15, జనవరి 2017, ఆదివారం

వార్తలు చదువుతున్నది దుగ్గిరాల పూర్ణయ్య


నా రేడియో సహోద్యోగి నాగసూరి వేణుగోపాల్ ఈరోజు ఒక ఫోటో పోస్ట్ చేశారు. అది చూడగానే సంతోషం, విచారం ఏకకాలంలో ముప్పిరిగొన్నాయి.
మాస్కో రేడియోలో పనిచేయడానికి వెళ్ళే ముందు దుగ్గిరాల పూర్ణయ్య గారిని ఢిల్లీలో కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నాను. గంభీరమైన స్వరం. వార్తలు విరిచినట్టు చదవడంలో ఒక ప్రత్యేకమైన బాణీ. రేడియో వార్తలు సగంలో విన్నా కూడా చప్పున చెప్పేయొచ్చు వార్తలు చదివేది పలానా అని. ఎందరో శ్రోతలు, ఎందరో అభిమానులు. అలా గడిచి పోయింది వారి రేడియో జీవితం.
ఇప్పుడు గుడివాడ దగ్గర అంగలూరులో శేష జీవితం గడుపుతున్నట్టు వేణుగోపాల్ వల్ల తెలుస్తోంది. వారి ఫోటో చూసినప్పుడే గుండె బరువెక్కింది.
కాలం తెచ్చే మార్పులు తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు.

(కింద ఫోటోలో: దుగ్గిరాల పూర్ణయ్య, కర్టెసీ: నాగసూరి వేణుగోపాల్, ఆలిండియా రేడియో)  

   


3 కామెంట్‌లు:

M KAMESWARA SARMA చెప్పారు...

80 ల నాటి ఫోటో కూడా చూపిస్తే బావుణ్ణు
ఎంకే శర్మ

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అంగలూరులో దుగ్గిరాల వారి కుటుంబాలు, తదితర ప్రముఖుల కుటుంబాలు చాలానే ఉన్నాయి. బౌద్ధ వాఙ్మయ బ్రహ్మ అని బిరుదు పొందిన దుగ్గిరాల బలరామకృష్ణయ్య గారిది ఆ ఊరే. "కవిరాజు" త్రిపురనేని రామస్వామి చౌదరి గారిది ఆ ఊరే (ప్రఖ్యాత రచయిత త్రిపురనేని గోపీచంద్ వారి కుమారుడే. గోపీచంద్ గారి కుమారుడు సాయిచంద్ "మాభూమి" సినిమాలో ప్రముఖ పాత్ర పోషించారు). శ్రీ మదద్భుతోత్తర రామాయణం రాసిన నందగిరి వెంకటప్పయ్య గారిది ఆ ఊరే. పలు రంగాల్లో పేరు గాంచిన ఊరు అంగలూరు. స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు ఆ ఊరివారు. గాంధీ గారిని అనుసరించి ఉప్పు సత్యాగ్రహంలో దండి వరకు వెళ్ళిన ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న మరో గాంధేయవాది ఆరెకపూడి నాగభూషణం గారు ఆ ఊరివారే. భారతదేశంలో టెలెకమ్యూనికేషన్స్ రంగంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి IT Adviser గా సేవలందించిన వ్యక్తి డా.త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు ఆ ఊరివారే. కృష్ణాజిల్లా లో మొదటి ప్రభుత్వ బాలికల హైస్కూల్ అంగలూరులోనే స్ధాపించారు బ్రిటిష్ వారి హయాంలో. కృష్ణాజిల్లాలో చెప్పుకోదగిన ఊళ్ళల్లో అంగలూరు తప్పకుండా ఒకటి. (ఇంత విపులంగా చెప్పటానికి కారణం మా స్వగ్రామం కూడా అంగలూరే కాబట్టి 🙂🙂).
పైన ఎంకే శర్మ గారన్నట్లు పూర్ణయ్య గారి పాత ఫొటో కూడా పెడితే బాగుంటుంది. మీ ఉద్యోగకాలం నాటి గ్రూప్ ఫొటోలలో ఏదన్నా దొరుకుతుందో ?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@విన్నకోట వారికి.అంగలూరు విశేషాలు బాగున్నాయి. పొతే పూర్ణయ్య గారు తన ఉద్యోగ జీవితం యావత్తూ ఢిల్లీ లో గడిపారు. వారితో నేను ఎప్పుడూ ఫోటో దిగలేదు. కాకపోతే గతంలో రేడియో న్యూస్ రీడర్లను గురించి ఇదే బ్లాగులో రాస్తూ నెట్లో దొరికిన వారి ఫోటోను పోస్ట్ చేశాను. ఈ ఫోటో కూడా రేడియో సహోద్యోగి పోస్ట్ చేయగా నేను వాడుకున్నాను.