17, మార్చి 2011, గురువారం

నీటిలా సాగిపోవాలి! - భండారు శ్రీనివాసరావు

నీటిలా సాగిపోవాలి! - భండారు శ్రీనివాసరావు


వియత్నాం వీరుడు హోచిమిన్ తన జ్ఞాపకాలలో ఇలా రాసుకున్నారు.


“నాకప్పుడు తొమ్మిదేళ్ళు. స్కూలు పరీక్ష తప్పాను. నాకొచ్చిన మార్కులు చూసుకుని ఎంతో బాధ పడ్డాను. జీవితం వృధా అనిపించింది. యావత్ ప్రపంచం నన్నో పనికిమాలినవాడిగా చూస్తున్న భావన కలిగింది. ఆ మానసిక వేదనతో వున్ననేను ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాను. ఐతే, మా నాన్నగారు నామానసిక స్తితిని కనిపెట్టారు. తండ్రిగా దగ్గరకు తీసి లాలించారు. పరీక్ష పాసవడం ఒక్కటే జీవితంలో ప్రధానం కాదన్నారు. మా అమ్మ మరీను. ఎంతో ఆప్యాయంగా మృదువయిన మాటలతో నాకు సర్దిచెప్పింది. నా మనోవేదనను చేత్తో తీసివేసినట్టు మాయం చేయడానికి ఆమె చేయని ప్రయత్నం లేదు. మా కుటుంబానికి ఎల్లవేళలా దన్నుగావుండే మాఇంటి ఆధ్యాత్మిక గురువు గారు నాకు మరింత ధైర్యాన్ని నూరిపోశారు. ఆ సమయంలో వారినుంచి నాకు లభించిన భరోసా నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసిందనే అనుకున్నాను. అయినా, నాలో గూడుకట్టుకుపోయిన దైన్యం తొలగిపోలేదు. అధైర్యం మాసిపోలేదు. వారి మాటలతో, చేతలతో తెచ్చిపెట్టుకున్నకూసింత ధైర్యం కాస్తా మరునాటికే జావకారిపోయేది. నిరాశ ,నిస్పృహ రోజురోజుకూ పెరిగిపోవడంతో ఇక తట్టుకోలేక ఓ రాత్రి ఇంటి నుంచి పారిపోయాను.


“అలా దిక్కుతోచకుండా తిరుగుతూ ఒక బౌద్ద ఆరామం చెంతకు చేరుకున్నాను. బౌద్ద బిక్షువు ఒకరు సుమధురంగా ఆలపిస్తున్న ప్రార్ధనా గీతం నా చెవిన పడింది. అతడు పాడుతూనే వున్నాడు. నేను వింటూనే వున్నాను.


“నీరు స్వచ్చంగా ఎలావుంటుంది? ఎందుకంటె అది నిరంతరం పారుతూనే వుంటుంది. అలా పారే నీటికి అడ్డంకులు వుండవా? వుంటేనేం నీటికి వున్న పారే గుణం ఆ అడ్డంకులను అధిగమించేలా చేస్తుంది. ఒక నీటి బొట్టు ఓ పెద్ద జలపాతంలా ఎలా మారుతుంది ? ఎందుకంటె దానికున్న పారే గుణమే దానికా శక్తి నిచ్చింది. ఆ జలపాతం ఒక వాగులా, ఆ వాగు ఓ నదిలా ఎలా రూపం మార్చుకుని సముద్రం లో కలుస్తుంది ? ఎందుకంటె ఒకే జవాబు. నీటికి వున్న పారే ఆ లక్షణమే దానికి కారణం.


అందుకని ఓ నా జీవితమా! ఎక్కడా ఆగిపోకు. నిరంతరం సాగిపోతూవుండు. పారుతూనేవుండు. అలా అలా సాగిపోతూనే వుండు.”


“ఆ గీతం వింటూ చాలాసేపు నన్ను నేను మరచిపోయాను. ఎంత గొప్ప భావం. ఎంత చక్కని సందేశం. చలనం లేని ప్రపంచం ఎంత నిరర్ధకం.


“ఆ బౌద్ద బిక్షువు ప్రార్ధన నాలో కొత్త మనిషిని తట్టిలేపింది. అంతే! అప్పటినుంచి నేను నిరంతరం పారే నీటిలా మారిపోయాను. నాటినుంచి ఇప్పటివరకు సదా ప్రవహిస్తూనే వున్నాను. ఎక్కడా ఆగిపోలేదు. అన్నిచోట్లకూ వెళ్ళ గలుగుతున్నాను. అందరినీ చేరగలుగుతున్నాను. ఎందుకంటె సతతం పారే నీటి గుణాన్ని నేను కూడా అలవరచుకున్నాను కనుక. కనుకే, ఎక్కడా ఆగకుండా ముందుకు సాగిపోతున్నాను.” అని తన స్మృతుల్లో రాసుకున్నారు- మహా నాయకుడు, అశేష జనాలకు పద నిర్దేశకుడు అయిన హోచిమిన్.






నీతి: విజయాన్ని చూసుకుని పొంగిపోవద్దు. అపజయంతో కుంగి పోవద్దు. ఎలాటి ప్రతికూల తలపుల ప్రభావం మనసుపై పడకుండా చూసుకోవాలి. మరో మంచి లక్ష్యం నిర్దేశించుకుని ఆ దిక్కుగా సాగిపోవాలి. అడుగు ముందుకే పడాలి. ఆగిపోయామా ఇక జీవితం ఆగిపోయినట్టే. ఎందుకటే చలనం లేని జీవితం మృత్యువుతో సమానం. (17-03-2011)

కామెంట్‌లు లేవు: