15, మే 2015, శుక్రవారం

బుక్ షెల్ఫ్ - 4 - కప్పు చాయ్ మూడు పైసలు



శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి గారి 'హైదరాబాదు - నాడూ నేడూ' నుంచి .....


"స్కూలుకు వెళ్ళడానికి తలకు టోపీ, కాళ్ళకు చెప్పులు, ఒంటికి కొటూ ముఖ్యం. నాకీ మూడూ లేవు. మా అక్కయ్య ఇంటికి దగ్గరలో వున్న చెన్నాప్రగడ రామచంద్ర రావు గారి అబ్బాయి సుధాకర్ కోటు నాకు సరిపోయింది. ఆ బ్లేజర్ కోటు వేసుకుని మిగతా పిల్లలతో పాటు స్కూలుకు బయలుదేరాను. మలక్ పేట రైల్వే బ్రిడ్జ్ (డబీర్ పురా వైపు) కింద నుంచి వెళ్లి చాదర్ ఘాట్ వంతెన వస్తుంది. మూసీ నది మీద ఎంతో అందంగా కట్టారు. మధ్యలో కొంచెం ఎత్తు, ఆ పక్కా  ఈ పక్కా కొంచెం పల్లం. చక్కని తారు రోడ్డు. మధ్యలో కాలి దారి పక్కన కూర్చుని ఓ బక్క పకీరు కమ్మని స్వరంతో 'అల్లా రహం కరదే, మౌలా హుకుం దే' అంటూ భిక్ష  అడుగుతుంటే ఓ పాట పాడుతున్నట్టుగా అనిపించింది. బ్రిడ్జ్ దాటిన  తరువాత విక్టరీ ప్లే గ్రౌండ్. ఇసామియా బజారు, పెద్ద వేప చెట్టు, కింద చిన్న హనుమంతుడి గుడి. త్రూప్ బజారు నిజానికి ట్రూప్ బజారు, కానీ ట్రూప్ బజారనీ, తూర్పు బజారనీ అనేవాళ్ళు. ఇప్పుడది బ్యాంకు స్ట్రీట్. కుడివైపున విశాలమైన ఆవరణలో రెండు మూడు బంగళాలు. అంతకన్నా విశాలమైన స్థలంలో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. జిందా తిలిస్మాత్ దుకాణం తరువాత రామ్ కోటీ సందు. సాగర్ టాకీసు, ఆబిద్ సర్కిల్.  ఆబిద్ రోడ్డులో ఫర్లాంగు దూరంలో ఎడమ వైపు సందులో మా చాదర్ ఘాట్ స్కూలు.           
"ట్రూప్ బజారు ఎడమవైపున రెండు ఇనుప కటకటాలున్న పెద్ద ఆవరణలు. ధన రాజ్ గిర్జీ, ప్రతాప్ గిర్జీలవి. ప్రతాప్ గిర్జీ మార్వాడీల గురువు. ఏటా వారి పుట్టిన రోజున మార్వాడీలు  వారి ఎత్తు బంగారం తూచి కానుకగా ఇచ్చేవారట. నిజాం కన్నా వీరే ధనవంతులని చెప్పుకునే వాళ్ళు. నిజాం ఒక రోల్స్ రాయిస్ కారు  కొంటే వీళ్ళు రెండు  కొనేవారట.
"ఆబిద్ రోడ్డులో కెఫే కరాచీ హోటలు వుండేది. అమృతప్రాయమైన చాయ్ మూడు హాలీ పైసలు. మలైవాలా చాయ్ (మీగడ వేసిన) చాయ్ ఒక అణా.                        

(ఇంకా వుంది)

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

శ్రినివాసరావు గారూ,

మీ పోస్టులకి లేబుళ్ళు పెట్టటంలో ఒకే విషయానికి సంబంధించిన అన్ని పోస్టులకీ ఒకే రకమైన లేబుల్(ళ్ళు) పెడితే చదివేవారికి, మీకూ సౌకర్యంగా ఉంటుందని నా అభిప్రాయం.

నిన్నటి పోస్టుకి "ఎనభై ఏళ్ళ క్రితం హైదరాబాద్", "బుక్ షెల్ఫ్-3" అని లేబుళ్ళు పెట్టారు. కానీ దానికి కొనసాగింపుగా వ్రాసిన ఈరోజు పోస్టుకి "బుక్ షెల్ఫ్-4", "కప్పు చాయ్ మూడు పైసలు" అనే లేబుళ్ళు తగిలించారు. మరి ఇదే ముచ్చట్లకి సంబంధం ఉన్న మీ 26 డిసెంబర్ 2014 "పాతైదరాబాదు" అనే పోస్టుకి "పాతైదరాబాదు", "హైదరాబాద్ నాడు నేడు శిష్టా లక్ష్మీపతి శాస్త్రి" అనే లేబుళ్ళు ఇచ్చారు.

ఒకే రకమైన లేబుళ్ళు ఉంటే వెదుకులాట సులభమవుతుంది. నా సూచనని పరిశీలించగలరు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@విన్నకోట నరసింహా రావు గారు - నాకు రాసుకుంటూ పోవడం తప్ప ఇన్ని విషయాలు తెలియవు. మన్నించండి. ఈ డెబ్బయ్ ఏళ్ళ వయస్సులో ప్రతిదీ ఒక కొత్త పాఠం