12, ఆగస్టు 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (208) : భండారు శ్రీనివాసరావు

 

మిస్టర్ పెళ్ళాం
ఆవిడ పేరు దుర్గ. బాండ్ జేమ్స్ బాండ్ మాదిరిగా దుర్గ, కనకదుర్గ.
ఆవిడ పేరు సీత.
ఓ యాభయ్ ఏళ్ళ క్రితం బెజవాడ గవర్నర్ పేటలో పాటిబండ అప్పారావు వారింట్లో అద్దెకు వుండేవాళ్ళు. మాంటిసొరీ స్కూల్లో ఆడుతూ పాడుతూ చదువుకుంటూ వుండేవాళ్ళు. ఆ ఇద్దరి స్నేహం అంతా ఇంతా కాదు, చదువయినా, ఆటలయినా ఇద్దరూ కలిసే.
చదువు అయిపోయింది అని అనుకునే లోగా ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అవడం షరా మామూలు. అల్లాగే పెరిగి పెద్దయిన తరువాత జరిగిన పెళ్ళిళ్ళు, చిన్నప్పటి స్నేహితులను విడదీశాయి. అప్పటి నుంచీ ఎక్కడా కలిసింది లేదు, ఎదురుపడ్డదీ లేదు. అలా యాభయ్ ఏళ్ళు గడిచిపోయాయి.
ఫేస్ బుక్ లో నా రాతలు, పెట్టే మా ఆవిడ ఫోటోలు చూసి సీతగారికి మనసు మూలల్లో అనుమానం, తన చిన్ననాటి స్నేహితురాలు దుర్గ కాదు కదా! అని. అనుకోవడం తడవు వారి భర్త గౌరవరం సుబ్బారావు గారి సహకారంతో ఫేస్ బుక్ లో నా నెంబరు పట్టుకుని ఓ సాయంత్రం ఫోను చేసారు. అంతే!
చిన్నప్పటి స్నేహితురాండ్రు ఫోనుకు అతుక్కుపోయారు.
చిన్నతనంలో బెజవాడ పాత బస్ స్టాండ్ దగ్గర పాటిబండ వారి మేడపై తొక్కుడు బిళ్ళల ఆటలు, అప్పారావు గారి భార్య తన పిల్లల్ని, అద్దెకు ఉండేవారి పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించిన వైనాలు అన్నీ వారి ముచ్చట్ల నడుమ గిర్రున తిరిగాయి.
సుబ్బారావు గారితో నేనూ మాట్లాడాను. ఆయన ఎన్ ఎఫ్ సీ ఎల్ లో పని చేసి రిటైర్ అయ్యారు. భార్యాభర్తలు ఇద్దరూ సత్యసాయి భక్తులు. తరచుగా పుట్టపర్తి వెళ్లి సాయి ఆశ్రమంలో సేవలు చేస్తుంటారు.
ఏది ఏమైనా అరవై ఏళ్ళు దాటిన తరువాత మా ఆవిడకు ఒసేయ్, ఏమే అనే ఫ్రెండు దొరికింది. అని సంతోషించాను.
ఇక మా ఇంట్లో
‘ఏమోయ్! ఒసే! ఇలా పిలుపులు లేవు. నేను ఆమెకు ‘ఏమండీ’. ఆమె నాకు ‘మిస్టర్’. పెళ్ళయిన మొదటి రోజునుంచీ ఇంతే!
పుట్టినప్పుడు బియ్యంలో రాసిన పేరు కనక దుర్గ. పొట్టిగా దుర్గ. ముద్దుగా చిట్టి.
ఇలా ఇన్ని పేర్లున్నా కాపురానికి వచ్చిన తర్వాత మా బామ్మగారు రుక్మిణమ్మ ఆమె పేరును నిర్మలగా మార్చేసింది.
నా బాసూ నా బానిసా నా భార్యే. నా తప్పులు సరిదిద్దడానికి బాసు. నా తప్పులు భరించడానికి బానిస. రెండు పాత్రల్లోనూ బానిస బతుకే. ఇలా 48 ఏళ్ళు నాతో కాపురం వెళ్లదీసింది.
ఫస్టు తారీఖు
1987 లో మాస్కో వెళ్ళేవరకు మా ఇంటిల్లిపాదికీ చిరపరిచితమైన పదం, ఈ ఫస్టు తారీకు. అందరం చకోర పక్షుల్లా ఎదురుచూసే రోజును ఎలా మరచిపోగలం!
చేసేది సెంట్రల్ గవర్నమెంట్ కొలువు కాబట్టి నెల జీతం ఏనెలకానెల నెలాఖరురోజున ఇచ్చేవాళ్ళు. సూర్యుడు ఎటు పొడిచినా సరే మేము నలుగురం అంటే నేనూ మా ఆవిడా ఇద్దరు పిల్లలం, ఆరోజు సాయంత్రం మొదటి ఆట ఏదో ఒక సినిమా చూడాల్సిందే. హిమాయత్ నగర్ మినర్వా ( బ్లూ ఫాక్స్) లో భోజనం చేయాల్సిందే. ఆ రోజు తప్పిందంటే మళ్ళీ నెల రోజులు, రోజులు లెక్కపెట్టుకుంటూ ఆగాల్సిందే. ఎందుకంటే మళ్ళీ మర్నాటి నుంచే మాఇంట్లో నెలాఖరు మొదలు కాబట్టి.
మాస్కో వెళ్ళిన కొత్తల్లో ఏమో కానీ ఆ తరవాత్తరవాత అక్కడ ఫస్ట్ తారీకు అనే మాటే మరచిపోయాము. గమ్మత్తేమిటంటే అక్కడ నెలకు ముప్పయి రోజులు మాకు ప్రతి రోజూ ఫస్ట్ తారీకు మాదిరిగానే గడిచిపోయేవి.
తిరిగొచ్చిన తర్వాత మళ్ళీ కధ మామూలే.
కాకపొతే కొత్తగా వచ్చిన క్రెడిట్ కార్డులు మళ్ళీ మొదటి తారీకును మరచిపోయేలా చేసాయి కానీ, ఆ తరవాత టిక్కెట్టు కొనకుండానే నరకాన్ని కూడా చూపించాయి. ఈ కార్డులు అనేవి లేకపోతే నాకసలు బీపీ అనే జబ్బు వచ్చేది కాదని మా ఆవిడ దృఢ విశ్వాసం.
ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా పాత రోజుల్ని రివైండ్ చేసే పనిలో పడ్డాము. పింఛను డబ్బులు బ్యాంకులో పడగానే, నెట్లో సినిమా టిక్కెట్లు బుక్ చేసుకుని, ఉబెర్ లో బయలుదేరివెళ్లి మల్టీప్లెక్స్ లో సినిమా చూసేసి, ఎంచక్కా హోటల్లో భోజనం చేసేసి, ఉబెర్లో పడి ఇంటికి చేరేవాళ్ళం.
కాకపొతే అప్పుడు నలుగురం, ఇప్పుడు ఇద్దరం.
మరీ ఇప్పుడయితే అందులో సగం. అంటే ఒక్కడినే. కాకపోతే ఈ సినిమా తిరుగుళ్ళు లేవు.
‘మా ఆవిడ భయపడేది, అయితే నాకు కాదు. నేనూ భయపడతాను, అయితే ఆవిడకి కాదు.
‘ఇప్పటికే రెండు గుండె ఆపరేషన్లు. ఏటా ఒకసారి పుట్టింటికి వెళ్ళినట్టు ఆసుపత్రిలో మూడు నిద్రలు చేసివచ్చేది. ఇంటికి రాగానే జబ్బుల సంగతి మర్చిపోయి తన పనుల్లో మునిగిపోయేది.
‘నేనలా కాదు. ప్రపంచం నా ముందు బలాదూర్ అనుకుంటూ బలాదూరుగా తిరిగేవాడిని. కానీ చిన్న అస్వస్థత వస్తే చాలు, జావకారిపోతాను.
‘అలాంటిది నన్ను ఇన్నేళ్ళుగా కనిపెట్టుకుని వున్న ఆ 'గుండే' జారిపోతే..... అదే జరిగింది.
నా గుండె గట్టిది కాబట్టి ఆమె దాటిపోయి, అదీ ఆగస్టు నెలలోనే, ఆరేళ్ల తర్వాత కూడా కొట్టుకుంటూనే వుంది.
ఆగస్టు అంటే అదోరకమైన విరక్తి.
కింది ఫోటో:
2017 లో యాభై ఏళ్ళ తర్వాత కలుసుకున్న చిన్ననాటి స్నేహితురాళ్ళ మాటా ముచ్చట





(ఇంకావుంది)

కామెంట్‌లు లేవు: