27, జనవరి 2017, శుక్రవారం

గీత దాటుతున్న నేతలు


(PUBLISHED IN THE EDIT PAGE OF 'SURYA' TELUGU DAILY ON 29-01-2017,SUNDAY)
కాలం ఎవరికోసం ఆగదు, ఎవరికోసం నిలవదు. అయినా మనిషికి తనమీద తనకు విశ్వాసం అధికం. అందుకే కాలాన్ని జయించాలని కలలు కంటుంటాడు. అధికారంలో వున్నప్పుడు దానికి ఎదురులేదనుకుంటాడు. ఎదురు వుండకూడదని ఆశ పడుతుంటాడు. అందిన అధికారం శాశ్వతం అనే భావనలో ఉంటాడు.  పదవిలో  లేకపోతే, సాధ్యమైనంత త్వరగా అధికార అందలం ఎక్కాలని  ఆత్రుత పడుతుంటాడు. రాజకీయాల్లో ఈ ధోరణి మరింత ప్రస్పుటం.   
గత గురువారం  సాయంత్రం విశాఖ విమానాశ్రయంలో ఎంతో  హడావిడి. ఏం జరగబోతోందో అనే ఆందోళన. ఏదైనా జరక్కపోతుందా అనే ఆసక్తి. ఇక మీడియా దృష్టి మొత్తం అక్కడే. కానీ ఏమీ జరగకుండానే అక్కడికది ముగిసింది.
ఆ మరునాడే అదే విశాఖలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో నలభయ్ దేశాల ప్రతినిధులు  పాల్గొనే  భాగస్వామ్య సదస్సు మొదలయింది. రెండు రోజులపాటు సందడే  సందడి. మీడియాలో గంటల గంటలతరబడి సమాచార ప్రవాహం.
సదస్సు ప్రారంభానికి  ముందు రోజు,   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని కోరుతూ విశాఖ సాగర తీరంలో కొవ్వొత్తుల ర్యాలీకి సన్నాహాలు. దానికి చెన్నై మెరీనా తీరంలో జరిగిన జల్లికట్టుతో ముడి. జల్లికట్టుకు, ప్రత్యేకహోదాకు సంబంధం ఏమిటని పాలకపక్షం ఎద్దేవా.
‘కొవ్వొత్తుల ర్యాలీ  భాగస్వామ్య సదస్సుకు అడ్డంకి. అటువంటి చర్యలతో అభివృద్ధికి ఆటంకం కలిగించవద్దంటూ’ ర్యాలీపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం. విశాఖ తీరం పొడవునా రహదారుల దిగ్బంధం. డేగ కన్నులతో పోలీసు పహరా. 
శాంతియుతంగా జరిపే కొవ్వొత్తుల ర్యాలీకి, భాగస్వామ్య సదస్సుకు ముడి పెట్టి మాట్లాడం విడ్డూరంగా వుందని ప్రతిపక్షాల విమర్శ.
చివరికి ఏమి జరిగింది?
కొవ్వొత్తుల ర్యాలీకి ప్రతిపక్ష నేత  హాజరు కాకుండా ప్రభుత్వం నిరోధించగలిగింది. కానీ ఎయిర్ పోర్ట్ ఉదంతంతో జగన్ కు దక్కిన దేశవ్యాప్త ప్రచారానికి అడ్డుకట్ట వేయలేకపోయింది.
ప్రభుత్వం కోరుకున్నట్టుగానే విశాఖలో భాగస్వామ్య సదస్సు అట్టహాసంగా మొదలై, విజయవంతంగా ముగిసింది, కొవ్వొత్తుల ర్యాలీని అనుమతించినా ఇలానే జరిగి వుండేదన్న వ్యాఖ్యానాల నడుమ.
జగన్ ర్యాలీకి రాకూడదని ప్రభుత్వం కోరుకుంది. ప్రభుత్వం కోరుకున్నట్టుగానే  జగన్ ర్యాలీకి హాజరుకాలేకపోయారు. అది ప్రభుత్వ వ్యూహాత్మక విజయం.
జగన్ కోరుకున్నట్టుగా మీడియాలో విస్తృత ప్రచారం లభించింది. అది ఆయనకు అయాచితంగా  దక్కిన గెలుపు.
ప్రత్యేకహోదా అంశంపై జరుగుతున్న రాజకీయ పోరులో తాత్కాలికంగానే అయినా  విజయం ఎవరిని వరించింది? ఎవరు జితులు? ఎవరు పరాజితులు? చంద్రబాబు వ్యూహం ఫలించిందా? జగన్ ఎత్తుగడ జయించిందా? ఈ ప్రశ్నలకు ఎవరి జవాబులు వారు చెప్పుకుంటున్నారు. కానీ నిజానికి గెలిచింది  మాత్రం రాజకీయం.
వర్తమానం నుంచి గతంలోకి తొంగి చూస్తే ఇందుకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. మరెన్నో  పోలికలు కానవస్తాయి.              
ముందు గత గురువారం ఏం జరిగిందో చూద్దాం.  
విశాఖ విమానాశ్రయం.
ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహనరెడ్డి తన బృందంతో విమానం దిగగానే అడ్డుకున్న పోలీసులు. నిరసనగా రన్ వే  పైనే భైఠాయించిన జగన్ బృందం. పోలీసులతో వాగ్వివాదం. అధికారంలోకి రాగానే సంగతి గుర్తు పెట్టుకుంటామని పోలీసులకు హెచ్చరికలు. చివరికి జరిగింది ఏమిటి. ర్యాలీలో పాల్గొనకుండానే విశాఖ నుంచి నేరుగా విమానంలో హైదరాబాదుకు తిరుగు ప్రయాణం.
‘రన్ వే పై నిరసనలా!’ అసహనం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.
ఏడేళ్ళు వెనక్కివెడదాం.
ఔరంగాబాదు విమానాశ్రయం.
బాబ్లీ ప్రాజెక్టు ఆందోళనలో భాగంగా బస్సు యాత్రలో తెలుగుదేశం నేత, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు బృందం అరెస్టు.  వారిని స్వరాష్ట్రం పంపడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానం ఎక్కడానికి చంద్రబాబు నిరాకరణ. ఎయిర్ పోర్ట్ టార్మాక్ మీదనే  భైఠాయింపు. నచ్చచెప్పి వెనక్కి తిప్పి పంపిన పోలీసులు.
‘ఎయిర్ పోర్ట్ లో నిరసనలా? ఏవిటీ విడ్డూరం?’ నాటి పాలకపక్షం కాంగ్రెస్ నాయకుల సన్నాయి నొక్కులు.
ఆనాటి సంఘటన గురించి సుప్రసిద్ధ సంపాదకులు, పత్రికారచయిత ఐ. వెంకటరావు,  చంద్రబాబుపై  రాసిన ‘ఒక్కడు’ అనే గ్రంధంలో గుర్తు చేసుకున్నారిలా.
“మహారాష్ట్ర పోలీసులు వచ్చి ధర్మాబాద్ ఐ.టి.ఐ. ఆడిటోరియంలో వున్న టీ.డీ.పీ. నాయకులను లాగి పడేశారు. కొందరిని చితక బాదారు. ఎం.ఎల్.ఏ.లు, ఎంపీలని చూడకుండా పిడి గుద్దులు గుద్దారు.   పోలీసులు చంద్రబాబునాయుడుతో సహా ఆయన బృందాన్ని బస్సులో ఎక్కించి తీసుకువెళ్ళారు. ఎటు వెడుతున్నారో తెలియని అయోమయం. మంచి నీళ్ళు ఇవ్వలేదు, అల్పాహారం ఇవ్వలేదు. నేరుగా ఔరంగాబాదు విమానాశ్రయానికి తీసుకువెళ్ళారు. మీడియాను రానివ్వలేదు. చంద్రబాబు, మరికొందరు విమానం దగ్గరే బైఠాయింపు జరిపారు. నినాదాలు చేసారు”
దీన్నిబట్టి తెలుస్తున్నదేమిటంటే, పోలీసులు నిమిత్తమాతృలు. ఎవరు అధికారంలో వుంటే వారికి నిబద్దులు. అలా అని అందర్నీ ఒక గాటన కట్టడం కాదు. కర్తవ్యానికి ప్రాధాన్యత ఇచ్చి పోస్టింగులను గురించి  పట్టించుకోనివారు వారిలో కూడా చాలామంది  లేకపోలేదు.
మరి కొంచెం గతాన్ని తడిమితే.
ఎన్నికలకు ముందు ‘వస్తున్నా మీకోసం’ పేరుతొ చంద్రబాబునాయుడు సుదీర్ఘ పాదయాత్ర.
తన పాదయాత్రకు కాంగ్రెస్ ప్రభుత్వం  ఆటంకాలు కల్పిస్తున్నదంటూ పలు సందర్భాలలో ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.  తాము మళ్ళీ అధికారంలోకి వస్తామన్న సంగతిని తమతో సరిగా వ్యవహరించని పోలీసులు గుర్తు పెట్టుకోవాలని టీ.డీ.పీ. నాయకుల హెచ్చరికలు.
ఇంకొంచెం లోతుకుపోయి గతాన్ని మరింత స్పృశిస్తే.
టీ.డీ.పీ. హయాములో వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రతిపక్షనాయకుడిగా వున్నప్పుడు ఆయన తలపెట్టిన పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు కల్పించిన పోలీసులు. ఒక దశలో సహనం కోల్పోయి, నిజామాబాదు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వై.ఎస్.ఆర్.
ఇలా గుర్తు చేసుకుంటూ పొతే ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో దృశ్యాలు.
వీటన్నిటినీ గమనంలో వుంచుకుంటే అర్ధం అయ్యేది ఏమిటి?
రాజకీయ ప్రకటనలు, స్పందనలు, వ్యాఖ్యలు, విమర్శలు, ఆరోపణలు  అనేవి అధికారంలో వున్నప్పుడు ఒకరకంగా వుంటాయని. ప్రతిపక్షంలో వున్నప్పుడు వేరే విధంగా సాగుతాయని.
రాజకీయ నాయకులు మారరు. మారిందల్లా అధికార మార్పిడి ఒక్కటే. అదే వారినలా మారుస్తుంటుంది.
విచిత్రం ఏమిటంటే రాజకీయ నాయకులకు సమస్తం గుర్తు వుంటుంది. అయితే  వీలునుబట్టి కొన్నింటిని  మరిచిపోయినట్టు కనిపిస్తారు.
వున్న అధికారం శాశ్వతం అని పాలకపక్షం, రానున్న కాలంలో మాదే అధికారం అని ప్రతిపక్షం అనుక్షణం అనుకుంటూ, ఎదురు చెప్పిన వాళ్లకు తస్మాత్ జాగ్రత్త అంటూ  తర్జని చూపిస్తుంటాయి. అలా లేకపోతే రాజకీయాల్లో నిభాయించుకురావడం చాలా కష్టం. బడా నాయకులకే ఇది పరిమితం కాదు, గ్రామస్థాయిలో కూడా ఈ ధోరణి హెచ్చు స్థాయిలోనే వుంటుంది.
సరే! ఈ కధ ఎలాగూ ఇలాగే నడుస్తూవుంటుంది. కాకపొతే,        
‘ఆగండాగండి, మాకూ సమయం వస్తుంది, అప్పుడు మా తడాఖా చూపిస్తాం’ అని ప్రజలు అనకుండా నేతలు జాగ్రత్త పడడం అవసరమేమో! (28-01-2017)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్:  98491 30595  

3 కామెంట్‌లు:

అన్యగామి చెప్పారు...

సందర్భోచితమైన పోస్ట్. రాజకీయులకి ఏది ఎంతకాలం గుర్తుంటుందో, అధికారం శాశ్వతం కాదన్నసంగతి బాగా చెప్పారు. వాళ్ళల్లో మీవ్రాతలు చదివేవాళ్లెవరైనా ఉన్నారా?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@anyagaami_'లేరు' అని నిస్సంశయంగా చెప్పగలను. ధన్యవాదాలు

అజ్ఞాత చెప్పారు...

Congress stabbed AP from the front. Babu and Venkayya have stabbed AP in the back. Everybody has let down the people of AP. Telangana leaders and media abused them. Congress, BJP and TDP have deceived them. Very sad. Very difficult for Jagan to come to power. Babu has strong yellow media support who have the capability to assassinate the character of everybody.