“లెట్ మి డై, ది వే ఐ వాంట్ టు డై”
రెండు
సంఘటనలు చెప్పుకుందాం.
2018 వ సంవత్సరం
ఏప్రిల్ నెల. సమయం మధ్యాన్నం పదకొండు
పన్నెండు మధ్య.
హైదరాబాదు రాజ్ భవన్ రోడ్డులో యశోదా హాస్పిటల్ లోని ఒక
పేషెంటు గదిలో చిన్న సమావేశం జరుగుతోంది. నిజంగా విచిత్రమే, పేషెంటు గదిలో సమావేశం జరగడం అనేది. చాలా
మంది డాక్టర్లు అక్కడ వున్నారు. రోగి పరిస్థితి గురించి చర్చించడానికి కాదు, రోగి చెప్పేది వినడానికి.
వినడానికి విచిత్రంగా వున్నా ఇది అక్షర సత్యం.
ఆ రోగి పేరు డాక్టర్ ఏపీ రంగారావు. కేన్సర్ తో పోరాడుతూ
మరణ శయ్య మీద ఆక్సిజన్ మాస్కుతో,
బలహీన స్వరంతో ఆయన చెబుతున్న మాటలను వారందరూ బాధతో, మౌనంగా విన్నారు. ఇంతకీ, ఆయన వాళ్ళతో
మాట్లాడింది తాను కోలుకునే అవకాశాలు ఏమేరకు వున్నాయని కాదు. వైద్య రంగంలో వస్తున్న
మార్పులకు అనుగుణంగా యువ డాక్టర్లకు, వైద్య సిబ్బందికి స్కిల్ డెవలప్ మెంటులో
ఎలా శిక్షణ ఇవ్వాలి, దానికి ఏమి చేయాలి అనే అంశం గురించి.
రాం దేవ్ హాస్పిటల్ కు చెందిన డాక్టర్ విక్రం రావు, డాక్టర్ జయరాం పింగళి, డాక్టర్
దయాకర్ (ఇప్పుడు లేరు, చనిపోయారు),
డాక్టర్ నాగభూషణం, డాక్టర్ చారి, అమరా వెంకటేశ్వర రావు, డాక్టర్ వేణుగోపాల్ మొదలైన వారు ఆనాటి సమావేశంలో వున్నారు.
చికిత్స
పేరుతో డబ్బులు పిండుతూ చేసే వైద్యాలకు డాక్టర్ రంగారావు పరమ విరోధి. అతితక్కువ
ఖర్చుతో చేసే వైద్యమే పేదవారు ఎక్కువగా వుండే మన వంటి దేశాలకు ఉపయుక్తమని ఆయన
ఎప్పుడూ చెబుతుండే వారు. స్వల్ప ఖర్చుతో సత్వర వైద్యం అనేది ఆయన నినాదం. చిన్న
చిన్న అస్వస్థతలను శరీరమే తట్టుకుంటుందని, వీటి కోసం పెద్ద పెద్ద వైద్యాలు, పరీక్షలు అనవసరమన్నది డాక్టర్ రంగారావు
నిశ్చితాభిప్రాయం. ఇలా వచ్చిన వారికి ఆయన
ఓ క్రోసిన్ గోలీ వేసుకోండని చెబుతూ వుండేవారు. ఆయన అన్నట్టే వారికి స్వాంతన
చేకూరేది. దానితో ఆయనకు డాక్టర్ క్రోసిన్ అనే పేరు వచ్చింది.
ఎన్నో
ఏళ్ళక్రితం వైద్య విద్యార్ధిగా తొలిపాఠం నేర్చుకున్నప్పుడు, యువ డాక్టర్లకు నేర్పే ఓ నీతిపాఠాన్ని
ఆయన ఒంటపట్టించుకున్నాడు. జీవితాంతం దాన్నే పాటిస్తూ వచ్చాడు.
‘రోగికి అవసరం లేని వైద్యం చేయకూడదు, చేసిన వైద్యానికి డబ్బు తీసుకోకూడదు’
అన్నది ఆ పాఠం.
డాక్టర్ ఏపీ రంగారావు, మా పెద్దక్కయ్య పెద్ద కొడుకు. హైదరాబాదు గాంధీ
మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివి, లండన్ లో పై
చదువులు పూర్తి చేసుకుని
స్వదేశానికి
తిరిగి వచ్చాడు. విదేశాల్లో పై చదువులు పూర్తి చేసుకుని వచ్చిన వాళ్ళు, హైదరాబాదు
వంటి పెద్ద నగరాల్లో పోస్టింగ్ కోసం పోటీ పడుతుంటే, ఆయన మాత్రం ఏరి కోరి
భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో డాక్టరుగా
పనిచేయడానికి వెళ్ళాడు. ఇదీ ఆయన నేపధ్యం.
నిజానికి
డాక్టర్ రంగారావు ఒక మామూలు డాక్టరు. ‘నేనొక షరా మామూలు డాక్టరుని మాత్రమే ’ ఆయన అనుకున్నట్టయితే, ఆయన కధే వేరుగా వుండేది.
ఎక్కడో సంపన్నుల కాలనీలో ఓ పెద్ద భవంతి కట్టుకుని ‘నాకిది చాలు’ అనుకుంటూనో, ’ఇంకా కావాలి’ అని తాపత్రయ పడుతూనో
జీవితాన్ని దొర్లించి ఉండేవాడు. కానీ ఆయన అలా అనుకోలేదు. సాధారణ మనుషులు కూడా
నిబద్ధతతో వ్యవహరిస్తే గొప్ప పనులు చేయడం అసాధ్యం కాదని నిరూపించాడు.
పది
జీవితాల్లో చేయాల్సిన మహత్తరమైన పనులన్నింటినీ ఆయన ఒక్క జీవితంలోనే
చక్కబెట్టగలిగారు.
అలాంటి
విశిష్ట వ్యక్తిత్వం కల మనిషి కనుకనే, ఇతరులకు అసాధ్యం అనుకున్న 108, 104 వంటి అనేక అపూర్వ పధకాలను ఆయన నిజం చేసి చూపించగలిగారు.
సకల
జనులు మెచ్చుకున్న ఆ గొప్ప పనుల వెనుక తానున్నానని చెప్పుకోవడానికి ఆయన ఎప్పుడూ
వెంపర్లాడలేదు.
ఇక రెండో
సంఘటన అదే రోజున కొద్ది గంటల తేడాతో అదే హాస్పిటల్ లో జరిగింది.
సమావేశం
పూర్తయిన అదే రోజు సాయంత్రం ఆయనకు చికిత్స చేస్తున్న పెద్ద డాక్టరు ఆయనతో
చెబుతున్నారు.
‘మీకు మంచి వైద్యం అందుతోంది, త్వరలో కోలుకుంటారు’
ఆయన
ఆశించిన రీతిలో కాకుండా డాక్టర్ రంగారావు నుంచి నివ్వెరపోయే సమాధానం వచ్చింది.
‘నో
డాక్టర్. లెట్ మి డై, ది వే ఐ వాంట్ టు డై. ప్లీజ్ డిశ్చార్జ్ మి’’
పేషెంటు
అభ్యర్ధన మేరకు డిశ్చార్జ్ చేసారు. ఇంటికి చేరాడు. పన్నెండు గంటలు కూడా కాలేదు. ఆ
రాత్రి గడవలేదు. తెల్లవారుజామున కన్ను మూశాడు.
అయితే
ఆయన కన్న కల, ఆయన కనురెప్పల కిందే కరిగిపోలేదు.
రాం
దేవ్ హాస్పిటల్ వాళ్ళు దాన్ని సాకారం చేశారు. లక్షలు ఖర్చుచేసి తమ హాస్పిటల్ లో
స్కిల్ డెవలప్ మెంటు కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దానికి డాక్టర్
రంగారావు పేరు పెట్టారు. విమానాలు నడిపేవారికి సిమ్యులేటర్ లో శిక్షణ ఇచ్చే తరహాలో,
వైద్య సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చే అధునాతన ఏర్పాట్లు ఈ విభాగంలో వున్నాయి.
మొన్న
శనివారం జులై 18 వ తేదీన
దాన్ని నిరాడంబరంగా ప్రారంభించారు. ఆయన
స్మృతికి గొప్ప నివాళి.
(ఇంకా వుంది)