10, సెప్టెంబర్ 2018, సోమవారం

అస్పష్ట స్పష్ట చిత్రం తెలంగాణా రాజకీయం


  
ఇప్పుడు అన్ని పార్టీలదీ కేసీఆర్ బాటే.
‘అవసరమైతే లక్ష్య సాధన కోసం గొంగళి పురుగును అయినా ముద్దాడతాను’
ఈమాట ఆయన అన్నది తెలంగాణా సాధించడం కోసం. కానీ ఇప్పుడు ఈ పద ప్రయోగం  చేస్తున్న వారి ధ్యేయం వేరే!
పేకాట ఆడేవారి విషయంలో ఒక జోకు ప్రచారంలో వుంది. ‘మనకు పడ్డ ఆట ఎలా వుందో మనం ఎప్పుడయినా చూసుకోవచ్చు, ముందు పక్కవాడికి ఎలాటి ఆట పడిందో చూద్దాం’
ప్రస్తుతం రాజకీయ క్రీడల్లో మునిగితేలుతున్న పార్టీల పరిస్తితి కూడా చూడబోతే అలాగే వుంది.
‘మన వ్యూహాలు మనకెలాగో వుంటాయి, ముందు ప్రత్యర్ధి పార్టీల ఆలోచనలు, కదలికలపై ఓ కన్నేసి వుంచడం మంచిదని అనుకుంటున్నట్టుగా వుంది.
ముందస్తు ఎన్నికలు తప్పవని తేలిపోయిన తెలంగాణలో రాజకీయ పరిస్తితులలో  కొంత వరకు స్పష్టత వచ్చింది.
తెలంగాణలో బీజేపీ బలపడడం కానీ, కేంద్రంలో మోడీ మళ్ళీ అధికారంలోకి రావడం కానీ  కాంగ్రెస్  పార్టీకి ఇష్టం వుండదు.
‘తెలంగాణలో కాని, ఆంధ్రప్రదేశ్ లో కానీ బీజేపీ బలపడకూడదు,   కేంద్రంలో ఎట్టి పరిస్తితుల్లోను మోడీ ప్రభుత్వం తిరిగి రాకూడద’ని టీడీపీ (అధిష్టానం) భావన.
‘కేంద్రంలో ఎవరు గద్దె ఎక్కుతారో అనేది తరువాతి మాట. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడకూడదు, అలాగే తమ పార్టీ మళ్ళీ ముందుగానే అధికారంలోకి వచ్చి తీరాలి’ ఇది టీఆర్ఎస్ అధినేత మనసులోని మాట.
‘తెలంగాణాలో కాంగ్రెస్, టీడీపీలు బలపడకూడదు’ అనేది బీజేపీ (అధిష్టానం) ఉద్దేశ్యం.     
ఇప్పటికి తెలంగాణలో రాజకీయ పరిస్తితి ఇది.
‘రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారానికి వచ్చే పరిస్తితి ఎలాగూ  లేదు. కేంద్రంలో బీజేపీని  రాకుండా చేయడానికి బద్ధ శత్రువు కాంగ్రెస్ తో చేయి కలపడానికి కూడా సిద్ధం’ అంటున్న టీడీపీ, తెలంగాణా విషయానికి వచ్చేసరికి డోలాయమానంలో పడుతోంది. స్థానిక నాయకత్వం కోరుకుంటున్నట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలుపుకుంటే టీఆర్ ఎస్ దూకుడును నిలవరించడం సాధ్యం కావచ్చు. కానీ తమ పార్టీకి యేవో కొన్ని సీట్లు తప్పిస్తే అధికారానికి వచ్చే చాన్స్ లేదు. వస్తే గిస్తే ఆ అవకాశం కొంత కాంగ్రెస్ పార్టీకు ఉండవచ్చు. అలాంటప్పుడు ఈ ‘తనకుమాలిన ధర్మం’ ఎందుకని పార్టీలోనూ, పార్టీ శ్రేయోభిలాషుల్లోను తలెత్తుతున్న ధర్మసందేహం. కేసీఆర్ తో లేని పోని  కీచులాట మినహా ఇందువల్ల సాధించేది పెద్దగా ఉండదని తెలంగాణాలో స్థిరపడిన ఆంధ్రప్రాంతపు శ్రీమంతుల (కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు) మన్ కీ బాత్.
బహుశా అందుకే కేసీఆర్ నరనరాన ద్వేషిస్తున్న కాంగ్రెస్ తో బాహాటంగా జట్టు కట్టడానికి అధినేత తటపటాయింపు అని కొందరి భాష్యం.
తెలంగాణలోనే పుట్టి, ఎన్టీఆర్ హయాములో బడుగు, బలహీన వర్గాల ఆదరణను చూరగొన్న తెలుగు దేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాలని, అందుకు అసెంబ్లీ ఎన్నికలను అవకాశంగా వాడుకోవాలని, కేడర్ బలమున్న తమ పార్టీ, లీడర్ బలమున్న కాంగ్రెస్ వంటి మరో పార్టీతో జత కడితే బాగుంటుందని  ఆ పార్టీ స్థానిక నేతలు భావించడంలో తప్పేమీలేదు. కానీ అసలు చిక్కల్లా, ఏదైనా అనుకోనిది జరిగితేనో,  లేదా అనుకున్నట్టుగా జరగని పక్షంలోనో  టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల నడుమ అది మరికొన్ని కొత్త చిక్కులకు కారణం అయ్యే  ప్రమాదం వుంది. అందుకే కాబోలు, ఏ విషయాన్ని అయినా సాకల్యంగా, ముందు వెనుకలు, సాధ్యాసాధ్యాలు అన్నీ పూర్తిగా  పరిశీలించుకుని కానీ అడుగు వేయడం అలవాటులేని చంద్రబాబునాయుడు, ఈ పొత్తుల అంశాన్ని ప్రస్తుతానికి స్థానిక నాయకులకు వదిలేసి, ఎన్నికల  ప్రచారానికి కూడా తాను  రాబోవడం లేదన్న సంకేతాలు ఇవ్వడం. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకు కనీసం 50:50 అవకాశాలు వున్నాయని నిర్ధారణకు రానిదే చంద్రబాబు ఈ విషయంలో స్పష్టంగా ఏ నిర్ణయమూ ప్రకటించక పోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం టీడీపీతో పొత్తుపెట్టుకోవడానికే తహతహలాడుతున్నట్టుంది. ఒక్క టీఆర్ఎస్ తోనే కాదు, అటు బీజేపీని, ఇటు కేసీఆర్ ని వ్యతిరేకించే ఇతర రాజకీయ పార్టీలను కూడా కలుపుకుని మహా కూటమి ఏర్పాటు చేయాలనే యోచనతో ఆ పార్టీ ముందుకు సాగుతోంది.
పొతే కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు ఏ రూపంలో అంటే బహిరంగంగానా లేక లోపాయకారీగానా అనేది టీడీపీ అధినాయకుడి ఆలోచనకు అనుగుణంగా వుంటుంది.           

27 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...

ఈ సమయంలో తెలంగాణా బిడ్డగా జూనియర్ ఎన్ టీ ఆర్ తెలుగుదేశానికి వారసుడిగా రాజకీయ ప్రవేశం చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ! తెలంగాణాలో తెలుగుదేశం నిలబడలేని పరిస్థితులలో ఎన్ టీ ఆర్ స్థాపించిన తెలుగుదేశాన్ని వారి వారసులకే అప్పగిస్తే లెక్క సరి అవుతుంది కదా ?

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

జూనియర్ ఎన్.టీ.ఆర్ తెలంగాణాబిడ్డ ఎలా అవుతాడు నీహారిక గారూ 🤔?

సూర్య చెప్పారు...

వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీపగ్గాలు వారసులకి అప్పగించాలని వారికి అనిపించొచ్చేమో గాని మనకి కూడా అలా అనిపించడంసబబు కాదు నీహారిక గారూ.
నా దృష్టిలో tdp కాంగ్రెస్ తో ఎక్కడ పొత్తు పెట్టుకున్నా అది ఆత్మహత్యా సదృశమే. చంద్రబాబు రెండు కళ్లూ ఆంధ్రపై పెట్టడం మంచిది. లేదంటే రెండొకన్నూ పోవటం తథ్యం.

నీహారిక చెప్పారు...

తెలంగాణాలో పుట్టినవారందరూ తెలంగాణా వారే అన్నది మావారి వాదన ! ఈ విషయంలో మా ఇద్దరి వాదన ఇంకా తేలలేదు ....మీరు మళ్ళీ మొదలెడితే రాముడు పుట్టింది కౌసల్యాపురంలో అయితే అయోధ్య వాసులు ఎలా అవుతారు అన్న అక్బరుద్దీన్ వాదనకు సమాధానం చెప్పాలి.

నీహారిక చెప్పారు...

నాకు వారసత్వం అంటే మక్కువ కాబట్టే కాంగ్రెస్ ని సపోర్ట్ చేస్తున్నాను. ఎవరిష్టం వారిది అనుకోండి.

రెండు కళ్ళ సిద్ధాంతం వదులుకుంటేనే గౌరవం మరియు ఎక్కడివారు అక్కడే ఉండాలి.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...


“తెలంగాణాలో పుట్టినవారందరూ తెలంగాణా వారే” అన్నది మీవారి వాదనేమో కానీ గౌ॥ కెసియార్ గారు 2014 లో - తండ్రి, తాత కూడా తెలంగాణాలోనే పుట్టుండాలి .. తెలంగాణాబిడ్డ అనిపించుకోవాలంటే - అని కదా అన్నారు నీహారిక గారూ? 🙁

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

“వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టిన” పార్టీలు కూడా కాలక్రమేణా అదే పంథాలోకి వచ్చాయిగా. ఏ రాయైతేనేం లెండి?

Jai Gottimukkala చెప్పారు...

"తెలంగాణలో కాని, ఆంధ్రప్రదేశ్ లో కానీ బీజేపీ బలపడకూడదు, కేంద్రంలో ఎట్టి పరిస్తితుల్లోను మోడీ ప్రభుత్వం తిరిగి రాకూడద"

చా నిజమా ఇదంతా నమ్మడానికి జనం చెవిలో పువ్వు పెట్టుకున్నారా?

గత ఎన్నికలలో బీజేపీ మద్దతు లేకుంటే టీడీపీ గెలిచేది కాదు. నాలుగేళ్లు గడిచినా భ్రమరావతిలో ఒక్క భవనం కూడా ఎందుకు లేదని, ఇంటికో ఉద్యగం ఎక్కడని జగన్ అడుగుతుంటే మా తప్పేమి లేదు బీజేపీ మోసం చేసిందని దాటవేయాలని చంద్రబాబు ప్రయత్నం.

స్వామిభక్తి పైత్యం ముదిరిన పచ్చ మీడియా తానా అంటే తందానా అంటూ కమ్మటి రాగాలు పాడుతుంది. పైగా నాన్నగారూ వాజపేయి గారిని ఏమీ అనకండని ఎంప్టీ డ్రామారావుకు హరికృష్ణ సిఫార్సు అంటూ చాకలి ఫిట్టింగులు!

Jai Gottimukkala చెప్పారు...

@విన్నకోట నరసింహా రావు:

టీడీపీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని ఎవరు ఎప్పుడు అన్నారు? దగ్గుబాటి నుండి రామమోహన్ నాయుడు వరకు ఎవరినయినా అడిగి చూడండి తెలిసిపోతుంది.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

నేనెక్కడ అన్నాను జై గారూ? వారసత్వాలు, వారసుల తర్ఫీదు కళ్ళెదుట కనిపిస్తున్నాయిగా? పైన సూర్య గారు అన్నదానికి స్పందిస్తూ అన్ని పార్టీలూ అలాగే ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో అన్నాను.

వారసులకు కట్టబెట్టే ప్రయత్నాలతో బాటు వారి వంశం / కుటుంబం లోని పేర్లే ఏదోరకంగా జనబాహుళ్యం నోళ్ళల్లో కలకాలం నలిగేలా చేసే ప్రయత్నాలు కూడా సాగుతున్నట్లున్నాయి. ఉదాహరణకు ... హాస్పిటల్లో కాన్పు అయిన తరువాత ఆ స్త్రీలకు ప్రభుత్వం వారు అందజేస్తున్న కిట్ల పేరేమిటో తెలుసా? బసవతారకం మదర్ కిట్😳. మరీ obvious గా లేదూ? (ఆ మహాఇల్లాలు ఏనాడూ పబ్లిక్ లైఫ్ లోనూ రాజకీయాల్లోనూ కనబడేవారుకాదు. ఒద్దికగా భర్త చాటున ఉండేవారు). అంతగా కావాలంటే ఆ ప్రాంతంలోనే స్త్రీలడాక్టర్ గానూ స్వాతంత్ర్య సమరయోధురాలిగానూ పేరు గాంచిన మొట్టమొదటి తెలుగు మహిళా డాక్టర్ కూడా అయిన కొమర్రాజు అచ్చమాంబ గారి పేరు పెట్టుండచ్చు, తగినట్లుండేది. అబ్బే అలా ఎలా కుదురుతుంది, మా వాళ్ళ పేర్లే ఉండాలి అన్నది పోలసీలాగా కనబడుతోంది.

Jai Gottimukkala చెప్పారు...

విన్నకోట వారూ, నాకు మీ ఉద్దేశ్యం బాగానే అర్ధం అయింది. నా వ్యాఖ్యలోనే వర్డింగ్ సరిగ్గా పడలేదు. మన్నించండి.

అజ్ఞాత చెప్పారు...

పనికిమాలిన సలహా.హాయిగా సినిమాలు చేసుకుంటున్న మనిషిని ఎందుకు లాగుతారు ఈ రొంపిలోకి.

అజ్ఞాత చెప్పారు...

పరమ దరిద్రగొట్టు పోలిక. Disgusting. You should feel ashamed for quoting a dangerous, vicious person who has scant regard for other religions. People like you find it fashionable to speak such nonsense. Sorry Niharika Garu. You need serious introspection.

అజ్ఞాత చెప్పారు...

ధూ నీయవ్వ. బసవతారకం గారి పెరు అవసరమా. చౌ. చెత్తకుండీ, నం.నాప్ కిన్ అని కూడా పెట్టుకోండి.

nmrao bandi చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
nmrao bandi చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
nmrao bandi చెప్పారు...

@ విన్నకోట నరసింహా రావు - 10 సెప్టెంబర్, 2018 2:52 PM కి ...


కొంతమంది మనుషులు
నాయకులకు డప్పులు
కాలికింది చెప్పులు
బుర్రలు మోచిప్పలు

పుట్టుకతో మూర్ఖులు
తల కాసే గొడుగులు
తాతలకు తండ్రులకీ
కొడు క్కొడు క్కొడుకులకీ

తరతరాల చాకిరి కై
వంగు వెర్రి పప్పలు

కులం గజ్జి మతం గజ్జి
మనసంతా రుద్ది రుద్ది
లేక బుద్ది జనుల కద్దు
కీటక సన్యాసులు


(నిన్నటి లీడరు ధోకా
నేడు చూడజాలరు
కనులున్న జాత్యాందులు
కాకినైనా పోలరు) ...
(శ్రీ శ్రీ గారి లైన్లు)


ఎక్కడండి యువకులు
రాబోవు యుగం దూతలు
పావన జీవన నవ
భరత జాతి నేతలు
(రాజకీయ నేతలు)
బానిస భావాలు త్రెంచి
అందుకొనగ జోతలు
చెప్పినట్టు నీతులు
నిలిపే పరమాత్ములు

ఉన్నాం మనమే కాలం
ఓరన్నో ఇది కలికాలం

శ్రీ శ్రీ గారికి మనస్పూర్తి క్షమాపణలతో ...
_____/\_____ ...

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అంతే అంతే బండివారూ, ఈనాటి జనాలు నిజంగా వెఱ్ఱిపప్పలే. ఏమాత్రం ఇంగితం లేకుండా మూర్ఖుల్లాగా తయారయ్యారు. నిన్నటి డెక్కన్ క్రానికల్ వార్తాపత్రికలో .. ఒక ఎం.పి. ని కూర్చేబెట్టి పాలాభిషేకం చేస్తున్న ఫొటో వచ్చింది. వ్యక్తిపూజ పరాకాష్ఠకు జేరుకుంటోంది. యువకులు ఎక్కడంటారా? ఆ సేనాని, ఈ అన్న అంటూ గొఱ్ఱెల్లాగా తిరుగుతున్నారు.

శ్రీశ్రీ గారిని paraphrase చేస్తూ మీరు వ్రాసిన పై కవిత బాగా కుదిరింది.

సూర్య చెప్పారు...

వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని ఏర్పాటు చేశారని బుద్దా మురళి గారు ఓసారి బ్లాగులో రాసారు. అయితే గియితే ఆయన కల్పనే అయ్యుండాలి.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

// “ ..... బసవతారకం గారి పెరు అవసరమా.” // (అజ్ఞాత 10 సెప్టెంబర్, 2018 10:16 PM)

—————
వాళ్ళకు అవసరమే అని వాళ్ళు నమ్ముతున్నట్లుంది, అజ్ఞాత గారూ. ప్రతిదానికీ ఇప్పటివరకు తన మామగారి పేరు, ఈ మధ్య తన పేరు పెట్టించడం జరిగింది. ఇప్పుడు తన అత్తగారి పేరు మాత్రం ఎందుకు పెట్టకూడదు అనిపించినట్లుంది. తరువాత తరువాత మెల్లిగా తన మనమడి పేరు, తన భార్య పేరు, బావమరిది పేరు పెట్టడం మొదలెట్టినా ఆశ్చర్యపోనక్కరలేదు.
చరిత్ర సృష్టించేదీ మేమే, చరిత్ర తిరగరాసేదీ మేమే అని వాళ్ళ కుటుంబం గురించి ఇన్-డైరక్ట్ గా సూచిస్తూ సినిమాల్లో డైలాగులు కూడా వ్రాయించుకున్నారుగా?

సూర్య చెప్పారు...

అభిషేకం చేసిన వాళ్ళు ఆ నేచురల్ సాల్ట్ కలిసిన పాలని తలా గ్లాసుడూ తాగితే దరిద్రం వదిలిపోయేది!

సూర్య చెప్పారు...

రాజీవ్ గాంధీ పేరుమీదున్న కట్టడాలలో ఒక90శాతానికి పేర్లు మారిస్తే బావుంటుంది.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

హ్హ హ్హ హ్హ, సూర్య గారూ 😀😀.
కానీ అసలు ఆ పెద్ధమనిషయిపా అటువంటి ఆలోచన మానుకోమని ఆ అభిమానుల్ని గట్టిగా మందలించాడా? ఆయన అనేక విద్యాసంస్ధల, హాస్పిటళ్ళ అధినేత కూడా. అటువంటివారు కూడా ఇటువంటి కార్యక్రమాల్ని వారించకపోతే ఎలా?

ఎంపీ గారికి పాలాభిషేకం

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

వ్యక్తుల పేర్లు పెట్టిన అన్ని కట్టడాలు, రోడ్లు, ప్రభుత్వ పధకాలు .. 90 శాతమేం .. వంద శాతానికీ ఆ వ్యక్తుల పేర్లు తీసేస్తే బాగానే ఉంటుంది, ఈ తమాషాకి ఫుల్-స్టాప్ పెట్టినట్లవుతుంది, సూర్య గారూ. అసలు వ్యక్తుల పేర్లే పెట్టకూడదని రూల్ పెడితే మరింత “దరిద్రం వదిలి”పోతుంది. కానీ పిల్లి మెడలో గంట కట్టేదెవరు?

శ్యామలీయం చెప్పారు...

వ్యక్తుల పేర్లు వంతెనలకు పథకాలకు పెట్టటం అన్న స్థాయిని దాటి పరిస్థితి జిల్లాలకు పెట్టటం వరకూ ఎప్పుడో వచ్చింది.
ఇంక రాష్ట్రాలకు కూడా ఆ ఆనవాయితీని విస్తరించటం మున్ముందు కాలంలో జరిగినా ఆశ్చర్యం లేదు.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కరలేదు శ్యామలరావు గారూ. “ఆరోజెంతో దూరం లేదు రంగయ్యో” అనుకోవచ్చు కూడా 🙁. మన నాయకులు ఎంతకయినా తగుదురు.

సూర్య చెప్పారు...

వ్యక్తుల పేర్లు కట్టడాలకి పెట్టుకోవటం అన్ని దేశాల్లోనూ ఉంది కదండీ. అందుకే కొన్నింటికి వ్యక్తుల పేర్లు పెట్టుకోవటం తప్పు పట్టను నేను.అయితే తమ కుటుంబం తప్ప చరిత్రలో ఇంకేం లేదన్నట్లు అన్నింటికి అధికార పార్టీ కుటుంబం పేర్లే పెట్టెయ్యటం చారిత్రక దరిద్రం. హైదరాబాద్ ,వైజాగ్ విమానాశ్రయాలు రెండింటికి రాజీవ్ గాంధీ పేరెందుకు. ఇక ప్రతి పథకానికి దిష్టి చుక్కల్లా కుటుంబ సభ్యుల పేర్లేందుకు అన్నదే ప్రశ్న. ఇక జిల్లాలు వీధులకి చిన్నపేర్లు ఉత్తమం. లేకపోతే వీసా కోసం పది అడ్రస్ లు రాసిన ప్రతిసారి బూతులు తిట్టుకోవాల్సి వస్తుంది.