27, ఫిబ్రవరి 2016, శనివారం

ప్రభులవారి రైల్వే బడ్జెట్

సూటిగా.....సుతిమెత్తగా..........

పరిగెత్తి పాలు తాగాలా నిలబడి నీళ్ళు తాగాలాఅంటే రైల్వే మంత్రి సురేష్ ప్రభు రెండోదే ఎంచుకున్నట్టు అనిపిస్తోంది. ఆయన ప్రవేశ పెట్టిన మోడీ మార్కు రైల్వే బడ్జెట్ లో ఈ ధోరణే ద్యోతకమవుతోంది.ఏ బడ్జెట్ అయినా – అది సార్వత్రిక బడ్జెట్ కానివ్వండి లేదా రైల్వే బడ్జెట్ కానివ్వండి అది చూసేవారి కంటినిబట్టి రెండు రకాలుగా కనిపిస్తుంది. అధికార పక్షం వారికి ఆహా ఓహో’ బడ్జెట్. ఇంకా కాస్త పొగడాలని అనిపిస్తే 'అభివృద్ధికి బాటలు వేసే అద్భుతమైన బడ్జెట్'. అదే బడ్జెట్   ప్రతిపక్షం వారికంటికి  అంకెల గారడీ బడ్జెట్. ఇంకా తెగడాలని అనిపిస్తే, 'అభివృద్ధి నిరోధక బడ్జెట్'.  అయితే ఈ రెండు కళ్ళే కాదు, పైకి కనబడని  మూడో కన్ను’ మరోటి వుంది. అది ప్రజలది. అంటే ప్రయాణీకులది. అందులోనూ అతి సాధారణ ప్రయాణీకులది. కానీ వారి గోడు ఎన్నికల సమయంలో తప్ప ఎవ్వరికీ పట్టదు. తమకున్న   'మూడో కన్ను' తెరవాలంటే ఎన్నికలదాకా ఆగాలన్న 'మునిశాపంవాళ్లకు  వుంది. రైల్వే భాషలో చెప్పాలంటే వాళ్ళది 'వెయిట్ లిస్టుకేటగిరీ.
పోతే,  కొత్త రైలు ప్రస్తావన లేని మొట్టమొదటి రైల్వే బడ్జెట్ అంటూ షరా మామూలు పద్దతిలోనే ప్రతిపక్షాల వాళ్లు  విమర్శలు చేశారు.
ఈ సారి రైల్వే బడ్జెట్లో  కొత్త రైలు కూతలు లేకపోయినా చార్జీల మోతలేకుండా చేశామని, అన్ని వర్గాలవారి అవసరాలు తీర్చేవిధంగా వుందని  సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీగారే కితాబు ఇచ్చారు కాబట్టి ఇక ఎవరుఏమనుకుంటే ఏమని మంత్రిగారు భరోసాగా ఉండవచ్చు.
బడ్జెట్ పాత పద్దతిలో కాకుండా అందులో నవ్యత్వం చూపడానికి రైల్వేమంత్రి కొంత  ప్రయత్నం చేశారు. అయితేఅనేక సంవత్సరాలుగా బడ్జెట్ అంటే ఒక ఒరవడికి అలవాటుపడిన వారికి అది ఒక బడ్జెట్ మాదిరిగా కాకుండా మంత్రిగారి 'ఊహలచిత్రంగా కానరావడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీలేదు.  మోడీగారి 'స్వచ్చభారత్ఈ బడ్జెట్ లో బయో  టాయిలెట్ల రూపంలో దర్శనం ఇచ్చింది. ఇంట్లో నుంచే టికెట్ బుకింగ్ఈ టికెట్ తో రైల్లో కావాల్సిన భోజనంఆన్ లైన్ ద్వారా వీల్  చైర్ సౌకర్యంమహిళలకువృద్ధులకు కింది బెర్తుల కోటా పెంపు, స్టేషన్లలో వైఫై సదుపాయాలు, బోగీల్లో రేడియోలు, ఎన్నికల్లో కల్పించలేని ముప్పై శాతం మహిళా రిజర్వేషన్లను బెర్తుల్లో కల్పించడం, మహిళా ప్రయాణీకుల భద్రత కోసం హెల్ప్  లైన్, ఇలా ఒకటా రెండాకొత్త రైళ్ల వూసే లేని ఈ కొత్త రైల్వే బడ్జెట్ లో ఇలాటి వూసులు ఎన్నోఎన్నెన్నో.( ఈమాదిరి చిలకపలుకులు గత  ఏడాది రైల్వే మంత్రి బడ్జెట్ ప్రసంగంలో కూడా వినవచ్చాయని, వాటి సంగతి ఏమైందని   కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.)
కాకపొతే రైళ్ళలో అనునిత్యం ప్రయాణించే కోటిన్నర పైచిలుకు ప్రయాణీకుల్లో ఈ మాటలు వినని వాళ్లువాటికి అర్ధం తెలియని వాళ్లుఅసలు వాటి అవసరమే లేనివాళ్ళు అధిక సంఖ్యలో వున్నారు. ఆ జనాలకు సురేష్ ప్రభుగారు ప్రతిపాదించిన 'భోజనాలు. 'టిక్కెట్లు, ''  దుప్పట్లువీటి  అవసరమే లేదు. వారికి  కావాల్సింది సమయానికి వచ్చికడగండ్లు లేకుండా  సమయానికి గమ్యం చేర్చే ప్రయాణపు బండ్లు. వాటిల్లో కూర్చోవడానికి ఎలాగూ చోటుండదుకనీసం సౌకర్యంగా నిలబడి ప్రయాణించడానికి కాసింత వీలుంటే చాలనుకునే వాళ్లు చాలామంది. ఇలాటి  సాధారణ బోగీల్లో కూడా  మొబైల్ చార్జింగ్ సదుపాయం కల్పిస్తామని అంటున్నారుసంతోషం. అలాగేమామూలు బోగీల్లో కూడా చెత్త బుట్టలు ఏర్పాటు చేస్తామంటున్నారు. మరీ సంతోషం. ప్లాటుఫారాలపై లిఫ్టులుఎస్కలేటర్లు పెడతామంటున్నారు. మరింత సంతోషం. వాటితో పాటుప్రస్తుతం వున్న మెట్ల దారిలో ట్రాలీ సూటుకేసులు తోసుకుంటూ తీసికెళ్లగల సైడ్ వాక్ సౌకర్యం గురించి యెందుకు ఆలోచించరుఈరోజుల్లో అనేకమంది ప్రయాణీకులు రైల్వే  పోర్టర్ల మీద ఆధారపడకుండా  తోసుకుంటూ వెంట తీసుకువెళ్ళే ట్రాలీ  లగేజీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాటివారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మెట్లు ఎక్కడానికీదిగడానికీ పడుతున్న  అవస్థలు తెలుసుకోవడానికి ప్రత్యేక అధ్యయనాలు చేయించనక్కర లేదుఏ రైలు స్టేషన్ కు వెళ్ళినా ఈ దృశ్యాలు కానవస్తాయి. ఈ సందర్భంలో గతం గురించిన ఒ ముచ్చట చెప్పుకోవడం అసందర్భం కానేరదు.
పూర్వం జనతా ప్రభుత్వం హయాములో రైల్వే మంత్రిగా మధుదండావతే పని చేశారు. అప్పటి వరకు సాధారణ టూ టయర్త్రీ టయర్ బోగీల్లో పడుకోవడానికి చెక్క బల్లలు వుండేవి. దండావతే గారి పుణ్యమా అని ఆ బోగీలకు కూడా ఫోం పరుపులు అమర్చారు. ఆ ఒకే ఒక్క నిర్ణయంతో సామాన్యులు కూడా తామూ సమాజంలో ఎదుగుతున్నాం అనే ఉన్నత భావనకు లోనయ్యారు. సామాన్యులకు దగ్గరకావడం అంటే ఏమిటోఎలానో నాటి రైల్వే మంత్రి దండావతే చేసి చూపించారు.  సురేష్ ప్రభుమోడీ గార్లకు ఆ సంకల్పం కలగాలే కాని ఇటువంటివి చాలా చెయ్యవచ్చు.     
నిజానికి రైలుబళ్ళు యావత్ భారతానికి నకళ్ళు. ఇంట్లోవొంట్లో పుష్కలంగా వున్న వాళ్ళకోసం రాజులుమహారాజులు కోరే సకల  సౌకర్యాలతో 'ప్యాలెస్ ఆన్ వీల్స్అనే పేరుతొ పట్టాలపై నడిచే  రాజప్రసాదాలు మనదేశంలో ఇప్పటికే  వున్నాయి. 'ఎప్పుడు వస్తుందో తెలియనిఎప్పుడు గమ్యం  చేరుతుందో తెలియనిఅతి మామూలు పాసింజర్ రైళ్ళు కూడా అదే పట్టాలపై తిరుగుతుంటాయి. అసలు సిసలు భారతానికి ఇదొక నమూనా. ఇక మధ్య తరగతిఎగువ మధ్య తరగతిదిగువ తరగతి వాళ్లందరూ వేరు వేరు బోగీల్లో ఒకే రైలులో ప్రయాణిస్తుంటారు. వారి భాషలు వేరుసంస్కృతులు వేరుమాటతీరు వేరుఅయినా ఒక  కుటుంబం మాదిరిగా రైలు బండ్లు వారిని కలిపి వుంచుతాయి. రైల్వేలు మాత్రం వారిని వేరువేరుగా చూస్తాయి. పక్కపక్కనే వున్నా వారి పక్కలు వేరువారికి కల్పించే భోజన వసతులు వేరు. ఇదంతా వారు చెల్లించే టికెట్టు ధర నిర్ణయిస్తుంది.  కొందరేమో  శబ్దం చెయ్యని ఏసీ బోగీల్లో దుప్పట్లు కప్పుకుని వెచ్చగా పడుకుని వెడుతుంటేఅదే రైల్లో మరో సాధారణ బోగీలో కాలు చేయీ కదపడానికి  కూడా వీల్లేని స్తితిలో మరికొందరు ప్రయాణం సాగిస్తుంటారు. అచ్చమైన భారతానికి అచ్చమైన నకలు ఏదైనా వుందంటే అది మన దేశంలోని రైలుబండేసందేహం లేదు.
కాకపోతే, సురేష్ ప్రభుగారి విషయంలో ఒక విషయం మాత్రం ఒప్పుకుని తీరాలి. బడ్జెట్ రూపకల్పనలో ఎక్కడా తన సొంత రాష్ట్రం 'మహారాష్ట్రకు ఏదో ఒరగబెట్టాలని యెంత మాత్రం అనుకోలేదు. ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ఈ ఒక్క విషయంలో  వెనుకటి మంత్రులతో పోలిస్తే ఈయన చాలా మెరుగు.
గతంలో రైల్వే మంత్రులగా పనిచేసినవాళ్ళల్లో చాలామంది 'తమ' ప్రాంతాల 'పాల రుణం' తీర్చుకోవడానికి నిస్సిగ్గుగా రైల్వే బడ్జెట్ ని ఉపయోగించుకున్నారు. వీరిలో బెంగాల్ ఆడపులి మమతా బెనర్జీ, బీహారు రాజసింహం లాలూ పేర్లే ముందు చెప్పుకోవాలి. యూపీయే హయాములో మమత బెనర్జీ  'రైలు భవన్ మహరాణీగా ఓ వెలుగు వెలిగినప్పుడు,  రైల్వే బడ్జెట్ లో సింహభాగాన్ని తూర్పువెళ్ళే రైలు  ఎక్కించేసి  చేతులు దులుపుకున్నారు.  పశ్చిమ బెంగాల్ పై వరాలవర్షం కురిపించి అందరూ ఆశ్చర్యంతో హౌరా’ అని నోళ్ళు వెళ్ళబెట్టేట్టు చేసారు. అల్లాగే, లాలూ ప్రసాద్ యాదవ్ మహాశయులు. రైల్వే మంత్రిగా వున్నప్పుడు ఆయన తన అధికారాన్ని ఉపయోగించి ఏకంగా  అత్తవారి వూరికే ఒక రైలును వేయించారని ప్రతీతి. 'సొంత రాష్ట్రానికిసొంత జనానికి ఏమి చేస్తే ఏమి తప్పుపడతారో' అని సంకోచించే నిత్య శంకితులకు మాత్రం నిజంగా  ఇది కనువిప్పే.

సరే అదలా వుంచికొత్తగా పురుడు పోసుకున్న తెలుగు రాష్ట్రాల సంగతికి వస్తే- - 
రైల్వే మంత్రి సురేష్ ప్రభు పార్లమెంటుకు సమర్పించిన ఈ బడ్జెట్ఈ రెండు ప్రాంతాల ప్రజలను మాత్రం  ఉసూరుమనిపించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వున్న చంద్రబాబు. కేసీఆర్ ఇరువురూ ఈ విషయంలో తమ బాధ్యతను ఏమాత్రం విస్మరించలేదు. ఢిల్లీ పెద్దలకు ముందస్తుగానే శాయంగల విన్నపాలు చేసుకున్నారు. ‘ఈ బడ్జెట్ లో కాస్త కనికరం చూపండి మహాప్రభూ' అంటూ, అనేక సార్లు ఢిల్లీ ప్రదక్షిణాలు చేసి రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు.  కానీ ప్రభువులు కరుణించింది లేదు.        
ఈసారి తెలుగు రాష్ట్రాలకు  అనుకున్న రీతిలో రైల్వేమంత్రి పూర్తి స్థాయిలో  న్యాయం చేయలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.  విశాఖ కేంద్రంగా  కొత్త రైల్వే జొన్ గురించి ప్రకటన వెలువడగలదని ఆశించిన వారికి మళ్ళీ  నిరాశే ఎదురయింది. అల్లాగేదశాబ్దాల తరబడి నానుతూ వస్తున్న కాజీపేట కోచ్ ఫాక్టరీ వ్యవహారం.
అయితే, ముందే చెప్పినట్టు ఈ బడ్జెట్ ని ప్రజల దృక్కోణంలో నుంచి పరిశీలిస్తే ఒకింత వూరట కలిగించే పద్ధతిలో వుందనే చెప్పాలి. వాళ్ళమీద కొత్త భారాలేవీ మోపలేదు. చార్జీలు ఏమీ పెంచలేదు. ఇదొక ఉపశమనం అనుకోవాలి.  
ఒకటి మాత్రం నిజం. ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’ ‘ఎక్కిన రైలు గమ్యం చేరుతుందా లేదా అనే డౌటు’ ప్రయాణీకులకు లేకుండా చేయగలిగితే ఆ బడ్జెట్ సార్ధకమైనట్టే లెక్క. అలాగే,  రైలెక్కిన ప్రయాణీకుడి పేరు ముందు 'లేటు' అని రాయాల్సిన అవసరం లేకుండా  భద్రతకు భరోసా ఇవ్వగలిగితే మరీ గ్రేటు.

ఉపశృతి:
సాంఘిక మాధ్యమాల్లో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య కనిపించింది. “రైలు చార్జీలు పెంచలేదు సరే, కనీసం టాయిలెట్లలో మగ్గుకు తగిలించి వుండే గొలుసునన్నా అవసరానికి తగినట్టు పెంచితే బాగుంటుంది”

NOTE: Courtesy Image Owner

రచయిత ఈ  మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595   


1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Mamata, Lalu, Jaffer shareif etc. only developed railways in home states. Tamil Nadu smart guys always got good trains and projects by black mailing and arm twisting the central govt. Only bakara states like AP were left high and dry.

The projects take decades to complete. When the salary bill of employees is more than the income, how can the projects be completed. In this scenario, the proposal for high speed trains looks foolish. No wonder, there is a proposal to welcome passengers with rose flowers which can be kept in our ears.