29, జులై 2019, సోమవారం

సమర్ధత, సచ్చీలతలకు చిరునామా జైపాల్ రెడ్డి


( శనివారం28-07-2019 తేదీ అర్ధరాత్రి హైదరాబాదులో కన్నుమూసిన ప్రముఖ రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శ్రీ ఎస్. జైపాల్ రెడ్డి గురించి రాసిన ఈ వ్యాసాన్ని సోమవారం సూర్య దినపత్రికలో ప్రచురించారు)
ప్రభుత్వాలను కార్పొరేట్లు శాసిస్తాయనే అపవాదు ఒకటి వుంది. కార్పొరేట్లను అదుపుచేయాలని చూసే కేంద్ర మంత్రులను అడ్డు తొలగించుకునే శక్తి సామర్ధ్యాలు వాటికి పుష్కలం అని చెప్పుకోవడం కద్దు. ఉత్తమ పార్ల మెంటేరియన్ గా పురస్కారం అందుకున్న శ్రీ ఎస్. జైపాల్ రెడ్డికి కూడా ఈ బెడద తప్పలేదు.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఒకసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. అంతవరకూ కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తూ వచ్చిన జైపాల్ రెడ్డి పెట్రోలియం మంత్రిగా వున్నారు.
కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయకముందే ఉత్తరాది మీడియా బాంబు లాంటి వార్త పేల్చింది, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అభీష్టం మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి సీనియర్ మంత్రి జైపాల్ రెడ్డిని తప్పిస్తున్నారని.
పెట్రోలియం ఉత్పత్తుల వ్యాపారంలో అగ్రగామిగా వున్న రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యానికి అనుకూలమయిన నిర్ణయాలు తీసుకోవడంలో జైపాల్ రెడ్డి విముఖత ప్రదర్శిస్తూ వుండడమే దానికి కారణమని కొన్ని పత్రికలు ముక్తాయింపు కూడా ఇచ్చాయి.
మీడియా వూహాగానాలను నిజం చేస్తూ జైపాల్ రెడ్డి శాఖ మారింది. చాలా చిన్న శాఖగా పరిగణించే శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖను జైపాల్ రెడ్డి వంటి సీనియర్ కు వొప్పగించిన తీరు చూసి నివ్వెర పోవడం అందరి వంతు అయింది. ఆయన మాత్రం నిబ్బరం కోల్పోలేదు. ‘పెట్రోలియం శాఖ ఇచ్చినప్పుడు కొంత అసంతృప్తికి గురయ్యాను కాని ఇప్పుడు శాస్త్ర సాంకేతిక శాఖ కేటాయించినప్పుడు ఎలాటి అసంతృప్తి లేద’ని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో పండిపోయిన మనిషి. యెలా స్పందించాలో ఆ మాత్రం తెలియని వ్యక్తి కాదు కదా. కానీ ఆ అవకాశాన్ని కేజ్రీవాల్ అందిపుచ్చుకున్నారు. ఆయన అప్పటికి ఇంకా పేరుపెట్టని ఓ కొత్త పార్టీ పెట్టి అన్ని పార్టీలకు చెందిన అగ్ర నాయకులపై అవినీతి ఆరోపణాస్త్రాలు గుప్పిస్తూ మీడియాలో వెలిగిపోతున్న రోజులవి. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలరు కదా!
ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థకు ప్రభుత్వం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని, ఇందులో భాగంగానే జైపాల్ రెడ్డిని పెట్రోలియం శాఖనుంచి తప్పించారని కేజ్రీ వాల్ ఆరోపణ.
ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహనకు విరుద్ధంగా రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తిని దాదాపు నిలిపివేసి ధర పెంచాలని అడ్డదారిలో వొత్తిడి తెస్తోందని అంటూ, సరకును దాచి పెట్టి కృత్రిమంగా రేట్లు పెంచాలని చూసే చిల్లర వ్యాపారుల నైజంతో రిలయన్స్ దిగ్గజం వ్యవహారాన్ని కేజ్రీ వాల్ పోల్చారు.
ముఖేష్ అంబానీ డిమాండ్లను అంగీకరిస్తే రిలయన్స్ సంస్థకు అదనంగా 43 వేల కోట్ల రూపాయల అదనపు లాభం రాగలదని., కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై 53 వేల కోట్లు అదనపు భారం పడగలదని జైపాల్ రెడ్డి తయారుచేసిన నోట్ లో పేర్కొన్నారని కేజ్రీ వాల్ వెల్లడించారు. కృష్ణా గోదావరి బేసిన్ లో గ్యాస్ అన్వేషణ విషయంలో ప్రభుత్వంపై అధిక భారం పడగల అనేక రాయితీలను గతంలో బీజేపీ సారధ్యంలోని ఎన్ డీ యే ప్రభుత్వం కూడా సమకూర్చి పెట్టిందని ఆయన గుర్తుచేశారు.
కేజ్రీవాల్ ఆరోపణలు ఎలావున్నా, వాటిపై ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం గమనార్హం.
సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి అయిదేళ్ళు దాటిపోయింది. విభజనకు పూర్వం చాలా కాలం, తరువాత కొన్నాళ్ళు విభజానంతర పరిణామాల పట్ల చాలామందిలో, ప్రత్యేకించి హైదరాబాదులో స్థిరపడిన సీమాంధ్రుల మనస్సుల్లో వున్న భయసందేహాలు చాలా వరకు సద్దుమణిగాయి. ఏవో రాజకీయ సంబంధమయిన చిటపటలు మినహా మొత్తం మీద చూస్తే అటూ, ఇటూ జనాలు సర్దుకుపోయారనే చెప్పాలి. ఇలాంటి నేపధ్యంలో విభజన కధ పేరుతొ అలనాటి విషయాలను తవ్వి తీస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏకంగా ఒక పుస్తకం రాశారు.
ఈ పుస్తకంలో ఎస్. జైపాల్ రెడ్డి ప్రస్తావన అనేక పర్యాయాలు రావడమే ఈ ప్రసక్తి తీసుకురావడానికి కారణం.
ఆ రోజుల్లో తాను డైరీలో రాసుకున్న విశేషాల ఆధారంగా ఉండవల్లి ఈ పుస్తకం రాశారు. మరి కొన్నిటితో తనకు సంబంధం లేని, అంటే తాను ప్రత్యక్షంగా లేని, చూడని సన్నివేశాలను, సంభాషణలను తన ఊహాశక్తితో రచించానని ఆయనే చెప్పుకున్నారు. ఆయా వ్యక్తుల స్వభావాలను అర్ధం చేసుకున్న వ్యక్తిగా, వారు కొన్ని సందర్భాలలో ఎలా, యేమని మాట్లాడుకుని వుంటారో ఊహించి రాయడం, అదీ జీవించి వున్న వ్యక్తుల విషయంలో ఇటువంటి ప్రయోగం చేయడం నిజంగా సాహసమే. ముఖ్యంగా విభజన బిల్లు ఓటింగు విషయంలో స్పీకర్ ఛాంబర్లో జరిగిన సమావేశం. స్పీకర్, జైపాల్ రెడ్డి నడుమ జరిగిన సంభాషణ ఉండవల్లి కల్పనాశక్తికి చక్కని ఉదాహరణలు. కొన్ని పేజీలకు విస్తరించిన ఈ సంభాషణల పర్వం ఈ పుస్తకానికి హైలైట్. ఉండవల్లి నిజంగానే పరకాయ ప్రవేశం చేసి రాశారా అన్నట్టుగా వుందా ఘట్టం. విషయ విస్తరణ భీతి వల్ల ఆ మొత్తం వ్యవహారాన్ని యథాతధంగా పేర్కొనడానికి వీలుండదు కనుక, మచ్చుకు కొన్ని మాత్రమే ప్రస్తావించాల్సి వస్తోంది. (ఒక స్థాయిలో రాజకీయాలు ఏ తీరుగా సాగుతాయో అనడానికి ఇవి తార్కాణం కూడా).
తాను లేని స్పీకర్ ఛాంబర్లో జై పాల్ రెడ్డి మాట్లాడిన విధానాన్ని ఉండవల్లి ఎలా ఊహించి రాశారో గమనించండి.
జైపాల్ రెడ్డి: (స్పీకర్ ను ఉద్దేశించి) : “కంగారు పడకమ్మా! ఫిఫ్టీ యియర్స్ ఇక్కడ. యాభయ్ ఏళ్ళ ఎక్స్ పీరియన్స్ తో చెబుతున్నా. నువ్వు అధ్యక్ష స్థానంలో కూర్చోగానే అకస్మాత్తుగా టీవీ ప్రసారాలు ఆగిపోతాయి. అవి బాగు చేసేలోగా బిల్లు పాసయిపోతుంది. కొత్త లోక సభ ఏర్పడి ఎంక్వయిరీ చేస్తారనే భయం అక్కరలేదు. యూపీఏ, కాకపొతే ఎన్డీయే. ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ బిల్లు విషయం ఇంతటితో ముగిసిపోతుంది”
“కట్టేకాడ్ ప్రాంతంలో ఒక తెగ వాళ్ళు ఆడపిల్ల పుట్టగానే నోట్లో, ముక్కులో బియ్యం గింజలు వేసి చంపేస్తారు. తల్లీ తండ్రీ ఏకమై పసిగుడ్డును చిదిమేస్తే ఎవరేం చేయగలరు. కంప్లైంట్ లేనప్పుడు విచారణ ఏమిటి? శిక్ష ఎక్కడ?
“ఇంత దారుణమైన పోలిక తెస్తున్నందుకు బాధపడకండి. ఈ పార్లమెంటు కూడా ఆ తెగ లాంటిదే.
“తండ్రి లాంటి అధికారపక్షం, తల్లి లాంటి ప్రతిపక్షం కలిసి బిడ్డను చంపేయాలని అనుకుంటే స్పీకర్ ది మంత్రసాని పాత్రే అమ్మా!
“అంచేత మీ విధి మీరు నిర్వర్తించండి. మొదట్లో అదోలా అనిపించినా తర్వాత మీకే అనిపిస్తుంది ఇంత సులువా అని.
“ఆఖరి మాట. మీరేం తప్పు చేయడం లేదు. రూల్ ప్రకారం తలలు లెక్క పెడుతున్నారు. ఎవరి సీట్లలో వాళ్ళు ఉంటేనే లెక్కపెడతామని మధ్య మధ్యలో చెబుతూ వుండండి.
“....బిల్లు పాసయి రాష్ట్రం విడిపోయిన తర్వాత దీన్ని గురించి మాట్లాడేవాళ్ళు కానీ, అసలు ఆలోచించేవాళ్ళు కానీ ఉండనే ఉండరు.
“పదేళ్ళు ఉమ్మడి రాజధాని సరిపోదేమో అనుకుంటున్నారు. పది నెలల్లో రాజధాని మార్చేస్తామనకపొతే నన్నడగండి.
“నేను చెప్పిన దాంట్లో ఏదైనా కటువుగా, రాజ్యాంగ విరుద్ధంగా, అధర్మంగా మీకనిపిస్తే అది మీ అవగాహనాలోపమే తప్ప, నా ఆలోచనా అపరికత్వత మాత్రం కాదు.
“నేను చెప్పదలచుకున్నది ఇంతే!”
ఇలా చెప్పాల్సింది నీళ్ళు నమలకుండా చెప్పేసి, జైపాల్ రెడ్డి స్పీకర్ చాంబర్ నుంచి బయటకు వచ్చిన తరువాత టీ. కాంగ్రెస్ ఎంపీలతో ఆయన చెప్పిన మాటలు కూడా ఉండవల్లి ఊహాగానమే. అది ఇలా సాగింది ఈ పుస్తకంలో:
“స్పీకర్ చాంబర్లో జరిగింది మరిచిపొండి. ఆ మాటలు నేను అనలేదు, మీరు వినలేదు. ధర్మ సంస్థాపన కోసం కొంచెం అధర్మంగా నడుచుకున్నా తప్పులేదు. నేనూ అదే చేసాను. తెలంగాణా ఏర్పడడం తక్షణ అవసరంగా భావించే ఇలా ప్రవర్తించాను. నౌ ఆర్ నెవ్వర్. ఇప్పుడు అయితే అయినట్టు. లేకపోతే తెలంగాణా ఎప్పటికీ రాదు. నా బాధ్యత నేను నిర్వర్తించాను. కేసీఆర్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయించడమే మీ బాధ్యత. ఆ పని చేయండి”
జైపాల్ రెడ్డి మాటల్ని ఊహించి రాసినట్టు ఉండవల్లి మరోమారు చెప్పుకొచ్చారు. జైపాల్ రెడ్డి ఉపన్యాస శైలి తో పరిచయం వుండడం చేత, ఆఖరి గంటలో స్పీకర్ చాంబర్లో ఆయన ఎలా మాట్లాడి ఉంటారో ఊహించి రాసానని పేర్కొన్నారు. కానీ నైతికంగా ఆలోచించినప్పుడు ఉండవల్లి అనుసరించిన ఈ విధానం వ్యక్తుల వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా వుందని చెప్పక తప్పదు. తన వాదనకు బలం చేకూర్చేందుకు ఇలా ఊహాగానాలతో గ్రంథరచన చేయడం సబబు అనిపించదు.
కాంగ్రెస్ హయాములో న్యూఢిల్లీలో కామన్ వెల్త్ గేమ్స్ జరిగినప్పటి మాట. ఇందులో కూడా జైపాల్ రెడ్డి సమర్ధతతకు అద్దం పట్టే ఓ ఉదంతం వుంది. ఈ క్రీడలు ప్రారంభం కాకమునుపే అనుమానపు మబ్బులు కమ్ముకున్నాయి.
ఈ క్రీడలు మొదలు కావడానికి రెండు రోజులు ముందువరకు కూడా అందరి మనసుల్లో నూటొక్క సందేహాలు. నిర్వాహకుల నిర్వాకంపై వేయిన్నొక్క అనుమానాలు.
అవినీతి పునాదులపై స్టేడియాల నిర్మాణం జరిగిందనీ, అతిధులకూ, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకూ సరయిన వసతులు కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారనీ,
భద్రతా ఏర్పాట్ల పట్ల శ్రద్ధ కరువయిందనీ,
ఉగ్రవాదులనుంచి పెను ముప్పు పొంచివుందనీ,
ఇలా ఎన్నో ఆరోపణలు.
ఎన్నెన్నో విమర్శలు.
ఈ నేపధ్యంలో –
దేశ ప్రతిష్ట మసకబారబోతోందనే దశలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. చక చకా చర్యలకు ఉపక్రమించింది. ఆరోపణలకు కేంద్ర బిందువయిన క్రీడల కమిటీ చైర్మన్ సురేష్ కల్మాడీ అనుదిన జోక్యంపై అంట కత్తెర వేసింది. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి నేతృత్వంలో ఉన్నతాధికార బృందాన్ని ఏర్పాటు చేసి ప్రధాన బాధ్యతలన్నీ అప్పగించింది. ప్రారంభ సంరంభానికి పట్టుమని పది రోజుల వ్యవధి కూడా లేని స్తితిలో, పరిస్తితులను చక్కదిద్దే భారాన్ని జై పాల్ రెడ్డి బృందం భుజస్కందాలపై మోపింది.
పనులు ఓ గాడిన పడుతున్నాయని అనుకుంటున్న తరుణంలో క్రీడోత్సవ నిర్వహణలో భాగంగా నిర్మిస్తున్న ఒక వంతెన హఠాత్తుగా కూలిపోవడంతో విమర్శల జడివాన మళ్ళీ మొదలయింది. అయితే, జైపాల్ రెడ్డి పూనికతో ప్రధాని కల్పించుకుని సైన్యాన్ని రంగం లోకి దింపి, వంతెన నిర్మాణాన్ని ఆరు రోజుల్లో పూర్తి చేయించడంతో ఆరోపణల కారు మేఘాలు తాత్కాలికంగా పక్కకు తప్పుకున్నాయి.


5 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఉండవిల్లి గారు వ్రాసినదాన్ని wisdom after the event అనవచ్చు.

జైపాల్ రెడ్డి గారు సంస్కారవంతమైన రాజకీయ నాయకుడు, పార్లమెంటేరియన్. వారి ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని కోరుకుందాం 🙏.

Jai Gottimukkala చెప్పారు...

భండారు వారూ, మీరీ వ్యాసం రాసింది జైపాల్ రెడ్డికి నివాళి కోసమా లేక ఉండవల్లి "సృజనాత్మకత" యొక్క విశ్లేషణ కోసమా తెలియడం లేదు. కేటాయించిన పదపరిమితిలో ముక్కాలు వంతు ఉండవల్లికే వాడేసుకుంటే మీకు essay writing నేర్పించిన మాస్టారు "భా"ద పడతారేమో.

Jai Gottimukkala చెప్పారు...

"కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయకముందే *ఉత్తరాది మీడియా* బాంబు లాంటి వార్త పేల్చింది, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అభీష్టం మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి సీనియర్ మంత్రి జైపాల్ రెడ్డిని తప్పిస్తున్నారని"

"ఉత్తరాది మీడియా" అంటే ఏమిటండీ?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ Jai Gottimukkala: News reporting అంటేనే writing in hurry అంటారు. ఒక్కోసారి deadline catch చేయడానికి ఈ 'భా'దలు కి తప్పవు

అజ్ఞాత చెప్పారు...

Jaipal Reddy played his part in dividing Andhra. I don't think we can see any politician in India working for uniting people.