19, డిసెంబర్ 2019, గురువారం

రేడియో రోజులు - 47 - భండారు శ్రీనివాసరావు
రేడియో అన్న మూడక్షరాలు కాలగర్భంలో కలిసి పోయాయేమో అన్న అనుమానాలన్నీ, రేడియో గురించి రాస్తున్న వ్యాసాలపై వస్తున్న అనూహ్య స్పందన చూసి పటాపంచలయిపోయాయి. గుర్తున్నంతవరకే కాకుండా, గుర్తు తెచ్చుకుని మరీరాయాలనీ, అవసరమయితే రేడియో గురించి తెలిసిన ప్రతి ఒక్కర్నీ తట్టిలేపయినాసరే ఇంకా ఇంకా రాయాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయం లో అందరి సహకారాన్నీ మనస్పూర్తిగా కోరుతున్నాను. తప్పులు దిద్దుకోవడంలో, రాసిన విషయాలను మరింత సమగ్రం చేసుకోవడంలో, ఎప్పటికప్పుడు సమాచారాన్ని క్రోడీకరించు కోవడంలో ఈ సహకారం ప్రయోజనకారిగా వుండగలదని నమ్ముతున్నాను.

ఆకాశవాణి న్యూస్ రీడర్లను పరిచయం చేసే క్రమంలో  శ్రీ శ్రీ ప్రసక్తి వచ్చిన సందర్భంలో సుజాత గారు ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి ప్రస్తావన తీసుకువచ్చారు. 90 దశకం పూర్వార్ధంలో కన్నుమూసిన సుబ్రహ్మణ్యం గారు నయాగరా కవిత్రయంలో ఒకరు. మిగిలిన ఇద్దర్లో ఒకరు బెల్లంకొండ రామదాసు గారు కాగా మరొకరు వచన కవి కుందుర్తి ఆంజనేయులు గారు. ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి తమ్ముడు ఏల్చూరి విజయ రాఘవరావు గారు ప్రముఖ వేణుగాన విద్వాంసులు. కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ లోని ఫిలిమ్స్ డివిజన్ లో చాలాకాలం మ్యూజిక్ కంపోజర్ గా పనిచేశారు. సుబ్రహ్మణ్యం గారి కుమారుడు శ్రీధర్ న్యూఢిల్లీ లో ప్రొఫెసర్ గా వున్నారు. సుబ్రహ్మణ్యం గారు చాలాకాలం మద్రాసులో సోవియట్ భూమి తెలుగు విభాగంలో పనిచేశారు. బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు గారు, శెట్టి ఈశ్వరరావు గారు, తాపీ మోహనరావు గారు (తాపీ ధర్మారావు గారి తనయుడు) ఆయనకు సహచరులు. శ్రీ శ్రీ, ఝరుఖ్ శాస్త్రి గార్లకు సుబ్రహ్మణ్యం గారు సన్నిహిత మిత్రులు. వారి నడుమ సంభాషణలు కవితాత్మకంగా, కొండొకచో రసాత్మకంగా వుండేవని చెప్పుకునేవారు. ఒకసారి శ్రీ శ్రీ  సుబ్రహ్మణ్యం గారి గురించి చెబుతూ ప్రాసక్రీడల్లో అనుకుంటాను

                                ఏ సోడా! ఏ నీళ్ళూ
                                 వీసం కూడా కలపక
                                సౌనాయాసంగా విస్కీ సేవించే ఏసుకు ...  అని ఆశువుగా ఆలపించారు. ఇక్కడ  సౌనాయాసంగా అంటే సునాయాసంగా, ఏసు అంటే ఏల్చూరి సుబ్రహ్మణ్యం. అలా వుండేదన్న మాట మహాకవితో ఆయనగారికున్న సాన్నిహిత్యం.

సుబ్రహ్మణ్యంగారు మద్రాసులో వున్నప్పుడు రాళ్ళభండి వెంకటేశ్వరరావు గారు పాస్ పోర్ట్ పనిమీద అనుకుంటాను అక్కడికి వెళ్లారు. తదనంతర కాలంలో రచయిత, గ్రంధకర్త, విమర్శకుడు అయిన రాల్లభండి వెంకటేశ్వర రావు గారు (ఆర్వీయార్) మాస్కోలోని రాదుగ ప్రచురణాలయంలో చాలాకాలం పనిచేశారు. మాస్కోలో చదువు కోవడానికి వచ్చే పిల్లలందరికీ ఆయనే అక్కడ పెద్దదిక్కు. మా కుటుంబం మాస్కోలో వున్నప్పుడు కూడా మా ఇళ్ళ నడుమ రాకపోకలు ఎక్కువ. సాయంకాలక్షేపాల సందర్భంలో ఆయన ఎన్నెన్నో కబుర్లు చెబుతుండేవారు.
ఆర్వీయార్ మద్రాసు వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్యం గారిని  కలిసారు. పక్కన వున్న శెట్టి ఈశ్వర రావుగారు జగమెరిగిన బ్రాహ్మణుడు అంటూ సుబ్రహ్మణ్యం గారిని ఆర్వీయార్ గారికి పరిచయం చేయబోయారు. అదేమిటండీ అలా అంటారు చొక్కా లోపలనుంచి జంధ్యం అలా కనబడుతుంటేనూ అని ఆర్వీయార్ గారు తన సహజ శైలిలో అనేసారుట,  జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేలా? అన్న నానుడిని గుర్తు చేస్తూ.

సుబ్రహ్మణ్యం గారి వియ్యంకులు ధనికొండ హనుమంతరావు గారికి మద్రాసులో తెలుగు ముద్రణాలయం వుండేది. ఎవరయినా రచయిత పుస్తకం అచ్చుపని ఎప్పుడు పూర్తవుతుందని అడిగితే  ఆయనకు చర్రున మండుకొచ్చేదిట. ఏమిటయ్యా హడావిడి. బట్టలు ఇస్త్రీకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడే కట్టుకోవాలి కాని ఇలా వెంటపడితే ఎలా అనేవారని ఆర్వీయార్ గారు చెప్పారు.

అన్నట్టు, ఆర్వీయార్ గారు కూడా మాస్కో రేడియోలో ఆపద్ధర్మంగా వార్తలు చదివేవారు. రష్యన్-తెలుగు డిక్షనరీ కూడా తయారు చేసారు. ఆ రోజుల్లో పనులమీదా, ఇస్కస్ (ఇండో సోవియట్ కల్చరల్ సొసైటీ ) ఆహ్వానం మీదా సోవియట్ యూనియన్ సందర్శించే తెలుగువారికి ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా వుండేది.
(ఇంకా వుంది)


కామెంట్‌లు లేవు: