3, ఫిబ్రవరి 2016, బుధవారం

కాపులు, కరివేపాకులా?

సూటిగా.........సుతిమెత్తగా.....

సమస్యల అమావాస్యల నడుమ కొట్టుమిట్టాడుతున్న ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇప్పుడు మరో కొత్త సమస్య కాపుల రిజర్వేషన్ల రూపంలో వెంటాడుతోంది.
గతంలో ఒకసారి చెప్పుకున్నట్టు, పదేళ్ళ అధికార వియోగం తరువాత ముఖ్యమంత్రి అయ్యారు అన్న ఒక్క విషయాన్ని మినహాయిస్తే ఈసారి చంద్రబాబు నాయుడు ఆ  పదవిలో పట్టుమని పది రోజులుకూడా కంటినిండా నిద్రపోయిన దాఖలా లేదు. లోగడ రెండు దఫాలు ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కేంద్రంలో అనుకూల ప్రభుత్వాలు ఉండేవి. అనుకూలమే కాదు దాదాపు ఆయన చెప్పుచేతల్లో వుండేవవి జనం చెప్పుకునేలా ఆయన హస్తినలో చక్రం తిప్పేవారు. ఇక సొంత రాష్ట్రంలో ఆయన మాటలకు, చేతలకు ఎదురులేని పరిస్తితి. విదేశాల్లో వుండే ఆంధ్రులకు ఆయన ఆరాధ్య దేవత. ఈ ఒక్క విషయంలో మాత్రం ఆయన ప్రభ ఇంకా అలాగే వుంది. మొదటి రెండు అంశాలే కొంత తలనొప్పి కలిగిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో వున్నది సాక్షాత్తు మిత్ర పక్షమే అయినా మునుపటి హవా సాగడం లేదనే చెప్పాలి. పొతే రాష్ట్రంలో పొద్దున్న లేస్తే చీకాకు పెట్టే ప్రతిపక్షం. చెప్పుకోవడానికి, సర్దిచెప్పడానికి ప్రత్యమ్నాయ రాజకీయ పక్షాలు లేకపోవడం. వెరసి ఇవన్నీ చంద్రబాబుకు గత కాలపు భోగాలను కేవలం జ్ఞాపకాలుగా మిగిలిస్తున్నాయి.
చంద్రబాబును చుట్టుముట్టి వేధిస్తున్న సమస్యల్లో కొన్ని ఎన్నికల హామీల రూపంలో స్వయం కృతాలు అయితే,  మరికొన్ని ఆయన ప్రమేయం లేకుండా వచ్చిపడ్డవి. తాజాగా మీదపడ్డది కాపుల రిజర్వేషన్ సమస్య.
ఇది చాలా సున్నితమైన సమస్య అని ఆయనకూ తెలుసు. ‘కరవమంటే కప్పకు కోపం, వద్దంటే పాముకు కోపం’  మాదిరి.
తమని  బీసీల్లో కలపాలన్నది కాపు కులస్తుల  డిమాండు. అందులో కూడా ఔచిత్యం లేకపోలేదు. నిజానికి కొన్ని దశాబ్దాల క్రితం వరకు కాపులు ఈ రిజర్వేషన్ల సదుపాయం అనుభవిస్తూ వచ్చారు. గతంలో ఒక ముఖ్యమంత్రి ఒక్క కలం పోటుతో దీన్ని తొలగించారు. అప్పటి  నుంచి లోలోపల రగులుతూ వచ్చిన కాపుల ఆందోళన, విజయ భాస్కర రెడ్డి హయాములో ఇచ్చిన ఒక జీవోతో కొంతవరకు సమసిపోయింది. అయితే, రిజర్వేషన్లు యాభయ్ శాతం మించకూడదన్న నిబంధన కారణంగా   ఆ జీవో చెల్లుబాటు కాదని న్యాయస్థానాలు తేల్చడంతో  కధ మళ్ళీ  మొదటికి వచ్చింది. సాధికారిక కమీషన్ సర్వే చేసి ఇచ్చే నివేదిక ఆధారంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు  అలాటి వారిని  బీసీ రిజర్వేషన్ జాబితాలో చేర్చవచ్చని కోర్టు ఒక వెసులుబాటు కల్పించడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఈ అంశాన్ని తన ఎన్నికల ప్రణాళికలో చేర్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ హామీ చక్కని సానుకూల ఫలితాలను ఇచ్చిన విషయాన్ని  చంద్రబాబు  పలుసందర్భాల్లో చెప్పుకున్నారు కూడా.  అధికారానికి రాగానే కమిషన్ వేసి దాని నివేదిక ప్రాతిపదికగా  రిజర్వేషన్లు కల్పిస్తే న్యాయపరమయిన చిక్కులు ఎదురుకావని ఆలోచన చేసిన టీడీపీ అధినేత   చంద్రబాబు,  కొంత కాలయాపన జరిగినప్పటికీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక కమీషన్ ఏర్పాటు చేసి, ఆరు మాసాల్లో నివేదిక ఇమ్మని కోరారు.   కాపుల అభివృద్ధి సంస్థను కూడా ఏర్పాటు చేసి కొన్ని నిధులు కేటాయించారు. పదవిలోకి వచ్చి ఇరవై మాసాలు గడిచిపోతుంటే ఇంకా అరకొర నిధులతోటే సంస్థను ఏర్పాటుచేసి కాలక్షేపం చేస్తున్నారని, తమ రిజర్వేషన్ల డిమాండు నెరవేర్చే విషయంలో ప్రభుత్వం తాత్సార వైఖరి అనుసరిస్తోందని కాపుల్లోని  ఒక వర్గంలో అసహనం మొదలయింది. కొందరయితే ఏకంగా కరివేపాకు సామ్యం తెచ్చారు. ఈ రకమైన ఆలోచనలు చేసేవారికి, కాపుల్లో బలమయిన పట్టున్న వ్యక్తి,  నిష్కళంక రాజకీయ నాయకుడు అని జనంలో ముద్ర వున్న మాజీ మంత్రి, ఒకప్పటి టీడీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం నాయకుడిగా లభించారు.ఆయన ఇచ్చిన పిలుపు మేరకు తునిలో జరిగిన కాపు గర్జన సభకు భారీ సంఖ్యలో కాపు మహా జనం తరలివచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఉద్దేశించిన  ఈ గర్జన సభ, అవాంచిత పరిణామాలకు తెర తీసింది. తుని సమీపంలో సభ జరుగుతున్న ప్రదేశానికి దగ్గరలో రైలు మార్గంపై వెడుతున్న రత్నాచల్ ఎక్స్ ప్రెస్ బండిని నిలిపివేసి  దానికి నిప్పు పెట్టారు. అ రైలు బోగీలన్నీ పరశురామప్రీతి అయ్యాయి. ఆ తరువాత రెచ్చిపోయిన అల్లరి మూకలు తుని పోలీసు స్టేషన్లపై దాడికి దిగి తగులపెట్టాయి. ఈ దృశ్యాలను  టీవీల్లో  చూసిన వారికి  అక్కడి పరిస్తితుల తీవ్రత కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఈ హఠాత్పరిణామాలతో ఇటు  ప్రజానీకం,  అటు ప్రభుత్వం దిమ్మరపోయాయి. ఒకే ఒక అదృష్టం ఏమిటంటే, ఇంతటి భయానక సంఘటనలు జరిగినా కూడా ఎలాటి ప్రాణనష్టం లేకపోవడం. ఉద్యమం హింసారూపం ధరించడంతో ముద్రగడ పద్మనాభం, రైలు రోఖో, రాస్తా రోఖో కార్యక్రమాలను విరమించారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.
ఆ తరువాత పరిణామాలు కూడా రాజకీయ రంగు పులుముకుని చకచకా జరిగిపోయాయి. అన్ని పార్టీలు రంగప్రవేశం చేసాయి. వారి వారి  ప్రయోజనాలకు అనుగుణంగా ప్రకటనలు చేసారు, భాష్యాలు చెప్పారు. ఆరోపణలు,  ప్రత్యారోపణలతో మీడియా మార్మోగింది.  పాలక, ప్రతిపక్షాలు అన్నీ ఈ విషయంలో ఒక అడుగు మాదే ముందు అనే రీతిలో వ్యవహరించాయి. తమదే పైచేయి అనిపించుకోవాలనే చూశాయి. సొంత ప్రయోజనాలకోసం దీర్ఘకాలిక సమాజ ప్రయోజనాలను పక్కనపెట్టాయి. ఆరోపణలు, నిందారోపణలు పరిస్తితులను మరింత జటిలం చేస్తాయి తప్ప పరిష్కారానికి పనికిరావన్న వాస్తవాన్ని  ఉభయులు పరిగణనలోకి తీసుకుంటున్నట్టు లేదు.
ముందే చెప్పినట్టు ఇది చాలా సున్నితమైన సమస్య. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేయాలని రాజకీయ పార్టీలు చెబుతుంటాయి. అదెలా సాధ్యమో మాత్రం చెప్పవు.  పై పంచ గాలికి ఎగిరి దారి పక్కన ముళ్ళకంచెపై పడినప్పుడు, పంచె చిరగకుండా ఎలా జాగ్రత్తగా బయటకి తీయాలో అంతటి చాకచక్యాన్ని ప్రదర్శించాల్సిన సందర్భం ఇది. 
కాపుల ఆందోళన ఇంకా ఒక కొలిక్కి రానేలేదు. వారింకా ఆందోళన పధం వీడి వచ్చేట్టు లేరు. ఇంత జరిగాక కూడా వారు ముందు ముందు  చేయాల్సిన కార్యాచరణ గురించే ఆలోచిస్తున్నట్టు కానవస్తోంది.  కాపు గర్జన పిలుపు  ఇచ్చిన  ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షకు పూనుకుంటామని అంటున్నారు. దీనికి తోడు, అటు బీసీలు కూడా భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. తమ రిజర్వేషన్లలో కాపులను చేర్చే ఏ ప్రతిపాదన కూడా తమకు సమ్మతం కాదని విజయవాడలో సమావేశమైన ఇరవై అయిదు బీసీ సంఘాలు తేల్చిచేప్పినట్టు భోగట్టా. ప్రభుత్వం ‘కిం కర్తవ్యమ్?’ దశలో వుంది. కాపుల డిమాండు ఒప్పుకుంటే బీసీలతో పోరు తప్పని స్తితి. అందుకే, బీసీలు అభ్యంతరం చెప్పని విధంగా, కోర్టులు  తప్పుపట్టని తీరులో  పరిష్కార మార్గం కోసం  చంద్రబాబు సర్కారు కసరత్తు చేస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం కూడా విజయవాడలో సమావేశమై ఈ అంశాన్ని చర్చించింది. ఈ వ్యాసం రాసే సమయానికి అదింకా కొనసాగుతోంది.
తుని దుర్ఘటన జరిగిన రోజునే బెజవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.    
ఈ సమస్యపై తమ ప్రభుత్వం ఆలోచనా సరళిని ఆయన సుదీర్ఘంగా వివరించారు. కోర్టు తీర్పులను ఉదహరించారు. తమ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని ప్రస్తావించారు. జీవో ఇవ్వడం వల్ల ఎదురయ్యే కోర్టు సమస్యలను విశదం చేసారు. కొన్ని రాజకీయ ఆరోపణలు చేసినప్పటికీ, తుని సంఘటన ఆయన్ని కలవరపరచినట్టు ఆయన ముఖకవళికలే తెలియచేస్తున్నాయి. తాను చేయాల్సింది అంతా చేస్తున్నా కొందరు  తనని సరిగా అర్ధం చేసుకోవడం లేదన్న ఆవేదన కూడా చంద్రబాబునాయుడు మాటల్లో ధ్వనించింది. ‘ఏం చెయ్యమంటారో మీరే చెప్పండి’ అని విలేకరులను ప్రశ్నించిన తీరు ఇందుకు అద్దం పడుతోంది.
ఒక్కటి మాత్రం సుష్పష్టం. ఈ విషయంలో రాజకీయం ఎవరు చేసినా, ఒకరినొకరు ఆరోపించుకుంటున్నట్టు, అది ప్రతిపక్షం కావచ్చు, లేదా పాలక పక్షమేకావచ్చు, అది అమానుషమే. ఎందుకంటే అన్యోన్యంగా జీవిస్తున్న వివిధ కులాల మధ్య ఆర్పలేని చిచ్చును ఇటువంటి చర్యలు ప్రేరేపించే  ప్రమాదం హెచ్చుగా  వుంది.  కొత్తగా ఊపిరిపోసుకున్న నవజాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతమాత్రం మంచిది కాదు. సమస్యతో సంబంధం వున్న వారందరూ మనసులో పెట్టుకుని వ్యవహరించాల్సిన ‘హెచ్చరిక’ ఇది.     
ప్రభుత్వం ముందు రెండు ప్రత్యామ్నాయాలు.  నివేదికను త్వరగా ఇమ్మని కమిషన్ ను వేగిరపరచడం. కాపు కార్పోరేషన్ కు ఇతోధికంగా నిధులను మంజూరు చేసి వారిని సంతృప్తి పరచడం. లేదా కాపుల్లో ఒక వర్గం కోరుతున్న విధంగా, తదుపరి న్యాయపరమైన  పర్యవసానాలు ఎలావున్నప్పటికీ, ప్రస్తుతానికి ఒక జీవో ఇచ్చి చేతులు దులుపుకోవడం. అన్నింటికీ  మించి ఈ సమస్యను రాజకీయ కోణం నుంచి కాకుండా ఆలోచించి సమస్యతో సంబంధం వున్న నలుగురినీ కలుపుకుని రాజకీయాలకు అతీతంగా ఒక పరిష్కార మార్గాన్ని అన్వేషించడం. చర్చల ద్వారా సమస్యల పరిష్కారమే ప్రజాస్వామ్య వ్యవస్థలో చక్కని రాజమార్గం.
సమాజంలో రిజర్వేషన్ల అవసరం దేశానికి స్వతంత్రం వచ్చిన ఇన్ని దశాబ్దాల తరువాత కూడా వుందంటే ఎక్కడో లోపం వుందనుకోవాలి. అణగారిన, వర్గాలను సమాజంలో మిగిలిన వారి సరసకు చేర్చడం కోసం  ఉద్దేశించిన ఈ రిజర్వేషన్లు ఇప్పటికి కూడా  ఆశించిన లక్ష్యాలను, కోరుకున్న స్థాయిలో  సాధించలేదు అంటే, ఆ తప్పు ఎవ్వరిదనుకోవాలి? నిస్సంశయంగా అది పాలకులదే!. ఇది నిర్వివాదాంశం.
ఉపశృతి: రిజర్వేషన్లు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోయినా, వాటివల్ల ఇన్నేళ్ళ కాలంలో అణగారిన వర్గాల్లోని  చాలామంది,  జీవితంలో ఒక స్థాయికి చేరుకున్న మాట కూడా కాదనలేని వాస్తవం. అటువంటి వారు తమ సాటి బడుగులపట్ల కొంత ఔదార్యం ప్రదర్శించడం వల్ల రిజర్వేషన్ ఫలాలను  మరి కొందరు అర్హులయిన వాళ్ళు అనుభవించడానికి అవకాశం  లభిస్తుంది. ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో ఇదే మాదిరి ‘గివ్ అప్’ ప్రచారం సాగుతోంది. రిజర్వేషన్ల వల్ల సమాజంలో పెద్ద స్థాయికి చేరుకున్న వారు, ఇందుకు పెద్దమనసుతో సహకరిస్తే, ప్రస్తుతం అందుబాటులో వున్న టెక్నాలజీని అందుకోసం ఉపయోగించుకోవచ్చు. రైళ్లల్లో  బెర్తులను కేటాయించడానికి ‘ఆటోమేటిక్  అప్  గ్రెడేషన్’  విధానాన్ని వినియోగిస్తున్నారు. రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం పొందిన వారి నుంచి , అర్హత కలిగిన ఇతరులకి దాన్ని బదిలీ చేయడానికి ఈ విధానం ఉపయోగపడుతుందేమో పరిశీలించాలి. తద్వారా  ‘కొందరికే అన్నీ  కాదు, అందరికీ అన్నీ’ సగర్వంగా చెప్పుకోవచ్చు.   ఆలోచిస్తే పోయేదేమీ లేదు, కాసింత సమయం తప్ప.
ఏలికలు ఆలోచించాలి. (03-02-2016)

This article in SURYA today:'రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595 


12 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

సమస్య మూలాలు వేరేనండీ. గతంలో కాపులకు బీసీ హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకించిన కృష్ణయ్య ఇప్పుడు టీడీపీలో చేరారు. ఆంధ్రలో కాపులకు బీసీ హోదా వాగ్దానం టీడీపీ అధికారం రావడంలో ఎలా తోడ్పడిందో తెలంగాణాలో బీసీ ముఖ్యమంత్రి (ఉరఫ్ క్రిష్ణయ్యకు సింహాసనం) అనే హామీ కూడా పార్టీ కుప్పకూలకుండా కాపాడింది. రేపోమాపో కాపులకు బీసీ హోదా ఏదోరకంగా ఇచ్చినా కూడా ఇదే కృష్ణయ్య గొడవ చేయడం ఖాయం, ఈ విషయాన్ని తెర వెనుక నుండి చంద్రబాబు చేయిస్తున్నట్టు కాపులకు అనిపించడం అంతే ఖాయం.

ఎన్నికల తరువాత కృష్ణయ్య టీడీపీతో అంటీఅంటనట్టే ఉంటున్నా, ఆయనపై చర్య తీసుకోవడం ఆత్మహత్యా సాదృశ్యం కావోచ్చును. అలాగని ముద్రగడతో తలపడడం కూడా సమానంగా కష్టం. చంద్రబాబు అందుకే ఆవు వ్యాసం తరహాలో జగన్ మీద విరుచుకు పడ్డారు. పనిలో పనిగా పవన్ కళ్యాణ్ గారిని స్వామిరక్షణా కార్యానికి పురమాయించారు.

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
నీహారిక చెప్పారు...

@Jai,

>>పనిలో పనిగా పవన్ కళ్యాణ్ గారిని స్వామిరక్షణా కార్యానికి పురమాయించారు<<
ఎపుడూ ఎవరో ఒకరిని బ్లేం చేయకుండా కాస్త డిఫరెంట్ గా మాట్లాడండీ !

అజ్ఞాత చెప్పారు...

ఈ సంఘటన జరగడం వలన లాభం ఎవరికి, నష్టం ఎవరికి? కొంతకాలం క్రితం దాకా రాజకీయనాయకులు అవకాశం కొరకు వేచి చూసేవాళ్ళు ఇప్పుడు అవకాశాలు వాళ్ళే సృష్టించుకుంటున్నారు.

’వాచస్పతి’ చెప్పారు...

కాపులు ఆత్మావలోకన చేసుకోవాలి.

’వాచస్పతి’ చెప్పారు...

కాపులు ఆత్మావలోకన చేసుకోవాలి.

hari.S.babu చెప్పారు...

ఓపెన్ కాంపిటీషన్ క్యాతగిరీని పూర్తిగా ఎత్తేసి దామాషా ప్రకారం అన్ని కులాలకీ రిజర్వేషన్లు వర్తింపజేస్తే పోలా:-)

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

Excellent idea Haribabu గారూ. caste-based రిజర్వేషన్లు మొత్తం ఎత్తివేసే ధైర్యం లేనప్పుడు మొత్తం ఓపెన్ కాటగిరీని ఎత్తివేయడం ప్రశస్తమయిన ఆలోచన.

Jai Gottimukkala చెప్పారు...

హరిబాబు & నరసింహారావు గార్లూ,

బీసీ రిజర్వేషన్ల ఏకైక లక్ష్యం ఒక్కటే: విద్యా తదితర ముఖ్య రంగాలలో సరయిన మోతాదులో ప్రాతినిధ్యం లేని వర్గాలకు వెసులుబాటు కల్పించడం. ఇది దామాషా స్థాయి కంటే తక్కువే ఉంటుంది, ఉండాలి కూడా.

The idea is only to partially compensate grossly under represented SEBC.

Chaitanya చెప్పారు...

"ఓపెన్ కాంపిటీషన్ క్యాతగిరీని పూర్తిగా ఎత్తేసి దామాషా ప్రకారం అన్ని కులాలకీ రిజర్వేషన్లు వర్తింపజేస్తే పోలా" - చాలామంది చెప్పారు ఈ మాట. ప్రభుత్వమే వినటం లేదు. అలా చేస్తే ఏ కులమూ పక్క కులం గురించి ఏడవదు. అవకాశం దొరకని ప్రతివారు తమ కులంలోనే ఉన్న క్రీమీలేయర్ మీద పడతారు, అన్నీ మీరే బొక్కేస్తున్నారని. అప్పుడు క్రీమీలేయర్ గురించి కోర్టులు మొత్తుకోనక్కర్లేదు, ప్రతి కులంలో పేదజనాలు కొట్టి పెట్టిస్తారు. మన కమ్యూనిస్టులు ఈ ఐడియాని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే దీని వల్ల వాళ్ళకి చాలా కన్ఫ్యూసింగ్‍గా ఉన్న కులపోరాటాలు తగ్గి, ప్రతి కులంలో వాళ్ళకిష్టమైన వర్గపోరాటం మొదలౌతుంది.

Jai Gottimukkala చెప్పారు...

ముస్లిం రిజర్వేషన్ల కేసు (మురళీధర్ రావు వెర్సెస్ ఆంద్ర ప్రదేశ్) తీర్పులో హైకోర్టు ఇలా పేర్కొంది:

"The Commissionerate in its study report found that the total number of employees at different levels of employment in Kurnool District is 31,523 of which Muslims are 3,978 comprising 12.6% as against their 16.95% share in the population of the district. The Commissionerate proceeded on the assumption that adequate representation means proportional representation. It is needless to restate that adequate representation does not mean proportional representation"

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Jai Gottimukkala - Thanks for your additional inputs.