19, మార్చి 2011, శనివారం

రైల్లో అమెరికా ప్రయాణం - రేడియో రోజులు - భండారు శ్రీనివాసరావు

రైల్లో అమెరికా ప్రయాణం - రేడియో రోజులు - భండారు శ్రీనివాసరావు


రైల్లో అమెరికా ప్రయాణం

కొందరు తాము నవ్వుతూ ఇతరులను నవ్వించాలని చూస్తారు. మరికొందరు తాము మాత్రం నవ్వుతూ పక్కవారిని ఏడిపించాలని చూస్తారు. ఇంకొందరు తాము నవ్వరు. కానీ, తమ మాటలతో అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంటారు. ఇదిగో ఈ కోవలోని వారే ఈనాటి నా వ్యాసుల వారు. అంటే వ్యాస మహర్షులు కాదు. ఈ వ్యాసానికి ప్రేరకులని కవి హృదయం. ఆయనే తురగా కృష్ణ మోహనరావుగారు. బోలెడంత ఘన కీర్తిని తన వెంటబెట్టుకుని, బోలెడు బోలెడు జ్ఞాపకాలను మనందరికీ వొదిలిపెట్టి స్వర్గానికి వెళ్లిపోయి రమారమి ముప్పయ్యారేళ్ళు అవుతోంది. ఈ రోజు పోతే రేపటికి మూడు అని తేలిగ్గా తీసుకునే రోజుల్లో – ఫిబ్రవరి పదో తేదీన (ఫిబ్రవరి 21 ఆయన జయంతి – అక్టోబర్ రెండో తేదీ వర్ధంతి. ఆరోజు కృష్ణా ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవాన్ని కవర్ చేయడానికి వెళ్లి, తప్పిపోయిన రైలును అందుకోవడానికి రైల్వే అధికారులు ఏర్పాటు చేసిన వాహనంలో వెడుతూ నక్రేకల్ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించి ఎవరికీ అందనంత దూరాలకు వెళ్లి పోయారు) హైదరాబాదు సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటుచేసిన ఆయన సంస్మరణ సభకు ఎక్కడెక్కడినుంచో వచ్చిన ఆత్మీయులను చూస్తుంటే మంచి మనిషికీ, మంచి జ్ఞాపకాలకూ ఏనాటికీ మరణం లేదనిపించింది.


కృష్ణమోహనరావు గారు రేడియో మనిషి. ఆ మీడియాన్ని ఆయన ఆపోసన పట్టారు. ఈ ప్రజా మాధ్యమం పూర్తిగా సర్కారు చేతుల్లో వున్నప్పుడు ఆయన రేడియో కొలువుని అటు ఉద్యోగ ధర్మానికి మాట రాకుండా, ఇటు సామాజిక బాధ్యతకు లోటు రాకుండా నెగ్గుకొచ్చిన తీరును ఈ సమావేశంలో ఆనాటి ఆయన సహోద్యోగులు మరోసారి గుర్తు చేసుకున్నారు. అక్షరాలను అందమయిన చిత్రాలుగా గీస్తూ వాటితో వెన్నెట్లో, చీకట్లో సయితం సతతం ఆడుకునే  'రేడియో'  సుధామ - కృష్ణమోహన రావు గారితో రేడియో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటే, దూరదర్శన్ డైరెక్టర్ శైలజా సుమన్ - జానకీరాణి గారి కుటుంబంతొ తన సాన్నిహిత్యాన్ని నెమరువేసుకున్నారు.


ఆయన పేరిట నెలకొల్పిన అవార్డును అందుకున్నది దూరదర్శన్ కరస్పాండెంటు ఈమని కృష్ణారావు. రేడియో జర్నలిజంలో తనకు అక్షరాభ్యాసం చేసింది తురగా కృష్ణ మోహనరావుగారే అని అప్పటి రోజులను మననం చేసుకుంటూ, విధి నిర్వహణలో తురగావారి అంకితభావమే తనకు మార్గదర్శిగా నిలుస్తూవచ్చిందని పేర్కొన్నారు. కాజువల్ సిబ్బందిని కూడా ‘నా సహోద్యోగి’ (మై కొలీగ్) అంటూ బయటవారికి పరిచయం చేసే ఔన్నత్యం కృష్ణమోహన రావుగారి రక్తంలో వుందన్నారు.


కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సీనియర్ ఐ .ఏ. ఎస్. అధికారి శ్రీ రమణాచారి మాట్లాడుతూ- ‘వీలయితే నాలుగు మాటలు, కుదిరితే కప్పుకాఫీ అనుకునే రోజుల్లో ఇంతమంది ఆత్మీయులు హాజరు కావడం కృష్ణమోహన రావు గారి గొప్పదనానికి అద్దంపడుతోంద’న్నారు.


కర్నాటక మాజీ గవర్నర్ శ్రీమతి వీ.ఎస్. రమాదేవి తమ ప్రసంగంలో వినిపించిన – కృష్ణమోహనరావు, జానకీ రాణిల ‘పెళ్ళికి ముందు ప్రేమ కధను’ శ్రోతలు ఆసక్తితో విన్నారు. ‘గుంభనగా, నిదానంగా వుండే కృష్ణమోహనరావు, చెంగు చెంగునా గంతులువేసే జానకీ రాణి- యాదగిరిగుట్టలో చేసుకున్న ప్రేమపెళ్లికి తానే ప్రత్యక్ష సాక్షిన’ని అంటూ వారి కుటుంబంతో తనకున్న చనువును కళ్ళు చెమర్చేలా చెప్పుకొచ్చారు. భర్త ప్రాణం కోసం యముడిని వెంటాడిన సతీ సావిత్రిలా – జానకీరాణి – ఇన్నేళ్ళ తరవాత కూడా భర్తను సజీవంగా వుంచే ఇలాటి కార్యక్రమాలను– పైపెచ్చు వొంట్లో బాగాలేకపోయినా లేని సత్తువను తెచ్చుకుని నిర్వహిస్తూ వుండడం చూస్తూ – ఒకనాటి సహోద్యోగిగా గర్వపడుతున్నానని చెప్పారు.


ఇలాటి సభల్లో వక్తలు దారితప్పి అనవసర ప్రసంగాలతో చీకాకు పెడతారన్న అపోహను తొలగించడానికా అన్నట్టు కార్యక్రమం ఆసాంతం ఆసక్తిగా సాగిపోవడం కృష్ణ మోహనరావు గారి అభిమానులను మరింత అలరించింది. స్వతహాగా హాస్యప్రియుడయిన తురగా వారికి నిజమయిన శ్రద్ధాంజలి రీతిలో ప్రసిద్ధ రచయిత్రి  సోమరాజు సుశీలాదేవి – కధా ప్రసంగం పేరుతొ చదివిన కధ – సభా ప్రాంగణాన్ని నవ్వులతో కదిలించింది. అమెరికాలో వున్న పిల్లల దగ్గరకు ప్రయాణమై వెడుతున్నప్పుడు ఒక గృహిణికి  ఎదురయిన అనుభవాలను హాస్యంతో రంగరించి శ్రోతలను అలరించారు. కధలు రాయడంలో చేయి తిరిగిన సుశీలా దేవి గారు కధను చదివి వినిపించడంలో కూడా అందెవేసిన చేయి అనిపించారు. ఆరోజుల్లో అమెరికా వెళ్ళాలంటే రైల్లో మద్రాసు వెళ్లి అక్కడినుంచి విమానంలో ఆ దేశానికి వెళ్ళేవారు. అమెరికాకు రైల్లో బయలుదేరామంటూ ప్రారంభించి హాస్యం తొణికించారు.


తురగా దంపతుల ముద్దుల కుమార్తెలు ఉషారమణి (ఆకాశవాణి న్యూస్ రీడర్ ) శోభ, జర్నలిస్ట్ కేబీ లక్ష్మి  - ముగ్గురూ  కార్యక్రమాన్ని ముందునుంచి, వెనుకనుంచి దన్నుగా నిలబడి  విజయవంతంగా నిర్వహించారు.


ఇక, నాకు తెలిసి తురగా కృష్ణ మోహనరావు గారు ఒక అద్భుతమయిన హాస్య రచయిత. సునిశితమయిన వ్యంగ్యానికి ప్రతీక. ‘ప్రవీణ్’ పేరుతొ ఆంధ్ర పత్రిక వార పత్రికలో వారం వారం వారు రాసిన ‘రాజధాని కబుర్లు’ నా బోటి పాఠకులకు అక్షరామృతం. వారి అకాల మరణం తరవాత ఆయన  వొదిలి వెళ్ళిన రేడియో విలేకరి  ఉద్యోగంలో నేను ప్రవేశించడం కేవలం నా సుకృతం.(10-02-2011)









5 కామెంట్‌లు:

cbrao చెప్పారు...

తురగా దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. జర్నలిస్ట్ కేబీ లక్ష్మి వీరి అమ్మాయి కాదు. తురగా జానకీరాణి గారి
ఫోన్. 2335 1153 సెల్: 98487 35124 మరో సెల్: 98484 29169

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@సీబీ రావు గారికి- 'రామునితోకపివరుండిట్లనియె'అన్నట్లయింది.ఇద్దరు పిల్లలని తెలియక కాదు.-భండారు శ్రీనివాసరావు (ఇంత శ్రద్ధగా చదివే మీకు నా ధన్యవాదాలు).

Sleep-Walker చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Sleep-Walker చెప్పారు...

ఇదిగో ఇలాంటి ఆత్మీయుల నుంచి జ్ఞాపకాలు కూడగట్టుకుని, పదిలపరచుకోవాలనే మా తాపత్రయం. మీరు రాసిన ప్రతి అక్షరం చదవడానికి, చదువుకోవడానికి బావుంటుందని నాకు ఏనాటి నుంచో తెలిసిన సంగతే కానీ, మా సొంత వారి గురించి మీరు ఎంతో ఆప్యాయంగా రాసిన ఈ వ్యాసం, వందల సార్లు చదివినా తనివి తీరదని తప్పనిసరిగా చెప్పాలి. మీరు అన్నట్లు నిన్న పోతే ఇవాళ మనుషులని మర్చిపోయే ఈ కాలంలో, మా నాన్నగారి వాల్యూస్, స్వభావం, ప్రతిభ గురించి పనిగట్టుకుని మంచి మాట మాట్లాడడం మీ సహృదయతను, సంస్కారాన్ని తెలియచేస్తోంది.
చాలా చాలా థాంక్స్, నమస్కారం.

22 మార్చి 2011 7:20 ఉఇదిగో ఇలాంటి ఆత్మీయుల నుంచి జ్ఞాపకాలు కూడగట్టుకుని, పదిలపరచుకోవాలనే మా తాపత్రయం. మీరు రాసిన ప్రతి అక్షరం చదవడానికి, చదువుకోవడానికి బావుంటుందని నాకు ఏనాటి నుంచో తెలిసిన సంగతే కానీ, మా సొంత వారి గురించి మీరు ఎంతో ఆప్యాయంగా రాసిన ఈ వ్యాసం, వందల సార్లు చదివినా తనివి తీరదని తప్పనిసరిగా చెప్పాలి. మీరు అన్నట్లు నిన్న పోతే ఇవాళ మనుషులని మర్చిపోయే ఈ కాలంలో, మా నాన్నగారి వాల్యూస్, స్వభావం, ప్రతిభ గురించి పనిగట్టుకుని మంచి మాట మాట్లాడడం మీ సహృదయతను, సంస్కారాన్ని తెలియచేస్తోంది.
చాలా చాలా థాంక్స్, నమస్కారం.

ఉషా రమణి

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ఉషారమణి - చాలా సంతోషం ఉషా! అభిమానం తొణికిసలాడే అభిప్రాయం రాసావు.పాతికేళ్ళ కిందటే రేడియోలో నా టేబుల్ అద్దం కింద రాసిపెట్టుకున్నాను."మనిషి ఏడుస్తూ పుట్టేది నవ్వుతూ చనిపోవడానికి" అని.అందుకే,చక్కటి హాస్యం రాసిన మీ నాన్నగారంటే నాకంత ఇష్టం.-భండారు శ్రీనివాసరావు