12, డిసెంబర్ 2019, గురువారం

రేడియో రోజులు - 40 - భండారు శ్రీనివాసరావు


ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ నెల్లూరు? ఎక్కడ ఆలిండియా రేడియో, ఎక్కడ బీజేపీ, ఎక్కడ వెంకయ్యనాయుడు, ఎక్కడ శ్రీనివాసరావు? ఎక్కడ 2005 ఎక్కడ 2017?
అదంతా గతం. అని నేను అనుకున్నాను. కాదని నాయుడు గారు అనుకుంటున్నారు (ట).
ఆలిండియా రేడియో అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా పదవీ విరమణ చేసిన డాక్టర్ పద్మనాభరావుగారు ఈ సంగతి చెప్పారు కనుక నమ్మక తప్పదు. వెంకయ్య నాయుడుగారు  గౌరవించి ఆదరించే ఆత్మీయులలో డాక్టర్ పద్మనాభరావు గారు ఒకరు. రేడియో గురించి అనేక గ్రంధాలు రాశారు. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి ఆలిండియా రేడియోలో ఉన్నత స్థానానికి చేరుకోగలిగారు.
కొంత కాలం  క్రితం పద్మనాభరావు గారు స్వర్ణభారతి ట్రస్టుకు వెళ్ళారు. ఉపరాష్ట్రపతి హోదాలో నాయుడు గారు ట్రస్టులో ఇద్దరు ముగ్గురు సన్నిహితులకు సాదాసీదాగా ఇచ్చిన విందులో పద్మనాభ రావు గారు కూడా  పాల్గొని, నాయుడి గారితో ఉన్న  పాత పరిచయంతో మాటామంతీ జరిపారు. ఆ సంభాషణల్లో వెంకయ్యనాయుడు నాయుడు గారు నా ప్రసక్తి కూడా తెచ్చారని  పద్మనాభ రావు గారు పేర్కొంటే  సంతోషం అనిపించింది.
వెంకయ్య నాయుడు గారితో నా మొదటి పరిచయం 1972 – 73 లో ప్రత్యేక ఆంద్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల నాటిది. నేను బెజవాడ నార్లవారి ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాను.  బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఇప్పుడు స్వరాజ్ మైదానం అనుకుంటా, అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రధాన వక్తలు మాట్లాడిన తరువాత ఒక యువకుడు మైకు అందుకున్నాడు. నిమిషాల వ్యవధిలోనే సభికులను తన వాగ్దాటితో మైకంలో ముంచి తేల్చాడు. ఎవరని ఆరా తీస్తే వెంకయ్య నాయుడు అన్నారు. పేరు చూస్తే వయసుమళ్ళినవాడనిపించేది కానీ, మనిషి మాత్రం చాలా  చిన్నకారువాడే.
1975 లో హైదరాబాదు ఆలిండియా రేడియోలో విలేకరిగా చేరిన మూడు సంవత్సరాలకు వెంకయ్యనాయుడు ఎమ్మెల్యేగా శాసన సభలో అడుగుపెట్టారు. ఆయనకు జోడీ ఎస్. జైపాల్ రెడ్డి.  ఇక వాళ్ళు సభలో ప్రసంగం మొదలు పెట్టినా, ప్రశ్నలు లేవనెత్తినా, ప్రభుత్వాన్ని నిలదీసినా మొత్తం ప్రెస్ గ్యాలరీ పూర్తిగా నిండిపోయేది. వింటూ రాసుకోవడం విలేకరులకి అలవాటే అయినా వాళ్ళిద్దరూ చెబుతున్నది ఆసక్తిగా వినాలా,  శ్రద్ధగా వింటూ పొల్లుపోకుండా రాసుకోవాలా అనేది అందరికీ  ఒక సమస్యగా వుండేది. ఆ రోజుల్లో ‘శాసన సభలో ఛలోక్తులు’ అనే శీర్షికతో  ప్రతి పత్రికా ఒక కాలం ప్రచురించేది.  వాటిల్లో సింహభాగం వారిద్దరివే  ఉండేవి. ఈ విషయంలో ఇద్దరూ ఇద్దరే.  వెంకయ్యనాయుడి విశ్వరూపం నేను చూసింది అసెంబ్లీలోనే. అంత్య ప్రాసలతో  ఉపన్యాసాన్ని రక్తి కట్టించే ఆ సాంప్రదాయాన్ని ఆనాటి నుంచి ఈనాటివరకూ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ప్రసంగాల్లో కూడా  ఆయన కొనసాగిస్తూ వస్తూనే  వున్నారు.     
ఇక ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో ఆయన పాత్ర ఇంతా అంతా కాదు. ప్రజల్లో రగిలిన అసహనానికి ఆయన వాగ్ధాటి ఆజ్యం పోసిందనడంలో అతిశయోక్తి లేదు.
మరోసారి కలిసింది ఢిల్లీలో. మాస్కో రేడియోలో పనిచేస్తూ సెలవుపై హైదరాబాదు వస్తూ ఢిల్లీలో దిగాను. పూర్వ పరిచయం పురస్కరించుకుని వెడితే గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించారు. మాస్కో విశేషాలు అడిగి ఆసక్తిగా విన్నారు.
వై.ఎస్. రాజశేఖర రెడ్డి మొదటి విడత  ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో నేనూ జ్వాలా నరసింహారావు ఒకసారి ఢిల్లీ వెళ్ళాము. ఏపీ భవన్ లో దిగిన మమ్మల్ని కలవడానికి సీనియర్ జర్నలిష్టులు చంద్రకాంత్, ఆనంద్ వచ్చారు. మాటల మధ్యలో వెంకయ్యనాయుడు గారి ఇంటికి వెడుతున్నట్టు చెప్పి మమ్మల్ని కూడా రమ్మన్నారు. ఆయన ప్రతి సంక్రాంతి పండక్కు కాబోలు తన ఇంట్లో చక్కటి విందు భోజనం ఏర్పాటుచేసి, ఢిల్లీలోని తెలుగు కుటుంబాలను ఆహ్వానిస్తారు. పిలవని పేరంటంగా వెళ్లిన మా ఇద్దర్నీ కూడా వెంకయ్యనాయుడు చాలా ఆదరంగా కనుక్కున్నారు. అద్వానీని చాలా దగ్గరగా ఆ సందర్భంలోనే చూడడం తటస్తించింది. అందరూ వెళ్ళిన తరువాత వెళ్లి కలిస్తే, ‘ఢిల్లీ వచ్చిన పనేమిటని’ ఆయనే  ఆరా తీసారు. అప్పుడు జ్వాలా 108 లో పనిచేస్తున్నాడు. రాజస్థాన్ రాష్ట్రంలో విస్తరణ గురించి జ్వాలా చెబితే అక్కడి ముఖ్యమంత్రితో మాట్లాడుతానని చెప్పి, అప్పటికప్పుడే  మాట్లాడారు కూడా.
నాయుడి గారితో  నా రేడియో అనుబంధం ఇంకా విచిత్రం. ఎమ్మెల్యేగా, పార్టీలో అతి వేగంగా ఎదుగుతున్న నాయకుడిగా వున్న రోజులనుంచి పరిచయం.  ఏదైనా వార్తను పత్రికలకు ఎలా కూర్చి చెప్పాలో, రేడియోకు ఎలా మార్చి  చెప్పాలో ఆయనకు కరతలామలకం. రేడియో వార్తలకు వున్న పరిమితులు ఆయనకు మాకన్నా బాగా తెలుసేమో అనిపించేది. ఎందుకంటే ఆయన ఏదైనా వార్తను  రేడియో కోసం ఫోనులో చెబితే మళ్ళీ తిప్పి రాసుకోవాల్సిన అవసరం వుండేది కాదు. అంత క్లుప్తంగా, సూటిగా వార్తను మలిచి చెప్పేవారు.   మధ్యాన్నం పూట,  మళ్ళీ సాయంత్రం రేడియోలో ప్రాంతీయ వార్తలు ప్రసారం అయ్యేవి. ఆయన ఇరవై మూడు జిల్లాల్లో ఎక్కడ వున్నా ఫోనుచేసి వార్త చెప్పేవారు. మేము ప్రసారం చేసింది విని, మళ్ళీ ఫోను చేసి ‘బాగానే చెప్పారు కానీ మరో వాక్యం జత చేస్తే బాగుండేది, సాయంత్రం వీలుంటే చెప్పండి’ అనేవారు, మేము  ‘కాదు’ అనడానికి అవకాశం ఇవ్వకుండా. అంత మన్ననగా వుండేది ఆయన వ్యవహార శైలి. తదనంతర కాలంలో ఏకంగా రేడియో, దూర దర్శన్ లను ప్రత్యక్షంగా పర్యవేక్షించే కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు కూడా ఆయన తీరులో ఇసుమంత మార్పును నేను చూడలేదు. 
ఇక ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా  వెంకయ్యనాయుడు గారు పదవీ రీత్యా చాలా బిజీ. కానీ వారికి జర్నలిస్టులు అంటే తగని అభిమానం. అందులోను గతంలో ఈ రంగంలో ఎంతో కాలం పనిచేసి, ఉద్యోగ విరమణ అనంతరం ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్న వయోధిక పాత్రికేయులంటే మరింత వాత్సల్యంతో కూడిన అభిమానం. అందుకే వయోధిక పాత్రికేయ సంఘం సభ్యులం కొంతమందిమి వారిని కలవాలని ఉందనే  ఆకాంక్షను ఉపరాష్ట్రపతి ప్రెస్ సెక్రెటరి శ్రీ మల్లికార్జున్ (ఒకప్పుడు హిందూ పత్రిక విలేకరి) ద్వారా తెలపగానే ఆయన  వెంటనే అంగీకరించారు. ఇచ్చిన సమయానికి ముందే మేము, హైదరాబాదులోని  జూబిలీ హిల్స్ లోఉన్న  వారి నివాస గృహానికి చేరుకున్నాము. తేనీటి వంటి అతిధి మర్యాదలు ఆయనే  స్వయంగా కనుక్కున్న తర్వాత మేము వచ్చిన పని చెప్పాము. ఈ ఏడాది ప్రసిద్ధ సంపాదకులు గోరా శాస్త్రి గారి  శతజయంతి సంవత్సరం. ఈ సందర్భంగా ఆయన స్మృత్యర్ధం ప్రచురించిన ఒక పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరింప చేయాలనేది మా సంఘం తరపున చేసిన అభ్యర్ధన. రెండో మాటకు తావివ్వకుండా అంగీకరించి,  అందుకు సంబంధించిన ఆదేశాలను వ్యక్తిగత సిబ్బందికి అక్కడికక్కడే జారీ చేసి, ‘ఇహ చెప్పండి ఏమిటి విశేషాలు’ అంటూ ముచ్చట్లకు స్వీకారం చుట్టారు. వచ్చిన వారినందరినీ పేరు పేరునా పలకరించి మా పూర్వాశ్రమాలలో మాతో వారి అనుభవాలను, జ్ఞాపకాలను చాలాసేపు గుర్తు చేసుకున్నారు. అవన్నీ ఒకచోట రాయాలంటే పెద్ద వ్యాసమే అవుతుంది. వీలువెంట రాయాలనేది నా సంకల్పం. తరువాత ఇచ్చిన మాట ప్రకారమే  గోరా శాస్త్రి గారి శత  జయంతి కార్యక్రమానికి హాజరై చక్కటి ప్రసంగం చేశారు.
వెంకయ్యనాయుడి గారిని కలిసిన వాళ్ళలో నాతోపాటు శ్రీయుతులు జీ.ఎస్. వరదాచారి, ఉడయవర్లు, లక్ష్మణ రావు,  దాసు కేశవరావు, నందిరాజు రాధాకృష్ణ, శ్రీనివాసరెడ్డి (మాజీ ఈనాడు) ఉన్నాము. 
ఉపరాష్ట్రపతి గా ఎంపిక కావడానికి పూర్వం మోడీ మంత్రివర్గంలో సభ్యుడిగా వున్న కాలంలో హైదరాబాదులో ఏదో కార్యక్రమానికి హాజరయి, జనాల హర్షద్వానాల నడుమ ఆసక్తికర ఉపన్యాసం ముగించుకుని, విమానం టైం అయిందని మధ్యలోనే వెడుతుంటే దారిలో నాకు కనిపించారు. ‘ఎలా వున్నావు శ్రీనివాసరావు’ అంటూ అదే ఆదరణతో కూడిన పలకరింపు. నడుస్తూనే నా గురించి మంచీచెడూ కనుక్కుంటూ కారెక్కి వెళ్ళిపోయారు.
పరిచయం ఉన్నవారిని ఆయన మరచిపోరు. ఆయనతో పరిచయం ఉన్న వారు ఆయన్ని మరచిపోరు.
అలాంటి విలక్షణ వ్యక్తిత్వం వెంకయ్యనాయుడు గారిది.
(ఇంకా వుంది)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

వెంకయ్య నాయుడు గారు విశిష్ట మైన ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి. గొప్ప జాతీయ మానవతా వాది. అందరినీ కలుపు పోయే స్వభావం కలవారు. ఆయన భావి కాలంలో రాష్ట్రపతి పదవి చేపట్టాలి.