8, ఫిబ్రవరి 2016, సోమవారం

మాస్కో బ్యాచ్


రేడియో మాస్కోలో పనిచేయడానికి  1987 లో  మాస్కో వెళ్లిన వాళ్ళమై,  అప్పటి సోవియట్ యూనియన్ అంగవంగ కళింగ దేశాలుగా విచ్చిన్నం అయిన చారిత్రిక సందర్భాన్ని కళ్ళారా చూసిన వాళ్ళమై, 1991 లో సకుటుంబ  సమేతంగా స్వదేశం చేరుకొని తిరిగి హైదరాబాదు ఆకాశవాణిలో ఉద్యోగ ప్రస్తానం కొనసాగిస్తున్న వేళ....
.......తాజాగా తెలియవచ్చిన విషయం ఏమిటంటే, మాస్కోలో వున్న కాలంలో  నాతొ పాటే అక్కడ ఉద్యోగరీత్యా వున్న ఐదారు  తెనుగు కుటుంబాలు కూడా హైదరాబాదులోనే స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్నాయని.
మాస్కోలోని  ఇండియన్ ఎంబసీలో పనిచేసే నేవల్ కమాండర్లు సుధీర్ పరకాల, రమా పరకాల, దాసరి రాము, అమ్మాజీ రాము,  స్టీల్  అధారిటీ  తరపున పనిచేసే  ఇంజినీర్  కే.వీ. రమణ, త్రిలోచన రమణ,  హిందూస్తాన్ ఏరో నాటిక్స్  తరపున పనిచేసే శ్రీధర్ కుమార్, విశాల శ్రీధర్ కుమార్, రాదుగ  ప్రచురణాలయంలో పనిచేసే రాళ్ళభండి వెంకటేశ్వరరావు (ఆర్వీయార్), సుందరమ్మ గారు, (ఆర్వీయార్ దంపతులు కాలం చేశారు) ప్రగతి ప్రచురణాలయంలో పనిచేసే నిడమర్తి ఉమారాజేశ్వరరావు (ప్రస్తుతం బెంగళూరులో సెటిల్ అయ్యారు)  ఇత్యాది తెలుగు సంసారులం  అందరం మాస్కోలో వున్న అయిదేళ్ళు వారంవారం భార్యా పిల్లలతో కలిసి ఒకరింట్లో కలుసుకుని,  సాయం కాలక్షేపాలతో  మగవాళ్ళు, మాటలు, ముచ్చట్లతో ఆడంగులు  పొద్దుపుచ్చడం అనేది  ఒక ఆనవాయితీగా  మారింది.మళ్ళీ ఇన్నేళ్ళకు నిన్న ఆదివారం మధ్యాన్నం లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డులో వున్న జల వాయు విహార్ లోని పరకాల సుధీర్ గారి నివాసంలో అందరం కలుసుకున్నాము. రెండున్నర దశాబ్దాలు వెనక్కి మళ్ళి,  కలబోసుకున్న కబుర్లతో, రమా పరకాల గారు స్వహస్తాలతో వండి వడ్డించిన విందు  భోజనాలతో కడుపులు, మనస్సులు నింపుకుని ’దస్విదానియా’ (రష్యన్ పదం- మళ్ళీ కలుద్దాం అని అర్ధం) అనుకుంటూ  ఎవరిళ్లకు వాళ్ళం మళ్ళాము.  
కామెంట్‌లు లేవు: