1, ఆగస్టు 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (204) : భండారు శ్రీనివాసరావు

 వేలు విడిచిన మేనమామ

నేను వేలు పెట్టని ప్రక్రియ లేదు, ఒక్క ఛందోబద్ధ పద్యం, నవలా రచన ఈ రెండు తప్పిస్తే, కధలు, గేయాలు, వ్యాసాలు, వాక్టూనులు, కార్టూనులు, జీవన స్రవంతి వంటి స్వకపోల కల్పితాలు,  టీవీ చర్చలు, వగైరా వగైరా.   

వేలు దూరే సందు దొరకాలే కానీ, అన్నిట్లో వేలు పెట్టడం, వదిలేయడం, అదేదో ఇంగ్లీష్ సామెత లాగా. జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ బాపతన్న మాట.  

మా పెద్ద మేనల్లుడు, నాకంటే వయసులో చాలా పెద్ద అయిన  డాక్టర్ ఏపీ రంగారావు (108, 104 అంబులెన్స్ల  ఫేం) కు పత్రికల్లో వచ్చే గళ్ళనుడికట్లు పూర్తి చేయడం హాబీ. ముఖ్యంగా ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం సప్లిమెంటులో (ఇప్పుడు వస్తున్నదో లేదో తెలియదు) ప్రచురించే గళ్ళనుడికట్టుతో కుస్తీ పడుతుండేవాడు. ఇక్కడ మేనమామ చాలిక పోలిక కుదరదు, నాదీ నా పెద్ద మేనల్లుడి  వరసే. ఆదివారం నాడు అన్ని తెలుగు దినపత్రికలు తెప్పించడం ఇందుకోసమే. ఆ రోజుల్లో వారాల అబ్బాయిలా ప్రతి రోజూ ఒక టీవీ స్టూడియోకి వెళ్ళేవాడిని.  ఆదివారం ఉదయం చర్చలకు వెళ్ళే  టీవీ స్టూడియో నుంచి,  మా ఇంటికి రాని కొన్ని పేపర్లను ‘ఇదిగో ఈ పిల్ల పత్రికని నేను దొంగిలిస్తున్నాను’ అని చెప్పి మరీ  పట్టుకొచ్చేవాడిని. ఏమోలే, ఏనాడూ మనం ఇచ్చే  పచ్చి టీ నీళ్ళు కూడా తాగడు’ అనే సానుభూతో ఏమో  వాళ్ళూ కిమ్మనేవాళ్ళు కాదు.  

ఈ పదబంధ పూరణ అనే అలవాటు క్రమంగా ముదిరి, డీఎడిక్షన్ కు అవకాశం లేని వ్యసనంలా మారింది.

రేడియోలో పనిచేసేటప్పుడు ఒకమ్మాయి వచ్చి ఎలాగైనా వార్తలు చదవాల్సిందే, నా చేత చదివించాల్సిందే అని పట్టుబట్టింది. దూరదర్సన్ అయితే అద్దంలో నీ మొహం చూసుకున్నావా అనే ఒక మాట ప్రయోగించవచ్చు. కానీ రేడియోకి కావాల్సింది రూపం కాదు వాచికం. అదీ ఆమె రూపానికి తగ్గట్టే వుంది. కానీ ఆ మాట మొహం మీద ఎలా చెప్పగలం. వార్తలు చదవడం సంగతేమో కానీ,  మనసులో భావాలు చదివే సామర్ధ్యం వున్నట్టుంది, తెల్లబోయి చూస్తున్న మా మొహాల వంక నవ్వుతూ చూస్తూ అంది, ‘మీకు తెలిసే వుండాలి, అమితాబ్ బచ్చన్ కి కూడా మొదట్లో గొంతు బాగా లేదని చెప్పి  సినిమాల్లో వేషాలు ఇవ్వలేదు, మీరు  ఇచ్చి చూడండి అదే అలవాటు అవుతుంది’ అనే ధోరణిలో వాదం మొదలు పెట్టింది. వార్తలు చదవడం అంటే రేడియో పెట్ట్టుకుని వార్తలు విన్నంత సులభం కాదని, ఆ ఎంపికకు చాంతాడంత ప్రొసీజర్ వుంటుందని ఎలాగో నచ్చచెప్పి పంపించాము అనుకోండి.

నాదీ ఒకరకంగా ఆ అమ్మాయి తత్వమే. ఎందుకు చేయలేను అని అన్నింట్లో వేలు పెడుతుంటాను.

ఎన్నాళ్ళు ఇలా పిల్ల పత్రికల్లో పదబంధ పారిజాతాలు పూర్తి   చేస్తూ కూచోవాలి, నేనే గళ్ళ నుడికట్టు తయారుచేస్తే పోలా అనుకుని ఒక శుభ ముహూర్తంలో కష్టపడి ఆ ప్రయత్నం  చేశాను. ఆ రోజుల్లో నా లక్ష్యం నా పదాల పందిరి మరో పదబంధ  ప్రహేళిక కావాలని. లక్ష్యం పెద్దది పెట్టుకోమన్నారు కదా, కలాం గారు.

బోలెడు తయారు చేశాను, నిజంగా కష్టపడి. ఇందులో ఇంత శ్రమ వున్న సంగతి అప్పుడే తెలిసింది. కానీ వేసే పత్రిక లేదు. ముష్టివాడు వస్తే, చేయి ఖాళీ లేదు అనే ఇల్లాలిలా,  ప్రతి పత్రికకు ఇవి తయారు చేసిపెట్టే ఘనాపాటీలు సిద్ధంగా వున్నారు. దాంతో, పదాల పందిరి శీర్షికతో తయారు చేసిన పందిళ్ళు కొన్ని పాత కాగితాల దొంతరల్లోనే  వుండిపోయాయి.  వెతికితే నాలుగయిదు దొరికాయి. కొన్ని పూరించినవి. కొన్ని పూరించనవి. ఇప్పుడు ప్రయత్నిస్తే నాకే కొరుకుడు పడడం లేదు.  

ఇదంతా ఎప్పుడో, పాతికేళ్ళ కిందటి సంగతి. అప్పుడు కంప్యూటర్లు వున్నాయి, కానీ  ఇప్పటిలా ఇంతటి నాగరీకంగా వుండేవి కావు. ఒకరకంగా చెప్పాలి అంటే గ్లోరిఫైడ్ టైప్ రైటర్లు.  మా  దగ్గర పనిచేసే శ్రీదేవి అనే స్టెనోగ్రాఫర్, నా మాట కాదనలేక  నానా అవస్థపడి గళ్ళనుడికట్టు చార్టులు తయారుచేసింది.  తెలుపు, నలుపు గళ్ళు, మళ్ళీ వాటిలో అడ్డం, నిలువు అంకెలు. తీరా అంతా పూర్తయిన తర్వాత నిలువులోనో, అడ్డంలోనో   ఒక అంకె తప్పు పడేది. మళ్ళీ శ్రమపడి సరిదిద్దేది. అయినా ఒకటి రెండు అక్షర దోషాలు తప్పేవి కావు. శ్రీదేవికి పని ఒప్పచెబితే ఇది నా పని కాదు అనకుండా ఓపికగా చేసేది. మనసు పెట్టి పనిచేసేది.  అంచేత మనసులో తిట్టుకోకుండా ఇష్టపడే ఈ తతంగాన్ని పూర్తి చేసేది.

అప్పుడు ఈ సాంఘిక మాధ్యమాలు లేవు, మనం రాసింది మనం చదువుకోవడమే. మనం చూసుకోవడమే.  

రెండు దశాబ్దాలుగా వెలుగు చూడకుండా వున్న పదాల పందిరి గళ్ళనుడికట్లలో మచ్చుకు ఒకటి.

 

పదాల పందిరి: 5

ఆధారాలు:

అడ్డం:

1. నువ్వు తప్ప (4)

4. కసి కసిగా వుందా? రెండో మారనకపొతే ఏం?  (2)

6. పొమ్మనడం రమ్మనడం అంతా మీ ఇష్టమేనా? (2)

8. దీవించండి ఒక పనయిపోతుంది (5)

10.  ఆవేశం చివర్లో తగ్గిపోయింది (3)

12. దన్నుగా నిలవాలని ఎదురు తిరిగి నిలబడింది  (2)

13. ఉత్తరం పంపాలా? దీన్ని పిలవండి (3)

15. లెస్స పలికితివి కృష్ణ రాయా! (9)

18. విడిపోయింది చెదిరి మధ్యలో కొంత కోల్పోయింది. (3)

19. వున్నవి రెండు ఎలుకలు, వరసగా నిలబడితే, తలలు ఎగిరిపోయాయి. (4)

22. ఆమ్యామ్మా నలుగురికి తెలియకూడదని రూపం మార్చుకుంది. (3)

24. దీంతో కడిగిన ముత్యం మెరవక చస్తుందా! (2)

25. ఇదీ నిలువు 21 మాదిరే! కానీ ముందున్న గౌరవం కోల్పోయింది   (2)

27. వ్రతమన్న పేరే కానీ కాణీ ఖర్చులేదు . పైగా చేయక్కరలేదు, పడితే చాలు  (4)

28. బేధాల్లో ఒకటి  (2)

29. 26 నిలువులోని పాలే సుమా!  (4)

31. ఈ అఘాయిత్యం కూల! ఇదేమిటి?  (4)

32. అప్పటినుంచి (4)

35. కుదుపు  (3)

36. తలాపిడికెడు  (5)

 

ఆధారాలు నిలువు

 

 2. ఫారిన్ లాంగ్వేజెస్ – అందుకే తెలుగు వ్యాకరణం తగలడి గుడి, గుడి దీర్ఘం రెండూ పోయాయి. (6)

 

3. నడి సంద్రములో నడిపించు -------దేవా! (2)

4. నిజమే కానీ మధ్యలో సాగింది (4)

5. ఇంకు (2)

7. రచ్చ రచ్చ (3)

9. గజిబిజి ఆలోచన (3)

10. చూచి రమ్మంటే కాల్చి వచ్చే సేవకులతో ఇదే తంటా! కడకంటా వినరు (2)

11. వేషము కట్టబోతే మధ్యలో కుదరలేదు (3)

13. క భాషలో రెండులు (4)

14. అచ్చంగా చెవులవే (3)

16. పాతకాలం నాటి నాటకాల కరపత్రాలలో ఇది మామూలేగా  (6)

17. తెలుపు గడి కదా! తెల్లదే (5)

20. కింద నుంచి ఏర్పాటు, అరమరిక ర లేదు. (4)

21. ఇది ఆజ్ఞే కానీ ముందు గారు (3)

23. ఉచ్చారణ లేని భాష (2)

26. కుంభం రాశి కాదు (2)

28. అంతరాయం కనుకే అలా అయింది (4)

30. పన్నీరుకు జత (3)

 33. పద్యం చెప్పాలంటే ఈ సన్యాసి అవసరం ఎంతో వుంది. (2)

34. ఈ భారం అంటే కృష్ణుడు గుర్తు వస్తాడు (2)

 

తోకటపా:

ఇదంతా రాసిన తర్వాత నాకు బోధివృక్షం అవసరం లేకుండానే  జ్ఞానోదయం అయింది. టెక్నాలజీలో గొప్ప ప్రవేశం లేని నాకు అర్ధం అయింది ఏమిటంటే:

“THIS IS NOT MY CUP OF TEA”

 

 

 

 

 

కింది చిత్రాలు : పదాల పందిరి (5) ఆధారాలతో పూరించక మునుపు, పూరించిన తర్వాత







 

(ఇంకావుంది)

 

కామెంట్‌లు లేవు: