మిత్రుడు సత్యారావు ఓ పుస్తకం రాసాడు. నిజానికి
అది ముందూ వెనుకా అట్టల్ని, ఫోటో పేజీలని మినహాయిస్తే అక్షరాలా ముప్పయి రెండు
పేజీల చిన్ని పొత్తం. ఏకబిగిన చదివించే శైలి కలిగిన పుస్తకం కాబట్టి చదివేయడం
అన్నది కొన్ని నిమిషాల పనే. ఇదొక సౌలభ్యం.
రచయిత సత్యారావు నాకు గత ముప్పయి అయిదేళ్ళు గా
తెలుసు. తెలుసు అనుకుంటున్నాను కానీ అతడి గురించి నాకు అసలు ఏమీ తెలియని విషయాలు
ఎన్నో వున్నాయని ఈ పుస్తకం చదివిన తరువాతే నాకు తెలిసింది. అతడు హైదరాబాదులో పరిచయం అయింది
ఆంద్ర జ్యోతి విలేకరిగా. నేను అప్పటికే 1975 నుంచి
రేడియో విలేకరిగా పనిచేస్తున్నాను. గతంలో జ్యోతిలో పనిచేసి వచ్చాను
కనుక అందులో పనిచేసే సత్యారావు అంటే అవ్యాజానురాగం. నన్ను భం.శ్రీ. అని
పిలిచేవాడు. రేడియోలో ప్రసారం చేసే
అసెంబ్లీ సమీక్షలు రాస్తుండేవాడు. మా దగ్గర తాత్కాలికంగా రిపోర్టింగ్ చేసే
వెసులుబాటు వుండేది. ఆ రోజుల్లో రోజుకు డెబ్బయి అయిదు రూపాయలు ఇచ్చేవాళ్ళు
అనుకుంటాను. ఇప్పుడది బాగా పెరిగినట్టు వుంది. ఇదలా ఉంచుదాం. అలాటి
సత్యారావు ఆనతి కాలంలోనే ప్రభుత్వ సమాచార శాఖలో చేరి దాని డైరెక్టర్ స్థాయికి
ఎదిగాడు. ముఖ్యమంత్రులకు ప్రెస్ సెక్రెటరీగా పనిచేసాడు. చివరికి క్యాబినెట్ హోదా కలిగిన ప్రెస్ అకాడమీ చైర్మన్ అయ్యాడు. ఇవన్నీ నాకు తెలుసు.
కానీ ఈ పుస్తకంలో అతను రాసుకున్న కొన్ని విషయాలు
విభ్రాంతి కలిగించే విధంగా వున్నాయి. ఈ స్థాయికి చేరుకోవడానికి ముందు సత్యారావు
బెజవాడ ప్రెస్ క్లబ్ లో ఆఫీసు బాయిగా పనిచేసాడు. విలేకరుల సమావేశాలు జరిగినప్పుడు
కాఫీ టీలు అందించేవాడు. క్లబ్ లోనే
మెట్లకింద కాళ్ళు ముడుచుకుని రాత్రి పూట నిద్రపోయేవాడు. బెజవాడ హోటల్లో సర్వరుగా
పనిచేసాడు. అవన్నీ హాయిగా శ్రమజీవన సౌందర్యం తెలిసిన మనిషిగా ఎలాటి భేషజాలకు
పోకుండా అక్షరబద్ధం చేసాడు. అదీ అతగాడి సత్య నిష్ఠ. జర్నలిష్టుకు కావాల్సిన
మొట్టమొదటి అర్హత. అలాటివాడి ఎదుగుదల
క్రమాన్ని తెలిపేదే ఈ పుస్తకం. కంటి నీరు అదుముకుంటూ చదువుకోవాలి. చదువరులని మరీ
ఏడిపించడం ఇష్టం లేకనే సత్యారావు ఈ పుస్తకాన్ని అంత చిన్నగా రాసివుంటాడు. ఇక
చివరగా ఒక మాట. ‘మా వూరి దారి నుంచి...’ అనే తన జీవనయాన గాధను సత్యారావు మొదలు పెట్టిన క్రమం ఇలా వుంది. అదొక్కటి చాలు స్థాలీపులాక
న్యాయం మాదిరిగా ఈ పుస్తకం గొప్పదనం తెలపడానికి.
“అది 1977. నెల సరిగ్గా గుర్తు లేదు. బెజవాడ
ప్రెస్ క్లబ్. ఆజానుబాహుడైన ఒక పెద్దాయన నా సత్యారావు భుజము మీద చేయి వేసి మెట్లు
దిగుతున్నాడు.
‘ఏ వూరప్పా’ అడిగారాయన.
‘శ్రీకాకుళం జిల్లా పొందూరు దగ్గర సిరిపురం సార్!’
‘ఏం చేస్తున్నావప్పా’
చెప్పాను, ఆఫీసు బాయ్ నని.
‘బాగా చదువుకో అప్పా’ సలహా ఇచ్చి వెళ్లిపోయారాయన.
‘ఆయన ఎవ్వరో కాదు ఆంద్ర ప్రదేశ్ ప్రధమ
ముఖ్యమంత్రి, తదనంతర కాలంలో భారత రాష్ట్రపతి అయిన శ్రీ నీలం సంజీవరెడ్డి గారు.
జనతా పార్టీ తరపున రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా
బెజవాడ వచ్చి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రెస్ క్లబ్ కి వచ్చారు.”
భవిష్యత్తులో ఎక్కాల్సిన మెట్లకు చిహ్నంగా కాబోలు
సత్యారావుకు ఆ రోజు అలా రాజకీయాల్లో మేరునగ ధీరుడుగా భాసిల్లిన సంజీవరెడ్డి గారు ప్రెస్
క్లబ్ మెట్ల మీద తారసపడ్డట్టున్నారు.
ఆల్ ది బెస్ట్ సత్యారావ్!
('మా ఊరు దారి నుంచి...' పుస్తకావిష్కరణ)