8, జూన్ 2019, శనివారం

కొలువు తీరిన కొత్త ప్రభుత్వం – భండారు శ్రీనివాసరావు


(published in SURYA telugu daily in it's EDIT PAGE on 09-06-19, SUNDAY) 

పాతికమంది మంత్రులలో అయిదుగురు ఉప ముఖ్యమంత్రులు. పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీలకు చెందినవారికే ఒక్కొక్కటి చొప్పున ఈ అయిదు పదవులు. ఈ మంత్రివర్గాన్ని రెండున్నరేళ్ళ వరకూ మార్చరు. మార్పులు చేర్పులూ ఏమి చేయాల్సి వచ్చినా ఆ తరవాతనే.
ఇది సాహసమనాలా! దుందుడుకుతనం అనాలా!  అభిమానులు సాహసం అంటారు. వ్యతిరేకులు తెంపరితనం అంటారు. ఏ పేరుతొ పిలిచినా, ఎవరు ఏమనుకున్నా వై.ఎస్. జగన్ మోహన రెడ్డి తాను అనుకున్నట్టే చేశారు. చేయగలిగారు. ఆయనది ప్రాంతీయ పార్టీ కాబట్టీ, ప్రజలు అత్యధిక స్థానాలు కట్టబెట్టి ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారు కాబట్టి జగన్ మోహన రెడ్డి ఈ విధంగా దుస్సాహసాలు చేయగలుగుతున్నారనీ సన్నాయి నొక్కులు నొక్కేవాళ్ళు లేకపోలేదు. కానీ ఈ వాదన సరికాదు. గతంలో కూడా కొన్ని ప్రాంతీయ పార్టీల నాయకులకీ, మరికొన్ని జాతీయ పార్టీల నాయకులకీ ప్రజలు ఇదే మోస్తరుగా అధికార పగ్గాలు అప్పగించిన దాఖలాలు వున్నాయి. అయితే వారిలో ఏ ఒక్కరు కూడా జగన్ మాదిరిగా ఈ స్థాయిలో ప్రయోగాలు చేయలేదని నిక్కచ్చిగా చెప్పొచ్చు.   
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వై.ఎస్. జగం మోహన రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఈ కోవలోకే వస్తాయి. అవి సాహసోపేతమైనవా, దుందుడుకు చర్యలా అనేది కాలమే తేలుస్తుంది.
మొత్తం పాతిక మంది మంత్రులుగా ప్రమాణం స్వీకరించారు. వీరిలో అయిదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని ముఖ్యమంత్రి జగన్ నిన్ననే ప్రకటించారు. రాజ్యాంగం మూడో షెడ్యూల్ ప్రకారం ఉపముఖ్యమంత్రి అంటూ పేరుపెట్టి ఎవరిచేతా ప్రమాణం చేయించడానికి వీలుండదు. అంచేత, పలానా వారు ఉప ముఖ్యమంత్రి అంటూ విడిగా జీవోలు జారీ చేస్తారు. మంత్రుల ప్రమాణ స్వీకారకార్యక్రమం ముగిసిన గంటల వ్యవధిలోనే ఉప ముఖ్యమంత్రులకు,మిగిలిన మంత్రులకు శాఖలు కేటాయిస్తూ  ప్రకటన వెలువడింది. పుష్ప శ్రీ వాణి (ఎస్టీ), సుచరిత (ఎస్సీ), అంజాద్ భాషా (మైనార్టీ), పిల్లి సుభాష్ చంద్ర బోస్ (బీసీ), ఆళ్ళ నాని (కాపు) ఉప ముఖ్యమంత్రులుగా నియమితులయ్యారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఒక మహిళకు హోం శాఖను అప్పగించి ఒక చక్కటి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. మళ్ళీ ఆయన కుమారుడు వై.ఎస్. జగన్ సైతం అదే బాటలో హోంమంత్రిగా ఒక మహిళను నియమించారు.
శాసన సభలో మొత్తం 175 స్థానాలు వుంటే వాటిలో 151 జగన్ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. అదొక అద్భుత విజయం. ఇంతమంది అధికార పక్ష సభ్యుల నుంచి కేవలం పాతికమందిని మంత్రులుగా ఎంపిక చేసుకోవడం మాత్రం అంత ఆషామాషీ కాదు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించినప్పటి నుంచి కొత్త మంత్రి వర్గం ఏర్పాటు చేసేవరకు ఆయన తీసుకున్న వ్యవధానం ఒకరకంగా తక్కువే అయినా ఈ కొద్ది సమయంలోనే కాబోయే మంత్రులు గురించి అనేక ఊహాగానాలు అటు మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ వెల్లువెత్తాయి. ఆశావహుల సంఖ్య  ఎక్కువ. తీసుకోవాల్సిన సంఖ్య చాలా తక్కువ. జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా, కులాలు, మతాల వారీగా అన్ని వర్గాలను సంతృప్తి పరచడం అనేది కత్తిమీది సామే. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడు చెబుతూ వుండేవారు,  ముఖ్యమంత్రికి ఎదురయ్యే మొదటి పరీక్ష మంత్రివర్గం ఏర్పాటు చేయడమని.  ‘అలాగే మంత్రివర్గ విస్తరణ. ఈ రెండూ ఏ సీఎం కయినా అత్యంత క్లిష్టతరమైన సమస్యలు, ప్రత్యేకించి మా వంటి జాతీయ పార్టీ ముఖ్యమంత్రులకు’ అనేవారాయన.
అందుకే కాబోలు జగన్ మోహన రెడ్డి ఇందుకోసం ఒక మార్గాన్ని ఎంచుకున్నట్టుగా కనబడుతోంది. అదే ఆది నిష్టూరం.
వైసీపీ లెజిస్లేచర్ సమావేశాన్ని ఆయన దీనికి ఉపయోగించుకున్నట్టుగా వుంది. మంత్రివర్గం కూర్పులో తన మనసులో ఉన్న విషయాలను నిజాయితీగా వారితో పంచుకున్నారు. పరిమితులు గురించి వారికి నచ్చచెప్పినట్టుగా కనబడుతోంది. ఏ విషయాన్ని అయినా దాపరికం లేకుండా సంబంధించిన వారితో పంచుకోవడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.
పార్టీ ఏర్పడినప్పటి నుంచి, పార్టీ ఎన్నో ఇబ్బందులలో ఉన్నప్పటి రోజుల నుంచి అంటిపెట్టుకుని ఉన్న అనేక ప్రముఖమైన పేర్లు మంత్రుల జాబితాలో లేకుండా పోయాయి. పైగా రెండున్నరేళ్ళ వరకు వడ్డన పూర్తి చేసారు. కొసరు  వడ్డనపైనా, మారు వడ్డనపైనా ఆశలు పెట్టుకోకుండా ఆ విషయంలో ఒక విస్పష్టమైన ప్రకటన చేశారు. వర్తమాన రాజకీయాల్లో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి సాహసమైనా వుండాలి, ఎవరినీ లెక్కచేయని  గుండె ధైర్యం అయినా వుండాలి.
అగ్ర కులాల వారిని  తగు మోతాదులోనే మంత్రులుగా తీసుకుని, బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేయడం, అదీ ఈస్థాయిలో జరగడం నిజంగా విడ్డూరమే. ఈ మధ్యకాలంలో కనీవినీ ఎరుగని విషయమే. బహుశా ప్రజలకు చేసిన వాగ్దానాలను నిర్దిష్ట కాలంలో పూర్తిచేసి చూపాలంటే నమ్మకంగా కష్టించి పనిచేసే జట్టు అవసరం ఎంతయినా వుంటుంది. ఫలితాలను రాబట్టే ఈ జట్టును ఎన్నికల ముందు వరకు కొనసాగించి, హామీల అమలు పట్ల ప్రజల్లో ప్రభుత్వ పనితీరు పట్ల  నమ్మకాన్ని పెంచడం, ఆ తర్వాత ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని అందుకు సంసిద్ధం చేసే విధంగా ఫలితాలను రాబట్టే మరో జట్టును అప్పుడు ఎంపిక చేసుకోవడం అనే ద్విముఖ వ్యూహంగా కనబడుతోంది. రాజకీయ నాయకుడిలో అటు పాలననూ, ఇటు పార్టీ నిర్వహణనూ సమంగా సంభాళించుచుకునే సామర్ధ్యం వుండాలి. ఈ వ్యూహాలన్నీ ఆ దిశగా వేస్తున్న అడుగులు అని పరిశీలకులు భావిస్తున్నారు.         
ఒక విషయం అందరూ గమనించి వుంటారు. తమ పార్టీ గెలుపు తధ్యమని నిర్ధారించుకున్న మరుక్షణం నుంచీ జగన్ మోహన రెడ్డి తాను ప్రయాణించాల్సిన  మార్గాన్ని గురించి ఒక నిర్దుష్టమైన అవగాహనకు వచ్చి వుండాలి. ఈ అయిదేళ్ళ కాలంలో ప్రతి నిమిషం అమూల్యమైనదిగా భావించివుండాలి. అందుకే కాబోలు చేసే ప్రకటనలలో ఆ ఉరవడి. వేసే అడుగుల్లో ఆ వడివడి.
కాని పక్షంలో తనంతట తానుగా ప్రత్యేక హోదా గురించీ,  మద్య నిషేధం గురించీ ప్రస్తావించాల్సిన అవసరం ఆయనకు లేదు. ముందెప్పుడో ప్రతిపక్షాలు గుర్తుచేస్తే అప్పుడు చూసుకోవచ్చని మిన్న కుండాల్సిన అంశాలు ఇవి. కానీ జగన్ తీరే వేరు. మొదటి రోజునుంచే ఆయనే వీటి ప్రస్తావన తెస్తున్నారు. ప్రత్యేక హోదాపై  కేంద్రం కుండబద్దలు కొట్టినట్టు ప్రకటించినా, రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు ఇది కుదిరేపని కాదని పనికట్టుకుని పదేపదే చెబుతున్నా జగన్ మోహన రెడ్డి ఈ విషయంలో తన పంధా వీడినట్టు కానరావడంలేదు. పై పెచ్చు ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసివచ్చిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీకి సంఖ్యాబలం తగ్గివున్నట్టయితే బాగుండేది, మనం బెట్టు చేసి ఒప్పించడానికి వీలుండేది అనే పద్దతిలో మరో కుండ బద్దలు కొట్టారు. అదే సమయంలో ‘జగన్ మోహన రెడ్డితో తన సమావేశం అద్భుతంగా జరిగిందని మరో పక్క ట్వీట్ చేస్తున్న సమయంలోనే జగన్ ఈ విధంగా మాట్లాడడం కాకతాళీయం కావచ్చు కానీ, రాజకీయంగా చేయాల్సిన ప్రకటన కాదని జగన్ ని విమర్శించిన వాళ్ళూ వున్నారు. అయితే జగన్ లో జనం మెచ్చిన ప్రత్యేకత ఇదే అనే విషయాన్ని వాళ్ళు మరచిపోతున్నారు.
అలాగే మద్య నిషేధం. ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన మాటను వేదంగా భావించే తత్వం కనుక ఆయనే ఈ అంశాన్ని తన ప్రాధాన్యతల జాబితాలో చేర్చుకున్నారు. ఖజానా బోసిపోతుందేమో అనేదానితో నిమిత్తం లేకుండా, మద్యం అమ్మకాల ద్వారా  వచ్చిపడే అపార నిధులు లేకుండా ఇచ్చిన హామీల అమలు ఎలా సాధ్యమవుతుందని లిప్తపాటు కూడా ఆలోచించకుండా జగన్ మోహన రెడ్డి మద్యంపై యుద్ధాన్ని ఏకపక్షంగా ప్రకటించారు. అయిదేళ్ళ కాలంలో మద్యాన్ని అయిదు నక్షత్రాల హోటళ్లకు మాత్రమె పరిమితం చేస్తూ దశలవారీగా నిషేధం అమలుచేస్తామని స్పష్టం చేసారు. అందులో భాగంగా ముందు బెల్ట్ షాపులపై బెల్ట్ తీసారు.
రివర్స్ టెండరింగ్. మొదట వినగానే జగన్ కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరిగానే ఆంగ్ల పడికట్టు పదాల గారడీ చేస్తున్నారని అనిపించే అవకాశం వుంది. కానీ పరిపాలనలో ముఖ్యంగా ఆర్ధిక కుంభకోణాలకు కేంద్రాలుగా మారుతున్న భారీ కాంట్రాక్టులలో పారదర్శికతను తీసుకురావడానికి జగన్ మోహన రెడ్డి ఈ రివర్స్ టెండరింగ్ విధానానికి రూపకల్పన చేసారు. నిజానికి ఇదికొత్త విషయం కాదు. పాదయాత్ర సందర్భంలో అనేక బహిరంగ సభల్లో ప్రజలకు ఈ విధానాన్ని గురించి వివరిస్తూ వచ్చారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జగన్ మోహన రెడ్డి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని మర్యాద పూర్వకంగా కలుసుకుని ఈ విధానాన్ని కార్యరూపంలోకి తేవడం కోసం ఒక న్యాయమూర్తిని ప్రతిపాదించాలని విజ్ఞప్తి చేసారు.     
ఇవన్నీ గమనించేవారికి జగన్ మోహన రెడ్డి పనితీరు పట్ల సానుకూల వైఖరి పెరిగే వీలుంది. మొట్టమొదట ఏర్పరచుకున్న అభిప్రాయం ఒక పట్టాన చెరిగిపోదని అర్ధం వచ్చే ఒక ఆంగ్ల సామెత వుంది.
‘మాట తప్పను, మడమ తిప్పను’ అనే నైజాన్ని తన తండ్రి రాజశేఖర రెడ్డి నుంచి పుణికిపుచ్చుకున్నానని వై.ఎస్. జగన్ తరచూ పేర్కొంటూ వుంటారు.  ప్రజలకు ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చే పవిత్రమైన బాధ్యత ఇప్పుడ ఆయన భుజస్కంధాలపై వుంది.
యుద్ధ వీరుడికి సాహసం అవసరమే. కానీ ప్రజాస్వామ్యంలో పోరాడే వీరుడికి సాహసంతో పాటు ఒకింత సంయమనం కూడా ఆవశ్యకం.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఐదుగురు ఉపముఖ్యమంత్రులు ఎందుకు. ఆళ్ల, అంబటి రాంబాబు, రోజాకు మంత్రి పదవి ఇవ్వకుండా కొత్తవారికి ఇవ్వడం సరికాదు. జగన్ మంత్రి వర్గ కూర్పు బాగాలేదు. దుందుడుకు అనే సినిమా తీయవచ్చు. అతి చేస్తే బొక్కబోర్ల పడటం జరుగుతుంది.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

"కొలువు తీరడం", "పట్టాభిషేకం" (ప్రమాణ స్వీకారం అనడానికి బదులుగానన్నమాట) ..... ఇటువంటి రాచరికపు పదజాలాన్ని ప్రజాస్వామ్య కాలంలో ఎందుకు వాడుతున్నారండీ మీడియా వారు? తామేదో "డిఫరెంట్" గా, "వెరైటీ" గా, గొప్పగా రాశాం అనుకుంటున్నారేమో ఈ రాతలు రాసే మీడియా ఎడిటర్లు (both print and visual)? Unfortunate.