వెనక్కు తీసుకున్న వాటాల ధనాన్ని మళ్ళీ మరోచోట మదుపు చేయకుండా తమదగ్గరే భద్రపరచుకోవడం, లేదా బంగారం కొనుగోలుకు వినియోగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. దానా దీనా ప్రపంచవ్యాప్తంగా పుత్తడి ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. తమ పెట్టుబడుల భద్రత పట్ల విదేశీ సంస్తాగత పెట్టుబడిదారులు (ఎఫ్.ఐ.ఐ.) లు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు మన దేశంలోని దేశీయ సంస్తాగత ఇన్వెస్టర్లు (డీ.ఐ.ఐ.) లను బెంబేలెత్తిస్తున్నాయి. భారతీయ మార్కెట్లలో ఎఫ్.ఐ.ఐ.లు తమ షేర్లను తెగనమ్ముతుంటే మరోపక్క డీ.ఐ.ఐ.లు వాటిని కొనుగోలు చేయడానికి వెనుకాడుతున్నారు. ఎందుకంటె తమకంటే బలవంతులయిన ఎఫ్.ఐ.ఐ.లతో తలపడడం అంత క్షేమదాయకం కాదని వారికీ తెలుసు. అందుకే రానున్న కొన్ని వారాలపాటు కొనుగోళ్లకు దూరంగా వుండడం మంచిదన్న ఆలోచనలో దేశీయ ఇన్వెస్టర్లు వున్నట్టు కనబడుతోంది.

ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న పరిణామాల నేపధ్యంలో- భారత ఆర్ధిక వ్యవస్థ పటిష్టంగా వుందని, దానికి వెను వెంటనే వాటిల్లే ముప్పెమీలేదని కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మాత్రం భరోసా ఇస్తున్నారు. జాతి ఆర్ధిక పునాదులు బలంగా వుండడం, దిద్దుబాటు చర్యలు సకాలంలో తీసుకోగల సమర్ధవంతమయిన యంత్రాంగం కలిగివుండడం దీనికి కారణాలుగా ఆయన పేర్కొంటున్నారు. ఆర్ధిక మంత్రి ధీమా ఆహ్వానించదగ్గదే. కానీ, ముందే పేర్కొన్నట్టు, ప్రస్తుతం అన్ని దేశాలవారు అంతో ఇంతో అమలుచేస్తున్న నూతన ఆర్ధిక సంస్కరణల కారణంగా విడిగా ఏ ఒక్క దేశమూ ఒంటరిగా ఈ పరిణామాల ప్రభావం నుంచి తప్పించుకునే వీలు సహజంగానే వుండదు. ఎదుర్కోగలిగిన సత్తా మాత్రమే కాదు అందుకు తగిన సంసిద్ధత కూడా అవసరం. ఎందుకంటె ఆర్ధిక రంగంలో చోటుచేసుకునే మార్పుల విష ఫలితాలు సునామీలా విస్తరిస్తాయి. కాచుకునే వ్యవధానం వుండదు. బహుశా, ఈ ఉద్దేశ్యంతోనే పరపతి రేటింగ్ కంపెనీలపై కన్నేసివుంచాలని ‘సెబీ’ సంకల్పించింది. అమెరికా పరపతి రేటింగ్ సృష్టించిన సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని అటువంటి పరిస్థితులు మన దేశంలో తలెత్తకుండా ఈ జాగ్రత్త తీసుకుంటున్నట్టు కనబడుతోంది.

అలాగే, దేశ విదేశాలలో మన దేశానికి గుర్తింపు తీసుకువచ్చిన ఐ.టీ. రంగం మరోసారి అలజడికి, భారీ కుదుపులకు గురికాకుండా చూసుకోవాలి. గతంలో ఆర్ధికమాంద్యం సమయంలో మన ఐ.టీ. రంగం కుప్పకూలకపోయినా కుదేలయిన విషయం అందరికీ గుర్తుండే వుంటుంది. దాని ఫలితాలను రియల్ ఎస్టేట్ వంటి ఇతర రంగాలు చవిచూశాయి. తిరిగి ఇప్పుడు తలెత్తిన సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే వ్యయాన్ని బాగా నియంత్రించే ఐ.టీ. ఉత్పత్తులపట్ల శ్రద్ధ తీసుకోగలిగితేనే భారతీయ ఐ.టీ. రంగం నిలదోక్కుకోగలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే, భారతీయ ఐ.టీ. సంస్తలు కేవలం తమ ఉత్పాదనల పట్లనే కాకుండా నిరంతర పరిశోధన, అభివృద్ధి గురించి కూడా దృష్టి సారించడం అవసరమని వారంటున్నారు.

పోతే, ఆర్ధిక సంక్షోభాలను గట్టిగా ఎదుర్కుని నిలబడాలంటే అందుకు తగిన రాజకీయ సుస్తిరత చాలా అవసరం. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో రాజకీయ పార్టీలు కీచులాటలకు దిగకుండా ఒకే మాటపై నిలబడడం అన్నది ఈ పరిస్థితుల్లో ఎంతో మేలు చేస్తుంది. రాజకీయ కారణాలవల్ల ఏర్పడే అనిశ్చిత పరిస్థితులు కూడా ఆర్ధిక సంక్షోభ ప్రభావాలను మరింత విషమం చేసే ప్రమాదం వుంది. తరచుగా జరిగే బందులు, సమ్మెలు పరిస్తితులను మరింత దిగజారుస్తాయి. ఉదాహరణకు మన రాష్ట్రాన్నే తీసుకుంటే వరుస బందులు, ఆందోళనలతో రోజుకు అయిదు వందల కోట్ల రూపాయల మేరకు పారిశ్రామికరంగం నష్టపోతున్నదని ‘ఫాప్సీ’ పేర్కొన్నది.
మనదేశం పాఠాలు నేర్చుకోవాల్సిన మరో అనుభవం ఒకప్పుడు మనదేశాన్ని శతాబ్దాల తరబడి పాలించిన ఇంగ్లండు నుంచి.


గత కొద్ది రోజులుగా లండన్ నగరం తగలబడిపోతున్నదంటే అతిశయోక్తికాదు. రవి అస్తమించని సామ్రాజ్యంగా ఒకనాడు పేరుగాంచిన బ్రిటిష్ పాలకుల రాజధానీ నగరం ఈనాడు భయం గుప్పిట్లో, విధ్వంస జ్వాలల్లో చిగురుటాకులా వొణికిపోతోంది
ఒక్క లండన్ మాత్రమే కాదు బర్మింగుహాం, నాటింగ్ హాం, బ్రిస్టల్, మాంఛెస్టర్, లివర్ పూల్, ఇంకా మరెన్నో నగరాలు అగ్నిజ్వాలలకు ఆహుతవుతున్నాయి. అల్లరిమూకల దౌర్జన్యాలతో అతలాకుతలం అవుతున్నాయి. “ఈ దుస్సంఘటనలు బ్రిటిష్ చరిత్రలోనే అత్యంత దౌర్భాగ్యకరం” అని ఆ దేశ ప్రదానమంత్రి డేవిడ్ కేమరున్ పేర్కొనడాన్నిబట్టి దిగజారిన అక్కడి పరిస్తితులను వూహించుకోవడం ఏమంత కష్టం కాదు.
పోలీసు కాల్పుల్లో ఓ నల్లజాతీయుడు మరణించడం అన్న ఒక్క కారణంతో ఇంత పెనుదుమారం చెలరేగిందంటే ఓ పట్టాన నమ్మడం కష్టం. ఆ నల్లజాతీయుని మరణానికి నిరసనగా స్థానికులు నిరసన ప్రదర్శనకు దిగటం అదికాస్తా హింసాత్మకంగా మారటం, అలా మారిన పరిస్తితులను అసాంఘిక శక్తులు తమకు అనుకూలంగా మార్చుకోవడం ఇవన్నీ గమనిస్తున్నవారికి ఒక చిన్న విషయం సయితం ఎంత పెద్ద గందరగోళానికి దారి తీయగలదన్న సంగతి సులభంగా అవగతమవుతుంది. ‘జరిగిందేమిటి, జరుగుతున్నదేమిటి, జరగబోయేదేమిటి’ అన్న ప్రశ్నలు మాత్రం అక్కడి సభ్య సమాజాన్ని కలవరపరుస్తున్నాయి. నిన్న మొన్నటివరకు సహజీవనానికీ, సభ్యతా సంస్కారాలకు పెద్ద పీట వేసిన బ్రిటిష్ సమాజంలో ఈ నాడు తమ తోటివారినే అనుమానంతో చూడాల్సిన విషాద పరిస్తితి నెలకొన్నది. పరిచయం ఉన్నా లేకున్నా అందరినీ చిరునవ్వుతో పలుకరించుకునే బ్రిటిష్ పౌరుల సంప్రదాయం. అలాటిది ఈ రోజున చిరునవ్వులు చెదిరిపోయి బిగుసుకున్న పెదవులు దర్శనమిస్తున్నాయని ఆ దేశంలో చిరకాలం నుంచి నివసిస్తున్న తెలుగువారు ఇంటర్నెట్లో వాపోతున్నారు. దేశాల్లో వర్ణ వివక్షను ఖచ్చితంగా పాటించే బ్రిటిష్ శ్వేత జాతీయులు తమ దేశం లో మాత్రం దీనికి మినహాయింపు ఇస్తారని అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్లు కితాబు ఇస్తుంటారు కూడా. వివిధ
దేశాల వారు, అన్ని జాతుల వారు తమ దేశంలో తమతో పాటు సహజీవనం చేయడానికి వీలయిన ఉదార తత్వం బ్రిటిష్ శ్వేత జాతీయుల సొంతమనీ వారు చెప్పడం కద్దు.
అయినా ఎందుకీ అల్లర్లు అక్కడ జరుగుతున్నాయి ? వీటినుంచి నేర్చుకునే పాఠాలు ఏమిటి? వాటిని తెలుసుకోవడం, అర్ధం చేసుకుని తదనుగుణంగా మారడం వర్తమాన భారత ప్రజానీకానికీ, వారిని పాలించే పాలకులకు ఎంతో అవసరం.
బ్రిటన్ జనాభాలో శ్వేత జాతీయులది అగ్రభాగం. ఆ తరువాత ఆసియా దేశస్తులు. అంటే భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి ఆ దేశానికి వెళ్లి స్తిరపడ్డవారన్న మాట. చైనా, ఆఫ్రికా దేశాలనుంచి వచ్చిన వారు కూడా బ్రిటన్ లో ఏళ్లతరబడి మనుగడ సాగిస్తున్నారు.
ఇంగ్లాండ్ దక్షిణ ప్రాంతములో జనసాంద్రత అధికం. అలాగే జాతుల వైవిధ్యం కూడా ఎక్కువే. దేశ ఆర్థిక ప్రగతిలో దక్షిణాది ప్రాంతాలదే హవా. ఆర్థికమాంద్యం కొట్టిన దెబ్బతో ఆ దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. కొత్త ఉద్యోగాలు రావటం గగన కుసుమంగా మారింది. కనీస వేతనాలకన్నా తక్కువకే పనిచేయడానికి సిద్ధపడ్డా ఉద్యోగాలు ఇచ్చే నాధులు కరువయ్యారు. సహజంగా ఈ పరిణామాలు యే సమాజంలో నయినా అసంతృప్తులకు దారితీస్తాయి. దానికితోడు అంతో ఇంతో శ్వేత జాతీయులు పాటించే వర్ణ వివక్ష. అధికారికంగా కాకపోయినా ఉద్యోగాలకు పెట్టే ధరఖాస్తు స్తాయిలోనే ఈ వివక్ష మొదలవుతుందని వలస వర్గాల్లో ప్రతీతి.

జాతుల నడుమ క్రమేణా పేరుకుపోయే ఈ రకమయిన వివక్షల ప్రభావం అప్పుడప్పుడూ ఈ మాదిరి అల్లర్ల రూపంలో బయట పడుతూ వుండడం కూడా అక్కడ కొత్తకాదు.
కనీసం చిన్నాచితకా ఉద్యోగాలను సైతం మాకు దక్కనీయటంలేదని ఓ పక్క శ్వేతజాతీయులు ఆరోపిస్తుంటే, వారు పాటించే వర్ణవివక్ష గురించి వలస జాతీయులు ఆరోపించటం మామూలయి పోయింది. ఇలాంటి నేపధ్యం లోనే పోలీసులు ఓ నల్లజాతీయుడిని కాల్చి చంపటంతో అల్లర్లు ఉవ్వెత్తున వూపందుకున్నాయి.
ఈ సందర్భంలోనే భారతీయ సమాజం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు గురించిన ప్రస్తావన అవసరమవుతోంది.

అల్లర్లు చెలరేగిన సమయములో అక్కడి పోలీసుల వ్యవహారశైలి అత్యద్భుతం. కేవలం ఘటనలు జరిగిన 48 గంటల్లో దాదాపు 1500 మంది పైచిలుకు అనుమానితులను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. అల్లర్లు లేని ప్రాంతాలలో పోలీసుల పహారా ముమ్మరం చేశారు. అల్లరి మూకలను అదుపు చేయటానికి వారు అనుసరించిన పద్దతులు అనుసరణీయం. ఇంత పెద్ద స్థాయిలో ఘటనలు జరుగుతున్న సమయంలో కూడా పోలీసులు తుపాకులకు పని చెప్పలేదంటే అల్లర్లను అదుపు చేయడంలో వారు అనుసరిచే అనుసరించే పద్ధతులు ఎలాటివో మన పోలీసులు నేర్చుకోవాలి. అలాగే అక్కడి మీడియా పోషించిన నిర్మాణాత్మక, బాధ్యతాయుతమయిన పాత్ర. వాస్తవాలు మినహా, వదంతులకు ఆస్కారమిచ్చే గాలివార్తలకు బ్రిటిష్ మీడియా పూర్తిగా దూరంగా వుంది.
మనదీ ప్రజాస్వామ్య దేశమే. ఇక్కడా అధికారపక్షం, విపక్షం అన్నీ ఉన్నాయి. విషమ ఘడియల్లో పాలక, ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా యెలా వ్యహరించవచ్చన్నది ఆ దేశం నుంచి నేర్చుకోవాలి. అల్లర్ల సమయంలో బ్రిటన్ లోని ప్రతిపక్షాలవారందరూ నిగ్రహం పాటించిన తీరు మెచ్చదగినది. ఒక్కరు కూడా ప్రజల భావోద్వేగాలను మరింత రెచ్చగొట్టే ఒక్క ప్రకటన కూడా చేయలేదు. అలాగే అక్కడి పాలక పక్షం కూడా ప్రతిపక్షాలు చేసిన ఆచరణ యోగ్యమయిన సూచనలు బేషరతుగా స్వీకరించింది. మరో ముఖ్యమయిన విషయం ఏమిటంటే – ఆపత్కాలంలో సాధారణ ప్రజానీకం సయితం చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోకుండా అవసరమైనంతమేరకే ఆత్మరక్షణ చర్యలకు దిగటం, గొప్ప గుండెనిబ్బరాన్ని ప్రదర్శించి చూపడం.

బ్రిటన్ కానివ్వండి ప్రపంచములో మరే గొప్ప దేశమయినా కానివ్వండి జరిగిపోయిన చరిత్రను మార్చగలిగే శక్తి కలిగివుండడం అసాధ్యం. తమ జాతికాని ప్రజలను తమ దేశానికి అనుమతించే ముందే ముందు చూపుతో వ్యవహరిస్తే పరిస్థితులు ఇలా పరిణమించే అవకాశం వుండదు. తీరా ఇతర జాతీయులు వచ్చి స్థిరపడి కొన్ని తరాలు గడిచిపోయిన తరువాత వారిపై వివక్ష చూపడం నాగరిక సమాజానికి అసలు సిసలు వారసులమని గొప్పలు చెప్పుకునే బ్రిటిష్ శ్వేత జాతీయులకు ఎంత మాత్రం తగని పని. (12-08-2011)

కృతజ్ఞతలు:  లండన్ అల్లర్లు గురించి శ్రీ అచంగ (అరుణ్ చంద్ర గడ్డిపాటి) తమ బ్లాగ్ కృష్ణవేణీ తీరం లో రాసిన కొంత సమాచారాన్ని ఇందులో ఉపయోగించుకోవడం జరిగింది. వారికి మనఃపూర్వక  కృతజ్ఞతాభివందనాలు - భండారు శ్రీనివాసరావు  




.