20, డిసెంబర్ 2019, శుక్రవారం

రేడియో రోజులు -48- భండారు శ్రీనివాసరావు


నేటి తెలుగు ప్రసార మాధ్యమాలు అన్నింటికీ ఆకాశవాణి మూలపుటమ్మఅనవచ్చు. 
1954 దాకా మద్రాసు కేంద్రంలో లలిత సంగీత విభాగం ప్రత్యేకంగా ఏర్పడకపోయినా ప్రధానమైన నాలుగు దక్షిణ భారతీయ భాషల్లో లలిత  గీతాల ప్రసారం 1939 నుంచీ తరచుగానే సాగుతుండేది. బిల్హణీయంవిశేషమైన ఆదరణ పొందడంతో ప్రముఖులైన కవులతో రాయించిన సంగీత నాటకాలు ఎన్నింటినో  మద్రాసు కేంద్రం ప్రసారం చేసింది. వాటిలో కొన్ని:  కృష్ణ శాస్త్రి రాసిన శర్మిష్ట’, ‘వూర్వశి’,  ‘శబరి’, ‘గుహుడు’, ‘అతిధిశాల’, ‘దక్ష యజ్ఞం’, ‘కృష్ణాష్టమి’, విశ్వనాధ సత్యనారాయణ రాసిన కిన్నెరసాని’, ‘కోకిలమ్మపెళ్లి’, ‘సుమిత్ర’, ‘ఊర్మిళ’, ‘’మారీచుడు’, ‘గోదావరి’. అలాగే రజని (బాలాంత్రపు రజనీకాంతారావు రాసిన మధురానగర గాధ’, ‘చండీ దాసు’, ‘మేఘ సందేశం’, శివశంకర శాస్త్రి (స్వామి) రాసిన  ‘పద్మావతీ చరణ చారణ చక్రవర్తి’,  శ్రీ శ్రీ రాసిన  ‘వ్రేపల్లె’.
ఉమర్ ఖయ్యాం జీవితాన్ని, అతని తత్వాన్ని ఆవిష్కరించినది  ‘అతిధి శాల’.  ఉర్దూ, అరబ్బీ, పారశీక పదాలతో కృష్ణశాస్త్రి  సృష్టించిన మధ్య ప్రాచ్య వాతావరణాన్ని, అందుకు తగిన సంగీతాన్ని సమకూర్చి శ్రావ్యకావ్యంగా తీర్చిదిద్దినవారు రజని’. అలాగే కృష్ణ శాస్త్రి విరచిత దక్ష యజ్ఞం’ -  సాలూరి రాజేశ్వరరావు సంగీతంలో రూపుదిద్దుకున్న మరో అద్భుతం.
టేప్ రికార్డింగ్ సదుపాయాలు  లేని  ఆ రోజుల్లో రేడియో  కార్యక్రమాలన్నీ అప్పటికప్పుడు  ప్రసారం అయ్యేవి. (LIVE BROADCASTS). అందువల్ల ఎన్నో గొప్ప కార్యక్రమాలు రేడియో పరిభాషలో చెప్పాలంటే- ఇప్పుడు లభ్యం కాకుండా గాలిలో కలిసిపోయాయి.
శ్రీ శ్రీ రాసిన బలి’, ‘గ్రామఫోను రికార్డులా తిరుగుతాడుఅనే రేడియో నాటికలు  1939-40 లలో ప్రసారమయ్యాయి. రేడియో నాటక రచనలు యెలా చేయాలో తెలిసిన రచయితలు కొందరే. అటువంటివారిలో శ్రీ శ్రీ ఒకరు. మనకు లభిస్తున్న ఆధారాలనుబట్టి1939 నుంచి 1984 దాకా శ్రీ శ్రీ రేడియో కోసం  14 నాటికలు రాశారు. వీటిల్లో మరో ప్రపంచంఒకటి. అందులో ప్రధాన పాత్ర పేరు కనుపాప’. ఇరవై  ఒకటో శతాబ్దానికి చెందినవాడు. ఇరవై  ఐదో శతాబ్దంలోకి వెళ్ళబోయి యాంత్రికలోపంతో ఇరవయ్యవ శతాబ్దిలోకి వస్తాడు. ఆ పాత్ర చేత శ్రీ శ్రీ ఒకచోట ఇలా పలికిస్తాడు.  ‘భాష చాలా అసమగ్రమైన పనిముట్టు. ఏ వూహనీ అది విస్పష్టంగా, అసందిగ్ధంగా తెలియచెయ్యలేదు’.
పీవీ రాజమన్నార్, కొడవటిగంటి కుటుంబరావు, గోరాశాస్త్రి మొదలయిన వారు ఆ రోజుల్లో రేడియో కోసం నాటకాలు రాసేవారు.  1939 నాటికే మద్రాసు కేంద్రం స్త్రీలకోసం పిల్లల కోసం కార్యక్రమాలు మొదలుపెట్టింది. బాలల  కార్యక్రమాలను ఒక వారం దుర్గాబాయమ్మ (దుర్గాభాయి దేశముఖ్) నిర్వహిస్తే  మరో వారం న్యాయపతి కామేశ్వరి నడిపేవారు. కొన్నాళ్ళకు దుర్గాబాయమ్మ తమకున్న ఇతర పనుల తొందర వల్ల రేడియోకి రాలేకపోయేవారు. అప్పుడు కామేశ్వరితో పాటు ఆమె భర్త న్యాయపతి రాఘవరావు రేడియోలో బాలల  కార్యక్రమాల నిర్వహణకు పూనుకున్నారు. ఆ దంపతులు  ‘రేడియో అన్నయ్య’,  ‘రేడియో అక్కయ్యఅనే  పేర్లతో ప్రసిద్ధులయ్యారు. తెలుగులో బాల సాహిత్యం వర్దిల్లడానికి  వారిద్దరూ  చేసిన సేవ చిరస్మరణీయం. బాలలకోసం పాటలు, నాటికలు రాయడంతోపాటు వాటిని బాలలతోనే నిర్వహించడం ఆటవిడుపుఅనే ఆదివారం కార్యక్రమం సాధించిన విజయం అపూర్వం. ఆ తరువాత బాలానందం పేర శనివారాలలోను పిల్లల  కార్యక్రమాలు ప్రసారం చేసేవారు.
రెండు రోజులకోసారి ‘మహిళామండలి’ కార్యక్రమాలు మధ్యాహ్న సమయంలో ప్రసారం అయ్యేవి. ఆ కార్యక్రమాల చివర వినిపించే ‘మంగళ హారతి’ ని  ఆ రోజుల్లో చాలా ఇళ్ళల్లో శుభకార్యాల్లో పాడుతూ వుండేవారు. స్త్రీల పట్ల వివక్ష ఎక్కువగా వున్న ఆ కాలంలో ‘మహిళా మండలి’ ఎందరో స్త్రీలకు ‘వాణి’ కాగలిగింది.
అప్పటి ఉమ్మడి  మద్రాసు రాష్ట్రంలో వున్న తెలుగు జిల్లాలలో వున్న సంగీత కళాకారులెందరో మద్రాసు రేడియో కేంద్రం నుంచి తమ సంగీతాన్ని వినిపించినవారే. తెలుగు పాట విలువను, ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన ప్రముఖ గాయకుల   తొలి కార్యక్రమాలు మద్రాసు రేడియో కేంద్రం నుంచే  ప్రసారం అయ్యాయి. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ  పదకొండేళ్ళ వయస్సులో 1941  జులై రెండో తేదీన తమ మొదటి రేడియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరువాత కొన్నేళ్లకు ఆయన  విజయవాడ, మద్రాసు, హైదరాబాదు రేడియో స్టేషన్లలో ఉద్యోగం చేశారు. రేడియో సంగీత చరిత్రలో ఇదో గొప్ప అధ్యాయంగా చెప్పుకోవచ్చు. అలాగే ఘంటసాల వేంకటేశ్వర రావు 1944  సెప్టెంబర్ ఇరవైన మొదటిసారి రేడియోలో పాడారు. ఆ తరువాత అనేక సార్లు ఆయన లలితసంగీత కార్యక్రమాల్లో, సంగీత నాటకాల్లో పాల్గొంటూ వచ్చారు. దీపావళి పండుగ కోసం సముద్రాల రాఘవాచార్యులు రాసిన ‘వెలుగు వెల్లువ’ అనే సంగీత నాటకంలో ఘంటసాల, భానుమతి ప్రధాన పాత్రధారులు. విశ్వనాధ రాసిన ‘కిన్నెరసాని’ సంగీత నాటకానికి ఘంటసాల సంగీతం సమకూర్చారు. ‘లైలా మజ్నూ’ నాటకంలో ఘంటసాల మజ్నూ పాత్ర పోషించారు. అందులో ఆయన పాడిన ‘గుడారమెత్తివేశారు’‘ఎందు చూచినగాని లైలా...’ అనే పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.(రచన: యండమూరి సత్యనారాయణ, సంగీతం : రజని). 1945 లో ఘంటసాల పాడిన రజని గేయం ‘ఘనాఘనా గర్జింపవొ..’ అనే పాట  ఢిల్లీ నుంచి జాతీయ కార్యక్రమంలో ప్రసారమయింది.
రెండో ప్రపంచ యుద్ధం రోజుల్లో మద్రాసు నగరం నుంచి షార్ట్ వేవ్ ట్రాన్స్ మిటర్ (ప్రసారిణి) ను ఢిల్లీ తరలించారు. 1942 నుంచి1945 దాకా తెలుగు, తమిళ కార్యక్రమాలు ఢిల్లీ నుంచి కూడా ప్రసారం అయ్యాయి. మద్రాసు నుంచి కొంత బలహీనపడిన ప్రసార వ్యవస్థ ద్వారా తెలుగు, తమిళ ప్రసారాలు కొనసాగినా, శ్రోతలు ఢిల్లీ నుంచి వెలువడే కార్యక్రమాలపట్ల ఎక్కువ ఆకర్షితులయ్యేవారు.
1947లో దేశం స్వాతంత్రం సాధించేనాటికి -  ఆలిండియా రేడియో  వ్యవస్థలో ఢిల్లీ, కలకత్తా (కోల్ కతా), బొంబాయి(ముంబై), మద్రాసు(చెన్నై), లక్నో, తిరుచిరాప్పళ్లి రేడియో కేంద్రాలు మాత్రమే వుండేవి. మద్రాసు నుంచే కాక డెక్కన్ రేడియో నుంచి, మైసూరు నుంచి(చాలా అరుదుగా) తెలుగు ప్రసారాలు జరిగేవి. స్వాతంత్రం వచ్చిన తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సమాచార, ప్రసార శాఖల మంత్రి అయ్యారు. ఆయన పర్యవేక్షణలో దేశంలో రేడియో వ్యాప్తికి కృషి మొదలయింది.  
1948 అక్టోబర్ 12 నాడు విజయవాడలో రేడియో కేంద్రం మొదలయింది. దీనితో మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
(ఇంకా వుంది)
(సమాచార సేకరణలో తోడ్పడిన డాక్టర్ పి.ఎస్. గోపాల కృష్ణ గారికి కైమోడ్పులు)

కామెంట్‌లు లేవు: