అస్పష్ట స్పష్ట చిత్రం తెలంగాణా రాజకీయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అస్పష్ట స్పష్ట చిత్రం తెలంగాణా రాజకీయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, సెప్టెంబర్ 2018, సోమవారం

అస్పష్ట స్పష్ట చిత్రం తెలంగాణా రాజకీయం


  
ఇప్పుడు అన్ని పార్టీలదీ కేసీఆర్ బాటే.
‘అవసరమైతే లక్ష్య సాధన కోసం గొంగళి పురుగును అయినా ముద్దాడతాను’
ఈమాట ఆయన అన్నది తెలంగాణా సాధించడం కోసం. కానీ ఇప్పుడు ఈ పద ప్రయోగం  చేస్తున్న వారి ధ్యేయం వేరే!
పేకాట ఆడేవారి విషయంలో ఒక జోకు ప్రచారంలో వుంది. ‘మనకు పడ్డ ఆట ఎలా వుందో మనం ఎప్పుడయినా చూసుకోవచ్చు, ముందు పక్కవాడికి ఎలాటి ఆట పడిందో చూద్దాం’
ప్రస్తుతం రాజకీయ క్రీడల్లో మునిగితేలుతున్న పార్టీల పరిస్తితి కూడా చూడబోతే అలాగే వుంది.
‘మన వ్యూహాలు మనకెలాగో వుంటాయి, ముందు ప్రత్యర్ధి పార్టీల ఆలోచనలు, కదలికలపై ఓ కన్నేసి వుంచడం మంచిదని అనుకుంటున్నట్టుగా వుంది.
ముందస్తు ఎన్నికలు తప్పవని తేలిపోయిన తెలంగాణలో రాజకీయ పరిస్తితులలో  కొంత వరకు స్పష్టత వచ్చింది.
తెలంగాణలో బీజేపీ బలపడడం కానీ, కేంద్రంలో మోడీ మళ్ళీ అధికారంలోకి రావడం కానీ  కాంగ్రెస్  పార్టీకి ఇష్టం వుండదు.
‘తెలంగాణలో కాని, ఆంధ్రప్రదేశ్ లో కానీ బీజేపీ బలపడకూడదు,   కేంద్రంలో ఎట్టి పరిస్తితుల్లోను మోడీ ప్రభుత్వం తిరిగి రాకూడద’ని టీడీపీ (అధిష్టానం) భావన.
‘కేంద్రంలో ఎవరు గద్దె ఎక్కుతారో అనేది తరువాతి మాట. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడకూడదు, అలాగే తమ పార్టీ మళ్ళీ ముందుగానే అధికారంలోకి వచ్చి తీరాలి’ ఇది టీఆర్ఎస్ అధినేత మనసులోని మాట.
‘తెలంగాణాలో కాంగ్రెస్, టీడీపీలు బలపడకూడదు’ అనేది బీజేపీ (అధిష్టానం) ఉద్దేశ్యం.     
ఇప్పటికి తెలంగాణలో రాజకీయ పరిస్తితి ఇది.
‘రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారానికి వచ్చే పరిస్తితి ఎలాగూ  లేదు. కేంద్రంలో బీజేపీని  రాకుండా చేయడానికి బద్ధ శత్రువు కాంగ్రెస్ తో చేయి కలపడానికి కూడా సిద్ధం’ అంటున్న టీడీపీ, తెలంగాణా విషయానికి వచ్చేసరికి డోలాయమానంలో పడుతోంది. స్థానిక నాయకత్వం కోరుకుంటున్నట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలుపుకుంటే టీఆర్ ఎస్ దూకుడును నిలవరించడం సాధ్యం కావచ్చు. కానీ తమ పార్టీకి యేవో కొన్ని సీట్లు తప్పిస్తే అధికారానికి వచ్చే చాన్స్ లేదు. వస్తే గిస్తే ఆ అవకాశం కొంత కాంగ్రెస్ పార్టీకు ఉండవచ్చు. అలాంటప్పుడు ఈ ‘తనకుమాలిన ధర్మం’ ఎందుకని పార్టీలోనూ, పార్టీ శ్రేయోభిలాషుల్లోను తలెత్తుతున్న ధర్మసందేహం. కేసీఆర్ తో లేని పోని  కీచులాట మినహా ఇందువల్ల సాధించేది పెద్దగా ఉండదని తెలంగాణాలో స్థిరపడిన ఆంధ్రప్రాంతపు శ్రీమంతుల (కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు) మన్ కీ బాత్.
బహుశా అందుకే కేసీఆర్ నరనరాన ద్వేషిస్తున్న కాంగ్రెస్ తో బాహాటంగా జట్టు కట్టడానికి అధినేత తటపటాయింపు అని కొందరి భాష్యం.
తెలంగాణలోనే పుట్టి, ఎన్టీఆర్ హయాములో బడుగు, బలహీన వర్గాల ఆదరణను చూరగొన్న తెలుగు దేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాలని, అందుకు అసెంబ్లీ ఎన్నికలను అవకాశంగా వాడుకోవాలని, కేడర్ బలమున్న తమ పార్టీ, లీడర్ బలమున్న కాంగ్రెస్ వంటి మరో పార్టీతో జత కడితే బాగుంటుందని  ఆ పార్టీ స్థానిక నేతలు భావించడంలో తప్పేమీలేదు. కానీ అసలు చిక్కల్లా, ఏదైనా అనుకోనిది జరిగితేనో,  లేదా అనుకున్నట్టుగా జరగని పక్షంలోనో  టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల నడుమ అది మరికొన్ని కొత్త చిక్కులకు కారణం అయ్యే  ప్రమాదం వుంది. అందుకే కాబోలు, ఏ విషయాన్ని అయినా సాకల్యంగా, ముందు వెనుకలు, సాధ్యాసాధ్యాలు అన్నీ పూర్తిగా  పరిశీలించుకుని కానీ అడుగు వేయడం అలవాటులేని చంద్రబాబునాయుడు, ఈ పొత్తుల అంశాన్ని ప్రస్తుతానికి స్థానిక నాయకులకు వదిలేసి, ఎన్నికల  ప్రచారానికి కూడా తాను  రాబోవడం లేదన్న సంకేతాలు ఇవ్వడం. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకు కనీసం 50:50 అవకాశాలు వున్నాయని నిర్ధారణకు రానిదే చంద్రబాబు ఈ విషయంలో స్పష్టంగా ఏ నిర్ణయమూ ప్రకటించక పోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం టీడీపీతో పొత్తుపెట్టుకోవడానికే తహతహలాడుతున్నట్టుంది. ఒక్క టీఆర్ఎస్ తోనే కాదు, అటు బీజేపీని, ఇటు కేసీఆర్ ని వ్యతిరేకించే ఇతర రాజకీయ పార్టీలను కూడా కలుపుకుని మహా కూటమి ఏర్పాటు చేయాలనే యోచనతో ఆ పార్టీ ముందుకు సాగుతోంది.
పొతే కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు ఏ రూపంలో అంటే బహిరంగంగానా లేక లోపాయకారీగానా అనేది టీడీపీ అధినాయకుడి ఆలోచనకు అనుగుణంగా వుంటుంది.