4, జనవరి 2013, శుక్రవారం

ఏనుగు శీర్షాసనం చూశారా!


(ఈనెల పద్నాలుగో తేదీ ‘జంధ్యాల’ జయంతి)

ఏనుగు శీర్షాసనం చూశారా!



ఆయనతో పరిచయం యెలా జరిగిందో గుర్తు రావడం లేదు. ఆయనో లాయరు. మహాకాయానికి తక్కువగా, స్తూలకాయానికి ఎక్కువగా వుండేవారు. పేరు మాత్రం కురచ. వరప్రసాద్.  వయస్సులో నాకంటే రెండు పదులు తక్కువ. బుద్ధిలో బృహస్పతి. రాజ్యాంగ శాసనాలు కొట్టిన పిండి. ప్రాచీన ధర్మ సూక్ష్మాలు, శాస్త్రీయ విషయాలు కరతలామలకం. భారత, భాగవత, రామాయణాలు ఆసాంతం  ఆపోసన పట్టిన వ్యక్తి. పద్యాలు, వేల సంఖ్యలో సంస్కృత  శ్లోకాలు కంఠతా వచ్చు. అష్టాదశ పురాణాలు తడుముకోకుండా చెప్పగల సామర్ధ్యం ఆయన సొంతం. కుతర్కంతో కాక  తర్కంతో తన వాదన నెగ్గించుకునే ఈ మహానుభావుడు సూర్యోదయానికి పూర్వమే లేచి ఎంతో నిష్టగా అనుష్టానలన్నీ పూర్తిచేసుకుని ఇంటి నుంచి బయట పడడం తరువాయి ఆయన జీవన శైలి ఈనాటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా మారిపోయేది.
ఎమర్జెన్సీ తరువాత జనతా సర్కారు ఇందిరా గాంధీపై పెట్టిన అనేక కేసులను ఆవిడ తరపున వాదించానని ఆయనే అనేకసార్లు చెప్పుకున్నారు. జ్వాలా నేనూ ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇందుకు దాఖలా అన్నట్టు పలువురు పెద్దలను మాకు పరిచయం చేసి, వారితో తన సాన్నిహిత్యాన్ని తెలియచెప్పారు. దేశ రాజధానిలో   అంతంత స్థాయిలో పరిచయాలు కలిగిన వ్యక్తి  హైదరాబాదులో మాత్రం లాంబెట్రా స్కూటరు మీద తిరిగే వాడు. ఆరోజుల్లో మాకు స్కూటరు సరే సైకిల్ కూడా వుండేది కాదు. కాబట్టి ఆయన్ను సందేహించే పరిస్తితి మాది కాదు. అంత పెద్ద శరీరంతో స్కూటరు మీద చిక్కడపల్లిలో మేముంటున్న ఇంటికి వస్తుంటే మా పిల్లలు వినాయకుడు ఎలక వాహనంపై వస్తున్నాడని ఆట పట్టించేవారు.
ఎక్కడ వున్నా త్రికాలసంధ్యాదులు సక్రమంగా నిర్వర్తించడం ఆయన అలవాటు. ఢిల్లీలో మేము ఆయనతో కలసి కుతుబ్ మినార్ చూసివస్తున్నప్పుడు సూర్యాస్తమయం కావొస్తుండడం గమనించి దారిపక్కన నీటి  చెలమ వున్నచోట కారు ఆపించి సంధ్యావందనం చేసివస్తుంటే టాక్సీ డ్రైవర్ కూడా ఆశ్చర్య పోయాడు.


అలా, ఆయనతో కలసి తిరుగుతూ ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్ళాము. అక్కడి బుక్ స్టాల్లో పుస్తకాలు తిరగేస్తూ మాలో మేము తెలుగులో మాట్లాడుకుంటుంటే ఒకాయన మా వైపు తెలుగు వాళ్ళా అన్నట్టు చూసారు. ఒక్క క్షణం ఆగి ‘మీరు శ్రీనివాసరావు కదూ!’ అని పలకరించారు. ఆయన ఎవరో కాదు హాస్య సినీ బ్రహ్మ జంధ్యాల. బెజవాడ ఎస్సారార్ కాలేజీలో బీకాంలో క్లాసుమేటు. సినీ రంగంలో అడుగుపెట్టి బాగా పేరు తెచ్చుకుంటున్న రోజులవి. ఆయన అసలు పేరు జే.వీ.డీ.ఎస్. శాస్త్రి. ఆయన ఆ హోటల్లోనే దిగారుట. చాలా ఏళ్ళ  తరువాత కలిసిన మమ్మల్ని జంధ్యాల తమ రూముకు తీసుకు వెళ్లారు. వెళ్ళీ వెళ్ళగానే, మాతో వచ్చిన లాయరు గారు ఎలాటి మొహమాటం లేకుండా, కొత్త చోటని సందేహించకుండా ‘ఒకసారి మీ బాత్రూం వాడుకోవచ్చా’ అని అడుగుతూనే జవాబుకోసం ఎదురుచూడకుండా అందులో దూరిపోయి స్నానం చేసి బయటకు వచ్చారు. రావడం రావడమే ఆ గదిలో పరచిన తివాచీ పై తల కిందకు పెట్టి కాళ్ళు పైకి లేపి లిప్త మాత్రంలో శీర్షాసనంలో దర్శనమిచ్చారు. మా అందరికీ కళ్ళు తిరిగిపోయాయి. చిన్న తల, పెద్ద బొజ్జ, అంత భారీ కాయంతో ఆయన వేసిన ఈ ఆసనం చూసి జంధ్యాల కూడా నివ్వెర పోయారు. తరువాత వారిరువురి నడుమ సాగిన కవి పండిత చర్చ విని తీరాలి. అప్పటికే  ‘శంకరాభరణం’ సినిమాకి సంభాషణలు సమకూర్చిన జంధ్యాల – విశ్వనాద్ గారిదే మరో సినిమా ‘సప్తపది’కి మాటలు రాస్తున్నారు. అనేకానేక అంశాలను స్పృశిస్తూ జరిగిన సంభాషణ నిజానికి ఇద్దరు పండిత శ్రేష్ఠుల మధ్య జరిగే వాదోపవాదాన్ని తలపించింది. ఏమాత్రం స్వరం పెంచకుండా, ఎదుటివారి వాదాన్ని పూర్వపక్షం చేస్తూ ఒకర్ని మించి మరొకరు అక్షర లక్షలు చేసే తర్కవిన్యాసాలు ప్రదర్శించారు. ధర్మాధర్మ విచక్షణకు సంబంధించిన వీటిలో కొన్నింటిని ‘సప్తపది’ సినిమాలో జంధ్యాల పొందుపరచినట్టున్నారు కూడా.
ఈ చర్చ సాగిన తీరు గమనిస్తే – నాకు కాలేజీలో తెలిసిన శాస్త్రి, ఈ జంధ్యాల ఒకరేనా అన్న సందేహం కలిగింది. అంతటి పరిణతి ఆయనలో కనబడింది. ఆ రోజుల్లో జంధ్యాల ఒక్కడే మొత్తం కాలేజీలో ‘కారున్న కుర్రకారు’. ప్రిన్సిపాల్ కూడా కాలేజీకి రిక్షాలో వస్తుంటే, జంధ్యాల మాత్రం సొంత కారులో వచ్చేవారు. ‘సంధ్యారాగంలో శంఖారావం’ వంటి నాటకాలు రాస్తూ,వేస్తూ సరదాగా వుండేవారు. అలాటి జంధ్యాలలోని మరో కోణాన్ని ఢిల్లీలో చూడగలిగాను. అలాగే మా వెంట వచ్చిన లాయరు గారు. ఆయనకున్న విషయ పరిజ్ఞానాన్ని కళ్ళారా చూసి, చెవులారా విన్న తరువాత ఆయనపై వున్న దురభిప్రాయం దూదిపింజెలా ఎగిరిపోయింది. ‘వినదగునెవ్వరు చెప్పిన’ సూక్తిలోని  వాస్తవం మరోమారు  బోధపడింది.
మనం చెప్పిందే ఇతరులు వినాలన్న ఆత్రంలో యెంత నష్టపోతామో అర్ధం అయింది. సజ్జన సాంగత్యంలో వొనగూడే లాభం ఎరుకలోకి వచ్చింది.
ఇప్పుడు వారిద్దరూ లేరు. వారి జ్ఞాపకాలే మిగిలాయి. 
(అక్టోబరు 10,2010)                                               

4 కామెంట్‌లు:

buddhamurali చెప్పారు...

aa nyaya vadi peru raayalsindi

ఆ.సౌమ్య చెప్పారు...

భలే, జంధ్యాల గారు మీ ఫ్రెండా!!
కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలని...లాయరుగారితో స్నేహం భలే :)

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@buddha murali - aa nyaayavaadi peru vara prasad. మొదటి పేరా మూడో లైన్ లో వుంది. కాకపొతే 'కురచ' ఆయన ఇంటి పేరు అనే అర్ధం వచ్చేలా వుంది. అది నా పొరబాటే.మన్నించాలి.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ఆ.సౌమ్య- కేవలం ఫ్రెండే కాదు. బీకాం మూడేళ్ళు ఒకే క్లాసు, ఒకే బెంచి. జంధ్యాల మాటల్లో చెప్పాలంటే -క్లాసుమేటు,గ్లాసుమేటు కూడా.