17, జనవరి 2017, మంగళవారం

ప్రచారాలు


ఈ రోజు ఉదయం ఊబెర్ లో వెడుతున్నాను. డ్రైవర్ పేరు పెండ్యాల సత్యనారాయణ. మా ఊళ్ళో కూడా పెండ్యాల ఇంటి పేరుకలవాళ్ళు వున్నారు. మాటల్లో చెప్పాడు. రెండేళ్ళ క్రితం ఈ కారు కొనుక్కున్నాడట. అంతకు పూర్వం తను డ్రైవరుగా పనిచేసిన యజమాని మాట సాయం వల్ల కారు లోన్ లభించిందనీ, ఆయన పేరు రామచంద్ర మూర్తిగారనీ చెప్పాడు. స్టీరింగు ముందు కూర్చోగానే  సాయం చేసిన  ఆయన్ని ప్రతిరోజూ  గుర్తు చేసుకుంటానని  చెప్పాడు. సంభాషణ కొనసాగిస్తే తేలింది ఏమిటంటే ఆ రామచంద్ర మూర్తిగారు, ఇప్పుడు సాక్షిలో ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్ర మూర్తి గారు ఒక్కరేనని. మూర్తిగారు హెచ్.ఎం.టీ.వీ. లో పనిచేసేటప్పుడు ఈ సత్యనారాయణ గారు  అయిదేళ్లపాటు ఆయన కారు డ్రైవరుగా వున్నాడట.
ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, చేసిన పని గురించి గొప్పలు చెప్పుకునే ప్రచార యుగంలో ప్రస్తుతం  జీవిస్తున్నాము. అందుకే చిత్రంగా అనిపించింది. మంచి పని చేసి కూడా దాన్ని చెప్పుకోని కాలాన్ని చూసినవాడిగా కొన్ని విషయాలు రాయాలనిపించి రాస్తున్నాను.
మొన్నీ మధ్య ఒక పెద్దమనిషి చెప్పాడు, పెన్షనర్ల కోసం మోడీ జీవన్ ప్రమాణ్ అనే పేరుతొ ఒక మంచి పధకం ప్రవేశ పెట్టారని. నిజమే. నేనూ వెళ్లి నా పేరు నమోదు చేసుకున్నాను.తాము ఇంకా బతికే వున్నామని, అందుకు  రుజువుగా పెన్షనర్లు ప్రతియేటా తమ బ్యాంకుకు వెళ్లి అక్కడి అధికారి ఎదుట హాజరయి ఒక సర్టిఫికేట్ సమర్పించుకోవాలి. పెద్దతనంలో ఎక్కడో ఏ ఊళ్లోనో పిల్లల  దగ్గర శేష జీవితం గడిపే పెన్షనర్లు ఇలా బ్యాంకుల చుట్టూ తిరగడం ప్రయాసే. ఈ జీవన్ ప్రమాణ్ వల్ల ఆ ఇబ్బంది వుండదు. ఉంటున్న ఊళ్లోనే ఏదైనా బ్యాంకుకు వెళ్లి బొటనవేలి ముద్ర ద్వారా ఈ పని పూర్తి చేసుకోవచ్చు. దేశంలో ప్రస్తుతం పనిచేసే సిబ్బంది కంటే పదవీ విరమణ చేసి పించను పుచ్చుకుంటున్న వాళ్ళ సంఖ్యే ఎక్కువ. కాబట్టి అలాంటి వాళ్లకి ఇది వరప్రసాదమే. ప్రయోజనం పొందిన వాళ్ళే చెబుతారు, ఇది మోడీ పుణ్యం అని. కానీ అలా జరగడం లేదు, ఇది మోడీ ప్రవేశపెట్టిన పధకం అంటూ ప్రచారం చేయడం విడ్డూరం అనిపిస్తుంది. మోడీ చేస్తున్న పెద్దపెద్ద పనులు ఇంకా చాలా వుంటాయి. ఇలా ప్రతి పనిని ఆయన ఖాతాలో వేయడం వల్ల ఆయన వ్యక్తిత్వ శోభ ఇనుమడిస్తుందని నేనయితే అనుకోను. ఇందుకు ఒక ఉదాహరణ చెబుతాను. గతంలో ఒకసారి కొన్ని మందుల కోసం సీ.జీ.హెచ్. క్లినిక్ కి వెళ్లాను. కొన్ని మందులు ఇచ్చారు. మరి కొన్ని స్టాక్ లో లేవన్నారు. బయటకు వస్తుంటేనే సెల్ లో ఎస్సెమ్మెస్ వచ్చింది. ‘మీరు ఇన్ని మందులు  తీసుకున్నారు, మిగిలిన మందుల కోసం ఇండెంటు పెట్టారు, పలానా రోజున వచ్చి వాటిని పట్టుకెళ్ళమని’. నేను ఎంతో ఆశ్చర్య పోయాను. ఆ రోజుల్లో ప్రధాని మన్మోహన్ సింగ్. కానీ ఎవ్వరూ ఈ మంచి పని చేసింది ఆయన అని ప్రచారం చేయలేదు. జనత ప్రభుత్వ హయాములో రైల్వే మంత్రి మధు దండావతే  స్లీపరు కోచీల్లో చెక్క బల్లల స్థానంలో మెత్తగా వుండే పరుపుల బెర్తులు వేయించారు. సాధారణ రైల్వే ప్రయాణీకులకు అదొక పెద్ద ఊరట. కానీ ఆయన ఎప్పుడూ తను ఈ పనిచేశానని చెప్పుకోలేదు. ఆయన అనుయాయులూ చెప్పలేదు. అలాగే రైల్వేలలో రిజర్వేషన్లు కంప్యూటరైజ్ చేసిన తరువాత ఒనగూరిన ప్రయోజనాలు చెప్పక్కర లేదు. కానీ ఏ ప్రభుత్వం వాటికి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేయలేదు. అలా ఒక్కొక్క ప్రభుత్వ హయాములో ఒక్కొక్క మంచి పని జరుగుతూనే వుంటుంది. అలా మంచి పనులు చేస్తూ పోవడం తమ బాధ్యతగా భావించాలి కానీ తామే అన్నీ చేస్తున్నాం అని పదేపదే చెప్పుకోవడం, ప్రచారం చేసుకోవడం వల్ల ప్రజల దృష్టిలో పలచన పడే అవకాశం వుంటుంది.
కొన్ని ప్రధానమైన విధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటికి సంబంధించి ప్రభుత్వాలు కానీ వాటి నేతలు కానీ, వారి అనుయాయులు, అభిమానులు కానీ  ప్రచారం చేసుకుంటే అభ్యంతర పెట్టాల్సింది ఏమీ వుండదు.
మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు ఒక గేయంలో రాశాడు ఇలా:

“ప్రచారాల తెరలుడుల్చి ప్రతిభ చూపనోపకు!”                              

2 కామెంట్‌లు:

అన్యగామి చెప్పారు...

మనుషుల్లో, ప్రభుత్వాల్లోని మంచిని భలే ఆవిష్కరించారు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@anyagaami: THANKS