11, ఫిబ్రవరి 2016, గురువారం

ఆయారాం గయారాం


‘జనత పార్టీ’  ప్రయోగం విఫలం అయిన తర్వాత, 1980 లో ఇందిరాగాంధీ తిరిగి కేంద్రంలో  అధికారంలోకి రాగానే, ఆనాటి హర్యానా ముఖ్యమంత్రి భజన్ లాల్  రాత్రికి  రాత్రే పార్టీ మార్చి, ‘సహేంద్ర తక్షకాయస్వాహా’ మాదిరిగా తన కేబినేట్ మంత్రులు, తన  పార్టీ  ఎమ్మెల్యేలతో సహా కాంగ్రెస్ (ఐ) లో చేరిపోయిన సందర్భంలో, నాటి మరాఠా రాజకీయ నాయకుడు ఎస్.బీ. చవాన్ ‘రాజకీయ కప్పదాట్లకు కొత్తగా చేసిన నామకరణమే ఈ  ‘ఆయారాం గయారాం’. అప్పటినుంచి ఈ రాజకీయ విష సంస్కృతి మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొత్త రెమ్మలు తొడుగుతూనే వస్తోంది. 
ఈ అభివృద్ధి రేటు పెరుగుదల చూసి దేశంలో రాజకీయ పార్టీలు అదిరిపోతున్నాయి. కోడి మనదే, కోడిని ఉంచిన గంప మనదే అనే ధైర్యం పోతోంది. గంప గంప లాగానే వుంది. కోళ్ళు మాత్రం మాయం అవుతున్నాయి. అందుకే కాబోలు పార్టీ టిక్కెట్టు మీద గెలిచిన వాళ్ళు తమ కట్టు దాటిపోకుండా అనేక ఎత్తులు వేస్తున్నాయి. ‘ఆయారాం గయారాం’ బెడద తప్పించుకోవడానికి మేఘాలయ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం, ‘యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీ’   ఒక కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. అదే ‘నయా రాం’.దీనికింద పార్టీ టిక్కెట్టు ఇచ్చేముందే అభ్యర్ధులతో, ఇండియన్ కాంట్రాక్ట్ ఆక్ట్ కింద  బాండు మీద సంతకం చేయించుకుంటారు, అయిదేళ్ళ వరకు పార్టీ ఒదిలి వెళ్ళమని. కానీ రాజకీయాల్లో స్కాచి వడబొసిన ధిగ్గనాధీరులు, యేరు దాటగానే బోడి మల్లయ్య’ అనడం నేర్చిన వాళ్ళు ఈ  బండ్లు, సంతకాలు లెక్కపెడతారనుకోవడం అమాయకం. 1972 లో అస్సాం నుంచి విడిపడి ఏర్పడ్డ మేఘాలయ రాష్ట్రంలో గత నలభయ్ ఏళ్ళ కాలంలో అక్షరాలా ఇరవై నాలుగు ప్రభుత్వాలు ‘ఆయారాం గయారాం’ సంస్కృతి కారణంగా మారాయి. రెండు సార్లు రాష్ట్రపతి పాలన అదనం.
ఇలా చెప్పుకుంటూ పొతే చాలా వున్నాయి ఈ కబుర్లు.   
ఈ రాజకీయ కప్పదాట్లు అనేవి మన దేశానికీ, మన ప్రాంతాలకు  మాత్రమే పరిమితం కాదు. అనేక దేశాల్లో ఈ సంస్కృతి రెక్కలు విప్పుకుని విస్తరిస్తోంది. ఉదాహరణకు  నైజీరియా. వచ్చే ఏడాది అక్కడ జరిగే ఎన్నికల మాటేమో కానీ రాజకీయ నాయకుల  పార్టీ మార్పిళ్లు మాత్రం చాలా వేగంగా పెద్దఎత్తున సాగుతున్నాయి. లేబర్ పార్టీ అభ్యర్ధిగా గెలిచి గవర్నర్ అయిన ఒలుసేగం మిమికో  గాలివాటం చూసుకుని ఆ పార్టీకి  రాం  రాం చెప్పేసారు. 2009 ఫిబ్రవరిలో ఆయన ఆండో స్టేట్  గవర్నర్ అయి,  తిరిగి  2012 అక్టోబర్ లో సయితం అయన అదే లేబర్ పార్టీ టిక్కెట్టు పై మళ్ళీ గెలిచి మళ్ళీ  గవర్నర్ కాగలిగారు. ఆ రాష్ట్రానికి  ఇలా రెండోసారి వరుసగా గవర్నర్ అయిన వారు ఎవ్వరూ లేరు. లేబర్ పార్టీ పుణ్యమా అని అలాటి రికార్డు అయన సొంతం అయింది.  కానీ మిమికో ఈసారి, రెండేళ్ళు తిరక్కముందే  రూటు మార్చి పాలకపక్షం పీపుల్స్  డెమోక్రటిక్ పార్టీలో  దూరిపోయి తన అదృష్టాన్ని మరో రకంగా పరీక్షించుకునే పనిలోపడ్డారు. ఇలా పార్టీ మార్చిన మిమికో మహాశయులను పీ.డీ.పీ. కూడా సగౌరవంగా పార్టీలోకి స్వీకరించి ఇటువంటి విషయాల్లో తనకెలాంటి భేషజాలు లేవని రుజువు చేసుకుంది.
'పిల్లి  తను  చనిపోయేలోగా ఏడు (గండాలు) చావులు తప్పించుకుంటుంది' అని ఓ  ఆంగ్లసూక్తి.  అనంబ్రా రాష్ట్ర మాజీ గవర్నర్  డాక్టర్ పీటర్ ఓబీ ఈ సామెతకు సరిగ్గా అతికినట్టు  సరిపోతారు. ఈయన గారు అధికారంలో వున్న రోజుల్లో ఆ అధికారాన్ని దుర్వినియోగం  చేయడం ఎల్లా అనే ఒక్క దానిమీదనే దృష్టి పెడతారని, వేరే ధ్యాసలు ఏవీ  పెట్టుకోరని ఆయనకో పేరుందని అంటారు. అనడం ఏమిటి ఆయనపై ఇలాటివి చాలా కేసులు వున్నాయి. ఆరోపణలు వచ్చినప్పుడల్లా పదవి పోగొట్టుకోవడం,  మళ్ళీ  కోర్టు నుంచి ఉపశమన ఉత్తర్వులు తెచ్చుకుని తిరిగి పదవి పొందడం ఆయనకు అలవాటుగా మారింది. అదేమి  చిత్రమో తెలియదు కానీ ప్రతిసారీ కోర్టు రూలింగులు ఆయనగారికి అనుకూలంగానే వచ్చేవి. అందుకే పిల్లి ఏడు  గండాలు తప్పించుకున్నట్టు ఆయనకూడా ప్రతిసారీ వొడ్డున పడగలుతున్నారు. అన్ని తెలివితేటలు ఉండబట్టే ఈ సారి ఎన్నికలకు ఏడాది ముందే ఆయన ముందు చూపుతో పాలకపక్షం పీడీపీలో చేరిపోయారు. అంతా ఇలా అధికారపక్షం  వైపు దూకుతుంటే పాలక పక్షానికి  చెందిన  నాయకుడు, ప్రస్తుత  పార్లమెంటు స్పీకర్ అయిన అమిను తంబువాల్, ఈ మధ్యనే తన సొంత పార్టీ పీడీపీ ని వొదిలి పెట్టి ప్రతిపక్షం ఏపీసీ లో చేరి  నిరుడు జరిగిన ఎన్నికల్లో గెలిచి  సోకోటో రాష్ట్ర  గవర్నర్ కాగలిగారు. 
అంటే గోడలు దూకడం వల్ల కూడా ప్రయోజనం లేకపోలేదన్న మాట. అయితే ఈ సూత్రం అన్ని సందర్భాల్లో పనిచేయకపోవచ్చు. గోడ దూకి మోకాళ్ళు విరగగొట్టుకున్న వాళ్ళు కూడా రాజకీయాల్లో కనిపిస్తారు. వారి విషయం మరోసారి. NOTE
ఉపశృతి:
పార్టీ వాళ్ళు సొంత పార్టీ ఒదిలి బయటకు పరిగెడుతున్నా పార్టీ అధినాయకులు మాత్రం మొక్కుబడిగా చేసే వ్యాఖ్య ఒకటుంది.’ ఇలా ఎందరు పోయినా  మా పార్టీకి వచ్చే నష్టం ఏమీలేదు’
నిజమే వారికోసమే  సినారె పాట రాసివుంటారు.   
“ఎవ్వడికోసం ఎవడున్నాడు పొండిరా పొండి నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా రండి”

NOTE: Cartoon Courtesy "TIMES OF INDIA"
3 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

1967లొ గయా లాల్ అనే హర్యానా విధాయకుడు పదిహేను రోజులలో మూడు సార్లు పార్టీ మారాడు. ఆయారాం గయారాం అనే పదం అప్పటి నుండి చెలామణి అవుతూ వచ్చింది.

ఇకపోతే జంప్ జిలానీలు ఎప్పడి నుండో ఉన్నారు. నాకు తెలిసి స్వాతంత్ర్య భారత దేశంలో ఉన్నత పదవుల కోసం పార్టీ మారిన మొదటి వ్యక్తి టంగుటూరి ప్రకాశం.

1951 ఎన్నికలలో కేఎంఎల్పీ పార్టీ తరఫున పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన ఆయన 1953లొ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కారు. మొదటి హయాములో ఆయన్ని కష్టపెట్టిన ఆర్ధిక అవకతవకల ఆరోపణలు రెండో ఇన్నింగులొ కూడా వెంటాడాయి. పైగా అసమ్మతి పోటు కూడా చేరడంతో పట్టుమని ఏడాది దాటకుండానే పదవి కోల్పోయారు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ Jai Gottimukkala - మీరు గమనించి ఉంటారని అనుకున్నాను. నేను ఎక్కడా తెలుగు వారి పేర్లు రాకుండా జాగ్రత్త పడ్డాను.

Jai Gottimukkala చెప్పారు...

@Bhandaru Srinivasrao:

ఎస్పీవై లాంటి తెలుగు వారే కాదు తెలుగు వారికి తెలిసి ఉండే వారిని (ఒక్క భజన్ లాల్ మినహా) కూడా మీరు జాగ్రత్తగా వదిలేసారు. ఉ. సురేష్ ప్రభు, ఇటీవలి ఝార్ఖండ్ & అరుణాచల్ రాష్ట్రాలలో ఫిరాయింపు ప్రహసనాలు వంటి వాటికి సుతిమెత్తగా దూరంగా ఉన్నారు. చెప్పదలుచుకున్న విషయానికి నైజీరియా ఉదాహరణలతో విశిదీకరించడం సూపర్బ్!

అయితే భజన్ లాల్ వల్లే ఆయారాం గయారాం నానుడి వచ్చిందనడం మాత్రం సరికాదు. సదరు "ఘనత" 1967 గయాలాల్ గారికే చెందడం న్యాయం.