3, జనవరి 2017, మంగళవారం

ఎవరీ హరిశ్చంద్ర ప్రసాద్ ?


మూన్నెళ్ళుగా ఆర్ కే ప్రసాద్ మనసును తొలుస్తున్న అనుమానం.
అతను చాలా  సంవత్సరాలు అమెరికాలో ఉద్యోగం చేసి  ఇండియా రాగానే  హైదరాబాదులోని ఒక సంస్థలో ఫైనాన్స్ విభాగంలో ఉన్నతాధికారిగా చేరాడు. తన కింద పనిచేసే కొన్ని డజన్ల మంది ఉద్యోగులతో ముఖతః పరిచయం లేక పోయినా రికార్డులను బట్టి వారేమిటో, ఏ పని చేస్తుంటారో తనకు తెలిసిపోతూనే వుంటుంది, ఒక్క ఈ హరిశ్చంద్ర ప్రసాద్ విషయం తప్ప. ఆయన ఆ ఊళ్లోనే బ్రాంచి ఆఫీసులో పనిచేస్తారు.
ఆయన తన దృష్టిని ఆకర్షించడానికి  కారణం కూడా వుంది. అది ఆయన నడవడిక. తనిఖీ నిమిత్తం తాను నెలలో అనేక పర్యాయాలు  ఆ బ్రాంచికి వెళ్ళాల్సిన అవసరం పడేది. ఎప్పుడు వెళ్ళినా ఆయన తన సీట్లోనే కనబడేవాడు. ఆఫీసు టైం కల్లా ఠంచనుగా గంట కొట్టినట్టు వచ్చి తన సీట్లో కూర్చుంటాడని చెప్పేవాళ్ళు.  వచ్చీ రాగానే అందర్నీ చిరునవ్వుతో పలకరిస్తాడు. అంతే! ఆ తరువాత మౌనముని.  కంప్యూటర్ ఓపెన్ చేసి తన పనిలో పడిపోతాడు. ఎవరితో మాటా ముచ్చటా వుండదు. లంచ్ బాక్స్ ఇంటి నుంచే తెచ్చుకుని తన సీటు దగ్గరే భోజనం ముగిస్తాడు. ఆయన ఎవరికీ రిపోర్ట్ చేయడు. పలానా పని చేసారా ఎవరూ ఆయన్ని అడగ్గా చూడలేదు. సాయంత్రం ఆఫీసు పని వేళలు ముగియగానే కారు నడుపుకుంటూ వెళ్ళిపోతాడు. ఇదీ ఆయన గురించి విన్న విషయాలు. వారికి తెలియని విషయం ఒకటి ఫైనాన్స్ అధికారిగా తనకు తెలుసు. ఆయన జీతం లక్షల్లో. ఏపనీ లేకుండా ఎందుకంత జీతం ఇస్తున్నట్టు!
‘ఇంతకీ ఎవరీయన?’
అదే ప్రశ్న సహచరులను అడిగి చూశాడు.
“మాకూ తెలియదు. మన బాస్ కావాలని ఆయన్ని తెచ్చి పెట్టుకున్నాడు. అలా అని బాస్ తో చనువుగా వుండగా మేమెప్పుడూ చూడలేదు. తన పనేమిటో  తన లోకమేమిటో. గతంలో ఒకరిద్దరు బాస్ తో ఈ ప్రస్తావన చేయ బోయారు. ‘మీకు అది అంత అవసరమా” అని కట్ చేసారు. ఆ తరువాత ఎవ్వరూ ధైర్యం చేయలేదు”
ఈ సమాధానం ప్రసాద్ లో ఉత్సుకతను మరింత పెంచింది.
ఎవరీ హరిశ్చంద్ర ప్రసాద్!
ఫైనాన్స్ విభాగం అధిపతిగా ఆయన ఎవరో తెలుసుకునే అధికారం తనకుంది. ఎవరో తెలియకుండా అంతంత జీతాలు చెల్లించే పత్రాల మీద సంతకం చేయాల్సిన అవసరం తనకు లేదు.
అదే విషయం బాస్ తో అనేశాడు. ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి.
‘పోనీ ఒక పని చేయండి. ఎవరో తెలియకుండా జీతం ఇవ్వలేని పక్షంలో నా కంపెన్సేషన్ నుంచి ఆయనకు ఆ డబ్బు ఇవ్వండి. మళ్ళీ ఎప్పుడూ ఈ విషయం నా వద్ద ఎత్తకండి’
బాస్ స్పందన ప్రసాద్ ఆశ్చర్యాన్ని రెట్టింపు చేసింది.
మరో రెండేళ్ళు గడిచాయి. ఒక రోజు ఆఫీసు పని మీద ఆ బ్రాంచికి  వెళ్ళే సరికి అంతా హడావిడిగా వుంది. ఓమూలన కూర్చుని పనిచేసే ఆ ముసలాయన కనిపించలేదు. భోరున వర్షం కురవనీ, ఊళ్ళో కర్ఫ్యూ పెట్టనీ టైముకు ఆఫీసుకు వచ్చే పెద్దాయన ఈ రోజు రాలేదు. బాస్ కూడా అప్పుడు అక్కడే వుండడం చూసి ఆశ్చర్యం వేసింది. అందరూ బయటకు వెళ్ళడానికి సిద్ధంగా వున్నారు. ప్రసాద్ కూడా తన కారులో వాళ్ళని అనుసరించాడు.
ఊరికి దూరంగా విసిరేసినట్టున్నప్రాంతంలో విశాలమైన ఆవరణలో పూదోట వంటి ఓ పెంకుటిల్లు.  ఇంటి ముందు పాడె మీద  ఆ పెద్దాయన శవం.
ఎక్కువ హడావిడి లేకుండానే కర్మ కాండలు ముగిశాయి. అంతా ఆఫీసుకు తిరిగి వచ్చారు.
ఆ సాయంత్రం ఒక సంతాప సభ ఏర్పాటు చేశారు.
రెండు నిమిషాలు మౌనం పాటించిన తరువాత బాస్ మైక్ తీసుకున్నాడు.
‘ఎవరీ హరిశ్చంద్ర ప్రసాద్? మన ఆఫీసులో ప్రతి ఒక్కరికీ దీనికి జవాబు తెలుసుకోవాలని వుందని నాకు తెలుసు. ఆయన ఎవ్వరోకాదు, మన ఈ కంపెనీకి అసలు యజమాని. కంపెనీ మంచి వృద్ధిలో వున్న సమయంలో విదేశాల్లో విహార యాత్రకు వెళ్ళిన ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఒకే సారి  మరణించారు. వారసులు ఎవ్వరూ లేరు. ఆ సమయంలో ఆయన నాకు ఒక బాధ్యత ఒప్పచెప్పారు. అప్పుడాయన చెప్పిన మాటలు నాకు బాగా జ్ఞాపకం వున్నాయి.
‘ఎంతో విలువలతో ఈకంపెనీని నడుపుకుంటూ వచ్చాను. నాకూ వయసయిపోయింది. మా కుటుంబ సభ్యుల మరణం చూసాక మృత్యువు అనివార్యమని తెలిసిపోయింది. నేనూ ఒక రోజు పోక తప్పదు. కానీ ఈ కంపెనీ బతికి  తీరాలి. ఇన్నేళ్ళుగా ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఆఫీసుకు వెళ్లి పనిచేస్తూ వస్తున్నాను. ఈ పరిస్తితుల్లో నేను మనసు పెట్టి పనిచేయలేను. అలా  అని  ఖాళీగా కూడా  వుండలేను. అంచేత మన కంపెనీ లోనే పనిచేస్తాను. సంస్థ చైర్మన్ గా కాదు, ఒక ఉద్యోగిగా. కానీ ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకూడదు. హెడ్ ఆఫీసులో అది కుదరని పని. కాబట్టి ఏదైనా బ్రాంచిలో చూడు’
‘అలా నాకు చెప్పిన ఆయన ఇప్పుడు లేరు. కానీ అయన మనకు ఒప్పచెప్పిన ఆశయాల ప్రకారం  పనిచేసి కంపెనీని నిలబెడదాం. ఇన్నేళ్ళుగా ఆయన కూర్చున్న కుర్చీని అలాగే ఉంచేద్దాం. ఆయన అక్కడే కూర్చుని వున్నారు అనుకుంటే అదొక ప్రేరణగా వుంటుంది. అందుకే  ఈ ఏర్పాటు’’

ఎవరీ హరిశ్చంద్ర ప్రసాద్ అని మధన పడుతున్న ప్రసాద్ కి అసలు  విషయం బోధపడింది.    (03-01-2017)            

కామెంట్‌లు లేవు: