9, సెప్టెంబర్ 2018, ఆదివారం

త్వరిత గతిన మారుతున్న తెలంగాణా రాజకీయ చిత్రం

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 09-09-18)
‘ఇలా జరగొచ్చని అనుకున్నవాళ్ళు వున్నారు కానీ ఇలానే జరుగుతుంద’ని
అన్నవాళ్లు తక్కువ.
అయితే కేసీఆర్ ఎలా జరగాలని అనుకున్నారో అక్షరాలా అలాగే జరిగింది.
తెలంగాణా ప్రభుత్వపు ఆఖరి మంత్రివర్గ సమావేశం నిమిషాల్లో ముగిసింది. శాసన
సభను రద్దు చేయాలనే ఏకవాక్య తీర్మానాన్ని క్షణాల్లో ఆమోదించింది. ఆ
తీర్మానాన్ని తీసుకుని ముఖ్యమంత్రి నేరుగా రాజ్ భవన్ కు వెళ్ళారు.
గవర్నర్ ని కలిసారు. తీర్మానం ప్రతిని అందచేశారు.
మంత్రివర్గ రాజీనామాను అక్కడికక్కడే గవర్నర్ నరసింహన్ ఆమోదించారు.
సాయంత్రం అయిదు గంటలకు టీబీజేపీ ప్రతినిధివర్గం తనను కలవడానికి వస్తున్న
దృష్ట్యా గవర్నర్ తన నిర్ణయాన్ని వెంటనే ప్రకటించక పోవచ్చని టీవీ
చర్చల్లో కొందరు మాట్లాడుతున్నప్పుడే వారిని నిబిడాశ్చర్యానికి
గురిచేస్తూ గవర్నర్ నరసింహన్ మంత్రివర్గ నిర్ణయాన్ని ఎలాంటి జాప్యం
చేయకుండా తక్షణం
ఆమోదించడం మాత్రమే కాకుండా, కే. చంద్రశేఖర రావును ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా
కొనసాగమని కోరినట్టు టీవీ తెరలపై స్క్రోలింగులు పరుగులు తీశాయి.
అక్కడినుంచి పరిణామాలు చకచకా సాగాయి.
తెలంగాణా తొలి అసెంబ్లీ రద్దయినట్టు శాసనసభ సచివాలయం గెజిట్ జారీ
చేసింది. గెజిట్ ప్రతిని శాసన సభ కార్యదర్శి నరసింహాచార్యులు రాష్ట్ర
ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి అందచేయడం, ఆ విషయాన్ని కేంద్ర ఎన్నికల
సంఘానికి తెలియచేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం హుటాహుటిన ఢిల్లీకి వర్తమానం
పంపడం వెనువెంటనే జరిగిపోయాయి.
ముందుగా రాసుకున్న సినిమా స్క్రిప్ట్ మాదిరిగా ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు,
అవాంతరాలు లేకుండా జరగాల్సిన విధి విదానాలన్నీ సాగిపోయాయి.
అప్పటివరకు ఈ విషయంలో అలముకున్న అనుమాన మేఘాలన్నీ పటాపంచలు అయ్యాయి.
నిన్నమొన్నటి వరకు కేసీఆర్ అనే పేరుకు ముందున్న ‘ముఖ్యమంత్రి’ అనే పదానికి
‘ఆపద్ధర్మ’ అనే పదం జోడు కలిసింది.
తాను కోరుకున్న విధంగానే కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తెలంగాణా రాష్ట్రంలో మొట్టమొదటి పర్యాయం అసెంబ్లీ
ఎన్నికలు జరగబోతున్నాయి.(2014లో అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణాకు విడిగా
జరిగినా ఆ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినట్టే లెక్క)

విశేషం ఏమిటంటే ఈ పరిణామాలన్నీ మెరుపువేగంతో జరిగిపోవడం.
అంతేనా! అంటే అంతటితో అయిపోలేదు.
శాసనసభ రద్దు నిర్ణయాన్ని వెల్లడించిన విలేకరుల సమావేశంలోనే, ఎవరూ
ఊహించని రీతిలో ఏకంగా రానున్న ఎన్నికల్లో పోటీచేసే నూట అయిదుమంది పార్టీ
అభ్యర్ధుల పేర్లను ప్రకటించి అందర్నీ మరింత విస్మయానికి గురిచేసారు
కేసీఆర్. ముందస్తు ఎన్నికల మాట
ఇదమిద్ధంగా తేలకముందే ఆయన మాత్రం చాలా ముందుగానే అభ్యర్ధుల తొలి జాబితా
విడుదల చేసి ఒక రికార్డు నెలకొల్పారు.
అంటే ఏమన్నమాట. ఈ విషయంపై ఆయన చాలా కాలంగా, చాలా లోతుగా కసరత్తు
చేస్తున్నారని అర్ధం చేసుకోవాలి.
సరే! నూట అయిదుమంది అభ్యర్ధులు ఎవరన్నది తేలిపోయింది. సంతోషం. వాళ్లకి
కూడా టికెట్ వస్తుందా రాదా అన్న అనుమాన, భయాలు ‘ప్రస్తుతానికి’ లేకుండా పోయాయి.
మరి తరువాత ఏమిటి? మళ్ళీ ఈ ప్రశ్న సహజంగానే ముందుకువస్తుంది. దానితో
పాటుగా మరికొన్ని ఉప ప్రశ్నలు.
‘కేసీఆర్ భావిస్తున్నట్టు డిసెంబరులోగా తెలంగాణా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయా?
‘ఏదైనా కారణంతో జరక్కపోతే ఏం జరుగుతుంది?
‘కొత్త రాష్ట్రంగా తెలంగాణా ఏర్పడ్డ తర్వాత తొట్టతొలిసారి రాష్ట్రపతి
పాలన వస్తుందా?’

ఇలా అన్నమాట.
అయితే, ఈలోగా మరో పరిణామం చోటుచేసుకుంది. లేకపోతె ఇది జవాబు దొరకని
ప్రశ్నలాగా మిగిలిపోయేది, ఎవరో అన్నట్టు ‘డౌటింగ్ థామస్’ లకు
చేతినిండా పని పెడుతూ.
ఈరకం ప్రశ్నలపై టీవీల్లో చర్చలు మొదలవుతుండగానే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పిలుపు వచ్చింది, ఖుద్దున ఢిల్లీ
బయలుదేరి రావాల్సిందని.
మరో నాలుగు రాష్ట్రాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, చత్తీస్
ఘడ్ లకు ఎన్నికల ఘడియ దగ్గర పడింది. వాటి విషయం చూడడానికి కేంద్ర ఎన్నికల
కమీషన్ వారానికి రెండుమార్లు, మంగళవారం. శుక్రవారం సమావేశం అవుతూ
వస్తోంది. ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులతో పాటు తెలంగాణా
అధికారిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు అంటే తెలంగాణాలో ముందస్తు
ఎన్నికలు గురించి కేంద్ర కమీషన్ లో కూడా కొంత కదలిక కనబడుతోందని కొందరు భాష్యం
చెబుతున్నారు.
అదీ నిజమనే అనిపిస్తోంది, ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం చూస్తే.

ఈ పరిణామాల నేపధ్యంలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తధ్యం అనే మాటలు
ఎల్లెడలా వినిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉండగానే టీఆర్ఎస్ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి తెలంగాణా కాంగ్రెస్
పార్టీ కూడా ముందస్తు ప్రకటనలు చేస్తూ తానూ రేసులో ఉన్నాననే సంకేతాలు
బలంగా పంపిస్తోంది. సాధారణంగా ప్రతి విషయానికీ ఢిల్లీ వైపు చూస్తూ,
నిర్ణయాలు తీసుకుకోవడంలో జాప్యం చేస్తారనే అపప్రధను మోస్తున్న కాంగ్రెస్ పార్టీ
ఈ పర్యాయం చాలా ముందుగానే ఎన్నికల ప్రణాళిక వెల్లడిచేసింది. ఆకాశమే
హద్దుగా చేసిన ఎన్నికల వాగ్దానాలు, ఓటర్లకు ఇవ్వచూపిన తాయిలాలు,
కేసీఆర్ ముందస్తు ఎన్నికల ఆలోచనను మరింత ముందుకు నెట్టాయని కూడా
కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. త్వరితగతిన స్పందించడంలో ఏమాత్రం
వెనుకబడిలేమనే సంకేతం ఇవ్వడానికి కాబోలు ఎంతమాత్రం కాలయాపన చేయకుండా విలేకరుల
సమావేశాలు వెనువెంటనే పెట్టి కేసీఆర్ ఏ నిర్ణయం ప్రకటించినా దాన్ని
ఖండించే కొత్త పద్దతికి కాంగ్రెస్ స్వీకారం చుట్టడం ఆ పార్టీలో వచ్చిన
కొత్త మార్పు. ‘ప్రజలను మంచి చేసుకుని అధికారంలోకి తిరిగిరావడం కన్నా
వ్యవస్తలని మేనేజ్ చేసుకుని అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కేసీఆర్ కి
వెన్నతో పెట్టిన విద్య’ అని కాంగ్రెస్ నాయకులు ఘాటయిన విమర్శలకు
దిగుతున్నారు.
రాజకీయాలను, ముఖ్యంగా ఎన్నికలను, అవి ఏ ఎన్నికలయినా సరే, అత్యంత
ప్రతిష్టాత్మకంగా, ఎంతో పట్టుదలగా తీసుకుని చావోరేవో తేల్చుకునే విధంగా
వ్యవహరించే రాజకీయ నాయకుడని కేసీఆర్ కు పేరుంది. దాన్ని నిజం చేస్తూ యాభై రోజుల్లో
వంద ప్రజాశీర్వాద సభలను నిర్వహించి తమ పరిపాలనపై ప్రజల తీర్పును కోరాలని నిర్ణయం
తీసుకోవడం, వేయబోయే ఆ అడుగును తనకు గతంలో కలిసొచ్చిన హుస్నాబాదు నుంచే ఆ
మరునాడే మొదలు పెట్టడం కూడా జరిగింది.
‘ఔర్ ఏక్ బార్ కేసీఆర్’, ‘కంటి ముందే అభివృద్ధి, ఇంటి ముందే అభ్యర్ధి’
అనే ఎన్నికల నినాదాలను బలంగా జనంలోకి తీసుకు వెళ్లేందుకు టీఆర్ఎస్
శ్రేణులు ఫేస్ బుక్, వాట్సప్ వంటి సాంఘిక మాధ్యమాల్లో
ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాయి కూడా. కాంగ్రెస్ పార్టీకి కూడా
ఇటువంటి హైటెక్ ప్రచారాన్ని సమన్వయం చేసే గట్టి యంత్రాంగం లేకపోలేదు. ఆ
మాటకువస్తే, మిగిలిన రాజకీయ
పార్టీలు కూడా ఈ విషయంలో ఎవరికీ తీసిపోలేదనే చెప్పాలి. అయితే ఆయా పార్టీల
అభిమానులు, కార్యకర్తలు తమ పార్టీలని సమర్ధించడానికి, ప్రత్యర్ధి
పార్టీలను బద్నాం చేయడానికి ఈమాధ్యమాలను వాడుకుంటున్న తీరు కొన్ని
విమర్శలకు గురవుతున్న మాట కూడా యదార్ధమే.
‘ఏది మాట్లాడాలి ఏది కూడదు’ అనే విషయంలో నాయకులే స్పష్టత లేక
నోటికివచ్చినట్టు మాట్లాడుతుండడం చూస్తుంటే ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున
మేస్తుందా’ అనే సామెత గుర్తు రాకమానదు.
రానున్న ఎన్నికల్లో ఎన్ని పార్టీలు పోటీకి దిగినా ప్రధాన పోరాటం
టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నడుమే అన్నది బహిరంగ రహస్యం.

కాంగ్రెస్ లో బహునాయకత్వం. ఇది ఒక రకంగా ఆ పార్టీకి బలమూ, బలహీనత. పార్టీ
గుర్తు తోడయితే తమ సొంత బలంతో సునాయాసంగా గెలవగలిగిన వాళ్ళు ఆ పార్టీలో
చాలామంది వున్నారు. అయితే అంతర్గత కలహాల కారణంగా అనేక సందర్భాలలో ఈ బలం
నిర్వీర్యం అయిపోతోంది.
టీఆర్ఎస్ పరిస్తితి వేరు. ప్రాంతీయ పార్టీలకు అధినాయకుడే అసలు బలం. అతడి
శక్తిసామర్ధ్యాలను బట్టే జయాపజయాలు చాలావరకు నిర్ధారణ అవుతాయి. కేసీఆర్
నాయకత్వపటిమే ఆ పార్టీకి శ్రీరామరక్ష. అయినా ఏదోవిధంగా బలమయిన
అభ్యర్ధులను వేరే పార్టీల నుంచి ఆకర్షించే ప్రయత్నం కేసీఆర్
చేస్తున్నారంటే, ఎన్నికల వంటి అతిముఖ్యమైన విషయాల్లో ఆయన ఏమాత్రం చాన్స్
తీసుకునే వ్యక్తి కాదని అర్ధం చేసుకోవచ్చు.

ప్రత్యర్ధి శిబిరాలు కూడా ఈసారి ఛాన్స్ తీసుకోకూడదనే ఆలోచనల్లో వున్నాయి.
కేసేఆర్ అనే ఉమ్మడి రాజకీయ ప్రత్యర్ధిని నిలువరించేందుకు ఆగర్భ రాజకీయ
ప్రత్యర్దులయిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపే ప్రయత్నాలను
ముమ్మరం చేశాయి. ఈ దిశలో సంప్రదింపులను మరింత ముందుకు తీసుకుపోవడానికి
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హైదరాబాదు వచ్చారు. పొత్తులపై
చర్చలు జరపడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధి కూడా ఒక
కమిటీని ఏర్పాటు చేసారు. మరికొన్ని పార్టీలను కలుపుకుని ఒక మహా కూటమి
ఏర్పాటు చేయాలన్నధ్యేయంతో ముందుకు సాగుతున్నట్టు తోస్తోంది. మరి కొద్ది
రోజుల్లో ఈ పొత్తులపై ఒక స్పష్టత వచ్చే అవకాశం వుంది. ఈ సందర్భాలలో పైకి
భావసారూప్యం అనే పడికట్టు పదాలు వినబడుతుంటాయి.కానీ ఇలాంటి కూటములది ఒకే
ధ్యేయం, అధికారంలో ఉన్న ప్రత్యర్ధి పార్టీని గద్దె దింపడం. తమ రాజకీయ
ప్రయోజనాలను తాత్కాలికంగా అయినా కాపాడుకోవడం. గతం చెబుతున్న సత్యం ఇది.

మన ప్రజాస్వామ్యంలో ఉన్న చమత్కారం ఏమిటంటే, అన్ని పార్టీలు ప్రజాస్వామ్య
పరిరక్షణే తమ ఆశయం అంటూనే, మరో పక్క అవకాశం దొరికినప్పుడల్లా ఆ
స్పూర్తికి తూట్లు పొడవడం.

నిజానికి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షకులు ఎవరయ్యా అంటే వాళ్ళు మన సాధారణ
ఓటర్లు. రాజకీయ పార్టీలు కాదు.

పార్టీలు ఎరచూపే ప్రలోభాలకు గురవుతున్నారన్న అపప్రధను మోస్తూ కూడా కేవలం
‘ఓటు’ అనే ఆయుధంతో ప్రభుత్వాలను మార్చగలుగుతున్నది మాత్రం ఆ ఓటర్లే.రచయిత ఈమెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 98491 30595

7 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఇయ్యన్నీ టివిలల్ల విని విని కంపరమొస్తుంది. కొత్తగా మీరేమి చెబుతున్నారు. ఈ పుచ్చకాయ ముందస్తు ఇప్పుడు అవసరమా కాదా అది చెప్పుండ్రి. తెలుగు పెజానీకానికి ఉన్నంత ఎన్నికల పిచ్చి పైత్యం... బెకబెక కప్పల చర్చలు కిచకిచ మని కోతి చర్చలతోని సంపకతింటారు.

రాజ్ చెప్పారు...

నా ఉద్దేశ్యం ప్రకారం .... బహుశా కె.సి.ఆర్ తన సొంత సర్వేల ద్వారా తను గెలిచే అవకాశం ఉందని ఎక్కువగా ఉందని తెలుసుకుని ఉంటారు. ముందస్తు ఎన్నికల కు వెళ్ళడం ద్వారా కె.సి.ఆర్ ఈ క్రింది విషయాలను సాధించవచ్చు
1. బి.జె.పి యొక్క ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయడం, సార్వత్రిక ఎన్నికలకి ముందు బి.జె.పి ఒక రాష్ట్రం లో ఓడిపోతే మీడియాలో ఎంత వ్యతిరేక ప్రచారం జరుగుతుందో ఊహించండి.
2. మూడవ కూటమికి (!!) నాయకుడిగా స్థిరపడడం - బహుశా అన్ని రాష్ట్రాలలో బా.జ.పా. వ్యతిరేక పార్టీలకి తనే ప్రచారం చేయడం,
3. తద్వారా ప్రధాని పదవికి మార్గం సుగమం చేసుకోవడం
4.

nmrao bandi చెప్పారు...

@రాజ్ ...

మీ ఉద్దేశ్యం సరైనదే. సర్వేలపై ఆధారపడే ఏ ప్రభుత్వమైనా ఈ విధమైన ముందస్తు ఎన్నికల నిర్ణయాలు తీసుకునేది. మరింత దీర్ఘ కాలిక అధికారాన్ననుభవించడం కోసం కాకపొతే ఎవరూ కూడా చేతిలో ఉన్న అధికారాన్ని కుదించుకోరు . ఎగ్జాట్లీ ఇదే విధంగా చంద్రబాబు గారు ముందస్తుకు పోక పోవడానికి కారణం కూడా సర్వేలే. గెలుపు అవకాశాలే గనుక ఉండి ఉంటే కెసిఆర్ కన్నా ఆయనే ముందు ఉబలాట పడేవారు. సర్వేలు బాగున్నాయన్న కారణంతో అలిపిరి ఘటన సందర్భంగా ముందుకెళ్లి వెనకబడి పోయిన సందర్భం ఇంకా ఆయన మనసులో ఫ్రెష్ గానీ ఉండి ఉండాలి. అలాంటప్పుడు ఆశాజనకంగా లేని సర్వే లను నమ్ముకుని మరో ఏడెనిమిది నెలల అధికారాన్ననుభవించే అవకాశాన్ని అప్పనంగా వదులుకునే ఆమాయకుడో, అజ్ఞానో కాదు ఆయన. కనుక ఆంధ్రాలో ముందస్తు ఖచ్చితంగా రాదు. ఇది నా నిశ్చిత అభిప్రాయం.

ఇకపోతే మీరు చెప్పిన మూడు విషయాలు ...

1) "బి.జె.పి యొక్క ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయడం ..."
ఇలాంటి అవకాశం సూది మొనంత ఉన్నా బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణా ముందస్తుకు ఒప్పుకునే
అవకాశం లేనే లేదు. ఆ సందేహమే గనుక ఉండి ఉంటే కెసిఆర్ గారిచ్చిన మంత్రివర్గ తీర్మానాన్ని రక
రకాలుగా నానేట్లు చేసి, కేంద్రంతో సలహాలు సంప్రతింపులు పేరిట కాలం గడిపి సుదీర్ఘ కాలం వ్యవహారం
నడిచి ఉండేది. it is simple knowledge that everything is preplanned and acted upon as
scheduled that the governor accepted the cabinet decision in a blink. we read in
papers that he just took the paper/s from kcr and signed it the next second. would
that have happened without the prior intimation from the central government ! and
also observe how fast the election commission's machinery flung into action, fast
and haste ! bjp must have had their own designs in sending kcr to early elections.

2) "మూడవ కూటమికి నాయకుడిగా స్థిరపడడం ..."
కెసిఆర్ గారు మొత్తం 17 పార్లిమెంట్ సీట్లూ గెలిచినా గానీ ఆయనను మూడవ కూటమికి నాయకుడిగా
ఎన్నుకోవడం, అంగీకరించడం ఉత్తరాది వారు ఎట్టి పరిస్థితుల్లోనూ
పడనివ్వరు. at the most ఆయన ఆ ఫ్రంట్ లో క్రియాశీలంగా వ్యవహరించి కాసిన్ని ముఖ్యమైన
పోర్ట్ఫోలియోలు మాత్రం తెచ్చుకోగలరు. అంతే.
3) "తద్వారా ప్రధాని పదవికి మార్గంము ..."
ములాయం సింగ్ లాంటి, నితీష్, మాయావతి, మమతా బెనర్జీ లాంటి వారు, విడివిడిగానూ,
యేకంగానూ దక్షిణాది వారిని గద్దెనెక్కనివ్వరు. ఇది ఒప్పుకున్నా లేకపోయినా సత్యం. నిశ్చయం.
నిస్సందేహం.

we would only see kcr remain a mere dreamer.
ఏమో ! గుర్రం ఎగురా వచ్చు ! అని మీరంటే గనుక నా దగ్గర ఆన్సర్ లేదు సర్...

Chiru Dreams చెప్పారు...

గుర్రం ఎగిరితే ఏం చెయ్యాలి, ఎగరకపోతే ఏం చెయ్యాలి అని తెలివైన నాయకుడు ఎప్పుడూ 2 ఆప్షన్లు రెడీగా పెట్టూకుంటాడు.

గుర్రం ఎగిరితే: రాజ్ అన్నట్టు, తెరాసా బంపర్ మెజారిటీతో గెలిస్తే, అది చూపించుకోని ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తాడు. కాకపోతే, ఫ్రంట్లో భాగస్వామ్యమున్న ప్రతి ఒక్కడూ ప్రధాని అభ్యర్ధే. వాల్లందర్నీ కాదని పసిగుడ్డు(కెసీఆర్ భాషలో)కి అవకాశం ఇవ్వడమనేది జరిగే పనికాదు. కాకపోతే, చంద్రబాబులాగా ప్రధానిని నేనే తయారు చేశా అని చెప్పుకునే చాన్సు.

ఇక గుర్రం ఎగరకపోతే: తక్కువ మెజారిటీ ఒస్తే, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చెస్తాడు. అక్కడనుంచి కేసీఆర్, అవితలకు కేంద్ర మంత్రిపదవి, కేటీఆర్ ముఖ్యమంత్రి..

nmrao bandi చెప్పారు...

@Chiranjeevi Y ...

"పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చెస్తాడు ..."
this sure looks more logical.

Jai Gottimukkala చెప్పారు...

@రాజ్:

"సార్వత్రిక ఎన్నికలకి ముందు బి.జె.పి ఒక రాష్ట్రం లో ఓడిపోతే మీడియాలో ఎంత వ్యతిరేక ప్రచారం జరుగుతుందో ఊహించండి"

ఎప్పుడూ గెలవని, ఇప్పుడు గెలిచే అవకాశం ఉందని ఎవరూ భావించని రాష్ట్రంలో ఓడితే నష్టం ఏమీ ఉండదు. పచ్చ మీడియా ప్రచారానికి భయపడితే ఆయన మోడీ ఎందుకు అవుతాడు?

@nmrao bandi:

"దక్షిణాది వారిని గద్దెనెక్కనివ్వరు"

దేవగౌడాను రానిచ్చారు కదండీ. తాము గద్దె ఎక్కాలని వారు (కూడా) సహజంగానే ఉవ్విళ్ళూరుతున్నారు తప్ప దక్షిణాది వారిని ప్రత్యేకంగా అణగదొక్కాలని కుట్ర పన్నరు.

@Chiranjeevi Y:

"ఫ్రంట్లో భాగస్వామ్యమున్న ప్రతి ఒక్కడూ ప్రధాని అభ్యర్ధే"

ప్రణబ్ ముఖర్జీ లాంటి వారు సైతం దస్తీ వేసుకున్నారు!

nmrao bandi చెప్పారు...

@ Jai Gottimukkala ...
"దేవగౌడాను రానిచ్చారు ,,," -
ఆ సందర్భంలో ఎక్కువ మంది ఆస్పిరంట్స్
లేకపోవడం ప్లస్ అప్పటికి రాజకీయాల్లో ఇంకా
నేతల్లో కాస్తంత పెద్దరికం ఉండటం, అదీకాక
లోలోపల దక్షిణాదిపై చిన్నచూపు ఉన్నా గానీ
బయట పడకుండా హుందాగా నడుచుకున్న
కాలం అది. రోజులు మారాయి సర్. ఇప్పటి
నాయకులకు ఆ ముసుగు అవసరం లేనే లేదు.
ఉదా : శ్రీ నరేంద్ర మోదీ.

అయిదు దక్షిణాది రాష్ట్రాలూ పార్లిమెంట్ లో
మెజారిటీ సాధించి, కలిసి ఉమ్మడిగా,
ప్రధానిగా తమలో ఒకడ్ని ఎన్నుకునే పరిస్థితి
వస్తే తప్ప దక్షిణాది వ్యక్తికి ఛాన్స్ కష్టమే ...